జగమంతా అమ్మ
ఈ సృష్టిలో ఏ విశ్వ చైతన్యం నిండి ఉంది? గ్రహాలు, లోకాలు, సకల జగత్తు ఏ శక్తి నుంచి ఆవిర్భ విస్తున్నాయి? సర్వ ప్రాణుల్లో ఉన్న జీవానికి మూల రూపం ఎవరు?, పుట్టుకకు, చావుకు మధ్యలో ఈ చైతన్యం అంతా ఎక్కడ నిక్షిప్తమై ఉంది?
ఆ శక్తి పేరే ఆదిశక్తి. ఆమే పరాశక్తి. సృష్టిలో సమస్తం ఆమెలో అంతర్భాగమే. బుద్ధి, ప్రాణాలకు చైతన్యం ఎవరు ఇస్తున్నారో ఆ శక్తినే మన మహర్షులు దేవి అన్నారు. ఆమెను ఉపాసించడమే దేవీ ఉపాసన. అటువంటి అమ్మవారిని ఆరాధించడానికి ఉద్ధిష్టమైన మాసం ఆశ్వయుజం. దేశమంతా అమ్మ పూజలో తరించేది ఈ నవరాత్రుల సమయంలోనే. ఈ తొమ్మిది రోజులు భారతావనిలోని ఆసేతు హిమాచలం ఆది పరాశక్తి ఆరాధనలో తన్మయత్వం చెందుతుంది. పూజలు, ఉత్సవాలతో దేశమంతా అమ్మ వారి ఆలయమే అవుతుంది.
ఈ సృష్టిలోని సమస్త శక్తికి మాత్రమే కాకుండా, త్రిమూర్తుల్లోని చైతన్యానికి కూడా అమ్మ వారే మూల కారణం. అందుకే ఈ సృష్టిలోని ఎవరికి పని చేయడానికి సామర్థ్యం చాలకపోయినా శక్తి హీనులని అంటారు తప్ప బ్రహ్మహీనుడు, విష్ణుహీనుడు అని అనరు. ‘ఈ సృష్టిలోని ప్రతి జీవి తాలూకు క్రియాశీలత, సామర్థ్యం కూడా శక్తి స్వరూపమే’ అని దేవీ భాగవతం చెబుతోంది.
లోకంలోని జీవులు ఏ పని చేయాలన్నా ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అనే మూడు రకాలైన శక్తి కావాలి. వీటినే త్రిశక్తులు అని అంటారు. ఒక పని చేయాలన్న కోరికనే ఇచ్ఛ లేదా సంకల్ప శక్తి అంటారు. ఆ పని ఎలా చేయాలన్న జ్ఞానం కావాలి. చివరికి ఆ పని పూర్తి చేయాలి. దీనినే క్రియ అంటారు. ఈ మూడింటికి మూలమైన శక్తి మనలో వెలుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తెరిగి మనలోని అమ్మకు ప్రణమిల్లడమే మనం నవరాత్రుల్లో చేయాల్సిన విధాయ కృత్యం.
మనం అమ్మగా పిలుచుకునే ఆది పరాశక్తి మూల తత్త్వం నిర్గుణ రూపమని మన పురాణాలు వర్ణించాయి. అటువంటి ఆ తల్లి ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నాడు అవతరించి, నవమి నాడు రాక్షస సంహారం చేసినట్టు విశ్వాసం. కాబట్టి ఈ సమయంలో ఆది పరాశక్తిని పూజించి అనుగ్రహం పొందడం సంప్రదాయంగా మారింది. అమ్మ దైవ కార్యం కోసం స్థూల రూపం ధరించి లోకానికి వ్యక్తమైనపుడు అనేక అవతారాల్లో కనిపిస్తుంది. అందులోని తొమ్మిది రూపాలను శరన్నవరాత్రుల సందర్భంగా మనం తొమ్మిది రోజుల పాటు ఆరాధిస్తున్నాం. అయితే ఆది పరాశక్తి సగుణ రూపం ప్రధానంగా త్రిగుణాత్మకంగా ఉంటుంది. తమో గుణ ప్రధానమైనపుడు మహాకాళి అనే పేరుతో ఉంటుంది. రజో గుణంలో ఉన్న శక్తి మహాలక్ష్మి అని, సత్త్వ గుణంతో ప్రకాశించే శక్తి మహా సరస్వతి అని పిలుస్తారు. ఏ రూపంలోనైనా అమ్మ సర్వ చైతన్య స్వరూపిణిగా వెలుగొందుతుంది. లలిత పేరుతో పూజలందుకుంటుంది.
అజ్ఞాన చీకట్లను పారదోలి, అన్ని రకాల దారిద్య్రాలను తొలగించే చింతామణి ఆ అమ్మ. సంసారంలో కూరుకుపోయిన వారిని ఉద్ధరించే దయామయి ఆమె. ఈ వర్ణణ జగద్గురువు ఆది శంకరాచార్యుల వారిది.
దసరా రోజుల్లో అమ్మవారిని శ్రద్ధగా ఆరాధిస్తే భక్తుల అజ్ఞానం పటాపంచలవుతుంది. వివేకం విచ్చుకుంటుంది. సంసార సాగరంలో మునిగిపోతున్న మనల్ని ఆ తల్లి వాత్సల్యంతో కాపాడు గాక!.
అందరికీ దసరా, దీపావళి శుభాకాంక్షలు
-కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review జగమంతా అమ్మ.