అనగనగ ఏడు చేపలు…

‘అనగనగా ఏడుగురు రాజ కుమారులు. ఒకనాడు వేటకు వెళ్లి ఏడు చేపలను వేటాడారు…’ చిన్నప్పుడు అందరూ నానమ్మ, అమ్మమ్మలను, తాతయ్యలను అడిగి పదేపదే చెప్పించుకున్న కథ ఇది. ఈ కథ వినని వారు నిన్నటి తరం వరకూ ఎవరూ ఉండి ఉండరు. అయితే, ఇది చిన్నపిల్లల కథ మాత్రమే కాదు సుమా! ఇందులో నేర్చుకోవడానికి చాలా ఉంది. అందుకే ఇది ఈ కాలం పెద్దలకూ ఉపయోగపడేలా, ఆధ్యాత్మిక వికాసం కలిగించేలా మార్చిన కొత్త కథ ఇది. పాత కథకే ఇది కొత్త కొనసాగింపు అన్నమాట. ఓపికగా, శ్రద్ధగా చదివి అర్థం చేసుకుంటే వికాసం మీ సొంతం

అనగనగా ఒక రాజు. ఆయనకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్లి ఏడు చేపలను వేటాడారు. వేటాడిని చేపలను ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు.
‘చేపా.. చేపా.. ఎందుకు ఎండలేదు?’ అని ఏడుగురు రాజ కుమారులు అడిగారు.
‘గడ్డిమేటు (వాము) అడ్డువచ్చింది’ అని ఆ చేప బదులిచ్చింది.
‘గడ్డిమేటా.. గడ్డిమేటా (వాము) ఎందుకు అడ్డొచ్చావ్‍?’ అని రాజ కుమారులు ప్రశ్నించారు.
‘నన్ను ఈ రోజు ఆవు మేయలేదు. అందుకే అడ్డొచ్చాను’ అంది గడ్డిమేటు.
రాజకుమారులు ఆవు వద్దకు వెళ్లి ఇలా అడిగారు-
‘ఆవూ? ఆవూ? ఎందుకు గడ్డి మేయలేదు?’.
‘ఈ రోజు గొల్లవాడు నన్ను మేపలేదు’ అని ఆవు చెప్పింది.
రాజ కుమారులు గొల్లవాడి వద్దకు వెళ్లి- ‘ఆవును ఎందుకు మేపలేదు?’ అని అడిగారు.
‘అమ్మ అన్నం పెట్టలేదు. అందుకే ఆవును మేపడానికి వెళ్లలేదు’ అని గొల్లవాడు చెప్పాడు.
‘అమ్మా.. అమ్మా! అన్నం ఎందుకు పెట్టలేదు?’ అని రాజకుమారులు ఆమె వద్దకు వెళ్లి ప్రశ్నించారు.
‘పిల్లవాడు ఏడ్చాడు. అందుకే వంట చేయలేదు’ అని ఆమె చెప్పింది.
‘పిల్లవాడా.. పిల్లవాడా? ఎందుకు ఏడ్చావ్‍?’ అని రాజ కుమారులు అడిగారు.
‘చీమ కుట్టింది. కుడితే ఏడవనా?’ అన్నాడు పిల్లాడు.
‘చీమా.. చీమా? ఎందుకు కుట్టావ్‍?’ అని అడిగారు.
‘నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?’ అని చీమ రాజ కుమారులకు బదులిచ్చింది.
ఈ కథ నిజానికి పిల్లల కాలక్షేపం కోసమే పుట్టినదై ఉండొచ్చు. కథ నిండా ఎన్నో అసహజ రీతులు, అసంగతాలు ఉంటాయి. అయినా పెద్దలు చెబుతుంటే పిల్లలు మారు మాట్లాడకుండా శ్రద్ధగా వినే కథ- ఏడు చేపల కథ.
నిజానికి రాజు గారి ఏడుగురు కొడుకులకు ఏడు చేపలను పట్టాల్సిన కర్మ ఏం పట్టింది? అడవికి పోయి క్రూర మృగాలను వేటాడవచ్చు కదా?. అయినా ఎవరూ ఈ ప్రశ్నలు వేయరు.
సరే.. రాజ కుమారులు చెరువుకు వెళ్లి చేపలు తెచ్చారని అనుకుందాం. వాటిని ఎండబెట్టడానికి, ఎండిన వాటిని ఎత్తి పోసుకోవడానికి వారి దివానుల్లో నౌకర్లే కరువయ్యారా? నిజానికి ఈ ప్రశ్న ఎంతో విలువైనది. అయినా ఎవరూ ఈ కోణం నుంచి ప్రశ్న వేయరు. కానీ, ప్రస్తుత కాలంలో మనకు మనం ‘ఇలా ఎందుకు?’ అని ఈ కథకు కొత్త భాష్యం చెప్పుకోవాల్సిన సమయమిది. ఈ కథను జాగ్రత్తగా చదివితే, అర్థం చేసుకుంటే, విశ్లేషించుకుంటే ఎంతో గొప్ప అంతరార్థం స్ఫురిస్తుంది.
ఇప్పుడు ఆ ప్రయత్నమే చేద్దాం.
రాజు గారు అంటే మనిషి.
ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే, మనిషిలోని సప్తధాతువులకు ప్రతిరూపాలు. కొడుకులు వేటకు వెళ్లడం అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.
జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం.
రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే, మనిషికి ఉండే సప్త వ్యసనాలు. ఏమిటా సప్త (ఏడు) వ్యసనాలు?
1) కామం, 2) వేట, 3) జూదం, 4) మద్యపానం, 5) వాక్పారుష్యం (కఠినంగా, పరుషంగా మాట్లాడటం), 6) దండ పారుష్యం (తీవ్రంగా దండించడం), 7) అర్ధ దూషణం (ధనాన్ని దుబారాగా ఖర్చు చేయడం).
ఈ వ్యసనాలన్నిటినీ మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు. అంటే పూర్తిగా ఎవరికి వారు నియంత్రించుకోవచ్చు. వీటిని ఎండగట్టుకోవాలీ అంటే అది ఎవరికి వారే చేసుకోవాల్సిన పని. వేరెవరో చేయలేరు. అందుకే కథలో ఏడు చేపలను రాజు గారి కొడుకులే ఎండగట్టినట్టు చెప్పారు. ప్రస్తుత సమాజంలో కామం, వేట, జూదం, దుర్భాష, ధనవ్యయం ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. పైన చెప్పిన సప్త వ్యసనాలూ మనిషిని ఏలా పీడిస్తున్నాయో, సమాజాన్ని ఎలా చెడగొడుతున్నాయో కళ్లారా చూస్తున్నాం.. వింటున్నాం.
రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒకటి ఎండలేదు. ఏమిటా చేప? అది- కామం (కోరిక). దీన్ని జయించడం చాలా కష్టం. ఎంత ప్రయత్నించినా అది ఎండదు. కామం అంటే ఈనాటి అర్థంలో ‘సెక్స్’ కాదు. కోరిక. మనిషిలో కోరిక అనేది ఒక పట్టాన చావదు. ఒకటి తీరితే మరొకటి పుట్టుకొస్తుంది. అలా వాటిని తీర్చుకుంటూ పోతే జీవితకాలం సరిపోదు. కోరికలన్నీ జయించి, మోక్షం సంపాదించాలని ప్రతి ఒక్కరూ ఆరాట పడతారు. కానీ, మోక్షం పొందాలనుకోవడం కూడా ఒక కోరికే. కాబట్టి కోరికను జయించడం అసాధ్యం. దాన్ని ఎండ గడితే తప్ప మోక్షం రాదు. కామం అనే ఈ చేప ఎండకుండా అడ్డుపడుతున్నదేమిటి?
గడ్డిమేటు.
గడ్డిమేటు.. కుప్పపోసిన అజ్ఞానానికి ప్రతీకగా ఇక్కడ భావించాలి. మనలోని అజ్ఞానం కొండలాగా పేరుకుపోతే దాని నీడన ఎన్ని కోరికలైన బతి కేస్తాయి. గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించడం ఎలా? మామూలు గడ్డికుప్ప అయితే, గడ్డి పరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు. కానీ, అజ్ఞానం అటువంటిది కాదు. జ్ఞానదాయకమైన మాటలు ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే. అంటే ఆ కుప్ప తరగదు. మనిషిలో ‘నేనున్నాను’ అనే అహంకారమే గడ్డి మేటు. దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం. మరి అది పోవాలంటే ఏం చేయాలి. ఆవు వచ్చి మేయాలి. ఆవు ఎక్కడి నుంచి రావాలి? అసలు ఆవు అంటే ఏమిటి?
ఆవు అంటే జ్ఞానం. జ్ఞానం అనే ఆవును దొడ్డో ఎగబడి మేస్త్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించిపోతుంది. లేదా జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది. మనలాంటి సామాన్యులు జ్ఞానాన్ని ‘గో’ రూపంలో దర్శించాలి.
ఈ గోవును ఎవరు మేపాలి? గొల్లవాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు? సమర్థ సద్గురువు. జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా! అర్జునుడు అనే దూడను అడ్డుపెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికీ ధారపోశాడు. ఇంత గొప్ప పని చేయవలసిని ఈ కథలోని గొల్లవాడు మాత్రం ఆ పని చేయలేదు.
పైగా ‘ఎందుకు ఆవును మేపలేదు?’ అని అడిగితే, ‘అమ్మ అన్నం పెట్టలేదు’ అన్నాడు.
ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు?
ఈ లోకాన్ని ఏలే జగన్మాతే అమ్మ. ఈ జగన్మాత ఒక మంచి గురువును పంపక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు. వాటి ఆకలి తీరలేదంటే అర్థం ఏమిటి? వాడికి ఇంకా జ్ఞానం పొందే సమయం రాలేదని అర్థం. ఇంకో మాటలో చెప్పాలంటే వాడికి దైవానుగ్రహం కలగలేదన్న మాట.
‘అమ్మా.. అమ్మా.. గొల్లవాడికి అన్నం ఎందుకు పెట్టలేదు’ అని రాజ కుమారులు అడిగితే, ఆమె ‘పిల్లవాడు ఏడ్చాడు’ అని బదులిస్తుంది.
ఇంతకీ ఆ పిల్లవాడు ఎవరు? ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించే వాడే ఆ పిల్లవాడు.
ఆ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు? వాడిని చీమ కుట్టింది. ఎక్కడిదీ చీమ? అది సంసారానికి ప్రతిరూపం. సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడి కన్నా పిల్లవాడే ముఖ్యం కనుక ఆ అమ్మ ఆ పిల్లవాడినే చూసుకుంది. చీమ కుట్టినందున కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం. మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి. ఈ చీమలు నిత్యం బయటికి కనిపించవు. వాటి పుట్టలో అవి ఉంటాయి. మరి ఏమిటా పుట్ట?.. మనిషికి ఉండే అజ్ఞానమే ఈ పుట్ట. రేపటి రోజును గురించి బంగారు కలలు కనడం మరో పుట్ట.
ఈ రెండు పుట్టలలో ఉన్న వాళ్లని చేరదీసి, రక్షించడమే భగవంతుడికి తెలిసిన విద్య. ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగుపెట్టే ముందు ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను చిన్నప్పుడు ప్రతి పిల్లలకు నూరి పోస్తారు.

Review అనగనగ ఏడు చేపలు….

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top