భగవంతుడి గురించి తెలుసుకోవడం అంత తేలిక కాదు. అందుకు ఎంతో సాధన చేయాలి. పవిత్రమైన దివ్య భావాల మధుమందారాలతో ఆయనను ఆరాధించాలి. భగవంతుడు లేదా సద్గురువు కృప వల్లనే ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞాని మనుషులందరినీ సమదృష్టితో చూస్తాడు. అందరినీ దైవ స్వరూపంగా ఎంచి ప్రేమిస్తాడు. అటువంటి జ్ఞానులు ప్రాతఃస్మరణీయులు. వారి పట్ల సదా భక్తిప్రపత్తులు ప్రదర్శించాలి. వారు చేసే బోధనలు, ఉప దేశాలు ఆత్మవికాసానికి దోహదం చేస్తాయి. నిజమైన జ్ఞాని ఎవరి నుంచీ ఏదీ ఆశించడు.
ఒక రాజు జ్ఞానమూర్తి అయిన గురువు పాదాలపై శిరసు ఉంచి వినయపూర్వకంగా అభివందనం చేశాడు. పక్కనే ఉన్న మంత్రికి అది నచ్చలేదు.
‘దేశానికి రాజైన మీరు ఆ జ్ఞాని పాదాలపై శిరసును ఎలా ఉంచారు? ఈ దేశ సార్వభౌముడిగా స్వర్ణ కిరీటాన్ని అలంకరించుకున్న శిరసు మీది’ అన్నాడు మంత్రి.
‘తగిన సమయంలో నీకు సమాధానం చెబుతాను’ అన్నాడు రాజు.
కొద్ది రోజుల తరువాత రాజు మంత్రిని పిలిచాడు.
‘నాకు ఒక మేక తల, పులి తల, మనిషి తల కావాలి. వెంటనే తీసుకుని రా’ అని రాజు ఆజ్ఞాపించాడు.
రాజాజ్ఞతో మంత్రి అయోమయస్థితిలో పడ్డాడు. చివరకు మేక తలను తీసుకుని రావాలని తన మనుషులను పంపాడు. డబ్బు చెల్లించగానే ఒక కసాయి వాడు మేక తలను ఇచ్చాడు. పులి తల బజారులో ఎక్కడా దొరకదు. కాబట్టి మంత్రి ఆరితేరిన వేటగాళ్లను అడవికి పంపాడు. వాళ్లు పులిని చంపి దాని తలను తీసుకువచ్చారు. ఇక మనిషి తల ఎలా సంపాదించాలి? అనేది మంత్రికి సమస్యగా మారింది. మృతదేహం నుంచి తలను వేరు చేయడానికి ఎవరూ అంగీకరించరు. మొత్తానికి ఎలాగో అష్టకష్టాలు పడి మంత్రి మనిషి తలను కూడా సంపాదించాడు. మొత్తం మూడు తలలను తీసుకుని రాజు వద్దకు వెళ్లాడు.
అప్పుడు రాజు మంత్రితో- ‘ఈ మూడు తలల్ని ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడ ఇచ్చేయ్’ అన్నాడు.
మంత్రి కంగుతిన్నాడు. ఎంతో కష్టపడి తెస్తే ఇచ్చేయమంటారేమిటి? అనుకున్నాడు. మేక తలను వెనక్కి ఇచ్చేయడం కష్టం కాదు కాబట్టి దాన్ని ఇచ్చేశాడు. పులి తలను ఎవరూ తీసుకోలేదు. పైగా అందరూ భయపడ్డారు. కొంత ధనం ఎరవేసి దానిని ఒకరికి అంట గట్టాడు. మనిషి తలను తీసుకోవడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు.
మంత్రి రాజు వద్దకు వెళ్లి ‘మనిషి తలను ఎవరూ తీసుకోవడం లేదు మహారాజా’ అని చెప్పాడు.
‘అంటే మేక తలకు కానీ, పులి తలకు కానీ చచ్చిన తరువాత కూడా ఎంతో కొంత విలువ ఉంటుంది. మనిషి తలను ఎవరూ స్ప•శిం చరు. అటువంటి ఎందుకూ కొరగాని నా తలను జ్ఞాని పాదాలపై ఉంచాను. నేను చేసింది తప్పా?’ అని రాజు మంత్రిని ప్రశ్నించాడు.
ప్రాపంచిక విషయాలు, విజయాలు, సుఖాలు నిత్యం, నిరంతరం మనల్ని వ్యామోహంలో ముంచెత్తుతుంటాయి. నిజానికి అవి ఏ విలువా లేనివి. జ్ఞాని పాదాలకు నమస్కరించడం కన్నా పుణ్యప్రదమైన పని మరొకటి లేదు. ఆ పాదాలు మోక్షానికి సోపానాలు. భగవంతుడికి ఆత్మ సమర్పణ చేసుకొన్న జ్ఞాని సాక్షాత్తూ భగవత్ స్వరూపుడే. ఆయన పాదాలు భగవంతుని పాదకమలాలతో సమానమైనవి. కాబట్టి జ్ఞాను లను గౌరవించడం నేర్చుకోవాలి. వారితో సాంగత్యం చేయాలి. మానవ జీవితాలకు మోక్షాన్ని ప్రసాదించి తరుణోపాయం చూపించేది జ్ఞానులే.
Review జ్ఞాని-భగవత్‍స్వరూపం.