నవ్వు కొనాల్సిందేనా

ఈ జీవితం ఒక్కటే. దీన్ని ఫలవంతం చేసుకోవాలంటే జీవించే ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. కష్టమైనా, నష్టమైనా చిరునవ్వుతో ఎదుర్కోవాలి. ఎదుటి వారిని, సాటి వారిని బేషరతుగా ప్రేమించాలి. సూర్యుడు, చంద్రుడు, పువ్వులు, పక్షులు, జంతువులు.. తమ తమ స్వభావాలతో తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, పరిసరాలను ఆనందమయంగా చేసుకుంటాయి. వాటితో పోలిస్తే విచక్షణ, వివేకం కలిగిన మనం ఈ జీవితాన్ని, ఎందుకు సంతోషకరం చేసుకోలేం. ఈ సృష్టిలో పైసా ఖర్చు లేనిది చిరునవ్వు మాత్రమే. కానీ, దాన్ని ‘కొనితెచ్చు’కోవాల్సినంత దుస్థితిలో మానవ జీవితాలు ఉన్నాయి. మే 6 ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

ఈ జీవితం ఒక్కటే. దీన్ని ఫలవంతం చేసుకోవాలంటే జీవించే ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. కష్టమైనా, నష్టమైనా చిరునవ్వుతో ఎదుర్కోవాలి. ఎదుటి వారిని, సాటి వారిని బేషరతుగా ప్రేమించాలి. సూర్యుడు, చంద్రుడు, పువ్వులు, పక్షులు, జంతువులు.. తమ తమ స్వభావాలతో తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, పరిసరాలను ఆనందమయంగా చేసుకుంటాయి. వాటితో పోలిస్తే విచక్షణ, వివేకం కలిగిన మనం ఈ జీవితాన్ని, ఎందుకు సంతోషకరం చేసుకోలేం. ఈ సృష్టిలో పైసా ఖర్చు లేనిది చిరునవ్వు మాత్రమే. కానీ, దాన్ని ‘కొనితెచ్చు’కోవాల్సినంత దుస్థితిలో మానవ జీవితాలు ఉన్నాయి. మే 6 ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

నవ్వుల దినానికి పునాది భారత్..
మనసారా నవ్వుకునే ముందు ఒక్కసారి ప్రపంచ నవ్వుల దినోత్సవం నేపథ్యంలోకి వెళ్దాం. ఈ దినోత్సవాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశమే. 1995లో ముంబైకి చెందిన ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ మదన్ కటారియా ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని సృష్టించారు. ‘నవ్వు ఒక యోగం’ అనే కాన్సెప్ట్ను ప్రపంచానికి చాటిన ఈయన భారతీయుడే కావడం విశేషం. మొదట్లో నవ్వుల క్లబ్ (లాఫర్ క్లబ్)గా ప్రారంభమైన ఈ వేడుక తరువాత కాలంలో 65 దేశాలలో ఆరు వేల క్లబ్ల వరకు విస్తరించింది. ప్రారంభంలో నవ్వుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి రెండో ఆదివారం నాడు నిర్వహించుకునే వారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో జనవరిలో చలి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ తేదీని మార్చాలనే హాస్యప్రియులంతా కోరడంతో లాఫ్టర్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఈ దినోత్సవాన్ని మే మొదటి ఆదివారానికి మార్చారు. మొట్టమొదటి నవ్వుల దినోత్సవాన్ని 1998 జనవరి 11వ తేదీన ముంబైలో నిర్వహించారు. దీనికి వివిధ దేశాల నుంచి 1200 మంది హాస్యప్రియులు హాజరయ్యారు. భారతదేశం వెలుపల తొలిసారిగా కోపెన్హాగెన్లో నిర్వహించారు. దీనికి పది వేల మంది హాజరయ్యారు. 2004 మే 2న స్విట్జర్లాండ్ రాజధానిలో ఈ ఉత్సవం జరిగింది. ఆ దేశపు పార్లమెంటు చుట్టూ నవ్వులూ ప్రదక్షిణ చేయడం ఈ వేడుక విశేషం. ఇక, నవ్వుల దినోత్సవాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని లాస్ఏంజెల్స్లో 2005 నుంచీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ భూమ్మీద గల అన్ని దేశాల రాజధానుల్లోనూ ఏటా మేలో వచ్చే మొదటి ఆదివారం నాడు నవ్వుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

నవ్వు.. నవ్వించు
నవ్వు నాలుగు విధాల చేటు అనేది పాత నానుడి. నవ్వు నూట నలభై విధాల గ్రేట్ అనేది నేటి ఒరవడి. నవ్వడం వలన శరీరంలో ఉన్న రోగాలన్నీ మటుమాయమైపోతాయని ఆరోగ్య నిపు ణులు చెబుతున్నారు. నవ్వడం మూలాన జీవితంలోని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని వారంటున్నారు. రోజులో కనీసం నాలుగైదుసార్లయినా మనసారా నవ్వడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. ఒక మనిషి సంతోషంగా ఉంటే అతని కుటుంబం సంతోషంగా ఉంటుంది. అలా కుటుంబాలన్నీ సంతోషంగా ఉంటే సమాజమంతా సంతోషంగా ఉంటుంది.. అప్పుడు ప్రపంచమంతా సంతోషంగా ఉంటుందనేది ఈ నవ్వుల దినోత్సవ నిర్వహణ వెనుక ఉన్న భావన.

అందరికీ అర్థమయ్యే భాష ‘నవ్వు’
మనుషులు వేర్వేరు భాషలు, దేశాలకు చెందిన వారైనా అందరికీ అర్థమయ్యే, అందరికీ వచ్చే యూనివర్షల్ లాంగ్వేజ్ మాత్రం నవ్వే. ఇది ఎవరూ నేర్చుకోనవసరం లేని భాష. అంటే, అందరిలోనూ స్వభావసిద్ధంగా ఉంటుంది. అయితే, ప్రతి మనిషీ తనలో సహజంగా ఉండే నవ్వును నవ్వడం లేదా దానిని ఉపయోగించడం మరిచిపోయాడని చెప్పాలి. పుట్టుకతోనే అబ్బే విద్య నవ్వు మాత్రమే. సకల జీవరాశిలో మనిషికి మాత్రమే నవ్వుకునే, నవ్వే గుణమూ, లక్షణమూ ఉన్నాయనుకోవడం అజ్ఞానం. చాలా గుణాలలాగే నవ్వు కూడా మన చుట్టూ ఉన్న జీవరాశి అంతటిలో ఉన్నాయి. పువ్వులు వికసించడమే హాసం. పక్షులు కిలకిలరావాలే కిలకిలల నవ్వులు. జంతువుల కొన్ని తరహా శబ్దాలు నవ్వులకు సంకేతాలే. నవ్వు అనేది మనిషి అభ్యాసంతో నేర్చుకునే విద్య కాదు. జన్మతః లభించిన లక్షణం. పుట్టు అంధులు, బధిర శిశువులు కూడా ఎంచక్కా నవ్వుతారు.

రోజూ ఎన్నిసారు్ల నవ్వుతున్నారు
ఒక మనిషి ఎంత సంతోషం నవ్వుల దినోత్సవం రోజునే కాదు మనం రోజూ నవ్వుతూనే ఉండాలి. నవ్విస్తూ మనం నవ్వుల పాలు కాకుండా, ఎదుటి వాళ్లను నవ్వుల పాలు చేయకుండా ఉండేదే అత్యుత్తమ హాస్య లక్షణం. సరదాగా కాసేపు మనసారా నవ్వుకోవడానికి ముళ్లపూడి వెంకటరమణ గారి ‘నవ్వితే నవ్వండి, మాకభ్యంతరం లేదు’ పుస్తకం నుంచి కొన్ని సరదా సన్నివేశాలను గుర్తు చేసుకుందాం. ఇలాంటి మరిన్ని మంచి జోకులు కావాలంటే వెంటనే ‘ముళ్లపూడి సాహితీ సర్వస్వం’ నాలుగో సంపుటిని సొంతం చేసుకోండి. ఇవి చాలా సున్నితమైన జోకులు. చదివి, అర్థం చేసుకుని నవ్వడానికి ప్రయత్నించండి.
• • •
ఒక బామ్మతో లాయరు అయిన ఆమె మనవడు ఇలా అన్నాడు
‘బామ్మా.. బామ్మా.. ఇవాళ పదింటికల్లా వంట చేసి అన్నం పెట్టాలి. కోర్టు పని ఉంది’.
‘పదెందుకురా నాన్నా. రొండింటికల్లా పెట్టేస్తాను’ అందట ఆవిడ.
(ఇక్కడ హాస్యం చాలా సున్నితమైనది. పది కంటే రెండు తక్కువనేది బామ్మ గారి లెక్క. ఎందుకంటే ఆమె సత్యకాలపు బామ్మ గారు మరి).
• • •
ఏడేళ్ల బాబి బడికి టెలిఫోన్‍ చేశాడు.
‘ఏమిటి? బాబికి జరం వచ్చిందా? సెలవు కావాలా? ఇంతకీ మాట్లాడుతున్నది ఎవరు?
‘నేను మా నాన్ననండీ’.
(ఇదండీ ఈ కాలపు న్యూ జనరేషన్‍ బుడతల ఎత్తుగడలు).
• • •
పంజరం తలుపు తెరిచి ఉండటం చూసి పిల్లి చిలకను పట్టుకుందామని మెల్లగా వచ్చింది.
చిలక: ఏయ్‍! ఎవరు నువ్వు?
పిల్లి: సారీ.. తమరు చిలకేమో అనుకున్నానండీ. పొరపాటైపోయింది
(ఇలా అని చెప్పి ఆ పిల్లి తుర్రుమంది),
• • •
కమల: నీకు అద్భుతమైన, అందమైన, ధగధగ మెరిసే అమ్మాయి కనబడితే ఏం చేస్తావు?
విమల: కొంతసేపు చూస్తాను. ఇంకా కొంతసేపు చూస్తాను. ఇహ విసుగు పుట్టి అద్దం కింద పెట్టేస్తాను.
(అందమైన, అద్భుతమైన, ధగధగ మెరిసే అమ్మాయి తానేనని విమల నమ్మకం. ఇది ఆమె ఆత్మవిశ్వాసం)

ఒక మనిషి ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసుకోవడానికి అతను రోజుకు ఎన్నిసార్లు మనస్ఫూర్తిగా నవ్వుతున్నాడో లెక్కవేస్తే సరిపోతుందట. ఒంటరిగా ఉన్నప్పటి కంటే సమూహంలో ఉన్నప్పుడే మనిషి ముప్పై రెట్లు ఎక్కువగా నవ్వుతాడట. మన పక్కన ఎవరూ లేకుండా సినిమాల్లో, టీవీ షోలలో వచ్చే హాస్య సన్నివేశాలు చూసినపుడు కూడా నవ్వు వస్తుంది. అలాగే, మంచి జోక్‍ చదివినా మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. అయితే నవ్వు మాత్రం ముంచుకు రాదు సుమా!. నవ్వు ముంచుకు రావాలంటే లేదా నవ్వుల్లో మనం మునిగిపోవాలంటే మన బంధువుల, మిత్రుల సమక్షంలో మాత్రమే జోకులు పేలాలట. ఎందుకంటే ఒంటరిగా ఉన్నపుడు వచ్చే నవ్వు కంటే సమూహంలో ఉండగా కలిగే నవ్వే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందట. ఎందుకంటే, నవ్వును ఇతరులతో పంచుకుంటేనే దాని తాలూకు ఆనందం మరింత అవర్ణమవుతుంది.

అధ్యయనాలేం చెబుతున్నాయంటే..
నిజానికి మన నిజ జీవితంలో మనకు నవ్వు తెప్పించే సందర్భాలు సినిమాల్లోని కామెడీ సన్నివేశాలంత సరదాగా ఉండవు. కాబట్టి నవ్వుకోవడం, నవ్వు తెప్పించుకోవడం వంటి సరదా సందర్భాలను తరచుగా సృష్టించుకోవాలి. ఎదుటి వారి ముఖ కవళికలు, కామెంట్లు, చేష్టలు కొన్నిసార్లు పగలబడి నవ్విస్తాయి. అయితే, మనం నవ్వే నవ్వు అవతలి వారి మనోభావాలను దెబ్బతీసి ఏడిపించకూడదు సుమా!. ఇక, జీవితంలో ఎవరు ఎక్కువగా నవ్వుతారంటే.. మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువసార్లు నవ్వుతారట. మనసు దోచుకున్న మగువను నవ్వించడానికి మగవాళ్లు నానా తంటాలూ పడితే తమకు నచ్చిన వాడి సన్నిధిలో అతివలు అధికంగా నవ్వులు కురిపిస్తారట. కలిసి ఉన్న సమయంలో 62 శాతాన్ని నవ్వులతో ముంచెత్తే మగవాళ్లను అమ్మాయిలు ఇష్టపడితే తమ హాస్యంలో కనీసం 65 శాతానికి స్పందించే అమ్మాయిలను అబ్బాయిలు కోరుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అడల్డ్ జోకులు పురుషులకు చక్కిలిగింతలు పెడితే, మహిళలు మాత్రం మంచి హాస్యరసం ఒలికే, హుందాగా ఉండే జోకుల్ని ఎంజాయ్‍ చేస్తారట. తమ మీద తామే జోకులు వేసుకుని నవ్వుకోగలిగే వాళ్లకు ఆత్మవిశ్వాసం స్థాయి అత్యధికంగా ఉంటుందట. తమ మీద ఇతరులు పేల్చే జోకుల్ని తట్టుకోలేని వాళ్లు ఆత్మన్యూనతతో బాధపడే వారి కింద లెక్క అని కూడా అధ్యయనాలు తెలుపుతున్నాయి. సెన్స్ ఆఫ్‍ హ్యూమర్‍ ఎక్కువగా ఉన్న ఉద్యోగులే ఎక్కువ సామర్థ్యంతో పని చేయగలుగుతారని మరో అధ్యయనం తేల్చింది.

హాస్యానికి పుట్టినిల్లు భారత్‍
భారతదేశంలో హాస్యానిది తొలి నుంచీ పెద్దపీటే. రాజుల ఆస్థానాలలో విదూషకులు కేవలం మహారాజులను నవ్వించడానికే ఉండేవారు. తెనాలి రామకృష్ణుడు, అక్బర్‍ – బీర్బల్‍ ద్వయం పండించిన హాస్యం ఎన్నటికీ అజ రామరం. ఈ రెండు తరహా కథలు నవ్వుతో పాటు ఆలోచననూ కలిగిస్తాయి. నిజానికి నవ్వుతో లేదా జోక్‍తో ఆలోచనను రేకెత్తించే హాస్యమే మరుపురాకుండా మిగిలిపోతుంది. అక్బర్‍ -బీర్బల్‍ కథలు ఎన్నో ఆలో చనలను రేకెత్తిస్తాయి. తెనాలి రామకృష్ణుడి కథలు తెలివిని పెంచుతాయి. పరమానందయ్య శిష్యుల కథలు కూడా మంచి హాస్యాన్ని పుట్టిస్తాయి. మన జానపద గీతాల్లోనూ హాస్యరసం పొంగిపొర్లుతుంది. ఇంకా పల్లెసుద్దుల్లో, పల్లెల్లో పనిపాటు చేసుకుంటూ పాడుకునే పా•ల్లో ఎంతో సునిశిత హాస్యం దొర్లుతుంది.

విదేశాల్లో నవ్వుల ఆస్పత్రులు
మన దగ్గర ఇంకా అవసరం రాలేదు కానీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యునైటెడ్‍ కింగ్‍డమ్‍ వంటి దేశాల్లో ప్రధాన ఆస్పత్రులకు అనుబంధంగా నవ్వుల ఆస్పత్రులు కూడా వెలస్తున్నాయట. ఈ మధ్య తమ వద్దకు వచ్చే రోగులను వైద్యులు- ‘మీరు రోజులో ఎన్నిసార్లు నవ్వుతున్నారు?’ అని ప్రశ్నిస్తున్నారట. వారిచ్చే సమాధానాన్ని బట్టి రోగి మానసిక, శారీరక స్థాయిని అంచనా వేస్తున్నారట. అందుకే నేడు ప్రపంచంలో హాస్యాన్ని, నవ్వును చికిత్స సాధనంగా గుర్తిస్తున్నారు. మనసారా నవ్వుకోవడం వల్ల మనం హాయిగా ఉన్నామనే భావన కలుగుతుంది. నవ్వుల ఆస్పత్రుల్లో హాస్య చిత్రాలు, వీడియోలు చూపిస్తారు. పెద్ద కారణంగా లేకుండా నవ్వడం పిచ్చి అనుకుంటే మీరు పొరపడినట్టే. కడుపుబ్బా నవ్వే వారు ఒత్తిడిని గణనీయంగా తగ్గించుకోగలుగుతారట. అంటే ఒక్క నవ్వుతో డిప్రెషన్‍, ఒత్తిడి వంటివి కనుమరుగైపోతాయన్న మాట. తమ సమస్యలను, సంకోచాలను పక్కన పెట్టిన హాయిగా నవ్వుకోగలిగిన వారు తమ మెరుగైన జీవనానికి తామే బాటలు వేసుకుంటున్నట్టు. అందుకే అన్నారు- ‘నవ్వడం ఒక యోగం.. నవ్వించడం ఒక భోగం.. అసలు నవ్వలేకపోవడం, నవ్వించలేకపోవడం ఒక రోగం’ అని.

నవరసాల్లో ఏ రసం లోపించినా..
నవరసాల సారమే జీవనం. అందులో ఏ రసం పాలు తక్కువైనా ఫర్లేదు కానీ, హాస్యరసం పాలు మాత్రం అసలు తక్కువ కాకూడదు. అది లోపిస్తే జీవితమంతా వేదనే మిగులుతుంది. అయితే, నేటి యాంత్రిక జీవనంలో, పోటీ ప్రపంచంలో మన జీవితాల్లో హాస్యరస పాలు క్రమంగా తగ్గిపోతోంది. ఆవేశం, ఆగ్రహం, అసంతృప్తి, అహం వంటివి నవ్వును, నవ్వే గుణాన్ని మింగేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మనిషి తనలో స్వభావసిద్ధంగా ఉన్న నవ్వును మరిచిపోయి, తనలో లేని అత్యాశ, అహం, ఆగ్రహం వంటి దుణాలను ఒంటబట్టించుకుంటున్నాడు. వీటి బారి నుంచి మళ్లీ బయటపడేందుకు నవ్వును ‘కొనితెచ్చు’కుంటున్నాడు. ఎంత దుర్దశ? ని•మే… ఇప్పుడున్న పరిస్థితుల్లో వేగం, ఒత్తిడి, పోటీ, సమస్యలు పెరిగాయి. అవి మనిషిని చిరునవ్వుకు దూరం చేస్తున్నాయి. అసలు నవ్వడమే మరిచిపోయేలా చేస్తున్నాయి. ఇప్పుడు వేల మంది చార్లీచాప్లిన్‍లు వచ్చినా మనుషులు మనసారా నవ్వే పరిస్థితులు లేవంటే అతిశయోక్తి కాదు. అంతగా మనిషి ‘లైఫ్‍ టార్గెట్‍’లకు లొంగిపోయి ఉన్నాయి. ఆరోగ్యకరమైన హాస్యం ఈనాటి జీవితాల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. అవసరాలు తీర్చుకునేందుకు, డబ్బు సంపాదనకు జరుగుతున్న పరుగు పందెంలో మనిషి గెలుస్తుండొచ్చు గాక.. కానీ, అమూల్యమైన నవ్వును మాత్రం కోల్పోతున్నాడు. నిజానికి నవ్వడానికి రూపాయి కూడా ఖర్చు పెట్టనవసరం లేదు. కానీ, డబ్బులు పోసి దాన్ని కొనుకుంటున్నాడు నేటి మనిషి.

లాఫింగ్‍ క్లబ్బులు..
నవ్వు మరిచిపోయిన మనిషి ముఖంపై చిరునవ్వు వెలిగించేందుకు ఇప్పుడు చిన్నా పెద్దా పట్టణాల్లో సైతం లాఫింగ్‍ క్లబ్‍లు వెలుస్తున్నాయి. కాసేపు కూడా నింపాదిగా, హాయిగా గడిపే తీరిక లేని మనిషికి ఇవి నవ్వడం నేర్పిస్తున్నాయి. అందులోనూ సెల్‍ఫోన్లు వచ్చాక మనుషుల మధ్య మాటలే కరువయ్యాయి. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటేనే కదా.. ఆ సంభాషణలో నుంచి హాస్యం పుట్టేది. ఇప్పుడు ఎవరికి వారు సెల్‍ఫోన్లతోనే మాట్లాడు తున్నారు. అరచేతిలోని ‘తాకే తెర’ మనసుకు నవ్వును తాకనివ్వడం లేదని ఎవరూ గుర్తించడం లేదు. వాట్సాప్‍లో వచ్చే జోకుకే మనిషి నేడు నవ్వు తున్నాడు. స్వతహాగా నవ్వడం ఏనాడో మరిచిపోయాడు. చింతలు, చికాకులు, అర్ధం లేని లక్ష్యాల వైపు పరుగులతో మనిషిలో హాస్యప్రియత్వ తగ్గిపోతోంది. నవ్వు ఇలా మహా భాగ్యమై పోయినందుకే లాఫింగ్‍ క్లబ్బులు వచ్చాయి. మనిషి కొత్తగా నవ్వడం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవి ఆ అవసరాన్ని తీరుస్తున్నాయి. నవ్వడాన్ని అభ్యాసం చేయిస్తున్నాయి. ఏదేమైనా నవ్వుకు దూరమై ఎరుపెక్కిన ముఖం, వంకర• తిరిగిన మూతి, బరు వెక్కిన హృదయం.. వీటన్నిటికీ విరుగుడు నవ్వే. హాస్య చిత్రాలు, నాటకాలు, రచనలు, కార్టూన్లు చదవడం, చూడటం వల్ల నవ్వు తెప్పించుకోవచ్చు.

నవ్వు యోగమే కాదు.. వ్యాయామం కూడా!
మన ముఖంలో నవ్వు కన•డాలి అంటే మన ముఖం లోని ముప్పై రెండు కండరాలు కదలాలట. చూశారా? నవ్వడం కూడా ఒక వ్యాయామం అన్నమాట. ఒక్క నవ్వుతో 32 కండరాలను కదిలించడం అంటే అది ఎంత గొప్ప వ్యాయామమో కదా!. చక్కని నవ్వు వల్ల ముఖ కవళికలు మెరుగవుతాయి. ముఖ కండరాల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. వృద్ధాప్య ఛాయలు, ముడతలను దరి చేరనివ్వదు. మనసు స్వచ్ఛంగా ఉన్న వాళ్లకే స్వచ్ఛమైన నవ్వు వస్తుంది. స్వచ్ఛమైన నవ్వును ఇతరులకు పంచగలుగుతారు. అంటే మనసులో ఎటువంటి కల్మషం లేని వారు మనసారా స్వచ్ఛంగా నవ్వగలరు. మనసు బాగాలేనపుడు ఒక మంచి హాస్య కథ చదవడం కానీ, ఒక మంచి హాస్యరస ప్రధానమైన సినిమాను చూడటం వల్ల కానీ చక్కగా రిలాక్స్ కావచ్చు. కొంతమంది నవ్వును చాలా పొదుపుగా వాడు తుంటారు. ఖర్చు లేని పనికి పొదుపు ఎందుకు? భగవంతుడు సృష్టిలో ఉన్న అనేక జీవరాసులలో మనిషికి మాత్రమే చక్కగా నవ్వగలిగే వరాన్నిచ్చాడు. పశుపక్ష్యాదులు కూడా నవ్వుతాయి కానీ, వాటి నవ్వు భాష జీవి జీవికీ వేర్వేరుగా, వేర్వేరు రూపాల్లో, శబ్దాల్లో ఉంటాయి. కానీ, ఈ భూమ్మీద ఎక్కడి మనిషైనా ఒకే విధంగా నవ్వగలడు. కాబట్టి ఆ నవ్వును ఉపయోగించుకుందాం. దానిని పొదుపుగా దాచుకుని, ఉగ్గబెట్టుకుని లేని రోగాలు తెచ్చుకోవడం ఎందుకు? హోదా కోసమో, నాగరికత పేరుతోనే నలుగురు కలిసినపుడు బిగుసుకుపోవడం, చాలా అరకొరగా మాత్రమే నవ్వడమే నేటి సివిక్‍ సెన్స్గా మారింది. సూట్లు, టైలతో ఎలాగూ శరీరాన్ని బిగించేసుకుంటున్నాం.. ఇక మనసును కూడా వాటి మాటున బిగించేయడం అవసరమా? నవ్వాల్సిన సందర్భంలో కూడా నవ్వలేకపోతే ఆ క్షణం వృథా అయిపోయినట్టే.

మీది ఏ రకమైన నవ్వు?
నవ్వుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మందహాసం, చిరు మందహాసం, నవ్వు, వికటాట్టహాసం, చిరునవ్వు. నవ్వులో పొదుపు పాటించే వారు ఎంత మంచి సమయంలోనైనా చిన్న చిరునవ్వుతో సరిపెట్టేస్తుంటారు. కొంతమంది చిన్న విషయాలకు కూడా వికటాట్టహాసం చేస్తుంటారు. ఈ నవ్వులన్నీ పర్వా లేదు కానీ, వెటకారపు నవ్వు మాత్రం ఎవరూ నవ్వ కూడదు. ఇది వెటకారపు నవ్వు నవ్వే వారికి మనసుకు, ఆరోగ్యానికే కాదు అవతలి వారికీ చేటు తెస్తుంది. ఎదుటి వారి మనసును గాయపరిచేది నవ్వు కానే కాదు. మనం నవ్వే నవ్వులకు పాజిటివ్‍ కోణమే ఉండాలి. దానికి నెగటివ్‍ ఛాయలు అసలు ఉండకూడదు.

నీలో నువ్వు.. నీతోనే నవ్వు..
అవతలి వారిని చూసి, వారు అపరిచితులైనా సరే, చక్కని నవ్వు నవ్వితే సగం పరిచయం అయిపోయినట్టే. నవ్వులోని మహత్తు అది. నవ్వుకు మించిన ‘ఫీల్‍ గుడ్‍ ఫ్యాక్టర్‍’ మరొకటి లేదు. మన రోజువారీ జీవనాన్ని అందంగా, ఆనందంగా డిజైన్‍ చేసుకోవడానికి నవ్వు చక్కని అలంకరణ సామగ్రి. నవ్వుతో సాధించలేనిది ఏదీ లేదు. ఇది పరిష్కరించలేని సమస్య కూడా కాదు. ఇది కనుగొనాలంటే ఎవరికి వారు నవ్వుల్లో మునిగి తేలాల్సిందే. అప్పుడే ఇందులో ఉన్న ఎమోషనల్‍ బాండ్‍ తెలిసి వస్తుంది. నవ్వు అనేది మొదట నీలో, నీతోనే మొదలవుతుంది. ఆపై అది నీ చుట్టూ ఉన్న పరిసరాలను, వ్యక్తులను సంతోషంలో నింపుతుంది. అది క్రమంగా అంతటా వ్యాపించి అందరినీ ఆనందడోలికల్లో ఓలలాడిస్తుంది. నవ్వు అనేది యోగా కిందకు రాదు. కానీ యోగాను మించిన మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. శ్వాసకోశ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ‘వెల్‍సెన్‍’కు నవ్వే టానిక్‍. యోగాతో పోలిస్తే నవ్వడం చాలా సులువు. యోగా అంటే కొన్ని భంగిమలు ప్రదర్శించాలి. దీనికి అవేమీ అవసరం లేదు. పెదాలను కాస్త కదిలిస్తే చాలు.. ఆ నవ్వుకు ప్రపంచమే కదిలివస్తుంది.
సో.. మే 6వ తేదీన మనసారా నవ్వుకోవడానికి రెడీ అయిపోండి. ఆ ఒక్కరోజే కాదు.. ఆ రోజు ఇచ్చిన స్ఫూర్తితో సంవత్సరంలోని మూడు వందల అరవై అయిదు రోజులూ.. జీవితాంతం నవ్వడం మర్చిపోకండి. నవ్వడం మరిచిపోయిన మనిషి తనను తాను మరిచిపోయినట్టే. మీరు నవ్వడంతో పాటు ఇతరులకూ దాన్ని షేర్‍ చేయండి. ఏదైనా పంచుకోవడం ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదు.
స్టే హాపీ.. స్టే హెలీ

నవ్వుల యోగా..
ముందే చెప్పుకున్నట్టు నవ్వడం యోగా కిందకు రాదు. కానీ, నవ్వడం మాత్రం ఒక యోగం. దీనివల్ల ఏయే ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి చదవండి.
మనసారా, మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల మనలో అంతర్లీనంగా ఉన్న శక్తి సామర్థ్యాలు వెలికి వస్తాయి. వాటిని సక్రమంగా వినియోగించుకోవడానికి, పాజిటివ్‍ దృక్పథం పెంచుకోవడానికి చక్కని నవ్వు దోహదం చేస్తుంది.
ముఖంపై తొణికిసలాడే అందమైన దరహాసం.. మనకు పాజిటివ్‍ అవుట్‍లుక్‍ను తెస్తుంది. ఇదే ఆకర్షణ. మనల్ని ఇతరుల వైపు తేలికగా ఆకర్షింప చేస్తుంది.
మనకు పరిచయం ఉన్న వారితోనే కాదు, ఇతరులతోనూ తేలికగా కనెక్ట్ కావడానికి నవ్వును మించిన పరిచయ సాధనం మరొకటి లేదు.
మానసిక ఒత్తిడిని నవ్వు తగ్గిస్తుంది. హాయిగా నవ్వడం వల్ల ఒత్తిడి దిగిపోయి రిలాక్స్ కలుగుతుంది. కుంగుబాటు (డిప్రెషన్‍) నుంచి నవ్వు బయట పడవేస్తుంది.
ఉద్విగ్నత, భావోద్వేగాలను నవ్వు సమస్థితిలో ఉంచుతుంది. ఇవి అదుపులో ఉంటేనే మనం ఇతరులతో సంబంధ బాంధవ్యాలు సవ్యంగా నడపగలం. భావోద్వేగాలు అదుపులో లేకుంటే చిర్రుబుర్రులాడుతుంటాం. అటువంటి వారితో స్నేహం చేయడానికి ఎవరూ ముందుకురారు.
హాస్యం అనేది పూర్తిగా ‘ఫన్‍’టాస్టిక్‍ టానిక్‍. ఇది శరీరారోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.
నిరంతరం నవ్వుతూ ఉండేవారే ఇతరులను కూడా ఆనందింప చేయగలుగుతారు. నవ్వుతూ ఉండే వారి సాంగత్యాన్నే ఎక్కువ మంది కోరుకుంటారు.
స్మైలీ ఫేస్‍ అందరినీ ఆకట్టుకుంటుంది. పసిపిల్లలు ఎవరిని చూసినా నవ్వుతారు. కానీ, పెరిగి పెద్దయ్యే సరికి అలా ఎందుకు జరగడం లేదు. నిజానికి నవ్వు అనేది మనలో నిక్షిప్తమై ఉన్న సహజసిద్ధ స్వభావ లక్షణం. దాన్ని అదిమి పెట్టుకోవడం వల్ల నవ్వుకు దూరమైపోతున్నాం.
నవ్వడానికి సమయ సందర్భాలు అవసరం లేదని చెప్పలేం కానీ, కొన్నిసార్లు దానిని ఆచితూచి ఉపయోగించాలి సుమా!
‘లైవ్‍ ఎవ్విరి మూవ్‍మెంట్‍.. లాఫ్‍ ఎవ్విరి డే’ అనేది ఆధునిక ప్రపంచ నినాదం. ఇలా జీవించాలంటే చిరునవ్వును ముఖంపైకి తెచ్చుకోవాలి.
నవ్వాల్సిన సందర్భాల్లో బిగిసుకుపోవడం, వచ్చే నవ్వును అదిమి పెట్టుకోవడం వల్ల ముఖ కండరాలు సడలిపోతాయి.

రోగానికి నవ్వుల టాని
ఈ రోజుల్లో వస్తున్న సగం జబ్బులకు ఒత్తిడే కారణం. 70 శాతం రోగాలు ఒత్తిడితోనే కలుగుతున్నాయనేది వైద్య అధ్యయనాల సారాంశం. అధిక రక్తపోటు, గుండెజబ్బులు, డిప్రెషన్‍ (కుంగుబాటు), ఇన్సోమియా, మైగ్రేయిన్‍, ఆతృత, అలర్జీ, పెప్టిక్‍ అల్సర్‍.. ఇవన్నీ ఒత్తిడి వల్ల వచ్చేవే. నవ్వుల టానిక్‍ మాత్రమే వీటికి ఔషధం. ఉదయం లేస్తూనే ఒక చిరునవ్వును ముఖంపైకి తెచ్చుకుంటే ఇవన్నీ మటుమాయమైనట్టే.
దీర్ఘకాలిక వ్యాధులు ఒక్క నవ్వుతో దూరమవుతాయని చెప్పలేం. కానీ, ఉపశమనాన్ని మాత్రం కలిగిస్తుంది. ఒత్తిడికి ఎక్కువగా గురి కావడం వల్ల శరీరంలో అడ్రినాలిన్‍ ఎక్కువగా విడుదల అవుతుంది. నవ్వితే అది బాగా తగ్గిపోతుంది. తమలో తామే ముడుచుకుపోయే వారి కంటే తరచూ నవ్వే వారికి గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తక్కువట. టెన్షన్‍ తగ్గించే సేఫ్టీ వాల్వు నవ్వు. నవ్వు వల్ల ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. పది నిమిషాలు నవ్వగలిగితే 10 – 20 మిల్లీమీటర్ల మేర రక్తపోటు తగ్గుతుంది. రోజూ కొంతసేపు నవ్వితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకు అవసరమైన లింపాసైట్స్ ఉత్పత్తిని పెంచుతాయి. ముక్కు, శ్వాసకోశ వ్యవస్థలకు సంబంధించిన పొరలలో నవ్వుల వల్ల మెరుగుదల ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
శరీరంలో సహజ రోగ నిరోధకాలైన హార్మోన్ల ఉత్పత్తి పెరిగి, ఆర్ధరైటిస్‍, స్పాండిలైటిస్‍, మెగ్రెయిన్‍ వంటి వ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది. ఊపిరి తిత్తుల సామర్థ్యం మెరుగు పడుతుంది. రక్తంలో ఆక్సిజన్‍ పరిమాణం పెరుగుతుంది. ఆస్తమా రోగులకు హాయి కలుగుతుంది. ఇవన్నీ మనకు తెలియకుండా మనకు నవ్వు చేసే మేలులే. అందుకే, మీరు నవ్వడమే కాదు, మీ చుట్టూ ఉన్న వారిని రెండు మూడు మంచి జోకులు చెప్పి నవ్వించడానికి ప్రయత్నించండి. ఒక్కోసారి మనలో మనకు కలిగే ఆనందం కంటే మన కారణంగా ఇతరులకు కలిగే ఆనందమే మనకు ఎక్కువ ఆనందాన్నిస్తుందనే విషయాన్ని మరువకండి.
ఏ మనిషికై•నా ఆశ, విశ్వాసం అనేవి అవసరం. హాస్యం ఈ రెండింటినీ పుష్కలంగా ఇస్తుంది. సజీవనమైన నవ్వులతో తొణికిసలాడే వారే అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తులు. పసిపిల్లల బోసి నవ్వులు గుర్తు చేసుకుంటే ఇట్టే విచారం మాయ మవుతుంది. ఎవరైనా నవ్వుతుంటే వారితో కలిసి మరిన్ని నవ్వుల పువ్వులు పూయించాలి. పురుషులైనా, మహిళలైనా ఒక్కటే గుర్తుపెట్టు కోవాలి- ‘మీరు ముఖానికి రోజూ ఎంత మేకప్‍ అయినా చేసుకోండి. కానీ, దానికి చిన్న చిరునవ్వు జత చేయకుంటే ఆ అలంకరణ పూర్తయినట్టు కాదు’.

Review నవ్వు కొనాల్సిందేనా.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top