ఈ భూమ్మీద మనకు సాధ్యం కానిది ఏదీ లేదని, కనుగొనలేనిది ఏదీ లేదని గొప్పగా ఊహించుకుని, గర్వంతో విర్రవీగే క్షణంలో ఒక్కసారి తల ఎత్తి ఆకాశంలోకి చూడాలి.
ఒక్క క్షణం.. ఈ విశాల విశ్వంలో ఉండే సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంత, కృష్ణబిలం.. వీటిని తలెత్తి చూస్తే మానవులుగా మనమెంత అల్పులమో అర్థమవుతుంది.
ఎందుకంటే, వీటి గురించి మనకు తెలిసింది గోరంతే.. తెలియనది కొండంత.
నక్షత్రాలు, గ్రహాల సంగతి పక్కన పెడితే మన నిత్య జీవితంలో ప్రత్యక్ష సంబంధం ఉండేది సూర్యుడితోనే.
భూమ్మీద మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుంచీ అనేక ప్రాచీన సంస్కతులు సూర్యుడి ప్రత్యేకతను గుర్తించాయి. సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా భావించి కొలిచాయి.
నైల్ నదీ తీరాన వెల్లివిరిసిన ఈజిప్ట్ సంస్కతి. దక్షిణ మధ్య అమెరికాలో పరిఢవిల్లిన మాయా, ఇన్‍కా సంస్కతులు, భారత ఉపఖండంలో పురుడు పోసుకున్న ఆర్య సంస్కతులు ఉచ్ఛదశలో ఉన్న సమయంలో, తమ తమ నాగరికత కాలాల్లో సూర్యుడిని ఆరాధించడం మొదలుపెట్టాయి. ఈ పురాతన సంస్క•తులన్నీ నాడే తమ దైనందిన జీవితాల్లో సూర్యుడిది ఎంతటి ప్రముఖ, ప్రధాన పాత్రో తెలుసుకున్నాయి. అందుకు తగినట్టుగా సూర్యుడినే ఆధారంగా చేసుకుని గ్రహాల గమనం, కాలమానం, గ్రహణ సమయాలను కచ్చితంగా లెక్కగట్టే పరిజ్ఞానాన్నీ ఆనాడే సంపాదించాయి.
తన వాడివేడి కిరణాలతో భూమ్మీద ఉన్న సకల జీవజాతులకు ప్రాణం పోస్తున్నందునే సూర్యుడిని ‘నమో సృష్టికర్తా’ అనీ స్తుతిస్తారు. సూర్యుడు భూమికి 15 కోట్ల కిలోమీటర్ల (93 మిలియన్ మైళ్లు) దూరంలో ఉన్నాడు. సూర్యుడి కాంతి భూమికి చేరడానికి పట్టే సమయం 8.19 నిమిషాలు. ఇప్పటికి సౌరమండలం వయసు 4.6 బిలియన్ సంవత్సరాలు. అంటే ఇంతకాలం సూర్యుడు కాంతిని విరజిమ్ముతూనే ఉన్నాడన్న మాట. మరో నాలుగు బిలియన్ సంవత్సరాల వరకు సూర్యుడు కాంతిని ప్రసరిస్తూనే ఉంటాడని అంచనా. ఆ తరువాత ఏం జరగనుందనే దానిపై ఇప్పటికీ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రత్యేకించి మన భారతీయ దైనందిన జీవితంలో సూర్యుడే ప్రత్యక్ష దైవం. అందుకే ఆయనను స్తుతిస్తూ అనేక శ్లోకాలు వెలువడ్డాయి.
‘శ్రీ సూర్యనారాయణా.. వేద పారాయణా.. లోక రక్షామణీ.. దైవ చూడామణీ..’, ‘శ్రీ సూర్యనారాయణా మేలుకో.. ’, ‘ఆదిత్య హృదయం’.. వీటిలో సూర్యుడి వర్ణన, ఆయన వివిధ పుష్పచ్ఛాయలతో పోల్చడం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
విశ్వభర్త, విశ్వకర్త అయిన సూర్యుడితో కలిసే మన జీవన గమనం కూడా నడుస్తుంటుంది.
సూర్యుడు నమస్కార ప్రియుడు. ఆయనకు ఎదురుగా నిల్చుని ఒక్క నమస్కారం చేస్తే చాలు.. కలిగే ఆరోగ్యం అనన్యం. ఈ క్రమంలోనే ‘సూర్య నమస్కారాలు’ ఒక ఆరోగ్య పక్రియగా మారాయి.
ఆ విశేషాల సమాహారమే
ఫిబ్రవరి 2021 సంచిక
ముఖచిత్ర కథనం.
అందరికీ
రథ సప్తమి శుభాకాంక్షలు
Review నమో సృష్టికర్తా! నమో విశ్వభర్తా!!.