‘మాఘ’ మహాత్మ్యం

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో రెండో మాసం- ఫిబ్రవరి. తెలుగు పంచాంగం ప్రకారం ఫిబ్రవరి.. మాఘ మాసం. అలాగే పుష్య మాస తిథులు కూడా కొన్ని కలుస్తాయి. చైత్రాది మాస పరిగణనలో మాఘమి పదవ మాసం. ఫిబ్రవరిలో 11వ తేదీ వరకు పుష్య మాస తిథులు, ఆపై మాఘ మాస తిథులు
కొనసాగుతాయి. ఫిబ్రవరి 11 నుంచి మాఘ మాసం ఆరంభమవుతుంది. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడి రథసప్తమి, భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి, భీష్మ ద్వాదశి, అంతర్వేది తీర్థం, వసంత పంచమి వంటి పండుగలకు, పర్వాలకు ఈ మాసం నెలవు.

2021- ఫిబ్రవరి 1, సోమవారం, పుష్య బహుళ చతుర్థి నుంచి
2021- ఫిబ్రవరి 28, ఆదివారం, మాఘ బహుళ పాడ్యమి వరకు..
శ్రీశార్వరి నామ సంవత్సరం- పుష్యం- మాఘం- శిశిర రుతువు- ఉత్తరాయణం

మన పురాణాలలో మాఘ మాసాన్ని జ్ఞాన మాసంగా అభివర్ణించారు. అహం అనే పాపాన్ని తొలగించేది, అజ్ఞానమనే మృత్యువును హరించేది, నశింప చేసేదీ మాఘమని వేదాలు చెబుతున్నాయి. అందువల్లనే మాఘ మాసాన్ని వేద మాసమని కూడా అంటారు. ‘మఖ’ నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఈ మాసంలో రావడం వల్ల ఇది మాఘ మాసమైంది. ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖ మాసాల్లో వచ్చే నాలుగు పూర్ణిమలు మహిమాన్వితమైనవి. వాటిలో మాఘ పూర్ణిమ మరీ ఉద్ధిష్టమైనది. సాధారణంగా పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేయాలనేది నియమం. ఈ నాలుగు పూర్ణిమ దినాల్లో చేసే సముద్ర స్నానాలు ఇంకా ఫలాన్నిస్తాయి. సముద్ర స్నానం వల్ల పాపాలు నశించిపోవడమే కాదు ఆరోగ్యం కూడా బాగుపడుతుందని అంటారు. సముద్రపు నీటిలో లవణ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ ఉప్పునీటిలో శరీరం మునగడం వల్ల ఆ ఉప్పదనం రోమకూపాల ద్వారా శరీరంలోకి ప్రవేశించి, శరీరంలోని మాలిన్యాలను, వ్యర్థాలను తొలగిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే పూర్ణిమ నాడు చేసే సముద్ర స్నానాలు పవిత్రం కావడానికి ఇంకో కారణం కూడా ఉంది. చంద్రుడిలోని పదహారు కళల శక్తీ సముద్రంలో ఉండేది పూర్ణిమ నాడే. కాబట్టి ఆనాడు చేసే సముద్ర, నదీ స్నానాలు ఫలితాన్నిస్తాయి. మాఘంలో చేసే స్నానాలన్నిటికీ సూర్యుడే అధిపతి. యజ్ఞ యాగాదులకూ శ్రేష్ఠమైనది మాఘం. యజ్ఞాలకు అధి దైవం ఇంద్రుడు. అందుకే ఇంద్రుడిని ‘మఘవుడు’ అనీ అంటారు. మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక ‘మాఘం’ అయ్యింది. ఇది శిశిర రుతువు మాసం. చెట్లు ఆకులు రాల్చే కాలం. ఉసిరికలు విస్త•తంగా కాస్తాయి. ఇది కల్యాణకారక మాసం. పవిత్ర స్నానాలకూ, భగవచ్ఛింతనకూ నెలవైన మాసం.

శూన్య మాసంగా పరిగణించే పుష్యం తరువాత వచ్చే మాఘం కల్యాణకారక మాసం. పవిత్ర స్నానాలకు, భగవచ్ఛింతనకు అనువైనదిది. వైశాఖ – కార్తీక మాసాల మాదిరిగా మాఘ మాసపు స్నానాలు పవిత్రమైనవి. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘ మాస సంప్రదాయం. సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్య కిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయాల్లో సూర్య కిరణాల్లో ఉండే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమైనవనీ చెబుతారు. పైగా మాఘ మాస స్నానాలకు అధిష్ఠాన దైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘ మాసంలో సూర్యోదయానికి పూర్వం కనీసం

ఇంట్లో స్నానం చేసినా ఆరు సంవత్సరాల యజ్ఞస్నాన ఫలం లభిస్తుందని అంటారు. ఇంకా బావినీటి స్నానం పన్నెండు సంవత్సరాల పుణ్య ఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం శత గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీ శతగుణ ఫలం ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మృకండ ముని, మనిస్విని దంపతుల మాఘ స్నాన పుణ్య ఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అప మృత్యువును తొలగించిందని పురాణ వచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరడం సంప్రదాయం. ‘ప్రయాగ’ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మాఘ పురాణం మాఘ మాస మహిమలను వివరిస్తోంది. అలాగే, మాఘ స్నానం మహాత్మ్యాన్ని గురించి బ్రహ్మాండ పురాణంలో విపులంగా ఉంది. ఈ మాసంలో గృహ నిర్మాణాన్ని ఆరంభిస్తే ధనవృద్ధి అని మత్స్య పురాణంలో ఉంది. మాఘంలో వచ్చే ముఖ్యమైన పర్వాల వివరాలు.. తిథి సహితంగా..

పుష్య బహుళ సప్తమి
ఫిబ్రవరి 4 – భాను సప్తమి
సాధారణంగా ప్రతి నెలలోని సప్తమి తిథి సూర్యారాధనకు సంబంధించినదై ఉంటుంది. సప్తమి నాడు సూర్యుడిని విశేషంగా పూజిస్తారు. అలాగే, హిందూ తిథులను అనుసరించి స్వామి వివేకానంద జయంతి కూడా ఈనాడే అని అంటారు. కానీ, ఆయన జయంతిని జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

పుష్య బహుళ అష్టమి
ఫిబ్రవరి 5 – కాలాష్టమి
అష్టమి తిథి కాలభైరవుని పూజకు, శక్తి ఆరాధనకు విశేషమైనది. పుష్య బహుళ అష్టమి కాలాష్టమి దినమని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది.

పుష్య బహుళ నవమి
ఫిబ్రవరి 6- అన్వష్టకా శ్రాద్ధమ్‍
పుష్య బహుళ నవమి నాడు అన్వష్టకా శ్రాద్ధమ్‍ చేయాలని స్మతి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే ఈనాటి నుంచి ధనిష్ట కార్తె ప్రారంభమవుతుంది.

పుష్య బహుళ ఏకాదశి
ఫిబ్రవరి 7- షట్తిలైకాదశి
ఆమాదేర్‍ జ్యోతిషి అనే గ్రంథంలో పేర్కొన్న ప్రకారం- పుష్య బహుళ ఏకాదశి షట్తిలైకాదశిగా ప్రసిద్ధి. చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం ప్రకారం ఈనాడు- తిలదాహీ వ్రతం ఆచరిస్తారని ఉంది. షట్తిలైకాదశి అంటే, తిలల (నువ్వు)ను ఆరు విధాలుగా ఉపయోగించే ఏకాదశి అని అర్థం.
1) స్నానం చేసే నీటిలో నువ్వులను వేయడం,
2) నువ్వులు నూరిన ముద్దను శరీరమంతా రాసుకోవడం,
3) ఆరు నువ్వు గింజలను తినడం,
4) తాగే నీటిలో కొద్దిగా నువ్వులను వేసుకోవడం,
5) గురువులకు తిలలు దానం చేయడం,
6) తిలతర్పణం విడవటం..దేవతలకు నువ్వులు సమర్పించడం.
ఈ ఆరు విధులను పుష్య బహుళ ఏకాదశి నాడు ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలు చెబుతున్నాయి

పుష్య బహుళ ద్వాదశి
ఫిబ్రవరి 8- సంప్రాప్తి ద్వాదశి
పుష్య బహుళ ద్వాదశిని సంప్రాప్తి ద్వాదశిగా వ్యవహరిస్తారు. ఇంకా ఈ తిథి నాడు మహా ఫల ద్వాదశి, సురూప ద్వాదశి వంటి వ్రతాలు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. కాగా, ఈ ద్వాదశి నాడే వైష్ణవులు షట్తిల ఏకాదశిని ఆచరించే సంప్రదాయం ఉంది. కాబట్టి వారు ఈనాడు వైష్ణవ షట్తిల ఏకాదశిగా వ్యవహరిస్తారు.

పుష్య బహుళ త్రయోదశి
ఫిబ్రవరి 9- ప్రదోష వ్రతం
పుష్య బహుళ త్రయోదశి నాడు ప్రదోష వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది.

పుష్య బహుళ చతుర్దశి
ఫిబ్రవరి 10- మాస శివరాతి
పుష్య బహుళ చతుర్దశి నాడు యమతర్పణ పూజలు ఆచరించాలని నీలమత పురాణం అనే గ్రంథంలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈనాడు కాళీ పూజ చేస్తారు. అలాగే, విద్యాదీశ తీర్థానాం పుణ్యదినమని కూడా అంటారు. సాధారణంగా చతుర్దశి తిథి మాస శివరాత్రి పర్వదినం.

పుష్య బహుళ అమావాస్య
ఫిబ్రవరి 11- చొల్లంగి అమావాస్య
పుష్య బహుళ అమావాస్య తిథి నాడు సముద్ర స్నానం చేస్తే సమస్త దోషాలూ తొలగిపోతాయని అంటారు. సముద్రంలో కలిసే ఏదైనా జీవనదిలో ఈనాడు స్నానం చేసి పితృ తర్పణం విడిస్తే వారి పితరులు ఇరవై ఒక్క తరముల వారు నరకలోక యాతనల నుంచి బయటపడి స్వర్గలోకానికి వెళ్తారని పురాణ వచనం. గధాదర పద్ధతి అనే గ్రంథంలో ఈ తిథిని బహుళ అమావాస్యగా పేర్కొన్నారు. ఇక, తిథి తత్త్వం అనే గ్రంథం దీన్ని ‘అర్థోదయామావాస్య’గా పేర్కొంది. మన తెలుగు వారు మాత్రం ఈ అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్యగా వ్యవహరిస్తారు.
గౌతముడు, తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని, వశిష్ఠుడు అనే ఏడుగురు రుషుల పేరుతో ఏడు గోదావరి శాఖలు సప్త గోదావరి శాఖలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఏడు ప్రదేశాలకు వెళ్లి స్నానం చేసి రావడాన్నే ఆంధప్రదేశ్‍లోని ఉభయ గోదావరి జిల్లాల్లో సప్తసాగరయాత్ర అంటారు. ఈ యాత్ర చొల్లంగి స్నానంతో అనగా, పుష్య బహుళ అమావాస్య నాడు ఆరంభమవుతుంది. ఏడు పాయలు చూసుకుని ప్రాయకంగా మాఘశుద్ధ ఏకాదశి నాటికి వశిష్ఠా సాగర సంగమస్థానమైన అంతర్వేది చేరతారు. ఆనాడు అక్కడ గొప్ప తీర్థం జరుగుతుంది. ఆ ఏకాదశికి అంతర్వేది ఏకాదశి అని పేరు. సప్త సాగరయాత్రకు ఇలా ప్రారంభ, ముగింపు దినాలు పర్వదినాలయ్యాయి.
ఇక, చొల్లంగి అమావాస్య అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. చొల్లంగి అనేది ఊరి పేరు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఈ గ్రామం ఉంది. ఇది సముద్రతీర గ్రామం. గోదావరి ఏడుపాయల్లో ఒకటైన తుల్యభాగ ఇక్కడ సాగరంలో సంగమిస్తుంది. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సముద్రంలో కలిసే చోటు కాబట్టి ఇక్కడ స్నానం చేస్తే నదిలోనూ, సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన ఫలం కలుగుతుంది. చొల్లంగిలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది.
పుష్య బహుళ అమావాస్య.. మహోదయ కాలం. ఈ పుణ్య కాలంలో అన్ని నదుల జలాలు గంగానది జలంతో సమానమైన పవిత్రతను సంతరించుకుంటాయని అంటారు.

మాఘ శుద్ధ పాడ్యమి
ఫిబ్రవరి 12 – మాఘ మాసం ఆరంభం
మాఘ శుద్ధ పాడ్యమి తిథి నాటి నుంచి మాఘ మాసం ఆరంభమవుతుంది. ఇది మాసపు ఆరంభ తిథి. ఈనాడు కుంభ సంక్రమణం. గురు మౌఢ్యమి త్యాగం.

మాఘ శుద్ధ విదియ
ఫిబ్రవరి 13 – చంద్ర దర్శనం
మాఘ శుద్ధ విదియ నాడు చంద్ర దర్శనం. ఈనాటి నుంచి శుక్ర మౌఢ్యమి ప్రారంభమవుతుంది. అలాగే, ఈ తిథి త్యాగరాజ స్వామి ఆరాధన తిథిగానూ ప్రసిద్ధి. ప్రసిద్ధ ఆలయాల్లో ఈనాడు త్యాగరాజ కృతులను ఆలపించడం ఆనవాయితీ. దక్షిణాది రాష్ట్రాలలో ఈ కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి.

మాఘ శుద్ధ తదియ
ఫిబ్రవరి 14 – చంద్ర దర్శనం
మాఘ శుద్ధ తదియ నాడు ఉమాపూజ, లలితావ్రతం, హరతృతీయా వ్రతం, దేవ్యా ఆందోళన వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు. ఈ తిథి నాడు గుడలవణ దానం చేయాలని శాస్త్ర వచనం.

మాఘ శుద్ధ చవితి
ఫిబ్రవరి 15 – చతుర్థీ వ్రతం
మాఘ శుద్ధ చతుర్థి నాడు శాన్తా చతుర్థీ వ్రతం ఆచరించాలని అంటారు. చవితి తిథి కావడం వల్ల ఈనాడు గణేశ్‍ పూజ చేస్తారు. ఈ రోజున డుంఠి గణపతిని పూజించాలి. కుంద చతుర్థి నాడు శివుడిని మొల్ల పూవులతో పూజించాలి. అలాగే, పుష్య మాస తిథులు శనీశ్వర ప్రధానమైనవి కాబట్టి ఈ తిథిని తిల చతుర్థిగానూ వ్యవహరిస్తారు. ఈనాడు తిల (నువ్వులు) దానం చేస్తే కోటిరెట్ల ఫలాన్ని ఇస్తుందని అంటారు. ఇంకా చవితి తిథి నాడు ఉమాపూజ చేయాలని నీలమత పురాణం చెబుతోంది. అలాగే వరదా గౌరీపూజ కూడా చేస్తారు. చతుర్వర్గ చింతామణి గ్రంథంలో ఉంది.

మాఘ శుద్ధ పంచమి
ఫిబ్రవరి 16 – వసంత పంచమి
మాఘ శుద్ధ పంచమి చదువుల తల్లి సరస్వతీ దేవికి ఆరాధనకు ఉద్ధిష్టమైనది. మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఇంకా ఈ తిథిని ఇంకా మదన పంచమి అనీ, వసంతోత్సవారంభః, వసంత పంచమి, రతికామ దమనోత్సవం, సరస్వతీ జయంతి అని కూడా వ్యవహరిస్తారు. శిశిర రుతువు ప్రారంభంలో వచ్చే ఈ తిథిని వసంత పంచమి అనడాన్ని బట్టి ఇది రుతు సంబంధమైన పండుగగా భావించాల్సి ఉంటుంది. మాఘ ఫాల్గుణాలు శిశిర రుతువు. చైత్ర వైశాఖాలు వసంత రుతువు. శిశిర రుతువు ప్రారంభంలోనే వసంత రుతు సంబంధంగా ఈ వసంత పంచమి పర్వాన్ని నిర్వహించడానికి గల కారణం ఏమిటో ఇతమిద్ధంగా తెలియదు. బహుశా రాగల వసంత రుతు సూచనలకు స్వాగత సన్నాహాంగా ఈ పర్వం ఏర్పడి ఉండవచ్చు. మాఘ మాస శుక్ల పంచమి నాడు హరి పూజ చేయాలని, దాంతో పాటు వసంత పంచమి పర్వం కూడా నిర్వహించుకోవాలని హేమాద్రి అనే పండితుడు చెప్పారు. ఈనాటి కృత్యాలలో తైల స్నానం, నూతన వస్త్రధారణం ముఖ్యం. దక్షిణాదిన వసంత పంచమి అంతగా ప్రాముఖ్యమై లేదు. రాజపుటానాలో దీని ప్రాభవం ఎక్కువ. ఈనాడు వారు రంగుబట్టలు ధరించి బుక్కా, వసంతం చల్లుకుంటారు.
పూర్వం ఈ తిథి నాడు ‘యవేష్ఠి’ అనే యజ్ఞం చేసే వారని తెలుస్తోంది. ఇప్పుడిది అంతగా ఆచరణలో లేదు. ‘యవ’ అంటే ఒక ధాన్య విశేషం. ‘ఇష్ఠి’ అనగా యజ్ఞం. సంక్రాంతికి ఇంటికి వచ్చే ధాన్యాన్ని ఈనాడు అన్నం వండి కులదేవతకు నైవేద్యం పెట్టి తినే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఉంది.
వంగ దేశంలో దీనిని శ్రీపంచమి అంటారు. ఈనాడు సరస్వతీ పూజ చేస్తారు. పుస్తకాలు, కలాలు సరస్వతీదేవి వద్ద ఉంచి, రోజంతా సరదాగా గడుపుతారు. సాయంత్రం దేవి విగ్రహాన్ని సమీపంలోని జలాశయంలో నిమజ్జనం చేస్తారు.
ఏదేమైనా వసంత పంచమి విద్యారంభ దినం. మన తెలుగునాట బాసర, ఇతర సరస్వతీ క్షేత్రాల్లో చదువుల తల్లిని ఈనాడు విశేషంగా పూజిస్తారు. ఇంకా పర్వానికి రతి కామదమనోత్సవం, మదన పంచమి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈనాడే రతీదేవి కామదేవ పూజ చేసినట్టు కొన్ని పురాణాల్లో ఉంది. రుతు రాజు అయిన వసంతుడికి, కామదేవుడికి మంచి స్నేహం. కాబట్టి ఈనాడు రతీదేవికి కామదేవుడికి వసంతుడికి పూజ చేయాలనే ఆచారం ఏర్పడింది. ఇది వసంతరుతువు ఆగమనాన్ని తెలిపే తిథి పర్వం.

మాఘ శుద్ధ షష్ఠి
ఫిబ్రవరి 17 – స్కంద షష్ఠి
మాఘ శుద్ధ షష్ఠి నాడు కుమార స్వామి (స్కందుడు)ని పూజిస్తారు. కాబట్టి ఇది స్కంద షష్ఠి తిథిగా ప్రసిద్ధి. ఇంకా ఈనాడు విశోకాష్టమీ, మందారషష్టి, కామషష్ఠి వ్రతాలను ఆచరించాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఈనాడు వరుణ షష్ఠి. ఎర్ర చందనం, ఎర్రని వస్త్రాలు, పుష్పాలు, ధూపం, దీపాలతో విష్ణు స్వరూపుడైన వరుణదేవుని పూజించాలని నియమం.

మాఘ శుద్ధ సప్తమి
ఫిబ్రవరి 19 – రథ సప్తమి
మాఘ శుద్ధ సప్తమి సూర్య జయంతి దినం. దీనినే రథ సప్తమి పర్వంగా వ్యవహరిస్తారు. ఈ తిథి మన్వాది దినంగానూ ప్రసిద్ధి. సూర్యునికి వివస్వంతుడు అనే పేరుంది. వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు. వైవస్వతుడు ఏడవ మనువు. అతని మన్వంతరానికి రథ సప్తమి మొదటి తిథి. వైవస్వత మన్వాది దినం కనుక ఇది పితృ దేవతలకు ప్రియకరమైనది. ప్రస్తుతం జరుగుతూ ఉన్నది వైవస్వత మన్వంతరమే. మన్వాది నాడు చేయాల్సిన తర్పణాదులను ఈనాడు చేయాల్సి ఉంటుంది.
ఈ వైవస్వత మన్వాది తిథి భాగవతంలో సంవత్సరాదిగా చెప్పబడింది. దీనిని బట్టి ఈ తిథి ఒకప్పుడు మన దేశంలో ఉగాది పండుగగా ఉండేదని తెలుస్తోంది.
తెలుగుదేశంలో కూడా రథసప్తమి ఒకప్పుడు ఉగాది పండుగ అయి ఉండేదనడానికి ఆనాడు ప్రారంభమయ్యే అనేక వ్రతాలు ఆధారంగా ఉంటున్నాయి. నిత్య శృంగారం, నిత్య అన్నదానం, ఫల తాంబూలం, దంపతి తాంబూలం, పుష్ప తాంబూలం, పొడపువ్వుల వ్రతం, చద్దికూటి మంగళవారాలు, చద్దికూటి ఆదివారాలు, చద్దికూటి శుక్రవారాలు, మాఘగౌరి, కాటుకగౌరి, గండాల గౌరి, ఉదయ కుంకుమ, చిట్టి బొట్టు, సౌభాగ్య తదియ, కందవ్రతం, చిత్రగుప్తుని వ్రతం మొదలైన నోములన్నీ రథసప్తమి నాడే పడతారు. వ్రతాలన్నీ సాధారణంగా ఉగాది నాడే ప్రారంభం కావడం ఆచారం. కాబట్టి ఇన్ని వ్రతాల ప్రారంభ దినమైన రథ సప్తమి కూడా ఒకప్పుడు ఉగాది తిథేనని భావించవచ్చు.

మాఘ శుద్ధ అష్టమి
ఫిబ్రవరి 20 – భీష్మాష్టమి
మాఘ శుద్ధ అష్టమి.. భీష్మాష్టమి తిథి. భీష్మాష్టమి రోజున భీష్ముడికి తిలాంజలి ఇచ్చే వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. మాఘ శుద్ధ సప్తమి మొదలు మాఘ శుద్ధ ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకం అంటారు. భీష్ముడు అంపశయ్యపై పరుండి.. ఈనాటి నుంచి ఐదు రోజులలో రోజుకొక ప్రాణం చొప్పున తన పంచ ప్రాణాలను విడిచాడని అంటారు. దీనివల్ల భీష్ముడు ఈ రోజునే మరణించినట్టు తెలుస్తోంది. మహా భారతంలో కూడా ఈ దినమే భీష్ముని నిర్యాణ దినంగా చెప్పారు. భీష్మ ద్వాదశి వ్రతం ఈనాడే ప్రారంభిస్తారని నిర్ణయ సింధువు అనే వ్రత గ్రంథంలో రాశారు. భీష్మాష్టమి ఒక్క వంగ దేశంలోనే చేస్తారు. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధం, తర్పణం విడిచిన వారికి సంవత్సరంలో చేసిన పాపమంతా నశిస్తుందని తిథి తత్వం అనే గ్రంథంలో ఉంది. పద్మ పురాణంలోనూ, హేమాద్రి వ్రత ఖండంలోనూ కూడా దీనిని గురించి వివరణ ఉంది.
ఇంకా ఈనాడు నందినీ దేవిపూజ కూడా నిర్వహించాలని కొందరంటే, ఈనాడు నర్మదా జయంతి అని మరికొందరు అంటారు.

మాఘ శుద్ధ నవమి
ఫిబ్రవరి 21 – మహానంద నవమి
మాఘ శుద్ధ నవమి తిథి మహానంద నవమి పర్వదినమని స్మ•తి కౌస్తుభంలో ఉంది. ఈనాడు నందినీదేవిని పూజించాలని, ఈ ఆచారం వల్లనే ఈ తిథికి మధ్వ నవమి అనే పేరు కూడా ఉందని అంటారు.

మాఘ శుద్ధ ఏకాదశి
ఫిబ్రవరి 23 – జయైకాదశి/భీష్మ ఏకాదశి
మాఘ శుద్ధ ఏకాదశిని జయైకాదశిగా వ్యవహరిస్తారు. తిథి తత్వంలో భీష్మైకాదశీ వ్రతాన్ని ఆచరించాలని ఉంది. ఈ ఏకాదశికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. ఇంద్రసభలో పుష్పవంతుడు నాట్యం చేస్తున్నాడు. తన భార్యను చూస్తూ అతను నాట్యం తప్పుగా చేశాడు. దీంతో ఇంద్రుడికి కోపం వచ్చింది. పుష్పవంతుడిని, అతని భార్యను రాక్షసులు కావాలని శపించాడు. రాక్షసులై తిరుగుతున్న ఆ దంపతులకు మాఘ శుక్ల (శుద్ధ) ఏకాదశి నాడు తినడానికి ఏమీ దొరకలేదు. అందుచేత వారు ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఆ ఉపవాస ఫలితంగా వారిద్దరు శాప విముక్తులయ్యారు. భీష్ముడు ఈ తిథి నాడే మరణించాడని, కాబట్టి ఇది భీష్మైకాదశి దినమని అంటారు. అలాగే, గోదావరి సంగమ ప్రాంతమైన ఆంధప్రదేశ్‍లోని అంతర్వేదిలో గల శ్రీ లక్ష్మీనర్సింహస్వామి కల్యాణోత్సవం ఈ తిథి నాడే ఘనంగా నిర్వహిస్తారు. ఈనాడు అక్కడ గొప్ప తీర్థం జరుగుతుంది.

ఫిబ్రవరి 24 – షట్‍ తిల ద్వాదశి
మాఘ శుద్ధ ద్వాదశినే షట్‍తిలా ద్వాదశి అంటారు. ఇంకా ఈనాడు వరాహ ద్వాదశీ వ్రతం, భీమ ద్వాదశీ వ్రతం కూడా చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు.

మాఘ శుద్ధ త్రయోదశి
ఫిబ్రవరి 25 – విశ్వకర్మ జయంతి/కల్పాది
మాఘ శుద్ధ త్రయోదశి కల్పాది దినం. విశ్వకర్మ జయంతి దినంగా ప్రసిద్ధి. విశ్వకర్మ దేవశిల్పి. ఆయన అన్ని కళలకు, అన్ని శిల్పాలకు, అన్ని విధాలైన చేతి పనులకు, అన్ని రకాలైన వృత్తులకు ఆద్యబ్రహ్మ. ఈయన దేవతలకు కావాల్సిన నగరాలు, మేడలు, మిద్దెలు, రథాలు, ఆయుధాలు తయారు చేసి ఇచ్చాడు. సూర్యుడిని నేర్పుగా సానబట్టి.. రాలిన ఆ చూర్ణంతో విష్ణుమూర్తికి చక్రాయుధాన్ని తయారు చేసి ఇచ్చాడు. ఇంకా శివుడికి త్రిశూలాన్ని, ఇంద్రుడికి వజ్రాయుధాన్ని, రావణుడికి లంకా నగరాన్ని, శ్రీకృష్ణుడికి ద్వారకా బృందావనాన్నీ ఈయనే నిర్మించి ఇచ్చాడు.
విశ్వకర్మ కొడుకు నలుడు సుగ్రీవుని కొలువులో ఉండేవాడు. రాముడు సముద్రాన్ని దాటడానికి కట్టిన వారధికి చీఫ్‍ ఇంజనీర్‍ ఇతడే. విశ్వకర్మ పాండవులకు ఇందప్రస్థ నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. మన దేశంలో విశ్వకర్మ విగ్రహాలు పలుచోట్ల చూడవచ్చు. అందులో కొన్నిటికి ఒకే ముఖం ఉంటుంది. మరికొన్నిటికి పంచముఖాలు ఉంటాయి. ఆయన చేతుల్లో ఉత్పత్తి సాధనాలు అనేకం కనిపిస్తాయి. ఈయనది హంస వాహనం.
విశ్వకర్మ జయంతి నాడు కార్మికులు తన పనికి విశ్రాంతినిస్తారు. విందు వినోదాలతో ఆనందంగా గడుపుతారు.

మాఘ శుద్ధ పౌర్ణమి
ఫిబ్రవరి 27 – మహా మాఘి/ మాఘ పూర్ణిమ
ఆకాశవీధిలో గల అనేకానేక నక్షత్రాలలో మఘ ఒకటి. మనకు ప్రధానంగా ఇరవై ఏడు నక్షత్ర మండలాలు ఉన్నాయి. అందులోని ఒక మండలంలో మఘ ప్రధానమైనది. మఘతో పాటుగా మరో నాలుగు నక్షత్రాలు పల్లకి ఆకారంలో చెదిరి ఉంటాయి. నెలకోసారి చంద్రుడు ఆ నక్షత్రంలో ప్రవేశిస్తుంటాడు. కానీ ఏడాదిలో ఒకసారి మాత్రమే అతను పదహారు కళలలో వెలుగొందుతూ మఘ నక్షత్రంలో ప్రవేశిస్తాడు. అదే మాఘ పూర్ణిమ. మన పంచాంగకర్తలు దీనిని మహా మాఘీ అన్నారు. నాడు తిల పాత్ర కంచుక కంబళాది దానాలు చేయాలని పెద్దలంటారు.
మాఘ మాసంలో అరుణోదయాన స్నానం చేయడం మన మత విధులలో ఒకటి. చలికి వెరవక మంచుతో చల్లగా మారిన నదీ జలాల్లో స్నానం చేయాలని మన పెద్దలు మాఘ మాసపు విధిగా నిర్ణయించారు. మాఘ స్నానంతో పాటు తిలహోమం, తిలదానం, తిల భక్షణం కావించాలని చెబుతారు. ఈ ఆచారాలన్నీ ఆరోగ్యప్రదమైనవి. మాఘ మాసం పొడవునా ఈ ఆచారాలను పాటించలేకపోయినా కనీసం ఆ మాసపు పర్వాల్లో అయినా పాటించడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఇక, మాఘ పూర్ణిమకు కాళహస్తిలో స్వర్ణముఖి నదీ స్నానం మహత్తు కలదని అంటారు. రామేశ్వరం వద్ద సేతువులో రత్నాకరం మహోధుల సంగమం ఒకటుంది. ఇక్కడ స్నానం కూడా విశేషమైనదే. ప్రయాగలో త్రివేణీ సంగమంలో మాఘ పూర్ణిమ స్నానం మహా పాతక నాశినిగా ఉంటుందని అంటారు. అలాగే, మాఘ పూర్ణిమ సతీదేవి ప్రాదుర్భవించిన దినమని పురాణ కథ. మఘతో పాటుగా ఈశ్వరి (పార్వతి) ఒకసారి దక్షిణావర్త శంఖపు ఆకారాన్ని ధరించి సరయూ నదిలోని కాళింది మడుగులోని ఒక పద్మంలో పడింది. దక్ష ప్రజాపతి అక్కడ స్నానం చేస్తూ పద్మంలోని శంఖాన్ని చూశాడు. అది దక్షిణావర్తమై ఉంది. దక్షిణావర్త శంఖం అపురూపమైనది. అది ఎవరి వద్ద ఉంటుందో వారికి గొప్ప భాగ్యం పడుతుంది. ఈ సంగతులు తెలిసిన వాడు కావడం చేత దక్ష ప్రజాపతి ఆ శంఖాన్ని అందుకోబోయాడు. అతని హస్త స్పర్శ తగలడంతోనే ఆ శంఖం ఒక చక్కని చిన్నారి కన్నెగా మారింది. ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆ బిడ్డే సతీదేవి. శంఖం బాలికగా మారిన రోజు మాఘ పూర్ణిమ. అందుచేత మాఘ పూర్ణిమ అత్యంత పవిత్రమైన దినం అయ్యింది.
మఘ నక్షత్రానికి అధి దేవత బృహస్పతి. కాబట్టి ఈనాడు ఆయనను పూజించాలని అంటారు. గురుడు సింహరాశి గతుడైనపుడు తమిళనాడులోని కుంభకోణంలో మహామాఘి ఉత్సవం మరీ వైభవంగా ఉంటుంది. మాఘ పూర్ణిమ నాడు బ్రహ్మవైవర్త పురాణం దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం. మాఘ శుద్ధ పూర్ణిమ నాడే గురు రవిదాస్‍ జయంతి దినం. అలాగే ఈనాడు కొన్నిచోట్ల లలితా జయంతినీ నిర్వహించే ఆచారం ఉంది.

మాఘ బహుళ పాడ్యమి
ఫిబ్రవరి 28 – సౌభాగ్య వాప్తి వ్రతం
మాఘ బహుళ పాడ్యమి తిథి నాడు సౌభాగ్య వాప్తి వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

Review ‘మాఘ’ మహాత్మ్యం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top