రామాపురం అనే గ్రామానికి దగ్గరలో ఒక అరణ్యం ఉండేది. ఒక సాధువు ఆ అరణ్యంలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉండేవారు. రామాపురం ప్రజలు ఆయన బోధనలు వినడానికి వెళ్లేవారు. కష్టాలలో, బాధలలో ఉన్న వారికి ఆయన వాక్కులు ఎంతో స్వాంతన కలిగించేవి. చల్లని ఆయన చేతి స్పర్శ ఎలాంటి అనారోగ్యాన్ని అయినా నయం చేసేది.
ఆ సాధువు గ్రామస్తులకు- ‘మోహాన్ని, అహంకారాన్ని, స్వార్థాన్ని వదిలివేసి నిరాడంబరంగా జీవించండి. పరులకు సహాయం చేసినప్పుడే మనిషి జీవితం సార్థకం అవుతుంది. దానగుణమే అన్నిటి కంటే మించిన గొప్ప గుణం’ అని బోధించే వారు.
ఆయన అడవిని వదిలి బయటకు సాధారణంగా వచ్చే వారు కాదు. రామాపురం ప్రజలు ఎన్నిసార్లు ఆయనను గ్రామంలోకి ఆహ్వానించినా ఆయన సున్నితంగా వారి అభ్యర్థనను తిరస్కరించే వారు. ఒకసారి రామయ్య అనే రైతుకు జబ్బు చేసింది. అతను కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. రామయ్య కుటుంబసభ్యుల విన్నపం మేరకు మొదటిసారిగా ఆశ్రమం వదిలి బయటకు వచ్చి రామాపురంలో అడుగుపెట్టారు.
ఆయన రాక ఆ ఊరి ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు.. ఇలా అందరూ ఆ రోజు పనులు మానుకుని సాధువును దర్శించుకునేందుకు బారులుదీరారు. అందరూ రకరకాల పిండివంటలు, పంచభక్ష్య పరమాన్నాలు తయారు చేసుకుని ఆయనకు నివేదించడానికి తీసుకువచ్చారు. వాటంన్నిటినీ చూసి సాధువు నిర్వికారంగా ముఖం పెట్టారు. తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఆయన సిద్ధమయ్యారు.
‘అదేంటి స్వామీ! మీ కోసం ఇన్ని వంటకాలు భక్తిశ్రద్ధలతో తయారు చేసి తీసుకొస్తే ఏమీ తీసుకోకుండా, ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు? మీకు మా మీద కోపం వచ్చిందా? మేం ఏదైనా తప్పు చేశామా?’ అని గ్రామస్తులు ఆయనను అడిగారు.
అందుకు ఆ సాధువు- ‘నాయనలారా! ఇంతకాలం నేను మీకు ఎన్నో విషయాలు బోధిస్తూ వచ్చాను. మీరు వాటిని ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తున్నారని నాకు ఇప్పుడు అర్థమైంది. అంతేకాదు, మీరు కళ్లు ఉండీ చూడలేని వారు కూడా. నేను ఏం తింటున్నాను? ఎలా జీవిస్తున్నాను? అనే విషయాలను మీరు పట్టించుకోలేదు. నిరాడంబరంగా జీవించాలని మీకు చెబుతూ వచ్చాను. మరి, ఆ నిరాడంబరతే నాకు వర్తించదా? ఈ పిండివంటలు, పంచభక్ష్యాలు నాకు కావాలా?’ అన్నారు ఎంతో శాంతంగా.
గ్రామస్తులంతా తలలు వంచుకున్నారు.
భగవంతుడిని కానీ, ఆయన సేవలో గడిపే వారిని కానీ, ఆయనకు ప్రీతిపాత్రులైన సాధువుల వంటి వారిని కానీ ఆకట్టుకోవడానికి, వారి మనసు చూరగొనడానికి ‘తాయిలాలు’ పెట్టాలని ప్రయత్నించకూడదు. నిరాడంబర భక్తి మాత్రమే భగవంతుడిని, ఆయన ప్రతినిధులను కట్టిపడేస్తుంది.
నీతి: నిరాడంబరంగా జీవించే వారే భగవంతునికి ప్రీతిపాత్రలు.
Review నిరాడంబర భక్తి.