కోరలు తీసిన కోరికలు
కొసరే తేనెల మధురిమాలు
కోరికలు అంతులేని ఆనందాన్నిచ్చే శారికలే కాదు, బుసకొట్టి కాటేసే కాలసర్పాలు కూడా. పాములు విషం కక్కుతాయి. కాటు వేస్తాయి. కానీ కోరికలు లేకుండా, రాకుండా ఉంటాయా? అను నిత్యం మన జీవితంతో పెనవేసుకొని ఉన్నాయి కదా! అంటే జీవితానికి కోరికలు ముఖ్యమన్నమాట. అందుకే కోరికలే అన్నిటికన్నా ప్రథమస్థానం ఆక్రమిస్తున్నాయి. వాంఛలన్నీ చంపేసుకుని బ్రతుకును వెళ్ళదీయాల్సిన పనిలేదు. కోరికల కోరలు పీకి విషం పిండి బయట పారేయండి. వాటితో సరదాగా ఆడుకోండి. ఆశలు ఆనందాన్నీ, ఆవేదననీ కూడా ఇస్తాయి. అయితే వాటిలోని ప్రమాదకరమైన అంశాలను పక్కన పెడితే మిగిలినదంతా సంతోషమే! మొత్తం కోరికలనే చంపేస్తే సుఖసంతోషాలను కూడా చంపినట్లే. కృష్ణుడు కోరికలు లేకుండా బ్రతికాడా ? కోరికల పడగలలోని గరళాన్ని కక్కించి, నిర్వీర్యం చేసి ఆ పడగలపై విలా సంగా నాట్యవిన్యాసాలు చేశాడు. ఆనందలీలగా మల చాడు.
ఏ వస్తువును పైకి విసిరినా మళ్ళీ భూమిపైనే పడినట్టుగా పదే పదే అదే ప్రాథమిక సూత్రం, ‘ప్రకృతి ద్వంద్వ స్వభావం’ దగ్గరకే రావలసివస్తోంది. సృష్టించడమే కాదు, సంహరించడం కూడా ప్రకృతి ధర్మం. ప్రవేశద్వారం, నిష్క్రమణ ద్వారం రెండూ ఉంటాయి. బయటి దొంగలే కాదు, లోపలి దొంగలు కూడా ఉన్నారు. బయటి దొంగలు నగా, నట్రా దోచుకుంటే, లోపలి దొంగలు సుఖసంతోషాలను అపహరిస్తారు. బయటి దొంగల పని పట్టగలమేమో గాని, లోపలి దొంగలను తరిమికొట్టలేం. జగ న్నాథుడు శరీరసౌధాన్ని నిర్మిస్తాడు, నిర్మూలిస్తాడు. కూల్చుతున్నాడని క్రూరుడని పిలవకండి. అ క్రూర వరదుడు ఎన్నటికీ క్రూరుడు కానేరడు. అందమైన కొత్త భవనాన్ని ఆవిష్కరించేందుకు పాత ఇల్లు పడగొడుతున్నాడు.
ఒకే వస్తువు సుఖాన్నీ, దుఃఖాన్నీ ఇస్తుంది. నీరు వరదలా ముంచెత్తి బీభత్సం చేస్తుంది. ప్రాణాలు తీస్తుంది. దప్పికతో అలమటిస్తున్న వేళ దాహార్తిని తీరుస్తుంది. ప్రాణాలు నిలుపుతుంది.కోరికలను పూర్తిగా తృప్తిపరచి తుడిచివేయలేం. అవి నిరంతరసౌఖ్యానికి ముడిసరుకులు. ఆకలి ఉంటేనే రుచులు ఆస్వాదిస్తాం. భోజనం తృప్తిగా తినాలి. అరిగి మళ్ళీ ఆకలి పుట్టాలి. మరిన్ని కొత్త రుచులతో మళ్ళీ భోజనం చెయ్యాలి. కోరికలూ అంతే!నిరంతరసుఖప్రాప్తి కోసమే, అప్పుడప్పుడు దుఃఖం కలుగుతుంటుంది. ‘ఆనందాన్ని’ శాశ్వతం చేయడం కొరకు పరమేశ్వరుడు దయతో ‘ఆవేదన’ అనుగ్ర హించాడు. దుఃఖం మాయమైతే సుఖం కూడా కనుమరుగవుతుంది. సుఖదుఃఖాలు ఒకే జల నుండి ఊరిన రెండు నీటి ధారలు. ఒకదానిపై ఒకటి ఆధారపడే ఈ వైరుధ్యాలే మన ఉనికికి కారణమవుతున్నాయి. మన మనుగడను అర్థవంతం చేస్తున్నాయి. ఎడతెగకుండా ఎండ మాత్రమే కాస్తే, అంతా ఎడారిగా మారుతుంది. ఎప్పుడూ వర్షమే కురిస్తే జల ప్రళయం సంభవిస్తుంది. వానలు అస్సలు వద్దు, ఎండలు మాత్రమే ముద్దు అనుకుంటే రాళ్ళురప్పలు, బీడునేలలే మిగులుతాయి. నిరంతర సౌఖ్యాలు జీవితాన్ని ఎడారిగా మారుస్తాయి. మనం ప్రకృతిని సరిగ్గా అర్థం చేసుకోం. అందుకే ఇన్ని సందేహాలు, అపార్థాలు. సహజత్వమనే సులోచనాలు ధరించనంతవరకూ అయోమయంలోనే ఉంటాం.
సరళరేఖను ఎంత పొడవుగా గీసినా, అందులో అందమేముంటుంది! చిత్ర విచిత్ర గతుల వక్రరేఖల లోనే చిత్రకళ రంజిల్లుతున్నది. సెలయేటి సౌందర్యం, దాని వంపులలోనే దాగి ఉంటుంది. నిశ్శబ్దంగా ప్రవహించే నీటి గమనంలో ఒక విధమైన స్తబ్ధత చోటు చేసుకుంటుంది. కానీ అడుగడుగునా అడ్డుపడే రాళ్ల తాకిడితోనే గలగలల సరిగమలు జనిస్తున్నాయి. కడలి అలలు బండరాళ్లను ఢీకొన్నప్పుడు ఎంత కమనీయ దృశ్యం రచింపబడుతున్నది !
సృష్టిలోని అన్ని వస్తువులూ అపార మేధస్సు నుండి ఉద్భవించాయి. కనుక ప్రతి వస్తువూ పరిపూర్ణమైనది. లోపాలు లేనిది. ఏది ఎందుకున్నదో అర్థం చేసుకునే శక్తి మనకు లేకపోవచ్చు. మనకు అన్యాయంగా, అధర్మంగా కనిపించేదంతా, మనం అపార్థం చేసుకున్న భగవంతుని ప్రజ్ఞ.
కోరికలు కలగడం, అవి సంతృప్తి చెందకపోవడం రెండూ ప్రకృతి చమత్కారమే. ఇది సృష్టి ప్రతిభా విశేషం. ప్రతి వస్తువూ, ప్రతి సంఘటనా సుఖ, దుఃఖ కారకమే. కాబట్టి ఒక ముఖ్య విషయం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. కోరికలోని ఆనందాన్ని అనుభవిస్తూ (మితిమీరకుండా, అదుపు తప్పకుండా) వాంఛలను దుఃఖసాగరంగా మార్చేయకుండా, ఆనందామృతాన్ని తోడుకునే ఊటబావిగా మలచు కోవాలి. తీరని కోర్కెల బరువుమూటను వేడుకల పెన్నిధిగా, అక్షయపాత్రగా ఆవిష్కరించండి.
Review కోరలు లేని కోరికలు.