ఇద్దరు ప్రయాణికులు ఒక దారిలో కలిశారు.
ఒకతని దగ్గర లాంతరు ఉంది.
ఇంకొకతని వద్ద లేదు.
కానీ ఇద్దరూ కలిసి పక్కపక్కనే నడవడం వల్ల కాంతి ఇద్దరి మార్గాల్లో పరుచుకోవడం వల్ల మార్గం సుగమంగా ఉంది.
దీపం ఉన్న వ్యక్తి ఎంత సులభంగా అడుగులు వేస్తున్నాడో లాంతరు లేని వ్యక్తి కూడా అంతే అనాయాసంగా సాగుతున్నాడు.
కారణం- దీపమున్న వ్యక్తితో పాటు దీపం లేని వ్యక్తి నడవడమే.
లాంతరు లేని వ్యక్తి తన దగ్గర లాంతరు లేదే అని దిగులు పడలేదు.
కారణం- దాని అవసరం అతనికి అక్కడ లేదు.
అలా ఇద్దరూ చాలా దూరం నడిచాక ఒక నాలుగు రహదారుల కూడలి వచ్చింది.
అప్పటి దాకా ప్రయాణం సాఫీగా సాగింది.
అక్కడి నుంచీ దారులు వేరయ్యాయి.
లాంతరు ఉన్న వ్యక్తి కుడివైపునకు, లాంతరు లేని వ్యక్తి ఎడమ వైపునకు వెళ్లాలి.
లాంతరు ఉన్న వ్యక్తి కుడి వైపు తిరిగి వెళ్లిపోయాడు.
కాంతి అతనితో పాటు అతనికి దారి చూపిస్తూ వెళ్లింది.
లాంతరు లేని వ్యక్తి ఎడమ వైపుకు తిరిగి పది అడుగులు వేశాడో లేదో కాలు ముందుకు కదల్లేదు.
కారణం- చీకటి.
అడుగు ముందుకు పడటం లేదు. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. అతనికి ఏడుపు వచ్చింది. లాంతరు ఉన్న వ్యక్తిని తలచుకున్నాడు. అతని దగ్గరగా తను నడుస్తున్నంత సేపూ ప్రయాణం అనాయాసంగా జరిగింది. అతను వెళ్లిపోయాక తన మార్గం అంధకారబంధురమయ్యింది.
తన దగ్గర కూడా కనీసం చిన్న దీపమైనా ఉండి ఉంటే ప్రయాణం సాఫీగా సాగేది కదా అని బాధపడ్డాడు.
ఈ కథలో మాదిరిగానైనా, నిజ జీవితంలోనైనా మనకు ఇతరులు కొంత వరకే దారి చూపిస్తారు. తరువాత మన దారి మనం వెతుక్కోవాల్సిందే.
చివరి దాకా ఎవరూ వేలుపట్టి నడిపించరు.
గురువు చేసే పనైనా అదే. గురువు దగ్గరున్న కాంతి కొంతవరకే దారి చూపుతుంది. శిష్యుడు తనలోని దీపాన్ని వెలిగించుకున్నప్పుడు ప్రయాణం చివరి దాకా చేయగలడు.
దాని వెనుక ఉన్న పరమార్థం.. ఈ కథలోని నీతే!
-కుమార్ అన్నవ
Review నీకు నువ్వే దీపం.