మన నవీన ధర్మాల మూలాలన్నీ సనాతన ధర్మాలతో ముడిపడి ఉన్నాయి.
మన సంప్రదాయంలో విద్యాభ్యాసం అనేది అత్యంత ముఖ్యమైనది. హృదయ వికాసం కలిగించేదీ, ద్వంద్వాలు, మానసిక వికారాలు తొలగించి వివేకాన్నిచ్చేది అసలైన విద్య.
మొత్తం మనకున్న విద్యలన్నీ కలిపి పద్దెనిమిది రకాలని అంటారు. కానీ, స్థూలంగా చెప్పాలంటే విద్యలు రెండు రకాలు.
ఒకటి- పరావిద్య, రెండు- అపరావిద్య.
పరావిద్యనే ఆధ్యాత్మిక విద్య అని కూడా అంటారు. దీనివల్ల జన్మరాహిత్యం కలుగుతుంది.
అపరావిద్య అంటే- లౌకిక విద్య. అంటే మనకు పాఠశాలలు, కళాశాలల్లోనూ నేర్పేది. ఇది మనిషి ఉదర పోషణార్థం నేర్చే విద్య.
దేనివల్లనైతే డబ్బు, అధికారం, సుఖాలు, విలాసాలూ సమకూరుతాయో అది అపరావిద్య.
అపరావిద్య బతుకుదెరువు కోసమే కానీ, బతుకును పండించుకోవడానికి కాదు.
చదువు వేరు. సంస్కారం వేరు.
చదువుకున్న వారందరూ సంస్కారవంతులై ఉండరు. అలాగే సంస్కారవంతులందరూ చదువు నేర్చి ఉండకపోవచ్చు.
కానీ, చదువూ, సంస్కారం రెండూ ఒకే మనిషిలో ఉంటే..??
అలా ఉంటే బంగారానికి తావి అబ్బినట్టే!.
ఏ చదువు చదివినా, ఏ విద్యలు నేర్చినా అది మనలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నైతిక విలువలనూ, ఉన్నత వ్యక్తిత్వాన్ని పెంపొందించేదిగా ఉండాలి.
అది మన బుద్ధి బలాన్నీ, ఆత్మబలాన్నీ పెంచాలి. ఇప్పటి చదువులూ, విద్యలూ ఇవన్నీ నేర్పుతున్నాయా?
గుడ్లగూబ పగలు చూడలేదు.
కాకి రాత్రిళ్లు చూడలేదు.
చదువు లేని వాడు రేయింబవళ్లూ చూడలేడు.
కానీ, ఇప్పుడు చదువుకున్న వాడూ, చదువు లేని వాడూ.. అందరిదీ ఒకటే స్థితి.
ఎప్పుడూ ఎవరికీ ఏమీ కనిపించవు.
ఎవరూ జీవితంలోకి పూర్తిగా తొంగిచూడరు.
ఇప్పుడున్నదంతా అపరావిద్యే.
పరావిద్య అనేది లేనే లేదు.
నేటి మన చదువులు డాక్టర్లనూ, ఇంజనీర్లనూ, అధికారులనూ తయారు చేస్తున్నాయి కానీ, శీలవతులనూ, గుణవంతులనూ, మహనీయులనూ తయారు చేయలేకపోతున్నాయి.
త్యాగం, సేవ వంటి విలువలను నేర్పలేకపోతున్నాయి.
సకల విద్యలకూ మనసే స్థావరం. కనుక అంతరంగాన్ని శుద్ధిచేసి అందులోని ఆత్మను కళ్లెదుట నిలిపేదే అసలైన చదువు.
అలాంటి చదువులను, అందులోని మంచిని ప్రోది చేసుకుందాం.
– కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review బతుకును పండించుకుందాం!.