పలుకు తేనెల తల్లి

సర:’ అంటే కాంతి.
సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థం.
జనజీవితాలను జ్ఞాన, కాంతిమంతం చేసే మాతృశక్తి, అక్షరజ్ఞానాన్ని ఒసగే మంత్రశక్తి- శ్రీ సరస్వతీమాత.
సాహిత్యం, సంగీతం అనే రెండు అమృత కలశాలను మానవాళికి ప్రసాదిస్తున్న జగన్మాత ఆమె.
సకల కళారూపిణి అయిన సరస్వతీదేవి అక్షరానికి అధిదేవత.
ప్రణవ స్వరూపిణి. జ్ఞానానంద శక్తి. లౌకిక, అలౌకిక విజ్ఞాన ప్రదాయిని.
శ్రీవాణి కృప లేకుంటే లోకానికి మనుగడే లేదు.
మానవజాతి మనుగడకు, అక్షయ సంపదకు మూలమైన ప్రణవ స్వరూపిణి సరస్వతి.
విజ్ఞాన నిధులు అనేకం ఉన్నాయి. అవన్నీ చల్లని తల్లి సరస్వతి కటాక్ష వీక్షణ ఫలితాలే.
ప్రతిభ, మేధ, స్ఫురణ, ధారణ, చైతన్యం, కళా నైపుణ్యం, జ్ఞాన రహస్యం, సంస్కారం, సత్కీర్తి, తర్కం, వ్యాకరణం, మీమాంస, వ్యాఖ్యానం, భాష్యం.. ఇవన్నీ వాగ్దేవి భూషణ భాషణలే.
శుంభ, నిశుంభులను సంహరించిన వీరనారి కాబట్టే ఆమెను మహా సరస్వతిగా కొలుస్తారు.
సిద్ధ, నీల, ధారణ, అంతరిక్ష సరస్వతిగా ఆ దేవికి అనేక రూపాలున్నట్టు ‘మంత్ర శాస్త్రం’ చెబుతోంది.
వసంత పంచమి నాడు హరిపూజ చేయడం, కొత్త బట్టలు ధరించడం, రంగులు చల్లుకోవడం వంటి వాటితో పాటు సరస్వతీదేవిని పూజిస్తారు.
కొత్త ధాన్యం వచ్చే రోజులు కాబట్టి, బియ్యంతో పాయసం వండి నైవేద్యం పెడతారు. సరస్వతిదేవి జన్మించిన రోజుగా శ్రీపంచమిని భావిస్తారు.
అందుకే ఆనాడు ఆ దేవిని భక్తిప్రపత్తులతో కొలుస్తారు.

గ్రంథాలను ఆమె ప్రతిమ ముందు ఉంచి, పూజించి, సాయంకాలం ఊరేగింపుగా వెళ్లి జలాశయంలో నిమజ్జనం చేస్తారు.
వసంత పంచమి నాడే సరస్వతీదేవిని పూజించాలని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది. ఆమెతో పాటు రతీదేవి, కామదేవుడు, వసంతుడు కూడా ఈనాడు పూజలందుకుంటారు.
మకర సంక్రాంతి తరువాత ప్రకృతి వసంత రుతు లక్షణాలను నెమ్మదిగా సంతరించుకుంటుంది.

శీతాకాలానికి వేసవికాలానికి మధ్య ఇది సంధికాలం కావడంతో వాతావరణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

శిశిర రుతువు వసంతరుతువుకు స్వాగతం చెప్పే ఆకుపచ్చని ఈ సమయంలో.. చెట్లు కొత్త చివుళ్లు తొడుగుతాయి. పూలు విరబూస్తాయి. ఇవన్నీ ప్రకృతి నుంచి వెలువడే శుభ సంకేతాలు.
వసంతుడికి స్వాగతం పలుకుతూ ప్రకృతి కాంత శోభాయమానంగా ముస్తాబవుతుంది. అటువంటి సమయం, సందర్భంలో ఆచరించే పర్వమే- శ్రీ పంచమి.

మాఘ శుద్ధ పంచమి నాడు (ఫిబ్రవరి 14, 2024) ఆచరించే ఈ పర్వాన్ని వసంత పంచమి, మదన పంచమి, సరస్వతీ జయంతి అనే పేర్లతో కూడా పిలుస్తారు.
నిజానికి చైత్ర-వైశాఖ మాసాల్లో వచ్చే వసంతుడికి మాఘ-ఫాల్గుణ మాసాల్లోనే స్వాగతోపచారాలు మొదలవుతుండటాన్ని బట్టి ఈ పంచమి ప్రాముఖ్యం, వైశిష్ట్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
వసంత రుతు శోభలకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది.
అక్షర సంపద అంతటినీ లోక కల్యాణానికి వినియోగించడమే సరస్వతీ
దేవికి అసలైన సమర్చన.

శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణీ వాసరా పీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే
వసంత పంచమి రోజున సరస్వతీదేవిని తెల్లటి వస్త్రాలతో అలంకరించి, తెల్లని పుష్పాలతో పూజించి చందనం, క్షీరాన్నం, పేలాలు, నువ్వుండలు, అటుకులు, చెరుకుముక్కలను నివేదించాలని శ్రీమహావిష్ణువు నారదుడికి చెప్పినట్టు దేవీ భాగవతంలో ఉంది.
పెరుగు, వెన్న, తేనె, పంచదార, కొబ్బరికాయ, రేగుపండులను నివేదిస్తే దేవి ప్రసన్నురాలవుతుందని చెబుతారు.

విద్యార్థులు సరస్వతిని పూజించి అనుగ్రహం పొందుతారు. పుస్తకాలకు పసుపు రాసి దేవి ముందు ఉంచి మంచి విద్యాబుద్ధులు అనుగ్రహించాలని ప్రార్థిస్తారు.

ఆయా వృత్తుల వారు పనిముట్లను దేవీరూపంగా భావించి వాటికి పూజ చేస్తారు.
శుద్ధ సత్వగుణ శోభిత సరస్వతి, శ్వేత వస్త్రాలంకృతగా హంసవాహినిగా తామర పుష్పం మీద కొలువుదీరి జ్ఞానక్రతువు నిర్వహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
వేదాలు సరస్వతీమాత నుంచే వెలువడ్డాయని ‘గాయత్రీ హృదయం’ గ్రంథం అభివర్ణించింది. అందుకే ఆమె జ్ఞానానందశక్తిగా, వేదజ్ఞాన మాతృకగా వెలుగొందుతోంది.
సరస్వతీ నది అంతర్ముఖీనమై గంగ, యమునలతో కలిసి ‘త్రివేణి’గా విరాజిల్లింది. దేశవిదేశాల్లో గీర్వాణి ఆరాధనలు అందుకుంటున్నది.

సరస్వతీదేవి వద్ద ఆయుధాలు ఉండవు. గ్రీకులు, రోమనులు ఆమెను జ్ఞానదేవతగా పూజిస్తారు.
చండీ శప్తశతి, బ్రహ్మపురాణం, సరస్వతీ రహస్యోపనిషత్తు, శారదా తిలకం వంటి పలు గ్రంథాలు ఆ తేనె పలుకుల తల్లి వ్రత, ఉద్యాపన విధానాలను గురించి వివరిస్తున్నాయి.
మార్కండేయ, స్కంద, మత్స్య పురాణాల్లోనూ, ధర్మసింధు వంటి లాక్షణిక శిల్ప శాస్త్రాల్లోనూ వాణీ వైభవం వర్ణితమైంది.
సరస్వతి ఆలయాలు బాసర, వర్గల్‍లో ఉన్నాయి. ఈ రెండూ తెలంగాణ రాష్ట్రంలోనివే. ఇక, దేశంలోని రాజస్తాన్‍, శ్రీనగర్‍, శృంగేరి తదితర ప్రాంతాల్లోనూ ప్రసిద్ధ సరస్వతీ ఆలయాలున్నాయి.
సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్య రూపిణి అని లలితా సహస్ర నామస్తోత్రం వర్ణించింది.
ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానానికి ప్రతీక సరస్వతి.
జలం జీవశక్తికి సంకేతం.
ప్రకృతిలో ఉత్పాదక, సాఫల్య శక్తులను ప్రసాదించే దైవం సరస్వతి.
‘సర’ అంటే కాంతి/తేజస్సు అని ముందే చెప్పుకున్నాం. మానవులు ఆ జ్ఞాన తేజస్సుతో, కాంతి యశస్సుతో తమ జీవితాలను సర్వశక్తిమయం చేసుకోవడం సరస్వతీ అనుగ్రహంతోనే సంభవిస్తుంది.
కరణం కరవాణి శర్మదంతే
చరణం వాణి చరాచరోపజీవ్యన్‍
ఇది మల్లినాథసూరి రచించిన శ్లోకం.

‘జగత్తంతా సరస్వతీ మాతను ఆశ్రయించి జీవిస్తోంది. ఆ తల్లి పాదాలను నమ్ముకుని నేను జీవిస్తున్నాను’ అని పై శ్లోకానికి అర్థం.
సరస్వతీదేవి రూపగుణాలను అనేక రీతులుగా రుషులు దర్శించారు.

ఆమె హృదయస్థానంలో వేదాలు, బుద్ధి స్థానంలో ధర్మశాస్త్రాలు, శ్వాసలో పురాణాలు, తిలకంలో కావాల్యలు, జిహ్వలో వాజ్మయం, నేత్రాల స్థానంలో ఆధ్మాత్యిక, లౌకిక విద్యలు, ఉదరంలో సంగీత, నాట్యకళలు వికసిస్తూ ఉంటాయని ప్రస్తుతించారు.
మన కంటికి కనిపించే సుందరమైన జగత్తు అంతా సరస్వతీ స్వరూపమేనని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది.

వసంత పంచమి నాడే త్రిమూర్తులు జ్ఞాన సంబంధమైన దివ్యత్వాన్ని సరస్వతికి ఆపాదించారని పద్మపురాణం తెలియచేస్తోంది.

సరస్వతీ రూపం ఆధ్యాత్మికతకు, తాత్త్త్వికతకు ప్రతిరూపం.ఆమె హంసవాహిని.

పాలను, నీళ్లను వేరుచేసి, కేవలం పాలను మాత్రమే స్వీకరించే నైజం హంసది.

అదేవిధంగా మంచి చెడులను, యుక్తాయుక్తాలను, ధర్మాధర్మాలను వేరు చేసి సముచిత విషయాలను మాత్రమే గ్రహించి ఆచరణలో పెట్టాలనే తత్త్వానికి ఆమె హంస వాహనం ప్రతీక.

వసంత పంచమి నాడు నూతన
విద్యాభ్యాసం, వేద, ఉపాకర్మలు
విశేషంగా జరుగుతుంటాయి.

సరస్వతిదేవి వర్ణనలో ఎక్కువగా తెలువు
(శ్వేత) వర్ణమే ప్రాముఖ్యం వహిస్తుంటుంది.
రుగ్వేదంలో సరస్వతీదేవి ప్రస్తావన
ఉండటాన్ని బట్టి ఆమెను ప్రాచీన దైవతంగా భావిస్తారు.

అంతా ఆ దేవి చలవే..
వాగ్దేవి ఉపాసన వల్లనే వాల్మీకి రామాయణ రచన చేశాడని అంటారు.

శారద దీక్ష స్వీకరించిన తరువాతే వ్యాసుడు వేద విభజన చేయగలిగాడంటారు.

ఆదిశేషువు, బృహస్పతి, ఆదిశంకరులు, యాజ్ఞవల్క్యుడు వంటి ఎందరో మహానుభావులు శారదానుగ్రహం కారణంగా జ్ఞాన సంపన్నులయ్యారు.

వ్యాసుడు గోదావరి తీరాన సైకత రూపంలో వాణికి ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ క్షేత్రమే వ్యాసపురిగా, బాసరగా ప్రసిద్ధి చెందింది. పరాశక్తిని శారద రూపంలో దర్శించాడు బ్రహ్మ. ఆమెనే ఆరాధించి, కృప పొంది, సృష్టి చేసే శక్తిని సాధించగలిగాడు.
ఆదిశేషుడికి మహా పండితుడిగా పేరుంది. అందుకే భూదేవి అతడిని జ్ఞాన రహస్యాలు బోధించాలని కోరింది. ఆయన శారదను ఆరాధించి, శాస్త్రజ్ఞాన రహస్యాలు గ్రహించి, భూమాతకు ప్రబోధించాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సరస్వతి దయవల్లనే ఆదిశంకరాచార్యులు అపారమైన తత్వజ్ఞానాన్ని సముపార్జించారు.

హంసవాహిని..శ్వేత వస్త్రధారిణి
సరస్వతీదేవి హంసవాహిని. శ్వేత వస్త్రాలను ధరించి హంస వాహనంతో తెల్లటి తామర పుష్పంపై చదువుల తల్లి కొలువుదీరి ఉంటుంది.

నాలుగు చేతులతో నాలుగు దిక్కుల్లో ఉండటం సర్వవ్యాపకత్వానికి సంకేతం.

ఎడమచేతిలోని పుస్తకం సమస్త విద్యలకు చిహ్నం. కుడిచేతిలో అక్షరమాల జ్ఞాన సూచిక.

హస్తభూషణమైన వీణ.. ఆమె సకల కళల అధిదేవత అని చాటుతుంది.

సరస్వతీదేవి ఒక చేతి మీద చిలుక ఉంటుంది. అది మధురమైన పలుకులకు ప్రతీక.

సరస్వతి చేతిలోని పద్మం సంపదలకు సంకేతం.

పాశాంకుశాలు మనిషిలోని మనోకాలుష్యాన్ని హరింపచేసే ఆయుధాలకు సంకేతాలు.

పాలనీ, నీటినీ వేరు చేసే హంస మంచిచెడుల విచక్షణాజ్ఞానంతో మెలగాలని తెలియచేస్తుంది.

ఇన్ని శుభ లక్షణాల చదువుల తల్లి కాబట్టే ఆమెను కవులు, ‘అక్షరధామ శుక వారిజ పుస్తక రమ్యపాణి’ అని స్తుతించారు.

వీణాపాణి.. విమల సరస్వతి
సరస్వతీదేవి రూపం ఆధ్యాత్మికతకు, తాత్త్వికతకు ప్రతిరూపం.
ఆమెను వీణాపాణిగానూ కొలుస్తారు.

ఆమె రెండు చేతులతో వీణ పట్టుకుని దర్శనమిస్తుంది.
ఆ వీణకు ముప్పై రెండు మెట్లు ఉంటాయి.
దాని పేరు కచ్చపి.

యోగశాస్త్రం ప్రకారం.. మనిషి వెన్నెముకకు ముప్పై రెండు పూసలు ఉంటాయి.
వీణాదండాన్ని సుషుమ్న నాడితో పోలుస్తారు.

మూలాధారం నుంచి సహస్రారం వరకూ సంచరించే ఈ నాడే మన ప్రాణం.
తల్లి చేతిలో వీణరాగాల వలే మన జీవనశైలి కూడా ఉంటుంది.
వీణ పలకడం మానివేస్తే సృష్టి స్తంభిస్తుంది.
కాబట్టి ఆ తల్లి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలి.
సరస్వతి ఆదిపరాశక్తి అంశారూపం.
మూలా నక్షత్రం ఆమె జన్మ నక్షత్రం.
అందుకే శారదా నవరాత్రుల్లో ఆ నక్షత్రం నాడు సరస్వతికి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఒకప్పుడు సృష్టి చేయడంలో బ్రహ్మ అశక్తుడై ఆదిశక్తిని ప్రార్థించగా సరస్వతిని తన అంశగా సృష్టించి అందించిందనీ, నాటి నుంచి సృష్టి నిర్విఘ్నంగా కొనసాగుతోందని పురాణ కథనం.
బ్రహ్మకు సృష్టి రచనను సలిపే శక్తిని అందిస్తున్నది సరస్వతిమాతే.
బ్రహ్మ నాలుగు ముఖాలూ నాలుగు వేదాలను వల్లిస్తూ ఉంటాయని, సరస్వతి చతుర్భుజాలలో ఉన్న పుస్తకం, జపమాల, పద్మం, శుకం (చిలుక) నాలుగు పురుషార్థాలకు సంకేతమనీ పండితులు చెబుతారు.

Review పలుకు తేనెల తల్లి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top