భలే మంచి రోజు..

అన్ని రోజులూ మంచివే. రోజులు, సంవత్సరాలు మంచివి, చెడ్డవి అనే వ్యత్యాసంతో ఉండవు. ‘వచ్చే సంవత్సరం కలిసొస్తుంది..’, ‘రేపు మంచి జరుగుతుంది…’ ఇటువంటి భావనలన్నీ ఆశతో బతకడానికి పనికొస్తాయి కానీ, ఆశయంతో జీవించాలంటే మాత్రం ఆశకు తోడు విశ్వాసం కావాలి. మనం జీవించే ప్రతి క్షణం మంచిది కావాలంటే, మంచిగా మలుచుకోవాలంటే.. ముందు మన మనసు శుద్ధి కావాలి. మన మనసులోని భావాలు, భావనలు మంచివై ఉండాలి. అప్పుడు అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు మంచివే అవుతాయి. అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు మంచివే అయినా చైత్ర మాసంలో వచ్చే రెండు రోజులు మాత్రం చాలా విశేషమైనవి. అవి- ఉగాది, శ్రీరామనవమి.

బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినది, ధర్మవాక్య పరిపాలకుడు శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు అయినది, వెయ్యేళ్ల పాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినది, శకకారుడైన శాలివాహనుడు కిరీటధారణ చేసిందీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్టించినదీ ఉగాది నాడేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి కొత్త పనులు చేపట్టడానికి, కొత్త ప్రణాళికలు రచించి కార్యాచరణలోకి దిగడానికి ఇది మంచి సమయం. కాబట్టి ఈ రోజు నుంచే వికారి నామ సంవత్సరంలో విజయాలను కాంక్షిస్తూ కొత్త లక్ష్యా లను నిర్దేశించుకుందాం.

ఉగాది కొత్త సంవత్సరాదిగానే కాదు.. ప్రకృతి పండుగగా కూడా ప్రసిద్ధం. సాధారణంగా చైత్రం ముగిసి వసంతం వాకిలిలోకి ప్రకృతి కాంత అడుగిడే కాలమిది. పూలు వికసించేది. కొత్త చిగుర్లు తొడిగేది, మామిడిపండు విరివిగా లభించేది, శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మల్లెలు విరబూసేది, ఆమని కూహూ రాగాలు తీసేది ఈ వసంత రుతువులోనే. ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక యుగంలోనూ వసంత రుతువు గురించి వర్ణన చేయని కవులు, రచయితలు లేరంటే అతిశయోక్తి కాదు.
ప్రకృతితో ఎలా మమేకమై జీవించాలో తెలియచెప్పే పర్వ దినం ఉగాది. మనిషికి- ప్రకృతికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ఇది చాటుతుంది. అందుకే ఉగాదికి ప్రకృతిలో లభించే ఆరు ప్రధాన రుచులను విధిగా ప్రతి ఒక్కరు రుచి చూస్తారు. అసలు ఈ ఆరు రుచులే ఉగాదికి సంకేతం కూడా! ఈ ఆరు రుచుల సమ్మేళనంలో అద్భుతమైన అర్థముంది. అర్థం చేసుకుని ఆచరిస్తే అనంతమైన పరమార్థం ఉంది. తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు రుచులతో తయారయ్యే ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం. ఇందులో మరో పరమార్థం కూడా ఉంది. జీవితంలో అన్నీ సుఖాలే ఉండవు. అలాగని అన్నీ దు:ఖాలే కలగవు. సుఖదు:ఖాలు, కష్టనష్టాలు, కలిమిలేముల కలబోత జీవితం. అందమైన అనుభవాలూ ఉంటాయి. విషాదకరమైన జ్ఞాపకాలూ ఉంటాయి. జీవితంలో అన్నీ అలా సమపాళ్లలో కుదిరినపుడే జీవితానికి అర్థం, పరమార్థం. ఈ సత్యాన్ని బోధిస్తుంది ఉగాది పచ్చడి.

ఇక, శ్రీరామ నవమి రాముడిని ఆరాధించడానికి ఉద్ధిష్టమైన రోజు. మనిషిగా ఎలా బతకాలో ఆయన ఈ భూమిపై నడయాడి చూపించాడు. ఆయన లక్షణాలను పుణికిపుచ్చుకోవడమే మనిషిగా మన కర్తవ్యం.

(ఏప్రిల్‍ 6: ఉగాది, ఏప్రిల్‍ 14: శ్రీరామ నవమి)
-కుమార్‍ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

Review భలే మంచి రోజు...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top