‘ఆది’పర్వం… ఉగాది ఆనందోత్సవం

అచ్చమైన తెనుగు పర్వం- ఉగాది. ఉగాది నుంచే కొత్త సంవత్సరం మొదలవుతుంది. మన తెలుగు సంవత్సరాల్లో ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఈ సంవత్సరానికి వికారి నామ సంవత్సరం అని పేరు (ఏప్రిల్‍ 6, 2019). ఇది మన తెలుగు వారి మొదటి పండుగ. ఈ రోజు ప్రతి ఒక్కరు తమ రాశి ఫలాలు, గ్రహ స్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తదనుగుణంగా సంవత్సరమంతా మసులుకుంటారు. ఈ పర్వం నేపథ్యం, విశేషాల్లోకి వెళ్తే..

ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి తిథి ఉగాది పర్వం. ఈ రోజే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని అంటారు. మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుడనే రాక్షసుడిని సంహరించి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఉగాది ఆచారంలోకి వచ్చిందని పురాణ కథనం. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్ల పక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళలో సమగ్రంగా సృష్టించాడని ప్రతీతి. అంటే కాలగమనం, గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మ ఈనాడు ప్రవర్తింప చేశాడనేది పండితుల భావన. ఉగాది నాటి నుంచే వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందిగా ఈ పండుగ ప్రాచుర్యంలోకి వచ్చిందని అంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ఆచరణలోకి వచ్చిందనేది మరో కథనం.
‘ఉగాది’, ‘యుగాది’ అనే రెండు పదాలు ఈ పర్వానికి పర్యాయ పదాలుగా వాడుకలో ఉన్నాయి. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ‘ఆది’ అని అర్థం. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగము అంటే ద్వయము లేక జంట అని కూడా అర్థముంది. ఉత్తరాయణ, దక్షిణాయనాలనే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) అయ్యింది. అయితే, ఆ యుగానికి ఆది (సంవత్స రాది) యుగాది లేక ఉగాది అయ్యింది.
తెలుగు వారు ఉగాదిగానూ, మరా ఠీలు గుడి పడ్వాగానూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోనూ, సిక్కులు బైశాఖీగానూ, బెంగాలీలు పొయ్‍లా బైశాఖ్‍ గానూ జరుపుకుంటారు.
ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల (ఆరు రుచులు) సమ్మేళనంగా తయారు చేసే ఈ పచ్చడి జీవితంలో చోటుచేసుకునే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవాలను కలిగినదైతేనే అర్థవంతం అవుతుంది అనే భావం ఈ పచ్చడిలో మిళితమై ఉంది. పచ్చడిలో కలిసే ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.
బెల్లం- తీపి: ఆనందానికి సంకేతం
ఉప్పు: జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేపపువ్వు- చేదు: బాధ కలిగించే అనుభవాలు
చింతపండు- పులుపు: నేర్పుగా వ్యవహరించా ల్సిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు- వగరు: కొత్త సవాళ్లు
కారం: సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు

కాల పురుషుని ఉత్సవం..

ఉగాది కాల పురుషునికి సంబం ధించిన ఉత్సవం. కాలం అవ్యవహిత మైనది. వ్యక్తి జీవన అవసరాలకు వీలుగా దానిని వ్యవహితం చేసుకునే పక్రియలో అనేక విధాలుగా దానిని విభజించుకుంటూ ఉన్నాడు. కాలాన్ని గమనించే విధానంలోనే వ్యక్తి విజ్ఞానం ప్రారంభమైంది. మనసే అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగు వారు చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించారు. జ్యోతిషం ప్రకారం చంద్రుడు మన: కారకుడు. అంటే మనసుపై ప్రభావం చూపుతాడు. చాంద్రమానంలో పూర్ణిమ నాడు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆయా మాసాల పేర్లు పెట్టారు. చిత్త పూర్ణిమ నాడు వస్తే చైత్రం. విశాఖ పౌర్ణిమ నాడు వస్తే వైశాఖం. ఇలా రాని సమయంలో అధిక మాసం లేదా క్షయ మాసాలు వస్తుంటాయి. వైదిక మంత్రాలలోనే ఈ మాసాల ప్రశస్తి మనకు కనిపిస్తుందంటే కాలానికి పూర్వమే సౌర, చాంద్ర మానాల వినియోగం మనవారు చేసే వారని మనకు స్పష్టమవుతుంది.

చాంద్రమానంలో అరవై వత్సరాలు

గ్రహాలలో శని ఒకసారి సూర్యుని చుట్టూ తిరగి రావడానికి ముప్పై సంవత్సరాలు, గురుడు తిరిగి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది. ఈ రెండింటి కనిష్ట సామాన్య గుణిజం అరవై కావడం వల్ల చాంద్రమానంలోని సంవత్సరాలు కూడా అరవై (60)గా ఉన్నాయి. ఈ అరవై సంవత్సరాలను మనం సంవత్సర, పరివత్సర, ఇడావత్సర, ఇద్వత్సర, అనువత్సరాలనే భాగాలుగా చేస్తే అది పంచవర్షాత్మక యుగంగా చూసుకుంటే అరవై సంవత్సరాలు మళ్లీ పన్నెండు విభాగాలుగా కనిపిస్తాయి.

సంవత్సరారంభ దినం..

యుగం అంటే జంట. శరీరంలో కాళ్లు, చేతులు మొదలైన కర్మేంద్రియాలు, చెవులు, కళ్లు మొదలైన జ్ఞానేంద్రియాల జంటలు పని చేసినపుడే మనిషి స్పష్టమైన సమాచారం సేకరించగలుగుతాడు. కాలంలోనూ ఆయనాలు, రాత్రింబవళ్లు వంటివి కూడా జంటగానే కనిపిస్తాయి. అదే విధంగా అధిక మాసాలలో జంట ఏర్పడే ఐదు సంవత్సరాల కాలానికి పంచ వర్షాత్మక యుగమని పేరు. ఉగాది అనేది యుగాది. ఇది కాల ప్రమాణంలో సంవత్సర కాలానికి ప్రారంభమైన అంశం. ఈ ప్రారంభాన్ని తెలుగు వారంతా చక్కని పండుగగా ఆచరిస్తారు. ఆ రోజున అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వసంత ఆగమనోత్సవ వేడుకలను నిర్వహించే ఈ ఉత్తమమైన రోజున ఎన్నో శుభ సూచకాలు కావాలని కోరుకుంటారు. అనేక ధర్మశాస్త్ర గ్రంథాలు, వ్రత గ్రంథాలు ఉగాది నాడు వైజ్ఞానికంగా చేయాల్సిన పనుల గురించి నిర్దేశించాయి.

ఉగాది నాటి విధాయ కృత్యాలు
1. ప్రతిగృహ ధ్వజారోహణం
2. తైలాభ్యంగనం
3. నవ వస్త్రధారణ
4. దమనేన బ్రహ్మ పూజనం
5. సర్వాపచ్ఛాంతకర మహాశాంతి, పౌరుష ప్రతిపత్‍ వ్రతం
6. నింబకుసుమ భక్షణం (వేపపూవు)
7. పంచాంగ శ్రవణం
8. ప్రసాదాన ప్రారంభం
9. రాజ దర్శనం
10. వసంత నవరాత్రి ప్రారంభం
ఇలా అనేక అంశాలు ఉగాది నాడు చేయవలసి నవి ఉన్నాయి. తెలుగు వారు ప్రత్యేకంగా జరుపుకునే ఈ ఉగాది నాడు తప్పనిసరిగా నిర్వహించే కార్య క్రమాలలో ఉగాది పచ్చడి తయారీ, సేవనం, పంచాంగ శ్రవణం ముఖ్యమైనవి.

నింబ కుసుమ భక్షణం

వేపపూవును నింబకుసుమం అంటారు. ఉగాది రుతు సంబంధమైన పర్వం కావడం వల్ల తప్పనిసరిగా వేపపువ్వు పచ్చడి తినాలని చెప్పడం జరిగింది. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ రోజున తెల్లవారి మామిడి పువ్వును తినాలని, ఉగాది నాడు వేపపువ్వు తినాలని చెప్పడం వల్ల ఆ రోజున ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేసి తినడం ఆనవాయితీ. ఉగాది నాడు ఆ సంవత్సరపు వేపపువ్వు, చక్కెర (బెల్లం) చింతపండు, నెయ్యి కలిపి మొదటి జాములోనే తింటే ఆ సంవత్సరమంతా మంచి జరుగుతుందనే నమ్మకం మన తెలుగు వారిది.

పంచాంగ శ్రవణం..

పంచాంగ శ్రవణం: తిథి, వార నక్షత్రాదు లతో కూడుకున్న పంచాంగాన్ని ఉగాది నాడు వినడం వల్ల ఆ సంవత్సరాన్ని ప్రణాళికాబద్ధంగా గడపడానికి వీలవుతుంది. అందుకే పంచాంగ శ్రవణం తప్పనిసరి పక్రియగా నిర్దేశించారు. సంవత్సరారంభంలో సంవత్సర విశేషాలను అధ్యయనం చేస్తే ఆ ఏడాది తీసుకునే నిర్ణయాలకు వీలు కలుగుతుందని అంటారు. పంచాంగం గురించి తెలుసుకోవడం అంటే సంవత్సర సంబంధమైన అంశాల్లో ముందు జాగ్రత్త కోసం ప్రయత్నం చేస్తున్నట్టే. వర్షాలు పడే విధానం, భూములు పండే విధానం, ఏ ధాన్యాల విలువలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం, ఇబ్బందులు, పశుసంపద.. ఒకటేమిటి ప్రతి అంశానికి సంబంధించిన విశేషాలను సంవత్సర ప్రారంభం రోజున తెలుసుకోవడం ద్వారా ఆ సంవత్సరంలో ఎలా మెలగాలో నిర్ణయించు కోవచ్చు. ఇది అన్ని వర్గాల వారికి ఒక ఇయర్‍ ప్లాన్‍ వంటిది. పంచాంగం అంటే- తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. భూమి నుంచి ఆకాశంలోని సూర్య, చంద్రాదుల దూరాలను గణించి వాటికి సంబంధించిన వివరాలను అందించే ఒక విజ్ఞాన సర్వస్వం. ఒక విధంగా ఆకాశాన్ని అరచేతుల్లో చూపిస్తుంది పంచాంగం. దీని ఆధారంగా మన నిత్య కార్యకలాపాలన్నీ నెరవేర్చు కోవచ్చు. తిథి శ్రేయస్సును, వారం ఆయుష్షును, నక్షత్రం పాప నివారణను, యోగం రోగ నివారణను, కరణం కార్యసిద్ధిని కలిగిస్తాయి.

ఉగాది విశిష్టత ఇదీ..

ప్రళయం తరువాత తిరిగి బ్రహ్మ సృష్టిని ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే యుగాదిని యుగానికి (సంవత్సరానికి) ఆదిగా, ప్రారంభ సమయంగా పరిగణిస్తారు. ఈ పర్వదినం చైత్ర మాసంలో ఆరంభం కావడం వల్ల దీనిని తెలుగు సంవత్సరానికి ఆరంభ దినంగా వ్యవహరిస్తారు. ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల వచ్చే తొలి పండుగను తెలుగు వారంతా ఘనంగా జరుపుకుంటారు. అన్ని కర్మలకూ మనసు మూలమని గ్రహించిన తెలుగు వారు దానికి అధిపతి అయిన చాంద్రమానాన్ని ప్రామాణికంగా స్వీకరించి ఉగాదిని నిర్వహించు కోవడం ఆనవాయితీ.
ఉగాది పర్వం కాలగణన సంబంధమైనది. కాలాన్ని లెక్కించడానికి పంచాంగం వీలు కల్పిస్తుంది. లక్ష్మీ కటాక్షానికి, విజయ సాధనకు నిత్యం మనిషి చైతన్యంతో ఉండాలి. జీవులకు ఈ చైతన్యాన్ని ఉగాది శోభ అందిస్తుంది. ఉగాది వేళ ఘడియలు, గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, రుతువులు, ప్రాణులు కాల స్వరూపమైన ఏడాదిలో నివసిస్తుంటాయి.
అందుచేత ఉగాది పర్వదినాన అందరూ ప్రాత కాలంలో లేచి అభ్యంగన స్నానం ఆచరించి, కొత్త బట్టలు ధరిస్తారు. మంగళ ప్రదమైన మామి డాకులు తోరణాలు కట్టి రంగవల్లికలు వాకిట తీర్చిదిద్ది వసంతలక్ష్మికి స్వాగతం పలుకుతారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని పంచాం గానికి, కాల దేవతకు నివేదన చేసి, తమ భావి జీవితాలు మృదు మధురంగా సాగిపోవాలని కోరుకుంటారు.
ఉగాది పచ్చడిని వైద్యపరంగా పరిశీలిస్తే ఇది వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది. దీని షడ్రుచులలోని తీపి- చేదులు మానవ మనుగడలకు ప్రతీకలై నిలుస్తాయి. తెలుగు వారి సంప్రదాయాల్లో మరో ముఖ్యమైనది పంచాంగ శ్రవణం. దీని ద్వారా కొత్త సంవత్సరంలోని శుభాశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణం చేస్తారు.

చైత్రంలోనే ఉగాది ఎందుకు?

బ్రహ్మ కల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. మొదటి రుతువు వసంతం. నెల చైత్రం. తిథి పాడ్యమి. వారం ఆదివారం. అంటే ఆ సమ యంలో సృష్టి ప్రారంభమైందని, లేదా ప్రభవించినదని అర్థం. అందుకే తెలుగు సంవత్సరాలలో మొదటిది ప్రభవ నామ సంవత్సరం. చివరిది క్షయ నామ సంవత్సరం. క్షయ అంటే నాశనమయ్యేది. ఈ బ్రహ్మ కల్పం అంతమయ్యే ఏడాది క్షయ నామ సంవత్సరం అన్న మాట. కాబట్టి చైత్ర మాసం శుక్ల పక్షంలో సూర్యోదయ కాలంలో పాడ్యమి తిథి ఉన్న రోజునే ఉగాదిగా నిర్ణయిస్తారు.

మనకో లెక్క.. బ్రహ్మకో లెక్క..

ఉగస్య ఆది: ఉగాది: అంటారు. ఉగ అంటే నక్షత్ర గమనం. అంటే నక్షత్ర గమనం ఆరంభమయ్యే ఉగాది అని అర్థం. మానవుల లెక్క ప్రకారం 432,00,00,000 సంవత్సరాలు బ్రహ్మకు ఒక పగలు. రాత్రి కూడా అంతే. అంటే, 864,00,00,000 సంవత్సరాలు బ్రహ్మకు ఒక రోజన్న మాట. ఇలాంటివి 360 రోజులైతే ఆయనకు ఒక ఏడాది పూర్తయినట్టు లెక్క. అంటే బ్రహ్మ వందేళ్ల ఆయుష్షు మూడు లక్షల పదకొండు వేల నలభై కోట్ల సంవత్స రాలు.
సృష్టికార్యంలో ఆరుగురు బ్రహ్మలు..
ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టి కార్యా లను ముగించారు. ప్రస్తుతం ఏడో బ్రహ్మ ద్వితీయ యుద్ధంలో ఉన్నాడు. అంటే ఆయన వయసు యాభై ఒక్క సంవత్సరాలు. ఈ కలియుగం ప్రమాది నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమైంది. ఈ కల్పం ప్రారంభమై 197,29,49,114 సంవత్స రాలు పూర్తయ్యింది. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో ఉన్నాం. ఇది ప్రారంభమై ఇప్పటికి 5,114 సంవత్సరాలకు పైగా అయ్యింది.
తెలుగు సంవత్సరాలు 60
ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. ఈ యుగంలో తెలుగు సంవత్సరాలకు ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయి. ఆయా పేర్లను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించి చెప్పవచ్చు. తెలుగు సంవత్సరాలు అరవై (60). ప్రభవతో మొదలైన అక్షయతో ముగిస్తే ఒక ఆవృతం పూర్తియినట్టు. మళ్లీ తిరిగి ప్రభవతో సంవతరాలు ఆరంభమవుతాయి. ఈ పేర్ల వెనుక భిన్న వాదనలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం శ్రీకృష్ణుడి 16,100 మంది భార్యల్లో సందీపని అనే రాజకుమారికి అరవై మంది సంతానం. వారి నామాలనే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అంటారు. నారదుడి పిల్లల పేర్లు సంవత్సరాలకు పెట్టారనే మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దక్షుడు కుమార్తెల పేర్లు కూడా ఇవేనని అంటారు.

ఉగాది.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా..

ఉగాదిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఆచరిస్తారు. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఆచార, వ్యవహారా లకు తగినట్టుగా స్థానిక తేదీలను అనుసరిస్తూ ఈ పర్వాన్ని నిర్వహించు కుంటారు. తెలుగు సంవత్సరాల ప్రకారం మనం చేసుకునే పండగ ఉగాది అయితే, మరాఠీలు వారి సంప్రదాయం ప్రకారం గుడి పడ్వాగా జరుపుకుంటారు. మనలాగే ఆ రోజున ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు. కాక పోతే దానికి అదనంగా వామునే చేర్చి ఆరగిస్తారు. బ్రహ్మదేవుడు ఆ రోజున సృష్టిని ఆరంభించినందుకు గుర్తుగా బ్రహ్మధ్వజం నిలబెట్టి పూజిస్తారు.

తమిళుల పుత్తాండు..

తమిళులు ఉగాదిని పుత్తాండు పేరుతో జరుపుకుంటారు. ఒకప్పుడు తమిళుల ఉగాది కూడా తెలుగు వారి మాదిరిగానే ఏప్రిల్‍లోనే వచ్చేది. డీఎంకే ప్రభుత్వం దాన్ని ఆర్యుల పండుగగా భావించి సంక్రాంతి సమయంలోనే ఉగాది వేడుకలు జరుపుకోవాలని అసెంబ్లీలో చట్టం చేసింది. ఏప్రిల్‍లో వచ్చే ఉగాది రోజును తమిళులు చిత్తిరై తిరునాళ్‍ పేరుతో జరుపుకోవాలని ప్రకటించింది.

సిక్కుల బైశాఖి
సిక్కులు బైశాఖి పేరుతో ఉగాది పర్వాన్ని నిర్వహించుకుంటారు. సిక్కులకు కొత్త సంవత్సరం వైశాఖ శుద్ధ పాడ్యమి రోజు వస్తుంది. తెలుగు వారికి సంక్రాంతి లాగా సిక్కులకు ఇది పంటల పండుగ. రబీ పంట నూర్పిడి సమయమిది. సిరులు పొంగే ఆ సమయంలో సిక్కుల మనసులు ఆనందంతో నిండిపోతాయి. ఆ ఉత్సాహంలో ఆడా మగా అనే తేడా లేకుండా భాంగ్రా, గిద్దా నృత్యాలు చేస్తారు.

బెంగాలీల పొయ్‍లా..

పశ్చిమబెంగాల్‍ వాసులు ఉగాదిని వైశాఖ మాసంలో జరుపుకుంటారు. దీనికి వారు పెట్టుకున్న పేరు పొయ్‍లా బైశాఖ్‍. వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు ఉగాది వేడుకలను నిర్వహించుకుంటారు. ప్రభాత్‍ ఫేరీ పేరుతో కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతారు.

మలయాళీల విషు..

మలయాళీలు కొత్త సంవత్సరాదిని విషు పేరుతో నిర్వహించుకుంటారు. సౌరమానం ప్రకారం దీనిని వారు ఆచరిస్తారు. కాబట్టి వీరి ఉగాది ఏప్రిల్‍ మాసం మధ్యలో వస్తుంది. ధాన్యాలన్నింటినీ ఓ పాత్రలో ఉంచి పూజలు చేస్తారు. దాన్ని విషుకని అంటారు. ఉదయం లేవగానే మంగళకరమైన ఆ విషుకనిని దర్శిస్తే శుభం కలుగుతుందని మలయాళీల నమ్మకం.

Review ‘ఆది’పర్వం… ఉగాది ఆనందోత్సవం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top