విశ్వ విన్యాసంలో మానవాతీత శక్తి ఉందని గ్రంథాలు చెబుతున్నాయి.
అంతవరకు ఎందుకు? మనిషి అంత:శ్శరీర నిర్మాణమే ఒక అద్భుతం.
జ్ఞాన, కర్మేంద్రియాలు అవిశ్రాంతంగా, పకడ్బందీగా పనిచేయడమే మానవ మేధస్సుకు అందని విడ్డూరం. అది చర్మచక్షువుకు గోచరించదు. మనోనేత్రంతోనే ఆ విన్యాసాన్ని వీక్షించాలి. ఆ శక్తి, సామర్థ్యాలను సాధించడానికి ఎంతో ఆధ్యాత్మిక సాధన చేయాలి. నిత్యశోధన చేయాలి. కఠోర మానసిక పరిశ్రమ కావాలి. సమర్థతకు సంయమనం జతకలవాలి. ఈ పనిని జీవితంలో తీరిక దొరికనపుడు ఎప్పుడో ఆరంభిద్దామంటే.. ఆ జాప్యమే కాలసర్పమై కాటు వేస్తుంది.
ఈ జీవయాత్రలో ప్రతి క్షణమూ విలువైనదే. అమూల్యమైనదే. ఏదేదో చేయాలని ఉంటుంది. ఏమీ చేయలేని నిస్సహాయత ఆవహించి నిర్వీర్యం చేస్తుంది. ఈ నిర్లిప్తతను, స్తబ్ధతను వీడి కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వారు సాధకులవుతారు. విజేతగా నిలుస్తారు.
కాలం విలువ తెలుసుకున్న వారే కార్యసాధకుడు అవుతాడు.
మనం ఎంచుకున్న లక్ష్యం చేరుకోవడానికి సన్మార్గంలోనే పయనించాలి.
అత్యాశకు పోయి అడ్డదారులు తొక్కితే అవి బెడిసికొట్టి మొత్తం జీవితమే నాశనం అవుతుంది.
ఆశల సౌధం పేకమేడలా కుప్పకూలిపోతుంది.
మనం మరణించాక కూడా ప్రజల మనసులలో మెలగాలి.
ఎందరో మహానుభావులు ఈ సూత్రాన్ని నియమబద్ధమైన ప్రణాళిక ద్వారా ఆచరించి చూపారు.
ప్రతి దశలోనూ అత్యంత జాగరూకతతో వ్యవహరించి, ఎంచుకున్న రంగాల్లో విజయాలు సాధించి చరిత్రలో మహాత్ములలా మిగిలారు.
ప్రపంచంలో ఏ గ్రంథమైనా ‘ధర్మమే జయిస్తుంది.. అధర్మం అపజయం పాలవుతుంది’ అన్న సిద్ధాంతాన్నే ప్రచారం చేశాయి.
సత్యం, ప్రేమ, ధర్మం వంటివి సన్మార్గంలో నడిచిన వారందరూ పాటించి చూపారు.
ఆ లక్షణాలు ఏ యుగంలోనైనా శాశ్వత మైలురాళ్లుగా నిలిచి భావితరాలకు దిశానిర్దేశం చేస్తాయి.
మనం సాధించే విజయాలకు మూల సూత్రాలు- మూడు.
1. దృఢమైన కోరిక
2. నైపుణ్యం.
3. విషయ పరిజ్ఞానం.
ఇవి త్రిశక్తులు. వీటిలో ఏది లోపించినా మన లక్ష్యం పూర్తికాదు.
విజయాలు కోరుకునే వారికి ప్రయత్న సాధనలో అపజయాలూ ఎదురవుతాయి. అది సహజం. అయితే, ఆ అప•యాలను నిచ్చెన మెట్లుగా చేసుకుని ముందుకు సాగే వాడే లక్ష్య సాధకుడు అవుతాడు.
– కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review మనలోని త్రిశక్తులు.