అదిగో.. అల్లదిగో యాదాద్రి క్షేత్రం

‘గుట్టకు వెళ్తే పుణ్యం వస్తుంది.. యాదాద్రి నృసింహుడిని దర్శించుకుంటే మనసు కుదుటపడుతుంది’.. ఇది తెలుగునాట నానుడి.

అవును. ఇప్పుడు గుట్టకు వెళ్తే ఆధ్యాత్మికానుభూతితో పాటు ఆహ్లాద భావనా కలుగుతుంది. అటు ఆధునిక సాంకేతికత.. ఇటు పురాతన సంప్రదాయం కలగలిసి దేశ చరిత్రలోనే సాటిలేని మేటి ఆలయంగా యాదాద్రి రూపుదిద్దుకుంది. మార్చి 28వ తేదీ 11.55 గంటలకు యాదగిరిగుట్ట దివ్యధామం మహాకుంభ సంప్రోక్షణతో భక్తుల దర్శనానికి సిద్ధమైంది.
కళ్లుతిప్పుకోనివ్వని శిల్పకళా సౌందర్యం.. ఎటుచూసినా ప్రకృతి రమణీయత.. సువిశాల ప్రాంగణాలు.. మదిలో ఆధ్యాత్మిక భావనలు కలిగించే దివ్య రాజగోపురాలు.. యాదగిరీశుని దర్శన భాగ్యమే భాగ్యం. అక్కడ అడుగుపెడితే ఆధ్యాత్మికానుభూతి..
తరచి చూస్తే ఆహ్లాదానుభూతి.. ఆరేళ్ల తరువాత స్వామి దర్శనానికి తలుపులు తెరుచుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ దివ్యక్షేత్ర పునర్నిర్మాణ వైభవానికి వెన్నెముకగా నిలిచింది. మరింకెందుకు ఆలస్యం.. ఆ దేవదేవుడి వైభవాన్ని అక్షరాలా ఆస్వాదిద్దాం. మే 15, 2022 నృసింహ జయంతి సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ క్షేత్రంపై ప్రత్యేక కథనం…

శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడిని కాపాడ్డానికి స్తంభోద్భవుడిగా అవతరిస్తే.. మరో భక్తుడి కోరిక మేరకు యాదగిరి కొండపైన స్వయంభువుగా వెలిశాడు. ఇక్కడి స్వామి ఐదు అవతారాలలో పంచ నారసింహునిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై విలసిల్లుతున్న యాదగిరి నృసింహుని స్థల పురాణం ఎంతో విశేషమైనది.
యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం పంచనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి. ఈ క్షేత్రానికి సంబంధించి అనేక పురాణాల్లో వివిధ ఐతిహ్యాలు ఉన్నాయి. రామాయణంలో పేర్కొన్న ప్రకారం.. మహాజ్ఞాని విబాంఢకుడి కుమారుడు రుష్యశృంగుడు. ఈయన భార్య శాంతాదేవి. సాక్షాత్తూ రామచంద్రుడి సోదరి. శాంతాదేవి, రుష్యశృంగుడిల కుమారుడు యాదరుషి. చిన్నప్పటి నుంచీ ఆయన విష్ణుభక్తుడు. నృసింహ ఉపాసకుడు. దశావతారాల్లో నాలుగోదైన నారసింహావతారంలో శ్రీహరిని దర్శించుకోవాలనేది యాదరుషి బలమైన కోరిక. ఒకసారి స్వామి సాక్షాత్కారం పొందడానికి దట్టమైన అడవుల్లో తిరుగుతూ కొండజాతి వారికి చిక్కాడు. వాళ్లు యాదరుషిని క్షుద్రదేవతలకు బలి ఇవ్వబోయారు. అప్పుడు హనుమంతుడు ప్రత్యక్షమై యాదరుషిని రక్షించి, కీకారణ్యంలో సింహాకార గుట్టలు ఉన్నాయని, అక్కడికి వెళ్లి సాధన చేస్తే స్వామి సాక్షాత్కరిస్తాడని చెబుతాడు. యాదరుషి దీర్ఘకాల తపస్సు ఫలించి.. నృసింహ స్వామి ప్రత్యక్షమయ్యాడు. అయితే,
ఉగ్ర నరసింహ రూపాన్ని చూడలేక యాదరుషి కళ్లు మూసుకున్నాడు. ఆ తరువాత ఆయన కోరిక మేరకు స్వామి శాంత స్వరూపంలో శ్రీలక్ష్మీ సమేత నరసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు. అనంతరం యాదరుషి స్వామిని వేర్వేరు రూపాల్లో చూడాలని ఉందని వరం కోరుకున్నాడు. దాంతో జ్వాలా, గండభేరుండ, యోగానంద, ఉగ్రనరసింహచ, శ్రీలక్ష్మీనృసింహ స్వామిగా ప్రత్యక్షమయ్యాడు శ్రీమహా విష్ణువు. తనను కటాక్షించిన గుహలోనే, సామాన్య భక్తులకూ దర్శనమివ్వాలని స్వామిని వేడుకున్నాడు యాదరుషి. విష్ణువు కాదనలేక, ఆ ఐదు రూపాల్లోనే అక్కడ వెలిశాడు. ఇదీ యాదగిరిగుట్ట నృసింహ క్షేత్రం స్థలపురాణం.
పంచనారసింహావతారాలు
యాదాద్రి ఆలయంలోని కొండ గుహలో ఉన్న రెండు శిలలపైన యోగానంద నరసింహుడు, శ్రీలక్ష్మీనృసింహుడు విగ్రహ రూపంలో కనిపిస్తుంటారు. ఈ రెండు శిలాఫలకాల మధ్య సన్నని రేఖలా సర్పాకృతిలో జ్వాలా నరసింహస్వామి దర్శనమిస్తాడు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామి ఆలయానికి తూర్పు వైపున కొండ బిలంలో గండభేరుండ నరసింహస్వామి కొలువై ఉంటాడు. ఇక, ఉగ్రనరసింహమూర్తిది అభౌతిక రూపం. కొండ చుట్టూ తేజోవలయమై ఉగ్రనృసింహుడు ఉంటాడనేది భక్తుల నమ్మకం. అందుకే యాదగిరి కొండనే ఉగ్రనారసింహస్వామి ఐదవ రూపంగా కొలుస్తారు. యాదరుషి పేరుతో యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్ర వైభవం, నారసింహ మహాత్మ్యం విని ఎందరో మహారాజులూ, చక్రవర్తులూ ఆ దేవదేవుడి పాదాలకు ప్రణమిల్లారు. క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలోనే పశ్చిమ చాళుక్య రాజు త్రిభువన మల్లుడు నారసింహస్వామిని దర్శించుకున్నాడని భువనగిరి కోటలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం కాకతీయ గణపతి దేవుడు, శ్రీకృష్ణదేవరాయలు స్వామిని ప్రసన్నం చేసుకున్నారు. భక్తులు ఒంటరిగా వెళ్లడానికి భయపడేలా ఉండే కొండ దారిని మార్చుతూ నిజాం రాజులు కొండ మీదకి బాట వేశారట.

పంచతల రాజగోపురాలు

పురం.. దేవదేవుడి దర్శనభాగ్యం కంటే ముందే ఆలయానికి అల్లం దూరం నుంచే ఆధ్యాత్మిక పరవశాన్ని కలిగిస్తుంది. యాదగిరిగుట్టలో ఈ దృశ్యం మరింత రమణీయంగా ఉంటుంది. గుహల వెలసిన స్వామికి నిర్మించిన రాజగోపురాలు అద్భుత శిల్పకళా సంపదతో ఆనందభాగ్యాన్ని కలిగిస్తాయి. మొత్తం ఈ ఆరు రాజగోపురాల్లోని అంతస్తుల మధ్యన కిటికీల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటి వల్ల గాలి ఎంత వేగంగా వీచినా గోపురాలకు ఎలాంటి నష్టం ఉండదు.
యాదగిరిగుట్ట క్షేత్రంలో ఆరు రాజగోపురాలు ఆలయంలోని రెండు ప్రాకారాల్లో కొలువుదీరాయి. దేవాలయ గోపురాల్లో మొత్తం 16 రకాలున్నాయి. యాదాద్రిలో మాత్రం మూడు రకాల గోపురాల్ని నిర్మించారు. అవి- త్రితల, పంచతల, సప్తతల రాజగోపురాలు.
గర్భగుడి వెలుపల మొదటి ప్రాకారంలో, ఈశాన్య దిక్కున, పడమర వైపున రెండు గోపురాలు ఉన్నాయి.
రెండో ప్రాకారంలో- తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర దిశల్లో నాలుగు రాజగోపురాలు కనువిందు చేస్తాయి.

ఐదంతస్తుల్లో పంచతల గోపురాలు

యాదాద్రి క్షేత్రంలోని ఆరు రాజగోపురాల్లో నాలుగు పంచతల గోపురాలు. వీటిలో మూడు రెండో ప్రాకారంలో ఉన్నాయి. మరొకటి మొదటి ప్రాకారంలో ఉంది. ఇవన్నీ 55 అడుగుల ఎత్తుతో ఐదు అంతస్తుల్లో ఉన్నాయి.
తొలి రాజగోపురం- ఆలయ రెండో ప్రాకారంలో తూర్పున ఉండే ‘ఇంద్ర గోపురం’. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఈ గోపురం నుంచే లోనికి ప్రవేశిస్తారు. దీనికి ఇరువైపులా ఐదు అడుగుల ఎత్తున రెండు ఏనుగల ప్రతిమలూ, ద్వారపాలకులుగా జయవిజయుల విగ్రహాలు ఉన్నాయి. రెండో రాజగోపురం ఉత్తర దిక్కున ఉంది. ఈ రాజగోపురం ద్వారానికి ఇరువైపులా నాలుగు అడుగుల ఎత్తున రెండు సింహాల ప్రతిమలు ప్రతిష్ఠించారు. గతంలో ఉత్తర ద్వారం లేకపోవడంతో ముక్కోటి ఏకాదశి పర్వదినాన తూర్పు ద్వారాన్నే ఉత్తర ద్వార దర్శనానికి ఉపయోగించారు. ప్రస్తుతం ముక్కోటి దర్శన భాగాన్ని ఉత్తరం నుంచే చేసుకునే వీలు కలిగింది. దేవాలయం దక్షిణ దిక్కున రెండో ప్రాకారంలో ఉండే మూడో పంచతల గోపురం పేరు- యమ రాజగోపురం. ఆలయ మొదటి ప్రాకారంలో పశ్చిమ దిక్కున ఉన్న గోపురం పేరు- ‘వరుణ గోపురం’. దీనికి ఇరువైపులా జయవిజయులు ఉంటారు.
వంద సంవత్సరాల క్రితం హైదరాబాద్‍కు చెందిన మోతీలాల్‍ పిత్తి, పన్నాలాల్‍ పిత్తి అనే దాతలు భక్తుల సౌకర్యార్థం ఆలయాన్ని పునరుద్ధరించారట. 1959లో పెద్ద జీయర్‍ స్వామి సూచనల మేరకు లక్ష్మీదేవి మందిరం, తూర్పు రాజగోపురాలను నిర్మించారు.

నేత్రపర్వం.. కృష్ణ శిలా సౌందర్యం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర నిర్మాణం ప్రస్తుతం ఆధునికత – సంప్రదాయం కలగలిసిన రూపును సంతరించుకుంది. క్షేత్ర నిర్మాణంలో కృష్ణ శిలా సౌందర్యం కట్టిపడేస్తుంది. ప్రాకారాలు, గోపురాలు, తోరణాలు, కుడ్య చిత్రాలు.. అన్నింటా నల్లరాతి సోయగాలే. ఆలయం మొత్తం కళ్లు తిప్పుకోనివ్వని అద్భుతాలే. ఎటుచూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా యాదాద్రి దివ్య క్షేత్రం కాంతులీనుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూనే సంప్రదాయాలను, ఆగమ శాస్త్ర నియమాలను అనుసరిస్తూ రూపుదిద్దుకున్న యాదాద్రి ఆలయనిర్మాణ అద్వితీయం.

సకల శైలుల సమాగమం..

యాదగిరిగుట్ట ఆలయాన్ని, దాని నిర్మాణ శైలిని దేశంలోని మరే ఆలయంతోనూ పోల్చి చూడలేం. ముఖ మండపాలూ, ఆళ్వార్ల విగ్రహాలు కాకతీయ శైలిలో కనిపిస్తాయి. ముఖ్యంగా ఆళ్వార్ల విగ్రహాలను తీర్చిదిద్దిన స్తంభాలను కాకతీయ కళా వైభవం ఉట్టిపడేలా నల్లరాయితోనే చెక్కారు. విమానం ద్రావిడ శిల్పకళా వైచిత్రతో ఉంటుంది. అష్టభుజి మండపం పల్లవ నిర్మాణరీతిని కళ్లకు కడుతుంది. ఆలయంలో యాభై ఎనిమిది యాలీ పిల్లర్ల (సింహం బొమ్మలతో కూడిన స్తంభాలు)ను ఏర్పాటు చేశారు. ప్రవేశ ద్వారానికి దక్షిణ దిశలో రాతి గోడపై వెండి పలకలతో ప్రహ్లాద చరిత్రనూ, లోపలి వైపు ప్రాకారంలో యాలీ నిర్మాణాలనూ శిల్పులు అద్భుతంగా చెక్కారు. ఏనుగులు పల్లవ శిల్పకళారీతులనూ, స్తంభాలు కాకతీయ – చాళుక్య శైలులనూ, ఉప పీఠాలు హొయసాల శిల్పరీతులనూ ప్రతిబింబిస్తాయి.
ప్రధానాలయానికి అనుబంధంగా పునర్నిర్మిస్తున్న శివాలయం సైతం కృష్ణశిలతోనే సిద్ధమవుతోంది. సాలహారాల్లోని ద్వాదశ జ్యోతిర్లింగాలూ, అష్టాదశ శక్తిపీఠాలూ, శైవ సంబంధ విగ్రహాలకు కూడా కృష్ణశిలనే వాడారు.

వెయ్యేళ్ల మన్నిక.. కృష్ణశిల ప్రత్యేకత

యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణానికి అవసరమైన కృష్ణశిల కోసం దేశవ్యాప్తంగా అన్వేషించారు. చివరకు ఆంధప్రదేశ్‍లోని ప్రకాశం జిల్లా గురిజేపల్లిలోనూ, గుంటూరు జిల్లా కమ్మవారిపాలెంలోనూ ఆలయ నిర్మాణానికి అవసరమైన, అనుకూలమైన కృష్ణశిల ఉన్నట్టు గుర్తించారు. రెండు జిల్లాల్లో ఉన్న ఈ గ్రామాల మధ్య ఉన్న ఇరవై కిలోమీటర్ల పరిధిలో కృష్ణశిల రాయి విస్తరించి ఉంది. దీన్ని వాడేముందు వివిధ పరీక్షలు చేసి నాణ్యతను శాస్త్రీయంగా మదింపు చేశారు. అత్యంత కఠినమైన శిల కావడం వల్ల దాదాపు వెయ్యేళ్ల వరకు ఆలయం చెక్కుచెదరదని అంచనా. ఈ రాయి ఏళ్లు గడిచే కొద్దీ మరింత నిగారింపును సంతరించుకుని దృఢమవుతుందట. అంతేకాకుండా వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండటం ఈ శిలకు ఉన్న ప్రత్యేకత. ఇంత విశిష్టమైనది కనుకనే ఈ రాయిని లక్ష్మీనృసింహుడి ఆలయానికి వాడారు. యాదాద్రి ఆలయ నిర్మాణంలో మొత్తం 2.5 లక్షల టన్నుల కృష్ణశిలను వినియోగించారు.

యాదగిరీశుని బ్రహ్మోత్సవం.. లోకమంతా వైభవం

యాదాద్రి దివ్యక్షేత్రంలో ఏటా ఫాల్గుణ
శుద్ధ విదియ నుంచి ద్వాదశి వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. సాక్షాత్తూ బ్రహ్మదేవుడే సృష్టికార్యాన్ని ఆరంభించే ముందు ఆ ఉగ్రనరసింహుడిని ఆరాధించి, ఈ బ్రహ్మోత్సవ సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడని అంటారు. ఈ బ్రహ్మోత్సవాల ప్రత్యేకత ఏమిటంటే..
వేల ఏళ్ల చరిత్ర ఉన్న యాదగిరిగుట్టలో పూర్వం ఉత్సవాలను భక్తులే మూడ్రోజుల పాటు నిర్వహించే వారు. అందుకే వాటిని భక్తోత్సవాలనే వారు. 110 ఏళ్ల క్రితం ఈ బ్రహ్మోత్సవ సంప్రదాయం మొదలైంది. ఇవి అప్పట్లో మార్గశిర మాసంలో ఐదు రోజుల పాటు జరిగేవట. అయితే, మార్గశిరంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ అశాస్త్రీయని భావించి, 1964 నుంచి ఫాల్గుణ మాసంలో 11 రోజుల పాటు నిర్వహించే సంప్రదాయం ఏర్పడింది. 1975 నుంచి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ఆలయంలో కొలువైన స్వామికి నిత్యపూజలు సర్వసాధారణమే అయినపుడు ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలు ఎందుకనే సందేహం వస్తుంది. దీనికి ఓ నేపథ్యం ఉంది. భగవంతుడి దృష్టిలో అందరూ ఒక్కటే. కానీ, ఆగమశాస్త్ర పద్ధతుల్లో చేపట్టిన ఆలయాల్లో అప్పట్లో మూలవిరాట్ల సందర్శనకు అట్టడుగు వర్గాల వారిని అనుమతించే వారు కాదు. కానీ, దేవుడిని భక్తులకు దూరం చేయడంపై కొందరు అభ్యంతరాలు లేవనెత్తడంతో ఏటా బ్రహ్మోత్సవాల నిర్వహణ ఆరంభమైంది. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న వారికి మూలవిరాట్టును దర్శించిన పుణ్యమే లభిస్తుందని ప్రతీతి. . అలా మొదలుపెట్టిన
ఉత్సవాల్ని ఐదు రోజులు నిర్వహించే వాటిని క్షేత్రాలనీ, 11 రోజుల పాటు నిర్వహిస్తే మహా క్షేత్రాలనీ అంటారు. యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం కావడంతో 11రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవ వేళ యాదాద్రి ముక్కోటి దేవతల విడిదిగా మారుతుందట. సకల దేవతల్నీ శాస్త్రోక్తంగా ఆహ్వానించి, వేదోక్తంగా పూజలు చేస్తారు. వేదపండితుల చతుర్వేద పారాయణలూ, అర్చకుల మంత్రోచ్ఛారణ, రుత్విక్కుల ప్రబంధ పారాయణాలతో యాదాద్రి వెలిగిపోతుంటుంది.
పూర్వం యాదగిరిగుట్ట చుట్టుపక్కల ప్రాంతాలకు గుట్ట మీద నుంచి వేదమంత్ర ఘోషలు వినిపించేవట. ఆ పద్మనాభుడి కల్యాణాన్ని కనులారా చూడ్డానికి బ్రహ్మాది దేవతలు, పార్వతి పరమేశ్వరులు దిగి వస్తారట. భక్తి పారవశ్యంతో చూస్తే- మహర్షులు చతుర్వేద పారాయణం చేస్తుంటే హనుమ, గరుడ, విష్వక్సేనాదులు మైమరిచి నాట్యాలు చేస్తున్నట్టే అనిపిస్తుంది వేదాద్రి. అందుకే బ్రహ్మోత్సవ వేళ యాదగిరి.. వేదగిరి అనే నామాన్ని సార్థకం చేసుకుంటుంది. ఆ సమయంలో క్షేత్ర మహత్యం రెట్టింపు అవుతుందనీ, భక్తసులభుడైన స్వామి కరుణా కటాక్షాన్ని కురిపిస్తాడని విశ్వసిస్తారు. పాంచరాత్ర ఆగమ పద్ధతిలో ఏటా జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో ఏ రోజు ప్రత్యేకత ఆ రోజుదే. విష్వక్సేనుడి పూజతో మొదలయ్యే ఉత్సవాలు అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగుస్తాయి. ఉత్సవ వేళ.. ఆశిత్రి రక్షకుడు అధిరోహించే ప్రతి వాహనానికీ ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాగే, నృసింహుడు ముస్తాబు చేసుకునే ఒక్కో అలంకారం వెనుకా ఒక పౌరాణిక ప్రశస్తి ఉంటుంది

నరసింహావతారం.. దుష్ట సంహారం

శ్రీమహావిష్ణువు పది అవతారా (దశావతారాలు)ల్లో నృసింహావతారం నాలుగవది. నర, మృగ రూపంలో స్తంభోద్భవుడిగా ఆవిర్భవించాడు ఉగ్రనారసింహుడు. నారసింహావతార కథ ఆధ్యాత్మిక పారవశ్యంతో పాటు ఒళ్లు జలదరింప చేస్తుంది. కూడా.
సప్తర్షుల్లో ఒకరైన కశ్యపుడికి విష్ణుమూర్తి అనుగ్రహంతో హిరణ్య కశిపుడు, హిరణ్యాక్షుడు జన్మిస్తారు. వీళ్లు పరమ క్రూరులు. పుట్టుకతోనే విష్ణు ద్వేషులు. వరాహావతారంలో విష్ణువు హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. దీంతో ఆయన వల్ల తనకు ఎప్పటికైనా ముప్పు ఉందని భావించిన హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేసి ఇంటి లోపలా బయటా, పగలూ రాత్రీ, నింగిలోనూ నేలపైనా, నిప్పులోనూ నీటిలోనూ, నరుల వల్లా మృగాల వల్లా, ఏ ఆయుధం చేతనూ మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరాన్ని పొందుతాడు. ఆపై వరగర్వంతో దేవతలపై దండెత్తుతాడు. దిక్కుతోచని దేవతలు విష్ణువును ప్రార్థిస్తారు.. అతడి పీడ విరగడ చేయాల. ‘కన్నూ మిన్నూ కానని హిరణ్యకశిపుడు కన్న కొడుక్కే ఆపద తలపెడతాడు. అప్పుడే మరణిస్తాడు’ అని విష్ణువు ముక్కోటి దేవతలకు అభయమిస్తాడు.
హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు. అతడు చిన్ననాటి నుంచే బ్రహ్మజ్ఞాని. ఓనమాలు రాకముందే ‘ఓం నమో నారాయణాయ:’ అంటూ అష్టాక్షరీ సాధన ప్రారంభిస్తాడు. ఆశ్రమంలోనూ శ్రీహరి నామ స్మరణే. గురువు చండామార్కుడు పరమ క్రూరుడు. నానా విధాలుగా హింసించినా ప్రహ్లాదుడు హరినామ స్మరణ మానలేదు. చివరకు తన వల్ల కావడం లేదని అతడిని తండ్రికే అప్పగిస్తాడు ఆ రాక్షస గురువు. కుమారుడికి ఎంతో నచ్చజెప్పాలని చూస్తాడు హిరణ్యకశిపుడు. ఎంతకీ వినకపోవడంతో సోదరి హోళికకు అప్పగించి ప్రహ్లాదుడిని మంటల్లో వేయాలని ఆదేశిస్తాడు. కానీ, హోళికే ఆ అగ్నికి ఆహుతి అయిపోతుంది. ఆగ్రహం పట్టలేని తండ్రి ‘ఎక్కడ నీ హరి..?’ అంటూ ప్రహ్లాదుడిని నిలదీస్తాడు.
‘ఇందుగలడందు లేడని సందేహము వలదు. ఎందెందు వెదికిన అందందే కలడు’ అంటాడు ప్రశాంతంగా ప్రహ్లాదుడు.
‘అయితే నీ హరి ఈ స్తంభంలో ఉన్నాడా?’ అని అడుగుతాడు హిరణ్యకశిపుడు.
‘అవును’ అంటాడు ప్రహ్లాదుడు.
అప్పుడు హిరణ్యకశిపుడు ఆగ్రహంతో గదతో స్తంభాన్ని మోదుతాడు.
అంతే.. ఆకాశం భళ్లున బద్దలైనట్టు.. భూగోళం ఫెటేలున పేలిపోయినట్టు.. సముద్రాలు ఒక్కసారిగా ఉప్పొంగినట్టు.. స్తంభాన్ని చీల్చుకుంటూ వస్తాడు మహోగ్రరూపుడైన నరసింహుడు. భీకరంగా గర్జిస్తూ ఒక్క ఉదుటన హిరణ్యకశిపుడిని తన తొడల మీద అదిమిపట్టి గోళ్లతో వక్షస్థలాన్ని చీల్చి, పేగుల్ని మెడలో వేసుకుని ఆ రాక్షసరాజును అంతమొందిస్తాడు. మనిషీ జంతువూ కాని నరమృగ రూపంలో, పగలూ రాత్రి కాని సంధ్యాకాలంలో, ఆయుధమని చెప్పలేని గోళ్లతో, ఇంటా బయటా కాక గుమ్మంలో, భూమిపైనా ఆకాశంలో కాక తన తొడ మీద హిరణ్యకశిపుని సంహరిస్తాడు శ్రీమహావిష్ణువు. ఇదే నృసింహావతార కథ.

Review అదిగో.. అల్లదిగో యాదాద్రి క్షేత్రం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top