శ (పది) విధాలైన పాపాలను హరించేది ‘దశహరా’. అదే కాల క్రమంలో దసరా అయింది. దుష్ట సంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే దసరా ఉత్సవాల్లోని పరమార్థం.
ప్రకృతిపరంగా పరిశీలిస్తే.. శరదృతువు ప్రసన్నతకు, ప్రశాంతతకు నిలయం. అప్పటి దాకా వర్షాలతో చిత్తడిగా మారిన నేలలన్నీ ఈ రుతువు ప్రారంభంలో వర్షాలు ఆగిపోవడం వల్ల ఎండిపోయి నిర్మలం అవుతాయి. జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తాయి.
శరత్కాలంలో వెన్నెల పిండారబోసినట్టు ఉంటుంది. చంద్రుడి కళలు ఉత్క•ష్ట స్థాయికి చేరతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దినదిన ప్రవర్థమానంగా పెరిగే చంద్రుని దివ్యకళలను దర్శిస్తే మనిషిలో కలిగే ఆనందోత్సాహాలు జీవితంపై ఆశాచంద్రికలను వెలిగిస్తాయి.
ప్రాకృతికంగా మనిషిపై అంత ప్రభావం చూపుతుంది కాబట్టే ఈ శరదృతువులో వచ్చే విజయదశమి అందరికీ ఆశాదీపమై వెలుగొందుతుంది. మనసుల్లో ఆత్మవిశ్వాసపు దీపాలను వెలిగిస్తుంది.
ఇక, ఆధ్యాత్మికంగా చూస్తే.. శ్రవణా నక్షత్రంతో కూడిన ఆశ్వయుజ శుక్ల దశమి నాడే ‘విజయ ముహూర్తం’. అదే దసరా. ఈ పుణ్యదినానే దేవదానవులు క్షీర సముద్రాన్ని చిలికి అమృతాన్ని పొందారు. అందుకే ఇది అమృతసాధక పుణ్యదినమైంది.
ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు గల తొమ్మిది రోజులు శక్తిపూజకు ఉద్ధిష్టమైనవి. శరన్నవరాత్ర దీక్షలో ఈ తొమ్మిది రోజులు శక్తిని పూజించిన దీక్షాధారులు విజయదశమి నాడు దీక్షను ముగిస్తారు. ఈ ముగింపునకు సూచికగా గ్రామ పొలిమేరకు వెళ్లి, విజయ సంకేతమైన పాలపిట్టను దర్శిస్తారు. జమ్మిచెట్టును పూజిస్తారు. ఆ చెట్టు ఆకులను పవిత్రంగా భావించి బంధుమిత్రులకు, ఆత్మీయులకు పంచుతారు.
పూర్వం త్రేతాయుగంలో రావణాసురుడిని సంహరించే సమయంలో రాముడికి అద్వితీయ శక్తిని ప్రసాదించినదీ, ద్వాపర యుగంలో అర్జునుడికి దివ్యమైన ధనుర్బాణాలను అందించి యుద్ధంలో విజయుడిని చేసింది ఈ జమ్మి (శమీ) చెట్టేనని అంటారు.
దసరా.. దాని చుట్టూ అల్లుకున్న ఇలాంటి విశేషాలు ఇలా అనేక విజయాలకు కారణమయ్యాయి కాబట్టే ఈ పర్వదినం విజయదశమి అయింది.
దసరా నాడు ప్రకృతిలో అమ్మవారు ‘అపరాజిత’ అనే శక్తిరూపంలో ఆవహించి ఉంటారట. ఆ శక్తిని పూజించడం వల్ల పరాజయాలు లేని భావి జీవితం సిద్ధిస్తుందని అంటారు. అపరాజితా శక్తి విజయాలను మాత్రమే కాకుండా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుందని స్కాంద పురాణం చెబుతోంది.
పూర్వం ప్రజా పాలకులైన రాజులకు విజయయాత్ర ముహూర్తంగా విజయదశమి పర్వదినం పూజలను అందుకునేది. ప్రాచీన కాలంలో రాజులు వర్షాకాలం ముగిసిన తరువాత శరత్కాలం ప్రారంభంలో విజయయాత్రలు చేసేవారట. అందుకు శుభ ముహూర్తమే ఈ విజయదశమి.
రాజులకే కాదు.. మనలాంటి జనులకూ మంచి పనులు చేయడానికి, అనుకున్న లక్ష్యాలను సాధించడానికి మంచి ముహూర్తం ఈ విజయదశమే.
(అక్టోబరు 24, విజయదశమి పర్వదినం)
– కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review శుభ ముహూర్తం.