‘మాసేన స్యా దహోరాత్ర: పైత్రో వర్షేణ దైవత:
అమరకోశకారుడి పై శ్లోకాన్ని బట్టి.. ‘‘మనకొక సంవత్సరం దేవతలకు ఒక దిన (రోజు)’’మని జ్యోతిష శాస్త్రపు లెక్క.
అనగా మనం నెలగా వ్యవహరించే ముప్పై రోజులు- పితృ దేవతలకు ఒక రోజుతో సమానం.
అలాగే, మన సంవత్సరం దేవతలకు ఒక రోజు అవుతుంది. ఇదే పై శ్లోకంలోని భావం.
ఒకప్పుడు ఆశ్వయుజ పూర్ణిమ సంవత్సరాదిగా ఉండేదని అంటారు. మాఘ పూర్ణిమ తరువాత అష్టమి నాడు అష్టక అనే వ్రతాన్ని పూర్వం ఆచరిస్తుండే వారు. దీనిని బట్టి మాఘ పూర్ణిమ తిథి కూడా సంవత్సరాదిగా పరిగణనలో ఉండేది. బౌద్ధుల వినయపీటకంలో అష్టకా వ్రతం ప్రస్తావన ఉంది.
పాలీ సాహిత్యంలో- ‘కౌముదీ చాతుర్మాసీయక్షణ’ అనే ఒక ఉత్సవం గురించి పేర్కొన్నారు. వాత్స్యాయనుడు దీనిని ‘కౌముదీ జాగర’గా పేర్కొన్నాడు.
సంహితలలోనూ, బ్రాహ్మణాలలోనూ ఆశ్వయుజ పూర్ణిమ ప్రస్తావన కనిపిస్తుంది.
గృహ్య సూత్రములలో ఈ పూర్ణిమకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ పూర్ణిమతోనే నూతన సంవత్సరం ఆరంభం అవుతుండేది.
అనంతరం కాలంలో చాంద్రమానానుసారం, రుతువులను బట్టి ఉగాది కాల నిర్ణయం- చైత్ర శుద్ధ పాడ్యమిగా నిర్ణయించారు మన పంచాంగకర్తలు.
ఉగాది అంటే నక్షత్రపు నడక అనే అర్థం కూడా ఉంది. ఇది పూర్తిగా ప్రకృతి పండుగ.
నేలంతా పులకరించి, కొత్త చిగుళ్లు, పూలతో కళకళలాడే పండుగ. భవిష్యత్తుపై ఆశలు పెంచి, కొత్త జీవితానికి ఊపిరిలూదే పండుగ.
ఈ పండుగను ‘సంవత్సరేష్ఠి’ అని కూడా అంటారు. ఇష్ఠి అంటే క్రతువు అని అర్థం.
అన్ని లోకాలూ సుఖశాంతులతో ఉండాలనే శుభ సంకల్పంతో విశ్వవ్యాప్తమైన శుభకామన కలిగి ఉండటమే మన భారతీయ పర్వాల్లోని అంతరార్థం. అదే మన ఉగాది ఈ లోకానికి ఇచ్చే సందేశం. ఇక, చైత్ర మాసంలో ఉగాది తరువాత వచ్చే మరో విశేష పర్వం- శ్రీరామ నవమి. లోకానికి ధర్మపు నడకను, నడతను నేర్పిన రామచందప్రభువు మనకు ప్రాతకాల స్మరణీయుడు.
ఉగాదిలోని ‘కొత్త’దనాన్ని ఆస్వాదిస్తూ.. ధర్మబద్ధులమై జీవించాలనేదే ఈ జంట పర్వాలు మనకిచ్చే సందేశం.. నేర్పే నీతి..
అందరికీ సంవత్సరాది,
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
– కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review సంవత్సరాది.. సంతోషాలకు నాంది.