మనిషి సాధారణంగా భగవంతుడి గురించి చింతించడు. కానీ, కష్టనష్టాలు, దుఃఖాలు ముసురుకొన్నప్పుడు భగవంతుడి కోసం ఎడతెగకుండా ప్రార్థనలు చేస్తాడు. వాటి నుంచి విముక్తి కలిగించాలని పదేపదే వేడుకుంటాడు. అసలు నిజం వేరే ఉంది. ఎవరి కర్మఫలం ఎంత వరకు
ఉందో అంత వరకు వారు దానిని అనుభవించి తీరాల్సిందే. పాప కర్మలు ముగిసే సరికి భగవంతుడు జనుల వద్దకు ఒక యోగీశ్వరుడిని పంపుతాడు. అప్పుడు ఆ యోగీశ్వరుడు జనులకు తగిన సలహానిచ్చి, యోగ క్షేమాలను తెలుసుకుంటారు. మన వద్దకు అలా సకాలంలో వచ్చిన దైవం షిర్డీ సాయిబాబా. ఆయన పాదాలను ఆశ్రయిస్తే వివేక వైరాగ్యాలనే జంట ఫలాలు లభిస్తాయి. మానవ జీవితాల్ని పారమార్థికంగా ఉద్ధరించేవి వివేక వైరాగ్యాలే. బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుంటే తల్లి తల్లడిల్లిపోతుంది. వారి చేత ఔషధాలను మింగించాలని చూస్తుంది. అయితే, ఔషధాలను తీసుకోవడం పిల్లలకు ఇష్టం ఉండదు. ఎందుకంటే, అవి రుచికరంగా ఉండవు. కానీ, బిడ్డపై ప్రేమ గల తల్లి- ఆరోగ్యాన్ని కలిగించే, గుణమిచ్చే చేదైన ఔషధాల్ని బలవంతంగా బిడ్డ చేత మింగిస్తుంది. బాబా కూడా ఆధ్యాత్మిక విషయాలను భక్తులకు ఇదే విధంగా బోధించే వారు. బాబా మార్గం రహస్యమైనది కాదు. అది బహిరంగమైనది. బాబా బోధనలను ఎవరైతే అనుసరిస్తారో వారి ధ్యేయం నెరవేరుతుంది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రాలను తెరిపించి ఆత్మ యొక్క దైవీక సౌందర్యాన్ని దర్శింప చేస్తారు. మన కోరికలను నెరవేరుస్తారు. మనలోని కోరికలు, విషయవాంఛలు తీరిన పిమ్మట మన ఇంద్రియ విషయవాంఛలు నిష్క్రమిస్తాయి. తుదిగా వివేక వైరాగ్యాలనే జంట ఫలాలు చేతికి వస్తాయి. అప్పుడు నిద్రలో కూడా ఆత్మజ్ఞానం మొలకెత్తుతుంది. సద్గురువుల సహవాసం చేసి, వారిని సేవించి, వారి ప్రేమను పొందితేనే ఇదంతా మనకు లభిస్తుంది. ఈ ఆధ్యాత్మిక ప్రగతి పూర్తిగా సద్గురువు సహాయం వల్లనే జరుగుతుంది. మనకు సాయి సద్గురువే భగవంతుడు. కాబట్టి మనం సద్గురువును వెతకాలి. వారి కథలను వినాలి. వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయాలి. ఇది మన నైతిక ప్రవర్తనలో ఒక భాగం కావాలి.
Review ‘సద్గురువు’.