ఉసిరికాయకూ ఓ పండుగ!

మన దేశ ఆధ్యాత్మికత ప్రకృతితో మమేకమై ఉంటుంది. అందుకే అనేక పర్వాలు, పండుగలు ప్రకృతిలోని వివిధ పుష్పాలు, ఫలాలు, కాయలతో ముడిపడి ఉంటుంది. ఈ క్రమంలోని పర్వమే అమలైక్యాదశి. ఆమలికం అంటే ఉసిరికాయ అని అర్థం. ఫాల్గుణ శుద్ధ ఏకాదశినే అమలైక్యాదశి, అమలిక ఏకాదశి అని వ్యవహరిస్తారు. కార్తీక మాసంలో మాదిరిగానే ఫాల్గుణ మాసంలోనూ ఉసిరిక వృక్షం విశేషంగా పూజలందుకుంటుంది. ఆ విధంగా ఉసిరిక ఉపయోగానికి రెండు రోజులు మన పెద్దలు ప్రత్యేకించారు.

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి వివరణలో ‘ఆమలకే వృక్షే జనార్థనః’ అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో అభివర్ణించారు.
ఆమలక వృక్షం జనార్ధన స్వరూపమనీ, దాని కింద ఆమలైకాదశి వ్రతాన్ని నిర్వహించాలని శాస్త్ర వచనం. ఫాల్గుణ శుక్ల ద్వాదశి నాడు ఆమలకి వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. చైత్ర మాసంలో ఆమలక ఫలాలు వైద్యానికి మంచివని అనుభవజ్ఞుల మాట. దీనిని బట్టి కార్తీక మాసం నుంచి చైత్ర మాసం వరకు గల ఆరు మాసాల్లోనూ మనం తీసుకునే ఆహారంలో ఉసిరిని ఏదో విధంగా వాడాలని మన పెద్దలు నియమం విధించారు.

అధిక మాస ప్రశంస లేని సాధారణ సంవత్సరాల్లో మనకు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి. ఆ ఇరవై నాలుగు ఏకాదశులకు ఇరవై నాలుగు వివిధ నామాలు ఉన్నాయి. విష్ణువు చర్యలను బట్టి శయనైకాదశి, పరివర్తనైకాదశి, ప్రబోధిన్యేకాదశి, వ్రత నియమాన్ని బట్టి నిర్జలైకాదశి, ఫలైకాదశి, వీర పూజనాన్ని బట్టి భీష్మైకాదశి, ఇంద్రైకాదశి వంటివి ఏర్పడ్డాయి. కానీ, అన్నింటిలోకి ఒక కాయ పండుతో సంబంధించిన ఏకాదశి ఆమలైకాదశి ఒక్కటే. ఏకాదశి వంటి గొప్ప తిథిలో ఉసిరిని జత చేయడం వల్లనే ఆమలకిలో ఏదో విశిష్టత ఉందని భావించవచ్చు. మన తెలుగు సంప్రదాయంలో కొన్ని పండుగలు వచ్చే నెలలో కొన్ని ఫలాలు పూజనీయం, వరణీయమై భాసిల్లుతున్నాయి. వాటిని ఆయా తిథుల్లో భుజించాలని మన పెద్దలు ఆరోగ్యరీత్యా నియమం విధించారు. ఆయా తిథి నియమాలను అనుసరించి ఆహారాన్ని, ఫలాలను తీసుకోవడం వల్ల ఎనలేని ఆరోగ్యం చేకూరుతుంది. ఈ క్రమంలోనే చైత్ర మాసంలో అశోక కలికా ప్రాశనం, ఫాల్గుణ మాసంలో ఆమ్రపుష్ప భక్షణం, కార్తీకంలో బిల్వపత్ర పూజ, ఆశ్వయుజంలో శమీ వృక్ష పూజ వంటి వాటి వల్ల మనుషులకు ఆరోగ్యం చేకూరుతుంది.
షడ్రసాల్లో ఉప్పు తప్ప మిగతా అన్ని రసాలు ఉసిరికలో ఉన్నాయి అని మన వైద్య గ్రంథాలన్నీ ఎలుగెత్తి చెబుతున్నాయి. ఇది మహత్తరమైన ఔషధీ గుణాలు గల ఫలం. అమృతాఫలం అనే గ్రంథంలో నలభై పేజీల్లో కేవలం ఉసిరిక ఔషధీ గుణాల గురించే ఉందంటే దీని ప్రశస్తిని అర్థం చేసుకోవచ్చు. అలాగే, ఫలజాతులు అనే గ్రంథంలోని యాభై పేజీల్లో దీని సర్వాంగాల గురించి వర్ణనలు ఉన్నాయి. వైద్యం, పారిశ్రామికంగా దీని ఉపయోగాల గురించి, వాగ్భటంలో పుంజీల కొద్దీ శ్లోకాలలో దీని రసాయనిక, కాయకల్పాది చికిత్సోపయోగాలను విపులీకరించారు. తెల్ల ప్లేగు అనే క్షయ వ్యాధి రాకుండా మానవుని రోగనిరోధక శక్తిని పెంపొందించే మహా ఔషధి ఉసిరిక.

ఇంత ప్రాధాన్యం కలది కాబట్టే మన వ్రత
నియమాల్లో దానికో స్థానాన్ని కలిగించి, దాని కోసం ఏకంగా ఏకాదశినే ప్రత్యేకించిన మన పెద్దల లోకహితం ఎంత విశిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఫాల్గుణంలో ఉసిరికను ఆహారంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు.

ఆరోగ్య సిరి
ఉసిరికాయలో విటమిన్‍ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
ఆయుర్వేదంలో పేర్కొనే చ్యవన్‍ప్రాశ్‍ ఔషధాన్ని ఉసిరి నుంచే తయారు చేస్తారు.
ప్రతి రోజూ ఉసిరికాయను తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.
ఇందులోని ఔషధ గుణాలు కంటిచూపును మెరుగుపరుస్తాయి.
2 చెంచాల ఉసిరి పొడిని 2 చెంచాల తేనెలో కలుపుకుని రోజూ 3 • 4 సార్లు తాగితే జలుబు రాదు.
ఉసిరికాయను నిత్యం ఏదో రూపంలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఉసిరి తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు. బరువు కూడా తగ్గించుకోవచ్చు.

Review ఉసిరికాయకూ ఓ పండుగ!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top