పల్లె ఖ్యాతి…. సంక్రాంతి

సంక్రాంతి తెలుగు వారి పెద్ద పండుగ. పంటల పండుగ. తెలుగు పల్లెలన్నీ కళకళలాడే పండుగ. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వేళ ఇది. ఈ పండుగకు చాలా రోజుల ముందు నుంచే పట్టణ, నగర ప్రాంతాల్లో నివసించే ప్రజల మనసులు తాము పుట్టి పెరిగిన పల్లె లకు చేరుకుంటాయి. అమ్మతోటి అనుబంధాన్ని, చిన్నప్పటి ఆట పాటలను, బాల్యస్నేహాలను, చిలిపి పనులను, బడిలో చదువుకున్న పాఠాలను అందరూ గుర్తు చేసుకునే సమయ మిది. సంక్రాంతి సమయంలో అందరి మనసులు ‘గతం’లోకి ప్రయాణిస్తాయి. ఊళ్లోని చెరువులో ఈత కొట్టిన అనుభవం, ఈతపళ్ల కోసం పడిన పాట్లు, దొంగతనంగా తెంపిన మామిడిపిందెలు.. ఇంకా ఎన్నెన్నో జ్ఞాపకాలు.. ఇవన్నీ నెమరువేసుకోవడానికి.. గుర్తుకుతెచ్చుకుని ఆనందించడానికి సంక్రాంతే తగిన సందర్భం.
తత్ర మేషాదిషు ద్వాదశ రాశిషు క్రమేణ సంచరితః
సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరరాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః
సంక్రాంతి ఆగమనాన్ని తెలిపే ఈ శ్లోకం జయసింహ కల్పద్రుమంలోనిది. ‘సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు సంచరిస్తూ క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరాభిముఖంగా ప్రవేశించి నప్పుడు సంక్రాంతి అవుతుంది’ అని పై శ్లోకానికి అర్థం.
సోయగాల పుష్యం..
సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. పుష్య మాసం సంవత్సరంలో పదవ మాసం. ఈ మాసంలో పూస గుచ్చడానికి కూడా పొద్దు ఉండ దని నానుడి. ఇది మంచుకురిసే హేమంత రుతు శీతాకాలం. చంద్రుడు పూర్ణిమ నాడు పుష్యమీ నక్షత్రంలో ఉండగా వచ్చేది కావడం వల్ల దీన్ని పుష్యమాసం అన్నారు. చల్లచల్లని గాలులు మేనును స్ప•శించడం.. మంచుజల్లులు పుడమిని ముద్దాడటం.. ఇవన్నీ పుష్య సోయగాలే. పుష్య అంటే పోషణ శక్తి కలదని అర్థం. ‘నీళ్లు తాకాలంటే భయంగా ఉంటుంది. అగ్ని మాత్రం ఉజ్జ్వలంగా ఉంటుంది’ అని ఈ మాసం గురించి వర్ణించారు ఆదికవి వాల్మీకి. పుష్య పూర్ణిమ నాటి రాత్రి సిద్ధాంతులు దూదిని మంచులో ముంచి ఆ మర్నాడు దాన్ని పిండి ఆ పక్రియలో వచ్చిన నీటి చినుకుల్ని బట్టి వర్ష నిర్ణయం చేసేవారు. ఎన్ని చుక్కలు జారిపడితే అన్ని కుంచాల వాన కురు స్తుందని అంచనా వేసేవారు. ప్రకృతి సౌంద ర్యానికి, పవిత్రమైన పర్వాలకు నెలవైన పుష్య మాసం సౌభాగ్యప్రదమైనది. ఈ మాసంలో వచ్చే ప్రధాన పర్వదినం సంక్రాంతి. ‘సంక్రాంతి’ అంటే ‘చేరుట’ అని అర్థం. సూర్యుడు నెలకోసారి ఒక్కో రాశిని చేరుతుంటాడు. దీనినే సంక్రమణం అంటారు. ఈ సంక్రమణంలో భాగంగా పుష్య మాసంలో ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ పర్వకాలమే సంక్రాంతి. ఇది మూడు రోజుల పర్వం. రైతుల విజయోత్సవానికి ఇది ప్రతీక. పంట చేతికంది కర్షకుడు ఖుషీగా గడిపే కాలమిది. తనకు పాడిపంటలనిచ్చిన పండుగగా రైతులు సంక్రాంతిని కృతజ్ఞతా పూర్వ కంగా జరుపుకొంటారు. పంటను చేతికందిం చిన భగవంతుడికి, పొలాల్ని దున్నే ఎద్దులకు ఈ పండుగ ద్వారా కృతజ్ఞత తెలుపుతారు. భోగి, సంక్రాంతి, కనుమ పర్వాల్లోని అంతరార్థమిదే. రైతు ఆనందంగా ఉంటే అందరూ ఆనందంగా ఉన్నట్టే.. అందుకే చిన్నా, పెద్దా, మహిళలు.. అంతా కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ ఇది. తెలుగునాట ఇది పెద్ద పండుగగా ప్రసిద్ధి. భోగి మంటల వెలుగులు.. కనుమ నాటి పూజాధికాలు.. ముక్కనుమ నాటి ఉత్సవ సంబరాలు.. సంక్రాంతి సందడే వేరు. ఏ ఇంట చూసినా ఆనందోత్సాహాలు.. చలిమంటల నెగళ్లు.. తీర్చిదిద్దిన గొబ్బిళ్లు.. రంగవల్లులు.. హరి దాసుల కీర్తనలు.. ఇళ్లకు చేరే పాడిపంటలు.. గంగిరెద్దుల కోలాహలంతో పల్లెతల్లి సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతుంది.
భోగభాగ్యాల భోగి..
చాంద్రమానం పాటించే తెలుగు వారు, సౌర మాన ప్రకారం జరుపుకునే పర్వాలలో సంక్రాంతి ఒకటి. తెలుగు నాట ఇతర పండుగల మాదిరిగా ఇది తిథి ప్రధానమైనది కాదు. మూడు రోజుల ఈ పండుగలో తొలిరోజు పర్వం భోగి. ఇది దక్షిణాయనానికి, ధనుర్మాసానికి ఆఖరు రోజు. మకర సంక్రమణానికి పూర్వపు రోజు. రైతులకు పంట చేతికంది, భోగి నాటికి ఇంటికి చేరు కుంటాయి. కర్షకులకు వ్యవసాయ పనుల రద్దీ తగ్గి కాస్త విశ్రాంతికి వీలుచిక్కే సమయమిది. చేతికందిన పంటను అనుభవానికి తెచ్చుకుని భోగ భాగ్యాలు అనుభవించడానికి రైతులకు వీలు కలిగించే పండుగ కాబట్టి దీనికి భోగి పండుగ అనే పేరు వచ్చిందని ఒక కథనం. శ్రీరంగనాథుడు గోదాదేవిని స్వీకరించి తనలో ఐక్యం చేసుకున్న కల్యాణ కరమైన రోజుగా భోగి ప్రసిద్ధి. గోదాదేవికి ఈ విధంగా భోగభాగ్యం చేకూర్చిన దినమిది. అప్పటి నుంచి జన సామాన్యానికి సైతం సమస్త భోగాలు ఇచ్చే రోజుగా ‘భోగి’ అయింది. నిఘంటువుల ప్రకారమైతే ‘భోగి’ శబ్దానికి పండుగ తొలిరోజు అనే అర్థం ఉంది. ఉండ్రాళ్ల తద్దికి ముందు రోజును ఉండ్రాళ్ల తద్ది భోగి అని వ్యవహరించడం కద్దు. ఈ లెక్కన చూస్తే సంక్రాంతికి తొలి రోజు కాబట్టి ఇది భోగి అయిం దని భావించాలి.
ఇంద్రుడు.. గోదాదేవి.. బలి..
కొన్ని వ్రత గ్రంథాలను బట్టి చూస్తే భోగి ముగ్గురికి సంబంధించిన పర్వంగా ముడిపడి
ఉంది. మొదట ఈ పండుగ ఇంద్రుడి కోసం చేసేదిగా కనిపిస్తుంది. ఇంద్రుడు మేఘాధిపతి. మేఘాలు లోకానికి వర్షాలనిస్తాయి. పంటలు పండటానికి వర్షాలు అవసరం. కాబట్టి వర్షాల కోసం ఇంద్రుడిని పూజించే ఆచారం ఏర్పడింది. కాగా, ద్వాపరయుగంలో జనుల నుంచి ఈ పూజలందుకుంటూ ఇంద్రుడికి గర్వం పెరిగిపోయింది. అతనికి గర్వభంగం చేయడానికి కృష్ణుడు భోగి పండుగ నాడు ముహూర్తం నిర్ణ యించాడు. అతను గొల్లలతో- ‘‘మనం గోవులను మేపుకునే గొల్లలం. కర్షకుల్లా మనకు వర్షాలతో పనిలేదు. మన గోవులకు మేతనిచ్చేది గోవర్ధన పర్వతంపైన గల పచ్చికబయలు. కాబట్టి గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం. ఇంద్రపూజ జోలికి మనం పోవద్దు’’ అన్నాడు. ఇది తెలిసి ఇంద్రుడికి కోపం వచ్చింది. తన మేఘాలను ధారపోతగా వర్షిం చాడు. జడివానలో తడిసి ముద్దయిన గొల్ల పిల్లలు కృష్ణుడికి విషయం చెప్పారు. అప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టుకుని గొల్లలకు దాని కింద ఆశ్రయం కల్పించాడు. ఇంద్రుడు వర్షించి.. వర్షించి నీరసించాడు. ఈ విధంగా అతనికి గర్వ భంగమైంది. కృష్ణుని మహత్తు తెలుసుకొని ఆయన పాదాక్రాంతుడయ్యాడు. కృష్ణుడు మన్నించి భోగి పండుగ నాడు ఇంద్రుడు పూజలందుకునేలా ఆనతి ఇచ్చాడు. ఇది ఒక కథ.
ఇక, మరో కథ. బలి చక్రవర్తి పాతాళానికి అణగిన దినంగా కూడా భోగిని భావిస్తారు. భోగి నాడే విష్ణువు వామనుడై బలి చక్రవర్తి నెత్తిన మూడో పాదాన్ని పెట్టి అతనిని పాతాళానికి తొక్కేశాడు. బలిని మూడు అడుగులతో అణచివేసిన దినం కాబట్టి, సంక్రాంతి పర్వం మూడు రోజులనే ఆచారం ఏర్పడిందని కూడా అంటారు. అందుకే, ఈనాడు వామన నామస్మరణ, బలిచక్రవర్తి ప్రస్తుతి చేయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారం.
ఇక, గోదాదేవి విషయానికి వస్తే.. శ్రీ విల్లి బుత్తూర్‍ అనే గ్రామంలో విష్ణుచిత్తుడనే పరమ భాగవత శిఖామణి ఉండేవాడు. ఆయన కూతురు గోదాదేవి. ఆమెకి పెండ్లి వయసు వచ్చింది. శ్రీరంగంలో కొలువైన శ్రీరంగనాయకులను తప్ప మానవ మాత్రులు ఎవరినీ వివాహం చేసుకోనని ఆమె తండ్రితో తెగేసి చెబుతుంది. తన కోరిక నెరవేర్చుకోవడం కోసం ఆమె ధనుర్మాస వ్రతం పూనుతుంది. ఈ వ్రతం ఆచరించిన నెల రోజుల్లో ఒక్కో రోజు తనకు కలిగిన అనుభూతుల్ని వర్ణిస్తూ తమిళంలో కవిత చెప్పి, రోజుకు ఒక పాశురం (మన తెలుగులో సీస పద్యం వంటిది) చొప్పున ముప్ఫయి రోజులు ముప్ఫై పాశురాలను రచించి స్వామికి కృతి ఇచ్చేది. ఆ నెల రోజులు ఆమె పొంగలి మాత్రమే తీసుకునేది. ఈ ముప్ఫయి పాశురాలతో కూడిన గ్రంథమే ‘తిరుప్పావై’. తిరుప్పావై పూర్తయిన ముప్ఫయ్యోనాడు స్వామి ప్రత్యక్షమై ఆమెను తప్పక వివాహం చేసుకుంటానని చెబుతాడు. ఆమెను శ్రీరంగం రావాలని ఆదేశిస్తాడు. ఆమెకు సమస్త భోగాలు సమ కూరుస్తానని మాటిస్తాడు. గోదాదేవి ఈ విషయాన్ని తండ్రికి చెబుతుంది. తండ్రి ఆమెను శ్రీరంగం తీసుకువెళ్తాడు. ఆశేష ప్రజానీకం సమక్షంలో ఆమెకు శ్రీరంగ నాథునితో వివాహం చేస్తారు. పెళ్లితంతు పూర్తి కాగానే ఆమె గర్భాలయంలోకి వెళ్లి స్వామి వారి శేషతల్పం ఎక్కివారి పాదాలు సమీపించి స్వామివారిలో ఐక్యమవుతుంది. మహిమాన్వితమైన ఇంతటి కార్యం నడిచిన పుణ్య దినం, పర్వదినం భోగి.
భోగి నాటి విధాయ కృత్యంభోగినాడు అభ్యంగన స్నానం చేస్తారు. ఆనాటి మధ్యాహ్నం భోగిపళ్లు వదులుతారు. ఈ భోగి పళ్లు పోయడం అనేది దృష్టి పరిహారార్థం చేసే కర్మగా కనిపిస్తుంది. భోగినాడు ఈ పర్వం సన్నద్ధం కోసం చంటి పిల్లలకు కొత్త దుస్తులు తొడుగు తారు. కుర్చీలో కూర్చోబెట్టి రేగుపళ్లు, పైసలు, చెరుకు ముక్కలు, బంతిపూలు కలిపి తల మీద నుంచి కిందికి పోస్తారు. దీనిని బోడికలు పోయడం అనీ కొన్ని ప్రాంతాల్లో అంటారు. ఇలా చేయడం పిల్లలకు ఆయుర్వ•ద్ధి కరమని స్త్రీల నమ్మిక. దీంతో భోగి పీడ వదులుతుందని ప్రతీతి. అప్పటి నుంచి పిల్లలకు కొత్త జీవితం ప్రారంభం అవుతుందని భావిస్తారు. వరి కంకుల తోర ణాలతో, సిరి కుంకుమ పారాణులతో ఇళ్లను అలంకరిస్తారు. తాము పండించి తెచ్చిన తండు లాలతో, వివిధ కూరగాయల్ని కలిపి పాలుపోసి, పొంగలి తయారు చేస్తారు. అలాగే, ఉదయాన్నే భోగి మంటలు వేసి గోమయంతో చేసిన పిడకలను మంటల్లో వేస్తారు. ఈ పిడకలను భోగికి నెల ముందు నుంచే సిద్ధం చేసుకుంటారు. భోగి పండుగ నాడు తమిళనాట విందు భోజ నాలు ఆనందంగా సాగుతాయి. ఆనాడు సాధా రణంగా అందరూ పులగం వండు కుంటారు. అందరూ ఆట పాటల్లో పాల్గొంటారు. తమిళ నాడులో గ్రామ ఉమ్మడి స్థలాన్ని ‘మండైవెలి’ అంటారు. ఆనాడు గ్రామస్తులంతా అక్కడ చేర తారు. అందరూ పల్లెటిపట్టు అనే ఆట ఆడతారు. సాయంకాలం వరకు ‘ఆనందం గోవిందం’గా కాలక్షేపం చేస్తారు. భోగినాడు తెల్లవారుజామునే తెలుగునాట వీధి కూడళ్లలో మంటలు వేస్తారు. వీటికే భోగి మంటలని పేరు. భోగి మంటలలో ఈ ధనుర్మాసం నెల రోజుల్లో ఆడపిల్లలు ఆవు పేడతో తయారు చేసిన గొబ్బి పిడకలు వేస్తారు. తమిళనాడులో అయితే, భోగినాడు బాలబాలికలకు చిన్న డప్పులు ఇస్తారు. వీటితో చప్పుళ్లు చేస్తూ మంటలు వేస్తారు. దీనిని నాదబ్రహ్మ తాండవంగా వ్యవహరిస్తారు. ఈ బాజాలు స్వర్గాధిపతి ఇంద్రుడి గౌరవార్థం అని చెబుతారు. ఈ డప్పుల ఆచారం మన తెలుగునాట లేదు.
పెద్ద పండుగ.. మకర సంక్రాంతి
సంక్రాంతి పర్వంలో రెండో నాడు వచ్చేదే మకర సంక్రాంతి. దీనినే పెద్ద పండుగ అంటారు. మూడు రోజుల పర్వంలో ఇదే ప్రధానమైనది. ఈనాటి పూజావిధుల్లోకి వెళ్తే.. మకర సంక్రాంతినాడు రాముని పూజచేసి ఉపవాసం ఉండాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సూర్యుడు ఉత్తరగతుడు అవుతాడు. ఉత్తరాయణం దేవకర్మ లకు అర్హమైన కాలం. ఏడాదికి 12 సంక్రాంతులు వస్తాయి. కానీ మకర సంక్రాంతి మాత్రమే పవిత్రమైనది. మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించే దినమిది. ఇది సూర్యుని సంచారాన్ని బట్టి ఏర్పడిన పండుగ. ఈనాటి నుంచి సూర్యుడు తన సహస్ర కిరణాలతో ప్రకృతిని, జీవజాతుల్ని ఉత్తేజితుల్ని చేస్తాడు. ముగ్గులదే సంక్రాంతి పర్వదినాల్లో ప్రధాన భూమిక. పడుచులు, పిల్లలు వినూత్న రంగవల్లులను ఆవిష్కరిస్తారు. నెలపాటు తమ ప్రతిభను చూపి భూమిని వర్ణమయం చేస్తారు. మకర సంక్రాంతినాడు స్నానం చేయనివాడు ఏడు జన్మల వరకు రోగిగా, దరిద్రుడిగా ఉంటా డంటారు. దక్షిణాయణ గత పాపం ఉత్తరాయణ పుణ్యకాలంలో పోగొట్టుకోవాలి. అందుకోసం ఈనాడు సూర్యుడిని పూజించి, తిలలు, కూష్మాండం, భాండం, కంబళ, ధాన్య, లోహ, వస్త్ర, తైల దీపదానాలు చేయాలని శాస్త్ర వచనం. కొన్నిచోట్ల ఈ దినాన్ని ‘మొక్కుల పండుగ’గా కూడా వ్యవహరిస్తారు.
ముచ్చటగా ముక్కనుమ..
కనుమ.. దీన్నే ముక్కనుమ అని కూడా అంటారు. సంక్రాంతి మూడవ పర్వమిది. వేద కాలం నుంచీ ఆచారంలో ఉన్న పర్వమిది. కనుమ పర్వం గురించి అధర్వణ వేదంలో ‘ఉద్వ•ష భోత్సవం గురించి ‘అవడోత్సవం’ అనే పేరుతో కొంత వివరణ ఉంది. పంటలు పండి ధాన్యం ఇంటికి తెచ్చుకున్న పిమ్మట కర్షకులు చేసే విధాయ కృత్యమే అవడుత్సవం అని శ్రౌత సూత్రంలో రాశారు. అందుకు తగినట్టే కనుమ నాడు తెలుగునాట గో, పశుపూజ ఎక్కువగా చేస్తారు. పశువులను, ఎడ్లబండ్లను అందంగా ముస్తాబు చేస్తారు. మేళతాళాలతో ఊరేగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఎద్దులను పరుగెత్తించడం, కోడెదూడలతో పందేలు వేయడం కూడా చేస్తారు. ఇక, గోదావరి జిల్లాలలో కనుమనాడు ఇళ్ల చూరులకు వరి వెన్నులను గుత్తిగా తయారుచేసి వడ్ల కుచ్చులు వేలాడదీస్తారు. వీటిని పిచ్చుకలు వంటి పక్షులు ఆరగిస్తాయి. ఈ ఆచారాన్ని పక్షిపూజగా వ్యవహరిస్తారు. అలాగే, ఇంకా ఈనాడు కొన్ని ప్రాంతాల్లో అన్నానికి పసుపు, కుంకుమ కలిపి ఆకుల్లో పెట్టి బహిరంగ స్థలాల్లో ఉంచుతారు. కొత్తగా ప్రారంభమైన ఉత్తరాయణంలో తమ ప్రియ బంధువుల క్షేమాభి వృద్ధులు పక్షులు వచ్చి ఈ రంగు అన్నాన్ని ఆప్యాయంగా తినడంపై ఆధారపడి ఉంటాయని విశ్వసిస్తారు. ఈ పర్వం వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ప్రాచుర్యంలో ఉంది. సాధారణంగా గోదావరి జిల్లాలు, కోనసీమలో ఈనాడు ప్రభల తీర్థం పేరిట గొప్ప ఉత్సవం జరుగుతుంది. దీనిని పసుల (పశువుల) పండుగగా వ్యవహరిస్తారు. మకర సంక్రాంతి వెళ్లిన మర్నాడు కనుమనాడు గొల్లలు, రైతులు పశువుల పండుగ నిర్వహిస్తారు.
కనుమకు సంబంధించి పలు నానుడిలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
కనుమ నాడు మినుములు తినాలట..కనుమనాడు మినుములు తినాలని, లేకపోతే యముడు ఇనుము కొరికిస్తాడని పెద్దలు అంటారు. అందుకే కాబోలు ఈనాడు ప్రతి ఇం• మినపసున్ని, గారెలు వంటి వంటకాలు తప్పనిసరిగా వండు తారు. కొన్ని ప్రాంతాల్లో కనుమనాడు తమ గ్రామ దేవతలకు నైవేద్యాలను సమర్పించే ఆచారం ఉంది. పురుషులు గ్రామ పొలిమేరల్లో కోడి పందాలు, పొట్టేళ్ల పందేలు జరుపుతారు.. తిల కిస్తారు. కనుమ రోజున ప్రయాణం పెట్టుకో కూడదని అంటారు. వెళ్తే వెంటనే తిరిగి రావడం కుదరదని ప్రతీతి. కనుమ నాడు కాకి కూడా ఎక్కడకీ బయల్దేరదనే సామెత గోదావరి జిల్లాల్లో వాడుకలో ఉంది. తెలుగునాట కనుము నుంచి కాకి రూపు మనిషికి, మనిషి రూపు కాకికి వస్తా యనే నానుడి ఉంది. దక్షిణాయణంలో కాకులు ఏపుగా, గోముగా ఉంటాయి. మనుష్యులు చలికి ఇక్కలాక్కు పోయి బూడిద చరిచినట్టుండే చర్మంతో ఉంటారు. ఉత్తరాయణంలో కాకులు ఇక్క లాక్కు పోగా, మనుష్యులు మంచి నునుపు తేలి ఆరో గ్యంగా ఉంటారు. అందుకే పై నానుడి వ్యవహా రికంలోకి వచ్చింది.
పాడికి పూజ ఎందుకంటే..
పాడిపంటలు అనే జంట పదాల్లో పాడి శబ్దం ముందు వాడటం జరిగింది. అంటే ఒక విధంగా పంట కంటే కూడా పాడి ప్రయోజనకరమైనదన్న మాట. అటువంటి పాడి మనకు ఇచ్చేవి గోవులే. గోక్షీరం యొక్క శ్రేష్ఠత్వాన్ని నిరూపించడానికి మన పురాణాలు ఒక కథను చెబుతున్నాయి. ఆ కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. బ్రహ్మ మానవుల్ని సృష్టించాడు. వాళ్లు తినడానికి అనేక పదార్థాల్ని సృష్టించాడు. వారు ఎంత తిన్నా వారిని ఒక విధమైన నీరసం వేధిస్తూ ఉండేది. ఈ సంగతి వాళ్లు బ్రహ్మతో చెప్పుకున్నారు. బ్రహ్మ బాగా ఆలోచించాడు. దేవతలు తాగే అమృతం వీళ్లకు కూడా ఇస్తే వీళ్ల నీరసం తగ్గుతుందేమో అని అనుకున్నాడు. కానీ, మానవులకు దేవతల బలవీర్యాలు లేవు. కాబట్టి వాళ్లు అమృతాన్ని ఆరగించుకోలేరు. అమృతంవలే పుష్ఠిని ఇస్తూ, సులభంగా జీర్ణమయ్యే పానీయం ఒకటి కొత్తగా సృష్టిస్తే బాగుంటుందని బ్రహ్మకి తోచింది. వెంటనే బ్రహ్మ కడుపు నిండా అమృతం తాగేశాడు. దానిని తాను బాగా జీర్ణం చేసుకుని మానవులు జీర్ణం చేసుకోగల కొత్త పదార్థాన్ని తయారు చేశాడు. తాను గోరూపాన్ని ధరించాడు. తాను కొత్తగా తయారు చేసిన పదార్థాన్ని ఆ గోవు పొదుగులో ఉండేలా చేశాడు. అవే పాలు. అవి మానవులకు సమగ్రమైన ఆహారమై అమృతతుల్యంగా
ఉంటాయి. అందుచేత ఆవు మానవుడికి పాలిచ్చే తల్లి, ఆహారం కూర్చే తండ్రి, పోషించే బ్రహ్మము అయి పూజనీయం అయింది. ఆవుని పూజించడం వల్ల మానవుడు తల్లిని, తండ్రిని, బ్రహ్మను ముగ్గు రినీ పూజించినట్టు అవుతుంది. దానిని అనాదరిస్తే ఆ ముగ్గురినీ అనాదరించినట్టే. అటువంటి అనాదరణ మహా పాతకాన్ని కలిగిస్తుంది. బొమ్మలకొలువు ఆచారమూ ఉంది..శాలువా కప్పుకున్న పండితునిలా, గంభీరంగా అడుగులేస్తూ గంగిరెద్దులు కనిపించే కాలమిది. వీటి సంబరాన్ని సంక్రాంతి పర్వదిన వేళల్లోనే చూడాలి.
‘‘డూ డూ డూ బసవన్న
డూ డూ డూ వెంకన్న
అయ్యగారికీ దండం పెట్టూ అమ్మ వారికీ దండం పెట్టూ’’ అంటూ గంగి రెద్దుల వాళ్ల పాటలు ఊరూరా వినిపిస్తాయి. ఇంకా హరిదాసులు, కర్షకులు, సమాజంలోని సమస్త వృత్తుల వారూ మమేకమై నిర్వహించుకునేది మకర సంక్రాంతి పర్వం. సంక్రాంతికి కూడా కొన్ని చోట్ల బొమ్మల కొలువులు నిర్వహించే ఆచారం ఉంది. కొన్ని ప్రాంతాలలో భోగి మొదలుకుని పది రోజుల పాటు బొమ్మల కొలువులు పెడ తారు. దీనినే సంక్రాంతి కొలువని కూడా అంటారు.

సంక్రాతి విధాయకృత్యాలు..
• మకర సంక్రమణం నాడు ఇంటి ముంగిట అలికి, రంగు రంగుల పిండితో ముగ్గులు పెట్టి, గోమయంతో గొబ్బిళ్లు చేసి, వాటిలో రంగు రంగుల పూలను, కొత్త బియ్యాన్నీ, రేగుపండ్లనుపెట్టి ఇళ్లను అలంకరిస్తారు.
• ఈరోజు తొమ్మిది రకాల కూరగాయలను కలిపి కూర వండుతారు. బ్రాహ్మణులకు కూరగాయ లనూ, ధాన్యాన్నీ, దక్షిణనూ ఇస్తారు.
• నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని, సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేసి, పుష్పాలు సమర్పించి, అంజలి ఘటించి, గాయత్రీ మంత్రం పఠిస్తూ, సద్బుద్ధి, జ్ఞానం, ఆనందాన్ని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని ప్రార్థించాలి.
• పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. పూర్వజుల మొక్కు బడులూ, ఆశయాలూ, ఆశలూ, ప్రతిజ్ఞలు తీర్చాలి.
• నువ్వుపప్పు, బెల్లం కలిపి లడ్డూలు తయారు చేసి బంధుమిత్రులకు పంచిపెట్టాలి. అలా చేయడం వల్ల సంకుచితమైన భావాలు పోయి అందరితో సత్సంబంధాలు ఏర్పడతాయి.
• సంక్రాంతి శీతాకాలంలో వస్తుంది. కాబట్టి ఆరోజు ఉష్ణాన్నిచ్చే నువ్వులు, నెయ్యి, కంబళ్లు పేదలకు దానం చేయడం పుణ్యదాయకం.
ఉత్తమకాలం.. ఉత్తరాయణం
సంక్రాంతి అంటే మారడం, చేరడం అని అర్థం. కర్కాటకం నుంచి మకర సంక్రాంతి వరకు సూర్యుడు దక్షిణాభి ముఖంగా సంచరించడం వల్ల ఈ కాలాన్ని ‘దక్షిణాయణం’ అంటారు. మకర సంక్రాంతి నుంచి కర్కాటక సంక్రాంతి వరకు ఉత్తరాభి ముఖుడై సంచరించడం వల్ల ఈ కాలాన్ని ‘ఉత్తరాయణం’ అని అంటారు. దేవతలకు ఉత్తరాయణం ఉత్తమ కాలమని, దక్షిణాయణం పితృదేవతలకు ముఖ్య కాలమని భావిస్తారు. ఉత్తరాయణంలో మరణిస్తే మోక్షప్రాప్తి కలుగు తుందంటారు. అందుకే అంపశయ్యపై భీష్మా చార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నాడని మహా భారతం చెబుతోంది.

పెరుగు దానం..కొడుకు పస్రాదం
మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే దినం మకర సంక్రాంతి. ఈనాటి నుంచి సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ప్రవేశించింది మొదలు మకర సంక్రాంతి వరకు దక్షిణాయణం. ఉత్త రాయణం పుణ్యకాలమని, దక్షిణాయనం అంత మంచిది కాదని అంటారు. వివాహాలు, ఉపనయ నాలు సాధారణంగా ఉత్తరాయణంలోనే చేస్తారు. మకర సంక్రాంతి పర్వం అతి పురాతనమైనది. రుషి తుల్యుడైన ద్రోణాచార్యులు, కృపి దంపతులు ఒక ఆశ్రమంలో ఉండేవారు. ఒకనాడు ద్రోణుడు బయటకు వెళ్లాడు. ఆశ్రమంలో కృపి ఒక్కతే ఉన్న సమయంలో దూర్వాసముని సమిధల కోసం అన్వేషిస్తూ వచ్చాడు. ఆయనను పూజించిన కృపి.. తన పేదరికం గురించి చెప్పుకుంది. ఒక ముసలి ఆవు తప్ప లోకంలో తమకు ఏ ఆస్తీ లేదని, పిల్లలు కూడా లేరని చెప్పింది. తమకు భాగ్యప్రదమైన సాధనమేదైనా చూపాలని ఆమె ప్రార్థిం చడంతో దుర్వాసుడు ఆమెకు సంక్రాంతి పర్వాన్ని జరపాలని ఉపదేశించాడు.
వ్రతవిధానం ఇదీ..
సంక్రాంతి నాడు గంగానదిలో స్నానం చేసి బ్రాహ్మణుడికి పెరుగు దానం చేయాలి. నందుని భార్య యశోద ఇలాగే బ్రాహ్మణుడికి పెరుగు దానం చేసింది. ఫలితంగా ఆమెకు శ్రీకృష్ణుడు కొడుకుగా లభించాడు. ఆ కొడుకు వారి పేదరికాన్ని పోగొట్టి తన తండ్రి నందుని గొల్ల కులానికి రాజుని చేశాడు. ఈ సంగతు లన్నీ కృపికి చెప్పిన దుర్వాసుడు ఆనాడే మకర సంక్రాంతి అనే విషయాన్ని గుర్తుచేశాడు. దగ్గర
ఉన్న నదికి వెంటనే వెళ్లి శరీరానికి నువ్వుల పిండి రాసుకుని స్నానం చేసి రమ్మన్నాడు. వచ్చి తనకు పెరుగు దానం చెయ్యమన్నాడు. కృపి దుర్వాసుడు చెప్పినట్టే చేసింది. కాలక్రమంలో ఆమెకు చక్కని కొడుకు పుట్టాడు. అతడే అశ్వత్థామ. దాంతో ద్రోణా చార్యుడు, కృపి దంపతులకు అప్పటి నుంచీ చీకూ చింతా లేకుండాపోయాయి.
సంక్రాంతి వేళే పల్లెను చూడాలి
తొలకరిలో మొలకెత్తిన జొన్న, సజ్జ, ఆరిక, చామ, కొర్ర, నూవు, పెసర, కంది, సెనగ వంటి మెట్ట పైర్లు, రాగి, వరి తదితర కూరగాయల వంటి మాగాణి పంటలు కార్తీక మార్గశిర మాసాలకు కాపునకు వచ్చి ఎటుచూసినా కళకళలాడు తుంటాయి. భూమి పచ్చని చీరను చుట్టుకుని, సిగలో బంతి, చేమంతి పూలను తురుముకుంటుంది. పశుగణం పొదుగుల నిండుగా దండిగా పాలిస్తుం టాయి. లేగ దూడలు చెంగుచెంగున ఉరుకు తుంటాయి. సంవత్సరారంభం నుంచి రైతులు తాము చేసిన కృషికి తగిన ఫలితాన్ని అనుభవించే కాలమిది. ఈ సస్యవృద్ధిని చూసుకుని రైతులు మురిసి పోతుంటారు. పంటలు సిరిని మోసుకుని ఇళ్లకు చేరు తాయి. ఉబ్బితబ్బిబ్బైన ఇల్లాళ్లు ఇల్లలికి, వాకిలిని ముగ్గులతో తీర్చిదిద్ది సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తారు. ఇన్ని రమణీయ దృశ్యాలకు నెలవైన పర్వదినాన ఉప్పొంగని హృదయం ఉంటుందా? ఈ ఆనందం అవర్ణమైతే అదే సిరుల కాంతి. అదే సంక్రాంతి. పుష్య మాసంలో, అదీకాక దేవతలకు యోగ్య మైన ఉత్త రాయణ కాలంలో వచ్చే సంక్రాంతి.. మొత్తం పండుగ ల్లోనే మహా పండుగ. అందుకే దీనిని పెద్ద పండుగగా వ్యవహ రిస్తారు. ప్రస్తుతం మనం చైత్ర శుద్ధ పాఢ్యమిని సంవత్స రాది (ఉగాది)గా పరిగణిస్తున్నాం. కానీ, కొన్ని శాస్త్ర ప్రమాణాలను బట్టి చూస్తే మకర సంక్రాంతే ఉగాదిగా ఉంది. మకర సంక్రమణం నుంచే ప్రకృతి రమణీయ తను సంతరించుకుంటుంది.
పల్లె పిలుస్తోంది.. పదండి సంక్రాంతికి.. !
ముంగిట్లో బహు ముచ్చటగా కనువిందు చేస్తూ నేలపై హరివిల్లులు విరిసాయంటే.. సూర్యుని రాక కంటే ముందే హరిదాసు కీర్తనలు గోవిందనామాలతో వీనులవిందు చేస్తున్నాయంటే..అల్లంత దూరాన డూడూ బసవన్న ‘పట్టు శాలువా ధరించిన పండితుని’లా నిదానంగా కదిలి వస్తోంటే.. పూర్ణగర్భిణుల్లా ఇళ్లలోని గాదెలు ధన ధాన్యాలతో నిండుగా దర్శనమిస్తున్నా యంటే.. ఇంకేముంది…?! సంక్రాంతి వచ్చేసినట్టే!. సంక్రాంతి పర్వాలు ప్రధానంగా మూడు అయితే, ఈ పండక్కి నెల ముందు నుంచే సన్నాహాలు మొదలవు తాయి. పడుచులు ఇంటి ముంగిట అందమైన రంగవల్లులను నెల ముందు నుంచే తీర్చిదిద్దుతారు. పిల్లలు భోగిమంటల్లో వేయడానికి ఆవుపేడతో చేసిన పిడకల్ని నెల ముందునుంచే సిద్ధం చేసుకుంటారు. హరిదాసు కీర్తనలు నెలపాటూ కొనసాగుతాయి. అందుకే సంక్రాంతి పెద్ద పండుగే కాదు.. మన పెద్దల స్మరణకు ‘నెల’వైన ‘పెద్దల పండుగ’ కూడా!.
ఈ మాసమంతా తిలస్నానమే..
హేమంతం (హిమం=మంచు) రుతువులో పుష్యం రెండో మాసం. ఈ మాసంలో పగటి సమయం తక్కువ. రాత్రి సమయం ఎక్కువ. అందువల్లే ‘పుష్యమాసంలో పూసగుచ్చ పొద్దుండదు’ అనే నానుడి ఏర్పడింది. కొద్దిసేపైనా ఎండ తీక్షణత ఉండదు. సూర్మరశ్మి శరీరానికి తగినంత అందదు. అందువల్ల తైల గ్రంథులు వాటి విధిని సక్రమంగా నిర్వహించలేక మందగిస్తాయి. ఫలితంగా చర్మం పొడిబారుతుంది. పగుళ్లు ఏర్పడతాయి. దీనికి నివారణ తైల (తైలం=తిలల, నువ్వుల నుంచి తీసినది) అభ్యంగనం. శరీర ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచేది ఉష్ణోగ్రత. ఇది శరీరంలోని ధాతువుల్లో ఉండే కొవ్వు పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. ఈ మాసంలో అవి మందగించడం వల్ల తైల శాతం తగ్గుతుంది. దాన్ని భర్తీ చేయడానికి సరైన మార్గం నువ్వులు, బెల్లం కలిపి తినడం. బెల్లం ఆయుర్వేద పరంగా అత్యంత ఆరోగ్య ప్రదమైన పదార్థం. దీనివల్ల రక్తవృద్ధి జరుగుతుంది. ధాతుపుష్ఠి కలిగి నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అందువల్లనే ఈ నెలలో వచ్చే సంక్రాంతి మొదలు తదితర పండుగ లన్నింటిలోనూ తైలాభ్యంగనం తప్పనిసరి అంటారు. పుష్యమి అనేది శని గ్రహ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధి దేవత బృహస్పతి. ఇతను బుద్ధి కారకుడు. అందువలన బృహస్పతికి, శనికీ అత్యంత ప్రీతికరమైన మాసమని ఈ మాసాన్ని చెబుతారు.
మంగళ గౌరీదేవి వత్రం
పండుగ రోజుల్లోనే ఆచరించే కొన్ని వ్రతాలు ఉంటాయి. అటువంటి వాటిలో గొబ్బి గౌరీదేవి వ్రతం ఒకటి. ఇది భోగి నాడు ప్రారంభమవుతుంది. నాటి సాయంకాలం నట్టింట ఒకవైపున మంటపాన్ని ఏర్పర్చి అలంకరిస్తారు. ఆ రోజుల్లో దొరికే కూరగాయలు, చెరుకు గడలను అక్కడ ఉంచుతారు. మంటపం మధ్యలో బియ్యం పోసి, దానిపై బంకమట్టితో చేసిన గౌరీ ప్రతిమను ఉంచుతారు. పూజానంతరం రాత్రివేళ గౌరీదేవిని నిద్ర పుచ్చుతారు. ఉదయాన్నే మేల్కొలుపు తారు. మూడు రోజులు సాయం వేళల్లో ముత్తయి దువులను పేరంటానికి పిలుస్తారు. వారంతా మంటపం వద్ద పాటలు పాడి, గొబ్బిళ్లు పెడతారు. నాల్గవ నాడు ఉద్వాసన, మంటపం వద్ద ఉంచిన కూరగాయలతో వంట చేస్తారు. దీనినే గొబ్బి కూర అంటారు. ఆ సాయంకాలమే గౌరీదేవిని చెరువు లేక నదిలో ఓలలాడిస్తారు. ఈ వ్రతం కొన్ని చోట్ల ఆరు రోజుల పాటు నిర్వహించే ఆచారం కూడా ఉంది. కనుమ నాడు కొందరు స్త్రీలు పుట్టింటి క్షేమాన్ని కోరుతూ మరో వ్రతాన్ని చేస్తారు. దీనిని ‘కాకి పిడచ పెట్టుట’ అంటారు. అయితే, ఈ వ్రతం గురించి ఆయాన వ్రత గ్రంథాలలో ప్రస్తావన ఉంది కానీ, ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలనే దానికి సంబంధించి పెద్దగా వివరాలు అందుబాటులో లేవు. విజ్ఞులెవరైనా ఇటువంటి వ్రతాల గురించి పరిశోధిస్తే తెలుగు నాట మన సంక్రాంతి శోభ మరింత ఇనుమడి స్తుందనడంలో సందేహం లేదు.
ముగ్గులు.. ఖగోళ ప్రతీకలు
మార్గశిరంలో ప్రవేశించిన ధనుర్మాసం పుష్యం లోనూ ఉంటుంది. గోపికలు చేసిన కాత్యాయనీ వ్రతాన్ని కన్యలు ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడనే నమ్మకంతో గొబ్బెమ్మలు చేయడం ఒక సంప్రదాయం. ఈ మాసంలో ప్రతి ఇంటా ముగ్గుల మీద గొబ్బెమ్మలు కనిపిస్తాయి. ఈ సమయంలో పెట్టే ముగ్గులు ఖగోళ స్థితికి ప్రతీకగా పూర్వీకులు భావించారు. ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాల చలనాన్ని తెలియచేసేందుకు, వాటి ప్రభావం కారణంగా మన జీవితాలు నడుస్తూ ఉంటాయని గమనించడానికి ఈ ముగ్గులు సంకేతమని ఒక భావన ప్రాచుర్యంలో
ఉంది.
పశువులకు పొంగలి నైవేద్యం
సంక్రాంతి పర్వదినాల్లోని మూడవ రోజును కనుమ అంటారు. కనుమనాడు గోపూజ చేయడం తెలుగు మాగాణిలో కంటే తమిళ నాట ఎక్కువ ఆచారంగా ఉంది. కనుమనాడు పశువులను అందంగా ముస్తాబు చేసి పూజలు చేస్తారు. వీధుల్లో మే• •తాళాలతో ఊరేగిస్తారు. సాయంకాలం వేళ పొంగలి వండి పెడతారు. ఎద్దుల పందేలు నిర్వహిస్తారు. వ్యవసాయ దారుడికి పశువే ఆస్తి. వాటి శ్రమ మూలంగా, ఆయేటి పంట చేతికి వచ్చిన సంక్రాంతి తరుణంలో కృతజ్ఞతా సూచ కంగా వాటికి కొత్త బియ్యంతో పొంగలి వండి పెట్టే ఆచారం ఏర్పడింది.

తెలుగు పంట పండుగ
సంక్రాంతి కేవలం తెలుగు వారి గొప్ప పర్వమే కాదు.. తెలుగు భాషను సుసంపన్నం చేసిన పండుగ కూడా. ఈ పండుగ సందర్భంగా ఆయా ప్రముఖులు చేసిన రచనలన్నీ తెలుగు భాషను పండించినవే. అవేమిటో చూద్దాం.
ఆధునిక కవిత్వంలో మొదటి నుంచీ పల్లె ప్రజల జీవితం చిత్రి విచిత్రమైంది. 20వ శతాబ్ది ప్రారంభంలో కట్టమంచి రామలింగారెడ్డి ‘ముస లమ్మ మరణం’లో కథ పల్లెటూరి గాథే. అనంత పురం సమీపంలో బుక్కరాయసముద్రం అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి వచ్చిన విపత్తు, బసిరెడ్డి అనే కాపు కోడలు ముసలమ్మ బలి దానంతో తొలగిపోతుంది. ఒక మూఢ నమ్మకం ఆధారంగా ఆయన ఈ కావ్యం రాశారు. దాన్ని పక్కనపెడితే, పల్లె ప్రజల ఆత్మీయతను, బంధా లను రసవంతంగా వర్ణించి రామలింగారెడ్డి ఈ కథకు కావ్య గౌరవం కల్పించారు.
వ్యవసాయ జీవితమే ప్రధాన కథగా దువ్వూరి రామిరెడ్డి ‘కృషీవలుడు’ కావ్యం రాశారు. హాలిక జీవితాన్ని కావ్య వస్తువుగా స్వీకరించడాన్ని సమర్థిస్తూ కట్టమంచి వారు ‘శోకరసము వర్ణింప వలయున్న ననుకూల సందర్భ మెయ్యది? క్రొవ్వు కారెడి నాయికా నాయకులకు ఊహామాత్రమైన కష్టములా? ప్రజలు దినదినము కన్నీరు కార్చుటకైన నవకాశము లేక కుడుచుచుండు పరిపరి విధముల గోడులా? శాంతరసమునకు పోషకమెయ్యది?..’ అంటూ ప్రశ్నించారు. రైతులను కథానాయకుడిని చేసిన మొదటి తెలుగు కవి దువ్వూరి. ఆయనతో పాటు ఏటుకూరి వెంకటనరసయ్య, తుమ్మల సీతారామమూర్తులను కర్షక కవిత్రయంగా పేర్కొనవచ్చు.
ఇక, సంక్రాంతి అనగానే ముందుగా జ్ఞాపకం వచ్చే తెలుగు కవి తుమ్మల సీతారామమూర్తి. వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి సొగసుల్ని తుమ్మల వర్ణించినంత రమణీయంగా వర్ణించిన కవి మరొకరు లేరు. తెలుగు రైతు జీవితంతో గాఢంగా పెనవేసుకున్న సంక్రాంతి పండుగ అంటే తుమ్మల వారికి ప్రాణం. సంక్రాంతి శోభను తెలిపే ఖండ కావ్యాలను ఆయన అద్భుతంగా రాశారు. అవి.. సంక్రాంతి (1941), సంక్రాంతి తలపులు (1953), సంక్రాంతి వేదన (1954), జయ సంక్రాంతి (1955), క్రొత్త సంక్రాంతి (1960), సంక్రాంతి ముచ్చటలు (1983).. ఈ రచనల ద్వారా తుమ్మల నాలుగు దశాబ్దాల కాలంలో రైతు జీవితంలో వచ్చిన మార్పులను అత్యద్భుతంగా వర్ణించారు. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో ఏ మహా కావ్యంలోనూ సంక్రాంతి పండుగ శోభ కనిపించదు. సంక్రాంతికి ప్రత్యేకమైన ముద్ద బంతి పూవు ప్రాచీన కాలంలో ఏ కవి కావ్యంలోనూ కనిపించకపోవడం ఆశ్చర్యకరం. కానీ, ఆ కాలంలో తుమ్మల ఒక్కరే సంక్రాంతిని, రైతును స్ప•శించారు. రైతు కలిమియే దేశపు బలిమిగా ఆయన తలచే వారు.కొసరి నూరిన పచ్చి పు, బైతమొగాన గుమ్మడి పూవుమారమ్మునద్ది కండరేగడ నార బండి కన్పండువై పొలుచు మిర్యపు బండు బొట్టువెట్టి విపమ్మునకు నొక్కవాసి హెచ్చైనట్టి నునుమంచు దెర చీరనూలు కొల్చి బంతి పూవులకు జేమంతి నెయ్యము గూర్చి కబరీ భరమ్ము చక్కన కుదిర్చి..’’ అంటూ ఆయన సొగసైన సంక్రాంతిని ఆవిష్కరించారు. కొత్తగా పెళ్ల యిన అల్లుళ్లకు అత్త వారిళ్లలో జరిగే మర్యాదలు, బావమరదళ్ల పరిహాసాలు, తలంట్లు, అభ్యంగన స్నానాలు.. డెబ్బయి ఏళ్ల నాటి తెలుగు పల్లెల అందచందాలను తుమ్మల తనివితీరా వర్ణించారు.

Review పల్లె ఖ్యాతి…. సంక్రాంతి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top