ఆలయానికి వెళ్దామిలా..

దేవుని ఆలయం దేవాలయం. అది సర్వమానవ శ్రేయోతత్వాలకు నిలయం. సాంఘిక రక్షణగా, సహకార కేంద్రంగా, విద్యా విషయక పీఠంగా, కళా పోషణా ప్రదర్శనారంగంగా, ఒకటేమిటి ఏ రంగమైనా ఆలయ ప్రాంగణం నుంచి వెలసినదే, అక్కడి నుంచి ఆరంభమైనదే. అసలు తత్త్వము, ఆలోచన, వాదము, వివాదము, ప్రజ్ఞ ప్రదర్శన అంతా ఆలయం నుంచి వెలువడిన కిరణాలే. అట్టి కేంద్రాన్ని మతసాంఘిక నైతిక మానసిక ఉన్నతికై దర్శించి పునీతులు కావాలని, తెలిసి తరించాలని కోరికతో దైవదర్శనానికి వెళ్ళటం సదాచారం. అటువంటి పరమ పవిత్ర ప్రదేశానికి వెళ్లేటపుడు ఎలా ఉండాలి? ఏం చేయాలి ? ఏం చేయకూడదు? అక్కడ ఆచరించే
వివిధ పద్ధతుల్లోని అంతరార్థం ఏమిటో తెలుసుకుందాం.

మనిషి మనుగడ మతంతో ముడిపడి ఉంది. అది సమ్మత మైనది. కాబట్టి తన ఉనికిని, సంస్క•తిని, సంస్కారాన్ని ఉన్నత విచారపరంపరని వాదపటిమని ప్రదర్శించుటకు సాధన కూడా అయినది మతము. ఒకనాడు ‘అడవి’ సంస్క•తి కలిగిన మనిషి మతం ద్వారా సాంఘిక నాగరిక సంస్క•తిని సంతరింప చేసుకొన్నాడు. శక్తికి ప్రతిరూపంగా తన్ను మించిన శక్తిగా, అతీత అగామిక కర్తగా ఊహించుకున్న ఆత్మ అద్దానివి పరమాత్మయన్నది. ఏది ఏమైనా, ఎటు వాదించినా, పరుల విశ్వాసాలను విమర్శించినా, తృణీకరించినా, తాము తపించినప్పుడు, ఆవేదన పడినప్పుడు, అనుకున్నదానికి ఎదురుదెబ్బ తగిలినప్పుడు, అయోమయంలో ఆక్రందించినప్పుడు అమ్మతో బాటు దేవులాడేది దేవుణ్ణే. మనిషికి అతీతమైన శక్తిగా మనుగడకు విధాతగా నిర్ణయించుకున్నవాడే ఏ పేరున పిలిచుకున్నా విశ్వాసానికి కారణమైనవాడు దేవుడే. అటువంటి దేవుడి సన్నిధానానికి వెళ్లేటపుడు మనమేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకుందాం.
తలవంచటం:
పవిత్రమైన మనసుతో దేవున్ని కోరుటకు లేదా ప్రార్థించుటకు గుడికి వెళ్ళటం అంతరార్థం. అందుకే గౌరవంగా పాదరక్షలు విడవటం, తలకు పాగా చుట్టటం లేదా టోపీ తీయటం ఇవి దేశచారాలైనా దేవుని ముందు తలవంచటం గౌరవసూచకం. అందుకే ఆలయంలో గర్భగుడి ద్వారం తక్కువ ఎత్తులో నిర్మించటం జరుగుతుంది. ఎత్తు ఉన్నా లేకున్నా, పొట్టివాడైనా, పొడుగువాడైనా దేవుని ముందు తలవంచి ప్రార్థన చేయటం సదాచారం.
ప్రదక్షిణ:
ఆలయ ప్రాంగణంలో ప్రవేశించిన వెంటనే భగవంతుని స్మరించి ప్రార్థించు స్థితి లౌకిక వ్యవహారాల నుండి విడివడి ఈ భక్తి స్థితిని పొందటం సాధ్యపడదు. అందుకే మూడు ప్రదక్షిణలు చేయటం. అంతలో లౌకిక జంజాటాల నుండి విడివడి మనస్సు దేవునివైపు మళ్ళించుటకు సమయమూ, వీలూ కలుగుతుంది. పిదప ఆలయ ప్రాంగణం నుండి అంతరాలయానికి చేరుకోవటం జరుగుతుంది. ఇట్టి స్థితి రప్పించుటకే ఆలయ ప్రాంగణం ప్రదక్షిణ మార్గం శిల్పరంజితంగానో, ప్రమదావనం గానో తీర్చటం జరిగింది. నేడు ఆహ్లాదకరమైన పూదోటల వాతావరణం దేవాలయాల్లో లోపించింది. విష్ణు చిత్తునకు శ్రీరంగంలో తులసితోటలో దొరికింది గోదాదేవి. అనగా ఆలయ ప్రాంగణం తోటగా ఆహ్లాదకరంగా, ఉత్సాహకరంగా, మానసిక శాంతి కరంగా స్వచ్ఛ వాతావరణం కలిగి ఉండేది. నేటి విశాలమైన ఆల యాలలోని ప్రదక్షిణా మార్గంలో పూదోట లేకున్నా భక్తికి దోహదం చేసే చిత్తమనోవికాసకరమై నయానందకరమైన శిల్పకళా నిలయమై యున్నందువలననే భక్తుల సేద తీర్చుచున్నది.
గంట:
గుడికి వెళ్ళినప్పుడు గంట కొట్టి కళ్ళు మూసి కొని దేవునికి దండం పెట్టడం ఆచారం. గంట ప్రాపంచిక ధ్వనులన్నీ సమసిపోయి కైవల్య ధ్వని మాత్రమే చెవుల్లో ధ్వనిస్తుంది. ఆ ధ్వనిని వింటూ కళ్ళు మూసికొని పరమాత్మ రూపాన్ని ధ్యానించి స్మరించి నమస్కరించి కృతార్ధుడు కావాలనేది సంప్రదాయం. ఇతర ధ్వనులేవీ వినరాకుండా ఉండుటకు, ఓంకారనాదమే గింగురు మని ప్రతిధ్వనించాలని ఆశయం. ఏకాగ్రత కోసం కనులు మూసికొనటం, చెవులు కూడా చేతులతో మూసుకోవటం జరుగుతుంది. ముస్లింలు ‘అజా’ ఇచ్చునపుడు చెవుల్లో వేళ్ళు పెట్టుకొని ప్రతిధ్వనించునట్లు చేయటం అప్పుడు తనకా అల్లాహు అక్బర్‍ (దేవుడొక్కడు మాత్రమే గొప్పవాడు) మాత్రమే వినిపించాలీ అని. అలా ఎవరైనా ఎచటనైనా లౌకిక ధ్వని వినిపించకుండా ఉండుటకు చేయు చేష్టల్లో ఒకటి గంటకొట్టడం, కళ్ళు మూసి కోవటం లౌకిక రూపాల విడనాడి పరమాత్మ చిద్రూప దర్శనం చేసుకోవాలన్న ఆశయమే.
తీర్థము:
దర్శనం చేసుకున్నాక, ప్రార్థనానంతరం తృణం పణం దేవునికి అర్పించుకుని, (అవే మొక్కులుగా మారినవి) తీర్థ ప్రసాదాలు తీసుకోవటం విధి. పెరుమాళ్ళకైనా పెట్టుచుట్టమన్న సామెత ఈ కలియుగం తీరున వచ్చిన సామెత. దేవునికి కానుకలివ్వటం, కొబ్బరికాయ కొట్టటం అంతా మనిషి మానసిక సంతృప్తియే. అందుకే గత నైవేద్యం నీల కంఠునికైనా, ఆరగింపు అయ్యగారిదేనని. భక్తి గౌరవ ప్రతిపత్తికే గాని దేవుడు వరాలివ్వటానికి లంచంగా గాదు మ్రొక్కుబడి. ఈ మ్రొక్కుబళ్ళు కలియుగ స్వార్థ సృష్టియే. అంతా కాకులను గొట్టి గ్రద్దలకు వేసినట్లే. దేవుని పేర చేసే దోపిడీయే.
ఏదైతేనేం సువర్ణదానానంతరం తీర్థం తీసుకోవటం సదాచారం. తీర్థం తులసి జలం. కొబ్బరి నీళ్ళు తులసి మంచి ఔషధం. దాని ఆకు తిన్నా, గాలిపీల్చినా ఆరోగ్యమే. కఫాన్ని హరించి, జీర్ణాన్ని పెంచుతుంది. కాబట్టి ఇది ఎంతో ఆరోగ్యదాయకం. మలేరియా లాంటి జ్వరాలకు కూడా ఇది మందు. అలా రోగం రాకుండా ఉండుటకేముందు జాగ్రత్త. తులసి తీర్థం అలా గొంతు శుభ్రం చేసి ఆకలి కలిగించి, మాంద్యాన్ని తొలగించి, ఆరోగ్యాన్ని కలిగించేదిగా తెలిసియే ఆలయంలో తీర్థం పెట్టడం.
హారతి:
భగవద్దర్శనం నిండుగా స్పష్టంగా చేసికొనుటకే హారతి పట్టడం. జ్యోతి కాంతిలో భగవద్దర్శనం రూపం దర్శించుకోవటమే పరమార్థము. కళ్లకద్దుకునే వేళ ఆ కర్పూరపు వాసనలు తప్పక పీల్చుకోవటం సహజం. కర్పూరం దుర్గంధాన్ని తొలగించి, నాసికను స్వచ్ఛం చేసి, నాసికా రంధ్రాలను స్వచ్ఛం చేసి ఉచ్ఛ్వాస నిశ్శ్వాస చక్కగా జరిగేట్లు చేస్తుంది. ఇలా కంటికి, శ్వాసకి హారతి ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నది. హారతి పళ్ళెంలో తృణమో పణమో వేయటం సాంఘిక సహకారమే పరస్పరం ఇచ్చిపుచ్చు కోవడమే. నాటి పూజారికి దేవమాన్యాలు తప్ప ఆదాయం లేదుగాబట్టి భక్తులిచ్చే కానుకలు వారి జీవనాధారాలయ్యేవి. అవి ఆచారం నుండి హక్కుగా మారుట కలియుగ విశేషం.
ప్రసాదం:
దీనికి మిక్కిలి మంచి తినుబండారమని అర్థము. అంటే మంచి ఆరోగ్యాన్నిచ్చేది అని. భక్తులు సమర్పించిన ప్రసాదాలన్నింటి నుండి ఆరగింపు చేసి కొంత యిచ్చి కొంత తీసికొని అందరిచ్చిన ఆ ప్రసాదాలన్నింటిని కలిపి పూజారి ప్రసాదం పెడతాడు. అది భక్తుడు శ్రద్ధగా స్వీకరించి, తిని బాగుపడుతున్నాడు. ప్రసాదం పెసరపప్పు (శెనగపప్పు), బెల్లం (చక్కెర), కొబ్బరి, నువ్వులు, కలిగి ఉంటుంది.
శఠగోపము:
వైష్ణవాలయాలందు విష్ణుపాదపీఠమైన శఠగోపం నెత్తిన పెట్టడం ఆచారం. అది పంచలోహాలతో చేసియుండును గాన వాని గుణప్రభావాన్ని తలపైనుంచి శిరోవేదన రక్తపుపోటు లాంటి వేదనలను హరింపజేయుట జరుగుచున్నది. భక్తి దానితో బాటు ఆరోగ్యమూ రెంటిని భక్తుడు సాధించుకొనుటకు ఆధారము. ఇదొక విధంగా పిరమిడ్‍ యందలి గాలిని ప్రయోగించినట్లు జరుగుచున్నది. వలయాకారవాయు ప్రకంపనాలు, లోహ విశేషాల గుణాలతో శిరస్సు నందలి రక్తనాళాల స్వదింపజేసి రక్త ప్రసరణ బాగు చేయుచున్నవి.
కూర్చుండుట:
దర్శనానంతరం కొంతపడి కూర్చోవటం ఆచారం, దైవదర్శనానంతరం వడిగా ప్రాపంచికాలవైపు పరుగెత్తక కొంత ధ్యాన మననాలకై క్షేత్ర / ఆలయ వాతావరణంలో భక్తిని పండించుకొనుటకే కొంత వడి కూర్చుండుట. ఆత్మ శాంతి, మనస్సుకు విశ్రాంతితోబాటూ ప్రవచనాలు ఒకటి రెండైనా చెవిన బడి పునీతం చేస్తాయన్నదే పరమార్థం. వీనిని సార్ధకం చేసుకున్న జన్మ ధన్యమే. •

Review ఆలయానికి వెళ్దామిలా...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top