నమో నమామి

ఆయన సామాన్యుడు. కానీ, అసామాన్య విజయాన్ని సాధించారు. ఆయనకు కుల బలం లేదు. కుటుంబ బలగం అంతకంటే లేదు. సాధారణ భాషలో చెప్పాలంటే ఆయనో చౌకీదార్‍ (కాపలాదారు). చాయ్‍వాలా. కానీ, తన మాటల చాతుర్యంతో.. చేతల గట్టితనంతో అఖండ భారతావనిని తన కర‘కమలాల’తో కట్టిపడేశాడు. ఆ ఒకే ఒక్కడు నరేంద్ర మోదీ (న.మో.). నరేంద్ర దామోదర్‍ దాస్‍ మోదీ. ఆ పేరు భారత సార్వత్రిక ఎన్నికల్లో చేసిన మ్యాజిక్‍ అంతా ఇంతా కాదు. విపక్షాలు ఆశించినట్టుగా అనూహ్య పరిణామాలేవీ చోటుచేసుకోలేదు. ఏకపక్షంగా, అదీ అంచనాలకు మించి ‘కమలం’ వికసించింది.

కొన్నేళ్ల క్రితం రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ.. ఐదేళ్ల క్రితమే ఎవరి తోడ్పాటు లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినంత మెజారిటీ సాధించింది. 2019 లోక్‍సభ ఎన్నికల్లో అంతకుమించిన మెజారిటీని సాధించి వరుసగా రెండోసారి తన సత్తాను చాటింది. మోదీని గద్దె దింపటమే లక్ష్యంగా ఒక్కచోటకు చేరిన ప్రతిపక్ష పార్టీలన్నీ గూడు చెదిరిన పక్షుల్లా కకావికలమయ్యాయి. మోదీ ప్రభంజనం, మోదీ సునామీ ముందు ఎవరి ఆటలు చెల్లలేదు. జాతీయవాదానికి భారతీయ ఓటరు ముక్తకంఠంతో జైకొట్టాడు. తనకు ఓట్లు పడవనుకున్న చోట్ల కూడా బీజేపీ పాగా వేసింది. పంజాబ్‍, కేరళ, తమిళనాడు, ఆంధప్రదేశ్‍, ఒడిశా.. ఈ ఐదు రాష్ట్రాలు మోదీ ప్రభంజనాన్ని తట్టుకోగలిగాయి. దక్షిణాదిలోని కర్ణాటకలో కొన్ని సీట్లు బీజేపీ గెలవగా, ఏపీ, కేరళలో ఒక్క సీటూ దక్కలేదు. తమిళనాడులో మాత్రం ఆ పార్టీ మిత్రపక్షమైన అన్నాడీఎంకేకు ఒక్క సీటు దక్కింది. ఇవి మినహా మిగ• దేశమంతా మోదీ మ్యాజిక్‍కు ఫిదా అయిపోయింది.
సెమీ ఫైనల్‍లో ఓడి.. ఫైనల్‍లో గెలిచి..
కొద్ది నెలల క్రితం జరిగిన మూడు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను బీజేపీకి సెమీఫైనల్స్గా భావించారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురైంది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‍లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 351 స్థానాలు (బీజేపీ, మిత్రపక్షాలు కలిపి- ఎన్డీఏ కూటమి) దక్కించుకుని సెమీఫైనల్స్ నాటి ఓటమి లెక్కను సరి చేసింది. ఉత్తరప్రదేశ్‍లో ఎస్పీ-బీఎస్పీ కూటమి కట్టినా.. బీజేపీకి అడ్డుకోలేకపోయింది. ఇక, 2014తో పోలిస్తే కాంగ్రెస్‍ బలం కొంచెం పెరిగింది. అయితే కాంగ్రెస్‍కు ప్రతిపక్ష హోదా కూడా దక్క లేదు. కాంగ్రెస్‍, దాని మిత్రపక్షాల కూటమి అయిన యూపీఏకు 91 స్థానాలు దక్కాయి.
రికార్డులే రికార్డులు.. గత రికార్డులన్నీ బద్ధలు
దేశ తొలి ప్రధాని జవహర్‍లాల్‍ నెహ్రూ రికార్డులన్నిటినీ మోదీ చెరిపే శారు. మరింత ఎక్కువ సీట్లతో, మరింత ఎక్కువ ఓట్లతో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. అంతే కాక, నెహ్రూ తరువాత ఒకే పార్టీ తరపున అయిదేళ్లు అధికారంలో ఉండి మళ్లీ ప్రధాని పీఠాన్ని అధిరోహించిన రెండో వ్యక్తిగా నిలిచారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‍ పార్టీ 364 సీట్లు సాధించింది. ఆ తరువాత ఆయన సారథ్యంలోనే రెండో సార్వత్రిక ఎన్నికలు జరగగా, ఈసారి ఏకంగా 371 స్థానాలు గెలుచుకుంది. అప్పట్లో లోక్‍సభ మొత్తం సీట్ల సంఖ్య 489. నెహ్రూ మరణానంతరం ఇందిరాగాంధీ సారథ్యంలో 1967లో జరిగిన లోక్‍సభ ఎన్నికల్లో కాంగ్రెస్‍ 283 సీట్లు (అప్పుడు లోక్‍సభ మొత్తం సీట్లు 520) సాధించింది. ఈ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగలేదు. 1971లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి ఇందిర 352 సీట్లతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నెహ్రూ తరువాత ఐదేళ్లు అధికారంలో ఉండి, అంతకంటే ఎక్కువ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన వ్యక్తిగా మోదీ రికార్డు సృష్టించారు. 2014 లోక్‍సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు 282. ఇక, ఓట్లను మెరుగుపరుచుకునే విషయంలోనూ బీజేపీ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు భారత ఎన్నికల చరిత్రలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీ 2.79 శాతం మేరకే ఓట్లను మెరుగుపరుచుకుంది. బీజేపీ మాత్రం 2014తో పోలిస్తే 2019 ఎన్నికల నాటికి పది శాతం ఎక్కువగా ఓటు షేరును సాధించింది.
నెహ్రూ రికార్డు తెరమరుగు..
ఒక పార్టీ తరపున అయిదేళ్ల పాటు అధికారంలో ఉంది మళ్లీ ప్రధాని పదవిని చేపట్టిన రెండో వ్యక్తిగా మోదీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. గతంలో నెహ్రూ పేరిట మాత్రమే ఈ రికార్డు ఉంది. ఆయన 1952, 57, 62ల్లో మాత్రమే వరుసగా ప్రధాని పదవిని చేపట్టారు. ఇందిర పలుమార్లు ప్రధాని పదవిని చేపట్టినా, పూర్తి కాలం అధికారంలో కొనసాగలేదు. 2004, 2009ల్లో మన్మోహన్‍సింగ్‍ రెండుసార్లు ప్రధాని అయ్యారు. కానీ, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‍ సంపూర్ణ మెజారిటీ సాధించలేదు. యూపీఏ తరపున ఆయన ప్రధాని అయ్యారు. రాజీవ్‍గాంధీ 1984లో 414 సీట్లు సాధించి చిరస్మరణీయ విజయాన్ని సాధించినా రెండోసారి ప్రచార సమయంలో ఆయన శ్రీలంక తీవ్రవాదుల ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
ఇది మోదీ విజయం
అవును. ఇది బీజేపీ విజయం కాదు.. మోదీ విజయమనే అనాలి. అమితమైన ధైర్యానికి, సాహసోపేతమైన నిర్ణయాలకు, వజ్ర సంకల్పానికి నరేంద్ర మోదీ మారుపేరు. అందుకే ఒక సమర్థమైన నేతను ఎన్నుకుంటున్నామనే భావనతో దేశ ప్రజలంతా ఆయనకు బ్రహ్మరథం పట్టారని అనుకోవాలి. మూడుసార్లు గుజరాత్‍ సీఎంగా, గత ఐదేళ్లు భారత ప్రధానిగా ఆయన వ్యవహారశైలి అసాధారణం. మోదీ గుజరాత్‍లోని వాద్‍నగర్‍లో 1950, సెస్టెంబరు 17న జన్మించారు. రైల్వే స్టేషన్‍ సమీ పంలో తండ్రి టీ స్టాల్‍ నడిపేవారు. చదువుల్లో పెద్దగా రాణించకపోయినా, ఎనిమిదేళ్ల వయసు నుంచే ఆయన సంఘ్‍ (ఆర్‍ఎస్‍ఎస్‍) కార్యకలాపాల్లో పాల్గొనేవారు. ఆ సంస్థ ప్రముఖ్‍ లక్ష్మణరావు ఇనామ్‍దార్‍ మోదీని ప్రోత్సహించారు. 18 ఏళ్ల ప్రాయంలోనే ఆయనకు ఇష్టం లేకుండానే యశోదాబెన్‍తో వివాహమైంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న మోదీ.. బేలూరు మఠ్‍, హిమాలయాల్లో కొద్ది కాలం సంచరించారు. రెండేళ్ల తరువాత మళ్లీ వాదానగర్‍ చేరి, సంఘ్‍లో పూర్తి స్థాయి కార్యకర్తగా ఎదిగారు. 1978లో దూరవిద్య ద్వారా బీఏ, 1983లో రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు. 1986లో అడ్వాణీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటికే కార్యదక్షుడిగా పేరు తెచ్చుకున్న మోదీని అడ్వాణీ బీజేపీ గుజరాత్‍ శాఖ కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేశారు. 1990లో అడ్వాణీ చేపట్టిన రథయాత్ర నిర్వహణ బాధ్యతలను మోదీ సమర్థంగా నిర్వహించారు. 1998లో గుజరాత్‍ బీజేపీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినా.. బీజేపీ సీనియర్‍ నేత శంకర్‍సింగ్‍ వాఘేలా గుజరాత్‍ పార్టీ వ్యవహారాలకు మోదీని దూరంగా ఉంచాలని పట్టుబట్టారు. అప్పటి జాతీయ నేతలు ఢిల్లీ పార్టీ కార్యకలాపాలు చూసేందుకు మోదీని నియమించారు. ఆ తర్వాత అనూహ్యంగా మోదీని 2001లో గుజరాత్‍ సీఎం పదవి వరించింది. 2002లో జరిగిన గోద్రా ఘటన మోదీకి మచ్చ తెచ్చింది. మోదీని సీఎం పదవి నుంచి తొలగించాలని అప్పుడు ప్రధానిగా ఉన్న వాజ్‍పేయి పట్టుబట్టారు. అడ్వాణీ, ప్రమోద్‍ మహాజన్‍ల సహకారంతో ఆ ప్రమాదం నుంచి బయటపడిన మోదీ.. ఆ తరువాత రెండు శాసనసభ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం తెచ్చి పెట్టారు. 2013 నుంచి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయం సాధించి పెట్టారు. తొలిసారి ప్రధాని పదవిని చేపట్టారు. తొలి ఐదేళ్ల కాలంలో పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, రాఫెల్‍, నిరుద్యోగం, రైతు సమస్యలు ప్రధానిగా మోదీ ప్రాభవానికి అడ్డుకట్టు వేస్తాయని చాలామంది భావించారు కానీ, తన రాజనీతి, తన కుడి భుజమైన అమిత్‍షా వ్యూహాలతో 2019లో జరిగిన ఎన్నికల్లో మరోమారు ఘన విజయాన్ని సాధించి వరుసగా రెండోసారి ప్రధాని పదవిని చేపట్టారు.
మోదీ బలం, బలగం ఆయనే..
నరేంద్ర మోదీ ఘన విజయంలో అమిత్‍ షా ప్రస్థావన లేకుండా ఉండదు. నిజానికి మోదీ నిరుపేద. అమిత్‍ షా సంపన్నుడు. మోదీ సాదాసీదా చాయ్‍వాలా. అమిత్‍ షా బిజినెస్‍ మాన్‍ (స్టాక్‍ బ్రోకర్‍). కానీ, ఇద్దరినీ బీజేపీ కలిపింది. ఆర్థిక అంతరాలు ఇద్దరి మధ్య గల 30 ఏళ్ల మైత్రి బంధానికి ఏనాడూ ప్రతిబంధకం కాలేదు. మోదీ మహారథి అయితే, ఆ రథానికి అమిత్‍ షా సారథి. మోదీతో ఇంతలా అనుబంధం పెనవేసుకున్న అమిత్‍ షా.. మోదీకి అన్ని విషయాల్లోనూ తలలో నాలుకలా వ్యవహరిస్తారు. ఒకప్పుడు బీజేపీని వాజ్‍పేయి – అడ్వాణీ ద్వయం నడిపేది. ఇప్పుడు మోదీ – షా ద్వయం జోడెడ్ల మాదిరి పార్టీని ముందుకు ఉరికిస్తున్నారు. 14 ఏళ్ల వయసులోనే సంఘ్‍లో సభ్యత్వం తీసుకుని, 1986లో బీజేపీలో చేరి నాలుగు సార్లు గుజరాత్‍ ఎమ్మెల్యేగా, పలు శాఖలకు మంత్రిగా పని చేసి, రెండుసార్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన అమిత్‍ షా పార్టీలో మోదీకి ఇంచుమించు సరిసాటి. ఎన్నికలు వచ్చాయంటే మోదీ వ్యూహాస్త్రం అమిత్‍ షానే. ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లోని పార్టీ కార్యవర్గాలతో మమేకమై కేడర్‍ను సర్వ సన్నద్ధంగా ఉంచడమే అమిత్‍ షా పని. తన 14వ ఏట ఆర్‍ఎస్‍ఎస్‍ కార్యకర్తగా మారిన షా.. 1982లో తొలిసారి మోదీని కలిశారు. ఆ రోజుల్లో మోదీ సంఘ్‍ ప్రచారకర్తగా పనిచేస్తూ అహ్మదాబాద్‍లో యువజన కార్యకలాపాల ఇన్‍చార్జిగా ఉండేవారు. అదే సంవత్సరంలో ఏబీవీపీ కార్యదర్శిగా నియమితులైన షా.. 1986లో బీజేపీలో చేరారు. 1990 శకంలో మోదీ – షా ద్వయం గుజరాత్‍లోని పల్లె పల్లెనా తిరిగి పార్టీని బలోపేతం చేశారు. 2001లో మోదీ గుజరాత్‍ ముఖ్యమంత్రి కావడంతోనే షా రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. 2014లో బీజేపీ అఖండ విజయాన్ని సాధించిన కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం అమిత్‍ షా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. యూపీ ఇన్‍చార్జిగా 2014 ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని 80 లోక్‍సభ స్థానాల్లో 73 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి తన సత్తా నిరూపించుకున్నారు. 2014 జూలైలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలపడేందుకు చర్యలు తీసుకున్నారు. వామపక్షాల పాలనలో ఉన్న త్రిపురలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా షాదే. 2019 లోక్‍సభ ఎన్నికల్లో అడ్వాణీ గతంలో కొనసాగిన గాంధీనగర్‍ నుంచి అమిత్‍ షా మొట్ట మొదటిసారి పోటీచేసి గెలుపొందారు. దేశంలోనే శక్తిమంతమైన నాయకుల్లో నంబర్‍-2గా భావించే అమిత్‍ షా ప్రస్తుతం మోదీ సారథ్యంలోని ప్రభుత్వంలో కీలకమైన హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూస్తున్నారు.
‘పథకం’ ప్రకారమే విజయం..
నిజానికి మోదీకి ఇంతటి ఘన విజయాన్ని సాధించి పెట్టిన అంశ మేమిటి? కేవలం ఆయన వ్యక్తిగత ఇమేజా? లేక ఆయన ప్రభుత్వం తీసు కున్న సాహసోపేత నిర్ణయాలా? అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా, హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో, తూర్పు, మధ్య భారతంలోనూ ఆయన ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు బీజేపీ అభ్యర్థులకు ఓట్ల వర్షం కురిపించినట్టు తేలింది. వీటి వల్లే సుమారు 22 కోట్ల మంది లాభపడ్డారు. వారందరి ఓట్లు బీజేపీకే పడిందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. వాటిలోని కొన్ని ముఖ్య పథకాలివీ..
జన్‍ ధన్‍ యోజన: మోదీ ప్రారంభించిన మెగా బ్యాంక్‍ అకౌంట్ల పథకమిది. సమ్మిళిత ఆర్థిక కార్యకలాపాల్లో ప్రజలను భాగస్వాములను చేయడానికి దీన్ని ఉద్దేశించారు. ఇప్పటి దాకా దాదాపు లక్ష కోట్ల రూపాయలు జమయ్యాయి. 35 కోట్ల మంది అకౌంట్లు తెరిచారు. అనేక స్వయం ఉపాధి పథకాలకు దీని ద్వారా రుణ సహాయం అందుతోంది.
సహజ్‍ బిజిలీ (సౌభాగ్య): గ్రామీణ ప్రాంతాల గృహ సముదాయా లకు విద్యుత్‍ సౌకర్యం కల్పించడం ఈ పథకం ఉద్దేశం. దాదాపు రెండున్నర కోట్ల మందికి లబ్ధి కలిగింది.
ఉజ్వల యోజన: గ్రామీణ మహిళలను వం•పొయ్యిల పొగ బారి నుంచి కాపాడే ఉజ్వల్‍ (గ్యాస్‍ సిలిండర్‍) పథకం. ఏడు కోట్ల మందికి సబ్సిడీ ద్వారా వంటగ్యాస్‍ అందింది.
గ్రామీణ్‍ ఆవాస్‍ యోజన: గ్రామీణ నిరుపేదలకు ఇళ్ల నిర్మాణ స్కీం.

మారు రెండు కోట్ల మందికి ప్రత్యక్ష లబ్ధి కలిగింది.
ఆయుష్మాన్‍ భారత్‍: రూ. 5 లక్షల వరకు వైద్య బీమాతో కూడిన ఈ పథకం బీజేపీ దశ, దిశను మార్చివేసింది. ఇంకా ఐదెకరాలున్న రైతులకు ఆర్థిక భరోసా, ఏడాదికి రూ.6,000 వారి ఖాతాల్లోకి నేరుగా జమయ్యే పథకమిది. కోటిన్నర మంది సన్న, చిన్నకారు రైతులకు లబ్ధి చేకూరింది.
543లో 300 కొత్త ముఖాలే..
మొత్తం 543 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 300 మంది లోక్‍సభ సభ్యులు తొలిసారిగా ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టబోతున్నారు. క్రికెటర్‍ గౌతమ్‍ గంభీర్‍, మిమీ చక్రవర్తి, స్మ•తి ఇరానీ, రవిశంకరప్రసాద్‍, కనిమొళి, రీటా బహుగుణ, నకుల్‍ (మధ్యప్రదేశ్‍ సీఎం కమల్‍నాథ్‍ కుమారుడు) వంటి ప్రముఖులు సహా 300 మంది తొలిసారి లోక్‍సభ ఎంపీలుగా ఎన్నికయ్యారు. తెలంగాణలో మొత్తం 17 సీట్లలో 12 మంది కొత్త వారే గెలు పొందడం విశేషం. రాజకీయాల్లోకి అడుగుపెట్టి తొలి ఎన్నికల్లోనే ప్రత్యర్థిని 3.91 లక్షల మెజారిటీతో గౌతం గంభీర్‍ ఓడించగా, రవిశంకర ప్రసాద్‍ నటుడు శత్రుఘ్నసిన్హాను మట్టి కరిపించారు. 2004, 2014 ఎన్నికల్లో పరాజయం చవిచూసిన స్మ•తి ఇరానీ ఈ ఎన్నికల్లో ఏకంగా జాతీయ కాంగ్రెస్‍ పార్టీ అధ్యక్షుడు రాహుల్‍గాంధీపై ఘన విజయం సాధించారు. అలాగే, తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన సాధ్వి ప్రజ్ఞాసింగ ఠాకూర్‍ కాంగ్రెస్‍ సీనియర్‍ నేత దిగ్విజయ్‍ సింగ్‍పై గెలుపొందారు. తెలంగాణ నుంచి తొలిసారి ఎంపీలుగా గెలిచిన వారిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్‍- భువనగిరి), ఉత్తమ్‍కుమార్‍రెడ్డి (తెలంగాణ పీసీసీ చీప్‍- నల్లగొండ), రేవంత్‍రెడ్డి (కాంగ్రెస్‍- మల్కాజిగిరి), కిషన్‍రెడ్డి (బీజేపీ- సికింద్రా బాద్‍), సోయం బాపూరావు (బీజేపీ- ఆదిలాబాద్‍), బండి సంజయ్‍ కుమార్‍ (బీజేపీ- కరీంనగర్‍), అరవింద్‍ (బీజేపీ- నిజామాబాద్‍), మాలోత్‍ కవిత (టీఆర్‍ఎస్‍- మహబూబాబాద్‍), పాతుగంటి రాములు (టీఆర్‍ఎస్‍- నాగర్‍కర్నూలు), వెంకటేశ్‍ నేత (టీఆర్‍ఎస్‍- పెద్దపల్లి), మన్నె శ్రీనివాసరెడ్డి (టీఆర్‍ఎస్‍- మహబూబ్‍నగర్‍). రంజిత్‍రెడ్డి (టీఆర్‍ఎస్‍- చేవెళ్ల) కూడా తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన వారిలో ఉన్నారు. తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ సభ్యుల్లో కిషన్‍రెడ్డి.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవిని చేజిక్కించుకున్నారు.
భారతావని మనసులోని మాట..
యావత్తు భారతదేశం.. మన్‍ కీ బాత్‍ (మనసులోని మాట) ఒకటే.. ఔర్‍ ఏక్‍ బార్‍ మోదీ.. అదే నిజమైంది. దేశం మొత్తం ‘నమో’స్తుతి చేసింది. అబ్‍ కీ బార్‍ 300 కే పార్‍’ అంటూ మోదీ, అమిత్‍ షా సాగించిన ప్రచార దండయాత్రలో యావత్‍ భారతదేశం కకావికలమైపోయింది. మోదీని ప్రధానమంత్రి చేయడానికే ఈవీఎం మీట నొక్కండంటూ బీజేపీ సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారం సాక్షిగా.. మోదీ ప్రభంజనమే సృష్టించారు. ఆయన వారణాసి నుంచి దాదాపు 4 లక్షల ఓట్ల మెజారిటీతో గెలు పొందారు. మోదీని గద్దె దింపడమే ఎన్టీఏ పక్షాల ఏకైక అజెండా అయినప్ప టికీ.. సీట్ల సర్దుబాట్లు చివరి వరకు కొలిక్కి రాక. కలవక.. వేర్వేరుగా బరి లోకి దిగడంతో ప్రజలకు మోదీ తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు.
సాటి లేని మేటి మోది..
2018 చివరిలో నరేంద్ర మోదీకి రెండు సవాళ్లు ఎదు రయ్యాయి. అవి.. పంటలకు మద్దతు ధర లేక రైతులు నిరా శకు గురికావడం, అగ్రవర్ణాల్లో అసంతృప్తి. ఉత్పత్తి ధర కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా కనీస మద్దతు ధర నిర్ణయిస్తామని చెప్పిన బీజేపీ దాన్ని అమలు చేయలేక పోయింది. అలాగే, ఎస్సీ, ఎస్టీ అత్యా చారాల నిరోధక చట్టం విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన ఒత్తిడికి తలొగ్గి మోదీ ప్రభుత్వం వెనకడుగు వేయడంతో అగ్రవర్ణాల్లో అసంతృప్తి నెలకొంది. సరిగ్గా ఎన్నికలకు ముందు బడ్జెట్‍ సమయంలో కిసాన్‍ సమ్మాన్‍ పేరుతో రైతుల ఖాతాలో రెండు వాయిదాల్లో రూ.12 వేలు వేయడంతో రైతుల్లో నిరాశ పోయింది. అగ్రవర్ఱ పేదలకు 10 శాతం రిజర్వేషన్‍ ప్రకటించడం వారి ఆగ్రహాన్ని చల్లార్చింది. అలాగే- దేశ వ్యాప్తంగా ఈసారి బీసీలు బీజేపీకి అండగా నిలిచారు. ఉత్తరాదిన ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికి ఇదో కారణం. చెప్పిన పనిని గురించి పదేపదే చెప్పు కోవడం ఒక కళ. మోదీలో ఈ కళ మరింత ఎక్కు వగా ఉందని మార్కెటింగ్‍ నిపుణులు అంటారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పథకాల ప్రచారానికే మోదీ ప్రభుత్వం రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టింది. విదేశీ పర్యటనలు ఎక్కువగా చేసే మోదీ.. విదేశాల్లో భారతదేశ పరువు ప్రతిష్టలను పెంచారనే భావనను జనంలో కల్పించారు. హిందువుల ఆశా కిరణంగా, హిందువుల నాయకునిగా మోదీ ఇమేజ్‍ అమాంతం పెరిగిపోయింది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో హిందుత్వ సెంటి మెంట్‍ను రగిలించడం ద్వారా బీజేపీ ఈ ఎన్నికల్లో గరిష్టంగా హిందువుల ఓట్లను గంపగుత్తగా రాబట్టుకోగలిగింది. మధ్య తరగతి జనాభా 29 శాతం. కాంగ్రెస్‍ ‘న్యాయ్‍’ పథకం (నిరుపేదలకు ఏడాదికి రూ.72 వేలు ఇవ్వడం) ప్రజల్లోకి బాగా వెళ్లలేకపోయింది. పైగా దీనికి ప్రతిగా బీజేపీ శ్రేణులు చేసిన ప్రచారం మాత్రం మిన్నంటింది. అలాగే, ఈ ఎన్నికల్లో బీజేపీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహాన్ని అమలు చేసింది. పశ్చిమబెంగాల్‍లో అధి కారంలో ఉన్న తృణమూల్‍ కాంగ్రెస్‍ పార్టీ ముస్లింలకు అనుకూలంగా ఉంటుంది. అక్కడ బీజేపీ జాతీయ వాదాన్ని తలకెత్తుకుంది. జార్ఖండ్‍ వంటి రాష్ట్రాల్లో రోడ్లు, అభివృద్ధి వంటి నినాదాలకు ప్రాచుర్యం కల్పించారు. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా మోదీ, షా ద్వయం విజయవంతమైంది. ఎన్డీఏ తరపున ప్రధాని అభ్యర్థిగా మోదీనే మొదటి నుంచి బలమైన అభ్యర్థిగా నిలిచారు. మరెవరి పేరూ ప్రస్తావనకు రాలేదు. అదే సమయంలో యూపీఏ, తృతీయ కూటమిలో తమ ప్రధాని అభ్యర్థి ఎవరనేది కచ్చితంగా చెప్పలేకపోయాయి. కాంగ్రెస్‍ రాహుల్‍ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే సాహసం చేయలేక పోయింది. ఈ పరిస్థితిని సైతం బీజేపీ అనుకూలంగా మలుచుకోగలిగింది.

మీరు (ప్రజలు) చాలా ఆశలతో ఈ ఫకీరు జోలెను నింపేశారు. నాపై మరోసారి నమ్మకం ఉంచినందకు దేశ ప్రజలకు ధన్యవాదాలు. ఈ దేశంలో ఉన్నవి రెండే రెండు కులాలు. ఒకటి- పేదల కులం. రెండోది- ఆ పేదరికాన్ని రూపుమాపే కులం. దారిద్య్రాన్ని నిర్మూలించి నవ భారత నిర్మాణానికి బాటలు వేస్తాను. ఆ పక్రియ ఇప్పటికే మొదలైంది. దాన్ని మరింత వేగవంతం చేస్తాం. ఈ ఎన్నికలతో భారతదేశం మరోసారి గెలిచింది. ఇక నుంచి నా సమయంలోని ప్రతీ క్షణం, నా శరీరంలోని ప్రతీ కణం దేశ సేవ కోసమే వినియోగిస్తాను.
-నరేంద్ర మోదీ (న.మో.)

పజలతో నిర్మితమైనదీ దేశం. ప్రజలంటే
కార్మికులు, కర్షకులు, నిమ్న వర్గాలు, దళితులు, మన అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు, మన యువత. అందరి అభ్యున్నతీ నా లక్ష్యం. ఇందుకోసమే ఈ పథకాలు. సబ్‍ కా సాథ్‍.. సబ్‍ కా విసాస్‍.. 130 కోట్ల మందీ కలిసి పనిచేస్తే 130 అడుగులు ముందుకేస్తాం. ప్రగతిదారుల్లో పయనిస్తాం.
-నరేంద్ర మోదీ
(2019 లోక్‍సభ ఎన్నికల తొలి ప్రచార సభలో చేసిన ప్రసంగం)

‘దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం నిబద్ధతతో అంద రితో భుజం భుజం కలిపి పని చేస్తామని హామీ ఇస్తున్నా. రాజ్యాంగానికి, సమాఖ్య వ్యవస్థకు బీజేపీ కట్టుబడి ఉంటుంది. ఆయా రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో చేయూతను అందిస్తుంది. బీజేపీ ఎప్పుడూ తన సిద్ధాంతాలను వదలలేదు. ఎన్నో ఎత్తుపల్లాలను చూసినా ఎప్పుడూ వినమ్రత, వివేకం, ఆదర్శం, సంస్కారాన్ని వదిలి పెట్టలేదు.
-నరేంద్ర మోదీ
(2019 లోక్‍సభ ఎన్నికల విజయోత్సవంలో ప్రసంగం చేసిన ప్రసంగం)

Review నమో నమామి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top