రామ ధర్మం… మా’నవ’ ధర్మం

ఆధ్యాత్మికతతో ముడిపడిన అవతారాలన్నీ మనిషి మనసులో కేవలం భక్తిని ప్రేరేపిస్తే, రాముని అవతారం మాత్రం ప్రతి మనసులో గుడి కట్టుకుని, ఆ వ్యక్తి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. మునుముందు సంఘంలో మానవ మనస్తత్వ చిత్రణ శ్రీరామునిలా ఉండాలని, తద్వారా సంఘం ఉత్తమంగా రూపుదిద్దుకోవాలన్న సంకల్పంతో బహుశా వాల్మీకి మహర్షి రామాయణ రచన చేశాడేమో!
రాముడిని దేవుడిలా కాదు.. మానవుడిలా చూస్తే.. ఈ భూమిపై మనిషిలా ఎలా బతకాలో తెలిసి వస్తుంది. అందుకే రామాయణం ఆధ్యాత్మిక గ్రంథమే కావచ్చు.. కానీ, అంతకుమించిన వ్యక్తిత్వ వికాస గ్రంథం. ఒక వ్యక్తి సుగుణాలతో శోభిల్లితే సంఘంలో అతనికి గౌరవ మర్యాదలు ఉంటాయి. ధర్మం కొలువై ఉంటుంది.
‘రామో విగ్రవాన్‍ ధర్మ:’ అని శాస్త్రోక్తి.
అంటే, పోతపోసిన ధర్మ విగ్రహం రాముడు. ఏప్రిల్‍ 14, 2019 శ్రీరామ నవమి సందర్బంగా ప్రత్యేక కథనం.

రాముడు ‘స్మిత పూర్వభాషి. అంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడటం చిరునవ్వుతో ప్రారంభిస్తాడు. నవ్వు మనుషులను, మనసులను దగ్గర చేస్తుంది. కాగల కార్యం నెరవేరుస్తుంది. ఇప్పటి వ్యక్తిత్వ వికాస తరగతుల్లో చెప్పేదిదే.
వాల్మీకి రాముడి గుణ వర్ణన చేస్తూ ‘పిత శుశ షణే రత:’ అంటాడు.
అంటే పిత సేవ అనేది రాముని సహజ లక్షణం. తండ్రి మాట వేదం. జవదాటడు. అనుభవంతో తలపండిన తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి మాటలను శిరసావహిస్తే, అవే అందరకూ ఆశీర్వచనాలు. అభివృద్ధి సోపానాలు. వాటి విలువ తెలిస్తే ఈ రోజున పెద్దవాళ్లు వృద్ధ శరణాలయాల్లో ఉండరు. పిల్లల అభ్యున్నతిని కాంక్షిస్తూ వారి అభివృద్ధిని చూస్తూ పొంగిపోతూ, వాళ్ల మధ్యనే ఉంటారు.
రాముడిలోని మరో లక్షణం స్థిరచిత్తం. తన తండ్రి మాట నెరవేర్చడంలోనూ, ‘రాజ్య పాలనకు అంగీకరించాల’న్న భరతుని అభ్యర్థనను తిరస్కరించడంలోనూ, సీతా పరిత్యాగంలోనూ, ఏకపత్నీ వ్రతంలోనూ, సుగ్రీవునికి మాట ఇచ్చి వాలిని హతమార్చడంలోనూ, రావణుడిని యుద్ధంలో సంహరించి సీతను తిరిగి తెచ్చుకోవడం అనే సందర్భాల్లో రాముని స్థిర చిత్తం స్పష్టంగా గోచరమవుతుంది. మనసు చెయ్యాలన్నదాన్ని కాకుండా అంకితభావంతో అనుకున్నది నెరవేర్చుకోవడమే లక్ష్యసాధన. దానికి త్రేతాయుగ కాలంలోనే అంకురార్పణ జరిగింది.
హనుమంతుడు రాముని గుణగణాలను సీతకు వర్ణించి చెబుతూ ‘తన నడవడికను తనే సమీక్షించుకునే వాడు’ అంటాడు. అంటే, తనలోని లోటుపాట్లను తెలుసుకుని చక్కదిద్దుకుంటాడట శ్రీరాముడు. ఎంత గొప్ప వ్యక్తిత్వం? మన లోపాలు మనకు తెలిసుండి కూడా అభిజాత్యంతో సంస్కరించుకోకుండా ఉండే మనబోటి వాళ్లకు రాముని వ్యక్తిత్వం ఓ పాఠం.

శ్రీరామ నవమి పూజా విధానం.

రామనవమి రోజున ఉదయాన్నే నిద్రలేచి, తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరం, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజా మందిరం, గడపకు పసుపు, కుంకుమను అద్దాలి. ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించు కోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధం, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి. శ్రీ సీతారామ లక్ష్మణ, భరత శతృఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను కానీ పూజకు ఉపయోగించవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలా కాయలు సిద్ధం చేసుకోవాలి.

అలాగే, పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరం, శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామాష్టకం, శ్రీరామ సహస్రం, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యాయాన్ని పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి.
ఇక, శ్రీరామ దేవాలయాలకు లేదా భద్రాచలం, ఒంటిమిట్ట, గొల్లల మామిడాడ వంటి ఆలయాలను దర్శించుకోవడం మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృతాలతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకాలు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామ కల్యాణం వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి. అలాగే, శ్రీరామ నవమి రోజున శ్రీరామదేవుని కథా వ్రతాన్ని ఆచరించడం మంచిది.

నవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచు దీపం, రెండు దీపారాధనలు, ఐదు వత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించాలి. పూజ పూర్తయిన తరువాత శ్రీ రామ రక్షా స్తోత్రం, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి ముత్తయిదువులకు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని పురో హితులు చెబుతున్నారు.

ఎంత అవసరమో అంతే మాట్లాడటం, ఎలాంటి క్లిష్టతర పరిస్థితుల్లోనూ అప్రియంగా మాట్లాడకపోవడం, రాక్షసు లైనా, స్త్రీల పట్ల (తాటకి) ఉన్నత భావాలు కలిగి ఉండడం, శత్రు శిబిరం నుంచి వచ్చినా (విభీషణుడు) నమ్మి ఆదరించడం, సముద్రుడి మీద కోపంతో బ్రహ్మాస్త్రం ఎక్కుపెట్టినా, కోపం తగ్గాక మరో వైపు ప్రయోగించడం, తనకు అన్యాయం చేసినా.. కైకను ఒక్క పరుషపు మాట కూడా అనకుండా గౌరవించడం.. ఇవన్నీ రామచంద్రుడి సహజ ఆభరణాలు.
సదా ప్రశాంతమైన మోముతో విశ్వామిత్రుడంతటి వాడిని లోబరుచు కుని అస్త్రశస్త్రములు బహుమతిగా పొందాడు. సీతమ్మ వారితో కల్యాణం జరిపించుకున్నాడు. భ్రాతృ ప్రేమను రుచి చూపి లక్ష్మణుడికి సహవాసిగా చేసుకున్నాడు. గుణ సంపదతో హనుమను ఆకట్టుకుని భృత్యుడిని చేసు కున్నాడు.
శ్రీరాముడు నేల విడిచి సాము చేయలేదు. మహాత్యాలు చూపలేదు. కేవలం మానవ మాత్రుడిగా మనలో ఒకడిగా కార్య నిర్వహణ చేశాడు. మనిషిగానే సాధించాడు. అందుకే ఆయనకు దేవుడని పట్టంగట్టి వది లేయలేం. మనలో ఒకడిగా చూసుకుంటాం. అందుకే వీధికో గుడి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి అందరూ పెద్దలై శ్రీ సీతారామ కల్యాణం జరిపించి మురిసి తరించిపోతారు.
శ్రీరాముడి గుణ సంపదలో నుంచి మనం కొన్ని గుణాలు అలవర్చుకున్నా, వ్యక్తిత్వ శోభతో సమాజంలో వెలుగొందుతాం. ఇదే సమస్త మానవ కల్యాణానికి శ్రీరాముడు చూపిన మార్గం.

వేద వేద్యుడు శ్రీరాముడు

వేదవేద్య పరేపుంసీ జాతే దశా రధాత్మజే
వేద: ప్రాచేత సాదాసీత్‍ సాక్షాత్‍ రామాయణాత్మనా:
వేదాలచే తెలియబడువాడు, పరమ పురుషుడూ అయిన సాక్షాత్తు శ్రీ మహా విష్ణువును దశరథుని కుమారునిగా పుట్టగా, వేదమే రామాయణంగా వాల్మీకిచే రచింపబడినది. అంటే రామాయణమే వేదం. రాముడే శ్రీ మహా విష్ణువు. ఆ దేవుడు రామావతారంగా జన్మించిన దినాన్ని మనం రామ నవమిగా నిర్వహించుకుంటున్నాం. ఉగాది తరువాత వచ్చే మొదటి పండుగ శ్రీరామ నవమి. ఉగాదితో మొదలయ్యే చైత్రమాసంలోని శుద్ధ నవమి రోజు శ్రీరామ నవమి. ఈ పండుగ చాలా వరకు వారం పాటు నిర్వహిస్తారు. కొందరు ఒక్కరోజూ, కొందరు మూడు రోజులూ చేసుకుంటారు. ఈ రోజు శ్రీరాముడు జన్మించిన దినం. అగ్ని, సూర్యుడు, చంద్రుడు సమస్త ప్రపంచానికీ ఆధారం. ఈ మూడింటి సమ్మిళిత తత్వమే రామ శబ్దం. ‘ర’ అగ్ని బీజం. ‘ఆ’కారం సూర్యునికి, ‘మ’కారం చంద్రునికీ ప్రతీకలు. ‘ర’కారమనే ఈ అగ్ని బీజం పాపాన్నీ, ‘ఆ’కారం అనే సూర్య బీజం అజ్ఞానాన్నీ, ‘మ’కారం అనే చంద్ర బీజం తాపాన్నీ చల్లారుస్తాయి.

రామావతార కార్యమిదీ..

రామావతారానికి కారణం కొద్దిగా చెప్పుకొందాం. త్రేతాయుగంలో రావణాసురుడు బ్రహ్మదేవుని నుంచి వరాలు పొంది సాధు సత్పురుషులనూ, రుషులనూ ముల్లోకాలనూ హింసించసాగాడు. దేవతలు, గంధర్వులు, కింపురుషాదులూ అంతా బ్రహ్మదేవుని శరణుకోరి ‘దేవా! రావణాసురునికి ఎవ్వరి వల్లా మరణం లేకుండా వరం ఇవ్వడం వల్ల అతను లోకాలన్నింటినీ బాధిస్తున్నాడు. అతని ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతు న్నాయి. మీరే మాకు మార్గం చూపాలి’ అని వేడుకున్నారు.

రావణుడు మానవుల వలన తనకు మరణం రాకూడదని కోరలేదు కనుక మనందరం శ్రీమన్నారాయణుడిని ప్రార్థిద్దాం’ అని బ్రహ్మ చెప్పి అందరినీ తీసుకుని శ్రీహరి వద్దకు వెళ్లాడు. వారందరూ ప్రార్థించగా ఆయన ‘నేను మానవ రూపంలో దశరథ పుత్రునిగా జన్మించి రావణుడిని హతమారుస్తాను.’ వారికి అభయమిస్తాడు.
అలా శ్రీమన్నారాయణుడు శ్రీరామునిగా, ఆదిశేషువు లక్ష్మణుడిగా, శంఖము భరతునిగా, చక్రము శత్రుఘ్నునిగా దశరథుని ముగ్గురు భార్యలకూ జన్మిస్తారు.

నలుగురూ నాలుగు వేదాలకు ప్రతీకలు

రామలక్ష్మణభరతశత్రుఘ్నులు నలుగురూ నాలుగు వేదాలకు ప్రతీకలు. రాముడు- ధర్మానికి ప్రతీక అయిన యజుర్వేదానికి, లక్ష్మణుడు రుగ్వేదానికి, భరతుడు సామ వేదానికి, శత్రుఘ్నుడు అధర్వణ వేదానికి ప్రతీకలు. లక్ష్మణుడు ‘అ’కారమునకు, భరతుడు ‘ఉ’కారమునకు, శత్రుఘ్నుడు ‘మ’కారమునకు, శ్రీరాముడు ప్రణవ నాదమైన ‘ఓం’కారమునకు స్వరూపులు. దశరథునికి పుత్ర కామేష్ఠి వలన నలుగురు సంతానం కలుగగా, కుల గురువైన వశిష్ఠ మహర్షి వారికి నామకరణం చేస్తాడు.

అందరినీ ఆనందింప చేసేవాడు రాముడు..

రామ శబ్దానికి అర్థం- ‘రమయతి గుణై: ప్రజాయితి రామ:’
ర•మించు అనగా ఆనందించు, అందరినీ ఆనందింప చేయువాడు, ఆహ్లాదపరచువాడు అని అర్థం.
‘రమ్యతీ ఇతిరామ:
లక్ష్మణుడు శౌర్య వీర్యము లను ప్రదర్శించు లక్ష్మీ సంపన్నుడు. లక్ష్మీనారాయణుల సేవయే తన శ్వాసగా భావించి ఆచరించేవాడు.
భరతుడు అందరినీ ప్రేమానందములతో ఆశ్చర్యకరమైన ధర్మ ప్రవృత్తి కలిగి ప్రజల పోషణ గావించే వాడు.
ఇక, శత్రుఘ్నుడు శత్రువులను నాశనం చేసి అన్నల అడుగుజాడలలో నడిచి, శాంతచిత్తుడై ప్రవర్తించే వాడు.

లోక ధర్మం.. శ్రీరామ ధర్మం

శ్రీరాముడు లోక ధర్మాన్ని సంపూర్ణంగా పాటించి వాడు.
‘సుఖదు:ఖే సమీకృత్వా లాభాలాభే జయాజయా’
ఈ సూక్తిని ఆచరణాత్మకంగా నిరూపించిన లోకోత్తర పురుషుడు రాముడు. పట్టాభిషేకానికి సిద్ధమైన సమయంలో ఎంత ఆనందంగా ఉన్నాడో అదే ముహూర్తంలో అరణ్యాలకు వెళ్లాల్ని వచ్చినా అంతే ఆనందంతో, ఏమాత్రం విచారం లేకుండా వెళ్లాడు. పట్టు వస్త్రాలను తీసేసి నార వస్త్రాలు ధరించి ఆనందంగా వెళ్లాడు. అంతేకాక రాముడు వ్యక్తిగత, కుటుంబ, సామాజిక ధర్మాచరణల్లో సామాజిక ధర్మానికే ప్రాధాన్యత ఇచ్చాడు. మహారాజుగా రాజ ధర్మానికే ప్రాధాన్యమిచ్చాడు. జనులు రాజులను అనుసరిస్తారని, జన వాక్యానికి ప్రాధాన్యతనిచ్చి, నిర్దోషి అని తెలిసినా సీతను జన వాక్యం కర్తవ్యం అని అరణ్యాలకు పంపాడు. ఆయన జాతి, వర్ణ, కుల, అధికార భేదాలకు అతీతుడు. రామునిలో అతి గొప్ప గుణం- మాతృ భక్తి. దేశభక్తి. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి’ అని నమ్మినవాడు. స్వర్ణలంకను వదలి తన మాతృ దేశానికి వచ్చిన వాడు. అందుకే రామో విగ్రహవాన్‍ ధర్మ: అన్నారు.

నేను సాధారణ మానవుడిని..

రావణ, కుంభకర్ణాదుల వధానంతరం కూడా సుదీర్ఘ కాలం వృథ్విపైన జీవించి మానవాళికి జీవన మార్గాన్ని, ఆదర్శ జీవన విధానాన్ని తన జీవితమే ఉదాహరణగా దర్శింప చేసిన అవతారం శ్రీరామావతారం. కానీ, అద్భుతమైన, ఆదర్శవంతమైన గుణాలు గల రాముడు ఎక్కడా తాను భగవంతుడినని చెప్పుకోలేదు. ఇతరులు ఎవరైనా ‘నీవు భగవంతుడివి’ అని అన్నా, ‘ఆత్మానాం మానుషం మన్యే’ (నేను సాధారణ మానవుడిని) అని నిక్కచ్చిగా చెప్పేవాడు. తాను భగవంతుని అవతారం అనే విషయం ఎక్కడా తనకు తెలిసినట్టుగా ప్రవర్తించ కుండా, మానవునిగానే జీవితకాలమంతా సంచరించడం శ్రీరామావతారంలో చెప్పుకోదగిన విశేషంగా మనకు గోచరిస్తుంది. దానికి కారణమూ స్పష్టంగానే కనిపిస్తుంది. బ్రహ్మ ఇచ్చిన వరాల బలం వల్ల రావణ వధ.. దేవ దావన యక్ష, సిద్ధ, సాధ్య, కిన్నెర, కింపురుషాదులు ఎవరికీ సాధ్యం కాని పని. నవ వానరుల పట్ల రావణునికి ఉన్న తేలిక భావం కారణంగా వారి చేతిలో మరణం లేకుండా ఉండాలని వరంలో భాగంగా బ్రహ్మను కోరనూ లేదు. బ్రహ్మ ఇవ్వనూ లేదు. అందువల్ల నరుడిగా జన్మించి, నరుడిగా వ్యవహరించినపుడు మాత్రమే శ్రీమహావిష్ణువుకైనా రావణుడిని చంపడం సాధ్యమవుతుంది. ఇందుకోసమే వానర రూపంలో జన్మించిన దేవతా గణాల సహాయం తీసుకుని రావణుడిని వధించాల్సి వచ్చింది. మామూలుగా అయితే రావణ సంహారంతో కథ ముగిసిపోయి అవతార పరిసమాప్తి జరగాలి కదా! కానీ, అలా జరగలేదు. దశరథుని పుత్ర కామేష్ఠి యాగానికి వచ్చిన దేవతలకు ప్రత్యక్షమైన శ్రీ మహా విష్ణువు, తాను దశరాత్మజునిగా జన్మించి ‘దశవర్ష సహస్రాణి, దశవర్ష శతానిచ’ (పదకొండు వేల సంవత్సరాలు మానవునిగా జీవిస్తాను) అని ప్రకటిస్తాడు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలి. ఒక పరిపూర్ణ మానవుడు, ఒక ఆదర్శ మానవుడు ఎలా ప్రవర్తించాలి? నరుల పట్ల ఉన్న తేలిక భావం తొలగించాలన్నా, ఆదర్శ మానవ సంబంధాలు, ఆదర్శ కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలి? అనే విషయాన్ని ‘నా జీవితమే నా సందేశం’ అన్నట్టుగా జీవించి చూపాలన్నా ఇది అవసరం అవుతుంది. అలా జీవించి చూపిన అవతారమే శ్రీరామావాతారం.

రాముడిని కొలవడం కాదు.. రాముడిలా జీవించడం నేర్చుకోవాలి..

పర్వతాలు, నదులు ఈ భూమిపై ఉన్నంత కాలం రామకథ నిలిచి ఉంటుంది అని బ్రహ్మ అంటాడు. ఏనాడో త్రేతాయుగంలో జరిగిన గాథ ఈనాటికీ కలియుగంలో కూడా సజీవంగా, చైతన్యవంతంగా ఉండటానికి ఇదే కారణం. మానవ సంబంధాలు గతి తప్పి, వికృత, విశృంఖల ప్రవర్తన వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం మునుపటి కంటే ఇప్పుడే ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లోనే, రామ కథా శ్రవణం, రాముని గుణ గణాల అధ్యయనం.

పాక్షాత్తూ మహా విష్ణువే త్రేతా యుగంలో శ్రీరాముడిగా అవతరించిన సందర్భంలో, భక్తులు ఎవరికి తోచిన రీతిలో వారు ఆ మహా పురుషుడిని సేవించుకుని పావను లయ్యారు. శ్రీరామచంద్రమూర్తిని అనేక మంది భక్తులు నవ విధాలుగా సేవించి తమ పరమ ప్రేమను చాటుకున్నారు. హను మంతుడు, వాల్మీకి మహర్షి, సీతాదేవి, భర తుడు, శబరి, విభీషణుడు, లక్ష్మణుడు, సుగ్రీ వుడు, జటాయువు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ఆ తారకరాముడికి చేరువయ్యారు. ఆయా సేవల ప్రతిరూపంగా నవవిధ రామభక్తి అనే భావన ఏర్పడింది. వాటి గురించి వివరణ..

శ్రవణం- ఆంజనేయుడు

‘ఆర్తితో ఎక్కడ రామనామం జపిస్తారో అక్కడ హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు. ఆ రఘునాథుని కీర్తన వినిపించే చోట వినయపూర్వకంగా, ముకుళిత హస్తాలతో ప్రేమాశ్రువులు నిండిన పూర్ణ నేత్రాలతో నేను ఉపస్థితుడనవుతాను’ స్వయంగా హనుమంతుడే వెల్లడించాడు. అందుకే శ్రీరాముని పట్ల శ్రవణ భక్తికి హనుమంతుడే విశేష తార్కాణంగా నిలుస్తాడు.

కీర్తన- వాల్మీకి మహర్షి

రామనామ జపంతో కిరాతకుడు కూడా కవి వాల్మీకిగా మారిపోయాడు. స్వయంగా రామకథను రచించి, లోకానికి అందించి కారణజన్ముడు అయ్యాడు. వేలాది గొంతుకలు రామ నామామృతాన్ని గ్రోలి పులకించిపోయే అవకాశాన్ని కల్పించాడు.

స్మరణ- సీతాదేవి

రావణుడి చెరలో ఉన్నా, స్మరణలో మాత్రం సత తమూ రామచంద్రుడినే నిలుపుకున్న పరమపావని సీతా దేవి. రాక్షసుల మధ్య కూడా జానకీ మాత పతి నామాన్నే ప్రాణధారగా చేసుకుని ఆయన స్మరణలోనే గడిపింది.

పాదసేవ- భరతుడు

తన వల్లే అన్న అడవుల పాలయ్యాడని కుమిలి పోయిన ఆదర్శ సోదరుడు భరతుడు. అందుకు ప్రాయ శ్చిత్తంగా అన్న పాదుకలకే పట్టాభిషేకం చేసి, పరోక్షంగా భగవంతుడి పాదసేవకే జీవితాన్ని అంకితం చేసిన పుణ్య పురుషుడు.

అర్చన- శబరిమాత

అనన్యమైన భక్తితో అర్చించి శ్రీరాముడిని తన వద్దకు రప్పించుకున్న భక్త శిఖామణి శబరి. రామ ఆగమనాభి లాషియై ఆ పతిత పావనుడి పూజలోనే పండిపోయి ప్రత్యక్షం చేసుకున్న ప్రేమమూర్తి ఆమె. తన భక్తితో మెప్పించి ఆ భగవంతుడికే తన ఎంగిలి తినిపించిన శబరి ధన్యురాలు.

దాస్యం- లక్ష్మణుడు

అవతరించింది మొదలు పై లోకాలకు వెళ్లే వరకు అన్నకు దాస్యం చేయడానికే తపించిన తమ్ముడు లక్ష్మ ణుడు. అన్నతో అడవిలో ఉన్నా అయోధ్యలాగే భావించి సీతారాములకు దాసుడిగా కంటికి రెప్పలా కాపాడు కున్నాడు ఆ సౌమిత్రి అయిన లక్ష్మణుడు.

సఖ్యం- సుగ్రీవుడు

సీతాన్వేషణలో విశేష రీతిలో శ్రీరాముడికి సహక రించాడు సుగ్రీవుడు. భగవంతుడితో సఖ్యత చేసి అవ తార లక్ష్యానికి సాయం చేసిన ఆదర్శ భక్తుడు సుగ్రీవుడు.
ఆత్మనివేదన- జటాయువు

సీతామాతను రావణుడి కబంధ హస్తాల నుంచి విడిపించేందుకు తన శాయశక్తులా కృషి చేసిన అసువులు బాసిన త్యాగశీలి జటాయువు. ఆత్మనివేదనతో

పాలకులు నేర్చుకోవాల్సింది..

సకల కల్యాణ గుణాభిరాముడు శ్రీరాముడు. ఆ మహనీయుని జీవన యానమే రామాయణం. సమస్త మానవాళికి ఆయన ఆదర్శ పురుషుడు. ఆ మానవతామూర్తి చరిత్ర నేటి సమాజానికి ఆదర్శం. అలనాటి శ్రీరామ పాలన ఎందుకు అంత సుభిక్షంగా ఉందో నేటి పాలకులు తెలుసుకోవాలి.
ప్రస్తుతం మనం పాలనాపరంగా అనేక సమస్యలను ఎదుర్కొం టున్నాం. గృహ స్థాయి, పంచాయతీ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఈ సమస్యలు వికృత రూపాన్ని ధరించి మానవజాతి అభ్యున్నతికే గొడ్డలి పెట్టుగా తయారవుతున్నాయి. సమాజంలోని అన్ని ప్రధాన వ్యవస్థలు, పారిశుద్ధ్యం, వైద్యం, విద్య, ఉద్యోగం, మానవ సంబంధాలు.. ఇలా అన్నీ లోపభూయిష్టంగానే కొనసాగుతున్నాయి. కారణం బాధ్యతా రాహిత్యం. ఎవరికి వారు తమ ధర్మాలను నెరవేర్చకపోవడం, ఎవరి ధర్మాలను వారు సక్రమంగా ఆచరిస్తే నిజానికి ఏ సమస్యలూ తలెత్తవు. పాలకులు తమ పదవిని, హోదాను అనుభవించేదిగా, భోగాలను సమ కూర్చేదిగా భావిస్తున్నారు. విధి నిర్వహణలో తగిన శ్రద్ధను చూపక పోవడం, ఆశ్రితులు, బంధువర్గం ఆనందమే పరమావధిగా భావించి సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారు. సమస్యకు శాశ్వతమైన పరిష్కారాన్ని ఆలోచించక తాత్కాలికంగా పరిష్కా రాన్ని కనుగొని సంతృప్తి చెందుతున్నారు. ప్రస్తుత పాలన తీరు ఇలా ఉంది.

రాముని పాలన ఎలా ఉండేది?

శ్రీరాముని పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు.
ప్రజలంతా ధర్మబద్ధంగా జీవించారు.
ప్రజలు తమలో తమకు స్పర్థలున్నా.. రాముడికి ఎక్కడ బాధ కలుగుతుందోనని వాటిని బయట పెట్టలేదు.
స్త్రీలకు వైధవ్య దు:ఖం లేదు.
దుష్ట మృగాల వల్ల కానీ, వ్యాధుల వల్ల కానీ ప్రజలు బాధపడలేదు.
దొంగలు లేరు. ఎవరికీ కీడు జరగలేదు.
ప్రతి ఒక్కరు భార్యబిడ్డలతో ఆనందంగా కలకాలం గడిపారు.
అనారోగ్యం, అపరిశుభ్రత రాముని రాజ్యంలో లేవు. ఎవరూ దుర్మరణం పాలు కాలేదు.
ప్రజలంతా ఆయనను దేవుడనుకునే స్థాయిలో ఆయన పాలన సాగించారు.
రాముని పాలనలో జనులంతా ధర్మనిరతులై, ధర్మపరాయణులై, సత్యవాదులై శుభ లక్షణ సంపన్నులై ఉన్నారు.
అందుకే రాముడు, రాముని రాజ్యం మనకు ఎప్పటికీ ఆదర్శం.

రాముని పాలన ధర్మాలు..

ప్రజా పాలకుడు ఎలా ఉండాలో భరతుడికి రాముడు బోధించాడు.
తక్కువ సాధనాలతో ఎక్కువ ఫలితాలను సాధించే పనులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రారంభించాలి. అలసత్వం పనికిరాదు.
వేయి మంది మూర్ఖుల సలహాలతో పని చేయడం కంటే ఒక్క తెలివిగల పండితుని సలహాతో కార్య నిర్వహణ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందగలం.
మేధావి, శూరుడు, ఆలోచనలో సమర్థుడు, నీతి శాస్త్ర పండితుడు అయిన ఒక్క మంత్రి వల్ల రాజ్యాన్ని అభివృద్ధి పథంలో నడపవచ్చు.
అపరాధులను తీవ్రంగా దండించరాదు. వారు చేసిన తప్పులను తెలుసుకుని మంచివారుగా మారే విధంగా పరివర్తన తీసుకురావాలి.
ప్రజలపై అనవసరమైన పన్నులను విధించి, బలవంతంగా వసూలు చేయరాదు.
ప్రభుత్వానికి ప్రజలు చెల్లించాల్సిన పన్నులు వారికి భారం కారాదు.
చెప్పుడు మాటలను విని మన శ్రేయస్సు కోరే సన్నిహితులను కోల్పోరాదు.
పాలకుల వద్ద కుటిల స్వభావులు, చాడీలు చెప్పే వారు, స్తోత్రం చేసే వారు చేరతారు. వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
పాలనకు సంబంధించిన ప్రణాళికలను ఒంటరిగా ఆలోచించి చేయకూడదు. అలాగే చాలామందితోనూ ఆలోచన చేయరాదు.
ఒంటరిగా ఆలోచిస్తే.. ఆలోచనలోని మంచిచెడులు తెలియవు. అందరితో కలిసి ఆలోచిస్తే ప్రణాళికలపై ఐకమత్యం కుదరదు. అందుకే కొంతమందితో మాత్రమే ఆలోచన చెయ్యాలి.

Review రామ ధర్మం… మా’నవ’ ధర్మం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top