..బలిమితో పాలైనా తాగించలే

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం..

గుడ్డి కన్న మెల్ల మేలు
అసలేమీ లేని దాని కన్నా, ఏదో ఒకటి, ఎంతో కొంత ఉండటం మంచిదని చెప్పే సందర్భంలో వాడే సామెత ఇది. ఈ సామెతను అటు సానుకూల దృక్పథంగానూ, ఇటు ప్రతికూల దృక్పథంగానూ కూడా ప్రయోగిస్తుంటారు. ఉదాహరణకు ఒక పేదవాడు చెప్పులు లేకుండా నడిచి వెళ్తున్నాడనుకుందాం. దారిలో అసలు కాళ్లు లేని వ్యక్తి ఎదురైతే.. అతని కంటే తానే మెరుగని అనుకునే సందర్భంలో, అలాగే, సంపద కానీ, మరేదైనా కానీ అసలేమీ లేని దాని కన్నా ఎంతో కొంత ఉంది, ఉన్న దాంతో తృప్తి పడి ఉందామనే భావనలో ఈ సామెతను ఉపయోగిస్తుంటారు.

ఆవును చంపి చెప్పులు దానం చేసినట్టు..
కొంతమంది తెలిసి తెలిసి అనేక తప్పులు చేస్తారు. చెడు మార్గంలో నడుస్తారు. తప్పని తెలిసినా తమ ధోరణిని, స్వభావాన్ని మార్చుకోరు. మార్చుకోవడానికి ప్రయత్నించరు కూడా. పైగా ఆ తప్పులు, పాపాలు పోవడానికంటూ గుళ్లూ గోపురాలు తిరుగుతారు. అలా చేయడం ద్వారా తాము చేసిన నేరాలు, తప్పులు, పాపాలు అన్నీ పటాపంచలైపోతాయనేది అటువంటి వ్యక్తుల విశ్వాసం. కానీ అసలు నిజం వేరే ఉంది. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరు ఏ తప్పు చేసినా దానికి తగిన శిక్ష అనుభవించి తీరాల్సిందే. నిజానికి గోవును చంపడం మహా పాపం. కానీ, దానిని చంపి, ఆ పాపం పోవడానికి చెప్పులు దానం చేసినా, మరే పూజాదులు జరిపినా ఆ పాపం పోదు కదా! తప్పులు చేసి గుళ్లూ గోపురాలు తిరుగుతూ వాటిని పోగొట్టుకోవాలనుకునే వారిని, స్వల్ప ప్రయోజనం కోసం ఇతరులకు గొప్ప నష్టం కలిగించాలని చూసే వారిని ఉద్దేశించి ఈ సామెతను వాడుతుంటారు.

చెలిమితో చేదైనా తినిపించవచ్చు కానీ బలిమితో పాలైనా తాగించలేము..
బల ప్రయోగం అన్నిసార్లూ పనికి రాదని, సామరస్యం, సంయమనంతోనే అన్ని పనులనూ సానుకూలంగా మార్చుకోగలమనే జీవిత సత్యాన్ని ఈ సామెత తెలియ చెబుతుంది. మనం మన నిత్య జీవితంలో ఏ పనినైనా, ఇతరులతో మెలిగే విషయంలోనైనా మనం సత్ప్రవర్తనతో ఉండటం ద్వారా మాత్రమే అవతలి వారి నుంచి అవసరమైన సాయం, లబ్ధి పొందగలం. అంతేతప్ప బలవంతంగా అవతలి వారి నుంచి ఏదీ పొందలేం. ఒకవేళ పొందాలని చూసినా అది దౌర్జన్యం కిందకు వస్తుంది. మంచితనంతో ఉంటే ఏ పనినైనా సాధించవచ్చు అని చెప్పేటందుకు ఈ సామెతను విరివిగా వాడుతుంటారు.

అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేయడం
దొంగలకు, నైతికత లేనివారికి విలువలంటూ ఏమీ ఉండవు. తమకు సాయం చేసిన వారికే మోసం తలపెట్టడానికి కూడా వెనుకాడరు. ఒక దొంగకు మంచి మాటలు చెప్పి, అన్నం పెట్టి పంపిస్తే.. తిరిగి అతని బుద్ధి వక్రించి తనకు అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేయడానికి ఏమాత్రం సంకోచించడు. ఎందుకంటే అది అతని స్వభావం. అలాగే, కొందరు చేసిన మేలు మరిచిపోతుంటారు. తమకు ప్రయోజనం కలిగించిన వారికే తమ స్వలాభం కోసం నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తారు. అది వారి స్వార్థానికి ప్రతీక. అటువంటి వారిని ఉద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు. ఉపకారికి అపకారం చేయడాన్ని, అటువంటి సందర్భాలను ఈ సామెతతో సరిపోల్చుతారు.

Review ..బలిమితో పాలైనా తాగించలే.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top