మనం ఏ కార్యం నిర్వహించాలన్నా మూడు శక్తులు అవసరం. అవి-
పని చేయడానికి సంకల్పం- ఇచ్ఛాశక్తి,
సంకల్పం కార్యరూపం దాల్చడానికి- క్రియాశక్తి,
కార్యనిర్వహణా విధానానికి- జ్ఞానశక్తి.
ఈ మూడు శక్తులకు మూలం ఆదిపరాశక్తి. అమ్మకు చెందిన ఈ మూడు శక్తులూ మన ద్వారా వ్యక్తమైనప్పుడే మనం ఏ కార్యాన్ని అయినా సాధించగలం. కానీ, అమ్మ అనంత శక్తితో మనల్ని మనం అనుసంధానం చేసుకోలేక, అజ్ఞానానికి లోనై మన శక్తియుక్తుల వల్లనే అన్నీ సాధ్యమవుతున్నాయని భ్రమిస్తున్నాం. జగన్మాత సంకల్పం లేకుండా గడ్డిపోచ కూడా కదలదు అన్న సత్యాన్ని గ్రహిస్తేనే మనం మన పనుల్లో సఫలీకృతులం కాగలం. ఈ విశ్వాన్ని పాలించే జగన్మాత మహామాయ ప్రభావం వల్ల మానవులు మమత అనే సుడిగుండంలో పడి కొట్టుకుపోతున్నారు. మోహమనే లోయలో పడి కొట్టుకుంటున్నారు. అయితే, జ్ఞాన స్వరూపిణి అయిన ఆ జగన్మాతను శరణు వేడితే మోహపాశాలను తొలగించి ముక్తిని ప్రసాదిస్తుంది. ఇటువంటి మాయ వల్లనే ఇంద్రాది దేవతలు తమ విజయాలకు కారణం తమ శౌర్య ప్రతాపాలు, ప్రతిభే కారణమని భ్రమించినప్పుడు, జగన్మాత వారికి పట్టిన మాయను వదిలించి వారికి కనువిప్పు కలిగించిన కథ ఒకటి ‘కేశోపనిషత్’లో ఉంది. జగన్మాతను శరణు వేడితే మోహపాశాలను తొలగిస్తుంది. మోక్షద్వారాలను తెరిచే జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదిస్తుంది. విశ్వేశ్వరి అనుగ్రహంతో మనం విశ్వారాధ్యులం కావాలి. అమ్మ ఆరాధనకు ప్రతీ క్షణమూ అనువైనదే. అను క్షణమూ మనకు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రసాదించాల్సిందిగా జగన్మాతను ప్రార్థిద్దాం.
మోక్ష సామ్రాజ్యానికి అర్హతను సాధిద్దాం.
Review అమ్మ.. భక్తికి తలవంచే పూలకొమ్మ...