శ్రీకృష్ణదేవరాయల సాహితీ మండపం పేరే భువన విజయం అని చెప్పుకున్నాం కదా! అది పాండిత్యంతో పాటు శృంగార సాహితీ పక్రియలకు కూడా ఎక్కువగా వేదికవుతూ ఉండేది. ముఖ్యంగా శృంగారభరితంగా ఉండే ధూర్జటి వారి కవిత్వాన్ని రాయల వారు ఎక్కువగా ఇష్టపడేవారు. ఆయనను పొగడ్తలతో ముంచెత్తే వారు. ఇదంతా మిగతా కవులకు చిన్నతనంగా ఉండేది. అవమానంగా కూడా భావించే వారు. ఈ పరిస్థితిని ఎలాగైనా చక్కదిద్దాలని మిగతా కవులంతా తెనాలి రామకృష్ణుడిని కోరారు.
ధూర్జటి గారు ‘కాళహస్తీశ్వర శతకం’ రచించిన మహా పండితుడు. ఆయన నొసటన విభూది రేఖలతో, మెడలో రుద్రాక్షలతో సాక్షాత్తూ శంకరుడి వలే సభకు విచ్చేసే వారు. అంత పెద్దవయసులో, అటువంటి శృంగారాన్ని ఆయన ఎలా రచిస్తున్నారా? అని మిగతా వారంతా అసూయ పడేవారు. అనుభవం లేనిదే అటువంటి రసికతను కవిత్వంలో గుప్పించడం సాధ్యం కాదని కూడా వారంతా అనుకునే వారు. రామకృష్ణుడు కూడా అలాగే ఆలోచించాడు. మెల్లగా ధూర్జటి గారి గురించి ఆరా తీయడం ప్రారంభించారు.
రామకృష్ణుడి ఆరాలో, ధూర్జటి గారు వేశ్యాలోలుడని, కట్టుకున్న భార్య ముఖమయినా చూడడని తెలిసింది. ధర్మపత్నిని అలా నిర్లక్ష్యం చేస్తున్నందుకు ధూర్జటికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని రామకృష్ణుడు నిర్ణయించుకున్నాడు. ఆయన సంసారాన్ని చక్కదిద్దడంతో పాటు రాయల వారి వద్ద ఆయన పాండితీ ప్రకర్షను తక్కువ చేయడం.. ఒక దెబ్బకు రెండు పిట్టల్లా ఈ పని చేయాలనుకున్నాడు.
ఒకనాటి రాత్రి ధూర్జటి భోజనం చేసి, తన ముఖం కనిపించకుండా శాలువాను ముసుగు వేసుకుని వడివడిగా వేశ్యా గృహంలోకి వెళ్లడం రామకృష్ణుడి కంటపడింది. వెంటనే అతను ఒక ప్రణాళిక ఆలోచించి, మరునాడు చీకటి పడుతున్న సమయానికి దూర దేశం నుంచి వచ్చిన బ్రాహ్మణుడి వేషం వేసుకుని, ఆ వేశ్యా గృహం అరుగు మీద పడుకున్నాడు రామకృష్ణుడు. ఆ వేశ్య అది గమనించి, ఆ బ్రాహ్మణుడిని పలకరించింది. కప్పుకోవడానికి దుప్పడానికి దుప్పటి, పడుకోవడానికి చాప ఇచ్చింది లోనికి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి ధూర్జటి రహస్యంగా వచ్చి ఆ వేశ్యా గృహంలోకి దూరాడు. పని ముగించుకుని తెల్లవారుజామున తన ఇంటికి వెళ్తున్న ధూర్జటిని, ఆ ఇంటి అరుగుపై పడుకున్న బ్రాహ్మణుడి వేషంలోని రామకృష్ణుడు ‘తాతయ్య గారూ! వేశ్యా గృహం నుంచి వచ్చుచున్నారే’ అని పలకరించాడు.
ధూర్జటి తెల్లబోయి, ‘ఈ విషయం ఎవరికీ చెప్పకు. ఈ రహస్యం ఎక్కడా పొక్కనీయకు నాయనా! నీకు పుణ్యం ఉంటుంది’ అని ఆ బ్రాహ్మణుడి చేతులు పట్టుకుని బతిమలాడాడు.
ఆ బ్రాహ్మణుడు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరునాడు బితుకు బితుకుమంటూ భువన విజయానికి వచ్చాడు ధూర్జటి. ఆయన రావడంతోనే శ్రీకృష్ణదేవరాయలు ఆయనను పొగడటం ప్రారంభించారు.
‘జవచ్యుతుడైన యాంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గెనో
యతులిత మాధురీ మహిమ..’
(జవసత్వాలు ఉడిగిన ధూర్జటి పదాలకు అంతటి మాధుర్యం ఎలా కలిగిందో.. అనేది పై పద్యానికి భావం).
రాయల వారు పై పద్యం రెండు చరణాలు చదివి ఎందుకో కొద్దిగా విరామం ఇచ్చారు. అలా విరామం ఇచ్చి ఆయన సభ వైపు చూశారు.
సరిగ్గా, ఆ క్షణంలోనే తెనాలి రామకృష్ణుడు లేచి,
… హా తెలిసెన్ భువనైక మోహనోత
ధృవ సుకుమార వారవనితా జనితా ఘనతా పహార
సుధారస ధార గ్రోలుటన్ జుమీ’ అని అందుకున్నాడు.
‘జగదేక సుందరులు, సుకుమారులు, యవ్వనవతులు అయిన వేశ్యల అధరసుధలను నిత్యం గ్రోలడం వల్లనే ధూర్జటి పదాలకు అంత మాధుర్యం వస్తోంద’ని పై పద్యానికి భావం.
ఈ విధంగా రాయల వారు మధ్యలో ఆపేసిన పద్యాన్ని మిగతా పదాలతో రామకృష్ణుడు పూరించాడు.
రాయల వారికి ఏమీ అర్థం కాలేదు. సభలోని వారికి కూడా అయోమయంగా అనిపించింది.
‘అసలు విషయం ఏమిటి వికటకవీ?’ అని రాయల వారు అడిగారు.
అప్పుడు రామకృష్ణుడు ధూర్జటి గారి వేశ్యాలోలతను, భార్యను నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్నీ, క్రితం రాత్రి తాను ధూర్జటి వేశ్యా గృహం నుంచి వస్తుండగా పట్టుకున్న సంగతినీ పూస గుచ్చినట్టు సభలో వివరించాడు.
ధూర్జటి సిగ్గుపడుతూ తలదించుకున్నాడు.
వెంటనే రాయల వారు తన ఏకాంత మందిరంలోకి ధూర్జటిని పిలిపించుకున్నారు. భార్యను, సంసారాన్ని నిర్లక్ష్యం చేయడంపై గట్టిగా మందలించారు. ఇంత ముదిమి వయసులో అంత వేశ్యాలోలత పనికిరాదని హితవు చెప్పారు.
అప్పటి నుంచి ధూర్జటి శృంగార పద్యాలకు స్పందించడం మానేశారు రాయల వారు. అతనినిం
ప్రశంసించడం మానేశారు.
ధూర్జటికి తిక్క కుదిర్చిన, శృంగార కవిత్వంలో తనంత వారు లేరనే గర్వాన్ని అణచిన రామకృష్ణ కవికి మిగతా కవులు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
Review ధూర్జటి గారి గర్వం.