ఔషధాలకు పుట్టినిల్లు తెలుగు లోగిళు

తరతరాల వారసత్వ సంపద..
‘తెలుగు వైద్యం’. చిట్కా వైద్యంగా, వంటింటి
కిటుకులుగా ఈనాటికీ గ్రామీణ జీవితానికి ప్రాణం
పోస్తోందీ వైద్యం. ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని దీనికి
మేళవిస్తే ఇది మరింత వన్నెసంతరించుకుంటుంది. మన పాటలు, ఆటలు అన్నింటా తరచి చూస్తే ఎన్నో వైద్య
రహస్యాలు కనిపిస్తాయి.

మన తెలుగు వారికి వైద్యం అనేది అరచేతిలో ఉసిరికాయ వంటిది. తరతరాలుగా తెలుగునాట జరుగుతున్న ఉత్సవాలు, పండుగలు, పబ్బాలు.. అన్నిటిలో ఆరోగ్య రహస్యాలు దాగి ఉండటం వల్లనో ఏమో చాలా వరకు చిట్కా వైద్యం చాలామందికి తెలిసి ఉంటుంది. ఉదాహరణకు ఏ కూరగాయలు తరుగుతున్నప్పుడో వేలు తెగిందనుకోండి.. వెంటనే పసుపు వేసి గాయానికి కట్టు కట్టేస్తారు. దెబ్బకు రక్తం గడ్డకట్టి పోతుంది. నిజానికి వైద్యం అనేది తెలియని రోజుల్లోనే సమాజం తన బతుకుబాటను ముందుకు నడిపించు కోవడానికి అనేక పద్ధతులను అనుసరిస్తూ వచ్చింది. అవే చిట్కా వైద్య విధానాలుగా, కిటుకులుగా చలామణిలో నేటికీ ఉన్నాయి.
నాటి జానపదులకు ఎన్నెన్నో ఔషధ పక్రియలు, ఔషధ మూలికలపై అవగాహన ఉండేది. ఇప్పటికీ ఇంట్లో పెద్దతరానికి చెందిన పూర్వీకులు ఎన్నెన్నో చిట్కా వైద్యాలతో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల్ని చిటెకెలో చక్కదిద్దగల నేర్పు కలిగి ఉంటారు.
ఇక, ఔషధ, వైద్య పక్రియలు మన బతుకుబాటలో ఒక భాగమని చెప్పేందుకు ఎన్నో జానపద గీతాలు నిదర్శనంగా నిలుస్తాయి. ఒక జానపదాన్ని పరిశీలించండి..
కాళ్లాగజ్జె కంకాళమ్మా
వేగూచుక్కా వెలగా మొగ్గ
మొగ్గా కాదు మోదుగ నీరు
నీరూ కాదు నిమ్మలవాయు
వాయూ కాదు వాయింటకూర
కూరా గాదు గుమ్మడి పండు
పండూ కాదు పావడ మీసం
మీసం కాదు మిరియాల పోతు
పోతూ కాదు ••మ్మలశెట్టి
శెట్టి కాదు శామల మన్ను
మన్నూ గాదు మంచి గంధం చెక్క
లింగులిటుకూ పందెమాల పటుకు
కాలు పండినట్లు కడకుదీసిపెట్టు
నిజానికి తెలుగునాట ఆడపిల్లలు ఆలవోకగా పాడుకునే పాట ఇది. ఈ పాటలోని పదాలను, అందులోని అర్థాలను తరచి చూస్తే ఎన్నెన్నో ఔషధ రహస్యాలు దాగి ఉన్నాయని తెలుస్తుంది. ఈ పాట క్రమాన్ని, అందులోని పదాల అర్థాన్ని ఈ జానపద పాటను సేకరించిన ఆచార్య బిరుదురాజు రామరాజు తిరుమల రామానుజస్వామి నుంచి సేకరించి మరీ మనకు అందిస్తున్నారు.
పైజానపద గేయంలో పేర్కొన్నవన్నీ తెలంగాణలో స్థానికంగా ఉన్న పేర్లు. కంకాళమ్మ అంటే కచ్చూరాయి. వేగుల చుక్క.. బావంచాలు. వెలగమొగ్గ.. పాదరసం. ఈ మూడింటితో తయారు చేసిన లేపనం చర్మవ్యాధిని తగ్గిస్తుందని భావార్థం.
పాదరసానికి బదులు మోదుగ చెట్టు నీరు, వాయింట కూర, గుమ్మడి పండు.. ఇలా ప్రత్యామ్నాయంగా ఏది దొరికినా వాడుకోవడానికి మరో తొమ్మిది మూలికల్ని ఇదే గేయంలో వరుసగా ప్రస్తావించారు. తరతరాల తెలుగు వైద్యానికి ఈ గేయమే ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు.
మందులు మాకుల గురించి తెలుగువారికి అనాదిగా ఎంతోకొంత పరిచయం ఉందని నాటి జానపద గేయాల ద్వారా తెలుస్తోంది. ఉదాహరణకు తెలుగునాట జరిగే అన్ని ఉత్సవాల్లో, ప్రధానంగా జాతర సందర్భాల్లో వేపమండలు, పసుపు నీళ్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. పండుగలు, పర్వదినాల సందర్భాల్లో కళ్లాపి నీళ్లు చల్లుతారు. ఆవు పేడతో ఇల్లంతా అలికి ముగ్గులు పెడతారు. సాంబ్రాణి ధూపాలు విరివిగా వేస్తారు. ఇవన్నీ సూక్ష్మక్రిముల్ని తరిమికొట్టే చర్యలే. ఇంకా చెప్పాలంటే పేడనీళ్లతో కళ్లాపి చల్లడం, ముగ్గులు పెట్టడం వంటివన్నీ పల్లెటూరు వాసుల రోజువారీ వ్యవహారాల్లో ఒక భాగం.
అంగారపొలియ.. కృశిర
మన తెలుగు కవులు, కావ్యకర్తల సాహిత్య సృష్టిలోనూ ఔషధ గుణాలు ప్రతిఫలిస్తాయి. శ్రీనాథుడు ‘కాశీఖండం’లో చెప్పిన ఆహార పదార్థాల్లో ‘అంగార పొలియ’ ఒకటి. దీనిని తయారు చేసే విధానం గురించి ‘యోగరత్నాకరం’ అనే గ్రంథంలో కనిపిస్తుంది. గోధుమపిండిలో పంచదార, నెయ్యి కలపాలి. రెండింటిని బాగా పిసికి నిప్పుల మీద కాల్చిన తరువాత రొట్టెగా మారింది అంగారిక. ఇదొక తీపి తందూరీ రోటీ. ఇంకా ‘యోగ రత్నాకరం’లో రసం/చారు గురించి ఆసక్తికరమైన ప్రస్తావన చమత్కాయుక్తంగా కనిపిస్తుంది. తమిళనాట సాంబారు ఎంత ప్రసిద్ధో తెలుగింట రసం అంతే ప్రసిద్ధి. సాంబారు వడ్డించినా, పెళ్లి విందుల్లో వెనుకే చారు కూడా వస్తుంది. భోజన పదార్థాల్లో సారభూతమైనది కాబట్టే దీనిని ‘సారం’ అన్నారు. అదే తెలుగు వారి నోళ్లలో పడి ‘చారు’ అయింది. ‘కృశర’ అనే మరో వంటకం గురించి కూడా ఇక్కడే ప్రస్తావించుకోవాలి. ప్రస్తుతం ఇది అంతగా వ్యవహారికంలో లేదు. పైగా దీని గురించి మన తెలుగు వారికి, అదీ ఇప్పటి తరం వారికి అంతగా తెలియదనే చెప్పాలి. ముత్యాల్లా తెల్లగా ఉండి కొనలు విరగని బియ్యాన్ని, దానికి నాలగో రవంత పొట్టు తీసి ఎండించిన తెల్లని ఛాయ మినపప్పుని కలుపుతారు. నీళ్లు పోసి ఉడికించి అదే సమయంలో ఇంగువ, ఉప్పు, అల్లం, నెయ్యి కలిపితే ‘పులగం’ తయారవుతుంది. ఇదే ‘కృశర’. తమిళులు పెసర పులగాన్ని ‘కట్టుపొంగలి’ అంటారు. మనది మినప పులగం. ఒకప్పుడు తెలుగు వారికి ఇది అత్యంత ఇష్టమైన ఆహార పదార్థం. ఇది చాలా బలవర్థకమైన ఆహారం.
ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది.
మరో గేయంలోని ఒక పాదాన్ని పరిశీలిద్దాం.
ఒప్పులకుప్పా వయ్యారి భామా
సన్నబియ్యం ఛాయా పప్పు
పాలూ నెయ్యిడి పాశం వొండూ
నీ మొగుడు దింటే ఆనందమంటే
..ఈ గేయం కూడా తెలుగు నాట చాలా ప్రసిద్ధి పొందినది. సన్న బియ్యం, ఛాయ మినపప్పు కలిపి వండిన పాయసంలో నెయ్యి బాగా వేస్తే పుంసత్త్వం పెరుగుతుందని అర్థం.
‘చెమ్మ చెక్కా చారడేసి మొగ్గ’ వంటి ఆటపాటల్లోనూ మన ఊహకు అందని వైద్య రహస్యాలేవో నిక్షిప్తమై ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఔత్సాహికులైనవారు ఈ జానపద సంపదపై పరిశోధన సాగిస్తే మరిన్ని వైద్య రహస్యాలు బయటపడతాయి. ఇదే సందర్భంలో ఒక చాటు పద్యం గురించి కూడా ప్రస్తావించుకోవాలి.
‘దయగొని దర్భసూచి కుటితంబగు మూతికి గారతైలమున్‍..’ అనే చాటువుకు అర్థం- ‘గార చెట్టు నుంచి తీసిన తైలాన్ని కుష్ఠు వ్యాధి పీడిత శరీర భాగాలపై రాయాలి’.
మన తెలుగు సామెతల్లో కూడా కొన్ని వైద్యపరమైన చిట్కాలున్నాయి.
‘కాళ్లకు రాసుకుంటే కళ్లకు చలువ’ అనేది ఒక నానుడి. వేడి చేసినప్పుడు కళ్లు మండటం సహజం. అప్పుడు అరికాళ్లకు ఆముదాన్ని మర్దన చేస్తే కళ్లకు పట్టిన వేడి తొలగిపోతుంది.
తెలుగు నేలతో పోర్చుగీసు వారికి అనుబంధం ఉంది. ఒకప్పుడు వారు మన గడ్డపై అడుగు పెట్టారు. వీరిని తెలుగు వారు అప్పట్లో ఫిరంగులు, ఫరంగు దేశీయులని పిలిచేవారు. మిరప కాయలు, పొగాకు.. వీటితో పాటు సిఫిలిస్‍ వ్యాధినీ పోర్చుగీసువారు మన గడ్డపైకి వెంట బెట్టుకుని వచ్చారు. ఫరంగుల కారణంగా వచ్చిన వ్యాధి కాబట్టి ఫ(ఫి)రంగ అనే పేరు స్థిరపడింది. నిజానికి ఈ పేరును స్థిరపరిచింది ‘భావప్రకాశ’ అనే ఆయుర్వేద గ్రంథం. రసకర్పూరంతో ఈ వ్యాధికి చేసే చికిత్సను కూడా ఈ గ్రంథంలో వివరించారు. ఫిరంగి చెక్క అనే కొత్త వనమూలికను కూడా ఈ చికిత్స కోసమే పోర్చుగీసుల నుంచి పొందారు మన తెలుగువారు. అప్పట్లో తెలుగునాట ప్రసిద్ధి పొందిన ఆయుర్వేద వైద్య గ్రంథాలు అనేకం ఉండేవి. యోగరత్నాకరం, వైద్య చింతామణి, బసవరాజీయం, శరభరాజీయం వంటివి వీటిలో ముఖ్యమైనవి. వీటిలో యోగ రత్నాకరం మరీ అత్యుత్తమ జీవన విధానానికి ఉపకరించే యోగాలెన్నిటినో వివరించింది. అవన్నీ దాదాపు ఔషధ పక్రియల కిందకే వస్తాయి. నిజం చెప్పాలంటే ఆధునికత పెరిగిన ఇప్పటి కంటే ఏమీ తెలియని అప్పట్లోనే తెలుగులో విజ్ఞాన వైజ్ఞానిక గ్రంథాలు, పుస్తకాలు ఎక్కువ వెలువడేవి. ఇప్పుడంతా వినోదం పేరుతో సాహిత్యం వెల్లువెత్తుతోంది. తరతరాల వారసత్వ సంపదగా వస్తున్న ‘తెలుగు వైద్యం’ ప్రాముఖ్యతను గుర్తించడం, ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని తెలుగులోకి మరింతగా తెచ్చుకోవడం.. మన తక్షణ కర్తవ్యం. ఈ దిశగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని మేధావులు, విద్యావంతులు కంకణబద్ధులు కావాలి. అప్పుడే మన ఆరోగ్యానికి మనదైన వైద్యం రక్షణగా నిలుస్తుంది. •

Review ఔషధాలకు పుట్టినిల్లు తెలుగు లోగిళు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top