కవర్‍ స్టోరీ

దేవదేవుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వీడి భూలోకానికి వేంచేశాడు. వస్తూ వస్తూ వైకుంఠంలో ఉండే కొండలనూ, కోనలనూ, తీర్థాలనూ వెంట తెచ్చుకున్నాడు. తన దేవేరులైన శ్రీదేవి, భూదేవితో పాటు సేవకులైన గరుత్మంతుడు ఇతర పరివారమంతా ఆయన వెంటే ఉన్నారు. ఆ దేవదేవుడు నేరుగా సప్తగిరులలో అడుగిడాడు. అదిగో! అదే శ్రీహరివాసమైంది. ఆ స్వామి ఈ భూలోకంలో ఏరికోరి.. అదీ తెలుగింటి నేలపై ఇల్లు (ఆలయం) గుడి కట్టుకుని.. తెలుగువారి ఇంటింటి ఇలవేల్పుగా అవతరించాడు. వైకుంఠంలో తిరుమలేశుడిది మహా సంస్థానం. అదే ఇక్కడా భూలోక వైకుంఠంగా, ఆ పరంధాముని దివ్యధామంగా విరాజిల్లుతోంది.
శ్రీవేంకటేశ్వరుడు వైకుంఠం నుంచి దిగి వచ్చినది మొదలు తెలుగు అర్చకస్వామి గోపీనాథ దీక్షితులు వైఖానసాగమ శాస్త్ర ప్రకారం అర్చనలు, ఉత్సవాలు నిర్వహించడం ప్రారంభించారు. ఆనాటి నుంచి ఆ వైఖానస దీక్షితుల వారి వంశీయులే తరతరాలుగా తిరుమలేశుడికి అర్చనాది పూజా వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. ఇదంతా సరే!
మనమంతా ఉగాది పర్వం నాడు షడ్రుచుల పచ్చడిని ఇష్టదైవానికి నివేదించి.. ఆనక మనమూ స్వీకరించి.. తెలుగు వారి తొలి పండుగ నాడు జీవితంలోకి కొత్త ఆశలను ఆహ్వానిస్తాం. పంచాంగ శ్రవణం చేస్తాం. జాతకాది ఫలాలు తెలుసుకుంటాం. మరి వేంకటేశ్వరుడు కూడా ఉగాది పర్వాన్ని వైభవోపేతంగా జరుపుకుంటాడని తెలుసా? శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని మార్చి 19న శ్రీవారికి ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. ఆ పర్వాన్ని మానవమాత్రులెవరూ తిలకించే అవకాశం లేదు. మరి అంతటి భాగ్యానికి నోచుకోకపోయినా.. వేంకటపతి సన్నిధిలో నిర్వహించే ఉగాది పండుగ వేడుక ఎలా జరుగుతుందో చదివి తెలుసుకుని దాన్ని మనోనేత్రంతో దర్శించవచ్చు.
తెలుగింటి ఇలవేల్పు అయిన శ్రీవేంకటనాథుడికి తెలుగు వారి సంప్రదాయాల ప్రకారమే పూజాధికాలు, ఆలయ ఆచారాలను నిర్వర్తిస్తారు. మనకు ఉగాది పండుగ నుంచే కొత్త జీవితం ప్రారంభమైనట్టు.. శ్రీవారికీ ఉగాది పండుగ నాటి నుంచే ఉత్సవాలు, వేడుకలు, ఊరేగింపులు ప్రారంభమవుతాయి. మళ్లీ వచ్చే ఉగాది ముందు రోజు నాటికి ఇవన్నీ పూర్తవుతాయి.
పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని మార్చి 19, 2026, గురువారం నాడు తిరుమల శ్రీవారి ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఆనాటి నుంచే తిరుమల శ్రీవారి నిత్యోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల క్రమంలో ముందుగా నిర్వహించే ఉత్సవం- ‘తిరుమలేశుడి ఉగాది పండుగ వేడుక’. దీనినే ఉగాది కొలువు అనీ, ఉగాది ఆస్థానం అనీ అంటారు.
ఈ ఉగాది పండుగ వేడుక స్వామి వారి బంగారు వాకిలి ముందు ఉన్న తిరుమహామణి మండపం (ఘంటా మండపం)లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
కేవలం శ్రీవారి అర్చక స్వాములు, జియ్యంగార్లు, ఏకాంగులూ, వేదపండితులు, దేవస్థానం ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, తిరుమల ఆలయ సిబ్బంది మాత్రమే పాల్గొన దర్శించగలిగిన అదృష్టం.
ఆ ఆనంద నిలయుడి ఉగాది ఆస్థానం వేడుకలను ఇతర భక్తులు ఎవరూ దర్శించడం వీలు కాదు గాక కాదు. అంతేకాదు, ఆ వేడుకను చిత్రీకరించడం కూడా నిషిద్ధం. మరి ఇటువంటి పరిస్థితుల్లో తిరుమలేశుడి సన్నిధిలో జరిగే ఉగాది వేడుకను ఊహామాత్రంగా మననం చేసుకుంటే చాలు.. మనోఫలకంపై అది ప్రతిఫలిస్తుంది. ఆ వేడుక ఎలా జరుగుతుందంటే..
ఏకాంతంగా తిరుమంజనం
ఉగాది రోజున శ్రీవారి ఆలయంలో సుప్రభాతం, తోమాల సేవ జరిగిన తరువాత ఉభయ దేవేరులతో శ్రీమలయప్పస్వామికి, శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడికి ఏకాంతంగా తిరుమంజనం (అభిషేకం) నిర్వహిస్తారు. ఒకవేళ శుక్రవారం నాడే ఉగాది వస్తే శ్రీవేంకటేశ్వరస్వామి వారి మూలమూర్తికి ఆనాటి తెల్లవారుజామునే శుక్రవార అభిషేకం జరుగుతుంది. కానిపక్షంలో ఉగాది నాటికి ముందు వచ్చిన శుక్రవారం నాడే అభిషేకం అయిన తరువాత శ్రీవారి మూర్తిని విశేషమైన వజ్రాలు పొదిగిన కిరీటం, శంఖచక్రాలు, వరద, కటి హస్తాల కవచాలతో అలంకరిస్తారు. ఈ విశేషాలంకరణలో ఆనంద నిలయుని మూర్తి సౌందర్యం అనుపమానం! అప్రమేయం! అద్భుతం! ఆనందమయం! సర్వార్థ సిద్దిప్రదం!. అనంతరం ఆలయంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారికి తులసీ దళాలతో సహస్ర నామార్చన, నివేదనలూ నిర్వహిస్తారు.
సర్వభూపాల వాహనుడై..
బంగారు వాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో బంగారు సర్వ భూపాల వాహనంలో శ్రీదేవి, భూదేవితో కలిసి శ్రీమలయప్ప స్వామి వారిని తూర్పు ముఖంగా బంగారు వాకిలికి ఎదురుగా ఉన్న గరుత్మంతుడికి అభిముఖంగా వేంచేపు చేస్తారు. అనంతరం పట్టు పీతాంబరాలతోనూ, వజ్ర వైడూర్య మరకత మాణిక్యాది సర్వాభరణాలతోనూ, వజ్ర కిరీటాలతోనూ, సుగంధ పరిమళభరితమైన పూలమాలలతోనూ శ్రీవారి ఉత్సవ మూర్తులను నయనాభిరామంగా విశేషరీతిలో అలంకరిస్తారు.

శ్రీవారి సేనాధిపతికి స్వాగతం..
శ్రీవారి సర్వభూపాల వాహనం పక్కనే మరొక పీఠంపైన దక్షిణాభిముఖంగా సేనాధిపతి విష్వక్సేనుడిని వేంచేపు చేసి దివ్యాభరణాలతోనూ, పూలమాలలతోనూ అలంకరిస్తారు. శిరస్త్రాణాన్ని, ఖడ్గాన్ని ధరించి అత్యంత భయభక్తులతో శ్రీవారి ఆజ్ఞలను అమలు చేయడానికి సిద్ధమై, సర్వసన్నద్ధమై ఉంటాడు శ్రీ వేంకటేశ్వరుడి సేనాధిపతి విష్వక్సేనుడు. ఆ తరువాత ఆనంద నిలయంలోని వేంకటేశ్వరస్వామి వారి మూలమూర్తికి, బంగారు వాకిలి ఎదుట ‘ఉగాది పండుగ వేడుక’కు సిద్ధంగా ఉన్న శ్రీవారి ఉత్సవమూర్తులకు, సేనాధిపతికి విశేషంగా పిండివంటలను నివేదిస్తారు.
పిండివంటల నివేదన..
శ్రీవారి అర్చకస్వాములు, పెద్ద జియ్యంగార్లు, చిన్న జియ్యంగార్లు, ఏకాంగులు, ఆచార్య పురుషులు, వేదపండితులు, దేవస్థానం కార్యనిర్వాహకులు, ఇతర అధికారులు, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు,, దేవస్థానం వారి ఆలయం పేష్కార్లు, ఆలయంలోని సిబ్బంది.. ఇలా అందరూ ఛత్ర చామరాలతో మంగళ వాయిద్యాలు మోగుతుండగా, వేద పఠనం శ్రుతి శుభగంగా పఠిస్తుండగా శ్రీవారి వంటవారు అప్పటికే సిద్ధంగా ఉంచిన విశేష వంటకాలను వంటశాల నుంచి శ్రీవారి నివేదనకు ఊరేగింపుగా తీసుకువస్తారు.
లడ్డూలు, వడలు, అప్పాలు, దోసెలు తదితర పిండివంటలూ, చక్కెరపొంగలి, మిరియపు పొంగలి, పులిహోర, దధ్యోదనం ఇతర అన్న ప్రసాదాలను విమాన ప్రదక్షిణంలో బంగారు బావి పక్కన ఉన్న వంటశాల నుంచి ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ వెండి వాకిలి ఎదురుగా బయట ఉన్న ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేస్తూ లోనికి వచ్చి ఆలయ ప్రవేశం చేసి అటు గర్భాలయంలోనూ, ఇటు బంగారు వాకిలి దగ్గర ఆస్థానంలోనూ నివేదనకు ఉంచుతారు. నైవేద్య ఘంటలు హృదయగమంగా, వీనులవిందుగా మోగుతుండగా రెండుచోట్లా ఈ విశేష నివేదన జరుగుతుంది. ఇలా రెండుచోట్లా విశేష నివేదన పూర్తయిన వెంటనే వస్త్ర సమర్పరణ అనే మరో విశేష ఘట్టం ప్రారంభం అవుతుంది.
పట్టు వస్తాల్ర సమర్పణ
నివేదనలు పూర్తయిన తరువాత విమాన ప్రదక్షిణంలో ఈశాన్య మూలలోని శ్రీయోగ నరసింహస్వామి ఆలయం పక్కన ఉన్న ‘పరిమళపు అర’ దగ్గర నుంచి పెద్ద జియ్యంగార్లు పెద్ద వెండి పళ్లెంలో మడతపెట్టి చుట్టగా చుట్టబడిన బంగారు జరీ అంచు ఉన్న ఆరు పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని ఛత్రచామర మంగళవాద్య పురస్సరంగా ముందు పంచముఖ దివిటీలు వెలుగుతుండగా, సన్నడోలు, కంచు పలక గంటలు మోగుతుండగా వేద పారాయణలు హృదయంగమంగా పఠిస్తుండగా ముందుకు సాగుతారు. వాదందరి వెంట చిన్న జియ్యంగార్లు, ఏకాంగులు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి, సంయుక్త కార్యనిర్వహణాధికారులు, దేవాలయం ఉప కార్య నిర్వహణాధికారులు, పేష్కార్లు, పారుపత్యదార్లు ఇతర ఆలయ అధికార బృందం వెంట రాగా, ఆలయం వెండివాకిలి ముందు ఉన్న బంగారు ధ్వజస్తంభానికి,
బలిపీఠానికి ప్రదక్షిణం చేస్తూ లోనికి వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ ‘బంగారు వాకిలి’ దగ్గరకు రాగా, అక్కడ బాజా భజంత్రీల వారు బంగారు వాకిలి దగ్గరే నిలిచి వాయిస్తారు. ‘సన్నిధిగొల్ల’ దివిటీతో, పట్టువస్త్రాలతో కూడిన జియ్యంగార్లును, ఇతర పెద్దలను శ్రీవారి సన్నిధి వరకు పిలుచుకుని వెళ్లి ‘కులశేఖరపడి’ వద్ద నిలుస్తాడు. జియ్యంగార్లు, ఏకాంగులు మాత్రమే అర్చకస్వాములకు పట్టువస్త్రాలను అందిస్తారు. వెంటనే అర్చకస్వాములు కులశేఖరపడి (గర్భాలయం గడప) దగ్గర తెరను వేస్తారు.
లోపల అర్చకులు జియ్యంగార్లు సమర్పించిన ఆరు పట్టువస్త్రాల్లో నాలుగింటిని శ్రీవేంకటేశ్వరస్వామి వారి మూలమూర్తికి అలంకరిస్తారు. ఒక వస్త్రాన్ని శ్రీవారి కిరీటానికి, రెండో వస్త్రాన్ని నందక ఖడ్గానికి, మూడవ వస్త్రాన్ని ఆదితోమాల గాను, నాలుగవ వస్త్రాన్ని ఉత్తరీయంగానూ అలంకరిస్తారు. అర్చకస్వామి తెరను తొలగించి శ్రీవారి దివ్యమంగళ విరాట్మూర్తికి బంగారు పళ్లెంలో పచ్చకర్పూరంతో ఆపాదమస్తకం దివ్యమంగళ కర్పూర నీరాజనం ఇచ్చి, అందరికీ చూపించగా, కులశేఖరపడికి ఇవతల ఉన్న వారందరూ భక్తితో శ్రీవారిని చూస్తూ హారతిని కళ్లకు అద్దుకుంటారు.
చందనం, తీర్థం, శఠారి స్వీకారం
హారతి పక్రియ పూర్తయిన తరువాత ముందుగా అర్చకులు తాము చందన తీర్థశఠారులను స్వీకరించిన పిదప వరుస క్రమంలో పెద్దజియ్యంగారికి, చిన్న జియ్యంగారికి, ఏకాంగికి, ఆచార్య పురుషులకు, తాళ్లపాక వారికి తీర్ఠం, శఠారి, చందన తాంబూలాలను అందిస్తారు. అనంతరం సర్కారు వారు అయిన దేవస్థానం కార్యనిర్వహణాధికారికి, ఇతర అధికారులకు కూడా పైవిధంగానే తీర్థ, చందన శఠారులను సాయించి తాంబూలం ఇస్తారు.
ఉగాది వేడుకలో శ్రీవారికి విశేష వస్త్ర సమర్పణ
ఆ తరువాత మిగిలిన రెండు పట్టువస్త్రాలు ఉన్న వెండి పళ్లాన్ని పెద్దజియ్యంగారు శిరస్సుపై ధరించి బంగారువాకిలి దగ్గర ‘ఉగాది ఆస్థానా’నికి సిద్ధంగా ఉన్న శ్రీవారి ఉత్సవమూర్తులకు సమర్పిస్తారు. అర్చకులు ఆ రెండింటిలో ఒక వస్త్రాన్ని శ్రీమలయప్ప స్వామికి, రెండవ దానిని శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడికి అలంకరిస్తారు.
శ్రీవారికి అక్షతారోపణ
అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం (పరివేష్టనం- తలకు చుట్టు కట్టే చిన్నపట్టు గుడ్డ) కట్టుకుని శ్రీమలయప్ప వారిపై, విష్వక్సేనుడిపై కుంకుమాక్షతలను (అక్షతారోపణం) చల్లుతారు. ఆ తరువాత సేనాధిపతికి పరివట్టం కట్టి శ్రీవారి పాదాల మీది అక్షతలను తీసుకుని విష్వక్సేనుడిపై చల్లి శఠారి మర్యాదలను జరుపుతారు.
అర్చకులకు తండుల దానం.. ఆనందనిలయానికి ఆశీర్వచనం
శ్రీవేంకటేశ్వర స్వామి వారు అర్చకులకు తండుల (బియ్యం) దానం, తాంబూలం దక్షిణలతో సహా ఇస్తారు. ఇలా బియ్యంతో పాటు దక్షిణ తాంబూలాలను స్వీకరించిన అర్చకస్వామి, సాక్షాత్తూ ఆనందనిలయుడిని ‘నిత్యైశ్వర్యో భవ!’ అని ఆశీర్వదిస్తారు. సాక్షాత్తూ శ్రీనివాసుడి నుంచి దానం తీసుకుంటూ ఆ స్వామి వారినే, ‘స్వామీ! శ్రీనివాసా! నిత్యమూ ఐశ్వర్య పరంపరలతో వర్థిల్లవయ్యా!’ అని ఆశీర్వదించే శ్రీవారి అర్చకుల భాగ్యం ఎంతటిదో కదా!
ఇలా ఆశీర్వచనం చేసిన ప్రధాన అర్చకులకు మరొక అర్చకులు పరివట్టం కట్టి శఠారి మర్యాదలు చేస్తారు.
ఉగాది పండుగ నాటి పంచాంగ శవ్రణం
బంగారు సర్వభూపాల వాహనంలో కొలువై ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారి పాదాల చెంత ఉన్న నూతన సంవత్సర పంచాంగాన్ని శ్రీవారికి నమస్కరిస్తూ అర్చకులు ఆస్థాన సిద్ధాంతికి అందచేస్తారు.
ఆస్థాన సిద్ధాంతి శ్రీవారికి ఆనాటి తిథి వార నక్షత్రాలతో పాటు నూతన సంవత్సర ఫలితాలు, లాభనష్టాలు, నవగ్రహాల సంచారం, సస్యవృద్ధి, పశువృద్ధి మున్నగు విషయాలతో పాటు ఇరవై ఏడు నక్షత్ర జాతకుల కందాయ ఫలాలను, ఆదాయ వ్యయాలను, రాజపూజ్యత, అవమానాలను పంచాంగ శ్రవణంలో వినిపిస్తారు.

మళ్లీ ప్రత్యేకంగా, ‘స్వామీ! అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకా! ఆది మధ్యాంతరహితా! జగదేకసార్వభౌమా! శ్రీమత్‍ రాజాధిరాజ పరమేశ్వరా! నిత్యకల్యాణ చక్రవర్తీ! శ్రీమదలమేల్మంగపతీ! శ్రీమదానంద నిలయవాసా! బహుపరాక్‍! బహుపరాక్‍! స్వామీ తమరు వైకుంఠాన్ని విడిచి ఈ భూలోక వైకుంఠంలో అవతరించిన నక్షత్రం అత్యంత శుభప్రదమైన శ్రవణ నక్షత్రం. ఈ నూతన సంవత్సరంలో మీరు మరింత దయాంతరంగులై భక్తుల పాపాలను, ఆర్తులను పోగొడతారు. సమస్త కోరికలనూ తీరుస్తారు. సమస్త సంపదలనూ అనుగ్రహిస్తారు.
శుభపరంపరలను గుప్పిస్తారు. అందుకే స్వామీ! ఈ నూతన సంవత్సరంలో లక్షలాది మంది భక్తులు మీ దివ్యమంగళ సౌందర్యమూర్తి దర్శనం కోసం అర్రులు చాస్తూ నిరంతరం నిరంతరాయంగా తిరుమలకు వస్తారు. మీకు ఉత్సవాలు, ఊరేగింపులు ఇంకా వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు ఇబ్బడిముబ్బడిగా కానుకలు సమర్పించుకుంటారు. ఇంకా మీ కనుసన్నల్లో మెలిగే నవగ్రహ దేవతలు మీ భక్తులను ఇబ్బంది పెట్టకుండా మీరు సర్వదా కాపాడతారు. దేశమంతా సస్యశ్యామలంగా ఉంటుంది. కాలానుగుణంగా అక్కడక్కడా అతివృష్టి, అనావృష్టి, రోగాది భయాలు ఉన్నా మీ అనుగ్రహం వల్ల మీ భక్తులు సర్వత్రా ఆనందంగా ఉంటారు. సుఖంగా ఉంటారు’ అని ఆస్థాన సిద్ధాంతి నూతన పంచాంగ శ్రవణం చేస్తుండగా ఘన శ్రీవేంకటేశుడు సర్వ భూపాల వాహనంలో, చెవులారా పంచాంగాన్ని వింటూ, ఓరచూపులతో తన ఇద్దరు దేవేరులనూ చూస్తూ, చిన్మయ హాసంతో తలను పంకిస్తూ భక్తులందరినీ అరమోడ్పు కనులతో, చూపులతోనే ఆశీర్వదిస్తూ నిండుగా, మెండుగా అనుగ్రహిస్తారు. ఆ తరువాత ఆస్థాన సిద్ధాంతి శ్రీదేవి, భూదేవిలకు వరుసగా వారి నక్షత్రాలయిన ఉత్తర ఫల్గుణి, రేవతీ నక్షత్ర ఫలితాను చెప్పిన తరువాత అక్కడ ఉన్న కార్యనిర్వహణాధికారుల, సంయుక్త కార్యనిర్వహణాధికారుల, ధర్మకర్తల మండలి సభ్యుల, ఆలయ అధికారుల నక్షత్ర ఫలితాన్ని వినిపిస్తారు.
ఇలా పంచాంగ శ్రవణం చేయించిన ఆస్థాన సిద్ధాంతికి శ్రీవారి అర్చకులు స్వామి వారి పాదాల మీది అక్షతలను శిరస్సుపై చల్లుతూ శఠారిని అనుగ్రహిస్తారు.
పిదప శ్రీవారి బొక్కసం గుమాస్తా లేచి, అత్యంత భయభక్తులతో స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసి, నిలబడి ఆ ముందు రోజు వచ్చిన హుండీ రాబడిని, ఆదాయ వ్యయాలను, ఆ ఏడాది నిర్వహించిన.. పై ఏడాది నిర్వహించబోయే ఉత్సవ విశేషాలను, దేవస్థానం పరిధిలోని ఇతర ఆలయ ఉత్సవ విశేషాలను వినిపించిన తరువాత, ‘దేవర వారు చిత్తగించవలెను’ అంటూ సాష్టాంగ నమస్కారం చేసి, అర్చకుల ద్వారా శఠారి అనుగ్రహం పొందుతారు.
వెంటనే ‘కొలువు పళ్లెం’ అనే బంగారు తట్టలో నవనీత హారతిని శ్రీవారికి ఇచ్చిన తదుపరి అర్చకులు ఆ హారతిని కార్యనిర్వహణాధికారికి ఇచ్చిన తరువాత అందరికీ చూపిస్తారు.
అనంతరం తాళ్లపాక, తరిగొండ, మహంతు, మైసూరు వారి హారతులు ప్రత్యేకంగా సమర్పించబడతాయి. తరువాత అక్కడ చేరిన భక్తులందరి నుంచి ఒక్కో రూపాయిని సేకరించి ప్రత్యేకంగా అందరి తరపున ‘రూపాయి హారతి’ని ఇస్తారు. ఇలా సేకరించిన రూపాయలను కార్యనిర్వహణాధికారి ఖజానాకు జమ చేస్తారు.
చివరగా పెద్ద జియ్యంగారికి, పిదప దేవస్థానం కార్యనిర్వహణాధికారికి, పరివట్టం కట్టి శఠారిని అనుగ్రహించిన తరువాత శ్రీవారి ప్రసాద వినియోగం, అక్షత తాంబూల సత్కారం సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఇంతటితో ‘తిరుమలేశుడి ఉగాది’ పండుగ నాటి ఆస్థాన వేడుకలు సంపూర్తి అవుతాయి.
ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం చేస్తే శత్రునాశం జరుగుతుంది. దుస్సప్నాలు తొలగిపోతాయి. గంగా స్నానఫలం, గోదాన ఫలం కలిగి ఆయుష్షు పెరుగుతుంది. సత్సంతానం కలుగుతుంది. అందులోనూ తిరుమలేశుడు లోక కల్యాణం కోసం చేస్తున్న ఉగాది పంచాంగ శ్రవణం ఇది.
శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన ఉదయం పూట బంగారువాకిళ్ల ముందర ఏకాంతంగా జరిగే ‘తిరుమలేశుడి ఉగాది పండుగ వేడుక’ను వీక్షించలేకపోయామే అనే అసంతృప్తికి లోనుకాకుండా శ్రీనివాసుడిని మనసారా స్మరించుకోవాలి.
అందరి ఇళ్లూ ఆనంద నిలయాలే.
అందరి వాకిళ్లు బంగారు వాకిళ్లే.
అందరి లోగిళ్లూ ఘంటా మండపాలే.
అందరి హృదయాలూ సర్వభూపాల వాహనాలే.
భక్తులు తమ తమ హృదయాల్లో శ్రీవేంకటేశ్వరుడిని ప్రతిష్ఠించుకోవాలి. ఎవరి ఇళ్లలో వారు, ఎవరి హృదయాల్లో వారు పంచాంగ శ్రవణం చేయాలి. శ్రీనివాసుడి దయతో పరాభవ నామ నూతన సంవత్సరంలో అందరికీ సర్వ శ్రేయస్సులూ కలుగుగాక!.

Review కవర్‍ స్టోరీ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top