పిల్లల సంక్రాంతి పాట

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక

గెలముంద నెలముంద కులుకుతూ వచ్చావు
పలుకరింతా మంటె సంక్రాంతీ! నిలిచి మాటాడవే సంక్రాంతి

పూరింటి పై నవ్వు
బీర పూవుల మీద
చలి ముసుగు కప్పావు సంక్రాంతీ
చక్కిలిగింత పెట్టావు సంక్రాంతి

పాల చిక్కుడు చిగురు
కేలల్ల లాడింప
నీలాలు చిలికావు సంక్రాంతీ
నిగ్గులొలికించావు సంక్రాంతి

వరిచేను తలనరసి
వంగి జోహారంటె
కొడవళ్లు పట్టించి సంక్రాంతీ
కూలద్రోయించావు సంక్రాంతి

కోడిపుంజుల జోళ్లు
కోలాట మేస్తుంటె
కత్తులే నూరావు సంక్రాంతీ
కుత్తుకలె తెంపావు సంక్రాంతి

ముగ్గులో గొబ్బెమ్మ
ముద్దుగా కూర్చుంటె
మూన్నాళ్ల ముచ్చటని సంక్రాంతీ
మోమింత చేశావు సంక్రాంతి

గంగిరెద్దు సింగన్న
సంగీతమున కుబ్బి
తబ్బిబ్బులయ్యావు సంక్రాంతీ
తందనాలాడావు సంక్రాంతి

కోణంగి హరిదాసు
గొంతులో కొలువుంది
ఊళ్లూళ్లు మేల్కొలిపి సంక్రాంతీ
ఉర్రూతలూచావు సంక్రాంతి

డబు డక్కివాడు నీ
ఢంకా బజాయింప
గంగెద్దు పై నెక్కి సంక్రాంతీ
కదలివచ్చావమ్మా సంక్రాంతి

ముసలెద్దు రంకేసి
మూపురము గదలించె
నీ చలువు నీ విలువ సంక్రాంతీ
వాచా మగోచరము సంక్రాంతి

నీరుల్లి మడిలోన
వేరూని చిరికూర
సనలు దొడిగిందమ్మ సంక్రాంతీ
నిను నుతించిందమ్మ సంక్రాంతి

సెనగపూల రైక
చినదాని యొడిసేల
గాలి తరగల లోన సంక్రాంతీ
గోలి దిరిగాడింది సంక్రాంతి

మిరెపసారా ణెట్టి
మెరయు పంట వలంతి
పరిగె పాటలు పాడె సంక్రాంతీ
బంతిపూ పస పాడె సంక్రాంతి

అరిసెల పూపాలు
చిరుతిండి బండార
మల్లు గుర్రలకు నై సంక్రాంతీ
అటక చేర్పించావె సంక్రాంతి

ఆబాల గోపాల
మానంద వార్థిలో
మునిగి తేలినదమ్మ సంక్రాంతీ
తనువె మరిచిందమ్మ సంక్రాంతి

కవులకును శిల్పులకు
కావలసి నంత పని
కల్పింతు వేటేట సంక్రాంతీ
కనిపింతు వొకమాటె, సంక్రాంతి

స్వాతంత్య్ర భారత
చ్ఛాయలం దీనాడు
నీరూప మరసితిమి సంక్రాంతీ
నిర్వ•తి బొందితిమి సంక్రాంతి

Review పిల్లల సంక్రాంతి పాట.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top