శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలనేది శాస్త్ర నియమం. ఒకవేళ ఆరోజు వీలు కాకుంటే తరువాత వచ్చే శుక్రవారాల్లోనైనా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చు. మన భారతీయ ఆధ్యాత్మిక ఆచారాలలో అత్యంత ప్రాధాన్యమైనదీ వ్రతం. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవి విశిష్ట దేవత. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమైనదని అంటారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన, ఆయన జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఆయన దేవేరి అయిన వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని అంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాల కోసం, నిత్య సుమంగళిగా వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ పుణ్యస్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వ్రతాన్ని వేర్వేరు సంప్రదాయాలలో చేస్తారు. అయితే ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం ఒక్కటే. సాధారణంగా పండుగ అనే భావనే విశేషానందాన్ని పంచుతుంది. అందులోనే శ్రావణ మాసం రావడంతోనే ప్రతి ఇంటా లక్ష్మీకళ ఉట్టిపడుతుంది. ఆ దేవిని ఇళ్లకు ఆహ్వానిస్తూ ఆచరించే ఈ వ్రత విధానం ఈ మాసం ప్రత్యేకం..
వరలక్ష్మీ పూజకు కావాల్సిన సామగి
• వరలక్ష్మీదేవి ప్రతిమ (విగ్రహం లేదా కలశం లేదా ఫొటో)
• రెండు ఏనుగుల బొమ్మలు (ఏనుగుల బొమ్మలు లభించకపోతే పసుపుతో గోపురం ఆకారంలో రెండు ముద్దలు చేసి, తమలపాకులపై ఉంచి అమ్మవారికి ఇరువైపులా ఉంచాలి)
• తోరాలు: తొమ్మిది వరసల దారానికి పసుపు రాసి, మధ్య మధ్యలో పూలు గుచ్చి తొమ్మిది ముడులు వేస్తూ తోరం తయారు చేసుకోవాలి. పూజలో ఎంతమంది కూర్చుంటే అన్ని తోరాలు తయారు చేసుకోవాలి.
• వాయనాలు లేదా తాంబూలాలు (రవిక వస్త్రం, తమలపాకులు, వక్కలు, పండ్లు లేదా బెల్లం, కాసిన్ని నానబెట్టిన శనగలు, పసుపు, కుంకుమ,
పూలుతో వాయనం లేదా తాంబూలం సిద్ధం చేసుకోవాలి. మీ ఇంటి ఆనవాయితీని బట్టి ముగ్గురు లేదా ఐదుగురు లేదా తొమ్మిది లేదా పదకొండు మంది ముత్తయిదువలకు వీటిని పంచాలి).
• రెండు ప్రమిదలు (వెండి లేదా ఇత్తడి లేదా మట్టివి)
• దీపారాధన కోసం.. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, వత్తులు, అగ్గిపెట్టె, అగరవత్తులు, సాంబ్రాణి ధూపం, కర్పూరం
• పసుపు, కుంకుమ, గంధం
• అక్షింతలు (ఆవు నెయ్యి లేదా శుద్ధజలంతో పసుపు, కుంకుమ కలిపిన విరగని బియ్యపు గింజలు)
• పసుపు గణపతి
• చీర • పూలు
• ఆభరణాలు (మీరు వేసుకునే నగలను శుభ్రం చేసి అమ్మవారికి అలంకరించవచ్చు లేదా మంచి పూల మాలను అమ్మవారికి అలంకరించవచ్చు)
• పండ్లు (ఐదు లేదా 9 రకాల ఫలాలు లేదా రెండు అరటిపండ్లు పెట్టినా చాలు)
• పంచామృతం (ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర కలిపిన మిశ్రమం)
• కొబ్బరికాయలు (గణపతి పూజకు ఒకటి, లక్ష్మీపూజకు ఒకటి)
• బెల్లం ముక్క (గణపతికి నివేదించడానికి)
• తమలపాకులు (కలశంలో అమర్చడానికి, తాంబూలాలు సమర్పించడానికి సరిపడినన్ని)
• నైవేద్యం (మీ శక్తి మేర పిండివంటలు నివేదించవచ్చు. పరమాన్నం, గోధుమరవ్వతో చేసిన పాయసం)
• 4 పళ్లాలు (చేతులు కడుక్కోవడానికి, పూలు, పండ్లు, నైవేద్యాలు పెట్టుకోవడానికి)
• 2 ఉద్ధరిణలు (స్పూన్లు, ఆచమనం, తీర్థ నివేదనకు)
• 3 గిన్నెలు (తీర్థం పట్టడానికి, ఇతర పూజా అవసరాలకు)
• పొడి వస్త్రం (పసుపు కుంకుమలు, నూనె వంటివి చేతికి అంటినపుడు తుడుచుకోవడానికి)
(ఒకసారి పూజలో కూర్చుంటే మధ్యలో లేవకుండా పూజ సజావుగా, నిరాటంకంగా సాగేందుకు అవసరమైన పూజా సామాగ్రినంతటినీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని అందుబాటులో ఉంచుకోవాలి).
వరలక్ష్మీ పూజ ప్రారంభం
పూజలో పాల్గొంటున్న వారంతా మంత్రాలను చదవాల్సిన అవసరం లేదు. ఒకరు చదువుతుండగా మిగిలిన వారు ఆచరిస్తే సరిపోతుంది. సంకల్పంలో మాత్రం పూజ చేసుకుంటున్న ఆడపిల్ల అత్తింటి వారి గోత్రనామాలు చెప్పాలి. సాధారణంగా అత్త లేదా అమ్మ మంత్రాలు చదువుతుంటే ఆడపిల్లలు ఈ వ్రతం చేసుకోవడం మన తెలుగింటి సంప్రదాయం).
గణపతి ప్రార్థన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
శ్రీ గురుభ్యో నమ: (గురువును స్మరించుకోవాలి)
మాతాపితృభ్యో నమ: (తల్లిదండ్రులను స్మరించుకుని గంటను మోగించాలి)
శ్రీ మహాగణపతియే నమ: (ఇప్పుడు దీపాన్ని వెలిగించాలి)
దీప ప్రార్థన
దీపలక్ష్మీ నమస్తుభ్యం సర్వమంగళరూపిణీ
ఆయురారోగ్య ఐశ్వర్యం యావజ్జీవ మరోగతాం
ఓం శ్రీ దీపలక్ష్మీ దేవ్యై నమ:
(దీపం వెలిగించి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టాలి)
ఆచమనం
ఎడమ చేతితో గ్లాసులోని నీటిని ఉద్దరిణితో తీసి కుడిచేతిలో పోసుకుని ఓం కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా అంటూ మూడుసార్లు చప్పుడు లేకుండా పుచ్చుకోవాలి. తరువాత చేయి కడుక్కోవాలి. అనంతరం ఈ కింది మంత్రాలు చదవాలి-
గోవిందాయ నమ:, విష్ణవే నమ:, మధుసూదనాయ నమ:, త్రివిక్రమాయ నమ:, వామనాయ నమ:, శ్రీధరాయ నమ:, హృశీకేశాయ నమ:, పద్మనాభాయ నమ:, దామోదరాయ నమ:, సంకర్షణాయ నమ:, వాసుదేవాయ నమ:, ప్రద్యుమ్నాయ నమ:, అనిరుద్ధాయ నమ:, పురుషోత్తమాయ నమ:, అధోక్షజాయ నమ:, నారసింహాయ నమ:, అచ్యుతాయ నమ:, జనార్దనాయ నమ:, ఉపేంద్రాయ నమ:, హరయే నమ:, శ్రీకృష్ణాయ నమ:.
ప్రాణాయామం: చేతి వేళ్లతో నాసికా రంధ్రాలను మూసి ఈ కింది ప్రాణాయామ మంత్రం చదవాలి-
అంగుళ్యగైర్నాసికాగ్రం సంపీడ్యం పాపనాశనమ్
ప్రాణాయామ మిదం ప్రోక్షయ రుషిభి: పరికల్పితమ్
సంకల్పం: మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణ: ద్వితీయ పరార్దే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో: దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య (హైదరాబాద్ వాసులు వాయవ్య ప్రదేశే అని, తిరుపతి వాసులు ఆగ్నేయ ప్రదేశే అని, వియజవాడ, విశాఖపట్నం ఇతర ప్రాంతాల వారు ఈశాన్య ప్రదేశే అని చెప్పుకోవాలి) మమ లక్ష్మీ నివాస గృహే వర్తమాన వ్యావహారిక చాంద్రామన శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్షరుతౌ శ్రావణమాసే శుక్లపక్షే చతుర్దశి తిథౌ భృగువాసరే శుభ నక్షత్రే
శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ శ్రీమత:…….. గోత్ర:….. నామధేయ:……… గోత్రోద్భవతీ……. నాయధేయవతీ……… (ఎవరికి వారు గోత్ర:, నామధేయ: అన్నప్పుడు మొదటిసారి, గోత్రోద్భవతీ, నామధేయవతీ అన్నప్పుడు రెండోసారి గోత్రనామాలు చెప్పుకోవాలి.
అస్మాకం సహ కుటుంబానాం సకలాభీష్ట సిద్ధర్థ్యం వరలక్ష్మీ దేవతార్చనం కరిష్యే!.
పై విధంగా చెబుతూ అక్షింతలను చేతిలో వేసుకుని నీటితో పళ్లెంలో వదలాలి.
కలశ పూజ: రాగి చెంబులో నీళ్లుపోసి గంధం, అక్షింతలు, పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి, ఈ కింది శ్లోకం చదువుతూ నమస్కరించాలి-
కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రితా:
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మ•తా:
కుక్షౌతు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
రుగ్వేదో యజుర్వేద స్సామవేదోహ్యథర్వణ:
అంగైశ్యసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితా:
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు
కలశ జలాన్ని పువ్వుతో పూజా సామగ్రిపై, దేవునిపై, మనపై చల్లుకుని శుద్ధం చేసుకుని నమస్కరించాలి.
గణపతి పూజ
ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న పసుపు గణపతిని పూజించాలి.
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే
పై శ్లోకం చదువుతూ అక్షింతలు, పూలను స్వామికి సమర్పించాలి.
ఓ విఘ్నేశ్వరాయ నమ: పంచోపచార పూజాన్ సమర్పయామి. దీపం దర్శయామి, ధూపమాఘ్రాపయామి, నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి, శుద్ధ ఆచమనీం సమర్పయామి, అవసరార్థం గుడోపహారం నివేదయామి
బెల్లం ముక్క గణపతి ముందు నివేదించి, ఆకుతో నీళ్లు బెల్లంపైన చల్లి ఉద్ధరిణితో స్వామికి చూపిస్తూ-
అమృతమస్తు. శ్రీమహాగణపతియే నమ: మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిథానమసి ఉత్తరాపోశనం సమర్పయామి (నీళ్లు చిలకరించాలి) హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి.
నీళ్లు చల్లి, అక్షింతలు, నీళ్లు పళ్లెంలో వదలాలి. పసుపు గణపతి ఉన్న తమలపాకును తూర్పునకు జరిపి యథాస్థానంలో ఉంచాలి.
శ్రీమహాగణాధిపతయే నమ: గణపతిం ఉద్వాసయామి
శ్రీమహాగణాధిపతయే నమ: యథా స్థానం ప్రవేశయామి
శోభనార్ధే క్షేమాయ పునరాగమనాయచ
అక్షింతలు వేసి నమస్కరించాలి.
వరలక్ష్మీ పూజ అమ్మవారి ప్రాణప్రతిష్ఠ
చేతిలోకి పూలు, అక్షింతలు తీసుకుని కింది శ్లోకాన్ని చదివి అమ్మవారి పాదాల చెంత సమర్పించాలి-
ఓం శ్రీవరలక్ష్మీ దేవతాయై నమ:
ప్రాణ ప్రతిష్ఠాపన ముహూర్త సుముహూర్తోస్తు శ్రీవరలక్ష్మీ దేవతాయై నమ: స్థాపితోభవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ స్థిరోభవ, వరదోభవ స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద ప్రసీద
ధ్యానం: పూలు లేదా అక్షింతలు తీసుకుని కింది శ్లోకం చదివి వరలక్ష్మీ అమ్మవారి పాదాల వద్ద ఉంచాలి-
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే
సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్క•తే
ఓం శ్రీవరలక్ష్మీ దేవతాయై నమ: ధ్యాయామి ధ్యానం సమర్పయామి
ఆవాహనం: పూలు, అక్షింతలు తీసుకుని కింది శ్లోకాన్ని చదువుతూ అమ్మవారి పాదాల వద్ద ఉంచాలి-
సర్వమంగళ మాంగల్యే విష్ణు వక్ష స్థలాలయే
ఆవాహయామి దేవిత్వాం సుప్రీతా భవసర్వదా
ఓం శ్రీవరలక్ష్మీ దేవతాయై నమ: ఆవాహయామి
ఆసనం: అమ్మవారిని పూజాస్థానంలో కూర్చోబెట్టడానికి పూలు అక్షింతలు తీసుకుని కింది శ్లోకాన్ని చదువుతూ అర్చించాలి-
సూర్యాయుతనిభస్పూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే ఓం శ్రీవరలక్ష్మీదేవతాయై నమ: రత్నసింహాసనం సమర్పయామి
అర్ఘ్యం: ఆచమన పాత్రలోని నీటిని పుష్పంతో లేదా తమలపాకుతో తీసుకుని కింది శ్లోకం చదివి అమ్మవారి చేతులపై కొద్దిగా చల్లాలి-
శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం
అర్ఘ్యం దాస్యామిత దేవి గృహాణ సురపూజితే
ఓం శ్రీవరలక్ష్మీ దేవతాయై నమ: హస్తయో అర్ఘ్యం సమర్పయామి
పాద్యం: కింది శ్లోకాన్ని చదివి ఆచమన పాత్రలోని నీటిని పుష్పంతో లేదా తమలపాకుతో తీసుకుని అమ్మవారి పాదాలపై కొద్దిగా చల్లాలి-
సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం
పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్క•తే
ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమ: పాదయో: పాద్యం సమర్పయామి.
ఆచమనీయం: నీటిని పుష్పంతో లేదా తమలపాకుతో తీసుకుని కింది శ్లోకాన్ని చదివి అమ్మవారి ముఖారవిందంపై కొద్దిగా చిలకరించాలి-
సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం
గృహాణచమనం దేవి మయాదత్తం శుభప్రదే
ఓం శ్రీవరలక్ష్మీ దేవతాయై నమ:
ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి
పంచామృత స్నానం: కింది శ్లోకాన్ని చదువుతూ అమ్మవారి విగ్రహంపై కొద్దిగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపిన పంచామృత మిశ్రమాన్ని చిలకరించాలి.
పయోదధీ•ఘృతోనేతం శర్కరా మధుసంయుతం
పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే
ఓం శ్రీవరలక్ష్మీ దేవతాయై నమ:
పంచామృత స్నానం సమర్పయామి
శుద్ధోదక స్నానం: అమ్మవారి విగ్రహంపై తమలపాకుతో కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ కింది శ్లోకం చదవాలి-
గంగాజలం మయానీతం మహాదేవ శిర:స్థితం
శుద్ధోదక స్నాన మిదం గృహాణ విధుసోదరీ
ఓం శ్రీవరలక్ష్మీ దేవతాయై నమ:
శుద్ధోదక స్నానం సమర్పయామి
వస్త్రం: కింది శ్లోకాన్ని చదివి చీర, రవిక లేదా పుష్పాలు సమర్పించాలి-
సురార్చితాం ఘ్రియుగళేందుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే
ఓం శ్రీవరలక్ష్మీ దేవతాయై నమ:
వస్త్రయుగ్మం సమర్పయామి
ఆభరణం: కింది శ్లోకాన్ని చదివి అమ్మవారికి వీలైతే స్వర్ణాభరణాలు లేదా పుష్పమాలిక లేదా
ఒక పుష్పాన్ని సమర్పించాలి-
కేయూర కంకణే దేవీ హారనూపురమేఖలా:
విభూషణా న్య మూల్యాని గృహాణ రుషిపూజితే
ఓం శ్రీవరలక్ష్మీ దేవతాయై నమ:
ఆభరణాని సమర్పయామి
యజ్ఞోపవీతం: కింది శ్లోకాన్ని చదివి యజ్ఞోపవీతాన్ని లేదా పత్తితో చేసిన ఉపవీత మాలను లేదా తెల్లటి పుష్పాన్ని అమ్మవారికి సమర్పించాలి.
తప్త హేమకృతం సూత్రం ముక్తాదాయ విభూషితం
ఉపవీతమిదం దేవి గృహాణ త్వం శుభప్రదే
ఓం శ్రీవరలక్ష్మీ దేవతాయై నమ:
ఉపవీతం సమర్పయామి
గంధం: కింది శ్లోకాన్ని చదివి చందనంలో ఒక పుష్పాన్ని ముంచి ఆ పువ్వును అమ్మవారి పాదాల వద్ద ఉంచాలి. లేదా అమ్మవారి ప్రతిమకు తడి గంధాన్ని రాయాలి-
కర్పూరాగరు కస్తూరీ రోచనాది భిరన్వితం గంధం
దాస్యామ్యహం దేవీ ప్రీత్యర్థం ప్రతి గృహ్యతాం
ఓం శ్రీవరలక్ష్మీ దేవతాయై నమ:
గంధం సమర్పయామి
అక్షింతలు: కింది శ్లోకాన్ని చదివి అమ్మవారి పాదాల వద్ద అక్షింతలు వేయాలి-
అక్షతాన్ దవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్
శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే
ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమ: అక్షతాన్ సమర్పయామి
పుష్పం: కింది శ్లోకాన్ని చదివి అమ్మవారికి పూలు సమర్పించాలి లేదా మాలనైనా వేయవచ్చు-
మల్లికా జాజి కుసుమై శ్చంపకైర్వకుళై స్తధా
శతపత్రైశ్చ కల్హారై పూజయామి హరిప్రియే
ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమ:
పుష్పై: పూజయామి
అధాంగ పూజ: కింది లక్ష్మీనామాలను చదువుతూ బ్రాకెట్లో సూచించిన అంగాలపై అమ్మవారిని అక్షింతలతో పూజించాలి-
ఓం చంచలాయై నమ: పాదౌ పూజయామి (అమ్మవారి పాదాలపై అక్షింతలు వేయాలి)
ఓం చపలాయై నమ: జానునీ పూజయామి (మోకాళ్లు)
ఓం పీతాంబరధరాయై నమ: ఉరుం పూజయామి (ఉరువులు)
ఓం కమలవాసిన్యై నమ: కటిం పూజయామి (వెనుక భాగం)
ఓం పద్మాలయాయై నమ: నాభిం పూజయామి (నాభి)
ఓం మదనమాత్రే నమ: స్తనౌ పూజయామి (స్తనాలు)
ఓం లలితాయా నమ: భుజద్వయం పూజయామి (భుజాలు)
ఓం శ్రియై నమ: హస్తౌ పూజయామి (చేతులు)
ఓం కంబుకంఠ్యై నమ: కంఠం పూజయామి (కంఠం)
ఓం సుముఖాయై నమ: ముఖం పూజయామి (ముఖం)
ఓం సువాసికాయై నమ: నాసికాం పూజయామి (ముక్కు)
ఓం సునేత్రాయై నమ: నేత్రౌ పూజయామి (కన్నులు)
ఓం రమాయై నమ: కర్ణౌ పూజయామి (చెవులు)
ఓం కమలాయై నమ: శిర: పూజయామి (శిరస్సు)
ఓం వరలక్ష్యై నమ: సర్వాణ్యంగాని పూజయామి (అమ్మవారిపై అక్షింతలు వేయాలి)
శ్రీ వరలక్ష్మీ దేవి అష్టోత్తర శతనామ పూజ
పూలు లేదా అక్షింతలతో లేదా కుంకుమతో ఈ కింది 108 నామాలను చదువుతూ వరలక్ష్మీదేవిని పూజించాలి-
ఓం ప్రకృత్యై నమ:
ఓం వికృత్యై నమ:
ఓం విద్యాయై నమ:
ఓం సర్వభూతహిత ప్రదాయై నమ:
ఓం శ్రద్ధాయై నమ:
ఓం విభూత్యై నమ:
ఓం సురభ్యై నమ:
ఓం పరమాత్మికాయై నమ:
ఓం వాచ్యై నమ:
ఓం పద్మాలయాయై నమ:
ఓం పద్మాయై నమ:
ఓం శుచ్యై నమ:
ఓం స్వాహాయై నమ:
ఓం స్వధాయై నమ:
ఓం సుధాయై నమ:
ఓం ధన్యాయై నమ:
ఓం హిరణ్యాయై నమ:
ఓం లక్ష్మ్యై నమ:
ఓం నిత్య పుష్టాయై నమ:
ఓం విభావర్యై నమ:
ఓం అదిత్యై నమ:
ఓం దిత్యై నమ:
ఓం దీప్తాయై నమ:
ఓం వసుధాయై నమ:
ఓం వసుధారిణ్యై నమ:
ఓం కమలాయై నమ:
ఓం కాంతాయై నమ:
ఓం కామాక్ష్యై నమ:
ఓం క్షీరోదధి సంభవాయై నమ:
ఓం అనుగ్రహప్రదాయై నమ:
ఓం బుద్ధయే నమ:
ఓం అనఘాయై నమ:
ఓం హరివల్లభాయై నమ:
ఓం అశోకాయై నమ:
ఓం అమృతాయై నమ:
ఓం దీప్తాయై నమ:
ఓం లోకశోకవినాశిన్యై నమ:
ఓం ధర్మనిలయాయై నమ:
ఓం కరుణాయై నమ:
ఓం లోకమాత్రే నమ:
ఓం పద్మప్రియాయై నమ:
ఓం పద్మహస్తాయై నమ:
ఓం పద్మాక్ష్యై నమ:
ఓం పద్మసుందర్యై నమ:
ఓం పద్మోద్భవాయై నమ:
ఓం పద్మముఖ్యై నమ:
ఓం పద్మనాభ ప్రియాయై నమ:
ఓం రమాయై నమ:
ఓం పద్మమాలాధరాయై నమ:
ఓం దేవ్యై నమ:
ఓం పద్మిన్యై నమ:
ఓం పద్మగంధిన్యై నమ:
ఓం పుణ్యగంధాయై నమ:
ఓం సుప్రసన్నాయై నమ:
ఓం ప్రసాదాభిముఖ్యై నమ:
ఓం ప్రభాయై నమ:
ఓం చంద్రవదనాయై నమ:
ఓం చంద్రాయై నమ:
ఓం చంద్రసహోదర్యై నమ:
ఓం చతుర్భుజాయై నమ:
ఓం చంద్రరూపాయై నమ:
ఓం ఇందిరాయై నమ:
ఓం ఇందుశీతలాయై నమ:
ఓం ఆహ్లాదజనన్యై నమ:
ఓం పుష్ట్యై నమ:
ఓం శివాయై నమ:
ఓం శివకర్యై నమ:
ఓం సత్యై నమ:
ఓం విమలాయై నమ:
ఓం విశ్వజనన్యై నమ:
ఓం తుష్ట్యై నమ:
ఓం దారిద్య్రనాశిన్యై నమ:
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమ:
ఓం శాంతాయై నమ:
ఓం శుక్లమాల్యాంబరాయై నమ:
ఓం శ్రియై నమ:
ఓం భాస్కర్యై నమ:
ఓం బిల్వనిలయాయై నమ:
ఓం వరారోహాయై నమ:
ఓం యశస్వినే నమ:
ఓం వసుంధరాయై నమ:
ఓం ఉదారాంగాయై నమ:
ఓం హరిణ్యై నమ:
ఓం హేమమాలిన్యై నమ:
ఓం ధనధాన్యకర్యై నమ:
ఓం సిద్ధయే నమ:
ఓం స్త్రైణసౌమ్యాయై నమ:
ఓం శుభప్రదాయై నమ:
ఓం నృపవేశగతానందాయై నమ:
ఓం వరలక్ష్మీయై నమ:
ఓం వసుప్రదాయై నమ:
ఓం శుభాయై నమ:
ఓం హిరణ్యప్రాకారాయై నమ:
ఓం సముద్ర తనయాయై నమ:
ఓం జయాయై నమ:
ఓం మంగళాదేవ్యై నమ:
ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమ:
ఓం ప్రసన్నాక్ష్యై నమ:
ఓం నారాయణ సమాశ్రితాయై నమ:
ఓం దారిద్య్రధ్వంసిన్యై నమ:
ఓం దేవ్యై నమ:
ఓం సర్వోపద్రవవారిణ్యై నమ:
ఓం నవదుర్గాయై నమ:
ఓం మహాకాళ్యై నమ:
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమ:
ఓం త్రికాల జ్ఞానసంపన్నాయై నమ:
ఓం భువనేశ్వర్యై నమ:
ఓం శ్రీవరలక్ష్మీ దేవతాయై నమో నమ:
ధూపం: కింది శ్లోకాన్ని చదివి అమ్మవారి ముందు గుగ్గిలం, సాంబ్రాణి వేసిన ధూపం లేదా అగరవత్తులు వెలిగించి చూపించాలి. ఒక చేత ధూపాన్ని పట్టుకుని కుడిచేతితో అమ్మవారికి చూపించాలి. అగరువత్తులను దీపంతో కాకుండా విడిగా వెలిగించాలి-
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం
ధూపం దాస్యామి దేవేశి వరలక్ష్మీ గృహాణత్వం
ఓం శ్రీవరలక్ష్మీదేవతాయై నమ: ధూపమాఘ్రాపయామి
దీపం: కింది శ్లోకాన్ని చదివి అమ్మవారికి దీపాన్ని దర్శింపచేయాలి-
ఘృతవర్తి సంయుక్త మంధకార వినాశకం
దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితాభవ
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమ: దీపం దర్శయామి
నైవేద్యం: ఒక పళ్లెంలో తామరాకు లేదా అరటి ఆకు లేదా విస్తరాకు వేసి సిద్ధం చేసిన నైవేద్యాలను అందులో ఉంచాలి. అమ్మవారి ముందు పీట కానీ, ముగ్గు కానీ వేసి, దానిపై మహా నైవేద్యపు పళ్లాన్ని ఉంచాలి. నైవేద్యాలను నేలపై పెట్టకూడదు. మరో పళ్లెంలో ఫలాలు పెట్టి కొబ్బరికాయ కొట్టి నివేదించాలి.
కింది శ్లోకం చదువుతూ నైవేద్యంపై కొద్దిగా నీళ్లు చల్లాలి-
ఓం భూర్భువస్సువ: తత్సవితుర్వరేణ్యం
భర్యోదేవస్య ధీమహీ: ధియో యోన: ప్రచోదయాత్
సత్యం త్వర్తేన పరిషించామి
(అమ్మ వారి వద్ద నీళ్లు చిలకరించాలి)
అమృతోపస్తరణమసి
(కింది శ్లోకాన్ని చదివి ఐదుసార్లు నైవేద్యాన్ని అమ్మవారికి చూపించాలి)
నైవేద్యం షడ్రసోపేతం దధిమత్ ఆజ్యసంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే
ఓం శ్రీవరలక్ష్మీ దేవతాయై నమ: మహా నైవేద్యం సమర్పయామి
ఓం ప్రాణాయ స్వాహా
ఓం అవ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా
ఓం సమానాయ స్వాహా
ఓం బ్రహ్మణే స్వాహా
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీళ్లు సమర్పించాలి)
అమృతాపిథానమసి ఉత్తరపోశానం సమర్పయామి (నీళ్లు చిలకరించాలి)
హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి (నీళ్లు చిలకరించాలి)
పానీయం: కింది శ్లోకాన్ని చదువుతూ కొబ్బరినీటిని అమ్మవారికి సమర్పించాలి-
ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం
పానీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరం
ఓం శ్రీవరలక్ష్మీ దేవతాయై నమ: పానీయం సమర్పయామి
తాంబూలం: తమలపాకులు, వక్కలు, పళ్లతో కూడిన తాంబూలాన్ని కింది శ్లోకాన్ని చదువుతూ అమ్మవారికి సమర్పించాలి-
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణసంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం ఓం శ్రీవరలక్ష్మీ దేవతాయూ నమ: తాంబూలం సమర్పయామి
మంత్రపుష్పం: కింది శ్లోకాన్ని చదివి అమ్మవారికి పుష్పాన్ని సమర్పించాలి-
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణప్రియే దేవీ సుప్రీతాభవ సర్వదా
ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమ: మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణం: లేచి నిలబడి పువ్వులు, అక్షింతలు చేతిలో ఉంచుకోవాలి. కింది శ్లోకాన్ని చదివి, వ్రతం చేసుకుంటున్న వారంతా ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు చేసి పువ్వులు, అక్షింతలు అమ్మవారికి సమర్పించాలి-
యానికానిచ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదేనమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే
పాహిమాం భక్త వరదే వరలక్ష్మై నమో నమ:
ఓం శ్రీవరలక్ష్మీ దేవతాయై నమ: ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
సర్వోపచారాలు: కింది శ్లోకం చదువుతూ అక్షింతలు అమ్మవారి పాదాల వద్ద వేయాలి-
ఓం శ్రీవరలక్ష్మీ దేవతాయై నమ:
ఛత్రమాచ్ఛాదయామి, చామరం వీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి,
శకటానారోహయామి
ఆందోళికానారోహయామి సమస్త రాజోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార పంచోపచార షోడశోపచార పూజాం సమర్పయామి
తోరగ్రంథి పూజ: ముందుగా సిద్ధం చేసుకున్న తోరాలను ఒక పళ్లెంలో ఉంచి వాటిని అమ్మవారి ముందు పెట్టాలి. తోరానికి ఉన్న తొమ్మిది ముడులను కింద పేర్కొన్న తొమ్మిది నామాలను చదువుతూ పువ్వుతో లేదా అక్షింతలతో పూజాంచాలి-
ఓం కమలాలయాయై నమ:, ప్రథమ గ్రంథిం పూజయామి
ఓం రమాయై నమ:, ద్వితీయ గ్రంథిం పూజయామి
ఓం లోకమాత్రే నమ:, తృతీయ గ్రంథిం పూజయామి
ఓం విశ్వజనన్యై నమ:, చతుర్థ గ్రంథిం పూజయామి
ఓం మహాలక్ష్మ్యై నమ:, పంచమ గ్రంథిం పూజయామి
ఓం క్షీరాబ్ధితనయాయై నమ: షష్ఠ గ్రంథిం పూజయామి
ఓం విశ్వసాక్షిణ్యై నమ:, సప్తమ గ్రంథిం పూజయామి
ఓం చంద్రసహోదర్యై నమ:, అష్టమ గ్రంథిం పూజయామి
ఓం హరివల్లభాయై నమ:, నవమ గ్రంథిం పూజయామి
తోరబంధన మంత్రం: మంత్రపూరితమైన తోరాలను కింది శ్లోకం చదువుతూ కుడిచేతికి కట్టుకోవాలి. అమ్మవారికి భక్తిపూర్వకంగా నమస్కరించాలి-
బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ సుసౌఖ్యం దేహిమేరమే
ఈ తోరబంధనంతో అమ్మవారి పూజ సంపూర్ణమవుతుంది.
పూజానంతరం వ్రతకథ చదువుకోవాలి.
శ్రీవరలక్ష్మీ వ్రతకథ
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే వారు తప్పనిసరిగా ఆచరించాల్సిన మూడు విధులు-
• లక్ష్మీ పూజ• తోరం కట్టుకోవడం
• వ్రతకథ వినడం
ఇప్పటికే మీరు పూజ పూర్తి చేసి తోరం కట్టుకున్నారు. ఇప్పుడు వ్రతకథ వినండి.
పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించిన ఈ కథ భవిష్యోత్తర పురాణంలో ఉంది.
కథను చదవడం ప్రారంభించే ముందు అక్షింతలను చేతిలోకి తీసుకుని చదవడం ప్రారంభించాలి. చదవడం పూర్తయ్యాక ఆ అక్షింతలను తలపై వేసుకుని మిగిలిన కుటుంబసభ్యుల శిరసులపైన కూడా వేయాలి.
కైలాసంలో ఒకనాడు పార్వతీదేవి మహాదేవుడికి నమస్కరించి, ‘స్వామీ! లోకంలో స్త్రీలంతా ఏ వ్రతాన్ని చేస్తే సర్వసౌభాగ్యాలు, పుత్రపౌత్రాదులు కలిగి సుఖంగా ఉంటారో అటువంటి వ్రతాన్ని గురించి తెలియచేయండి’ అని అడిగింది.
అప్పుడు శివుడు, ‘దేవీ పార్వతీ! స్త్రీలకు పుత్రపౌత్రాది సంపదలను కలిగించే మహిమాన్విత వ్రతం వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతాన్ని శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే
శుక్రవారం రోజున చేయాలి. ఆ వ్రతాన్ని మొదటిసారిగా ఆచరించిన సౌభాగ్యవతి చారుమతి. ఆమె గురించి చెబుతాను విను’ అంటూ కథను చెప్పడం ప్రారంభించాడు.
పూర్వం మగధ దేశంలోని కుండిన పట్టణంలో చారుమతి అనే భక్తురాలు ఉండేది. ఆమె ప్రతిరోజూ సూర్యోదయానికి ముందుగానే మేల్కొని ఇంటి పనులు చక్కబెట్టుకునేది. భర్తను దైవంగా భావించేది. అత్తమామలను ఆదరాభిమానాలతో సేవించేది. అందరితో మితంగా, ప్రియంగా మాట్లాడేది. ఆమె సత్ప్రవర్తనకు శ్రీమహాలక్ష్మికి ఆమెపై అనుగ్రహం కలిగింది. ఒకరోజున కలలో కనిపించి, ‘ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని. నీ భక్తికి ప్రసన్నురాలినయ్యాను. రానున్న శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీ సకలాభీష్టాలు నెరవేరుతాయి’ అని అనుగ్రహించింది.
చారుమతి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి అనేక నమస్కారాలు చేసి పూజించింది.
‘ఓ జగజ్జననీ! నేను జన్మజన్మాంతరాల్లో చేసిన పుణ్యఫలం కారణంగా నీ దర్శన భాగ్యం లభించింది. నా జన్మ ధన్యమైంది’ అంటూ స్తుతించింది.
మరుక్షణమే నిద్ర నుంచి మేల్కొంది. తనకు కలిగిన స్వప్న దర్శనాన్ని గురించి భర్తకు, అత్తమామలకు, ఇరుగుపొరుగు వారికి చెప్పింది. వారంతా చాలా సంతోషించి, అమ్మవారు చెప్పినట్టుగా వ్రతాన్ని ఆచరించాలని ఆమెను ప్రోత్సహించారు.
ఎదురు చూస్తున్న శ్రావణమాసం రానే వచ్చింది. సరిగ్గా పూర్ణిమకు ముందునాటి
శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేయడానికి చారుమతి సంకల్పించింది. ఆమెతో పాటు మిగతా ముత్తయిదువులంతా తెల్లవారకముందే నిద్ర మేల్కొని, స్నానాదికాలు పూర్తి చేసుకుని, శుభ్రమైన వస్త్రాలు ధరించారు. పూజా ప్రదేశాన్ని గోమయంతో అలికి, మంటపాన్ని ఏర్పాటు చేశారు. కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. షోడశోపచారాలతో పూజించారు. అమ్మవారికి మహా నైవేద్యాన్ని నివేదించారు. కుడిచేతికి తొమ్మిది సూత్రాల తోరాన్ని కట్టుకున్నారు. భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే స్త్రీలందరి కాళ్లకు ఘల్లుఘల్లుమంటూ గజ్జెలు ప్రత్యక్షమయ్యాయి. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు ధగధగా మెరిసే నవరత్నఖచిత బంగారు గాజులు గలగలమన్నాయి. మూడో ప్రదక్షిణ చేయగానే సర్వాభరణాలు సంప్రాప్తించాయి. చారుమతి ఇల్లు బంగారు మేడగా మారింది. ఇంటి ముందు రథాలు, ఏనుగులు, గుర్రాలు, వాహనాలు కొలువుదీరాయి. వ్రతాన్ని ఆచరించిన మిగతా ముత్తయిదువులకూ చారుమతికి లభించినట్టే అష్టైశ్వర్యాలు ప్రాప్తించాయి. చారుమతితో పాటు
ముత్తయిదువులందరూ బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించారు. ఒకరికొకరు వాయిన తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. బంధుమిత్రులతో కలిసి అమ్మవారికి నివేదించిన పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేశారు. ముత్తయిదువలందరూ అమ్మవారి వరప్రసాదితమైన రథాలపై వారి వారి ఇళ్లకు పయనమయ్యారు.
‘ఇదంతా చారుమతి భాగ్యమే. చారుమతికి వరలక్ష్మీదేవి స్వప్న దర్శన ఫలితమే మనకు ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆమె కారణంగా ఇంతటి అష్టైశ్వర్యాలు ప్రాప్తించాయి’ అంటూ చారుమతిని ఎంతగానో పొగిడారు.
నాటి నుంచి చారుమతితో పాటు మగధ రాజ్యంలోని ముత్తయిదువలందరూ ప్రతి ఏటా వరలక్ష్మీ వ్రతాన్ని తప్పక ఆచరించే వారు. పుత్రపౌత్రాభివృద్ధి కలిగి, ధనకనక వస్తు వాహనాలతో సుఖ జీవితాన్ని గడిపారు.
చారుమతి కథను వివరించిన అనంతరం శివుడు- ‘ఓ దేవీ! ఈ ఉత్తమమైన వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేసిన వారికి సర్వసౌభాగ్యాలు సిద్ధించి సుఖంగా ఉండగలరు. ఈ కథను వినేవారికి, చదివే వారికి వరలక్ష్మీ కటాక్షం కలిగి సకల కార్యాలు సిద్ధిస్తాయి’ అని పార్వతికి చెప్పాడు.
క్షమా ప్రార్థన: ఇప్పటి వరకు మీరు చేసిన పూజలో ఏమైనా లోపాలు, దోషాలు ఉంటే క్షమించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, చేతిలో అక్షింతలు, నీళ్లు తీసుకుని పళ్లెంలో వదలాలి.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనీ యత్పూజితం మయాదేవీ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానమావాహనాది
షోడశోపచార పూజాయచ అష్టోత్తర శతనామార్చనాయ, అవసర, మహా నివేదనా యచ భగవతీ సర్వాత్మికే సర్వం శ్రీవరలక్ష్మీ దేవతార్పణమస్తు
శ్రీవరలక్ష్మీ దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో
భవతు ఏతత్ఫలం వరలక్ష్మీ దేవతార్పణమస్తు
నీరాజనం: కింది శ్లోకాన్ని చదువుతూ అమ్మవారికి కర్పూర మంగళహారతులు ఇవ్వండి
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే
ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమ: నీరాజనం సమర్పయామి
నీరాజన అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
(అమ్మవారికి నీళ్లు సమర్పించాలి)
అనుగ్రహం: కింది శ్లోకాన్ని చదివి అమ్మవారి వద్ద ఉన్న పూలను తీసుకుని తలలో ధరించాలి. అక్షింతలను కుటుంబసభ్యులందరి శిరస్సుపైనా వేయాలి-
నమస్తే లోకజననీ నమస్తే విష్ణువల్లభే
పాహిమాం భక్త వరదే వరలక్ష్మై నమో నమ:
వాయన దానం: సంఖ్యతో నిమిత్తం లేకుండా మీ శక్తికొద్దీ ముత్తయిదువులకు వాయనదానం చేయాలి. మీరు ఇచ్చే వాయనం లేదా తాంబూలంలో నానబెట్టిన శనగలు కొన్నయినా ఉండాలి-
ఏవం సంపూజ్య కల్యాణీం వరలక్ష్మీం
స్వశక్తిత: దాత్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాయతే
ఇందిరా ప్రతి గ్రృహ్ణాతు ఇందిరావై దదాతిచ
ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమ:
ఉద్వాసన: వరలక్ష్మీ వ్రతం చేసుకున్న మరునాడు అంటే శనివారం అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. అమ్మకు నమస్కరించి, ప్రతిమ ఉన్న పీటను ముందుగా తూర్పు దిక్కుకు కొద్దిగా కదిలించాలి. పూజానంతరం నిర్మాల్యాలను చెరువులో కానీ, ఎవరూ తొక్కని చోట ఆకుపచ్చని చెట్ల వద్ద కానీ విడిచిపెట్టాలి.
శ్రీవరలక్ష్మీ వ్రతం సమాప్తం. శుభం





























































































Review వరలక్ష్మీ వ్రత విధి.