తీర్చిదిద్దినట్టుండే శరీర సౌష్టవం.. మంచి ఆరోగ్యం.. సంపూర్ణ ఆయుష్షు.. మది నిండా ఆనందం.. గుండె నిండా ధైర్యం.. ఇవన్నీ ఒక్కచోటే దొరికే జాగా.. యోగా! ప్రాచీన భారతీయ విజ్ఞానం మానవాళికి అందించిన అపురూప నగ.. యోగ. దేహాన్ని దేవాలయంగా, జీవుడిని దేవుడిగా, జీవనాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా మలుచుకోవడానికి ‘యోగ మార్గ’మే శరణ్యం. యుగాలు మారినా.. తరాలు కదిలినా.. ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్‌లు, అల్గరిథమ్లు వచ్చినా.. అనాది కాలం నుంచి ఆధునిక యుగం దాకా మానవ జీవితానికి వరంగా నిలుస్తోంది యోగ!. పరంపరగా మనకు సంక్రమించిన యోగ సంపద మనం కోరిన అన్నిటినీ సొంతం చేయడమే కాదు.. విశ్వశక్తుల్లోంచి రూపాన్ని, ప్రాణాన్ని పొందే మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా, అద్భుతంగా జీవించడమెలాగో వివరిస్తుంది. పంచభూతాల నుంచి శరీరానికి, మనసుకు, ఆత్మకు కావాల్సిన శక్తిని పుంజుకునేదెలాగో నేర్పుతుంది.
‘శరీర మాద్యం ఖలు ధర్మసాధనం’ అనేది పెద్దల మాట.
ఏం చేయాలన్నా, ఏం సాధించాలన్నా ఈ శరీరంతోనే చేయాలి. దేహాన్ని చురకత్తిలా మార్చాలంటే కొన్ని క్రియలు ఆచరించాలి. అవన్నీ యోగసాధనలో భాగాలే. మనసు, శరీరాల మధ్య అపూర్వ సంగమంగా మనిషిని మలిచే ఈ మహత్తర పక్రియను ప్రపంచమంతా ఆచరిస్తోంది.
జూన్ 21, ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
అభివృద్ధి, ఆధునికతలంటూ మనం ప్రకృతికి దూరమైపోతున్నాం. ఆత్మకు శుద్ధి లేదు. మనసుకు ప్రశాంతత లేదు. ఒంటికి వ్యాయామం లేదు. మనం నేడు ఎదుర్కొనే అన్ని సమస్యలకు ఇవే కారణాలు. ఒంటికి వ్యాయామం ఎంత ముఖ్యమో మనసుకు నిశ్చలతా అంతే ముఖ్యం. ఏకకాలంలో ఈ రెండింటినీ సాధించేందుకు యోగాను మించిన ఔషధం లేదు. అందుకే యోగసాధన ఎంత పురాతనమైనదైనా.. దీని అవసరం నేడే ఎక్కువగా ఉంది.
ఆరోగ్యం అంటే అదేదో శరీరానికి సంబంధించినదని అనుకుంటాం. కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనసులో ఉంటాయి. మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్నచోట వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువ. శారీరకంగా, మానసికంగా రెండు పార్శ్వాల్లోనూ ఆరోగ్యంగా ఉంటేనే మనం ‘సంపూర్ణ ఆరోగ్యం’గా ఉన్నట్టు లెక్క. మనం రకరకాల వ్యాయామాలు చేయొచ్చు. పుష్టినిచ్చే ఆహారం తీసుకోవచ్చు. మందులేసుకోవచ్చు. ఎన్ని చేసినా ఇవన్నీ శరీరాన్ని తప్పించి మన మనసును తాకలేవు. మనసును కూడా తాకి.. శరీరాన్ని, మనసునూ సమతౌల్యంలోకి తెచ్చే అమోఘ పనితనం ‘యోగాభ్యాసా’నికి మాత్రమే ఉంది.
ఆనంద యోగం.. ఆరోగ్య భాగ్యం
‘మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మానాం’ అని ఆర్యోక్తి.
‘మనసులో ఉన్నదే చెప్పి, చెప్పిందే చేసే వారిని మహాత్ములు అంటార’ని దీనికి అర్థం.
దీనినే మనం త్రికరణ శుద్ధిగా (మనసా, వాచా, కర్మణా) అంటాం. అంటే ఆలోచన, మాట, కర్మల్లో స్వచ్ఛత, ఏకత్వం ఉండటం. త్రికరణశుద్ధిగా జీవించే జీవితం నిజాయతీ, శ్రద్ధ, సమైక్యతల ద్వారా ప్రశాంతతను, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ త్రికరణశుద్ధి లేదా స్వచ్ఛతను సాధించడం సాధ్యమేనా అంటే.. సాధ్యమే అని చెప్పాలి.
చిత్తశుద్ధి కోసం పతంజలి యోగ శాస్త్రాన్ని, వాక్ శుద్ధి కోసం పాణిని వ్యాకరణ శాస్త్రాన్ని, కర్మ (దేహ) శుద్ధి కోసం చరకుడు ఆయుర్వేద శాస్త్రాన్ని మనకు ప్రసాదించారు. ఇదే భారతదేశ గొప్పదనం. వీటిలో యోగశాస్త్రానికి విశేష ప్రాశస్త్యముంది.
సాధనతో ఏదైనా సాధ్యమే..
ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలకు తోడు మనసు కలిపి మొత్తం పదకొండు ఇంద్రియాలు. వీటిలో అత్యంత క్లిష్టమైనది, చంచలమైనది మనసు. దీనిని ‘చిత్తం’ అనీ అంటారు.
మనసును జయించడమే
అసలైన విజయం
‘మనోజయ: ఏవ మహాజయ:’ అన్నారు పెద్దలు.
అంటే, మనసును జయించడమే నిజమైన గొప్ప విజయం.
ఆయుధాలు, బలంతో ఎదుటి వారిని జయించడం కాకుండా వారి మనసు గెలుచుకుంటే ప్రపంచంపైనే విజయం సాధించవచ్చు. నిజానికి చిత్తశుద్ధిని పొందగలిగితే వాక్శుద్ధి, కర్మశుద్ధి సాధించడం చాలా సులువవుతుంది. ఎందుకంటే ఈ మూడింటిలో మనసును నిగ్రహించడమే చాలా కష్టం. దీనికి కారణం ‘వృత్తి ప్రవాహ ఇతి చిత్త:’ (ప్రవహించే లక్షణం గలది మనసు). ఈ ప్రవాహాన్ని పూర్తిగా ఆపలేకపోయినా, ఆనకట్ట వేసి మనకు నచ్చిన వైపు మళ్లించవచ్చు. మనసును వశపరచుకున్నప్పుడే ఇది సాధ్యం. యోగా ద్వారానే ఇది కుదురుతుంది.
అష్టాంగ యోగంతో మనసు వశం
యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే ఎనిమిదింటిని ఆచరించడం ద్వారా సంపూర్ణ మనో నిగ్రహం సాధించవచ్చని అష్టాంగ యోగంలో పతంజలి చెప్పారు.
క్రూర జంతువులు కూడా శిక్షణ ద్వారా సౌమ్యంగా మారి మనిషి చెప్పినట్టు వింటాయి. అలాగే మనసు కూడా అష్టాంగ యోగ ద్వారా మనిషికి వశమవుతుంది. తద్వారా మనలోకి మనం తొంగి చూసుకుని సమస్థితిని పొందవచ్చు. ‘అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి’ అనే వసుధైక కుటుంబ భావనే యోగం. అదొక జీవన విధానం. ఐదు వేల సంవత్సరాల చరిత్ర గల సాటిలేని సాధన పక్రియ ఇది. వేద వాజ్మయంలోని ఆరు దర్శనాల్లో యోగా ఒకటి. ఆధునిక ప్రపంచానికి అనువైన పద్ధతుల్లో దీన్ని అందించినప్పుడు ఇది సామాన్యులకు సైతం మరింతగా చేరువవుతుంది. యోగా అనేది మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతమైనది. అందుకే నేడు ప్రపంచమంతా యోగాభ్యాసం చేస్తోంది.
‘అష్టాంగ’ అద్భుతాలివి..
2 సమాజం కలిసిమెలిసి క్రమపద్ధతిలో శాంతియుతంగా సాగడానికి అవసరమైన అహింస, సత్యం, అస్తేయం (దొంగతనం చేయకపోవడం), ఆస్తిక్యం (భగవంతుడిపై విశ్వాసం), స్థైర్యం, క్షమలాంటి ఆచరణాత్మక మార్గాలను యమ యోగాంగం సూచిస్తుంది. సమాజం ఎలా నడుచుకోవాలో ఇది బోధిస్తుంది.
2 పరోపకారం, సంతుష్టి, అంత:, బాహ్యశౌచం, శ్రద్ధ, జపం, సహనం వంటివి ఆచరించడం ద్వారా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి నియమ యోగాంగం అక్కరకొస్తుంది.
2 స్థిరంగా, సుఖంగా ఒకే స్థితిలో ఉండటమే ఆసనం. బలం, శరీరశుద్ధి, దీర్ఘాయుష్షును పెంచే శారీరక భంగిమలు ఇందులో ఉంటాయి.
2 ప్రాణం అంటే జీవక్రియ. ఆయామం అంటే పెంచడం. ప్రాణాయామం ద్వారా దోషాలు దగ్ధమవుతాయి. శ్వాస నియంత్రణకు సంబంధించిన సాధన వ్యవస్థ ఇందులో ఉంటుంది.
2 మనసును, బుద్ధిని శాంతింపచేసి, వాటిని నిర్మలంగా ఉంచి, బాహ్య పరధ్యానాలను ఉపసంహరించుకుని తద్వారా ఇంద్రియాలను నియంత్రించడం ప్రత్యాహారం.
2 ఒకే విషయంపై ఏకాగ్రతను నిలపడం ధారణ. అంటే పరమాత్మ, ఒక బిందువు, చిహ్నం లేదా వస్తువుపై మనసును కేంద్రీకృతం చేసి ఏకాగ్రతను పొందడం.
2 శరీరంలోని ఒత్తిడి, హార్మోన్లను తగ్గించడం ద్వారా ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తి, శ్రద్ధను మెరుగుపరిచి శారీరక వ్యాధులను నియంత్రిస్తుంది.
2 ధ్యానస్థితిలో ధ్యానం, సాధకుడు, ఏకాగ్రత వేర్వేరుగా ఉంటాయి. ఈ మూడూ ఏకమైన స్థితే సమాధి. అనంత ఆనందం, ఆత్మసాక్షాత్కార నిజస్థితి ఇది. వ్యక్తి ‘నేను’ అనే భావన నుంచి, కోరికల నుంచి విముక్తి పొంది ఆత్మ నిజమైన స్వభావాన్ని తెలుసుకోవడం ఇందులో సాధ్యపడుతుంది.
ఎలా చేయకూడదో కూడా తెలుసుకోవాలి..
పొద్దున లేస్తే మానసిక, శారీరక ఒత్తిడి.. తిరిగి రాత్రి పక్కకు చేరే వరకు ఒకటే టెన్షన్.. ఇలాంటి పరిస్థితి నుంచి రిలీఫ్ కోరుకోని వారెవరు? ఇలాంటి ఉపశమనం కోసం మందులు మాకులూ లేని ఓ దివ్య‘యోగ’ం ఉందంటున్నారు నిపుణులు.. అదే- యోగా. యోగా రొటీన్‌గా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. యోగాసనాల వల్ల పూర్తి ఫలితాన్ని పొందాలంటే.. దాని ఆచరణ క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చాలామంది అవగాహన లోపంతోనూ లేదంటే నిర్లక్ష్యంతోనూ యోగా చేసేటపుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీంతో దాని తాలూకు ఫలితం దక్కదు.
యోగాకూ పరిమితులున్నాయి..
శారీరకంగానూ, మానసికంగానూ మంచి ఫలితాలను ఇస్తున్న యోగా ప్రస్తుతం చాలామంది జీవితాల్లో ఒక భాగమైపోయింది. అయితే ప్రతిదానికీ ఒక పరిమితి ఉన్నట్టే యోగాకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ క్రమంలో ఏ ఆసనం ఎప్పుడు వేయాలి? ఎలా వేయాలి? ఎలా వేయకూడదో కచ్చితంగా తెలిసి ఉండాలని అంటున్నారు నిపుణులు. యోగా చేసే క్రమంలో కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అవేమిటంటే..
2 ‘అతి సర్వత్ర వర్జయేత్’ అని నానుడి. ఏదైనా అతిగా చేస్తే అనర్థాలు తప్పవు. యోగా విషయంలోనూ ఇది వర్తిస్తుంది.
2 త్వరగా మంచి ఫలితాలను పొందాలని ఎక్కువసేపు యోగా చేయడం, శరీరాన్ని ఇబ్బంది పెట్టే ఆసనాలు వేయడం వల్ల మొదటికే మోసం వస్తుందంటున్నారు నిపుణులు. అందరి శరీర తత్వాలు ఒకేలా ఉండవు. అందుకే ఎవరి శరీరానికి అనువుగా, సౌకర్యవంతంగా ఉంటాయో అలాంటి ఆసనాలనే ఎంచుకోవాలి.
2 కొత్తగా యోగా ప్రారంభించే వారు ఇతరులను చూసి, వీడియోలను చూసి ఆసనాలు వేయడం మంచిది కాదు. ఒకసారి యోగా నిపుణులు సలహాలు తీసుకుని ఆ తరువాత ఆచరణలోకి దిగాలి.
2 మరీ చల్లగా, అత్యంత వేడిగా ఉన్న ప్రాంతాలు, అధిక తేమతో కూడిన ప్రదేశాలు యోగాకు పనికిరావు. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశాల్లో యోగా చేయడం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.
2 యోగాలో భాగంగా వేసే కొన్ని ఆసనాల్లో కొన్ని సెకన్ల పాటు శ్వాసను బిగపట్టాల్సి ఉంటుంది. అలాంటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
2 అసాధారణ భంగిమల్లో ఆసనాలు వేయడం, సొంత నైపుణ్యాలు ప్రదర్శించడం కాకుండా నిపుణుల సలహాల మేరకు ఆయా ఆసనాలను వేయడం అవసరం.
2 మహిళలు నెలసరి సమయంలో కొన్ని రకాల యోగాసనాలకు దూరంగా ఉండాలి. గర్భిణులు కచ్చితంగా నిపుణుల మార్గదర్వకత్వంలోనే యోగసాధన చేయాలి.
ఇలా అసలు చేయొద్దు
యోగాసనాల్లో ధ్యానం కూడా ఒక భాగమే. ఈ క్రమంలో కొన్ని యోగాసనాలు వేసేటప్పుడు గట్టిగా గాలి పీల్చి వదలాలి. అయితే కొంతమంది ఈ పక్రియను నిర్లక్ష్యం చేస్తూ కేవలం యోగాసనాలపైనే దృష్టి పెడతారు. లేదంటే ఒకేసారి గట్టిగా గాలి పీల్చడం.. వదలడం వంటివి చేస్తుంటారు. దీనివల్ల ఫలితం దక్కదని అంటున్నారు యోగా నిపుణులు. అందుకే ఆసనాలు వేసేటప్పుడు దానికి తగిన తీరిలో ఉచ్ఛ్వాస, నిశ్వాసలు ఉండేలా జాగ్రత్తపడాలి., ఇందుకు నిపుణులు చెప్పిన చిట్కాలను తు.చ. తప్పకుండా పాటిస్తే సరిపోతుంది. యోగా చేసేటప్పుడు గాలి పీల్చడం, వదలడం వంటివి ఒక క్రమపద్ధతిలో, నిపుణులు సూచించిన విధంగా జరగాలి. అప్పుడే యోగాసనాల వల్ల ప్రయోజనం కలిగి ఇటు శరీరానికి, అటు మనసుకు ప్రశాంతత లభిస్తాయి.
అన్ని ఆసనాలు ఒకటి కావు..
కొన్ని యోగాసనాలు చేయడానికి, చూడటానికి దాదాపు ఒకేలా అనిపిస్తాయి. కానీ వాటిలోని భంగిమలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా ఆసనాలు వేయడం మంచిది. చాలామంది ఆసనాలు ఒకే రకంగా ఉన్నాయని అన్నింటికీ అవే భంగిమలు వేస్తే వాటి ద్వారా ఆశించిన ఫలితం దక్కకపోవచ్చు. నిపుణులు చెప్పినట్టుగా ఆసనాలు సాధన చేయడం ఉత్తమం. మరికొంతమంది ఇంట్లోనే స్వయంగా ఆసనాలు వేస్తుంటారు. కానీ ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆసనాలను వేయాల్సిన రీతిలో వేయకపోతే కండరాలు, నాడులపై ఒత్తిడి పడి ఆయా భాగాల్లో నొప్పి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నిపుణుల ఆధ్వర్యంలో యోగాసనాలను సాధన చేయడం మంచిది.
నెమ్మదిగా అభ్యాసం
వ్యాయామాలు చేసే క్రమంలో ముందుగా వార్మప్ చేస్తాం కదా! యోగాసనాలు చేసే క్రమంలోనూ ఇది తప్పనిసరి అంటున్నారు నిపుణులు. కానీ కొందరు మాత్రం ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ నేరుగా యోగాసనాల్లోకి దిగిపోతారు. దీంతో ఆసనాలు వేయడానికి శరీరం అంతగా సహకరించదు. ఫలితంగా యోగా చేయడం కష్టతరమై నెమ్మదిగా దానిపై ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. యోగా చేయడానికి అరగంట ముందు నుంచే దాని కోసం తగిన వార్మప్ చేయడం తప్పనిసరి. ఫలితంగా యోగాసనాలకు అనుగుణంగా శరీరం ఫ్లెక్సిబుల్‌గా తయారు కావడంతో పాటు దానిపై శ్రద్ధ పెరిగి మరిన్ని మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
ఆదరాబాదరా అసలే వద్దు..
యోగాసనాలను ఎంత నెమ్మదిగా, ఆసక్తితో చేస్తే అంత చక్కటి ఫలితం లభిస్తుంది. సమయం మించిపోతుందనో లేదంటే తక్కువ సమయంలో అన్ని ఆసనాలు కవర్ చేయాలనో ఆదరాబాదరాగా ఆసనాలను వేయడం వల్ల ఇన్ని రోజులు పడిన శ్రమ అంతా వృథా అవుతుంది. పైగా ఇలా చేయడం వల్ల గాయాలపాలయ్యే ప్రమాదం కూడా ఎక్కువ. కాబట్టి ఆసనాలు వేసే క్రమంలో ఎంత నెమ్మదిగా, ఆస్వాదిస్తూ చేస్తే అంత మంచిది. అలాగే ఒక ఆసనం పూర్తయిన తరువాత వెంటనే మరో ఆసనం ప్రయత్నించకుండా శరీరంలోని కండరాలకు, మనసుకు కాస్త విశ్రాంతిని ఇవ్వడం ఉత్తమం. ఫలితంగా ఆ తరువాత చేసే ఆసనం మరింత పర్ఫెక్ట్గా వస్తుంది. యోగాపై శ్రద్ధ, ఆసక్తి కూడా పెరుగుతాయి.
2 ఆరంభ దశలోనే కఠినమైన ఆసనాల కోసం ప్రయత్నించడం మంచిది కాదు. దీనివల్ల ఒక్కోసారి అతి కష్టంగా అనిపించి అసలు యోగా అంటేనే విముఖత కలిగే అవకాశం ఉంది. అందుకే యోగాసనాలు వేయడం ప్రారంభించినప్పటి నుంచి కనీసం 45 రోజుల వరకు సులభతరమైన ఆసనాలు వేయడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
2 గుండె సంబంధిత సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు నిపుణుల పర్యవేక్షణలో, వారు సూచించిన సులభతరమైన ఆసనాలను మాత్రమే సాధన చేయడం మంచిది.
2 వ్యాయామానికి ఎలాగైతే సౌకర్యంగా ఉండే దుస్తులు ధరిస్తారో.. యోగాకు కూడా సౌకర్యంగా, వాతావరణానికి తగ్గట్టుగా ఉండే దుస్తులను ధరించడం మంచిదని గుర్తుంచుకోవాలి. అయితే, ఈ క్రమంలో దుస్తులు మరీ బిగుతుగా, మరీ వదులుగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ కాలం పిల్లలకు
3 యోగాలు
‘జెన్ జీ’ పిల్లలు ప్రస్తుతం బాగా ప్రభా వితమవుతున్నది మూడు అంశాల్లో. ఒకటి- జీవితం పట్ల అవగాహన లేకుండా బాధ్యతారహితంగా ఉండటం, అల్లరిచేష్టలు మానలేకపోవడం, రెండు- సామాజిక మాధ్యమాల ప్రభావంతో నిరంతరం ఫోన్లకు అతుక్కుపోవడం, విద్యాభ్యాసం.. నిరంతర పఠనం కారణంగా మెడనొప్పికి గురికావడం, మూడు- చీటికీమాటికీ చిర్రుబుర్రులాడటం, కోపం తెచ్చుకోవడం. మరి, ఈ మూడింటికీ యోగాలో చక్కని పరిష్కారం ఉంది. యోగాసనాలు కూడా ఎప్పటికప్పుడు మనుషుల మనస్తత్వాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలకు అనుగుణంగా కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. అలా ప్రస్తుత తరం పిల్లల కోసం కొత్తగా రూపుదిద్దుకుని మంచి ఫలితాలనిస్తున్న మూడు ఆసనాలివి..
1. విజ్ఞత కోసం భూనామాసనం
పిల్లల్లో అల్లరిచేష్టలు మాన్పించడానికి, వారిలో మానసిక పరిపక్వత కలగడానికి ఒక ఆసనం ఉందని మీకు తెలుసా? నుదుటి మీద, కనుబొమల మధ్య జ్ఞానానికి సూచిక అయిన ఆజ్ఞాచక్రం ఉంటుంది. భూనామాసనం చేస్తే ఆ చక్రం విచ్చుకుంటుంది.
ఎలా చేయాలంటే..
యోగా మ్యాట్ మీద కాళ్లు ముందుకు చాపుకుని సదుపాయంగా కూర్చోవాలి. నెమ్మది నెమ్మదిగా కుడికాలును కుడివైపునకు, ఎడమకాలును ఎడమ వైపునకు జరపాలి. అలా సాధ్యమైనంతగా జరిపి, రెండు చేతులనూ నేల మీద పెట్టి మెల్లగా ముందుకు వంగాలి. మోచేతులను కింద ఆనించి అరచేతుల్లో చుబుకాన్ని ఉంచాలి. ఈ స్థితిలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి జాగ్రత్తగా కాళ్లను యథాస్థితికి తీసుకురావాలి. ఇది పిల్లలు తేలిగ్గానే చేయగలుగుతారు. ఆసనం చేసేటపుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మధ్యలో కొంచెం సేదదీరి మళ్లీ చేయాలి. ఒకేసారి కాళ్లను దూరం జరపకూడదు. కొన్నిరోజుల అభ్యాసం తరువాత రెండు కాళ్లూ సరళరేఖలా తిన్నగా తీసుకురావడం తేలికవుతుంది.
ప్రయోజనాలేమిటంటే..
2 ఆజ్ఞాచక్ర తెరుచుకుంటుంది. విజ్ఞత పెరుగుతుంది. పిల్లల్లో అల్లరి తగ్గి నెమ్మదితనాన్ని అలవర్చుకుంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
2 ఈ ఆసనం వేయడం వల్ల కాళ్లు, నడుము, వెన్నెముక, మెడ, భుజాలు బలపడతాయి.
2 థైరాయిడ్ గ్రంథులు క్రమబద్ధమవుతాయి. కీళ్లకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తవు.
2 పిల్లల్లో జీర్ణశక్తి పక్రియ మెరుగవుతుంది. కాలేయం పనితీరు సవ్యంగా ఉంటుంది. కొవ్వు కరుగుతుంది. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
2 పిల్లలు ఉత్తేజితులవుతారు. ఎముకలు దృఢంగా తయారవుతాయి.
2 పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. ఇది నిదానంగా, జాగ్రత్తగా చేయాల్సిన ఆసనం. తొందరపడి ఒకేసారి రెండు కాళ్లను దూరంగా జరిపితే ప్రమాదం సుమా!.
2. మెడనొప్పికి చెక్ ఇలా..
పిల్లలు నిరంతరం పఠనాభ్యాసాల్లో నిమగ్నమై ఉంటారు. కాసింత తీరిక దొరికితే ఫోన్లో మునిగిపోతున్నారు. దీంతో చిన్న వయసులోనే మెడ, భుజాల నొప్పికి గురవుతున్నారు. దీనికోసం ఎలాంటి ఆసనం వేయాలంటే..
• కింద సదుపాయంగా ఉండేలా కూర్చుని, రెండు చేతులను తొడల పక్కగా ఉంచి అరచేతులను పరిచినట్టు పెట్టాలి. మెడ మాత్రమే కదిలేలా ముఖాన్ని మెల్లగా కుడివైపునకు వెళ్లగలిగినంత దూరం వెళ్లనిచ్చి ఎదురుగా తీసుకురావాలి. ఎడమవైపు కూడా అలాగే చేయాలి. ఇలా ఐదుసార్లు కుడివైపు, ఐదుసార్లు ఎడమవైపు చేయాలి. తరువాత తలను మెల్లగా కిందికి వంచి, అంతే నెమ్మదిగా పైకి లేపి వెనక్కి తీసుకెళ్లాలి. ఇది కూడా ఐదుసార్లు చేయాలి.
• తలను కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడివైపునకు ఆరుసార్లు తిప్పాలి.
• కుడిచేతిని తల మీద పెట్టి తలను కుడి భుజం మీదికి వంచాలి. ఆనక ఎడమ చేతిని తల మీద పెట్టి తలను ఎడమ భుజం మీదికి వంచాలి. మొదటి రోజు ఎక్కువ ఇబ్బంది పడేలా ఈ అభ్యాసం చేయొద్దు.
ఇవీ ప్రయోజనాలు..
నెక్ ఎక్సర్సైజ్ వల్ల కండరాలు బలపడతాయి. రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. చేతులు, భుజాలు, శరీరం దృఢంగా తయారవుతాయి. బిగుసుకుపోయినట్టు ఉండదు. ఎలా అంటే అలా వంచగలుగుతాం. మెడ, వీపు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
జాగ్రత్త సుమా!
ఈ వ్యాయామం చాలా నెమ్మదిగా చేయాలి. మెడను తెలిగ్గా వంచగలిగినంతే వంచాలి. అసౌకర్యం కలగనంత వరకే తిప్పాలి. ఏ కాస్త నొప్పిగా, ఇబ్బందిగా అనిపించినా వెంటనే ఆపేయాలి. అపసవ్యంగా చేస్తే మెడ, వీపు, భుజాలు పట్టే స్తాయి. నొప్పి తగ్గకపోగా తీవ్రమవుతుంది. తలనొప్పి కూడా వస్తుంది.
3. కోపానికి గర్భాసనంతో విరుగుడు
ఈ కాలం పిల్లలు చీటికీమాటికీ కోపం తెచ్చుకుంటున్నారు. అది ఆవేశం స్థాయి దాటి ఆగ్రహంగానూ మారిపోతోంది. చేతికందిన వాటిని విసిరేయడం, మాటలు తూలనాటడం వంటివి మామూలే. దీనివల్ల అనుబంధాలు బీటలు వారతాయి. ఇలాంటి పిల్లలు పెద్దయ్యాక మరింత జగడాలమారిగా మారతారు. చిన్నతనంలోనే ఈ లక్షణాన్ని అడ్డుకోవాలంటే మానసిక వైద్యులను సంప్రదించాల్సిన అవసరం లేదు. ఈ గర్భాసనాన్ని వేస్తే చాలు.
ఎలా చేయాలంటే..
ముందుగా కాళ్లు రెండూ ముందుకు జాపి కూర్చుని కుడి కాలిని ఎడమ తొడ మీద, ఎడమ కాలిని కుడి తొడ మీద పెట్టి పద్మాసనంలో కూర్చోవాలి. రెండు కాళ్లకి మధ్యలో ఏర్పడిన రెండు ఖాళీల్లో చేతులు పెట్టి కిందికి తీసుకెళ్లాలి. అలా కాళ్ల సందుల్లోంచి పోనిచ్చిన చేతులను నెమ్మదిగా గడ్డం వద్దకు తీసుకెళ్లాలి. అంటే మోచేతుల దగ్గర మడిచి కాళ్లకు బయటి వైపు నుంచి చేతులను పైకి తీసుకెళ్లాలి. అరచేతులను గడ్డానికి అటూఇటూ ఉంచాలి. ఈ భంగిమలో తొడలు కొంచెం పైకి లేపి పిరుదుల మీద కూర్చోవాల్సి ఉంటుంది. ఈ ఆసనంలో ఉండగలిగినంతసేపు ఉండి నెమ్మదిగా కాళ్ల మధ్యలో నుంచి చేతులను తీసి యథాస్థితికి వచ్చి సేదదీరాలి. మొదట్లో బ్యాలెన్స్ చేయడం కాస్త కష్టమనిపించినా క్రమంగా సులభమవుతుంది. పద్మాసనం అలవాటు ఉన్న వారికి ఇది తేలిక.
ప్రయోజనాలివీ..
గర్భాసనంతో కోపం బాగా తగ్గుతుంది. ఉదర గ్రంథులను క్రమబద్ధం చేసి సవ్యంగా పనిచేయడంలో తోడ్పడుతుంది. జీర్ణాశయం సమస్యలు తగ్గుతాయి. మొత్తం జీర్ణ పక్రియను సరిచేస్తుంది. జఠరాగ్ని వృద్ది చెందుతుంది. ఆకలి మందగించిన వాళ్లు, ఆహారం పట్ల ఆసక్తి తగ్గిన వాళ్లు ఈ ఆసనం వేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆకలి పెరుగుతుంది. మనను, మెడదు అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటాయి.
‘ఆర్థిక’ యోగా!
ఆరోగ్యమే మహాభాగ్యం అనే పెద్దల మాట నూటికి నూరు శాతం నిజం. ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో సంతోషం, సుఖం, సమృద్ధి కలుగుతాయి. అయితే, వీటికి ‘ఆర్థిక ఆరోగ్యం’ కూడా ఎంతో ముఖ్యం. యోగాకు, ఆర్థిక శాస్త్రానికి సంబంధమేమిటని అనుకుంటున్నారా?. సంబంధం ఉంది.. ఎలాగంటే యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదే సమయంలో మనకు కొన్ని ఆర్థిక పాఠాలనూ బోధిస్తుంది. యోగ సూత్రాలను ఆర్థిక ప్రణాళికల్లో ఎలా మిళితం చేయొచ్చంటే..
క్రమశిక్షణ
యోగాలో ఒక ఆసనాన్ని సాధన చేయాలంటే ఎంతో శ్రద్ధ, క్రమశిక్షణ అవసరం. ఒక్కరోజు సాధనతో పరిపూర్ణత రాదు. ఇది నిరంతర అభ్యాసం. అదే విధంగా ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకూ క్రమశిక్షణతో పొదుపు, పెట్టుబడులు పెట్టడం అవసరం. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్)లో నెలనెలా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో గణనీయమైన సంపదను సృష్టించవచ్చు.
సమతుల్యం
యోగసాధనలో మనసు, శరీరం సమతుల్యంగా ఉండాలి. అదేవిధంగా ఆర్థిక జీవితంలో ఖర్చులు, పొదుపు, పెట్టుబడుల మధ్య సమతుల్యత కూడా అవసరం. అధిక ఖర్చులు ఆర్థిక జీవనాన్ని దెబ్బతీస్తాయి. అధిక నష్టభయం ఉన్న, రిస్కీ పెట్టుబడులు నష్టాలకు కారణమవుతాయి. తక్కువ, మధ్యస్థాయి నష్టభయం ఉన్న పెట్టుబడుల మధ్య సమన్వయం చేసుకుంటూ పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలి. అప్పుడే ఆర్థికారోగ్యం సాధ్యం.
ఓపిక
యోగాలో ఒక ఆసనాన్ని పరిపూర్ణంగా చేయాలంటే ఓపిక అవసరం. ఒక్కరోజులోనే శరీరం ఆ ఆసనానికి అనువుగా మారదు. అలాగే ఆర్థికంగా విజయం సాధించాలన్నా, సంపద సృష్టించాలన్నా కూడా ఓపిక కావాలి. మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా భయపడి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే నష్టాలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు కొంత సమయం ఇవ్వాలి. అప్పుడే సంపదను పెంచుతాయి.
ఆత్మవిశ్వాసం
మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు యోగా, ధ్యానం ఎంతో తోడ్పడతాయి. కష్టమైన ఆసనాలను వేసినపుడు వచ్చిన సంతృప్తి మనల్ని ధైర్యవంతులను చేస్తుంది. అలాగే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటపుడు మనపై మనకు విశ్వాసం అవసరం. వ్యక్తిగత, ఆర్థిక అంశాలకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడం తప్పనిసరి. భయంతో తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక నష్టాలను మిగులుస్తాయి.
ఒత్తిడి లేకుండా..
యోగా ఒత్తిడిని తగ్గించడంలో సాయం చేస్తుంది. ప్రాణాయామం, ధ్యానం వంటివి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఆర్థిక జీవితంలోనూ ఒత్తిడిని ఎదుర్కోవడం కీలకం. అనుకోని ఖర్చులు, రుణ వాయిదాల చెల్లింపులు, ఆదాయం తగ్గడం వంటివి నిత్య జీవితంలో మనల్ని ఎంతో ఒత్తిడికి గురిచేస్తాయి. అలాంటి సమయంలో ప్రశాంతంగా ఉండి, మంచి ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే జీవితంలో ఆర్థిక ఒడిదుడుకులు లేకుంటే ఒత్తిడి లేకుండా ఉండగలం.





























































































Review కవర్ స్టోరీ.