మాసం.. విశేషం

ఆంగ్లమానం ప్రకారం ఆరవ మాసం జూన్‍. ఇది తెలుగు పంచాంగం ప్రకారం (అధిక) జ్యేష్ఠ – జ్యేష్ఠ మాసాల కలయిక. అధిక జ్యేష్ఠ మాసంలోని కొన్ని రోజులు, నిజ జ్యేష్ట మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో ఉంటాయి. జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఇష్టమైన మాసంగా చెబుతారు. కొన్ని విధాలైన వ్రత విధానాలకు జ్యేష్ఠం అనుకూలమైనది. జూన్‍ 1, సోమవారం నుంచి జూన్‍ 15, సోమవారం వరకు అధిక జ్యేష్ఠ మాస తిథులు ఉంటాయి. ఆపై జూన్‍ 16, మంగళవారం నుంచి నిజ జ్యేష్ఠ మాస తిథులు ప్రారంభమవుతాయి. యమునా నది పుష్కరాలు జూన్‍ 2 నుంచి ప్రారంభమవుతాయి. ఇంకా, ఏరువాక పూర్ణిమ, దశపాపహర దశమి, గాయత్రి జయంతి వంటివి ఈ నెలలోని ఇతర ముఖ్య పర్వాలు.

తెలుగు పంచాంగాల ప్రకారం జ్యేష్ఠ మాసం (జూన్‍) చైత్రాది మాస పరిగణనలో మూడో మాసం. చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి జ్యేష్ఠ మాసమనే పేరు వచ్చింది. జూన్‍ నాటికి ఎండలు మరింత మండిపోతాయి. గ్రీష్మతాపంతో మానవాళే కాదు పశుపక్ష్యాదులు అల్లాడిపో తుంటాయి. నెల చివరి నాటికి వాతా వరణం కొంత చల్లబడుతుంది. జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఇష్టమైన మాసమని పేరు. జ్యేష్ఠ మాసం నెలంతా బ్రహ్మను ఆరాధించాలని అంటారు. నెల పొడవునా ఆయన ప్రతిమను గోధుమపిండితో తయారు చేసుకుని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చని అంటారు. ఇలా చేస్తూ జ్యేష్ఠ మాసంలో తనను ఆరాధించే వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని విశ్వాసం. పితృదేవతల ప్రీత్యర్థం చేయాల్సిన కర్మలకు, వారి రుణం తీర్చుకోవడానికి, చేసిన పాపాల నుంచి విమోచనం పొందడానికి ఉద్దేశించిన కొన్ని మంచి తిథులు జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి. జ్యేష్ఠంలో గృహ నిర్మాణ పనులను ప్రారంభించడం మంచిది కాదని మత్స్య పురాణంలో ఉంది. అలాగే శుభ ముహూర్తాల పరంగా కూడా ఈ మాసం అంతగా అనుకూలం కాదని అంటారు. పైగా అధిక జ్యేష్ఠ మాస తిథులతో కూడి ఉన్నందున జూన్‍లో శుభకార్యాలు అంతగా తలపెట్టరు. అయితే, ఈ మాసంలో కొన్ని విశేషమైన పర్వాలు, వ్రతాలు ఉన్నాయి. స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగించే సావిత్రి వ్రతం, పార్వతీదేవి ఆచరించిన రంభా వ్రతం, పచ్చి మంచినీళ్లయినా ముట్టకుండా ఆచరించే నిర్జల ఏకాదశి వంటివి జ్యేష్ఠ మాసంలో వచ్చే ముఖ్యమైన వ్రతాలు. ప్రధానంగా వ్యవసాయానికి జ్యేష్ఠ మాసమే శ్రేష్ఠమైనదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అందరికీ అన్నం పెట్టే ఫలసాయానికి బీజం పడేది ఈ మాసంలోనే. అందుకే రైతులు ఆనందంగా ‘ఏరువాక’ జరుపుకుంటారు. వృషభ పూజలు ఈ మాసంలో విశేషంగా జరుగుతాయి. తమకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే పశువులకు కృతజ్ఞతా సూచకంగా రైతులు జ్యేష్ఠంలో వృషభ పూజలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే, వ్యవసాయంలో ప్రధానమైన ఖరీఫ్‍ సీజన్‍కు రైతులు శ్రీకారం చుట్టేది ఈ మాసంలోనే. ఇక, దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్య ఫలాలను ప్రసా దించే ‘జ్యేష్ఠ పౌర్ణమి’, శ్రీ మహా విష్ణువు ఆరాధనలో తరింప చేసే ‘అపర ఏకాదశి’ ఈ మాసంలో ఆధ్యాత్మిక సాధనాపరులకు ఉన్నతిని కలిగిస్తాయి. ఇంకా ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వాల విశేషాలు..
గమనిక: నిజానికి నిజ జ్యేష్ఠ మాసంలోని ఆయా తిథుల్లో ఆచరించే పూజాదికాలు, వ్రతాలనే అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే ఆయా తిథుల్లో యథావిధిగా ఆచరించవచ్చు.

(అధిక) జ్యేష్ఠ బహుళ పాడ్యమి
జూన్‍ 1, సోమవారం

ఇది జూన్‍ మాసం ప్రారంభ దినం. తిథి రీత్యా (అధిక) జ్యేష్ఠ బహుళ పాడ్యమి. ఈనాడు ‘కరవీర వ్రతం’ చేయాలని అంటారు. ‘కరవీర’ అంటే ఎర్ర గన్నేరు పత్రం. వినాయకుడిని పూజించే 21 రకాల పత్రిలలో కరవీర (గన్నేరు) ఒకటి. అలాగే ఈనాడు భద్ర చతుష్టయ వ్రతం చేయాలని వివిధ వ్రత గ్రంథాల ప్రకారం తెలుస్తోంది.

(అధిక) జ్యేష్ఠ బహుళ విదియ
జూన్‍ 2, మంగళవారం

(అధిక) జ్యేష్ఠ బహుళ విదియ నాడు ఆచరించాల్సిన పూజాధికాలు, వ్రతాలు ప్రత్యేకించి ఏమీ లేవు. యమునా నది పుష్కరాలు ఈనాటి నుంచే ప్రారంభం. శ్రీ పరాభవ నామ సంవత్సర అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి, జ్యేష్ఠా నక్షత్రం సోమవారం (1.6.2026) రాత్రి 1.49 గంటలకు గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి యమునా నది పుష్కరాలు జూన్‍ 1.. తెల్లవారితే 2వ తేదీ నుంచి ప్రారంభమై పన్నెండు రోజుల పాటు కొనసాగుతాయి. గురుడు (బృహస్పతి) కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. యమునా నదీ తీర ప్రాంతాల్లోని ప్రధాన ఘట్టా లైన యమునోత్రి, డెహ్రాడూన్‍, యమునానగర్‍, ఢిల్లీ, మధుర, బృందావన్‍, ఆగ్రా, అలహాబాద్‍లో ఈనాటి నుంచి పుణ్యస్నానాలను విశేషంగా ఆచరిస్తారు. అలాగే ఈ కాలంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు, దానధర్మాలు విరివిగా చేస్తారు. యమునా నదీ పుష్కరాల సమయంలో నిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో (వేకువజామున 4.30 నుంచి 6 గంటల మధ్యలో) స్నానం ఆచరించడం ముఖ్యం. పితృ తర్పణాలు వదలడం, దానాలు చేయడం, యమునా నదికి హారతి ఇవ్వడం వంటి కృత్యాలు ఆచరించాలి.

(అధిక) జ్యేష్ఠ బహుళ తదియ
జూన్‍ 3, బుధవారం

(అధిక) జ్యేష్ఠ బహుళ తదియ తిథి నాడు ప్రత్యేకించి ఆచరించదగిన వ్రతాలు, పూజాదికాలేమీ లేవు.

(అధిక) జ్యేష్ఠ బహుళ చవితి
జూన్‍ 4, గురువారం

(అధిక) జ్యేష్ఠ బహుళ చవితి నాడు ఉమా పూజ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో వివరించారు. దీనిని గణేశ చతుర్థి తిథిగానూ భావిస్తారు. అలాగే, శుక్లా దేవిని పూజించాలని అంటారు. ఈనాడు ఆచరించే సంకటహర చతుర్థి వ్రతం గణపతిని ఉద్దేశించి ఆచరించేది. ఇది విశేష ఫలితాలను అందించే వ్రతంగా పేరొందింది.

(అధిక) జ్యేష్ఠ బహుళ పంచమి
జూన్‍ 5, శుక్రవారం

(అధిక) జ్యేష్ఠ బహుళ పంచమి తిథి పితృ దేవతల ఆరాధనలకు ఉద్ధిష్టమైనది. ఈ కారణం గానే ఈనాడు పితృ దేవతలను విధిగా పూజిం చాలని ఆయా వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే, ఈనాడు జూన్‍ 5న ప్రపంచవ్యాప్తంగా ఏటా పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

(అధిక) జ్యేష్ఠ బహుళ షష్ఠి
జూన్‍ 6, శనివారం

(అధిక) జ్యేష్ఠ బహుళ షష్ఠి తిథి నాడు అరణ్య గౌరీ వ్రతం, వింధ్యవాసినీ పూజ చేయాలని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు అరణ్యాల్లో, కొండల్లో గౌరిని పూజించే వారికి సౌభాగ్యం కలుగుతుందని అంటారు. అలాగే, ఈనాడు కుమారస్వామిని పూజించడం కూడా పుణ్యప్రదం. షష్ఠి తిథి ఆయనకు ప్రియమైనది. అందుకే ఈనాడు ఆయనను విశేషంగా పూజిస్తారు. ఈనాటి పూజలను స్కద షష్ఠి పూజలుగా వ్యవహరిస్తారు.

(అధిక) జ్యేష్ఠ బహుళ సప్తమి
జూన్‍ 7, ఆదివారం

(అధిక) జ్యేష్ఠ బహుళ సప్తమి నాడు ద్వాదశ సప్తమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, వరుణ పూజ చేయాలని మరికొన్ని గ్రంథాలలో రాశారు.

(అధిక) జ్యేష్ఠ బహుళ అష్టమి
జూన్‍ 8, సోమవారం

(అధిక) జ్యేష్ఠ బహుళ అష్టమి దుర్గాష్టమి తిథి అని ఆమాదేర్‍ జ్యోతిషీ వ్రత గ్రంథంలో పేర్కొన్నారు. ఈనాడు దుర్గాదేవిని పూజిం చాలి. దీనినే దుర్గాష్టమి వ్రతం అంటారు. జ్యేష్ఠ బహుళ అష్టమి నాటి పూజను తిందుకాష్టమీ వ్రతదినమని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఏడాది పాటు ప్రతి మాసం శివపూజ చేయాలని రాశారు. అలాగే ఈ తిథి వినాయకాష్టమని అని నీలమత పురాణం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇంకా త్రిలోచన పూజ, శీతలాష్టమి అని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది.
ఈనాటి నుంచి మృగశిర కార్తె ప్రారంభ మవుతుంది.

(అధిక) జ్యేష్ఠ బహుళ నవమి
జూన్‍ 9, మంగళవారం

(అధిక) జ్యేష్ఠ బహుళ జ్యేష్ఠ శుద్ధ నవమి తిథి నాడు శుక్లాదేవిని పూజించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాడు శుక్లాదేవిని ‘బ్రహ్మణీ నామ్యా ఉమాయా: పూజా శుక్లాదేవి’ అని స్తుతించాలి.

(అధిక) జ్యేష్ఠ బహుళ దశమి
జూన్‍ 10, బుధవారం

(అధిక) జ్యేష్ఠ బహుళ దశమి నాడు దుర్గాపూజ చేయాలి. సాధారణంగా దశమి తిథి దుర్గాదేవికి ప్రత్యేకించినది.

(అధిక) జ్యేష్ఠ బహుళ ఏకాదశి
జూన్‍ 11, గురువారం

(అధిక) జ్యేష్ఠ బహుళ తిథి యోగినీ ఏకాదశి అని ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథంలో ఉంది. పరమ ఏకాదశి అని, సర్వ ఏకాదశి అని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. కుబేరుడు ప్రతి రోజూ శివపూజ చేస్తుండే వాడు. ఆ పూజకు అతని తోటమాలి ప్రతి రోజూ పూవులు అందిస్తుండే వాడు. తోటమాలి భార్యాలోలుడై ఒకసారి పూజ వేళకు కుబేరుడికి పువ్వులు అందించలేక పోయాడు. దీంతో కుబేరుడికి పట్టరాని కోపం వచ్చింది. అప్పుడు కుబే రుడు ఆ తోటమాలిని కుష్ఠు రోగ పీడితుడివి కావాలని శపించాడు. ఈ వ్యాధితో బాధపడుతున్న తోటమాలి ఈనాడు ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని శాస్త్రయుక్తంగా ఆచరించిన ఫలితంగా కుష్ఠు రోగం నుంచి విముక్తుడయ్యాడు. అలాగే ఈనాడు వట సావిత్రీ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఈ తిథి ప్రకారం మర్రిచెట్టు కింద ఉన్న సావిత్రిని రాత్రి వేళ పూజించాలి. ఈ వ్రతాన్ని జ్యేష్ఠ పూర్ణిమ నాడు, జ్యేష్ఠ అమావాస్య నాడు కూడా చేసే ఆచారం కూడా ఉంది. ఈనాడు స్త్రీలు ఉపవసించి జలముతో వటవృక్షాన్ని తడపాలి. ఆ చెట్టు చుట్టూ నూట ఎనిమిది (108) సార్లు దారం చుడుతూ ప్రదక్షిణం చేయాలి. మర్నాడు సువాసినీ స్త్రీలకు భోజనం పెట్టాలి. ఈ వ్రతం చేసే స్త్రీ సర్వదా సౌభాగ్యవతి అవుతుందని శాస్త్ర వచనం.

(అధిక) జ్యేష్ఠ బహుళ ద్వాదశి
జూన్‍ 12, శుక్రవారం

(అధిక) జ్యేష్ఠ బహుళ ద్వాదశి నాడు ప్రదోష వ్రతం ఆచరించాలి. ఇది తప్ప జ్యేష్ఠ బహుళ ద్వాదశి నాడు ప్రత్యేకించి ఆచరించదగిన వ్రతాలు, ముఖ్యమైన పూజాధికాలేమీ లేవు.

(అధిక) జ్యేష్ఠ బహుళ త్రయోదశి
జూన్‍ 13, శనివారం

(అధిక) జ్యేష్ఠ బహుళ త్రయోదశి మాస శివరాత్రి పర్వం. ఇది శివుడికి ప్రీతికరమైన తిథి. అలాగే ఈనాడు రోహిణి వ్రతం కూడా ఆచరిస్తారు. ఇక, త్రయోదశి తిథి శనీశ్వరుడి పూజలకు ఉద్ధిష్టమైనది. ఇది శనిదేవుడికి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున ఆయనకు తైలాబి •షేకం చేయడం, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా ఏలినాటి శని, అష్టమ శని దోషాలు తొలగి శని అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. ఈ తిథి నాటి సాయంత్రం ప్రదోష కాలంలో శనీశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం, ఆరాధన చేయడం శ్రేష్టం. నల్లటి వస్త్రాలు, నువ్వులు, ఇనుము, నల్లని మినుములు వంటి వస్తువులను దానం చేయడం మంచిది. న్యాయపరమైన వివాదాలు, శత్రుభయం, అనారోగ్య సమస్యలు, రుణబాధల నుంచి విముక్తి కోసం శని త్రయోదశి నాడు పూజలు చేస్తే ఉపశమనం కలుగుతుందని అంటారు.

(అధిక) జ్యేష్ఠ బహుళ చతుర్దశి
జూన్‍ 14, ఆదివారం

(అధిక) జ్యేష్ఠ బహుళ చతుర్దశి తిథి నాడు కూడా శివుడిని విశేషంగా ఆరాధిస్తారు. పితృదేవతలకు ఉద్దేశించిన కర్మలు కూడా నిర్వహిస్తారు.

(అధిక) జ్యేష్ఠ బహుళ అమావాస్య
జూన్‍ 15,సోమవారం

(అధిక) జ్యేష్ఠ బహుళ అమావాస్య నాడు భోగశాయి పూజ చేయాలని అంటారు. ఈ పూజ చేసి ఉపవాసం ఉండాలి. హేమాద్రి పండితుడు ఈ పూజకు సంబంధించిన వివరాలను హేమాద్రి వ్రత ఖండంలో పేర్కొన్నారు. ఇంకా ఈనాడు సుజన్మావాప్తి వ్రతం, సంక్రాంతి స్నాన వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. కాగా, ఈనాటి నుంచి మిథున సంక్రమణం. ఈనాటి నుంచి అధిక జ్యేష్ఠ మాస తిథులు ముగుస్తాయి. నిజ జ్యేష్ఠ మాసపు జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి తిథి కూడా జూన్‍ 15నే ఉంది. ఈనాడు కరవీర వ్రతం ఆచరించాలని వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే భద్రచతుష్టయ వ్రతం కూడా చేయాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది.

జ్యేష్ఠ శుద్ధ విదియ
జూన్‍ 16, మంగళవారం

జ్యేష్ఠ శుద్ధ విదియ నాడు ఆచరించాల్సిన పూజాధికాలు, వ్రతాలు ప్రత్యేకించి ఏమీ లేవు. అమావాస్య ముగిసిన తరువాతి రోజు కావడంతో ఈనాటి నుంచి చంద్ర దర్శనం.

జ్యేష్ఠ శుద్ధ తదియ
జూన్‍ 17, బుధవారం

జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు ‘రంభా వ్రతం’ ఆచరిస్తారు. దీనినే ‘రంభా తృతీయ’గా స్మ•తి కౌస్తుభం, తిథి తత్త్వం, పురుషార్థ చింతామణి, చతుర్వర్గ చింతామణి తదితర వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. ఇంకా రాజ్య వ్రతం, తివిక్రమ తృతీయ వ్రతం తదితర వ్రతాలు కూడా ఈనాడు ఆచరిస్తారని తెలుస్తోంది. అయితే, వీటన్నిటిలో ‘రంభా వ్రతం’ కొంత వరకు ఆచరణలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ రంభా వ్రత కథ..

తపోనిష్టలో ఉన్న శివుడికి ఉపచా రాలు చేసేందుకు హిమవంతుడు తన కుమార్తె పార్వతిని అప్పగించాడు. పార్వతిపై శివుడికి ప్రేమ కలగడానికి ఆ సమయంలో మన్మథుడు బాణాలు ప్రయో గించాడు. దీంతో శివుడికి చిత్తం చెదిరింది. పిమ్మట ఆగ్రహించిన శివుడు తన మూడో కన్ను తెరిచి చూశాడు. మన్మథుడు భస్మమ య్యాడు. శివుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
జరిగిన ఉదంతంతో పార్వతి చిన్నబుచుకుని ఇంటికి వచ్చేసింది. తల్లిని పట్టుకుని జరిగింది చెప్పి బావురుమంది. తల్లి ఓదార్చి, ఆమెను తండ్రి అయిన హిమ వంతుని వద్దకు తీసుకు వెళ్లింది. అంతలో అక్కడికి సప్త మహా మునులూ వచ్చారు. వారికి హిమవంతుడు తన కుమార్తె సంగతి చెప్పాడు.
అప్పుడు ఆ మునులలో ఒకరైన భృగువు- ‘బిడ్డా! ఒక వ్రతం ఉంది. దానిని ఆచరిస్తే నీకు శివుడే భర్త అవుతాడు’ అని అన్నాడు.

పార్వతి- ‘మహాభాగా! ఆ వ్రతం ఎలా చేయాలి?’ అని అడిగింది.

భృగువు- ‘బిడ్డా! ఆ వ్రతాన్ని పెద్దలు ‘రంభా వ్రతం’ అని అంటారు. రంభ అంటే అరటి చెట్టు. ఆ వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు ఆచరించాలి. నాటి ఉదయాన్నే స్నానం చేసి అరటి చెట్టు మొదట అలికి, పంచవన్నెల ముగ్గులు పెట్టాలి. రంభకు అధిష్ఠాన దేవత సావిత్రి. కాబట్టి అరటి చెట్టు కింద సావిత్రీ దేవిని పూజించాలి’ అని వివరించాడు.
‘మహాశయా! అరటిచెట్టుకు, సావిత్రీదేవి అధిష్టాన దేవత ఎలా అయ్యింది?’ అని పార్వతి ప్రశ్నించింది.

‘బిడ్డా! సావిత్రి, గాయిత్రి అని బ్రహ్మదేవుడికి ఇద్దరు భార్యలు. సావిత్రీదేవి సౌందర్య గర్వంతో ఒకసారి బ్రహ్మ వద్దకు వెళ్లడం మానేసింది. గాయిత్రి ఆమెకు నచ్చ చెప్పింది. అయినా సావిత్రి తన మంకుపట్టు వీడలేదు. దీంతో బ్రహ్మకు కోపం వచ్చింది. ఈ లోకాన్ని వదిలి మానవ లోకంలో బీజం లేని చెట్టువై పుట్టు అని సావిత్రిని శపించాడు. దీంతో సావిత్రికి పశ్చాత్తాపం కలిగింది. బ్రహ్మ కాళ్ల మీద పడి మన్నించాలని ప్రాథేయపడింది. గత్యంతరం లేక భూలోకాన అరటిచెట్టుగా పుట్టింది. ఆ చెట్టు రూపంలోనే ఐదేళ్లు బ్రహ్మ కోసం తపస్సు చేసింది. మనసు కరిగిన బ్రహ్మ ఆమెకు జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు ప్రత్యక్షమయ్యాడు.
‘నువ్వు ఒక అంశతో అరటి చెట్టును ఆశ్రయించుకుని ఉండు. అరటి చెట్టు ద్వారా నిన్ను పూజించే వారి కోరికలు ఈడేరుతాయి. ఇక నువ్వు నాతో సత్యలోకానికి వచ్చెయ్‍’ అని బ్రహ్మ ఆమెను తీసుకుని వెళ్లిపోయాడు. ఆ విధంగా సావిత్రికి శాప విమోచన అయిన దినం కాబట్టి జ్యేష్ఠ శుద్ధ తదియ పర్వదినమైంది’ అని భృగువు పార్వతికి వివరించాడు.
‘స్వామీ! ఈ వ్రతాచరణ విధం వివరించండి’ అని పార్వతి భృగువును కోరింది.

అప్పుడు భృగువు రంభా వ్రత నియమాల గురించి ఇలా వివరించాడు.

‘ముగ్గులు పెట్టిన అరటి చెట్టు కింద మంటపం వేయాలి. దానిని సరస పదార్థ సంపన్నం చేయాలి. అరటిచెట్ల నీడలో పద్మాసనం వేసుకుని సాయంకాలం వరకు కూర్చుని సావిత్రి స్తోత్రం చేయాలి. రాత్రి జాగరణ చేయాలి. మర్నాటి నుంచి రాత్రి జాగరణ అవసరం లేదు. పద్మాసనస్థ అయి, పగలు సావిత్రిని స్తుతిస్తూ, రాత్రులు అరటి చెట్ల కిందనే విశ్రమిస్తూ ఉండాలి. ఇలా నెల రోజులు చేసి ఆపై సరస పదార్థ సంపన్నమైన ఆ మంటపాన్ని పూజ్య దంపతులకు దానం చేయాలి. ఈ వ్రతాన్ని ఇంతకు మునుపు లోపాముద్ర చేసి భర్తను పొందింది’.
భృగువు చెప్పిన విధంగా పార్వతి రంభా వ్రతాన్ని ఆచరించింది. ఈ దీక్షకు శివుడు మెచ్చి ఆమెను పెళ్లాడాడు.

పద్మాసనం వేసుకుని కూర్చుని తపస్సు చేయాలనే చోట ‘కృత్యసార సముచ్ఛయం’ అనే గ్రంథంలో పంచాగ్ని సాధన చేయాలని ఉంది. పంచాగ్ని సాధన అనగా, నాలుగు పక్కలా నిప్పుల గుండాలు ఉంచు కుని తాను సూర్యుని వైపు రెప్పవేయకుండా చూస్తుండాలి. ఇది కఠోర దీక్ష.
రంభా వ్రతం ఆవిర్భావాన్ని బట్టి ఇది స్త్రీలకు ఉద్ధిష్టమైనదని తెలుస్తోంది. అరటిచెట్ల నీడన జ్యేష్ఠ శుద్ధ తదియ మొదలు ఆషాఢ శుద్ధ తదియ వరకు నెల రోజుల పాటు నివసించడం ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. వేసవిలో పగటి పూట చెట్ల నీడ దాహ తాపాన్ని తగ్గిస్తుంది. చల్లగా ఉంటుంది.
మన దేశం మీదికి దండెత్తి వచ్చిన అలెగ్జాండర్‍.. ఇక్కడి మునులు కొందరు ఈ చెట్ల ఫలాలు మాత్రమే తింటూ, ఈ చెట్లనే నివాసంగా చేసుకోవడం చూసి ఆశ్చర్యపోయాడట. అందు చేతనే అరటికి గ్రీకు భాషలో ‘సాపియంటమ్‍’ అనే పేరు పెట్టారు. దీనికి ‘జ్ఞానం కలది’ అని అర్థం. దీనిని బట్టి అరటి చెట్టు నీడ జ్ఞానదాయిని అని గ్రీకులు కూడా భావించినట్టు తెలుస్తోంది.
ఇక, రంభా వ్రతమే కాక, అరటి చెట్టుతో ముడిపడిన వ్రతం మరొకటి ఉంది. దీనిని ‘కదళీ వ్రతం’ అంటారు. అయితే, దీనిని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు కానీ, నాడు వీలు కాకపోతే కార్తీక శుద్ధ చతుర్దశి నాడు కానీ చేస్తారు. ఈ వ్రతం చేస్తే స్త్రీలు సౌభాగ్యవంతులై చిరకాలం జీవిస్తారని ప్రతీతి.

జ్యేష్ఠ శుద్ధ చవితి
జూన్‍ 18, గురువారం

జ్యేష్ఠ శుద్ధ చవితి తిథి నాడు ఉమాపూజ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో వివరించారు. అందుకే దీనిని ఉమా చతుర్థి అని కూడా అంటారు. ఈనాడు శుక్లా దేవిని పూజిం చాలని కూడా అంటారు. అలాగే, ఈ తిథిని గణేశ చతుర్థి తిథిగానూ భావిస్తారు. సాధారణంగా చవితి తిథి గణపతి సంబంధమైనదిగా భావిస్తారు.

జ్యేష్ఠ శుద్ధ పంచమి
జూన్‍ 19, శుక్రవారం

జ్యేష్ఠ శుద్ధ పంచమి తిథి పితృ దేవతల ఆరాధనలకు ఉద్ధిష్టమైనది. ఈ కారణంగానే ఈనాడు పితృ దేవతలను విధిగా పూజించాలని ఆయా వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.

జ్యేష్ఠ శుద్ధ షష్ఠి
జూన్‍ 20, శనివారం

జ్యేష్ఠ శుద్ధ షష్ఠి తిథి నాడు అరణ్య గౌరీ వ్రతం, వింధ్యవాసినీ పూజ చేయాలని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు అరణ్యాల్లో, కొండల్లో గౌరిని పూజించే వారికి సౌభాగ్యం కలుగుతుందని అంటారు. అలాగే, ఈనాడు కుమారస్వామిని పూజించడం కూడా పుణ్యప్రదం. ఈనాడు ఆయనను పూజించడాన్నే స్కంద షష్ఠిగా వ్యవహరిస్తారు. కార్తికేయుడు తారకాసురుడిని సంహరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈనాడు పూజలు చేస్తారు. అలాగే దీనిని శీతల షష్ఠిగానూ పంచాంగాలలో పేర్కొన్నారు.
శీతల షష్ఠి అనేది శివపార్వతుల వివాహాన్ని స్మరించుకుంటూ జ్యేష్ఠ శుద్ధ షష్ఠి నాడు నిర్వహించుకు• పవిత్రమైన హిందూ పర్వం. ముఖ్యంగా ఒరిస్సాలోని సంబల్‍పూర్‍లో ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో శివుడు- పార్వతిల దివ్య కలయికను ఉత్సవంగా నిర్వహిస్తారు. శివపార్వతుల కల్యాణం ఈ జ్యేష్ఠ మాసంలోని ఈ తిథి నాడే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. ఈనాడు వ్రతాన్ని ఆచరించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయని, సంతానం కలుగుతుందని, కుటుంబంలో సుఖసంతోషాలు లభిస్తాయని అంటారు. ఒరిస్సాలో ఈనాడు పొయ్యి వెలిగించరు. ముందురోజు వండిన చల్లటి ఆహారాన్ని శివుడికి నైవేద్యంగా నివేదించిన అనంతరం తాము స్వీకరిస్తారు. శివ-శక్తి కలయికను, రుతుపవనాల రాకను సూచించే పండుగగా పూర్వీకులు ఈ పర్వాన్ని భావిస్తారు.

జ్యేష్ఠ శుద్ధ సప్తమి
జూన్‍ 21, ఆదివారం

జ్యేష్ఠ శుద్ధ సప్తమి నాడు ద్వాదశ సప్తమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు. అలాగే, ఈనాడు వరుణ పూజ చేయాలని మరికొన్ని గ్రంథాలలో ఉంది. అలాగే దీనిని భాను సప్తమి అనీ వ్యవహరిస్తారు. ఇది సూర్యుడికి సంబంధించినది.
కాగా, ఏటా జూన్‍ 21న ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహిస్తారు. యోగాకు భారతదేశమే పుట్టినిల్లు. అలాగే, ఈనాడు సంగీత దినోత్సవం కూడా.

జ్యేష్ఠ శుద్ధ అష్టమి
జూన్‍ 22, సోమవారం

జ్యేష్ఠ శుద్ధ అష్టమి తిథి దుర్గాపూజకు ఉద్ధిష్టమైన తిథి. అందుకే దీనిని దుర్గాష్టమి అనీ అంటారు. ఈ తిథినే త్రిలోచనాష్టమిగా ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో వర్ణించారు. ఈనాడు కొన్ని తావుల్లో వృషభ వ్రతాన్ని ఆచరిస్తారు. బహుషా ఇది రైతులు ఆచరించే పూజాదికం కావచ్చు. ఇక, ఈనాటి నుంచి ఆర్ద్ర కార్తె ప్రారంభం అవుతుంది.

జ్యేష్ఠ శుద్ధ నవమి
జూన్‍ 23, మంగళవారం

జ్యేష్ఠ శుద్ధ నవమి తిథి నాడు శుక్లా దేవిని పూజించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాడు శుక్లాదేవిని ‘బ్రహ్మణీ నామ్యా ఉమాయా: పూజా శుక్లాదేవి’ అని స్తుతించాలి.

జ్యేష్ఠ శుద్ధ దశమి
జూన్‍ 24, బుధవారం

జ్యేష్ఠ శుద్ధ దశమి కొందరికి సంవత్సరాది దినంగానూ పరిగణనలో ఉంది. ఈనాడు వారు స్నానం, దానం చేయడాన్ని ముఖ్యమైన విధులుగా భావిస్తారు. జ్యేష్ఠ శుద్ధ దశమి తిథికి ‘దశపాపహర దశమి’ అని పేరు. గంగాదేవి కృపను సంపాదించడం ప్రధాన ఉద్దేశంగా దశపాపహర దశమిని జరుపుకుంటారు. అందుకే ఈ ఉత్సవాన్ని గంగోత్సవమని కూడా అంటారు. గంగానది నీరు అతి పవిత్రమైనది. ఎన్నాళ్లు నిలువ ఉన్నా చెడిపోదు. గంగా తీర ప్రదేశాలు అనేకం తీర్థ స్థలాలై ఉన్నాయి. అందుకే దశపాపహర దశమి లేదా గంగోత్సవ పర్వం నదీతీర గ్రామాల్లో విస్తరించి ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా జరుగుతుంది. కాశి, హరిద్వార్‍, నాసిక్‍, మధుర, ప్రయాగ మొదలైన నదీ తీర నగరాల్లో గంగోత్సవాన్ని ఎక్కువగా ఆచరిస్తారు. ఈ ప్రదేశాల్లో అక్కడక్కడ గంగాదేవి ఆలయాలు ఉండటం కూడా మరో కారణం. ఈనాడు అక్కడ గంగాపూజ విశేషంగా జరుగుతుంది. దశ పాపహర దశమి అంటే, పది రకాల పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. దీన్ని జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజుల పాటు ఆచరించాలి. ఈ తిథి నాడు ఏ నదిలో స్నానం చేసినా అది విశేష ఫలాన్నిస్తుంది. గంగానదిలో చేస్తే ఇంకా ఫలం. కాశీలోని దశాశ్వమేధ ఘాట్‍లో గంగాస్నానం మరీ విశేషం. అలాగే, గంగావతరణ ఈనాడే జరిగిందని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. జ్యేష్ఠ శుక్ల దశమి, బుధవారం, హస్తా నక్షత్ర కాలంలో గంగావతారణం జరిగిందనీ, ఈ విషయాన్ని వాల్మీకి రామాయణం చెబుతోందని వ్రతోత్సవ చంద్రికాకారుడు చెబుతున్నాడు.
వైశాఖ శుక్ల సప్తమి నాడు గంగావతరణ జరిగిందని కొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. అయితే, జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు ఏ విధంగా చూసినా గంగాదేవి పూజకు ఉద్ధిష్ట మైనది. ఎందుకంటే, ఈనాడు ఆచరించే దశపాపహర దశమి వ్రతం గురించి స్కంధ పురాణంలో విపులంగా ఉంది. జ్యేష్ఠ శుక్ల దశమి సౌమ్యవారంతో హస్తా నక్షత్రంతో కలిసి వచ్చిన నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సర్వ పాపాలు సమసిపోతాయని నమ్మిక. జ్యేష్ఠ శుక్ల పాడ్యమి మొదలు దశమి వరకు రోజూ స్త్రీలు పిండి వంటలు చేస్తారు. రోజూ పదేసి భక్ష్యాలు దక్షణయుక్తంగా గురువులకు ఇస్తారు. పదకొండో నాడు, అనగా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. ఉపవాస కాలంలో పచ్చి మంచినీళ్లయినా ముట్టకూడదు. అదే నిర్జలైకాదశి.

జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి
జూన్‍ 25, గురువారం

జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి తిథి నిర్జలైకాదశి. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు గంగోత్సవాలు జరుగుతాయి. జ్యేష్ఠంలో ఎండలు మెండుగా ఉంటాయి. భూమిలో నీటిమట్టం చాలా అడుగుకు పడిపోతుంది. అటువంటి మండు వేసవిలో ఈ ఏకాదశి నాడు పచ్చి మంచినీళ్లయినా ముట్ట కుండా ఉపవాసం ఉంటారు. అందుచేతనే దీనికి నిర్జలైకాదశి (నిర్జల + ఏకాదశి) అనే పేరొచ్చింది. ఈ ఏకాదశి భీముడి కారణంగా ఏర్పడినట్టు చెబుతారు.
భీముడు తిండిపోతు. ఒక పూట కూడా తిండి లేకుండా ఉండ లేడు. అందుచేత దశమి నాడు ఏకభుక్తం మాత్రం చేసి ఏకాదశి నాడు ఒక పూట అయినా భోజనం లేకుండా అతడు ఉండలేడు. ఒకసారి భీముడు ఇదే విషయమై వ్యాసుడి వద్దకు వెళ్లాడు. అప్పుడు వ్యాసుడు భీముడితో ‘నువ్వు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు నీళ్లుకానీ, అన్నం కానీ తినకుండా ఉండు. ఏడాదిలోని ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలను చేసిన ఫలితం నీకు కలుగుతుంది’ అని చెప్పాడు. భీముడు అలాగే చేశాడు. ఏడాదికి ఒక వ్రతాన్ని చేసి భీముడు ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాల ఫలితాలను పొందాడు. కాబట్టే నిర్జల ఏకాదశి అంత మహత్తయినది. ఈ ఏకాదశి పర్వం గురించి చతుర్వర్గ చింతామణి, స్మ•తి కౌస్తుభం తదితర వ్రత గ్రంథాలలో విపులంగా ఉంది. ఇంకా ఇదే తిథి నాడు జయంతి దినం. లోకానికి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించిన మహాద్రష్ట విశ్వా మిత్రుడు. ఆయన నుంచి జాలువారిన ఈ 21 బీజాక్షరాల గాయత్రి మంత్రం ఆధ్యాత్మికంగానే కాదు.. ఆరోగ్యపరంగానూ ఎంతో ప్రభావం చూపుతుందని వివిధ అధ్యయనాల్లో తేలింది.

జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి
జూన్‍ 26, శుక్రవారం

జ్యేష్ట శుద్ధ ద్వాదశి తిథి నాడు చంపక ద్వాదశి వ్రతాన్ని ఆచరించాలని గదాధర పద్ధతి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు త్రివిక్రమ పూజ చేయాలని కూడా అంటారు. అలాగే, దీనిని రామలక్ష్మణ ద్వాదశి అని కూడా అంటారు. ఈనాడు కూర్మ జయంతి అని కొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. శ్రీశంకరాచార్య కైలాసగమనం ఈ తిథి నాడే జరిగింది.

జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి
జూన్‍ 27, శనివారం

మూడు వ్రతాలు చేసే ముహూర్త దినం- జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి.
ఒకటి- దుర్గంధ దౌర్భాగ్య నాశన త్రయోదశీ వ్రతం.
రెండు- జాతి త్రిరాత్రి వ్రతం.
మూడు- రంభా త్రిరాత్రి వ్రతం.
చివరి రెండు వ్రతాలు ఈనాటి రాత్రి మొదలు మూడు రాత్రుల పర్యంతం సాగేవి. ఈ మూడు వ్రతాల రీత్యానే కాక ఈనాడు మరొక విషయం చేత కూడా ఉద్ధిష్టమై ఉంది. ఈ తిథి విద్యారణ్యారాధాన దినం కూడా. విద్యారణ్యుల వారు ఈ తిథి నాడే సిద్ధి పొందారు. విద్యారణ్య స్వామి వేదత్రయ భాష్యకర్త. విద్యానగరమును, విద్యానగర సామ్రాజ్యాన్ని నిర్మించిన వాడు. లౌకికం, వైదికం.. రెండింటా అసమాన ప్రతిభ గలవారీయన. ఆయనకు వివేకం తెలిసే సరికి ఉత్తర హిందుస్థానమంతా మహ్మదీయుల వశమైంది. దక్షిణాదినా అన్య మతస్తులు అక్కడక్కడా అడుగుపెట్టారు. ఇవి విద్యారణ్యస్వామిని కలతపెట్టాయి. అప్పుడు ఆయన తుంగభద్ర నదీ తీరాన భువనేశ్వరి అమ్మవారిని గురించి తీవ్రమైన తపస్సును గాయత్రీ మంత్రంతో ప్రారంభించారు. అమ్మవారు ప్రసన్నురాలై ప్రత్యక్షమైంది. వరం కోరుకొమ్మనగా, ఐశ్వర్యం కోరుకున్నారు. అమ్మ వారు అది వీలు కాదంది. దీంతో అక్కడికక్కడే విద్యారణ్య పేరుతో సన్యసించి శృంగేరి పీఠాధిపత్యం స్వీకరిం చారు. విరూపాక్ష పీఠం నెలకొల్పినది ఈయనే. హరిహర రాయలు, బుక్కరాయలుకు కొంతకాలం ఈయన మంత్రిగానూ ఉన్నారు.
విద్యారణ్య స్వామి ఆంధ్రుడా, ద్రవిడుడా, కర్ణాటకుడా, మహారాష్ట్రుడా అనే సందేహం ఉంది. ఆయన జాతి విషయమై వివరణ ‘విద్యారణ్య చరిత్ర’లో ఉంది. ఆయన ఆంధ్రుడే అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. ఆది శంకరుల తరువాత అంతటి వారు విద్యారణ్య స్వామి. ఆది శంకరుడు కశ్మీరం నుంచి శృంగేరికి తెచ్చిన శారదా విగ్రహం చందన ప్రతిమను విద్యారణ్య స్వామి తన హయాంలో పంచలోహాలతో తయారు చేయించి పూర్ణకుంభాలతో అభిషేచనం చేశారు. ఆ విగ్రహమే నేటికీ శృంగేరీ పీఠంలో పూజలందుకుంటోంది.

జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి
జూన్‍ 28, ఆదివారం

జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి చంపక చతుర్దశి. ఈనాడు వాయు వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి, రుద్ర వ్రతం చేయాలని స్మ•తి కౌస్తుభం చెబుతున్నాయి.

జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ
జూన్‍ 29, సోమవారం

వర్ష రుతువు ఆరంభానికి సంకేతం.. జ్యేష్ట శుద్ధ పూర్ణిమ. ఈనాడు జరుపుకునే పర్వం ఏరువాక పున్నమి. ఇదే తెలుగునాట ఏరువాక పున్నమిగా ప్రసిద్ధి. మన పంచాంగంలో జ్యేష్ఠ పూర్ణిమ నాటి వివరణలో ‘వృషభ పూజా, హల ప్రవాహ’ తదితర పదాలున్నాయి. ఎద్దులను పూజించడం, నాగలి సాగించడం ఈనాటి విధాయ కృత్యాలని ఈ పదాలకు గల అర్థాలను బట్టి తెలుస్తోంది.
ఏరువాక అంటే వివిధ అర్థాలున్నాయి.
ఏరు= సర్వావయవములు గల నాగలికి ఎడ్లను కట్టినది, సర్వావయవములు గల నాగలి.
ఏరువాక= దున్నుటకు ఆరంభం.
శబ్ద రత్నాకరం నిఘంటువులో పేర్కొన్న ప్రకారం..
ఏరు= ఎద్దులను కట్టి దున్నుటకు సిద్ధంచేసిన నాగలి.
ఏరువాక= దుక్కి యొక్క ప్రారంభం.
ఈ రెండు అర్థాలను విశదీకరించి చూస్తే ఇది వ్యవసాయదారులకు సంబంధించిన పర్వమని స్పష్టంగా తెలుస్తోంది.
ఏరువాక పున్నమిని వర్ష రుతువు ఆరంభంలో ఆచరిస్తారు. ఈ సమయంలో వర్షాలు కురిసి భూమి పదునెక్కితే పునర్వసు కార్తెలో పునాస విత్తనాలను జల్లుతారు. ఈ పని పునర్వసు కార్తెలో జరుగుతుంది కాబట్టే ఈ కాలంలో పండే పంటను పునాస పంట అంటారు.
ఏరువాక పండుగ నాడు రైతులు ఎద్దులను శుభ్రంగా కడుగుతారు. వాటి కొమ్ములకు రంగులను పూస్తారు. గజ్జెలు, గంటలు, అద్దం, కుచ్చులు తదితరాలను ఎద్దులకు అలంకరిస్తారు. ఉదయాన్నే ఇంట్లో పొంగలి (పులగం) వండి ఎద్దులకు పెడతారు. ఎద్దులను కట్టి ఉంచే కాడికి ధూపదీప నైవేద్యాలు ఇస్తారు. సాయంకాలం తప్పెట, మేళం తదితర మంగళవాద్యాలతో ఎద్దులను ఊరి బయటకు తోలుకుని వెళ్తారు. ఊరి పొలిమేరలో పుంటినారతో చేసి తోరణాన్ని కడతారు. ఈ తోరణాన్ని రైతులు తమ చర్నాకోలలతో కొట్టి పీచుపీచు చేసి ఎవరికి దొరికిన పీచు వారు తీసుకునిపోతారు. దానిని ఇంట్లో పెట్టుకుంటారు. ఇది పశువులకు మేలు కలిగిస్తుందనేది వారి నమ్మకం.
కన్నడనాట కూడా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు ఇదే మాదిరిగా ఎద్దులను పూజిస్తారు. ఈ పర్వాన్నే వారు ‘కారుణిపబ్బ’ అని పిలుస్తారు.
ఏరువాక పున్నమి పూర్వ కాలం నుంచి ఆచరణలో ఉన్న పర్వం. మనది వ్యవసాయ ప్రధాన దేశం కావడంతో అనాదిగా ఇది ఆచారంగా వస్తోంది.
ఎద్దులతో మన రైతులది అవినాభావ సంబంధం.
‘ఎద్దులు లేని సేద్యం చద్దిలేని పయనం’
‘ఒంటి ఎద్దుసేద్యం వరిగాలు నొప్పి’
‘గొడ్లు, వడ్లు ఉన్న వాడిదే వ్యవసాయం’
‘ఎక్కువ వెల పెట్టి గుడ్డను తక్కువ వెల పెట్టి గొడ్డును కొనకూడదు’
తెలుగు నాట ప్రాచుర్యంలో గల ఈ సామెతలన్నీ ఎద్దుల ప్రాముఖ్యతను తెలిపేవే.
ఇక, జ్యేష్ఠ పూర్ణిమ.. సావిత్రీ వ్రతాచరణ దినం కూడా. ఈనాడు బంగారంతో కానీ, మట్టితో కానీ సావిత్రీ, సత్యవంతుల ప్రతిమలను చేసి యథాశక్తి పూజించాలి. ఆ రాత్రి సావిత్రి చరిత్ర వింటూ జాగారం చేయాలి. తెల్లవారిన తరువాత సావిత్రి ప్రతిమను దక్షిణసహితంగా దానం చేయాలి. ఇది స్త్రీలకు సౌభాగ్యప్రదమైన వ్రతం. ఇంకా ఈనాడు తిలచ్ఛత్రాదిదానం, బిల్వత్రిరాత్రి, పుత్రకామ, అశోకత్రిరాత్ర తదితరమైన వ్రతాలు కూడా చేస్తారని వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. ఆమాదేర్‍ జ్యోతిషి అనే గ్రంథంలో ఈ వ్రతాన్ని గురించి స్నాన పూర్ణిమ వ్రతంగా పేర్కొంది.
జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు వట పూర్ణిమ వ్రతం కూడా ఆచరిస్తారు. దీనినే వట సావిత్రీ వ్రతం అనీ అంటారు. వివాహితలైన స్త్రీలు జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు ఈ పర్వాన్ని ఆచరిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉంటారు. స్త్రీలకు వైధవ్యం రాకుండా ఈ పర్వం చేస్తుందని అంటారు. ఇది మూడు రోజుల వ్రతం. త్రయోదశి నాడు మొదలుకుని పౌర్ణమి వరకు ఉపవసిస్తారు. కొందరు పౌర్ణమి నాడు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వట అంటే మర్రి చెట్టు. ఆ చెట్టుకు ఈనాడు పూజలు చేస్తారు. మర్రిచెట్టుకు దారం చుడుతూ పదకొండు ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని అంటారు.
జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజున చేసే వస్త్ర దానాలు విశేష ఫలాన్నిస్తాయి.
కాగా, కబీరుదాసు జయంతి తిథి కూడా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడే.

తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం
జూన్‍ 26 నుంచి 28వ తేదీ వరకు..

కలియుగ వైకుంఠమైన తిరు మలలో బ్రహ్మాండనాయకుడు నిత్య వైభవమూర్తి. నిత్య కల్యాణం పచ్చ తోరణంలా విలసిల్లే తిరుమలలో జరిగే అనేకానేక ఉత్సవాల్లో జ్యేష్ఠాభిషేకం ఒకటి. తిరుమల పురాణం ప్రకారం, తెలుగు పంచాంగాల ప్రకారం ఈ ఉత్సవాన్ని పవిత్రమైన జ్యేష్ఠ మాసంలో నిర్వహిస్తారు. జ్యేష్ఠ నక్షత్రం పూర్తయ్యే రోజున ఉత్సవం ముగుస్తుంది. ఈ మూడు రోజుల వేడుక జ్యేష్ఠ మాసంలో వస్తుంది కాబట్టి దీనిని జ్యేష్ఠాభిషేకం అంటారు. దీనినే ‘అభిధ్యేయక అభిషేకం’ అని కూడా అంటారు.
చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి అత్యంత సమీపంలో ఉండే సమయంలో సకల లోకాలను జయించిన త్రివిక్రముని రూపంలో శ్రీమహావిష్ణువును పూజించడమే ఈ అభిషేకంలోని పరమార్థం.

‘అభిధ్యేయం’ అంటూ రక్షా కవచం లేదా కవచం. అంటే నాశనం చేయలేనిదని అర్థం. చెడుతో పోరాడడానికి, ధర్మస్థాపనకు కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడు ఈ రక్షా కవచంతో అవతరించాడు.

అంతటి విశేషమైన ఈ దేవుని రక్షా కవచానికి నిర్వహించే ప్రత్యేక అభిషేకమే- జ్యేష్ఠాభిషేకం. ఈ అభిషేకం సమయంలో దేవుని కవచాన్ని తొలగించిన మూడు రోజుల పూజల్లో తిరిగి వాటిని అలంకరిస్తారు. ఈ పక్రియను అభిధ్యేయకమని అంటారు. కాబట్టి ఈ పండుగను అభిధ్యేయక అభిషేకం అనీ వ్యవహరిస్తారు.
ఈ ఉత్సవం జ్యేష్ఠ మాసంలో, సాధారణంగా జూన్‍ నెలలో వస్తుంది. ఈ దివ్యోత్సవం రెండు వందల సంవత్సరాల పురాతనమైనది.

ఆలయ గాథ ప్రకారం.. సంవత్సరం పొడవునా తిరుమలలో దేవదేవునికి జరిగే ఉత్స వాలు అన్నీ ఇన్నీ కావు. ఆయా ఉత్సవాల సందర్భంగా ఊరేగింపులు, తిరుమంజనం (పవిత్ర స్నానం) నిర్వహించేటపుడు మలయప్ప స్వామి, ఆయన దేవేరులైన శ్రీదేవి, భూదేవిల ఉత్సవ విగ్రహాలకు సంభవించే నష్టం నుంచి రక్షించడానికి ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. అంటే వివిధ ఉత్సవాల సమయంలో ఉత్సవమూర్తుల విగ్రహాలు అరిగిపోవడం, నష్టం కలగడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈ కారణంగా ఉత్సవమూర్తుల కళాకాంతులు తరిగిపోకుండా వివిధ కవచాలను విగ్రహాలకు అలంకరించి, పరిరక్షణ చేసే ఉద్దేశంతో ఈ అభిషేకాన్ని నిర్వహిస్తారు.
ఇది మూడు రోజుల ఉత్సవం. ప్రతి రోజూ రెండవ గంట మోగిన తరువాత స్వామి వారిని, ఆయన దేవేరులను సంపంగి ప్రాకారంలోని కల్యాణోత్సవ మండపానికి తరలించి, వేద మంత్రాల పఠనం మధ్య స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. స్నపన తిరుమంజనంలో పసుపు, చందనం, తేనె, పాలు, పెరుగు వంటి సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర జలంతో దేవతా విగ్రహాలకు స్నానం చేయిస్తారు.
తరువాత రోజులలో ప్రతి ఒక్కదారిలోనూ స్వామి, ఆయన దేవేరులను వేర్వేరు వస్త్రాలతో (ప్రత్యేక కవచాలతో) అలంకరిస్తారు.

మొదటి రోజున స్వామి వారి నిత్య కవచమైన స్వర్ణ కవచాన్ని తొలగించి వజ్రకవచం (వజ్రాలు పొదిగిన కవచం) అలంకరిస్తారు.

రెండవ రోజున ముత్యాల కవచం (ముత్యాలు పొదిగిన కవచం) ధరింపచేస్తారు.

ఏడాది మొత్తం మీద శ్రీవారికి ఈ జ్యేష్ఠాభిషేకం సమయంలోనే వజ్ర, ముత్యాల కవచాలను అలంకరిస్తారు.

ఇక, చివరిదైన మూడవ రోజున శ్రీవారికి స్వర్ణ కవచం అలంకరిస్తారు. ఈ స్వర్ణ కవచం మాత్రం శ్రీవారికి సంవత్సరం పొడవునా అలంకరించి ఉంటుంది. మళ్లీ తరువాత సంవత్సరంలో వచ్చే జ్యేష్ఠాభిషేకం సమయంలో మాత్రమే దానిని తొలగించి పవిత్ర పూజల అనంతరం తిరిగి అలంకరింప చేస్తారు.
ఈ మొత్తం పక్రియనే జ్యేష్ఠాభిషేకం అంటారు. దీనిని తిలకించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక టికెట్లు జారీ చేస్తుంది. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

జ్యేష్ఠ మాస విశేషాలు, ప్రత్యేకతలు
2 జ్యేష్ఠ మాసం శ్రేష్టమైనది. ఇది బ్రహ్మదేవుడిని ఆరాధించడానికి అనువైన మాసం.
2 జ్యేష్ఠ మాసంలో గృహ నిర్మాణాన్ని ఆరంభించరాదని మత్స్య పురాణం చెబుతోంది.
2 స్త్రీలకు సౌభాగ్యాన్నిచ్చే వ్రతాలకు జ్యేష్ఠ మాసం పెట్టింది పేరు. రంభా వ్రతం, రంభా తృతీయా, సావిత్రీ వ్రతం, వట సావిత్రీ వ్రతం వంటివన్నీ మహిళలకు మంగళకరమైన ఫలితాలనిచ్చే వ్రతాలే.
2 ఈ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశి ప్రత్యేకమైది. ఇది మండు వేసవి సమయంలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి తిథి నాడు ఈ పర్వం వస్తుంది. ఈనాడు పచ్చి మంచినీళ్లయినా ముట్టకుండా ఉపవాసం ఉంటారు. ఈ ఒక్క ఏకాదశి నాడు ఈ ఉపవాసం ఆచరిస్తే ఏడాది మొత్తంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు చేసిన ఫలితం కలుగుతుందని అంటారు.
2 జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు వచ్చే దశపాపహర దశమి నాడు దశాశ్వమేథ ఘాట్‍ లోని లింగాన్ని దర్శించకున్నట్టయితే లోగడ పది జన్మలలో చేసిన పాపాలు నిస్సందేహంగా హరించిపోతాయని అంటారు. అందుకు అద్దం పట్టేదే ఈ కింది శ్లోకం
లింగం దశాశ్వమేధేశం
దృష్ట్యా దశహరాతిథ్‍
త్యజ్యతే నాత్రసంశయ
2 జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు రంభా వ్రతం అతి విశిష్టమైనది. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా భృగు మహర్షి ఉపదే శించగా, పార్వతీదేవి ఆచరించి శివుడిని భర్తగా పొందింది. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు సౌభాగ్యవంతులై చిరకాలం జీవిస్తారని అంటారు.
2 అధిక జ్యేష్ఠ – నిజ జ్యేష్ఠ తిథుల కలయికతో కూడిన జూన్‍ మాసం.. అటు మండు వేసవికి, ఇటు వర్ష రుతువు ఆరంభ దినాలకు వారధిగా ఉంది. నెల చివరకు వచ్చేసరికి ఎండలు చల్లబడతాయి.

Review మాసం.. విశేషం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top