వినాయకుడు.. శ్రీకృష్ణుడు.. ఒకరు విఘ్నాలను హరించే విఘ్నహర్త.. మరొకరు విశ్వాన్ని నడిపించే సృష్టికర్త.. ఏ పనైనా మొదలుపెట్టే ముందు వినాయకుడిని తలుచుకునే తొలి అడుగు వేసేది..
ఆ పని ముందుకు సాగడానికి మలి అడుగులు పడేది కృష్ణుడు చలువతోనే..
విఘ్నేశ్వరుడు మనకు మంచి ఆరంభాన్ని, స్థిరత్వాన్ని, వివేకాన్ని ప్రసాదిస్తాడు..ఆ లక్షణాల సాయంతో మన జీవనయానాన్ని గమ్యానికి చేర్చే మార్గదర్శనం చేసేవాడు కృష్ణుడు..
భారతీయ ఆధ్యాత్మిక పరంపరలో వీరిద్దరూ విశిష్ట దైవాలు. అత్యంత పూజనీయమైన, అత్యున్నతమైన వీరిద్దరి రూపాలు, లీలలు, తత్త్వాలు భిన్నంగా కనిపించినా.. వారి మూలతత్త్వంలో, ఆధ్యాత్మిక అంతరార్థంలో అద్భుతమైన సారూప్యాలు ఉన్నాయి. తత్త్వాలు వేరైనా..చివరకు ఇద్దరూ చాటేది ఒకటే పరమ సత్యాన్ని!.
ఆ పరమ సత్యమే- మోక్షం, ఆత్మసాక్షాత్కారం.!! సెప్టెంబరు మాసం ఈ రెండు విశిష్ట దైవాలను ఆరాధించేందుకు, వారు చాటే పరమసత్యాన్ని గ్రహించడానికి ఒక సందర్భంగా నిలుస్తోంది.
అధిగమించే శక్తి కోసం మొదట వినాయకుడిని స్మరించాలి.
ఆరంభించిన ఆ ప్రయాణంలో నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని, బాధత్యలను నిస్వార్థ భావంతో, భగవద్గీత నేర్పిన కర్మయోగ సిద్ధాంతంతో పూర్తి చేసేందుకు కృష్ణుడి మార్గాన్ని అనుసరించాలి.
‘ఎలా ప్రారంభించాలి?’ (డైరెక్షన్) అనేది వినాయకుడు నేర్పితే, ‘గమ్యాన్ని ఎలా చేరాలి?’ (డెస్టినేషన్, యాక్షన్) అనే మార్గదర్శనం చేసేది కృష్ణుడు.
బుద్ధి, జ్ఞానస్వరూపులు..
వినాయకుడు బుద్ధిప్రదాత. జ్ఞానస్వరూపుడు. వ్యాస మహర్షి మహాభారతాన్ని చెప్పగా.. తన దంతంతో రాసినా మహా ఇతిహాసాన్ని లోకానికి అందించిన వాడు వినాయకుడు. తద్వారా లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించాడు ఏకదంతుడు.
ఇక, కృష్ణుడూ జ్ఞాన సముద్రుడే. సకల వేదాల సారాంశమైన భగవద్గీతను అర్జునుడికి బోధించి.. తద్వారా సకల మానవాళికి దానిని చేర్చి అందరి హృదయాల్లో జ్ఞానజ్యోతిని వెలిగించిన అజ్ఞానాంతకుడు.
ఆబాలగోపాలానికీ ఆనందప్రియులే..
ఇద్దరూ ఇద్దరే. ప్రత్యేకించి పిల్లలకు వీరిద్దరూ ఎంతో ఇష్టమైన రూపాలు. వీరి బాల్యచేష్టలు అందరికీ ఆనందదాయకమైనవే.
వినాయకుడు మోదకప్రియుడు. బొజ్జ గణపయ్యగా.. చూడగానే ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే రూపధారి. గణపతిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం. కొంచెం గరిక, కొన్ని ఉండ్రాళ్లు నివేదిస్తే చాలు.. ప్రసన్నవదనుడై వాటిని అమితానందంతో స్వీకరిస్తాడు. ఆ గజముఖుడి మోములోని చెరగని చిరునవ్వు నిత్యానందానికి సంకేతం.
బాలకృష్ణుడి బాల్యచేష్టలకు మురిసిపోనిది ఎవరు? వెన్నదొంగగా, గోపికలను ఆటపట్టించే లీలలతో నిత్యానందానికి ప్రతీకగా నిలుస్తాడు ఆనందసాగరుడైన ఆ నందనందనుడు. కృష్ణుడి చిన్ననాటి చేష్టలు, రాసలీలలను కేవలం అల్లరిగా చూడటం సరికాదు. అవి మాయను, జీవుల హృదయాలనూ హత్తుకునే పరమాత్మ లీలలు.
అందుకే ఈ రెండు దైవాలూ భక్తసులభులయ్యారు.
అణకువ, నిరాడంబరత..
శివపార్వతుల పుత్రుడైన లంబోదరుడు భారీకాయుడైనప్పటికీ అతి చిన్నదైన మూషికాన్ని (ఎలుక) తన వాహనంగా స్వీకరించాడు. ఎలుక మనసులోని అశాంతికి, కోరికలకు ప్రతీక. వాటిని అణచిపెట్టి తన నియంత్రణలో ఉంచుకోవడం వినాయకతత్త్వం. అటువంటి ఎలుకను వాహనంగా స్వీకరించడమనేది ఆయన నిరాడంబరతకు, సమస్త జీవకోటి పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం. అందుకే ఈ ఓంకార స్వరూపుడు ఆశ్రిత వత్సలుడయ్యాడు.
లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు సాక్షాత్తూ పరబ్రహ్మ అయినా.. నిరుపేద అయిన కుచేలుడితో తుదకంటూ స్నేహం సాగించాడు. అతడిచ్చిన గుప్పెడు అటుకలనే మహా ప్రీతితో స్వీకరించాడు. సమస్త లోకానికి ‘విశ్వకర్త’ అయినప్పటికీ, చతుర్భుజ బలసంపన్నుడైనప్పటికీ అర్జునుడికి సారధిగా నిలిచాడు. ఇవి ఆయన అణకువకు ప్రతీకగా నిలుస్తాయి. అందుకే ఆయన భక్తసులభుడయ్యాడు.
వినాయకుడు, శ్రీకృష్ణుడు.. ఇద్దరూ అత్యున్నత దైవాలైనప్పటికీ తమ స్థాయిని పక్కనపెట్టి సాధువులకు, భక్తులకు సేవకులుగా మారడంలో అసాధారణ తత్త్వం ఇమిడి ఉంది.
విశ్వరూప సందర్శనం
వినాయకుడి రూపాన్ని ప్రణవ (‘ఓం’కార) స్వరూపంగా భావిస్తారు. ఆయన పెద్ద తల జ్ఞానానికి, పెద్ద చెవులు శ్రద్ధగా వినాలని, జ్ఞానయుక్తమైన విషయాలు గ్రహించాలని చెబుతాయి. తొండం విచక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. వినాయకతత్త్వం మనకు ధర్మం, విచక్షణను నేర్పుతుంది. ఏ పని చేసినా ముందుచూపుతో, బుద్ధితో, సమతుల్యతతో చేయాలని ఆయన రూపం చాటుతుంది. ఆయన పెద్ద బొజ్జ సమస్త లోకాలను, మంచిచెడులను సమానంగా జీర్ణించుకోగల సమన్వయానికి, సంయమనానికి చిహ్నంగా నిలుస్తుంది.
శ్రీకృష్ణుడు షోడశ కళలతో కూడిన పరిపూర్ణావతారం. ఆయన తత్త్వం కేవలం జ్ఞానానికి మాత్రమే పరిమితం కాదు. కర్మ, భక్తి, జ్ఞానాల సమ్మేళనమది. శ్రీకృష్ణ తత్త్వం మనకు నిస్వార్థ కర్మను బోధిస్తుంది. ‘నీ పని నువ్వు చేయి.. ఫలితం ఆశించకు’ అనే గీతాసారం మనిషిని కర్మయోగిగా మారుస్తుంది. పుట్టెడు కష్టాలున్నా.. జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలో శ్రీకృష్ణ లీలలు చాటుతాయి. అలాగే బాధ్యతలను తప్పించుకోకుండా ఎలా చాతుర్యంతో మెలగాలో నేర్పుతాయి.
మహా గణపతి మనలోని బుద్ధిని, అంత:చేతనను మేల్కొలిపితే, వాసుదేవుడు ఆ బుద్ధిని సక్రమ మార్గంలో నడిపించి మనిషిని కర్మయోగిగా మలుస్తాడు.
వినాయకుడికి ఏనుగు తల ఉంటుంది. ఏనుగు అడవికి రాజు లాంటిది. ఎంతో మేధస్సు గలది. ఇది గొప్ప ఆలోచనలకు, విస్త•తమైన జ్ఞానానికి ప్రతీక. విశ్వరూప చైతన్యానికి గజముఖం నిదర్శనం.
విశ్వరూప ప్రదర్శన ద్వారా సమస్త బ్రహ్మాండం తనలోనే ఉందని చాటాడు శ్రీకృష్ణుడు. నందబాలుడిగా గోకులంలోనే ఉన్నా.. సమస్త విశ్వాన్ని తన నోటిలో చూపించిన బాలకృష్ణుడి లీల.. వినాయకుడి బృహత్తర రూపంతో సరిపోలుతుంది.
మూలాధారశక్తికి అధిపతులు..
బ్రహ్మవిద్యా ప్రదాతలు
సుముఖుడైన వినాయకుడు మూలాధార చక్రానికి అధిపతి. మానవ శరీరంలో ఆధ్యాత్మిక శక్తి మేల్కొనడానికి మూలాధారమే ఆధారం. లంబోదరుడి అనుగ్రహం లేకుండా ఆ కుండలినీ శక్తి జాగృతం కాదని యోగశాస్త్రం చెబుతోంది.
‘అంతటా ఉన్నది నేను.. అన్నిటికీ మూలం నేనే’ అని గీతాకారుడు చెబుతాడు. సమస్త విద్యలకు, వేదాలకు, యోగాలకు కర్త ఆయన.
వినాయకుడు మనలోని అంతర్గత శక్తికి ప్రతీక అయితే, ఆ శక్తిని కార్యరూపంలోకి మలిచి ముందుకు నడిపించే విశ్వశక్తి శ్రీకృష్ణుడు
స్థితప్రజ్ఞత.. సమత్వతత్త్వం
అతిపెద్ద చెవులతో ఎక్కువగా వినడం, చిన్న నోటితో తక్కువగా మాట్లాడటం, పెద్ద కళ్లతో సూక్ష్మంగా పరిశీలించడం.. ఇవి వినాయక స్వరూపం చాటే లక్షణాలు. ఈ గుణాలు జీవితంలో లౌకిక సుఖదు:ఖాలకు అతీతంగా ఉండగల స్థితప్రజ్ఞతను నేర్పుతాయి.
గీతలో కృష్ణుడు మరో రూపంలో చెప్పిందీ అదే! ‘సుఖదు:ఖే సమేకృత్వా లాభాలాభౌ’ (సుఖదు:ఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను సమానంగా భావించు) అని లోకానికి చాటిన స్థితప్రజ్ఞుడు ఆ యశోద వత్సలుడు.
ఈ సమత్వతత్త్వం అటు వినాయకుడి రూపంలోనూ, శ్రీకృష్ణుడి బోధనల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రణవనాదం.. వేణుగానం
వినాయకుడి శరీరాకృతిని నిశితంగా పరిశీలిస్తే.. దేవనాగరి లిపిలోని ‘‘ఓం’’ అక్షరం కనిపిస్తుంది. సమస్త సృష్టికి మూలమైన ప్రణవనాదమే వినాయకుడు. ఆయన శబ్ద బ్రహ్మకు ప్రతీక.
శ్రీకృష్ణుడు వేణుగాన స్వరూపుడు. కృష్ణుడి చేతిలోని మురళి నుంచి వచ్చే వేణుగానం సమస్త సృష్టిని, గోవులను, గోపికలను పరవశింపచేస్తుంది. ఆ వేణుగాన నాదం కూడా ఓంకారనాదంతో సమానమైనదే.
వినాయకుడు మూల శబ్దమైతే, ఆ శబ్దం నుంచి వెలువడే లలితమైన సంగీతం, సృష్టిలోని మాధుర్యం వేణువుకు ప్రతీక అయిన శ్రీకృష్ణుడు.
ఆయుధ సంకేతాలు..
వినాయకుడి చేతిలో కనిపించే ఆయుధాలు- పాశం, అంకుశం, మోదకం, భగ్న దంతం.
భక్తులను తన వైపునకు లాక్కోవడానికి, బంధాలను తెంచడానికి పాశం ప్రతీకగా నిలుస్తుంది.
మనసును సరైన మార్గంలో నడిపించే అగ్రగామి సాధనం- అంకుశం.
మహా భారతం కోసం తన దంతాన్ని విరగ్గొట్టుకోవడం ద్వారా త్యాగానికి, జ్ఞాన సంపాదనకు ఎలాంటి అడ్డంకి వచ్చినా లెక్కచేయకూడదని నిరూపించేది- దంతం.
కమలనాథుడి చేతి ఆయుధాలు సుదర్శన చక్రం, మురళి.
రంధ్రాలు లేని వెదురు కర్రకు తన ఊపిరిని అందించి అద్భుతమైన సంగీతాన్ని సృష్టించినట్టే, మనిషి తనలోని అహంకారాన్ని (రంధ్రాలను) తొలగిస్తే అందులో భగవంతుడు తన గీతామృతాన్ని నింపుతాడనే వేదాంతాన్ని వేణువు (మురళి) బోధిస్తుంది.
కాలచక్రానికి, దుష్టశిక్షణకు ప్రతీకగా నిలుస్తుంది సుదర్శన చక్రం.
తులసి, గరిక చాలు..
శ్రీకృష్ణుడికి తులసి పత్రాలంటే చాలా ప్రీతి. ఒకసారి ఆయన దేవేరులైన సత్యభామ, రుక్మిణి తమలో ఎవరంటే కృష్ణుడికి ఇష్టమో తేల్చుకోవాలనుకుంటారు. సత్యభామ తన సమస్త బంగారం, సంపదను త్రాసులో ఉంచింది. త్రాసులో మరోపక్క కూర్చున్న కృష్ణుడు కదలలేదు. రుక్మిణి భక్తితో ఒక చిన్న తులసీ పత్రాన్ని ఉంచింది. ఆ తులసీ దళం బరువుకు కృష్ణుడి బరువు సమానమై త్రాసు కదిలింది. తులసి అంటే కృష్ణుడికి ఉన్న ప్రీతికి ఇది నిదర్శనం. అదే సందర్భంలో భగవంతుడు భక్తుల నిరాడంబరత, ప్రేమకు తూగుతాడు కానీ ఆడంబరాలకు కాదని ఈ చిన్న కథ చాటుతుంది.
కాగా, వినాయకుడికి తులసి దళాలను సమర్పించకూడదు. ఒక్క వినాయక చవితి రోజున మాత్రం ఈ నియమానికి మినహాయింపు ఉంది. ఇద్దరినీ ఒకేసారి పూజించే సందర్భంగా తులసిని కృష్ణుడి పాదాల వద్ద మాత్రమే ఉంచాలి. ఇక వినాయకుడికి గరిక అంటే ఎంతో ప్రీతి. ఆయనకు దానిని సమర్పించేటపుడు జంటగా (రెండు రెమ్మలు కలిసి ఉన్నది) సమర్పించడం శ్రేష్ఠం. దీనినే దూర్వాయుగ్మం అంటారు. వినాయకుని పూజలో సాధారణంగా ఇరవై ఒక్క (21) రకాల పత్రిని వాడతారు. కానీ ఎన్ని ఉన్నా గరిక లేనిదే వినాయక పూజ సంపూర్ణం కాదు. అనలాసురుడనే రాక్షసుడిని సంహరించిన తరువాత వినాయకుడు అతడిని మింగేస్తాడు. ఆ అసురుడి ప్రభావంతో వినాయకుడి శరీరం నుంచి విపరీతమైన వేడి పుట్టింది. ఎందరో దేవతలు ఆ తాపాన్ని తగ్గించడానికి యత్నించినా వేడి తగ్గలేదు. చివరకు రుషులు 21 గరిక పోచలను గణేశుడి తలపై ఉంచడం ద్వారా ఆ తాపాన్ని తగ్గించారు. అప్పటి నుంచి గరిక వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనదిగా మారింది. వినాయక పూజలో గరికకు అంత ప్రాధాన్యం ఉంది.
తులసి, గరిక.. చాటేది ఏమిటంటే.. స్థాయి, స్థానాలు భగవంతుని అనుగ్రహం పొందడానికి అడ్డంకి కాదు. సంపూర్ణ ప్రేమ, భక్తితో ఏ చిన్న వస్తువు సమర్పించినా దానిని మిక్కిలి ఆర్తితో స్వీకరిస్తామని చాటారీ జంట దైవాలు.
శివవిష్ణువులతో అనుబంధం..
వినాయకుడు శివపుత్రుడు. శివుడు లయకారకుడు. ఆయన సంపూర్ణ వైరాగ్యానికి ప్రతిరూపం. కాబట్టి ఆయన కుమారుడైన వినాయకుని తత్త్వంలో అంతర్ముఖత, వైరాగ్యం, నిగ్రహం ఎక్కువగా కనిపిస్తాయి.
ఇక కృష్ణుడు స్వయంగా విష్ణువు అవతారం. జగత్ పాలకుడైన విష్ణువు పూర్ణావతారం. కాబట్టి కృష్ణుడి తత్త్వంలో లోకకల్యాణం, బాధ్యత, సామాజిక ధర్మం, లౌకిక, పారలౌకిక సమన్వయం కనిపిస్తాయి.
శివుని తత్త్వమైన వైరాగ్యాన్ని (వినాయకుడు), విష్ణుతత్త్వమైన కర్మ/ధర్మాన్ని (శ్రీకృష్ణుడు) మనిషి తన జీవితంలో ఎలా సమన్వయం చేసుకోవాలో వీరిద్దరి లీలలు మనకు నేర్పుతాయి.
ఇద్దరి పరిచయ విశేషాలు..
పురాణాల ప్రకారం వినాయకుడు, శ్రీకృష్ణుడు వేర్వేరు యుగాలకు చెందిన రూపాలు.
వినాయకుడు ప్రథమ పూజ్యుడిగా సర్వకాల సర్వావస్థల్లోనూ ఉంటే, శ్రీకృష్ణుడు ద్వాపర యుగ కాలానికి చెందిన పూర్ణావతారం.
అయినా, కొన్ని పురాణ కథల్లో, ఇతిహాస సంబంధ విశేషాల్లో వీరిద్దరి మధ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని సంబంధాలున్నాయి. ఇద్దరూ ముఖాముఖి అయిన దా•లాలు కనిపిస్తాయి.
బ్రహ్మసంహితలోని శ్లోకం ప్రకారం.. వినాయకుడికి విఘ్న వినాశక శక్తులను శ్రీకృష్ణుడు ప్రసాదిస్తే.. శమంతకోపాఖ్యానం ప్రకారం కృష్ణుడి దోషాలను వినాయకుడు పోగొడతాడు.
‘శమంతకమణి’ కథలో కృష్ణుడు వినాయక చవితి నాటి చంద్ర దర్శన దోషానికి గురవుతాడు. ఈ సందర్భంలో వినాయకుడికి, కృష్ణుడికి మధ్య నేరుగా సంభాషణ జరిగిన దాఖలా ఇది.
భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడు కుబేరుని ఇంటికి విందుకు వెళ్లి కడుపారా కుడుములు ఆరగించి, తన వాహనమైన ఎలుకపై తిరిగి వస్తాడు. అంత భారీకాయుడు అల్పప్రాణిపై పయనించడాన్ని చూసి చంద్రుడు పకపకా నవ్వుతూ వెక్కిరిస్తాడు. దీంతో వినాయకుడు కోపంతో ఈరోజు (భాద్రపద శుద్ధ చవితి నాడు) చంద్రుడిని చూసిన వారు నీలాపనిందల పాలవుతారని శపిస్తాడు.
ఈ క్రమంలో ద్వాపర యుగంలో ఒకనాడు శ్రీకృష్ణుడు ఒక పాత్రలోని పాలు తాగుతూ, ఆ పాత్రలో పొరపాటున చవితి చంద్రుని ప్రతిబింబాన్ని చూస్తాడు. ఫలితంగా వినాయకుడి శాప ప్రభావానికి గురవుతాడు. దీంతో శమంతకమణి అపహరించాడనే నింద పడుతుంది. ఈ అపనిందను పోగొట్టుకోవడానికి కృష్ణుడు అడవికి వెళ్తాడు. శమంతకమణిని అపహరించిన సింహాన్ని వధించి, దాని నుంచి మణిని తీసుకుని జాంబవంతుడు ఓ గుహలో ఉంచుతాడు. ఇది తెలిసి కృష్ణుడు జాంబవంతుడితో ఇరవై ఎనిమిది రోజుల పాటు యుద్ధం చేసి మణిని సాధించి తెస్తాడు. ఈ సందర్భంలోనే శ్రీకృష్ణుడు స్వయంగా తన ఇష్టదైవమైన శ్రీరాముడని గుర్తించి జాంబవంతుడు క్షమాపణలు వేడుకుంటాడు. తన కుమార్తె జాంబవతిని కృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ద్వారకకు చేరుకున్న కృష్ణుడు ఆ మణిని సత్రాజిత్తుకు అందచేసి తనపై పడిన నింద నుంచి విముక్తుడవుతాడు. ఈ సందర్భంలోనే నారదాది మునులు వచ్చి సాక్షాత్తూ భగవానుడైన శ్రీకృష్ణుడికే వినాయకుడి శాపం వల్ల ఈ నింద ఎలా వచ్చిపడిందో వివరిస్తారు. అప్పుడు కృష్ణుడు వినాయకుడిని ప్రార్థించగా, ‘వినాయక చవితి రోజున శమంతకమణి కథను భక్తితో చదివిన, విన్న వారికి చంద్రుడిని చూసినా ఎలాంటి అపనిందలు రావ’ని వినాయకుడు వరమిస్తాడు. అప్పుడు కృష్ణుడు స్వయంగా లోకానికి వినాయక చవితి వ్రత ప్రాశస్త్యాన్ని, ఆ రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదనే విషయాన్ని వివరిస్తూ వినాయక పూజా విధానాన్ని ప్రచారం చేస్తాడు.
ఇక, బ్రహ్మ వైవర్త పురాణంలో వినాయకుడు, శ్రీకృష్ణుడు వేర్వేరు కాదనే భావన తాత్త్వికత కనిపిస్తుంది. ఈ పురాణంలోని గణపతి ఖండం ప్రకారం.. సృష్టిలో ప్రతి కల్పంలోనూ శ్రీకృష్ణుడే భక్తుల ఇష్టానుసారం గణేశుడిగా రూపం దాల్చుతాడని ఉంది.
విష్ణుమూర్తే గణపతి రూపంలో ఆవిర్భవించాడనే కొన్ని కథలు, దృష్టాంతాలు స్కంద, దేవీ పురాణాల్లో ఉన్నాయి.
తాత్త్వికంగా చూస్తే వినాయకుడి మూలాధార శక్తి, ఓంకార తత్త్వం, శ్రీకృష్ణుడిది పూర్ణావతార తత్త్వం ఒకే పరబ్రహ్మకు చెందిన రెండు భిన్న రూపాలుగా పురాణాలు వర్ణించాయి.
శివ పురాణం ఇతర పురాణాల ప్రకారం.. శ్రీకృష్ణుడు సంతానం కోసం లేదా ప్రత్యేక అనుగ్రహం కోసం కైలాసానికి వెళ్లి శివపార్వతులను తన తపశ్శక్తితో మెప్పించిన సందర్భాలున్నాయి. ఆ సమయాలలో పరమశివుడి కుటుంబసమేత దర్శనంలో గణపతి, కుమారస్వామి సమక్షంలో కృష్ణుడికి శివపార్వతుల ఆశీస్సులు లభించినట్టు వర్ణనలు ఉన్నాయి.
వినాయకుడు, శ్రీకృష్ణుడు వేర్వేరు కాలాల్లో అవతరించినప్పటికీ శమంతకోపాఖ్యానం రూపంలో వినాయకుడి శాప ప్రభావం శ్రీకృష్ణుడి జీవితంపై పడటం, ఆ ఇబ్బందిని కృష్ణుడు ఎదుర్కొని లోకానికి వినాయక వ్రత మహత్యాన్ని చాటడం అనేది ఈ రెండు దైవాల మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధానికి ఒక నిదర్శనం.
ఒకరికొకరు!
వినాయకుడు, కృష్ణుడు ఎదురెదురుగా నిలిచిన సందర్భాలున్నాయా? శమంతకమణి కథతో వినాయకుడు ప్రత్యక్షమై కృష్ణుడికి శాప విమోచన వరం ఇచ్చిన సందర్భం ఉంది. ఇది కాకుండా వీరిద్దరి ముఖాముఖి దాఖలాలున్నాయా? ఈ చిన్న కథలు ఆ వివరాలే చెబుతాయి.
బాణాసుర యుద్ధం
బాణాసురుడు రాక్షసుడు. గొప్ప శివభక్తుడు. ఒకసారి కృష్ణుడు బాణాసురుడితో తలపడతాడు. అప్పుడు వినాయకుడు, కృష్ణుడు ఎదురెదురుగా నిలబడాల్సి వచ్చింది. బాణాసురుడి కుమార్తె ఉష. శ్రీకృష్ణుడి మనవడైన అనిరుద్ధుడిని ప్రేమిస్తుంది. ఇది ఇష్టం లేని బాణాసురుడు అనిరుద్ధుడిని బంధిస్తాడు. శ్రీకృష్ణుడు తన సైన్యంతో బాణాసురుడి పురంపై దండెత్తుతాడు. బాణాసురుడు శివభక్తుడు కావడం, అతని భక్తికి మెచ్చి శివుడు అతడి నగరానికి రక్షణగా ఉంటానని వరం ఇవ్వడం వల్ల కృష్ణుడు ఆ నగరంలోకి వెళ్లలేకపోతాడు. పైగా బాణాసురుడి పక్షాన శివుడు, వినాయకుడు నిలుస్తారు. ఈ సందర్భంలో వినాయకుడికి, శ్రీకృష్ణుడికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. వినాయకుడు తన పాశం, అంకుశంతో కృష్ణుడి సైన్యాన్ని నిలువరిస్తాడు. యుద్ధంలో వినాయకుడి శక్తులను చూసి కృష్ణుడు ఆశ్చర్యపోతాడు.
కృష్ణుడు వినాయకుడిని గౌరవిస్తూనే యుద్ధాన్ని త్వరగా ముగించడానికి ‘జృంభణాస్త్రం’ అనే ప్రత్యేక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దీని ప్రభావంతో వినాయకుడు కాసేపు ఆవులింతలు తీస్తూ నిద్రావస్థలోకి జారుకుంటాడు. అదే అదనుగా కృష్ణుడు బాణాసురుడిపైకి దూసుకెళ్తాడు. శివుడు జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పి అనిరుద్ధుడికి ఉషతో వివాహం జరిపిస్తాడు.
ద్రౌపది అక్షయపాత్ర కథ
మహాభారతంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు జరిగిన ఒక ఘటనలో వినాయకుడు, శ్రీకృష్ణుడు.. ఇద్దరి ప్రమేయం కనిపిస్తుంది.
ఒకరోజు దురాస్వ మహర్షి తన పదివేల మంది శిష్యులతో పాండవుల ఆశ్రమానికి వస్తాడు. అప్పటికే ద్రౌపది, పాండవులు భోజనాలు కానివ్వడంతో ఆమె వద్ద ఉన్న అక్షయపాత్ర ఖాళీ అయిపోతుంది. మహర్షికి భోజనం పెట్టకపోతే శపిస్తాడని ద్రౌపది భయపడుతుంది. అప్పుడు ఆపద్బాంధవుడైన కృష్ణుడిని ప్రార్థిస్తుంది. కృష్ణుడు ప్రత్యక్షమై, అక్షయపాత్రకు అంటుకుని ఉన్న ఒక చిన్న అన్నం మెతుకును తిని ‘విశ్వమంతా తృప్తిచెందు గాక’ అంటాడు.
పురాణాల ప్రకారం.. విశ్వంలో ఉన్న సమస్త జీవుల ఆకలి తీరాలంటే మొదట విఘ్నేశ్వరుడి ఉదరం (కడుపు) శాంతించాలి. కృష్ణుడు ఆ మెతుకు తినగానే, వినాయకుడికి సంపూర్ణంగా కడుపు నిండిపోతుంది. వినాయకుడు తృప్తి చెందడంతో నదిలో స్నానం చేస్తున్న దుర్వాస మహర్షికి, ఆయన శిష్యులకు కడుపు నిండిపోతుంది. దీంతో నదిలో స్నానానికి వెళ్లిన వారు ఇక భోజనం కోసం పాండవుల వద్దకు వెళ్లకుండానే అటు నుంచే వెళ్లిపోతారు. ఇలా కృష్ణుడు వినాయకుడి ద్వారా పాండవులను శాపభారం నుంచి కాపాడాడు.
గజముఖాసురుడితో యుద్ధం
పురాణాల్లోని ఉప పురాణాల ప్రకారం.. ఒక సందర్భంలో గజముఖాసురుడనే రా•••సుడిని లొంగదీసుకోవడానికి వినాయకుడు శ్రీకృష్ణుడిలోని ఒక శక్తిని ఆవాహన చేసుకున్నాడట.
గజముఖాసురుడు దేవతలను పీడిస్తూ తనకెలాంటి ఆయుధాల వల్ల మరణం లేకుండా వరం పొందాడు. వినాయకుడు మహా చతురుడు కదా! అతడి పీడ విరగడ చేయడానికి అతనితో యుద్ధానికి దిగి, తన కుడి దంతాన్ని విరిచి అస్త్రంగా మలిచాడు. ఆ దంతానికి శ్రీకృష్ణుడి ఆయుధమైన ‘సుదర్శన చక్ర’ శక్తిని, మంత్రాన్ని జోడించి రాక్షసుడిపైకి సంధిస్తాడు. ఆ దంతం గజముఖాసురుడిని తాకగానే వివేకం కలిగి, తప్పు తెలుసుకుని వినాయకుడిని శరణు వేడుతాడు. వినాయకుడు అతడిని చంపకుండా మూషికం (ఎలుక)గా మార్చుకుని తన వాహనంగా చేసుకుంటాడు. అంటే కృష్ణుడి మంత్రాన్ని ఉపయోగించి ఈ యుద్ధంలో వినాయకుడు విజయం సాధించాడన్న మాట!.
లక్షణతో కృష్ణుడి వివాహం.. వినాయకుడి అనుగ్రహం
శ్రీకృష్ణుడి అష్టమహిషుల (ఎనిమిది మంది భార్యలు)లో లక్షణ ఒకరు. ఈమె వివాహం వెనుక వినాయకుడి ప్రమేయం ఉంది. లక్షణ తండ్రి అయిన మద్ర దేశ రాజు.. ద్రౌపది స్వయంవరం మాదిరిగానే తన కుమార్తెను పెళ్లాడే వారు ఆకాశంలో తిరుగుతున్న ఒక యంత్రాన్ని కింద ఉన్న నీటిలోని ప్రతిబింబాన్ని చూస్తూ బాణంతో కొట్టాలనే షరతు పెడతాడు. శ్రీకృష్ణుడు ఈ పోటీకి వెళ్లే ముందు తన తండ్రి అయిన వసుదేవుని సూచన మేరకు వినాయకుడికి ప్రత్యేక పూజ చేసి, విఘ్నాలను తొలగించే ‘గణేశ స్తవము’ చదువుతాడు. వినాయకుడి అనుగ్రహంతో కృష్ణుడు అతి సులభంగా లక్ష్యాన్ని ఛేదించి లక్షణను వివాహం చేసుకుంటాడు.
వినాయకుడికి ‘కృష్ణపింగళ’
అనే పేరెలా వచ్చింది?
వినాయకుడిని ముఖ్యమైన పన్నెండు పేర్లలో ‘కృష్ణపింగళ’ ఒకటి. సంకటనాశన స్తోత్రంలో ఈ నామం వస్తుంది. దీని వెనుక కృష్ణుడితో ముడిపడిన ఒక అంతరార్థం ఉంది. ‘కృష్ణ’ అంటే నలుపు, ఆకర్షణీయమైన అనే అర్థముంది. ‘పింగళ’ అంటే గోధుమ లేదా ఎరుపు రంగు. పురాణాల ప్రకారం.. వినాయకుడు పరమశివుని తేజస్సు, కృష్ణుని సంకల్పశక్తి (శ్యామల వర్ణ శక్తి) కలయికతో జన్మించినప్పుడు ఆయన శరీరంలో శ్రీకృష్ణుని శ్యామల (నల్లని) కాంతి ప్రతిబింబించింది. అందుకే ఆయనకు ‘కృష్ణపింగళ’ అనే పేరొచ్చింది. వినాయకుడికి కృష్ణుడు మేనమామ అనే వరుసలూ కొన్ని పురాణాల్లో ఉన్నాయి.
జ్యోతిషంలో బుధ గ్రహ పరిహారం
జ్యోతిష శాస్త్రం ప్రకారం శ్రీకృష్ణుడు, వినాయకుడు బుధ గ్రహానికి అధిదేవతలు. జాతకంలో బుధ దోషం ఉన్న వారు, బుధవారం నాడు వినాయకుడికి గరిక సమర్పించి, ఆపై కృష్ణుడికి అటుకులు నైవేద్యం పెడితే నష్టాలు తొలగిపోతాయని అంటారు. బుధుడు బుద్ధికారకుడు. వినాయకుడు బుద్ధి ప్రదాత. కృష్ణుడు భగవద్గీత ద్వారా పరమ జ్ఞానాన్ని ప్రసాదించిన జగద్గురువు. అందుకే విద్యార్థులకు వీరిద్దరి ఆరాధన అద్భుతమైన తెలివితేటలను ప్రసాదిస్తుంది.
గీతోపదేశం- మహాభారత లేఖనం
మహాభారత గ్రంథాన్ని వ్యాస మహర్షి చెబుతుంటే వినాయకుడు తన దంతాన్నిఏ విరిచి కలంగా మార్చి రాశాడు. విశేషం ఏమిటంటే, మహా భారతంలోని అంతర్భాగమే భగవద్గీత. అంటే సాక్షాత్తూ శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి చేసిన గీతోపదేశాన్ని వినాయకుడు తన చేతులతో స్వయంగా లిఖించాడు. కృష్ణుడి నోటి నుంచి వెలువడిన ఆ దివ్య వాక్కులను మొదట రాసింది వినాయకుడే. ఈ విధంగానూ వీరిద్దరి మధ్య దైవిక సంబంధం ముడిపడి ఉంది.
కృష్ణావతార సమాప్తి.. చవితి తిథి ప్రశస్తి
కొన్ని పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించి, వైకుంఠానికి నిష్క్రమించిన తిథి.. భాద్రపద శుద్ధ చవితి (వినాయక చవితి)కి దగ్గరి సంబంధం కలిగి ఉంది. కృష్ణావతారం ముగియడంతోనే ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమైంది. అంటే భాద్రపద శుద్ధ చవితి తిథి ఒకప్పుడు కలియుగారంభ తిథి. పూర్వం ఈ చవితి తిథినే ఉగాది దినమని కూడా పరిగణించే వారట. కలియుగంలో వచ్చే విఘ్నాలను తొలగించడానికి వినాయక చవితి పూజ అత్యంత ముఖ్యమైనదిగా మారింది.
జంట దైవాలు.. జంట శ్లోకాలు
హిందూ సంప్రదాయంలో మనం నిత్యం చదువుకునే చాలా వరకు ప్రార్థన శ్లోకాల్లో గణపతి, శ్రీకృష్ణుడు లేదా విష్ణువు కలిసి కనిపిస్తారు. హిందూ ధర్మంలోని ఏ శుభకార్యమైనా, పూజలైనా ముందుగా వినాయకుడిని స్మరించి, ఆ తర్వాత విశ్వపాలకుడైన శ్రీమహావిష్ణువు/శ్రీకృష్ణుడిని ఆరాధించడం ఆనవాయితీ. అలా మనం రోజూ పఠించే అత్యంత ప్రసిద్ధమైన రెండు శ్లోకాలు.. వాటిలోని అంతరార్థం..
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్।
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాన్తయే।।
ఇది ఏ కార్యాన్ని ప్రారంభించడానికైనా ముందు పఠించే శ్లోకం. వినాయకుడు, విష్ణువు (కృష్ణుడు)ను స్మరిస్తూ ఈ శ్లోకాన్ని చదువుతారు.
ఈ శ్లోకంలోని భావాన్ని పరిశీలిస్తే..
‘‘తెల్లని వస్త్రాలు ధరించిన వాడు, చంద్రుని వంటి కాంతి కలవాడు, నాలుగు భుజములు కలిగిన వాడు, ఎల్లప్పుడూ ప్రసన్నమైన ముఖంతో ఉండేవాడు అయిన ఆ వినాయక దేవుడిని సమస్త విఘ్నాలు తొలగిపోవడానికి నేను ధ్యానిస్తున్నాను’’.
శ్లోకంలోని ‘విష్ణు’ అంటే సర్వవ్యాపి అయిన ఆ గణనాథుడని అర్థం.
ఈ శ్లోకానంతరం చదివే మంత్రం-
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్
లక్ష్మీకాంతం కమల నయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్
‘‘ఎవరైతే శాంత స్వరూపుడో, ఆదిశేషునిపై పవళించి ఉంటాడో, నాభియందు పద్మము కలిగిన వాడో, దేవతలకు అధిపతియో, సమస్త విశ్వానికి ఆధారమో, ఆకాశం వలే సర్వవ్యాపినో, మేఘం వంటి నల్లని సుందర శరీర కాంతి గలవాడో, లక్ష్మీదేవికి ప్రియమైన భర్తయో, కమలముల వంటి నేత్రములు కలవాడో, యోగుల యొక్క హృదయాలలో దాగి ధ్యానం ద్వారా మాత్రమే పొందగలిగిన వాడో, సంసార భయాలను పోగొట్టే వాడు, సమస్త లోకాలకు ఏకైక నాథుడు అయిన ఆ మహావిష్ణువు/శ్రీకృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను.
పై రెండు శ్లోకాలు వినాయక, శ్రీకృష్ణులకు సంబంధించిన ఉమ్మడి శ్లోకాలు. ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మంచి ఆరంభాన్నివ్వాలని మొదటి శ్లోకాన్ని, ఆ ఆరంభాన్ని కొనసాగించేందుకు అవసరమైన శక్తినివ్వాలని రెండో శ్లోకాన్ని పఠించడం మన సంప్రదాయం.
భారతీయ పూజా విధానంలో ఏ దైవాన్ని ఆరాధించినా కానీ, మొదట ఈ శ్లోకాల ద్వారా వినాయకుడిని ప్రార్థించి మనలోని అజ్ఞానాన్ని, అడ్డంకులను తొలగించుకుంటాము. ఆ తర్వాత విష్ణువు/కృష్ణుడిని స్మరించడం ద్వారా ఆ పరిపూర్ణ పరబ్రహ్మ అనుగ్రహాన్ని, మోక్షాన్ని పొందుతాము. అందుకే ఈ రెండు శ్లోకాలూ మన పూజా విధానంలో విడదీయరాని జంటగా నిత్యపూజలో భాగమయ్యాయి.
జంట దైవాలు.. జంట శ్లోకాలు
హిందూ సంప్రదాయంలో మనం నిత్యం చదువుకునే చాలా వరకు ప్రార్థన శ్లోకాల్లో గణపతి, శ్రీకృష్ణుడు లేదా విష్ణువు కలిసి కనిపిస్తారు. హిందూ ధర్మంలోని ఏ శుభకార్యమైనా, పూజలైనా ముందుగా వినాయకుడిని స్మరించి, ఆ తర్వాత విశ్వపాలకుడైన శ్రీమహావిష్ణువు/శ్రీకృష్ణుడిని ఆరాధించడం ఆనవాయితీ. అలా మనం రోజూ పఠించే అత్యంత ప్రసిద్ధమైన రెండు శ్లోకాలు.. వాటిలోని అంతరార్థం..
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్।
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాన్తయే।।
ఇది ఏ కార్యాన్ని ప్రారంభించడానికైనా ముందు పఠించే శ్లోకం. వినాయకుడు, విష్ణువు (కృష్ణుడు)ను స్మరిస్తూ ఈ శ్లోకాన్ని చదువుతారు.
ఈ శ్లోకంలోని భావాన్ని పరిశీలిస్తే..
‘‘తెల్లని వస్త్రాలు ధరించిన వాడు, చంద్రుని వంటి కాంతి కలవాడు, నాలుగు భుజములు కలిగిన వాడు, ఎల్లప్పుడూ ప్రసన్నమైన ముఖంతో ఉండేవాడు అయిన ఆ వినాయక దేవుడిని సమస్త విఘ్నాలు తొలగిపోవడానికి నేను ధ్యానిస్తున్నాను’’.
శ్లోకంలోని ‘విష్ణు’ అంటే సర్వవ్యాపి అయిన ఆ గణనాథుడని అర్థం.
ఈ శ్లోకానంతరం చదివే మంత్రం-
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్
లక్ష్మీకాంతం కమల నయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్
‘‘ఎవరైతే శాంత స్వరూపుడో, ఆదిశేషునిపై పవళించి ఉంటాడ, నాభియందు పద్మము కలిగిన వాడో, దేవతలకు అధిపతియో, సమస్త విశ్వానికి ఆధారమో, ఆకాశం వలే సర్వవ్యాపినో, మేఘం వంటి నల్లని సుందర శరీర కాంతి గలవాడో, లక్ష్మీదేవికి ప్రియమైన భర్తయో, కమలముల వంటి నేత్రములు కలవాడో, యోగుల యొక్క హృదయాలలో దాగి ధ్యానం ద్వారా మాత్రమే పొందగలిగిన వాడో, సంసార భయాలను పోగొట్టే వాడు, సమస్త లోకాలకు ఏకైక నాథుడు అయిన ఆ మహావిష్ణువు/శ్రీకృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను.
పై రెండు శ్లోకాలు వినాయక, శ్రీకృష్ణులకు సంబంధించిన ఉమ్మడి శ్లోకాలు. ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మంచి ఆరంభాన్నివ్వాలని మొదటి శ్లోకాన్ని, ఆ ఆరంభాన్ని కొనసాగించేందుకు అవసరమైన శక్తినివ్వాలని రెండో శ్లోకాన్ని పఠించడం మన సంప్రదాయం.
భారతీయ పూజా విధానంలో ఏ దైవాన్ని ఆరాధించినా కానీ, మొదట ఈ శ్లోకాల ద్వారా వినాయకుడిని ప్రార్థించి మనలోని అజ్ఞానాన్ని, అడ్డంకులను తొలగించుకుంటాము. ఆ తర్వాత విష్ణువు/ కృష్ణుడిని స్మరించడం ద్వారా ఆ పరిపూర్ణ పరబ్రహ్మ అనుగ్రహాన్ని, మోక్షాన్ని పొందుతాము. అందుకే ఈ రెండు శ్లోకాలూ మన పూజా విధానంలో విడదీయరాని జంటగా నిత్యపూజలో భాగమయ్యాయి.
శ్రీకృష్ణుడి యుక్తి..
వినాయకుడి శక్తి
హిందూ ధర్మంలో దైవతాల మధ్య సంబంధాల విషయంలోనూ, సంప్రదాయాల విషయంలోనూ ఎలాంటి భేదాలూ లేవని దేవతలందరూ పరస్పర గౌరవంతో ఒకరినొకరు ఆరాధించుకుంటారని వినాయక, శ్రీకృష్ణ దైవాల మధ్య గల విశేషాలు చాటుతాయి. నిజానికి కృష్ణుడు వైష్ణవ, వినాయకుడు శైవ సంప్రదాయానికి చెందిన దేవతలని చెబుతారు కానీ, తమ మధ్య అలాంటి వైరుధ్యాలేవీ లేవని, భక్తులను కాచే విషయంలో ఇద్దరమూ ఒకటేనని ఈ రెండు దైవాలు చాటుతాయి.
బ్రహ్మ సంహితలోని ఐదవ అధ్యాయం, 50వ శ్లోకం ప్రకారం- శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరణాలను వినాయకుడు తన గజ ముఖంపై ఉంచుకుని పూజిస్తాడని చెబుతోంది.
ముల్లోకాల్లో సమస్త విఘ్నాలను తొలగించే శక్తిని వినాయకుడు శ్రీకృష్ణుని అనుగ్రహం వల్లనే పొందాడని ఈ సంహితలో ఉంది.
బృందావనంలో గోపికలు కాత్యాయని వ్రతం ఆచరించే వారు. ఈ వ్రతం నిర్విఘ్నంగా సాగేందుకు వ్రతాచరణకు ముందు వినాయకుడిని పూజించాలని గోపికలకు కృష్ణుడు చెప్పాడనే వివరాలు పురాణాల్లో ఉన్నాయి. అంతెందుకు.. కృష్ణుడే వినాయక పూజా విధానాన్ని, చవితి ప్రాశస్త్యాన్ని లోకానికి స్వయంగా చాటాడు.
బ్రహ్మసంహితను స్వయంగా బ్రహ్మ రచించాడు. ఇందులోని ఓ శ్లోకమిది..
యత్ పాద పల్లవ యుగం వినిధాయ కుంభ
ద్వంద్వే ప్రణామ సమయే స గణాధిరాజ
విఘ్నాన్ విహంతం ఆలం అస్య జగత్
త్రయస్య గోవిందం ఆదిపురుషం తమహం భజామి
ముల్లోకాలలో వచ్చే అన్ని అడ్డంకులను, విఘ్నాలను తొలగించే పరమ శక్తివంతమైన గణపతి.. తాను నమస్కరించే సమయంలో శ్రీకృష్ణుడి పాదపద్మాలను తన శిరస్సు (కుంభస్థలం)పై ధరిస్తాడు. ఆ కృష్ణుని పాదాల వల్లే వినాయకుడికి విఘ్న వినాశకుడనే శక్తులు లభించాయి.





























































































Review కవర్ స్టోరీ … వినాయకుడు.. శ్రీకృష్ణుడు...