అదిగో శ్రీశైలం,, అదియే కైలాసం

శైవ క్షేత్రాల్లో తలమానికమైనది- శ్రీశైలం. ఆది, మధ్యాంత రహిత పరబ్రహ్మకు పవిత్ర చిహ్నంగా లింగాన్ని పూజించడం మన సనాతన ధర్మం. శివుడిని నిగమాగమ పద్ధతుల్లో ఆరాధించే సంప్రదాయంలో లింగార్చనకు విశిష్ట స్థానం ఉంది. అనాది నుంచి రుషులూ, మునులూ శివలింగాన్ని జ్యోతి స్వరూపంగా భావిస్తారు. మన దేశంలో పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. ‘సౌరాష్ట్రే సోమనాథంచ..’ అంటూ ఆరంభమయ్యే శ్లోకంలో ‘శ్రీశైలే మల్లికార్జునం..’ అంటూ భ్రమరాంబికా సతీ హృదయేశ్వరుడి ప్రస్తుతి కనిపిస్తుంది. జ్యోతిర్లింగ, శక్తి పీఠాలు ఒకే గిరిశృంగం మీద వెలసిన పుణ్యక్షేత్రం- శ్రీశైలం. ఇది సకలారాధ్య క్షేత్రం. మరే క్షేత్రానికీ లేని ప్రత్యేకత శ్రీశైలానికి ఉంది. పూజారంభంలో చెప్పుకునే సంకల్పంలో శ్రీశైల క్షేత్రానికి ఏ దిశలో కూర్చుని తాము భగవదారాధన చేస్తున్నదీ విధిగా పేర్కొనడం ఈ క్షేత్ర ప్రామాణికతకు నిదర్శనం. బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే మూడు పర్వతాలకు పాదాభివందనం చేస్తూ తన చరణ కింకిణుల సవ్వడితో వేదఘోషను స్ఫురింపచేసే కృష్ణవేణి పాతాళగంగ పేరుతో ఉత్తరవాహినిగా ప్రవహిస్తోందిక్కడ. కృతయుగంలో హిరణ్యకశిపుడు శ్రీశైలాన్ని తన పూజా మందిరంగా చేసుకున్నాడనీ, త్రేతాయుగంలో రామచంద్రుడు రావణుడిని వధించిన తరువాత బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి సతీసమేతంగా ఈ క్షేత్రాన్ని దర్శించి సహస్ర లింగాలను ప్రతిష్ఠించి, అర్చించాడనీ ప్రతీతి. ద్వాపర యుగంలో పాండవులు సైతం వనవాస కాలంలో ఈ గిరిని దర్శించి లింగ ప్రతిష్ఠ చేసినట్టు ప్రాచుర్యంలో ఉంది. శివరాత్రి సందర్భంగా 2025, ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 11 రోజుల పాటు సాగే ఈ బ్రహ్మోత్సవాలు భక్తులకు నేత్రపర్వం గావించనున్నాయి. నిరంతరం వినిపించే ‘ఓం నమ:శివాయ’ మంత్రం.. రోజుకొకటి చొప్పున పార్వతీ పరమేశ్వరులకు జరిపే సేవలూ.. ఆది దంపతులకు అంగరంగ వైభవంగా నిర్వహించే కల్యాణం.. పాహిమాం పరమేశ్వరా అంటూ ప్రార్థించే భక్తులూ… ఈ వేడుకలన్నీ శ్రీశైలంలో మహా శివరాత్రి సందర్భంగా పదకొండు రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో కనిపించే విశేషాలు. 2025, ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా ఇక్కడ జరిగే ఉత్సవాల విశేషాలు, అవి జరిగే తీరుపై ప్రత్యేక కథనం..
దట్టమైన నల్లమల అడవుల్లో, కృష్ణానది తీరాన జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట వెలసిన భూలోక కైలాసమే శ్రీశైలం. ఇక్కడ పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున లింగంగా కొలువైతే, పార్వతీదేవి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబికా దేవిగా దర్శనమిస్తోంది. మహా శివరాత్రి సమయంలో ఇక్కడ జరిపే బ్రహ్మోత్సవాలనూ, శివపార్వతుల కల్యాణాన్నీ చూసేందుకు సుమారు పది లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా. ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు నిర్వహించే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఎందరో శివభక్తులు పాదయాత్ర చేస్తూ మరీ శ్రీగిరిని చేరుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు.

శివశక్తి సమ్మేళనం..
కృతయుగంలో శిలాద అనే మహర్షి సంతానం కోసం శివుడిని పూజించాడట. పరమేశ్వరుడు అనుగ్రహించి ఆ మహర్షికి ఇద్దరు కుమారులను అనుగ్రహించాడు. వారికి నందికేశ్వరుడు, పర్వతుడు అనే పేర్లు పెట్టాడు శిలాద ముని. కొంతకాలానికి నందికేశుడు శివుడిని పూజించి స్వామికి వాహనంగా మారితే పర్వతుడు కూడా తపస్సు చేసి తనపైన కొలువుదీరాలని స్వామిని వేడుకున్నాడు. అతడి కోరిక మేరకు శివుడు ఆ పర్వతంపైనే స్వయంభూగా కొలువుదీరాడని, అదే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటనీ అంటారు.
ఇక దక్షయజ్ఞం సమయంలో తండ్రి వల్ల అవమానానికి గురైన సతీదేవి అగ్నిలో దూకి ఆత్మాహుతికి యత్నించగా శివుడు సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని విలయతాండవం చేశాడు. ఆ ప్రళయాన్ని ఆపడం కోసం మహా విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో ఆ భాగాలు పలుచోట్ల పడి ఆ ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా వెలిశాయి. వాటిల్లో మెడ భాగం పడిన ప్రదేశమే శ్రీశైలమని, అందుకే ఈ ప్రాంతాన్ని శివశక్తి క్షేత్రమనీ అంటారు.

అమ్మవారికి ఆ పేరెలా వచ్చిందంటే..
ఇక్కడి ఆదిపరాశక్తికి భ్రమరాంబికా అనే పేరు రావడం వెనుకా ఒక కథ ఉంది.

ఒకప్పుడు అరుణాసురుడనే రాక్షసుడు గాయత్రి మంత్రాన్ని జపించి మరణం లేకుండా వరం పొందాడట. అది తెలిసి దేవతలు జగన్మాతను ప్రార్థించడంతో గాయత్రీ మంత్రం జపిస్తున్నంత వరకూ అతడిని ఎవరూ ఏమీ చేయలేరని చెప్పిందట. దీంతో దేవతలు ఒక పథకం ప్రకారం తమ గురువైన బృహస్పతిని అరుణాసురుడి వద్దకు పంపించారు. అలా వెళ్లిన బృహస్పతి తాను కూగా గాయత్రీ మాత భక్తుడినని అరుణాసురుడితో చెప్పాడు. దేవతలు పూజించే అమ్మవారిని తాను పూజించనంటూ ఆ రాక్షసుడు మంత్ర జపాన్ని ఆపేశాడు. అప్పుడు ఆదిపరాశక్తి భ్రమర (తుమ్మెద) రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలను సృష్టించిందట. అవన్నీ అరుణాసురుడినీ, అతడి సైన్యాన్నీ సంహరించడంతో అమ్మవారికి భ్రమరాంబిక అనే పేరు వచ్చిందనీ చెబుతారు.

ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు..
భూలోక కైలాసంగా పేరొందిన శ్రీ క్షేత్రంలో
సంవత్సరానికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. మొదటి ఉత్సవాలను సంక్రాంతి సమయంలో, రెండోసారి ఆ తరువాత వచ్చే మాఘ మాసంలోని మహా శివరాత్రి పర్వదిన సందర్భంలోనూ నిర్వహిస్తారు. మొదటి రోజు సాయంత్రం ధ్వజారోహణ, భేరీ పూజ చేసి దేవతలను ఆహ్వానించి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఆ మర్నాటి నుంచీ ఆది దంపతులకు రోజుకో వాహన సేవను నిర్వహిస్తారు. మహా శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో వేద పండితులూ, అర్చకులూ కలిసి మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకం, ఆ తరువాత శివపార్వతుల కల్యాణం, చివరగా ప్రభోత్సవం, తెప్పోత్సవం నిర్వహించి ఉత్సవాలను ముగిస్తారు.

పట్టు వస్త్రాల సమర్పణ.. పాగా అలంకరణ
శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో పార్వతీ పరమేశ్వరులకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి సన్నిధానం, కాణిపాకం దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు వస్తాయి. అలాగే శివపార్వతుల కల్యాణానికి ముందు అర్ధరాత్రి పన్నెండు గంటల తరువాత పాగా అలంకరణ పేరుతో 365 మూరల పొడవు ఉన్న పాగాను స్వామివారి గర్భాలయ విమాన శిఖరం నుంచి ముఖ మండపంపైన ఉండే నందులను కలుపుతూ అలంకరిస్తారు. కొన్ని సంవత్సరాల నుంచీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల పరిధిలోని హస్తినాపురానికి చెందిన పృథ్వి వెంకటేశ్వర్లు కుటుంబమే ఈ పాగాలంకరణ చేస్తోంది. వెంకటేశ్వరుల కుటుంబం రోజుకో మూర చొప్పున ఏడాది మొత్తం దీన్ని నేసి బ్రహ్మోత్సవాల సమయానికి ఆలయానికి తెస్తారు. ఇక, ఈ వేడుకలను చూసి తరించేందుకు ఎందరో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటారు.

పాదయాత్రతో పునీతం..
పార్వతీదేవి ప్రకృతి స్వరూపిణి. శ్రీశైలం చుట్టూ ఉన్న అడవి ఆ తల్లి అవతారమేనని భావిస్తారు భక్తులు. ఆ అడవిలో కాలినడకన ప్రయాణించడం అంటే పార్వతమ్మ వెచ్చటి పొత్తిళ్లలో తలదాచుకోవడమనని.. ఆ పాదయాత్ర తరువాత మల్లికార్జునుడిని కొలవడం అంటే అమ్మ ఒడి నుంచి వచ్చి అయ్య దీవెనలు నిండారా అందుకోవడమేనని నమ్ముతారు. అందుకే శివరాత్రికి కాస్త ముందు ఈ పాదయాత్రకు అటవీశాఖ అనుమతించగానే వేలాది మంది తరలివస్తుంటారు. అటవీ శాఖ ప్రస్తుతం అనుమతిస్తున్న వెంకటాపురం – నాగలూటి – భీముని కొలను పాదయాత్ర మార్గం.. శ్రీశైలాన్ని చేరుకునే ప్రాచీన దారుల్లో ఒకటి. రాయలసీమ నలువైపుల నుంచీ వచ్చే వారు కర్నూలు జిల్లా వెంకటాపురానికి వాహనాల్లో చేరుకుంటారు. అక్కడి నుంచే పాదయాత్ర మొదలవుతుంది. అలా ఓ మూడు కిలోమీటర్లు పంటపొలాల దారిలో నడిచి ముర్తుజావలి దర్గా వద్దకు చేరుకుంటారు భక్తులు. హిందూ ముస్లింల ఐక్యతకు సంకేతంలా ఇక్కడ భక్తులు మొక్కులు తీర్చుకోవాలనేది ఐతిహ్యం. ఇక్కడి నుంచి నాలుగు అడుగులు వేస్తే.. దట్టమైన అరణ్యంలోకి అడుగు పెడుతున్నామనడానికి సంకేతంగా కీచురాళ్ల రొద మొదలవుతుంది.

వెదురు చెట్ల గొడుగులు
కాలిబాటన వెళ్తున్న వారికి గొడుగు పడుతున్నట్టు దారికి ఇరువైపులా ఎత్తయిన, దట్టమైన వెదురుచెట్లు పలకరిస్తాయి. ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఎనిమిది కిలోమీటర్లు నడిస్తే నాగలూటి వీరభద్ర స్వామి ఆలయం వస్తుంది. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఆలయం ఇది. ఇక్కడి దాకా వచ్చిన భక్తులకు శ్రీశైలం ఆలయ సిబ్బంది రూ.200 శీఘ్ర దర్శన టికెట్లు అందిస్తారు. ఈ యాత్రలో తొలి కొండ మెట్ల మార్గం ఇక్కడి నుంచే మొదలవుతుంది. సుమారు వెయ్యి వరకు మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కే క్రమంలో ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అయినా.. చల్లగాలి సేదదీరుస్తూ ఉంటుందీ మెట్ల మార్గంలో. ఇక్కడి నుంచి ఓ పది కిలోమీటర్లు నడిస్తే కొండ కింది ‘పెద్దచెరువు’ అనే గిరిజన గ్రామం వస్తుంది. కర్నూలులో మనం ఎనిమిది గంటలకు బయల్దేరితే ఇక్కడికి సాయంత్రం ఆరు గంటలకు చేరుకుంటాం. ఆ తర్వాత అడవి మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరం కాబట్టి ఇక్కడే మజిలీ చేస్తారు భక్తులు. వాళ్ల కోసం శ్రీశైలం ఆలయ ట్రస్టు ఉచిత భోజనం సహా అన్ని వసతులూ కల్పిస్తుంది.
ఇక్కడ చీకటి ముదిరే కొద్దీ అడవిలో కీచురాళ్ల రొదకి జంతువుల అరుపులూ తోడై గమ్మత్తయిన అనుభూతినిస్తాయి. వేకువనే ఇక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికే మెట్ల మార్గం ప్రారంభం అవుతుంది. ఈ మెట్ల మార్గం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల కిందట కట్టించినవని చెబుతారు. అలా నడుస్తూ అడవి పక్షుల కిలకిలల మధ్య.. చీకటి తెరలను తొలగించుకుంటూ వచ్చే ఉదయభానుడిని చూడటం ఓ అద్భుతమైన అనుభవంగా మిగిలిపోతుంది. అక్కడి నుంచి భీముని కొలను మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ, అది ఓ పెద్ద లోయ అడుగున ఉంటుంది. చుట్టూ నిండిన పచ్చదనానికి లేత ఎండ అద్దే బంగారు మెరుగులూ, మన చుట్టూ చేరి తారట్లాడే మేఘాల పలకరింపులూ.. రెండ్రోజుల శ్రమనంతా ఇట్టే మరిచిపోయేలా చేస్తాయి ఇక్కడ. భీముని కొలనులో భీముడి విగ్రహమూ, ఓ కొలనూ ఉంటాయి. మరో రెండు కిలోమీటర్లు మెట్ల మార్గంలో పైకి ఎక్కాక.. శ్రీశైలం కైలాస ద్వారం కనిపిస్తుంది. అక్కడి నుంచి అరగంటలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయానికి చేరుకోవచ్చు.

44 నదులు.. 60 తీర్థరాజాలు..
లక్షా నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, ఎనిమిది శృంగాలతో అలరారే శ్రీశైలంలో నలభై నాలుగు నదులు, అరవై కోట్ల తీర్థరాజాలు, పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవన సీమలు, చంద్రకుండ, సూర్యకుండాది పుష్కరిణులు, స్పర్శవేదులైన లతలు, వృక్ష సంతతులు, అనేక లింగాలు, అద్భుత ఔషధాలు ఉన్నాయని ప్రతీతి. గిరుల బారులను దాటి శ్రీశైల మల్లన్న సన్నిధికి చేర్చే దారి అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. పౌరాణిక ప్రశస్తికి గుర్తుగా సీతారాములు ప్రతిష్ఠించిన సహస్ర లింగాలు, పాండవులు సభక్తికంగా సంస్థాపించిన సద్యోజాతి లింగం, పంచ పాండవ లింగాలు ఇక్కడ పూజలందుకుంటున్నాయి.
శ్రీశైలం ఎప్పుడు వెలసిందీ స్పష్టంగా తెలియచేసే ఆధారాలు లేవని అంటారు. అష్టాదశ పురాణాల్లోనూ, భారత రామాయణాది ఇతిహాసాల్లోనూ శ్రీశైల వైభవం స్తుతుల్ని అందుకుంది. సంస్క•త, ఆంధ్ర, కన్నడ, మరాఠీ గ్రంథాల్లో ఈ క్షేత్రం గురించి వర్ణనలు ఉన్నాయి. ఆయా భాషల కవులు శ్రీగిరిని కీర్తిస్తూ వ్యోమకేశ, హైమవతుల సంధ్యా సుందర నృత్యాన్ని సుమనోజ్ఞంగా అభివర్ణించారు. అరవైనాలుగు అధ్యాయాలు ఉన్న స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం ఈ క్షేత్ర మహత్తును వివరిస్తోంది. ఈ క్షేత్ర ప్రశాంతతకు ముగ్ధులైన ఆదిశంకరాచార్యులు కొంతకాలం ఇక్కడే తపస్సు చేసి ‘శివానంద లహరి(ని రచించి, మల్లికార్జునుడికి పూజాసుమాలుగా అర్పించారు. భ్రమరాంబ సన్నిధిలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించినది ఆదిశంకర జగద్గురువే.

దత్తావతార పరంపరలో భక్తుల పూజలందుకునే నృసింహ సరస్వతీ స్వామి శ్రీశైల మహత్యాన్ని వివరిస్తూ తన పాదుకలను పట్టుకున్న తంతుడు అఏ భక్తుడికి ఈ క్షేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించినట్టు ‘గురుచరిత్ర’ చెబుతోంది. ఆ స్వామీజీ తన అవతారాన్ని సైతం ఇక్కడి పాతాళగంగలో పరిసమాప్తి గావించి, కదలీవనంలో గుప్తరూపంలో ఉన్నట్టు దత్తభక్తులు విశ్వసిస్తారు.
శ్రీశైల క్షేత్ర దర్శనం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుందని చెబుతారు. కురుక్షేత్రంలో లక్షలకొద్దీ దానాలు చేస్తే, గంగలో రెండువేల సార్లు మునిగితే, నర్మదా తీరంలో అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే, కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించే పుణ్యం శ్రీశైల క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించడం ద్వారా పొందగలమని ధార్మికులు విశ్వసిస్తారు.

ఈ క్షేత్రాలు.. నటరాజు నర్తనశాలలు
శివ స్వరూపాలలో నటరాజ స్వరూపం ప్రత్యేకమైనది. సృష్టి క్రమానికి ఆ నట విన్యాసం ఓ సంకేతం. ఆయన శివతాండవం భక్తకోటికి ఆనందదాయకం. ఎర్రటి శిరోజాలతో హిమపర్వతాలపై ఆయన తాండవం చేసినట్టు పురాణాలలో ఉంది. శివుడు తన నాట్య విన్యాసంలో చేతుల్లో ఢమరుకం, అగ్ని, అభయముద్రతో పాటు ఒక చేతిని తన చరణాల దిశగా చూపిస్తుంటాడు. తన పాదాలను నిర్మలమైన మనసుతో ప్రార్థిస్తే చాలని దీని అర్థం.
జటాజూటధారి ఈ భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. అలా ఆయన నాట్యం చేసిన ఐదు క్షేత్రాలు తమిళనాడులోనే ఉండటం విశేషం.
నటరాజు అంటే నాట్యంతో ప్రకాశించేవాడని అర్థం. ఆయన నాట్య విన్యాసాలతో పునీతమైన తమిళనాడులోని ఐదు క్షేత్రాలు ఇవే..
వాద ఆరణ్యేశ్వర్‍ ఆలయం: ఇది చెన్నై సమీపంలోని తిరువళన్‍గడు సమీపంలో ఉంది. ఇక్కడ శివుడు చేసిన నాట్యానికి కాళి తాండవం అని పేరు.
నటరాజ ఆలయం: ఇది చిదంబరంలో ఉంది. ఇక్కడ శివుడు చేసింది ఆనంద తాండవం.
మీనాక్షి అమ్మవారి ఆలయం: మధురైలో గల ఈ ఆలయంలో శివుడు చేసిన నాట్యాన్ని సంధ్యా తాండవం అని పిలుస్తారు.
నెల్లైఅప్పార్‍ ఆలయం: ఇది తిరునల్వేనిలో ఉంది. ఇక్కడ శివుడు ముని తాండవం చేశాడని అంటారు.
కుట్రాళనాథర్‍ ఆలయం: ఇది కుట్రాళంలో గల ఆలయం. ఇక్కడ శివుడు చేసిన నాట్యం.. త్రిపుర తాండవం.

పరమేశ్వరుని దశావతారాలు
విష్ణుమూర్తి దశావతారాల గురించి అందరికీ తెలుసు. కానీ, శివుడు కూడా భిన్న సందర్భాలలో పది అవతారాలను దాల్చాడు. ఒక్కో అవతార సమయంలో శక్తి (అమ్మవారు) కూడా ఒక్కొక్క పేరుతో ఆయన దేవేరిగా అవతరించింది. ఈ అవతారాలను నిత్యం మననం చేసుకునే భక్తులకు శివుడు, శివాని సర్వ శుభాలనూ చేకూరుస్తారని ఈ కింది కథ తెలుపుతుంది. ఇది శివ మహాపురాణంలోని శతరుద్ర సంహిత పదిహేడో అధ్యాయంలో ఉన్న విశేషం. శివభక్తులు తమ ధర్మాలను పాటిస్తూ శివ దశావతారాల గురించి విశేషాలను విన్నా, చదివినా విశేష సుఖాలు లభిస్తాయి. ఆ దశావతరాల వివరాలివీ..
మహా కాలావతారం: శివుడి దశావతారాలలో ఇది మొదటిది. ఈ అవతారంలో పార్వతీదేవి (శక్తి) మహాకాలి (మహాకాళి)గా ఉండి తనను సేవించిన భక్తులను అనుగ్రహిస్తుంది. మహాకాలుడు భుక్తిని, ముక్తిని కల్పిస్తాడు.
తార్‍: ఇది శివుడి రెండో అవతారం. ఆయన యొక్క ఈ అవతార సమయంలో శక్తి (అమ్మవారు) తారా అనే పేరును ఆ స్వామిని అనుసరించి ఉంటుంది. ఇద్దరూ తమ భక్తులకు భుక్తి, ముక్తులను ప్రసాదిస్తారు.
బాలభువనేశుడు: ఇది శివుడి మూడో అవతారం. ఈ అవతారంలో శివుడి ఇల్లాలు పార్వతి బాల భువనేశ్వరి అనే పేరున ఆయనను అనుసరించి ఉంటుంది. ఈ రూపంలో అమ్మవారు తన భక్తులకు సుఖాలను ప్రసాదిస్తుంటుంది.
షోడశ శ్రీవిద్యేశుడు: శివుని ఈ అవతారంలో పార్వతి షోడశీ శ్రీవిద్యాదేవిగా ఉంటుంది. వీరిద్దరి ఆరాధనతో భక్తులకు భుక్తి, ముక్తి, సుఖాలు లభిస్తాయి.
భైరవ అవతారం: ఇది శివుడి ఐదో అవతారం. పార్వతీదేవి ఈ అవతార సమయంలో భైరవిగా స్వామిని అనుసరించి ఉంటుంది. ఉపాసకులను, భక్తులను సర్వకాలాలలోనూ అనుగ్రహిస్తుంటారీ దంపతులు.
చిన్న మస్తకుడు: ఇది ఆరో అవతారం. అమ్మవారు పార్వతీదేవి చిన్నమస్తకిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తుంటారు.
ధూమవంతుడు: ఇది శివుడి ఏడో అవతారం. ఈ అవతార సమయంలో పార్వతి ధూమావతి అనే పేరున ఉంటుంది. ఉపాసకుల కొంగుబంగారంగా ఈ అవతారంలో ఆదిదంపతులు ఉంటారు.
బగలాముఖుడు: ఇది శివుడి ఎనిమిదో అవతారం పేరు. అప్పుడా తల్లి బగలాముఖీ, మహానంద అనే పేర్లతో ఉంటుంది. శక్తి ఉపాసకులకు బగలాముఖీ దేవత చాలా ముఖ్య దైవతం. ఈమె ఆలయం హిమాచల్‍ప్రదేశ్‍లో ఉంది.
మాతంగుడు: ఇది శివుడి తొమ్మిదో అవతారం. ఈ అవతార సమయంలో పార్వతీదేవి మాతంగిగా ఉంటుంది.
కమలుడు: ఇది పదో అవతారం. చివరిది. ఈ సమయంలో పార్వతి కమల అనే పేరుతో శివుడి సరసన ఉంటుంది.
ఈ అవతారాలన్నీ విడిగా కన్నా తంత్ర శాస్త్రాలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ తంత్ర శాస్త్రాలలో కనిపించే పార్వతీదేవి అవతారాలు తమ భక్తుల శత్రువులను సంహరించడం, దుష్టులను శిక్షించడం, నిత్యం బ్రహ్మవర్చస్సును పెంపొందిస్తూ ఉండటం చేస్తుంటాయి. మహాకాలాది శివ దశావతారాలు శక్తితో కూడి ఉండి భక్తులను ఆదుకుంటుంటాయి. తంత్ర శాస్త్రానుసారం ధూమావతి, బగలాముఖి లాంటి శక్తులన్నింటికీ విడివిడిగా మంత్రాలు, ఉపాసనా విధులు ఉంటాయి. అవన్నీ సంపూర్ణంగా తెలిసినా, తెలియకపోయినా నిత్యం ఉదయం వేళ ఈ దశావతారాలలోని శివశక్తులను స్మరించడం పుణ్యప్రదమని శివపురాణం చెబుతోంది.

శివుని అష్టరూపాలు
భూనంభాస్యనలో నిలోమ్బర మహార్నాథో
హిమాంశు: పుమాన్‍
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్‍
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో:
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

జగద్గురు ఆదిశంకరాచార్య చెప్పిన దక్షిణామూర్తి స్తోత్రంలోని ఒక పాదం ఇది. దీని అర్థం ఏమిటంటే..
‘అంతటా నిండి నిబిడీకృతమైన శివ చైతన్యం కంటికి కనబడే విధంగా అష్టమూర్తి తత్త్వంగా ప్రకాశిస్తుంది’ అని. ఈ ప్రపంచంలో మనం శివుడిని ఎనిమిది రూపాలలో దర్శించగలమట. ఆయన తత్వమంతా ఎనిమిది అంకె మీదే నడుస్తుంది. పృథివీ, ఆపస్తేజో, వాయు, జల, ఆకాశములు పంచభూతాలు. ఈ ఐదుతో పాటు సూర్యచంద్రులు, జీవుడు.. ఈ మూడూ కలిపి మొత్తం ఎనిమిది శివ స్వరూపాలు.
వీటిని శివ స్వరూపాలుగా నిర్ధారణ చేయడం కోసమే ఈ ఎనిమిది లింగాలు మనకు దర్శనమిస్తున్నాయి. అవి..
– కంచిలో పృథ్వీలింగం,
– జంబుకేశ్వరంలో జల లింగం
– అరుణాచలంలో అగ్ని లింగం
– చిదంబరంలో ఆకాశ లింగం
– శ్రీకాళహస్తిలో వాయులింగం
– కోణార్క్లో సూర్య లింగం
– సీతాకుండంలో చంద్రలింగం
– కాఠ్మండ్‍లో యజమాన లింగం

వీటిలో అరుణాచలం, శ్రీకాళహస్తి, చిదంబరం, కంచి, జంబుకేశ్వరంలో గలవి పంచభూత లింగాలుగా ప్రసిద్ధి. వీటిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని చెబుతారు. శివరాత్రి పర్వదినం ఆయా క్షేత్రాల్లో విశేషంగా నిర్వహిస్తారు.

శివుడి నిజస్థానం
కైలాసమా? వారణాసా?

విశ్వేశ్వరుడికి ఈ విశ్వమే ఆవాసం. ఆయన విశ్వవ్యాప్తంగా కొలువై ఉంటాడు. కానీ, అంతటా నిండి ఉన్న దేవుడి తత్త్వాన్ని తెలియచేసే పుణ్యక్షేత్రాలు మాత్రం కొన్నే. అందులో ప్రముఖమైనది వారణాసి. కైలాస సదనంలో కులాసాగా ఉంటున్న శంకరుడికి ఒకసారి హిమగిరులు దాటి ఆవల ఉండాలనే మనసు పుట్టిందట. పార్వతీదేవితో కలిసి ఏదైనా సిద్ధక్షేత్రంలో నివసించాలని కోరుకున్నాడట. చివరికి అలా కాశీ తనకు తగిన ఆవాసమని ఎంచుకున్నాడట. అప్పటికే కాశీని రాజధానికిగా చేసుకుని ఆ ప్రాంతాన్ని దివోదాసు అనే రాజు పరిపాలిస్తున్నాడు. పరమేశ్వరనుడి ఆనతితో నికుంభుడనే రాక్షసుడు వారణాసికి వెళ్లి అక్కడి ప్రజలను, రాజును తరలించి శివుడు నివసించడానికి అనువైన ఏర్పాట్లు చేస్తాడు. తన రాజ్యం పోయిందన్న బాధతో దివోదాసు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. అప్పుడు కాశీరాజు ‘దేవతలు దేవలోకంలో, నాగులు పాతాళంలో, భూలోకంలో మనుషులు మాత్రమే ఉండే విధంగా వరం ఇవ్వాలని కోరుతాడు. బ్రహ్మ తథాస్తు అంటాడు. దీంతో కాశీనాథుడు మళ్లీ కైలాసానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లినా శివుడి మనసు మనసులో ఉండదు. కాశీలో ఉండటానికి మార్గం చేయాలంటూ 64 మంది యోగినులను పంపిస్తాడు. ఆ వచ్చిన దేవతలను గంగాతీరంలో ప్రతిష్ఠిస్తాడు దివోదాసు. శివాజ్ఞ మేరకు సూర్యుడు రాగా, ద్వాదశాదిత్య రూపాలుగా గంగ ఒడ్డున ప్రతిష్ఠిస్తాడు. దివోదాసును ఒప్పించడానికి స్వయంగా బ్రహ్మదేవుడే వారణాసికి వెళ్తాడు. ఆయననూ మచ్చిక చేసుకున్న దివోదాసు.. బ్రహ్మతో గంగాతీరంలో దశాశ్వమేథ హోమం చేయిస్తాడు. చివరకు విష్ణుమూర్తి కాశీకి వెళ్లి, దివోదాసుకు జ్ఞానోపదేశం చేస్తాడు. అలా శివుడు మళ్లీ కాశీ విశ్వనాథుడు అయ్యాడని కాశీ (వారణాసి) స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది.

Review అదిగో శ్రీశైలం,, అదియే కైలాసం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top