బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడిక ఇది అంతగా ఆసక్తి కలిగించే ప్రశ్న, సందేహం కానేకాదు. ఇప్పుడంతా అసలు ‘రాజమౌళి బాహుబలి’ని ఎలా తెరకెక్కించాడు? అందుకోసం ఏం కలగన్నాడు? తన కలను వెండితెరపై ఎలా ఆవిష్కరించుకొన్నాడు?’ అనేవే అందరికీ ఉత్కంఠ కలిగిస్తున్న ప్రశ్నలు. వాటికి సమాధానం తెలుసుకోవాలంటే ఈ విశేషాలు చదవాల్సిందే.
వెండితెర విజువల్ వండర్ ‘బాహుబలి’ ఇప్పుడొక చరిత్ర.
ఇప్పుడంతా ‘బాహుబలి’.. ఆ చిత్ర విశేషాలు.. అది కొల్లగొడుతున్న రికార్డుల గురించి
‘కథలు’ కథలుగా చెప్పుకొంటున్నారు.
తాజాగా వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‍లో చేరిన తొట్టతొలి భారతీయ తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ సినిమా ఆఫ్‍స్క్రీన్, ఆన్‍స్క్రీన్
విశేషాలు ‘తెలుగు పత్రిక’ పాఠకుల
కోసం ప్రత్యేకం.
జై మహిష్మతి..!
‘బాహుబలి’ చిత్రం సినీ అభిమానులకు పరిచయం చేసిన కొత్త సామ్రాజ్యం.. ‘మహిష్మతి’. ఈ రాజ్యం కోసమే బాహుబలి యుద్ధం చేస్తాడు. అయితే, చరిత్రలో నిజంగానే మహిష్మతి రాజ్యం ఉందా? అంటే, ఉందనే చెబుతున్నాయి చారిత్రక ఆధారాలు. ఇప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాజ్యపు ఆనవాళ్లు ఉన్నట్టు భోగట్టా. వింధ్య పర్వతాలకు రెండు వైపులా విస్తరించిన అవంతి రాజ్యంలో ఉత్తరాదిన ఉన్న భాగం ఉజ్జయిని నగరాన్ని రాజధానిగా చేసుకోగా, దక్షిణాన ఉన్న అవంతి రాజ్యానికి మహిష్మతి రాజధానిగా ఉండేదట. సామాజిక, ఆర్థిక కేంద్రంగా విలసిల్లిన మహిష్మతి నగరం గురించిన ప్రప్తావన పలు ఇతిహాసాల్లో కూడా ఉంది.
భారత్‍లోని పశ్చిమ, మధ్య ప్రాంతాలను పాలించిన ‘హాయ్‍హాయాస్’ అనే ఐదు తెగల సమాఖ్య మహిష్మతిని కేంద్రంగా చేసుకుని పాలించిందనే వాదన ఉంది. ‘హరివంశ చరితం’ అనే సంస్క•త గ్రంథంలోనూ మహిష్మతి రాజ్య ప్రస్తావన ఉంది. మహిష్మతి అనే రాజు దీన్ని ఏర్పాటు చేసినందున ఆయన పేరు ఈ నగరానికి వచ్చిందని ఈ గ్రంథంలో ఉంది. ‘రఘువంశ చరితం’లోనూ ఈ నగర ప్రస్తావన ఉంది. మహిష్మతి ప్రాంతాన్ని ‘అనుపమ’ అనే పేరుతోనూ వ్యవహరించే వారని ఈ గ్రంథం తెలియజేస్తోది.
ఇక, మహాభారతంలోనూ ఈ నగర ప్రస్తావన ఉంది. పాండవులు రాజ్యాధికారానికి రాక ముందు ‘నీల’ అనే రాజు మహిష్మతి రాజ్యాన్ని పాలించాడట. అలాగే, కార్తవీర్యార్జునుడు మహిష్మతిని పాలిస్తున్నప్పుడు రావణుడు యుద్ధానికి వచ్చి ఆయనతో యుద్ధంలో ఓడిపోయాడని ‘విష్ణు పురాణం’లో ఉంది. ఎత్తయిన వింధ్య పర్వత సానువుల్లో, నదీ తీరాన ఈ రాజ్యం విలసిల్లిందని, అడవులు, జలపాతాలకు నెలవై అలరారిందనీ చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ రాజ్యం చుట్టూ అల్లుకున్న ‘బాహుబలి’ కథ.. అలనాటి అందమైన ఊహలకు మరింత కనువిందు చేసే దృశ్యాలతో రెక్కలు తొడిగింది.
సాం•కేతికత అంతగా లేని ఆ రోజుల్లోనే ‘మాయాబజార్’ తెలుగు ప్రేక్షకుల్ని మాయాజాలం చేసింది. మరో వందేళ్లు కాదు.. వెయ్యేళ్లయినా ఆ దృశ్యకావ్యం తెలుగు గడ్డపై సజీవంగానే ఉంటుంది. అంతటి కమనీయ దృశ్యాలతో కట్టిపడేసిన ‘మాయాబజార్’ తరువాత మళ్లీ అంతటి అద్భుత దృశ్యాలతో కనువిందు చేసి, ప్రపంచ సినీ అభిమానుల్ని యావత్తూ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన చిత్రం ‘బాహుబలి’.
‘బాహుబలి- ది బిగినింగ్’తోనే ప్రేక్షకుల్ని సమాధానం దొరకని ప్రశ్నతో దాదాపు రెండు సంవత్సరాల పాటు ఉత్కంఠకు గురిచేసిన దర్శకుడు రాజమౌళి.. మొదటి చిత్రానికి కొనసాగింపుగా ‘బాహుబలి- ది కన్‍క్లూజన్’ వదిలారు. తొలి చిత్రం క్లైమాక్స్లో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడ’నే ప్రశ్నను లేవనెత్తారు. ఆ కుతూహలాన్ని రెండేళ్ల పాటు అలాగే కొనసాగించడం అంటే మాటలు కాదు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడంతో పాటు ఊహకందని రీతిలో అద్భుత దృశ్యాలను బాహుబలి-2లో పొందుపరిచారు.
అంతా అధునాతనమే..
బాహుబలి-2ను ఐమాక్స్ ఫార్మేట్‍లో విడుదల చేశారు. ఈ సినిమా కోసమే ఐమాక్స్ థియేటర్లు కొత్త టెక్నాలజీని రూపొందించుకున్నాయి. ఈ విధంగా ఐమాక్స్ ఫార్మేట్‍లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో దక్షిణ భారతదేశంలోనే ‘బాహుబలి-2’ మొదటిది. ఇక, సినిమాలో శబ్దం, దృశ్యం ప్రధానమైనవి. ప్రేక్షకుల్ని సినిమాలో లీనం చేసేవి ఇవి రెండే. ఇందు కోసం దాదాపు 200 థియేటర్లు ‘4కే ప్రొజెక్షన్’ సమకూర్చుకున్నాయి. నిజంగానే ఈ సాంకేతికత అంతా ప్రేక్షకుల్ని బాహుబలి సామ్రాజ్యంలో విహరింపచేశాయి.
‘బాహుబలి-3’ ఉంటుందా?
అందరి మదిని తొలిచిన ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇక, సినిమా చూసి.. ఆ సన్నివేశాలను చూసి.. ‘వాహ్..’ అనని వారు లేరు. రోజురోజుకూ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తున్న బాహుబలి గురించి తెలుగునాట, ప్రపంచంలోనూ సినీ అభిమానులు మాట్లాడుకోని రోజు లేదంటే ఆశ్చర్యం లేదు. ఈ సినిమా రెండు భాగాలు వచ్చాయి.. ఇక, మూడో భాగం కూడా రానుందా?. వెయ్యేళ్ల క్రితం జరిగినట్టుగా ఊహించి, రాసుకొన్న కథకు దృశ్యరూపమే.. ‘బాహుబలి’ రెండు భాగాలు. నిజానికి వెయ్యేళ్ల క్రితం నాటి ‘ఊహ’లోకి ప్రేక్షకుల్ని తీసుకువెళ్లడానికి రెండున్నర గంటల సమయం సరిపోదు. అందుకే, బాహుబలిని రెండు భాగాలుగా తీశారు. అంతేతప్ప, ఒక భాగం విజయవంతం అయ్యింది కాబట్టి, రెండో భాగం తీసి, అదీ సక్సెస్ అయ్యిందని మరో భాగం తీసే ఆలోచన చిత్ర బృందానికి లేదని స్వయంగా దర్శకుడు రాజమౌలి స్పష్టం చేశారు. కాబట్టి బాహుబలి మూడో భాగం లేనట్టే. ‘మహాభారతం’ తీయాలనేది తన కల అని ఆయన తాజాగా కూడా చెప్పారు. కాబట్టి ఆయన నుంచి మరో విజువల్ వండర్ వచ్చే అవకాశం ఉంది.
భావోద్వేగాలే ఆయువుపట్టు..
నిజానికి బాహుబలిలో ఏం ఉంది?.. అంతా గ్రాఫిక్స్ మాయాజాలమే అనే వారూ ఉన్నారు. కానీ, నిజానికి పాత్రల మధ్య గొప్ప సంఘర్షణ ఉన్నప్పుడే భావోద్వేగాలు బలంగా పుట్టుకొస్తాయి. అవి ప్రేక్షకుల్లో అటెన్షన్ తెస్తాయి. బాహుబలిలోని ప్రతి సన్నివేశంలో భావోద్వేగాలు పండాయి. ఆయా పాత్రల మధ్య సంఘర్షణను ప్రేక్షకులు ‘ఫీల్’ అయ్యారు. అందుకే ఈ సినిమా రెండు భాగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. బాహుబలి, శివుడు (ప్రభాస్), భళ్లాలదేవ (రానా), కట్టప్ప (సత్యరాజ్), శివగామి (రమ్యకృష్ణ), దేవసేన (అనుష్క).. ఈ పాత్రలన్నిటి మధ్య పుట్టిన ఘర్షణ.. అందులో ప్రతిఫలించే భావోద్వేగాలే ఈ చిత్రానికి ఆయువుపట్టుగా నిలిచాయి. లేదంటే.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నకు సమాధానం కోసం ప్రపంచం యావత్తూ రెండేళ్ల పాటు ఎందుకు వేచి చూస్తుంది?. ఇక, ఈ సినిమా కోసం హీరో ప్రభాస్, ప్రతినాయక పాత్రధారి (భళ్లాలదేవ) రానా 30 కిలోల బరువు పెరిగారు. గంటల తరబడి వ్యాయామశాలల్లో గడిపారు. ప్రభాస్ ప్రత్యేకంగా తన ఇంట్లోనే రూ.1.5 కోట్ల ఖర్చుతో జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపుగా చిత్ర యూనిట్ అంతా ఐదేళ్ల పాటు శ్రమించింది.
అన్నీ ప్రశ్నలే..
నిజానికి బాహుబలి మొదటి భాగంలో ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్న ఒక్కటే హైలైట్ అయ్యింది కానీ, ఇంకా తొమ్మిది వరకు ప్రశ్నలకు ఆ సినిమా చూస్తే జవాబు దొరకదు. వాటికి సమాధానమే బాహుబలి-2. మొదటి భాగం చూస్తే కలిగే సందేహాలు, ప్రశ్నల్లో కొన్ని ఇవి..
1. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?
2. శివగామి ఎలా చనిపోయింది?
3. అవంతికి అక్కడ ఎందుకుంది?
4. దేవసేన సంకెళ్లతో ఎందుకు ఉంది?
5. శివుడి కాలిని కట్టప్ప నెత్తిన పెట్టుకోవడం ఏమిటి?
.. ఇంకా ఇలాంటి ప్రశ్నలనే మొదటి సినిమా ప్రేక్షకుల మీదికి వదిలింది. వాటన్నిటికీ ఇప్పటికి సమాధానం దొరికింది.
దాదాపు ఐదు సంవత్సరాల పాటు రెండు భాగాలు షూటింగ్ జరుపుకొన్నాయి. యుద్ధ సన్నివేశాలకే ఒక్కో దానికి 120 రోజులకు పైగా పట్టింది. అటువంటి నాలుగైదు యుద్ధ సన్నివేశాలనే కేవలం ఏడాదిన్నర పాటు చిత్రీకరించారన్న మాట. సగటున ఒక్కో సన్నివేశానికి రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టారు. కేవలం ముగింపు సన్నివేశాల కోసమే రూ.30 కోట్లు ఖర్చు చేశారు. తొలి భాగం క్లైమాక్స్కు అయిన ఖర్చుతో పోలిస్తే ఇది రెట్టింపు.
విజువల్ వండర్
బాహుబలి.. వెండితెరపై కమనీయ దృశ్యకావ్యం. కానీ, ఆ దృశ్యాలను అలా తీర్చిదిద్దడానికి చాలా సమయం పట్టింది. చాలామంది సాంకేతిక నిపుణులు పనిచేశారు. బాహుబలి సినిమాతో పాటే మరింత ప్రాచుర్యంలోకి వచ్చిన పేరు విజువల్ ఎఫెక్టస్. బాహుబలికి వీటిని పెద్ద ఎత్తున వినియోగించారు. ప్రపంచ వ్యాప్తంగా వీఎఫ్‍ఎక్స్ స్టూడియోలు చాలా ఉన్నాయి. అయితే, రాజమౌళి తన సినిమాకు వీఎఫ్‍ఎక్స్ పని ఎలా జరుగుతోందో స్వయంగా పరిశీలించే వారు. తనకు ఏం కావాలో స్పష్టంగా చెప్పే వారు. అందుకు కాబట్టే ఆయా సన్నివేశాలు అంత జనరంజకంగా పండాయి. దర్శకుడు ఓ సన్నివేశాన్ని తీసిన తరువాత దాన్ని విజువల్ ఎఫెక్టస్ స్టూడియోకు పంపిస్తారు. ఏయే తరహా సన్నివేశాలను ఏయే స్టూడియోలు బాగా తీయగలవో తెలిసి ఉండాలి. ఆ సన్నివేశాన్ని సదరు స్టూడియోకు పంపిస్తేనే తగిన ఇన్‍పుట్ వస్తుంది. సామాన్య ప్రేక్షకుడికి సైతం లోపాలు కనిపించని రీతిలో వీఎఫ్‍ఎక్స్ స్టూడియోల్లోనే ఆయా సన్నివేశాలను సరిదిద్దుతారు. బాహుబలి కోసం దాదాపు 86 వీఎఫ్‍ఎక్స్ స్టూడియోలు పనిచేశాయి. వీఎఫ్‍ఎక్స్కి సంబంధించి దాదాపు 2,226 షాట్స్ ఉన్నాయి. వీటికి మెరుగులు దిద్దే పనిలో దాదాపు వెయ్యి మంది సాంకేతిక నిపుణులు దాదాపు 18 నెలల పాటు శ్రమించారు. ఒక సినిమాకు వీఎఫ్‍ఎక్స్ వర్క్ పూర్తి కావడానికి ఆరు నెలలు పడుతుంది. కానీ, అంత ఒత్తిడిలోనూ బాహుబలి ఇన్‍పుట్‍ను వీఎఫ్‍ఎక్స్ నిపుణుడు కమల్ కణ్నన్ రెండున్నర నెలల్లోనే ఇవ్వగలిగారు. మొదటి భాగంలోని జలపాతం, శివలింగాన్ని ప్రభాస్ భుజాన ఎత్తుకుని రావడం, మహిష్మతి రాజ్యం, యుద్ధ సన్నివేశాలన్నీ వీఎఫ్‍ఎక్స్ వర్క్తో అత్యద్భుతంగా రూపుదిద్దుకొన్నవే. రెండో భాగంలో ప్రధానమైనది- ‘కుంతల’. ఇది దేవసేన సామ్రాజ్యం. మహిష్మతి రాజ్యం కంటే భిన్నంగా దీన్ని వీఎఫ్‍ఎక్స్ ద్వారా దీన్ని డిజైన్ చేయించారు. యుద్ధ సన్నివేశాలను మరింత థ్రిల్ కలిగించేలా బాహుబలి-2లో రూపొందించారు.
రాజమౌళి మాయ..
అందరూ కలగంటారు. ఊహల పల్లకీలో ఊరేగుతారు. ఒక్కోసారి మేఘాల్లో తేలిపోతుంటారు. అయితే, అలాంటి ఊహలకు రెక్కలు తొడిగేది కొందరే. ఈ విషయంలో రాజమౌళికి సాటిరారెవరూ. తన కలను తెరపై అందంగా ఆవిష్కరించడం, అందులోకి తీసుకెళ్లిపోవడం, ఊహల్ని కలిగించడం.. వాటిని నిజమనేలా రూపుదిద్దడం, అది నిజమే అని నమ్మించేలా దృశ్యాలను తీర్చిదిద్దడం మాటలు కాదు. ‘బాహుబలి’తో తెలుగు సినిమా హద్దుల్నీ, అడ్డుగోడల్నీ సగర్వంగా చెరిపేసిన రాజమౌళి ఓ ఊహా మాంత్రికుడు. నిజానికి ఈ సినిమాలో కనిపించే చాలా సన్నివేశాలు విజయేందప్రసాద్ రాసిన కథలో లేవు. శివుడు శివలింగాన్ని భుజాన ఎత్తుకుని రావడం, అందమైన జలపాతాలు, మహిష్మతి, కుంతల సామ్రాజ్యాలు.. ఇవన్నీ రాజమౌళి ఊహల్లో నుంచి పుట్టుకొచ్చినవే. వాటికి ఆయా •ంకేతికతలను అద్ది ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లాడు. ఇటువంటి అందమైన దృశ్యాలకు తోడు- బాహుబలిలోని ధీరత్వాన్ని, బిజ్జలదేవలోని కుటిలత్వాన్ని, శివగామి ఔదార్యాన్ని, దేవసేన తెగువనీ, భళ్లాలదేవుడి ఆగ్రహాన్ని అద్భుతంగా చూపించాడు. ఈ పాత్రలన్నిటి మధ్య మంచి భావోద్వేగాల్ని పండించాడు. అదే బాహుబలి ది బిగెనింగ్, బాహుబలి ది కంక్లూజన్ విజయ రహస్యం.
అంతటా బాహుబలి మేనియా..
ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వేల తెరలపై బాహుబలి-2 ఏప్రిల్ 28న సందడి చేసింది. ఇక, భారత్‍లో ఆరు వేల ఐదు వందల థియేటర్లలో విడుదలైంది. 96 శాతం ఆక్యుపెన్సీ సాధించిన సినిమాగా బాహుబలి రికార్డు సృష్టించింది. తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన మల్టీఫ్లెక్స్లలో రోజుకు 15 నుంచి 20 షోలు ప్రదర్శితమవుతున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ సినిమాను అన్ని భాషల్లో కలిపి రూ.45 కోట్లకు అమ్మారు. విడుదలైన రెండు రోజుల్లోనే ఆ సొమ్మంతా వచ్చేసిందని అంచనా. అంటే వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక్క బాలీవుడ్‍లోనే ముందస్తు బుకింగ్‍ల రూపంలో బాహుబలి రూ.36 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీ భాషకు సంబంధించి ‘సోనీ’ సంస్థ శాటిలైట్ హక్కుల కింద రూ.51 కోట్లు చెల్లించింది. ఇక, తెలుగులో రెండు భాగాల సినిమాకు శాటిలైట్ హక్కుల కింద రూ.26 కోట్లు లభించాయి. ఈ సినిమా అంతర్జాతీయ వెర్షన్‍ను విన్సెంట్ టెబాలియన్ ఎడిట్ చేశారు. ఈయన ‘ఇంక్రెడిబుల్ హల్క్’ తదితర సినిమాలకు పని చేశారు. ప్రముఖ టీవీ చానల్ బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించిన తొలి సినిమా కూడా ఇదే. హైదరాబాద్‍లోని రామోజీ ఫిలింసిటీలో దాదాపు 199 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరుపుకొంది. ఇందులో 150 రోజుల సమయం సెట్టింగ్‍ల కోసమే పట్టింది.
బాహుబలి కథ..
ఎలా పుట్టిందో తెలుసా?
బాహుబలి అంతటి వీరుడు, శూరుడు ఈ లోకంలో మరొకడు ఉండడు. కానీ, అతను కూడా కత్తిపోటుకు కాదు, కాదు.. వెన్నుపోటుకు గురై చనిపోయాడు. అదెలా? అసలీ పాత్రలు ఎలా పుట్టాయి? కథ ఎలా మొదలైంది?.. నిజానికి బాహుబలి కథకు కట్టప్పనే మూలాధారం. అతని పాత్ర నుంచే బాహుబలి కథ మొదలైంది.
కట్టప్ప ముసలివాడు. కానీ, చాలా శక్తిమంతుడు. పిల్లలకు యుద్ధవిద్యలు నేర్పుతుంటాడు. ఓ రోజు కట్టప్ప వద్దకు విదేశీయుడు ఒకరు వస్తాడు.
‘యుద్ధవిద్యలో నేను ఇప్పటి వరకు మీ వంటి వీరుడిని చూడలేదు’ అని కట్టప్పకు నమస్కరిస్తాడు.
‘నా కంటే గొప్ప వీరుడు మరొకడు ఉన్నాడు. అతని పేరు బాహుబలి. అతన్ని యుద్ధంలో ఎవరూ గెలవలేరు’ అంటూ కట్టప్ప ఆ విదేశీయుడికి బాహుబలి కథంతా చెబుతాడు.
‘నాకు బాహుబలిని చూడాలని ఉంది. చూపిస్తారా?’ అని విదేశీయుడు ఆసక్తిగా అడుగుతాడు.
‘ఇప్పుడతను లేడు. చనిపోయాడు’ అని కట్టప్ప బదులిస్తాడు.
‘అంత గొప్ప శూరుడు ఎలా చనిపోయాడు?’ అని విదేశీయుడు ప్రశ్నిస్తాడు.
‘కత్తిపోటు కంటే బలమైనది వెన్నుపోటు. నేనే అతనిని పొడిచి చంపేశాను’ అని కట్టప్ప వివరిస్తాడు.
ఇదీ బాహుబలి కథకు రచయిత విజయేందప్రసాద్ (రాజమౌళి తండ్రి) రాసుకొన్న మొదటి సన్నివేశం. దీని ఆధారంగానే మిగతా శివగామి, భళ్లాలదేవుడు, దేవసేన తదితర పాత్రలన్నీ పుట్టుకొచ్చాయి. ఈ సన్నివేశాన్ని ఆధారంగా చేసుకునే మిగతా కథను అల్లారు.
డార్లింగ్ ప్రభాస్
ప్రభాస్ ఇప్పటి వరకు 20 సినిమాల్లో నటించాడు. బాహుబలి రెండు భాగాల కోసం దాదాపు ఐదు సంవత్సరాల సమయం వెచ్చించాడు. ఈ కాలంలో మరే సినిమా అంగీకరించలేదు. అయితేనేం మరెవరూ చేరుకోలేనంత స్థాయికి, మరెవరూ సాధించలేనంత కీర్తిని సంపాదించాడు. 2002లో ప్రభాస్ కెరీర్ ప్రారంభమైంది. కేవలం పదిహేను సంవత్సరాలకే ఏకంగా ఇండియాలోనే నంబర్‍వన్ హీరో స్థాయికి ఎదిగాడు. బాహుబలి సిరీస్‍తో ప్రభాస్ సూపర్‍స్టార్ అయ్యాడు. రూ.3 కోట్ల పారితోషకమే చాలా ఎక్కువ అన్నవాళ్లే ఇప్పుడు రూ.50 కోట్లు ఇచ్చి అతనితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. దేశంలోనే తొలి వెయ్యి కోట్ల క్లబ్ సినిమాలో హీరోగా ప్రభాస్ ఇమేజ్ అమాంతం శిఖర స్థాయికి పెరిగిపోయింది. ప్రభాస్ నటించిన సినిమాలు..
1) ఈశ్వర్, 2) రాఘవేంద్ర
3) వర్షం (కెరీర్‍ను మలుపుతిప్పిన
సినిమా ఇది)
4) అడవిరాముడు, 5) చక్రం
6) ఛత్రపతి (కెరీర్‍లో రెండో పెద్ద హిట్)
7) పౌర్ణమి, 8) యోగి
9) మున్నా, 10) బుజ్జిగాడు
11) బిల్లా, 12) ఏక్ నిరంజన్
13) డార్లింగ్, 14) మిస్టర్ పర్‍ఫెక్ట్
15) రెబల్, 16) మిర్చి
17) బాహుబలి-1
18) బాహుబలి-2
19) సాహో (ప్రస్తుతం షూటింగ్‍లో ఉంది
చూడాలని ఉంది..
బాహుబలిలో ఒకటీ రెండూ కాదు.. చాలా సన్నివేశాలు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి. మచ్చుకు కొన్ని నన్నివేశాలు.. మదపుటేనుగును బాహుబలి (ప్రభాస్) మచ్చిక చేసుకునే సన్నివేశంలో రాజమౌళిలోని ‘మాస్ పల్స్’ స్పష్టంగా కనిపిస్తుంది. దేవసేనతో కలిసి బాహుబలి గురి పెట్టి వేసే బాణాల సన్నివేశం చాలా అద్భుతంగా ఆవిష్క•తమైంది. కుంతల దేశంలో జరిగే ఎద్దుల యుద్ధాన్ని ఉత్కంఠ కలిగించేలా తీశారు. అలాగే, డ్యామ్‍ను పడగొట్టే సన్నివేశం కూడా బాగుంటుంది. ‘హంసనావ’ పాటలో మేఘాలను గుర్రాలుగా మలచడం, మరో సన్నివేశంలో మేఘాల పై నుంచి జలపాతాన్ని జాలువార్చడం.. రాజమౌళి సృజనాత్మకతకు ప్రతీకగా నిలుస్తాయి. ఏనుగు తొండాన్ని ఆసరాగా చేసుకుని బాహుబలి ధనుస్సు ఎక్కుపెట్టే సన్నివేశం.. కథానాయకుడిలోని ‘హీరో’చిత దృక్పథానికి పరాకాష్టగా నిలుస్తుంది. ఆయా ప్రధాన పాత్రల మధ్య సంఘర్షణ, భావోద్వేగాలు తదుపరి సన్నివేశాలపై ఉద్విగ్నతకు గురిచేస్తాయి.బాహుబలి పట్టాభిషేకం చేసుకోబోతున్న విషయాన్ని బిజ్జలదేవ, భళ్లాలదేవకు చేరవేస్తాడు కట్టప్ప. ఈ ఒక్క సన్నివేశంలో ఈ మూడు పాత్రల లక్షణాన్నీ ఒక్క క్షణంలో కళ్లకు కట్టేలా చిత్రీకరించిన తీరు అద్భుతం.‘నీకు రాజ్యం కావాలా? దేవసేన కావాలా?’ అని రాజమాత నిలదీసినప్పుడు, సైన్యాధిపతిగా ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు బాహుబలికి దక్కిన ప్రజాభిమానాన్ని చూసి, రాజుగా సింహాసనంపై కూర్చున్న భళ్లాలదేవుడు కుళుపోయినప్పుడు, రాజదర్బార్‍లో ఆడవాళ్లపై చేయి వేసినప్పుడు, ‘నరకాల్సింది వేళ్లను కాదు.. తలను’ అంటూ బాహుబలి శిరచ్ఛేదన చేసినప్పుడు.. ఈ సన్నివేశాల్లో పండిన ఎమోషన్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మహిష్మతి, కుంతల సామ్రాజ్యాలనేవి పూర్తిగా ఊహాతీతమైనవి. వాటిని నిజంగానే ఉన్నాయోమోననే రీతిలో విజువల్ ఎఫెక్టస్తో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. వెయ్యేళ్ల క్రితం నాటి సామ్రాజ్యాల్లో నాటి వస్తువులు ఎలా ఉండేవో కూడా చూపించే ప్రయత్నం చేశారు.
పధాని మోది నోట కట్టప్ప మాట!
‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’.. ఇది ప్రేక్షకులనే కాదు.. దేశ ప్రధానిని సైతం వేధించిన ప్రశ్న కాబోలు. అందుకేనేమో.. ప్రధాని మోది ఉత్తరప్రదేశ్‍లోని ఓ ఎన్నికల ప్రచార సభలో కట్టప్ప ప్రస్తావన తెచ్చారు. ఒక తెలుగు సినిమా ఈ స్థాయికి చేరడం విశేషమే మరి!
వై కట్టప్ప కిల్డ్ బాహుబలి?
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తొలిరోజే తెలిసేసుకోవాలని చాలా మంది అనుకొన్నారు. కానీ సినిమా రిలీజైన రోజున టికెట్లు దొరకకపోవడంతో వారి ఆశ తీరలేదు. ఇక, ఉత్కంఠ ఆపుకోలేక, గూగుల్‍ను ఆశ్రయించారు. బాహుబలి రిలీజైన రోజు ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి?’ అనే ప్రశ్న గూగుల్ సెర్చ్లో టాప్‍లో నిలిచింది. ఇదే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కోసం నెటిజన్లు సినిమా విడుదలకు దాదాపు 90 రోజుల ముందు నుంచే గూగుల్ సెర్చ్లో విహారం చేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, అహ్మదాబాద్, లక్నో తదితర నగరాల్లోనూ ఈ సెర్చ్ కొనసాగింది.
కనుకు 12 టికెట్లు.. బాహుబలి విడుదలైన రోజుతో పాటు మర్నాడు కూడా సెకనుకు 12 టికెట్ల చొప్పున బుక్ అయ్యాయి. బంగ్లాదేశ్‍కు చెందిన 40 మంది చార్టెడ్ ఫ్లైట్‍లో కోల్‍కతా వచ్చి బాహుబలి-2 చూశారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాలో సినిమాపై ఆసక్తి కలిగింది. సినిమా చూసి సమాధానం పొందాం అని వారు చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు అమీర్‍ఖాన్ ‘దంగల్’దే అత్యధిక వసూళ్ల చిత్రంగా రికార్డు. ఇప్పుడు దాన్ని బాహుబలి ఆవలీలగా అధిగమించేసింది. సుమారు రూ.250 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే రూ.500 కోట్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు వరల్డ్వైడ్ అత్యధిక వసూళ్ల రికార్డు అమీర్‍ఖాన్ ‘పీకే’ చిత్రానిదైతే.. తాజాగా బాహుబలి రూ.792 కోట్లు కలెక్ట్ చేసి ఆ రికార్డును చెరిపేసింది. రజనీకాంత్ ‘కబాలి’ తొలిరోజు రూ.87 కోట్లు కలెక్ట్ చేయగా, బాహుబలి-2 రూ.120 కోట్లు సాధించింది.
అమెరికాలోనూ హల్‍చల్
యూఎస్ టాప్-3లో చోటు
అమెరికా నేషనల్ పబ్లిక్ రేడియో (ఎన్‍పీఆర్).. అమెరికాలో ప్రముఖ రేడియో చాలన్. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇందులో తొలిసారిగా ఓ తెలుగు సినిమా గురించి ప్రస్తావించారు. చఅక్కడి యూఎస్ టాప్-10 మూవీస్‍లో బాహుబలి-2 ఒకటిగా నిలిచిందని ప్రకటించారు. అత్యధిక వసూళ్ల చిత్రాలలో ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ తరువాత బాహుబలి-2 3వ స్థానంలో నిలిచింది.
శివగామి (రమ్యకృష్ణ) ‘అమరేంద్ర బాహుబలి’ అని పలికే వాయిస్‍ను ఈ రేడియో ప్రసారం మధ్యలో ప్లే చేయడం విశేషం. ప్రపంచమంతా బాహుబలిని చూస్తోందని ఈ రేడియో ప్రసారాల్లో చెప్పడం తెలుగు వారందరికీ గర్వకారణం.
బాహుబలి-2 కోసం అమెరికాలో 900 స్క్రీన్లు, కెనడాలో 150 స్క్రీన్లు కేటాయించారు. ఓ తెలుగు సినిమాకు ఉత్తర అమెరికాలో ఇన్ని స్క్రీన్లు ఇవ్వడం రికార్డు.
అమెరికాలో బాహుబలి-2 తెలుగు వెర్షన్‍కు 400 స్క్రీన్లు, తమిళ వెర్షన్‍కు 200 స్క్రీన్లు, హిందీ వెర్షన్‍కు 300 స్క్రీన్లు కేటాయించారు.
బాహుబలి-1 ద్వారా దేశవిదేశాల్లో రూ.600 కోట్ల మార్క్ సాధించి, తాజాగా బాహుబలి-2 ద్వారా రూ.వెయ్యి కోట్ల మార్క్ను ఎప్పుడో దాటేసింది.
ప్రఖ్యాత వ్యాక్స్ మ్యూజియం మేడం టుస్సాడ్స్లో హీరో ప్రభాస్ మైనపు బొమ్మను ప్రతిష్ఠించారు. దక్షిణ భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన నటుల్లో ప్రభాస్ మొదటి వాడు. ఈ బొమ్మ కింద ‘ఒక్క బాహుబలి వంద సినిమాలతో సమానం’ అనే ట్యాగ్‍లైన్ రాశారు.
బాహుబలి-2 ట్రైలర్‍కు విడుదలైన గంటలోనే మిలియన్ వ్యూస్ లభించాయి. ట్రైలర్ విడుదలైన గంటలోనే కోటికి పైగా వ్యూస్ సాధించి.. మరో 2-3 గంటల్లో మరే సినిమా అందుకోనంత ఎత్తుకు చేరింది.
సగటున గంటకు 12 లక్షల వ్యూస్‍తో బాహుబలి-2 చరిత్ర సృష్టించింది. సెకనుకు 333 మందికి పైగానే బాహుబలి ట్రైలర్ చూశారని అంచనా.
ఇప్పటి వరకు షారూఖ్‍ఖాన్ నటించిన ‘రాయిస్’కు భారతీయ సినిమాల్లో అత్యధిక వ్యూస్ వచ్చాయి. బాహుబలి-2 పన్నెండు గంటల్లోనే 12 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డులన్నీ బద్దలు కొట్టింది. సాధారణంగా ఒక సినిమా ట్రైలర్‍కు కోటి వ్యూస్ రావాలంటే నెలపైనే పడుతుంది. అలాంటిది బాహుబలి ఒక్కరోజులోనే ఇంతటి ఘనత సాధించింది. మొత్తానికి సినిమా విడుదలకు మూడు వారాల ముందే దాదాపు 13 కోట్ల మందికి పైగా ఈ ట్రైలర్‍ను వీక్షించారు.
Review ఆహా బాహుబలీ.