సఖ్యత కుదిరిన ప్రతిచోటా స్నేహం పూస్తుంది. గాలి మేఘంతో, మేఘం నీటితో, నీరు నేలతో, నేల మొక్కతో, మొక్క పువ్వుతో, పువ్వు పరిమళంతో.. ఇలా పుట్టిన స్నేహాలన్నీ సఖ్యతతో ఏర్పడిన స్నేహాలే.
ఇవన్నీ పరస్పర ఆశ్రితాలే కాదు.. పరస్పర ప్రయోజనకారులు కూడా.
మనకు ఆస్తిపాస్తులు లేకున్నా పర్వాలేదు. బుద్ధిమంతులైన వారితో స్నేహం చేస్తే పరస్పర ప్రయోజనం పొందవచ్చు. ఆస్తిపాస్తులు, హంగూ ఆర్బాటాలు ఎన్ని ఉన్నా మనిషికి ఆత్మపరిశీలనకు మించిన ప్రక్షాళన లేదు. మనసుకు ఆత్మబంధాలను మించిన ఆహ్లాదమూ ఉండదు. మన పుట్టుకతో రక్త సంబంధాలు ఏర్పడతాయి.
ప్రవర్తనతో ఆత్మబంధాలు ముడిపడతాయి. ఈ లోకంలో స్నేహానికే కాదు.. ప్రతి బంధానికీ ఉన్నతమైన నిర్వచనాలే ఉన్నాయి. ఎలా ఉండాలో.. ఎలా ఉంటే ఆ బంధం నిలబడుతుందో తేల్చేస్తూ ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయి.
కానీ, పరిస్థితులు, ప్రవర్తనలే వాటి అర్థాలను మార్చేస్తాయి.
వ్యక్తిని బట్టి కథ మారుతుంది. ముగింపు మంచైనా, చెడైనా మరో నీతికథలా చరిత్రలో చేరుతుంది. మన స్నేహం జీవితాంతం ఆపాత మధురంగా నిలిచిపోవాలంటే పరిస్థితులు, ప్రవర్తన దాన్ని ప్రభావితం చేయకుండా చూసుకోవాలి.
ఆగస్టు 4, 2024 ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రత్యేక కథనం..
కలిగిన దాన్ని పంచుకోవడం, రహస్యాలను పంచుకోవడం, సలహాలు ఇచ్చిపుచ్చుకోవడం, ఆపదలో ఒకరినొకరు రక్షించుకోవడం.. ఇవే స్నేహాన్ని, ప్రీతిని తెలిపే గుణాలు. కేవలం గడ్డి వేసినందుకు.. తన దూడ సంగతి కూడా ఆలోచించకుండా ఆవు గడ్డి వేసిన వాడికి నిండుగా పాలు ఇస్తుంది.
ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నపుడే నిజమైన ప్రేమాభిమానాలతో కూడిన స్నేహం పురుడు పోసుకుంటుంది. ఇదే స్నేహధర్మం.
స్నేహితుల దినోత్సవం ఎలా పుట్టింది?
1935లో అమెరికాలో స్నేహితుల దినోత్సవం ప్రారంభమైంది. అప్పట్లో అమెరికా ప్రభుత్వం ఏదో కారణంతో ఓ యువకుడిని హతమార్చిందట. అది జీర్ణించుకోలేక హతుడి మిత్రుడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది జరిగింది ఆ ఏడాది ఆగస్టు మొదటి ఆదివారం నాడు. అప్పట్నుంచి ఏటా ఆగస్టు తొలి ఆదివారం నాడు ఫ్రెండ్షిప్ డే నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది. నిజానికి 1930లోనే ఈ దినోత్సవం మొదలైందట! అయితే హాల్ మార్క్ గ్రీటింగ్ కార్డుల వ్యవస్థాపకుడు ఈ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతిపాదించాడు. అందుకు తగ్గట్టు తన సంస్థ నుంచి కొన్ని గ్రీటింగ్ కార్డులను మార్కెట్లోకి వదిలాడట. దీని వెనుక స్నేహం కన్నా డబ్బులు సంపాదించాలనే వ్యూహం దాగి ఉందన్న విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 1958లో పరాగ్వేలో వరల్డ్ ఫ్రెండ్షిప్ క్రూసేడ్ అనే సంస్థ జూలై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించగా, చాలా దేశాలు దీన్ని పాటించాయి. ఆ రోజును అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచ స్నేహితుల దినోత్సవం మాత్రం ఆగస్టు తొలి వారంలోనే నిర్వహించసాగారు.
స్నేహితుడి ఎంపిక మన చేతుల్లోనే..
అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న వంటి బంధాలను మనిషి సృష్టించుకోలేడు. కానీ, తన స్నేహితులను మాత్రం తనే ఎంచుకోగల అవకాశం అతని చేతుల్లో ఉంది. ఆస్తి, అంతస్తు, కులంతో సంబంధం లేకుండా పుట్టేదే స్నేహం. స్నేహం అనేది ఇలా ఉండాలి.. అలా ఉండాలి.. అనే లెక్కలు, అంచనాలు ఉండవు. స్నేహితులు పరస్పరం ఒకరిపై మరొకరు నమ్మకం ఉంచుకుని ఎలాంటి సందేహాలు, శంకలు లేకుండా తమ కష్టసుఖాలు ఒకరితో మరొకరు పంచుకుంటారు. వారి మధ్య రహస్యాలు ఉండవు. ఇంట్లో కుటుంబసభ్యులతో కూడా పంచుకోలేని విషయాలను స్నేహితులతో పంచుకోగలం.
నిర్వచనానికి అందని స్నేహం
స్నేహం గురించి ఎందరెందరో ఎన్నెన్నో ఉపమానాలు, విశేషణాలు చెప్పారు. దాన్ని నిర్వచించే ప్రయత్నం చేశారు. కానీ, నిజానికి అది నిర్వచనాలకు, లెక్కలకు అందని ఓ అందమైన అనుభూతి. స్నేహితుడిని తలచుకోగాలనే ఒక ఆనందం, ఒక ధైర్యం, ఒక సాంత్వన.. ఇన్ని భావాలు కలగాలి. స్నేహితుడిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టనిపించాలి. అది నిజమైన స్నేహం. అలాగే స్నేహితుడంటే నిరంతరం మనల్ని వెన్నంటి ఉంటూ మనం చేసే పనులన్నిటినీ సమర్థించే వాడు కాదు. మనం తప్పు చేస్తుంటే ఎత్తిచూపాలి. పక్కదారి పడుతుంటే మంచిదారి చూపే మార్గదర్శి కావాలి. కష్టసుఖాల్లో, దుఖ సమయాల్లో, సమస్యల్లో వెన్నుదన్నుగా నిలవాలి. నువ్వేంటో నీకు తెలియ చెప్పగలగాలి.
బాల్య స్నేహం.. భలే స్నేహం
స్నేహం బాల్యం నుంచే వికసిస్తుంది. అప్పటి నుంచే మొదలవుతుంది. మన ఇష్టాయిష్టాలూ, ఇచ్చిపుచ్చుకునే ప్రాధాన్యాలూ, అభిరుచులూ, అభిప్రాయాలూ స్నేహితుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తాయి. మనకు దగ్గరగా వచ్చే వారు కాదు.. ఎవరు మనసుకు దగ్గరగా వస్తారో వాళ్లు మంచి స్నేహితులు అవుతారు. కాలం గడిచేకొద్దీ వారిలో కొందరు ప్రాణ స్నేహితులుగా మారతారు. మనల్ని మనగా, తమవారిగా అర్థం చేసుకునే స్నేహితులు ఎంత ఎక్కువగా ఉంటే అంత గొప్ప సంపదను సంపాదించినట్టే. వారికే మన మంచిచెడ్డలూ, బలాబలాలూ తెలుస్తాయి. జీవితంలో ఎదిగాక కలిసొచ్చే కలిమి, స్థాయిలతో సంబంధం లేకుండా బాల్య స్నేహాలు అల్లుకుని ఉంటాయి. వాటిని సహజ పరిమళంతో విరజిల్లేలా చూసుకోవడాన్ని గొప్ప బాధ్యతగా భావించాలి. చిన్ననాటి ఆటలూ పాటలూ, ఆనాటి సరదా సన్నివేశాలూ బాల్య స్నేహితుల మధ్యే గుబాళిస్తాయి. అప్పుడప్పుడు అలాంటి పరిమళాలను మనసారా ఆస్వాదించడం జీవితానికి హాయిని ఇస్తుంది. కాబట్టి వీలైన ప్రతిసారీ బాల్య స్నేహితులను కలవడం, కబుర్లు చెప్పుకోవడం ఒక విధిగా పెట్టుకోవాలి.
మంచి స్నేహితుడు.. మంచి జీవితం
‘ఒక మంచి మిత్రుడు వందసార్లు అలిగినా బతిమలాడటం నేర్చుకో.. ఎందుకంటే నీ కంఠహారంలో ఒక్క బంగారుపూస జారితేనే దొరికేదాకా వెతుకుతావు కదా.. నీ మనసెరిగిన స్నేహితుడు అంతకంటే ఎక్కువ కాదా?!’.. స్నేహానికి సంబంధించిన అనేకానేక కొటేషన్లలో ఇదీ ఒకటి. అయితే స్నేహం అనే విలువకు అసలైన నిర్వచనం మాత్రం ఇదేనని చాలామంది పండితులు చెబుతారు. ఆస్తిపాస్తులు, హంగులు ఎన్ని ఉన్నా ప్రతి మనిషికి ఆత్మ పరిశీలన అనేది ఉండాలి. దాన్ని మించిన ప్రక్షాళన లేనేలేదు. మనసుకు ఆత్మబంధాలను మించిన ఆహ్లాదం ఉండదు. పుట్టుకతో రక్త సంబంధాలు ఏర్పడతాయేమో కానీ.. మన ప్రవర్తనతోనే ఆత్మబంధాలు ముడిపడతాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు దోషాలు.. వాటి నుంచి పుట్టే హావభావాలను బట్టే స్నేహాలు నిలబడతాయి.. పడిపోతాయి.
మనకు దగ్గరయ్యే వారు కాదు.. మనసుకు దగ్గరయ్యే వారే నిజమైన స్నేహితులు
మంచి స్నేహమనేది ఎప్పుడూ జీవితానికి మేలే చేస్తుంది. మనకు ఉన్న తరగని ధనం స్నేహమే. మనసిచ్చి, మిత్రుల మనసు పుచ్చుకున్న మనిషి ఎప్పుడూ అవమానాల పాలుకాడు. ఆపదలకు గురికాడు. అందుకే మంచివారితోనే స్నేహం చేయాలి. స్నేహం ముసుగులో ముంచే వారితో నడవకూడదు. మంచి మిత్రులను కలిగి ఉంటే ఎలాంటి ఆపదల నుంచైనా ఎలా బయటపడవచ్చో, స్నేహితులను ఎలా సంపాదించుకోవాలో, నమ్మిన మిత్రుల కోసం ఎలా కట్టుబడి ఉండాలో, వారి కోసం ఎలాంటి త్యాగాలు చేయాలో తెలియచెప్పే కథలు మన తెలుగు సాహిత్యంలోనూ, పురాణాలు, ఇతిహాసాల్లోనూ
బోలెడన్ని ఉన్నాయి.
కృష్ణుడు చెప్పిన స్నేహం కథ..
ఒకసారి ఉద్ధవుడు ‘నిజమైన స్నేహితుడు ఎవరు?’ అని కృష్ణుడిని అడిగాడట. ‘నువ్వు ఆపదలో ఉన్నపుడు, నీ పిలుపు కోసం ఎదురు చూడకుండా వచ్చి సాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు’ అని కృష్ణుడు బదులిచ్చాడు.
‘మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడవు కదా! ధర్మరాజు జూదం ఆడకుండా ఆపొచ్చు కదా! లేదా ధర్మరాజు తరపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా?’ అన్నాడు ఉద్దవుడు.
‘ఉద్దవా! గుర్తుపెట్టుకో! ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకి. తనకు ఆట రాదు కాబట్టి శకునితో ఆడించాడు. ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను అడిగుంటే వేరేలా ఉండేది. కానీ, అతనలా చేయలేదు. నేను అతడు పిలుస్తాడని చూశాను. పిలవలేదు సరికదా! నేనసలు అటు రాకూడదని ప్రార్థించాడు. అది మన్నించి నేనటు వెళ్లలేదు. మిగిలిన పాండవులు అందరూ కూడా ఓడిపోయినందుకు ధర్మరాజును తిడుతున్నారే కానీ నన్ను పిలవలేదు. చివరకు ద్రౌపది కూడా వస్త్రాలు తొలగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా?’ అని చెప్పాడు కృష్ణుడు.
‘అంటే పిలిస్తే కానీ రావా?’ అన్నాడు ఉద్దవుడు.
‘జీవితంలో ప్రతీదీ కర్మానుసారమే జరుగుతుంది. నేను కర్మను మార్చలేను. కానీ మీ పక్కనే ఉండి ప్రతీదీ గమనిస్తూ ఉంటాను’ అని బదులిచ్చాడు కృష్ణుడు.
‘అంటే మా పక్కనే ఉండి, మేం కష్టాల్లో, ఆపదల్లో, చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమీ చేయవా?’ అని మళ్లీ రెట్టించాడు ఉద్దవుడు.
‘ఉద్దవా! ఇక్కడే నువ్వు ఓ విషయం అర్థం చేసుకోలేకపోతున్నావు. నేను పక్కనే ఉన్నానని గుర్తించగలిగితే అసలు తప్పు చేయనే చేయవు. కానీ మీరు నేను ఉన్నాననే విషయం మరిచిపోయి, నాకు తెలీదు అనుకుని ప్రతీదీ చేస్తుంటారు. అందుకే ఇబ్బందుల్లో పడతారు’ అని ఉద్ధవుడి సందేహం తీర్చాడు కృష్ణుడు.
స్నేహితుడు కూడా కృష్ణుడి లాంటి వాడే. మన బాగు కోరే నిజ స్నేహితుడు మన వెన్నంటే ఉంటాడు. అతడి ఉనికిని మనం గమనించి, గుర్తించి మసులుకుంటే అంతా మేలే జరుగుతుంది.
పండంటి స్నేహానికి
పన్నెండు మంది ఫ్రెండ్స్
‘మిత్రులు వంద మంది ఉన్నా తక్కువే.. శత్రువు ఒక్కడైనా ఎక్కువే’..
మరీ వంద మంది కాకున్నా కనీసం పన్నెండు (12) మంది మంచి మిత్రులు దొరికితే మన జీవితం ఫలవంతమైనట్టే.. ఆ పన్నెండు మంది మిత్రులు.. వారి మనస్తత్వాలు ఎలా ఉంటే మనం ఎంత సంతోషంగా ఉంటామంటే..
1. థింక్ డిఫరెంట్
మనకు అచ్చం మనలాగే ఆలోచించే స్నేహితులుంటే ప్రపంచానికి మనం దూరమయ్యే ప్రమాదం ఎక్కువ. అందుకే మన ఆలోచనలకు భిన్నంగా ఆలోచించే స్నేహితులు కూడా ఉండాలి. అప్పుడే మనలో వైవిధ్యమైన ఆలోచనలు కలుగుతాయి. మంచిచెడులతో పాటు లోకం పోకడ అర్థమవుతుంది. ఇలాంటి వారు స్నేహితులుగా దొరికితే మంచి వ్యక్తిత్వ వికాసాన్ని రోజూ నేర్చుకున్నట్టే.
2. నిత్య సంతోషులు
కొంతమంది ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు లేదా సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కష్టనష్టాల్లోనూ స్థైర్యాన్ని కోల్పోరు. జీవితంపై సానుకూల ధోరణితో ఉంటారు. ఇలాంటి వారితో కాసేపు గడిపినా మనపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది.
3. ఉన్నత వ్యక్తిత్వం
కులం, మతం, ప్రాంతం.. వీటికి అతీతంగా కొందరుంటారు. ఇలాంటి వాళ్లు మనుషులంతా ఒక్కటేనన్న ఉన్నత భావాలతో జీవిస్తారు. ఇలాంటి వారితో స్నేహం చేస్తే విభిన్న భాషలు, సంస్క•తులపై అవగాహన కలుగుతుంది. మనలోని మానవత్వాన్ని తట్టిలేపుతారు ఇలాంటి స్నేహితులు.
4. ఎమోషనల్
మన ముఖంలో చిరునవ్వు చెదిరితే అవతలి వ్యక్తి కళ్లలో కన్నీళ్లు చిప్పిల్లాయా? అలాంటి భావోద్వేగం కలిగిన స్నేహితుడు లభించడం అదృష్టమే. ఇలాంటి దోస్తులు దు:ఖ సమయంలో, ఆపదల్లో వెన్నంటి ఉంటారు.
5. సేవాగుణం
సామాజికంగా చురుగ్గా ఉంటూ, నాయకత్వ లక్షణాలో ఉండే వారు కొందరుంటారు. వీరికి మంచి సర్కిల్ ఉంటుంది. సేవాగుణం కూడా కద్దు. ఇలాంటి వారికి చాలా విషయాలపై అవగాహన ఉంటుంది. మనం ఏదైనా సమస్యలో చిక్కుకున్నపుడు ఇలాంటి వాళ్ల సాయంతో తేలిగ్గా బయటపడవచ్చు.
6. నవ్వుతూ.. నవ్విస్తూ
కొందరు అన్నింటా జోవియల్‍గా ఉంటూ సందర్భోచిత హాస్యాన్ని సృష్టిస్తారు. ఇలాంటి వారు స్నేహితులుగా దొరికితే జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వీళ్లు మంచి ఔషధం లాంటివాళ్లు. ఎప్పుడూ నవ్వుతూ, మనల్ని నవ్విస్తూ ఉంటారు. ఎంత మూడ్ ఆఫ్‍లో ఉన్నా క్షణాల్లో ఉత్సాహపరుస్తారు.
..పన్నెండు మంది ఫ్రెండ్స్
7. ఆదర్శం
కొందరు కొన్ని ఆదర్శాలకు కట్టుబడి ఉంటారు. అందరిలోనూ వీరు ప్రత్యేకంగా నిలుస్తారు. ఇలాంటి వారితో ఫ్రెండ్షిప్ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. జీవితంలో, వృత్తిలో స్థిరపడటానికి, భవిష్యత్తులో మంచి అడుగులు వేయడానికి ఇలాంటి వారి స్నేహం ఎంతో ఉపయోగపడుతుంది. మనం ఏయే విషయాల్లో నలుగురికీ ఆదర్శంగా నిలవవచ్చో వీరిని చూసి నేర్చుకోవచ్చు.
8. సాహసం
సాహసవంతులతో స్నేహం చేస్తే ప్రకృతిలోని అడ్వంచర్స్ ప్రదేశాలను మనకు పరిచయం చేస్తారు. భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపుతారు. ఔటింగ్ అంటే షాపింగ్ మాల్స్, కాఫీ షాప్‍లు.. ఇవే కాదు కదా.. సరదాగా కాస్తంత సాహసం చేయడానికి ఇలాంటి వారి స్నేహం ఉపయోగపడుతుంది. అడ్వంచర్స్ చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ దిశగా ప్రోత్సహించే స్నేహితులు పక్కనే ఉంటే మనలోనూ ధైర్యం పెరుగుతుంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటే అది చిన్నగా మారిపోతుంది.
9. ఆఫీస్ ఫ్రెండ్
స్నేహితులు రకరకాలుగా పరిచయం అవుతారు. ఆఫీసుల్లో ఫ్రెండ్స్ వేరు. బయట దోస్తులు వేరు. పనిచేసే చోట మంచి మిత్రులు దొరికితే మన కెరీర్ మంచి బాటలో నడుస్తుంది. పని ఒత్తిడి తగ్గుతుంది. అవసరమైనపుడు ఆఫీస్ పనుల్లో సాయం చేస్తారు.
10. మితభాషి
ఏదోదో మాట్లాడాలనిపిస్తుంది. జీవితంపై ఫిలాసఫీ చెప్పాలని ఉంటుంది. అదంతా వినడం కొందరికి బోర్. మరికొందరికి ఇష్టం. అలా మనం మన భావాలను చెబితే వినే స్నేహితుడు ఒక్కడున్నా చాలు. సాధారణంగా మనం చెబుతున్నది వినేవాళ్లు మితభాషి అయి ఉంటారు. వాళ్లు తక్కువగా మాట్లాడుతారు కాబట్టే మనం చెప్పేదంతా ఓపిగ్గా వింటారు. సందర్భానుసారం తగిన మంచి సలహా ఇవ్వగలుగుతారు.
11. టేస్ట్ఫుల్
మన మిత్రుల్లో కొందరు రుచుల ప్రియులు ఉంటారు. ఎక్కడ ఏ కొత్త రుచి ఉన్నా ఇట్టే వాలిపోతారు. ఏ ఫుడ్ ఎక్కడ బాగా దొరుకుతుందో, ఎక్కడ బాగుంటుందో వీరికి తెలుసు. ఇలాంటి వారితో కలిసి భోజనం చేస్తే మనకూ కొత్త రుచులు తెలుస్తాయి.
12. నిజాయితీ
నిజాయితీపరులు.. ఇలాంటి వాళ్లు ఈ రోజుల్లో దొరకడం కష్టమే. కాబట్టి ఇలాంటి వాళ్లు మన ఫ్రెండ్షిప్ లిస్టులో ఉంటే సరేసరి. లేదంటే ఏరికోరి చేర్చుకోవాలి. అన్నింటా నిజాయితీగా ఉండే ఇలాంటి వారిని అసలు వదులుకోకూడదు. మన వ్యక్తిగత ఎదుగుదలకు ఇలాంటి స్నేహితులు చాలా అవసరం.
సినిమా స్నేహాలు
ఫ్రెండ్షిప్‍పై మన తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. మంచి స్నేహాన్ని హర్షించనిదెవరు? అందుకే స్నేహం మీద వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లే. స్నేహానికి కొత్త అర్థం చెప్పిన కొన్ని సినిమాలివి..
ప్రేమదేశం (1996):
ఫ్రెండ్షిప్ కోసం ప్రేమనే త్యాగం చేసిన ఇద్దరు స్నేహితుల కథ.
స్నేహం కోసం (1999):
స్నేహానికి సేవకుడు – యజమాని అనే భేదం లేదని తెలిపే కథ.
హ్యాపీడేస్ (2007):
ఎన్ని అపార్థాలు కలిగినా నిజమైన స్నేహం ఎప్పటికీ వీడిపోదు అని తెలుపుతూ యువతరాన్ని కదిలించిన ఇది.
ఇద్దరు మిత్రులు (1999):
స్నేహానికి ఆడ – మగ అనే లింగభేదం ఉండదని చెప్పిన కథ.
స్నేహమంటే ఇదేరా (2001):
కుటుంబం ఎక్కువా? స్నేహం ఎక్కువా? అంటే స్నేహితుడే గొప్ప అని అలాంటి స్నేహితుడిని ఎంచుకున్న గొప్ప మిత్రుడి కథ.
నీ స్నేహం (2002):
మన జీవితం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మంచి స్నేహితుడు దొరికితే అంతకన్నా కావాల్సిందేముంది? అలాంటి భావన కలిగించే సినిమా ఇది.
వసంతం (2003):
స్నేహితుడి జీవితం బాగుండాలని తనకు ఇష్టమైన గమ్యాన్ని సైతం వదిలిపెట్టిన ఓ మిత్రుడి కథ.
ఉన్నది ఒకటే జిందగీ (2017):
ఈ ప్రపంచంలో మనం మనిషిగా నిలవాలంటే తప్పకుండా స్నేహితులు కావాల్సిందేనని చెప్పిన సినిమా.
కేరాఫ్ సూర్య (2017):
ఏ ఆపదైనా రానీ.. అది ముందు తనను దాటిన తరువాతే తన స్నేహితుడిని చేరాలనుకునే దమ్మున్న ధీరుడి కథ.
మహర్షి (2019):
స్నేహితుడు తన కోసం చేసిన త్యాగం గురించి తెలుసుకుని.. తిరిగి ఆ స్నేహితుడి కళ్లలో ఆనందం చూడ్డానికి ఎన్నో మెట్లు దిగిన గొప్ప మిత్రుడి పరిచయం ఈ సినిమా..
ఆర్‍ఆర్‍ఆర్ (2022):
ఇద్దరు స్నేహితులు.. వారి ఆశయాలు గొప్పవి. అయితే అందుకోసం వారు చేసే ప్రయత్నాలే వేరు. అయినా వారిద్దరి మధ్య స్నేహబంధం అన్నదమ్నుల్ని తలపిస్తుంది. న్యాయ పోరాటంలో ఇద్దరి అడుగులూ ఒక్కటై కదిలే కథనమిది.
స్నేహ వాక్యం
స్నేహితుడు దైవంతో సమానం. కష్టకాలంలోనే మంచి మిత్రుడెవరో తెలుస్తుంది.
– మహాత్మాగాంధీ
నా స్నేహితులే నా ఆస్తి.
– ఎమిలీ డికిన్సన్, అమెరికన్ కవయిత్రి
నేను కాంతిలో ఒంటరిగా కాకుండా, చీకటిలో స్నేహితుడితో నడవడానికి ఇష్టపడతాను.
– హెలెన్ కెల్లర్, అమెరికన్ రచయిత్రి
ఒక వ్యక్తి మరో వ్యక్తితో:
‘ఇక్కడ నేనే ఉన్నాను అనుకున్నాను. నువ్వు కూడా ఉన్నావా?’ అన్నప్పుడు స్నేహం ప్రారంభమవుతుంది.
– సీఎస్ లెవిస్, బ్రిటిష్ రచయిత
నా స్నేహితుల చిరుసాయంతోనే నేను లేస్తాను.
– జాన్ లెనన్, ఇంగ్లిష్ గాయకుడు
మీ మౌనాన్ని కోరే వ్యక్తి లేదా ఎదిగే మీ హక్కును అడ్డుకునే వ్యక్తి మీ స్నేహితుడే కాదు.
– అలిస్ వాకర్, అమెరికన్ రచయిత్రి
నా శత్రువును మిత్రుడిగా మార్చుకుని, ఆ శత్రుత్వాన్ని చంపేస్తాను.
– అబ్రహం లింకన్, అమెరికా మాజీ అధ్యక్షుడు
మీరు ఎక్కడైనా ఉండాలని అనుకున్నప్పుడు అక్కడ మీ కోసం ఉండే వ్యక్తి స్నేహితుడు.
– లెన్ వీన్, అమెరికన్ కామిక్ రచయిత
స్నేహంలో నవ్వులుంటాయి. ఆనందాలను పంచుకుంటాం. తద్వారా హృదయం ఉదయిస్తుంది. తాజాదనం వస్తుంది.
– ఖలీల్ జిబ్రాన్, లెబనీస్-అమెరికన్ తత్త్వవేత్త, రచయిత
ధనసాధన సంపత్తి లేనివారయ్యియు బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకుని, స్వకార్యములు సాధించుకొందురు.
– పంచతంత్రంలోని ‘మిత్రలాభం’లో మొదటి వాక్యం
———————
అఘము వలన మరల్చు,
హితార్థకలితు జేయు, గోప్యంబు దాచు, బోషించు గుణము,
విడువడాపన్ను, లేవడివేళ నిచ్చు
మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు
(చెడు పనుల నుంచి నివారించేవాడు, మంచి పనులను ప్రోత్సహించే వాడు, రహస్యాలను దాచిపెట్టే వాడు, అవసరంలో ఆదుకునే వాడు, ఆపదలో విడిచిపెట్టని వాడు.. ఈ లక్షణాలు ఉన్నవాడు మంచి మిత్రుడు కాగలడు).
– ఈ పద్యం భర్త•హరి సుభాషితానికి ఏనుగు లక్ష్మణకవి తెలుగు అనువాదం
Review టెండ్ మారినా ఫ్రెండ్ మారడు!.