నాయకుడు- అందరిలా సాధారణంగానే పుడతాడు. కానీ, అతడి అసాధారణ ఆలోచనలు, చర్యలే.. అతడిని నాయకత్వం వహించే వాడిగా తీర్చిదిద్దుతాయి.
మార్పు- రాత్రికి రాత్రే రాదు. కానీ, మొగ్గ తొడిగి, మారాకు వేసి ఆకుగా రూపాంతరం చెందినట్టు ఏదో ఒకరోజు ఏదో ఒక క్షణంలో మార్పు మొదలవుతుంది. ఆ ఆరంభమే కొత్త మార్పునకు నాంది పలుకుతుంది.
గొప్ప నాయకత్వ పటిమ ఉన్న వారే గొప్ప మార్పునకు పునాది వేయగలుగుతారు.
నాయకుడంటే ముందుండి నడిపించే వాడు కాదు.. తానే స్వయంగా ముందడుగు వేసి వెనక తనవాళ్లను నడిపించే వాడే నిజమైన నాయకుడు.
అతడే నిజమైన నాయకత్వానికి చిరునామాగానూ, నిర్వచనంగానూ నిలుస్తాడు.
హైదరాబాద్‍లో పుట్టి పెరిగి.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అడుగుపెట్టి.. తనదైన ఆలోచనలు, తనదైన నాయకత్వ లక్షణాలతో అమెరికన్లకు సేవలందిస్తున్నారు.
ఆ లీడర్ పేరు- దిలీప్ టుంకీ.
జాన్స్క్రీక్… ఇది అమెరికాలోనే అత్యంత జీవన యోగ్యమైన నగరంగా నిలిచింది. దాని వెనుక దిలీప్ కృషి, వేసిన అడుగులు అనన్య సామాన్యం. అవిరళ కృషి అనే పదానికి పర్యాయంగా నిలిచే దిలీప్ అసలు అమెరికా ఎందుకు వెళ్లారు? జాన్స్క్రీక్ నగర అభివృద్ధి పథంలో ఆయన పాత్ర ఏమిటి? తెలుసుకోవాలంటే ఆయన జీవన ప్రస్థానాన్ని తెలుసుకోవాల్సిందే.. ప్రస్తుతం జాన్స్క్రీక్ సిటీ ప్రొ-టెమ్ మేయర్ ఉన్న దిలీప్ టుంకి ‘తెలుగుపత్రిక’కు తన ప్రయాణం గురించి వివరించారు. సిటీ కోసం తనవద్దనున్న ప్రణాళికలు..ఏం చేశాను? ఏం చేయబోతున్నాను?, జీవిత నేపథ్యం.. వంటి ఎన్నో విషయాలను పంచుకున్నారు. అవన్నీ ఆయన మాటల్లోనే..
అమెరికా ప్రయాణం..
మాస్టర్స్ చేయాలనే ఆలోచన రావడంతో 1991లో టెక్సాస్ వెళ్లాను. అక్కడి లమార్ వర్సిటీలో చేరి 1993లో మాస్టర్స్ పూర్తి చేశాను. ఎన్విరాన్‍మెంటల్ ఇంజనీరింగ్‍లోనూ నైపుణ్యం సంపాదించాను. అనంతరం జాక్సన్‍విల్లేలో స్థిరపడి.. సొంతంగా ఏదైనా చేయాలనే తలంపుతో స్నేహితులతో కలిసి సెరెనిటీ ఇన్ఫోటెక్ అనే ఐటీ కంపెనీని ఏర్పాటు చేశాను. జాక్సన్‍విల్లే, కాలిఫోర్నియాతో పాటు ఆంధప్రదేశ్‍లోని తిరుపతిలోనూ బ్రాంచీలు పెట్టాము. తిరుపతి శాఖ ప్రధానంగా రిక్రూట్‍మెంట్ సంస్థ. అవసరమైన మానవ వనరులను రిక్రూట్ చేసుకుంటుంది. ముఖ్యంగా మా కంపెనీ ప్రాజెక్టు వర్కస్ చేపడుతుంటుంది. అలాగే, రియల్ ఎస్టేట్, రిటైల్, షాపింగ్‍మాల్స్, ఈవెంట్ హాల్స్ వంటివీ మా వ్యాపారంలో భాగమయ్యాయి. ఇలా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పబ్లిక్ ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేశాం. అటు తరువాత హ్యూస్టన్‍కు అక్కడి నుంచి అట్లాంటాకు మారాను.
బాల్యం.. విద్యాభ్యాసం..వివాహం
1968లో హైదరాబాద్‍లోని బర్కత్‍పురలో పుట్టాను. రాంరెడ్డి, సుజాత తల్లిదండ్రులు. మా పూర్వీకుల గ్రామం మెదక్ జిల్లాలోని అనంతసాగర్. నాన్న గారు విద్యుత్ ఏఈగా పనిచేసేవారు. ప్రస్తుతం పదవీ విరమణ చేసి హైదరాబాద్‍లోని డీడీ కాలనీలో ఉంటున్నారు. స్కూలు విద్య 1983 వరకు బర్కత్‍పుర ప్రాంతంలోని ఆంధ్ర యువతి మండలిలో కొనసాగింది. అప్పట్లో అది కోఎడ్యుకేషన్‍గా ఉండేది. ఇక, 1985లో అబిడ్స్లోని సెయింట్ మేరీస్ విద్యాసంస్థలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. నాంపల్లిలో డెక్కన్ కాలేజ్‍లో సివిల్ ఇంజనీరింగ్ చదివి 1989లో పట్టా పుచ్చుకున్నాను. ఇంజనీరింగ్ పూర్తయ్యాక హైదరాబాద్‍లోనే 1989-91 మధ్య కొన్నాళ్లు పనిచేశాను. ఉద్యోగ జీవితంలో నా తొలి టాస్క్- అప్పటి బేగంపేట ఎయిర్‍పోర్ట్కు కాంపౌండ్ వాల్ నిర్మాణం. ఇది నా పర్యవేక్షణలోనే నిర్మితమైంది. బీదర్‍లో కొన్నాళ్లు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‍లో ఒక ఏడాది పాటు పనిచేశాను. 1996లో పద్మశ్రీతో నాకు వివాహమైంది. అటు ఇండియాలోనూ, ఇటు అమెరికాలోనూ ఆమె నా వ్యాపార కార్యకలాపాలకు సహకరిస్తూ ఉండేవారు. ప్రస్తుతం గృహిణి. అమ్మాయి పేరు సింధు. యూజీఏలో బయాలజీలో గ్రాడ్యుయేట్. బోస్టన్ వర్సిటీలో పబ్లిక్‍హెల్త్లో మాస్టర్స్ చేసింది. ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉంది.
స్కూలు ఎన్నికలతో రాజకీయ అడుగులు..
2000 సంవత్సరంలో జార్జియా రాష్ట్రంలోని జాన్స్క్రీక్ ప్రాంతానికి వెళ్లాను. అప్పటికి అది సిటీ కాదు. 2006లో నగరంగా రూపాంతరం చెందింది. ఆ సిటీతో పాటు నా జీవితం కూడా కొత్త మలుపు తీసుకుంది. అప్పుడప్పుడే సిటీగా మారుతున్న జాన్స్క్రీక్‍తో నా జీవితం కూడా ముడిపడి ఉందనే ఫీల్.. నాచేత వడివడిగా అడుగులు వేయించింది. నిజానికి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మొదట్లో నాకు లేదు. అనుకోకుండా జరిగిన చిన్న ఎన్నిక నాచేత నాకు తెలియకుండానే రాజకీయంగా అడుగులు వేయించింది. అదెలా జరిగిందంటే.. సాధారణంగా అమెరికాలో స్థిరపడిన మన ఇండియన్స్ ఆలోచనలన్నీ ఒక ‘సైడ్’లోనే ఉంటాయి. మన అసోసియేషన్లలోనే ప్రాతినిథ్యం వహించాలని, మన వాళ్లను ఆర్గనైజ్ చేసి ఒకటిగా ఉండాలని.. వాటిపైనే దృష్టిపెట్టడం వంటివి. అయితే నా ఆలోచనలు వేరు. అమెరికా నాకు భద్రమైన జీవితాన్నిచ్చింది. చదువు చెప్పింది. ఉద్యోగమిచ్చింది. వ్యాపార అవకాశాలు కల్పించింది. ఇంత చేసిన దేశం కోసం ఏం చేయలేమా? అనే ఆలోచనతో వాలంటరీ ఆర్గనైజేషన్‍ను ప్రారంభించాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాను. ఈ క్రమంలోనే మా అమ్మాయి చదివే స్కూలులో గవర్నింగ్ కౌన్సిల్‍కు ఎన్నికలు వచ్చాయి. పేరెంట్సే ఓటర్లు. స్కూలు కోసం ఏం చేస్తానో, ఏం చేయగలనో చెప్పి.. ఈ ఎన్నికల్లో నిలిచి గెలుపొందాను. స్కూలుకు అవసరమైన ఫర్నిచర్, నిధులు, చిన్న చిన్న పనులు సాధించడమే ఈ కౌన్సిల్ పనిగా ఉండేది. నేను వచ్చాక.. ఇలాంటివెందుకు? పిల్లలకు శాశ్వతంగా ఉపయోగపడే పనులేమైనా చేద్దామని ప్రిన్సిపాల్‍తో చెప్పాను. ఈ క్రమంలోనే స్కూలుకు విలువైన గ్రీన్‍హౌస్ కావాలని, ఇది మంజూరైతే సైన్స్, మ్యాథ్స్, కల్చర్, స్పోర్టస్ వంటి అన్నింట్లోనూ పిల్లల తర్ఫీదు పొందుతారని ప్రతిపాదించాను. కౌంటీ నా ప్రతిపాదనలను అంగీకరించింది. ప్రిన్సిపాల్ ఫోన్ చేసి మీ ఐడియా ఓకే అయిందని చెప్పారు. దీనిపై కౌంటీకి ప్రజంటేషన్ ఇవ్వడానికి రావాలని కోరారు. అలా అప్పట్లో ఏ స్కూలుకూ సాధ్యం కాని పెద్ద టాస్క్ను నా ఆధ్వర్యంలో చేపట్టి సక్సెస్ చేశాను. ఈ ఘనతకు గుర్తింపుగా ప్రిన్సిపాల్ ఈ గ్రీన్‍హౌస్‍కు ‘టుంకీ గ్రీన్‍హౌస్’ అని పేరు పెడదామని అన్నారు. పిల్లలకు ఉపయోగపడే ఇలాంటి ప్రాజెక్టులను తన పేరు వద్దని సున్నితంగా తిరస్కరించా. కొంతకాలానికి మా పాప స్కూలింగ్ అయిపోయింది. నిబంధనల ప్రకారం నేను ఆ స్కూల్ గవర్నింగ్ కౌన్సిల్‍లో కొనసాగడానికి లేదు. కానీ, ప్రిన్సిపాల్ నిబంధనలు మార్చి మరో ఏడాది నా పదవీ కాలాన్ని పొడిగించారు. మీరుంటే మీరు స్కూలుకు సాధించి పెట్టే సౌకర్యాల వల్ల పిల్లలకు మరిన్ని బెనిఫిట్స్ కలుగుతాయని, అవసరమైన స్కిల్స్ పొందుతారని చెప్పడంతో కాదనలేకపోయాను. అప్పటికే నాకు సొంత కంపెనీతో పాటు వాలంటరీ సర్వీసెస్, మరెన్నో వ్యాపారాలు, వ్యాపకాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు, ఒక స్కూలులో వందలాది మంది పిల్లలకు ఉపయోగపడే పనులు చేయగలిగినపుడు నా స్కిల్‍ను, అనుభవాన్ని ప్రజల కోసం ఎందుకు ఉపయోగించకూడదనే ఆలోచన కలిగింది. అలా ఆ ఆలోచనకు బీజం వేసింది స్కూలు గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికలే.
జాన్స్క్రీక్ సిటీతో అనుబంధం..
మనం ఎక్కడుంటున్నామో అక్కడ మనం ఎదగడమే కాదు.. ఆ ప్రాంతం కూడా నంబర్‍వన్‍గా ఉండాలి. అందుకోసం ఏమైనా చేయాలి. అందుకే నాకు తలమునకలయ్యే వ్యాపకాలున్నా కూడా వీలు చేసుకుని జాన్స్క్రీక్ సిటీ కోసం నా సంస్థల ద్వారా ఎన్నో సేవలందించాను. సిటీ టౌన్ సెంటర్‍లోనూ, కమ్యూనిటీలోనూ పని చేశాను. సిటీ స్పోర్టస్ ఆర్గనైజేషన్‍లో సభ్యత్వం పొందాను. ఇంకా ఈ నగరానికి ఏం చేయాలి? ఏం చేయొచ్చు? అనేది క్షుణ్ణంగా స్టడీ చేశాను. ఆ సమయంలోనే రెండు పార్కులకు కొత్తరూపునిచ్చాను. 2019లో జరిగిన జాన్స్క్రీక్ సిటీకి జరిగిన మేయర్, కౌన్సిల్ మెంబర్ల ఎన్నికలో పోటీ చేశాను కానీ, ఓడిపోయాను. అప్పటికి ఈ ఎన్నికలపై అవగాహన లేకపోవడం, ఓటింగ్ అనుకున్నంతగా జరగకపోవడంతో ఎన్నికల్లో వ్యతిరేక ఫలితం వచ్చింది.
ఈసారి పక్కా ప్లానింగ్‍తో..
2020-21లో మళ్లీ జాన్స్క్రీక్ సిటీ మేయర్ కౌన్సిలింగ్‍కు జరిగిన ఎన్నికల్లో నిలుచున్నాను. ఈసారి పక్కా ప్రణాళికతో పోటీలో దిగాను. దీన్ని సిటీగా చేసుకోవాలంటే మనమంతా చేతులు కలపాలని, రెసిడెంట్స్ అంతా కలిసి కట్టే పన్నులతో మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలని అందరిలోనూ ఐక్యత తీసుకొచ్చాను. అప్పటికే నా సేవలు, నా కృషి నాకో గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం జాన్స్క్రీక్ జనాభా 85,000. వీరిలో 60 వేల మంది రిజిస్టర్ ఓటర్లు. వీరిలో 6 నుంచి 7 వేల మంది తెలుగు ఓటర్లు ఉన్నారు. మునిసిపల్ ఎన్నికలపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపరు. అందుకే నేను ఓటర్ల డేటా ప్రకారం ఇంటింటికీ వెళ్లాను. సోషల్ మీడియా ద్వారాను ప్రచారం సాగించాను. ఏం చేశానో, ఏం చేస్తానో స్పష్టంగా చెప్పాను. మనం అభివృద్ధి సాధించాలంటే ఎన్నికలు ఎంత ముఖ్యమో ఎడ్యుకేట్ చేశాను. ఆ ఎన్నికల్లో నాకు 9,500 ఓట్లు (67 శాతం), నా ప్రత్యర్థికి 33 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మేయర్ కన్నా నాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. జార్జియా రాష్ట్ర గవర్నర్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అప్పటికే నా సేవా కార్యక్రమాల గురించి, నా గురించి తెలిసి ఉన్న ఆయన జాన్స్క్రీక్ సిటీ ప్రగతికి బాటలు వేయాలని సూచించారు. అలా రాజకీయాల్లో నా మలి అడుగు విజయవంతంగా పడింది. జాన్స్క్రీక్ సిటీలో ఒక ఇండియన్ పాలిటిక్స్లోకి అడుగుపెట్టడం నాతోనే మొదలైంది. అదే మొదటిసారి. సిటీ కోసం ఏం చేద్దామనుకుంటున్నావని అడిగారు..
గెలిచిన సందర్భంలో ప్రజలతో, కౌంటీతో చిన్నపాటి ముఖాముఖి వంటిది ఏర్పాటు చేస్తారు. నేను గెలిచినపుడు జాన్స్క్రీక్ సిటీ కోసం ఏం చేద్దామనుకుంటున్నావు? నీకున్న ప్లాన్స్ ఏమిటి? అని అడిగారు. మీరు ఇండియా తరపున ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారా? అని కూడా అడిగారు. నా ప్రథమ ప్రాథాన్యం జేమ్స్క్రీక్ సిటీ అని, మొత్తం జాన్స్క్రీక్ సిటీకి నేను ప్రాతినిథ్యం వహిస్తానని చెప్పాను. అలాగే ఈ గెలుపు నాలో ఓ ఆలోచన రేకెత్తించింది. నాకు మొత్తం జనాభాలో 67 శాతం మంది ఓటేశారు. 33 శాతం మంది వేయలేదు. వీరెందుకు నాకు ఓటు వేయలేదు? వాళ్లేం కోరుకుంటున్నారు? వాళ్ల ఉద్దేశమేంటి? అనేది తెలుసుకోవడానికి మళ్లీ ప్రజల వద్దకు వెళ్లాను. వాళ్ల ఆశలు, ఆకాంక్షలు తెలుసుకున్నాను. వాటిని నెరవేరుస్తానని హామీ ఇచ్చాను. ఇప్పటికీ ఆ హామీకే కట్టుబడి జాన్స్క్రీక్ సిటీ కోసం, అక్కడి ప్రజల ప్రయోజనం కోసం పాటుపడుతున్నాను. ఇప్పుడు నేను జాన్స్క్రీక్ సిటీ ప్రొ-టెమ్ మేయర్‍గా సేవలందిస్తున్నాను.
చేసింది కొంతే..
నా టర్మ్లో జాన్స్క్రీక్ సిటీ కోసం, ప్రజల కోసం ఎంత చేయాలో అంతా చేశాను. ఇంకా చేస్తున్నాను. ముఖ్యంగా నేను గెలిచిన తరువాత విజయవంతంగా చేసిన పనుల్లో ప్రధానమైనది పన్ను రేట్లు తగ్గించడం. టాక్స్ల్లో ప్రాపర్టీ టాక్ ప్రధానమైంది. ఇది 80 శాతం రెసిడెంట్స్ నుంచి 20 శాతం బిజినెస్ రంగం నుంచి వస్తోంది. బిజినెస్ రంగం నుంచి వచ్చే టాక్స్ను మరింత పెంచి రెసిడెంట్స్పై భారం తగ్గించడానికి సిటీలో బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టించాము. కొత్త వ్యాపారాలను, షాపింగ్ సెంటర్లను అభివృద్ధి చేశాం. ఒక పరిశ్రమ పెట్టాలంటే అక్కడ అనువైన వాతావరణం ఉందా?, వర్క్ఫోర్స్ ఉందా? అని కంపెనీలు చూస్తాయి. ఇందుకు అనువైన వాతావరణాన్ని మేం క్రియేట్ చేశాం. ఇక్కడి విద్యాసంస్థలను యూనివర్సిటీలతో విజయవంతంగా అనుసంధానించాం. పన్నుల విధానాలను సరళతరం చేశాం. అన్నిటికంటే ముఖ్యమైనది- జాన్స్క్రీక్‍కు జిప్ కోడ్ లేదు. ఇదుండాలంటే పోస్టాఫీస్ ఉండాలి. అమెరికాలో దీని ఏర్పాటు అంత సులువు కాదు. దీంతో మేం పోస్టల్ శాఖ సాయంతో ఒక డిజిటల్ నంబర్ సంపాదించాం. ఈ నంబర్ ఎంటర్ చేయగానే జాన్స్క్రీక్ అని వస్తుంది. మా సిటీకి ఇదో ఐడెంటిటీ. మేయర్‍తో కలిసి ఈ ఘనత సాధించాం.
ఔటాఫ్ ది బాక్స్ థింకింగ్ కాన్సెప్ట్..
జాన్స్క్రీక్ సిటీని బిలియన్ నెట్‍వర్త్ రేటింగ్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేదే నా తదుపరి లక్ష్యం. ఈ క్రమంలో సిటీలో ఔటాఫ్ ది బాక్స్ థింకింగ్ కాన్సెప్ట్ను అభివృద్ధి చేస్తున్నాం. ఉదాహరణకు ఇక్కడ 200పైచిలుకు ఎకరాల్లో కౌలీ క్రీక్ పార్క్ ఉంది. ఇక్కడ సాకర్, పికిల్‍బాల్, క్రికెట్ బ్యాటింగ్ కేజ్ వంటి సౌకర్యాలను కల్పించాం. అలాగే బోలెడు రిక్రియేషన్ కార్యకలాపాల్లోనూ పాల్గొనవచ్చు. ఒక పార్కుకు కుటుంబాలు వేర్వేరు ఆసక్తులు, అభిరుచులతో వస్తాయి. వాళ్లందరి అవసరాలను తీర్చేలా ఈ పార్కును మెరుగుపరిచాం. పక్కనే ఓ వృథా భవనాన్ని తీసుకుని అందులో రోబోటిక్ ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఈ పార్కుకు వచ్చిన వారు తమకు నచ్చిన యాక్టివిటీస్‍లో పాల్గొనవచ్చు. ఆర్టస్ అండ్ రిక్రియేషన్ అనేవి జీవితంలో చాలా ముఖ్యం. వీటిని అందుబాటులోకి తెస్తే అక్కడి ప్రజల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. తద్వారా ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది.
అమెరికా దేశపు స్వర్గం.. జాన్స్క్రీక్
మా విజన్‍తో, వినూత్న విధానాలతో అమెరికాలోనే జాన్స్క్రీక్ సిటీని నంబర్‍వన్‍గా నిలిపాం. ఇక్కడి నివాసితుల్లో 65-75 శాతం మంది నాణ్యమైన, మెరుగైన జీవనం (క్వాలిటీ లైఫ్) గడుపుతున్నారు. తలసరి సంపాదన విషయంలోనూ అమెరికాలోని మిగతా నగరాల కంటే ఇక్కడెంతో మెరుగ్గా ఉంది. క్వాలిటీ లైఫ్.. నేరాల్లేవు.. అత్యంత భద్రమైన సిటీ.. మెరుగైన విద్య, ఉద్యోగాలు.. ఇవన్నీ కలిసి జాన్స్క్రీక్‍ను అమెరికాలోనే నంబర్‍వన్ జీవనయోగ్యమైన నగరంగా నిలబెట్టాయి. యూఎస్ న్యూస్ వరల్డ్ రిపోర్ట్.. యూఎస్‍లోని 850 నగరాలను పరిశీలించి, ఈ నగరాన్ని నంబర్‍వన్‍గా ఎంపిక చేసింది. జాన్స్క్రీక్ సిటీకి టౌన్ సెంటర్ హార్ట్ ఆఫ్ ది సిటీలాంటిది. 600 మిలియన్ డాలర్లతో దీన్ని నిర్మిస్తున్నాం. వచ్చే ఏడాది దీని నిర్మాణం పూర్తవుతుంది. నాలుగు వేల మంది ఇక్కడ సమావేశం కావచ్చు.
సమష్టి నిర్ణయాలు.. సమష్టి అభివృద్ధి
జాన్స్క్రీక్ సిటీ అభివృద్ధి అనేది నిరంతర పక్రియ. వారం విడిచి వారం మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్‍లో సిటీ కౌన్సిల్‍తో పాటు జాన్స్క్రీక్ సిటీ జనమంతా పాల్గొంటారు. ఇందుకోసం లైవ్ బ్రాడ్‍కాస్ట్ ఉంటుంది. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు జరిగే ఈ లైవ్ మీటింగ్‍లో ప్రజలు ఎవరైనా నగరాభివృద్ధి గురించి, తమ సమస్యల గురించి చెప్పవచ్చు. ఆయా సమస్యలపై అందరి నుంచీ సలహా సూచనలు స్వీకరిస్తాం. కొత్త ప్రతిపాదనలు కూడా చేయవచ్చు. అన్నీ నోట్ చేసుకుని, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు జరిగే వార్డు సెషన్‍లో వాటిపై చర్చిస్తాం. బాగున్న ప్రతిపాదనలను ఆమోదిస్తాం.. అమలు చేస్తాం. ప్రజలు దృష్టికి తెచ్చిన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. విధాన నిర్ణయాలపై సిటీ కౌన్సిల్‍లో ఓటింగ్ పెడతారు. మేయర్ ప్లస్ ఆరుగురు కౌన్సిల్ సభ్యులు ఉంటారు. ఏదైనా నిర్ణయంపై నాలుగు ఓట్లు అనుకూలంగా వస్తే అది పాసైనట్టు. సిటీ మీటింగ్ నిర్వహణ విషయంలో చాలా
జాగ్రత్తలు తీసుకుంటాం. మీటింగ్‍కు ముందు ఎంతో ప్రిపరేషన్ ఉంటుంది. జాన్స్క్రీక్ సిటీలో ఉద్యోగులు 284 మంది వరకూ ఉంటారు. మరికొందరు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తారు. వీరందరినీ వారంతపు మీటింగ్‍కు ముందు కౌన్సిల్ సభ్యులు అందరూ కలుస్తారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటాం. ఫిర్యాదులు స్వీకరిస్తాం. అనంతరం మీటింగ్ ద్వారా మరికొన్ని సలహా, సూచనలు, ఫిర్యాదులు స్వీకరించి, వాటన్నిటిపై కౌన్సిల్ మీటింగ్‍లో నిర్ణయాలు తీసుకుంటాం. కౌన్సిల్ మెంబర్ల నుంచి ఒకరిని డిప్యూటీ మేయర్‍గా ఎన్నుకుంటారు. వచ్చే నవంబర్‍లో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను.






















































































Review దిలీప్ టుంకి… టూ లీడర్.