ఆధ్యాత్మికత అంటే ఏమిటి?
ఇప్పటికిప్పుడు ఉన్నవన్నీ త్యజించేసి.. అడవులకో, పర్వత శిఖరాల మీదకో వెళ్లి ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడమా?
మనకున్నవన్నీ వదిలేసుకుని కట్టుబట్టలతో సంచరించడమా?
ఆధ్యాత్మికత అంటే ఒక మతానికో, ఒక దేవుడికో సంబంధించినది కాదు.
అదొక మానసిక చింతన.
నీలోకి నువ్వు చూసుకోవడం.
నీలోని నిన్ను తెలుసుకోవడం.
నిన్ను నువ్వు గుర్తించడం.
అదొక దైవ చింతన. దీని కోసం సంసారాలను వదిలి పెట్టాల్సిన పని లేదు. ఆస్తిపాస్తుల్ని త్యజించాల్సిన అవసరం లేదు. కాస్తంత వైరాగ్య భావం ఉంటే చాలు.
మనకు దేనిపైన అయినా గురి కుదరాలంటే గురువు ఉండాలి. కానీ, అన్నిసార్లు గురువులు లభ్యం కారు.
అటువంటి సమయంలో నీ బుద్ధే నీకు గురువు.
నీ మనసే నీకు మార్గదర్శి.
నీ బుద్ధి, నీ మనసును బట్టి నువ్వెలా నడుచుకుంటావనేదే నీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది.
కొందరు ఇందుకు దైవాన్ని ప్రేరణగా తీసుకుంటారు. ఇంకొందరు తమ ఆత్మనే తమ దైవంగా భావించి.. తమతో పాటు అందరూ దైవ సమానులేనని, సకల జీవుల్లోనూ భగవదంశ ఉన్నదని భావించి ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తారు.
సాధారణంగా మనం భక్తి, శ్రద్ధలతో ఉండాలంటే దైవంపై దృష్టి పెడతాం.
మనం ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, మనం ఎలా ప్రవర్తిస్తున్నా.. పైన భగవంతుడు అనే వాడు ఒకడు గమనిస్తుంటాడనే భావంతో జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తుంటాం.
ఈ ప్రయత్నమే దైవ చింతన. అదే ఆధ్యాత్మికత.
దేవుడిని పూజించడం, పూజలు, పురస్కారాలతో కాలం గడపడం కూడా ఆధ్యాత్మికతే కావచ్చు. కానీ, భక్తి అనే దానిని సాధనగా చేసుకుని మనల్ని మనం నిరంతరం సంస్కరించుకోవడమే అసలైన ఆధ్యాత్మికత. మతాలకు, దైవాలకు అతీతంగా భక్తిని ఏర్పర్చుకోగలిగితే ఆధ్యాత్మిక స్థితిని సాధించినట్టే.
మనం ఎందుకు పుట్టాం?
మన పుట్టుక పరమార్థం ఏమిటి?
ఇతరుల పట్ల ఎలా మెలగాలి?
సంస్కారం ఎలా అలవర్చుకోవాలి?
ఇతరులకు హాని కలగకుండా ఎలా మసులుకోవాలి?
ధర్మబద్ధంగా ఎలా జీవించాలి?
బుద్ధి, సంస్కారాలతో వ్యక్తిత్వాన్ని ఎలా సముపార్జించుకోవాలి?
మనిషై పుట్టినందుకు మనకు వేరొక పరమార్థం ఏదైనా ఉందా?
నిత్య జీవితంలో మనం ధర్మంగా, న్యాయంగా ఎలా వ్యవహరించాలి?
అసలు ‘నేను ఎవరు?’..
ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనడమే ఆధ్యాత్మిక చింతన.
‘నేను ఎవరు?’ అనే ప్రశ్నతో ఆధ్యాత్మిక చింతన ప్రారంభమవుతుంది.
ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడంలో భాగంగా జీవులు, సృష్టి, ప్రకృతి, మానవ ధర్మం.. ఇలా ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి. అన్నింటికీ సమాధానాలు కనుగొంటూ, సత్యాన్ని అన్వేషిస్తూ సాగించే పయనంలో కలిగే అనిర్వచనీయమైన అనుభూతే ఆధ్యాత్మికత అంటే.
ఆధ్యాత్మికత అంటే పెద్ద పెద్ద నిర్వచనాలేమీ అవసరం లేదు.
ఒక అందమైన పూదోటకు వెళ్లండి. అక్కడి పూల గుసగుసలు ఆలకించండి. ఆ కుసుమాల మీద నుంచి వీచే గాలిలో గానం వినగలగండి. ఈ మొత్తం సృష్టిని ఒక అందమైన, అద్భుతమైన కళారూపంగా ఊహించుకోండి. అప్పుడు కలిగే అనుభూతే మీలోని ఆధ్యాత్మిక చింతన తాలూకు ఆనవాలు.
ఆధ్యాత్మికత అంటే దేవుడిని మాత్రమే నమ్మడం కాదు. దైవాన్ని విశ్వసిస్తూనే తనలోనూ, ఇతరుల్లోనూ, సమస్త ప్రకృతిలోనూ దైవాన్ని దర్శించడం.
కొందరు దేవుడు లేడంటారు. ఇంకొందరు ఆధ్యాత్మికత అనేది వ్యర్థమైన భావన అనీ అంటారు. ఇది తప్పు. ఆధ్యాత్మికత అనేది అనేక విషయాలకు అతీతమైనది. ఆధ్యాత్మిక జీవనం గడపడం అంటే, ఆధ్యాత్మికతను అలవర్చుకోవడం అంటే ఒక కళ. ఆ ఆధ్యాత్మిక కళ ఒక మానసిక వికాసం. కళ అనేది మన లోపలి అంశం. సాధన ద్వారా దానికి మెరుగుపెడితే అది ఔన్నత్యాన్ని పొందుతుంది. కళ ద్వారా భావనాత్మక ఆనందం ఆవిర్భవిస్తుంది. కళ ఒక ఆనందపు గని. ఆనందించడానికి ఉపయోగపడే ఒక పరికరం వంటిది ఆధ్యాత్మిక కళ. దీని పరమావధి ఆనందం. తన లోపల ఉన్న ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని గుర్తించి, దాన్ని శాస్త్రబద్ధంగా అభ్యసించి, నిరంతరం సాధన చేసి అంచలంచెలుగా పైకి ఎదుగుతూ మనిషి ఔన్నత్యాన్ని ఉన్నత వ్యక్తిత్వాన్ని పొందగలుగు తాడు.
కళాకారుడు గొప్పవాడు కావాలంటే తాను సాధన చేస్తున్న కళను లోతుగా తాను ఆనందిస్తూ, అదే కళ ద్వారా ఇతరులకు ఆనందాన్ని పంచాలి. ఒక సంగీతకారుడు తాను పాడుతూ ఏవేవో దివ్యలోకాల్లో విహరిస్తున్నట్టుగా కనిపిస్తాడు. ఆ పాట వినేవాళ్లు కూడా తప్పకుండా ఆనందిస్తారు. కాస్త తామూ సంగీత ప్రవేశం ఉన్న వాళ్లు అయితే, ఆ సంగీతకారుని గాఢతను కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మికత కూడా అటువంటిదే. కళను సాధన చేసినట్టుగానే ఆధ్యాత్మికతను కూడా సాధన చేయాలి. మన అందరిలోనూ ఆధ్యాత్మికత అనేది ఏదో మూలన ఉండే ఉంటుంది. కొందరు దానిని కప్పి ఉంచుతారు. మరికొందరు గుర్తించరు. ఇంకొందరు అవసరానికి తీసి వాడుతుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే అందులోని ఆనందాన్ని గుర్తించి, ఆధ్యాత్మికతను ఆచరణలోకి తీసుకురాగలరు. మనలోని ఆధ్యాత్మికత పూర్తి స్థాయిలో వికసించి మన ఆనందానికి కారణం కావాలంటే నిరంతరం సాధన చెయ్యడం అవసరం. అప్పుడే అందులోని పూర్తి ఆనందాన్ని ఆస్వాదించగలం.
ఆధ్యాత్మికత – భక్తి అనేవి ఒకటననే భావన ఉంది. కానీ, ఈ రెండూ వేరువేరు. భక్తి అనేది ఒక భావోద్వేగం. అపారమైన గౌరవం. ఎవరిపై? భగవంతునిపై! భగవంతునిపై మనకు గల అనిర్వచనీయమైన ప్రేమ, త్యాగశీలత వంటి రకరకాల భావోద్వేగాల మేళవింపును భక్తిగా నిర్వచించవచ్చు. డబ్బు, సమయం లెక్క చేయని ఒక సమ్మోహన శక్తి భక్తి. ఇలాంటి భావోద్వేగాన్ని ఎవరి మీద చూపగలం? అలాంటి భావోద్వేగాలను వ్యక్తపరచడానికి మనకు ఏదో ఒక ‘గురి’ కావాలి. ఆ గురి- భగవంతుడే అని నమ్ముతాం. మనం నమ్మే ఆ ‘గురి’ని పూజించాలి. సేవించాలి. తరించాలి. మన చుట్టూ ఉన్న మనుష్యులపై అటువంటి అనిర్వచనీయమైన భావోద్వేగాలను ప్రదర్శించలేం. ఎందుకంటే, వారిలో ఉన్న లోపాలన్నీ మనకు తెలుస్తుంటాయి. అందుకే పురాణ పురుషులను, అమూల్య భావనలను ఆదర్శమూర్తులుగా చిత్రీకరించుకుని, భావించుకుని వాళ్ల విగ్రహాలు, పటాలను పూజిస్తూ భక్తిని ప్రదర్శిస్తాము. భక్తిలో సంతోషం ఉంది. భక్తి అనే భావోద్వేగం కలిగినపుడు దాన్ని బయటకు ప్రదర్శించినపుడు మాత్రమే దాని వల్ల సంతోషం కలుగుతుంది. అయితే నిరంతరం భక్తిలో ఉండటం సాధ్య ఉంటుంది. కానీ, మన నిత్య జీవితంతో ముడిపడి ఉన్న అనేక అంశాలు, నిత్య జీవితంలో మనం నిర్వర్తించాల్సిన బాధ్యతల వల్ల అది సాధ్యపడదు. దైనందిన జీవితాన్ని గడపడంలో మనం మరో భావోద్వేగంలోకి వెళ్లిపోతాం. అందువల్ల ఇక ఆ అనుభూతి దూరమై మరో రకమైన భావనలో పడిపోతాం. కాబట్టి అటువంటి వికారాలకు లోను కాకుండా, ఒక ‘స్థితి’ని సృష్టించుకుంటే.. అదే ‘ఆధ్యాత్మికత’.
ఆధ్యాత్మికతకు సింహద్వారమే భక్తి. భక్తి భావనలో మనం పరిణితి పెంచుకోగలిగితే ఆధ్యాత్మికతలోకి తేలికగా ప్రవేశించగలుగుతాం. కానీ, చాలామంది ‘భక్తి’లోనే ఉంటారు. అక్కడితోనే ఆగిపోతారు. అదేం తప్పు కాదు కానీ, ఆ తరువాత స్థాయి అయిన ఆధ్యాత్మికతను చేరుకోవడానికి ప్రయత్నించరు. అసలు భక్తి తరువాత ఒక స్థాయి ఉందనే విషయాన్ని కూడా చాలామంది గుర్తించలేరు. ఆధ్యాత్మికత అంటే సరి అయిన అవగాహన కూడా ఉండదు. భక్తి ద్వారా దొరుకుతున్న సంతోషమే అంతిమమైనదని భావిస్తారు. కొంతమందికి తరువాత స్థాయి గురించి తెలిసి ఉన్నప్పటికీ అంతకంటే ముందుకు వెళ్తే ఏమవుతుందో, భార్యాపిల్లలకు దూరమైపోతామేమో అనే భయం కలుగుతుంటుంది. తమ భక్తి ద్వారా చేసే పూజలు, వ్రతాల ద్వారా చాలా సంతోషంగా ఉన్నామని చెబుతుంటారు. కానీ ఈ పయనం ఇక్కడితోనే ఆగిపోకూడదు. భక్తి తరువాత స్థాయి ఏమిటనేది తెలుసుకోగలగాలి. ఆ స్థాయికి చేరుకోగలగాలి. ఇంకొందరు ఆచారాన్నే భక్తిగా భావిస్తుంటారు. అంటే, గుడికి వెళ్లడం, మడి – తడి ఆచారాలు పాటించడం.. ఇటువంటివి. ఇవి కూడా ఒక విధంగా ఆధ్యాత్మిక సాధనలే. తప్పు కూడా కాదు. ఎందుకంటే భక్తి సాధనలో ఎవరికి ఆనందాన్నిచ్చే పనులను వారు చేయవచ్చు. అయితే, అంతకుమించిన స్థాయికి చేరుకోవడమే మన పరమార్థం అయినపుడు, ఆ స్థాయి ఏమిటనే ప్రశ్న తలెత్తినపుడు.. దానికి లభించిన సమాధానమే ఆధ్యాత్మికత అవుతుంది. భక్తిలో భాగంగా మనం ఆచరించే పూజలు, వ్రతాలు, ఆలయ ప్రదక్షిణలు ఇత్యాదులన్నీ బాహ్యపరమైన అంశాలు మాత్రమే. ఒక నాట్యకళారూప ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఆహార్యం, అలంకరణల వంటివి ఈ అంశాలు, నాట్యం భక్తి. అలంకరణలు గొప్పగా ఉండి, నాట్యం పేలవంగా ఉంటే ఉపయోగం లేదు. ఆచార సంప్రదాయాలు కూడా అటువంటివే. ఆచార సంప్రదాయాల కంటే కూడా మనసులో ఉండే భక్తి భావన ముఖ్యం. దీనికి పనికి వచ్చే సాధనాల వంటివి మాత్రమే ఆచార సంప్రదాయాలు.
ఇక, ఆధ్యాత్మికతలోకి మళ్లీ వెళ్దాం.
ఆధ్యాత్మికత ఒక కళ అయితే, ఆ కళా సాధనకు ప్రాణాయామం, ధ్యానం వంటి అనేక రకాల సాధనాలను వినియోగించి మనిషి తనలోకి తాను చూసుకునే ప్రయత్నం చేయాలి. తన అంతరంగాన్ని ఆవిష్కరించుకోవాలి. ‘నేను ఎవరు?’ అనే ప్రశ్నతో మొదలుపెట్టి ఈ జీవులు, సృష్టి అంటూ ఆలోచనలు సాగించాలి. అన్నింటికీ సమాధానాలు వెతుక్కుంటూ సృష్టిలోని అందాలన్నింటినీ ఆస్వాదించగలగాలి. పూలతో మాట్లాడగలగాలి. గాలితో కబుర్లు చెప్పగలగాలి. సాటి జీవుల పట్ల ప్రేమను కనబరచాలి. ఈ మొత్తం సృష్టిని ఒక విచిత్రమైన, అద్భుతమైన కళారూపంగా దర్శించుకోగలగాలి. సృష్టిలోని రహస్యాలను ఛేదించుకుని ఎరుకలోనికి తెచ్చుకోగలగాలి. చివరకు తనే సృష్టిగా, సృష్టికర్తననే భావనను అనుభవంలోకి తెచ్చుకోగలగాలి. మనసులో ఉత్పన్నమైన అనుమానాలకు సమాధానం వెతుక్కుని తృప్తిచెందే స్థితి.. ఆ తరువాత ఆలోచనలే రాని స్థితికి వెళ్లాలి. అంతా అర్థమైతే ఇక మిగిలేది ఆనందమే. అదే ఆధ్యాత్మికత.
ఎప్పుడైనా ఒక ప్రశ్నకు సమాధానం దొరికితే లేదా మనసు సమాధాన పడితే తృప్తి కలుగుతుంది. అలా మన ప్రశ్నలన్నిటికీ సమాధానం లభించాక ప్రశ్నలే లేని స్థితిలో మిగిలేది తృప్తి మాత్రమే. ఆ తృప్తే బ్రహ్మానందం. తియ్యగా ఉంటుంది అన్నంత మాత్రాన తీపి రుచి అర్థం కాదు. అందులోని తీపిని తిని చూడాలి. ఆస్వాదించాలి. అలాగే సాధన చేసి బ్రహ్మానందాన్ని అనుభవించాలి. సాధన చేసి అటువంటి అనుభవాన్ని పొందిన వ్యక్తి ప్రాపంచిక విషయాల్లో ఉంటున్నప్పటికీ వాటికి అతీతంగా నిరంతరం ఆనందంలో ఉండటం సాధ్యపడుతుంది. ప్రపంచానికి సంబంధించిన దిగులు పెద్దగా అతనిని బాధించదు. ప్రశాంతవదనుడై సృష్టి ఆటను గమనిస్తుంటాడు తరగని చిరునవ్వుతో! అదే అసలైన ఆధ్యాత్మికత.
తన్ను గురించి తాను తెలుసుకునే ప్రయత్నంలో చేసే అంతరాన్వేషణే ఆధ్యాత్మికత. సముద్రం ఒడ్డున నిలుచుని ఎంత కాలం ఎదురుచూసినా అది ఎదురుచూపుగానే మిగిలిపోతుంది. అక్కడే నిలబడి ఎన్నాళ్లున్నా చివరకు దొరికేవి గవ్వలు, గులకరాళ్లు మాత్రమే. ముత్యం కావాలంటే సముద్రంలోకి దూకాలి. ఈదాలి. వెతకాలి. ఆల్చిప్పలను పట్టాలి. అప్పుడే కొన్ని అయినా ముత్యాలు లభిస్తాయి. పూర్తిగా భక్తిలో మునిగిపోతే.. కలిగేది ఆధ్యాత్మిక భావన. ఆ భావనను మధిస్తే లభించేదే ఆధ్యాత్మిక జ్ఞానం. అన్నిటికీ మూలం ఆత్మే అని ఆగిపోకుండా, ఆ ఆత్మను, దాని మూలాలను వెతుక్కుంటూ ఉండాలి. ఎందుకు వెతకాలి? అదే అసలు మనం కనుకా! లోచూపు కావాలి. ‘లోనారసి’ అంటే లోపలికి వెళ్లి, చూసి, అనుభవించి, అనుభూతిని పొంది, విభూతి స్థాయిని అందుకోవాలి. నమ్మకమే లేని స్థితి, నమ్మీ నమ్మని స్థితి, నమ్మకమే నడిపించే స్థితి మానవ జీవితంలో అనివార్యమైన స్థితులు.
తెలియదని అంటున్న వారు, తెలిసి తెలియనట్టు ఉన్నదన్న వారు, తెలుసుకుంటున్నానన్న వారు ఈ లోకంలో ఉన్నారు. తెలుసుకున్న వాడు మాత్రం ఏమీ అనడం లేదు. అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు. మాటలను దాటి మౌనం ద్వారా ప్రసారం చేస్తున్నాడు. అన్నింటికీ అతీతంగా ఉన్నాడు. మనం ఉంటున్న ఇదే ప్రపంచంలో అతనూ ఉంటున్నా, తనతో తాను ఉంటున్నాడు. కానీ ప్రపంచంలో జరుగుతున్న సమస్త కార్యకలాపాలను ఏ ప్రమేయం లేకుండా చూస్తున్నాడు. సర్వానందమయ స్థితిని అనుభవమయం చేసుకుంటున్నాడు. తామరాకుపై నీటి బొట్టు వలే ఉండగలుగుతున్నాడు. ప్రతి చర్యలోనూ చైతన్యాన్ని, చైతన్యం వెనుక ఉన్న ఆత్మశక్తిని నిత్యానుభవం చేసుకుంటున్నాడు. వస్తువు వెనుక ఉన్న యదార్థాన్ని దర్శిస్తున్నాడు. ఆ కారణంగా పైపైన జరుగుతున్న విషయాలను, అవి కలిగించే ప్రభావాలను గుర్తించకుండా తన్మయానుభూతిని పొందుతున్నాడు. ఆ అనుభవమే, ఈ అభ్యాసమే మనిషిని ప్రకృతి రహస్యాలను చూడగల, చూపించగల ఆధ్యాత్మిక శాస్త్రవేత్తను చేస్తున్నది. ఆ కారణంగా జాతి, మత, వర్గ, వర్ణనాతీతమైన మానవతా వాదం, శాస్త్రంగా రూపుదిద్దుకొని ప్రకృతి మూలాలలో ఇమిడి ఉన్న సహజ సౌందర్యాన్ని బహిర్గతం చేస్తుంది. అప్పుడే జగత్తు సంపూర్ణంగా ఆవిష్క•తమవుతుంది.
ఆత్మాన్వేషణను ముందుగా స్థూల శరీర పరిమితులను విశ్లేషించుకుంటూ ప్రారంభించి, ఆపై సూక్ష్మ శరీరాన్ని దాటుకుని మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, అనబడే స్థితులను అధిగమించగలిగితే మిగిలేది ఆత్మే. ఇదంతా నిత్య పరిశీలన, అనుష్ఠానం, సాధన వల్ల సాధ్యమయ్యేదే. సర్వత్రా ఆత్మను దర్శించగల స్థితి కలిగిన తరువాత ద్వంద్వాలు లేవు. గుణగుణాలు లేవు. అనేకం లేవు. ఏమీ లేవు. ఉన్నదంతా ఆత్మే అన్న స్థిర భావన స్థిరపమవుతుంది. ఆనందం స్వభావమవుతుంది. ఆనంద సాగరంలో తాను నిశ్చలుడై ఉంటాడు. ఎన్ని అలలు పుట్టనీ, ఎన్ని కెరటాలు ఎగసిపడనీ, ఎన్ని తుంపరులు తాకనీ, తాను మాత్రం అచంచులుడై ఉంటాడు.
కేనోపనిషత్.. ప్రశ్నించుకుంటూ సమాధానం పొందమని చెబుతుంది. సాధ్యమైతే నీ అంతట నీవే ప్రయత్నించాలని అంటోంది. సాధ్యం కాకపోతే గురువును ఆశ్రయించమంటోంది. ఆత్మోన్నతి కలిగించే గురువును అనుసరించాలని సలహానిస్తోంది. ఆత్మను ఎరిగిన వాడు మృత్యు భావనను జయిస్తాడు. భయం లేకుండా ఉంటాడు. ఎందరినో ఆ దారిని నడిపించగల నాయకుడు అవుతాడు. కర్త•త్వ భావన లేకుండా! అదే అసలైన ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనం. దానిని పొందగలగడమే మనిషిగా మన కర్తవ్యం.
ఆధ్యాత్మికతలో అనంతమైన శాంతి ఉంది. అద్భుతమైన ఆత్మానుభూతి ఉంది. అద్వితీయమైన తత్త్వ చింతన ఉంది. ఆధ్యాత్మిక సాధనను అలవర్చుకుంటే మనిషి వ్యక్తిత్వం ఔన్నత్యాన్ని సంతరించుకుంటుంది. సంస్కారవంతుడు అవుతాడు.
జిజ్ఞాసే తత్త్వ దర్శనానికి తొలిమెట్టు. కంటికి కనిపిస్తున్న, నడుస్తున్న నిరంతరం పరిణామం చెందుతున్న ఈ సృష్టికి మూలం ఏమిటి?
దాని వెనుక దాగిన శక్తి ఏమిటి?
ఇంత అద్భుతంగా గతి తప్పకుండా సాగుతున్న ఈ కదలికలకు, నానా రకాలైన చర్యలకు ఛోదక శక్తి ఏది?.. ఈ ప్రశ్నలు సహజమైనవి. అనివార్యమైనవి.
ఆలోచనలు ఎలా పుడుతున్నాయి?
అన్ని ఆలోచనలు కలిసిన మనసు ఎలా అవుతున్నది?
ఆ మనసుకు చలనాన్ని, వేగాన్ని ఇస్తున్నది ఎవరు?
వాక్కు ఎలా పురుడు పోసుకుంటుంది?
దానికి మూలమైన భావన, భావం, భాషలను ఎవరు సమకూరుస్తు న్నారు? ఎవరు అమరుస్తున్నారు?
వాక్కు స్పష్టతను, మాధుర్యాన్ని, గాంభీర్యాన్ని, అర్థాన్ని, పరమార్థాన్ని, శక్తిని పొందగల నేర్పును ఎవరు నేర్పుతున్నారు?, పొదుగుతున్నదెవరు?
కంటికి దృశ్యాన్ని చూపిస్తున్నది ఎవరు?
కాలులో ముల్లు గుచ్చుకుంటే కన్నెందుకు ఏడుస్తున్నది? ఆ కన్నీరు ఎలా కారుతున్నది? దాని వెనుక ఉన్న యంత్రమేమిటి? ఈ అనుబంధ సంబంధ సమన్వయ క్రీడను సాగిస్తున్నది ఎవరు? శాసిస్తున్నది ఎవరు? నియంత్రిస్తున్నది ఎవరు? నిగ్రహిస్తున్నది ఎవరు? శ్రమిస్తున్నది ఎవరు?
కేవలం కట్టెగా జడాత్మకమైన శరీరం కరచరణాది అవయవాల ద్వారా భిన్న కార్యకలాపాలను ఎలా నిర్వర్తిస్తున్నది?
చెవులు వినగలగడం వెనుక దాగిన సూత్రం ఏమిటి?
ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు ఇంతటి సమన్వయంతో పనిచేయడం ఎవరి నేతృత్వంలో జరుగుతోంది? ఎవరి ప్రేరణతో జరుగుతోంది?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే. అది ఆత్మ.
ఆ ఆత్మను కనుగొనడమే అసలైన ఆధ్యాత్మికతలోని పరమార్థం. ఇనుప పెట్టెలో వజ్రాల నగ ఎలా దాగి ఉంటుందో శరీరంలో ఆత్మ, సర్వాణువులలోనూ నిండి ఉంటుంది. అన్ని ప్రజ్ఞలూ ఆత్మ నుంచి ప్రసారమయ్యేవే. దేనిని కనులు చూడలేవో, కానీ దేని వలన కనులు చూడగలుగుతున్నవో అదే ఆత్మ లేదా బ్రహ్మము.
ప్రాణము, చైతన్యము, శక్తి.. ఇవన్నీ ఆత్మశక్తులే. అంటే సర్వేంద్రియా లనూ ఆత్మే ప్రేరేపిస్తున్నది. కనుక సమస్త కార్య నిర్వహణ వెనుక ఉన్నదీ ఆత్మే అనే భావన దృఢతరంగా అవుతున్నది. అటువంటి మూలాన్ని పట్టుకునే ప్రయత్నమే ఆత్మాన్వేషణ. ఫలించిన ప్రయత్నమే ఆత్మ సాక్షాత్కారం. అంటే ఆత్మ సాక్షాత్తూ ఆకారమై కనిపిస్తున్నదని అర్థం. కనుక ఆత్మ సాక్షాత్కారం అంటే దైవ సాక్షాత్కారం కాదు. దైవం ఒక భావన. ఒక అంతర్గత శక్తి. దైవం నామ, రూప, గుణ, విశేష వైభవోల్లసితం. దైవం భక్తికి సంబంధించిన స్థితి. దానిని దాటుకుని ముందుకు వెళ్లగలిగే స్థితి ఆధ్యాత్మికత. అదే ఆత్మాన్వేషణకు సాధనగా ఉపయోగపడుతుంది. దైవాన్ని దాటుకుని వెళ్లిన భావన.. తాను దైవం.. సమస్తమూ దైవమే అనే స్వానుభవాన్ని కలిగిస్తుంది.
ఎవరైతే భక్తి అనే మెట్టు దాటి ఆధ్యాత్మికత అనే అవసరాన్ని ఆశ్రయిస్తారో వారు సంతోషంగా ఉంటారని మన వేద పురుషులు చెప్పారు. మనిషి ఆధ్యాత్మిక భావన కలిగి ఉండటం అత్యంతావశ్యం. ఆధ్యాత్మికత అనేది మనిషికీ మనిషికీ మారుతుంది. ఒక బౌద్ధ మతస్తుడు ధ్యానం ద్వారా జ్ఞానోదయం పొందేందుకు ప్రయత్నిస్తాడు. ఒక హిందువు స్వీయ పరిత్యాగం ద్వారా పునర్జన్మల చక్రం నుంచి తప్పించుకునేందుకు కృషి చేస్తాడు. ఆధ్యాత్మికత అంటే మనశ్శాంతిని పొందాలనే, జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనే కోరికకు సంబంధించినది. ఆధ్యాత్మికత కోసం అన్వేషించే వారు తమ అంతరంగంలోకి, తమ అంతర్గత భావాలలోకి తొంగి చూడాలి. నిజమైన ఆధ్యాత్మికత అనేది ఒక మనిషి అంతరంగంలో ఉంటుంది. అది లోకాన్ని, చుట్టూ ఉన్న ప్రజలను ఎలా ప్రేమిస్తారు?, ఎలా స్వీకరిస్తారు? వారితో ఎలా ప్రవర్తిస్తారు? అనే వాటికి సంబంధించింది.
ఎవరైనా తమ లోపలి భావాలను అనుభవించడానికి మించిన అనుభూతి మరొకటి ఉండదు. అటువంటి అనుభూతి ఆధ్యాత్మికతతోనే లభిస్తుంది.
మనిషికి పుట్టుకతోనే కొన్ని సహజ ధర్మాలు అంటిపెట్టుకుని ఉంటాయి. అయితే తాము పెరుగుతూనే కొందరు వాటిని వదిలేస్తారు. సజ్జనులైన వారు వాటిని అనుసరిస్తారు. మన బుద్ధిని బట్టి మన ధర్మవర్తన ఉంటుంది. మీరు వెళ్తున్న దారిలో వంద రూపాయల నోటు దొరికింది. దానిని ఎవరు పారేసుకున్నారా? అని కొద్దిసేపు వాకబు చేశారు. ఎవరూ కనిపించలేదు. వెంటనే దానిని సమీపంలోని రక్షకభట నిలయంలో అందచేసి, అది ఎవరు పారేసుకున్నారో వారికి అందచేయాలని కోరారు. అది మీ నిజాయితీ తాలూకు ధర్మం. ఇలాంటివే మరికొన్ని సహజ ధర్మాలు ఉంటాయి. ఇతరులతో మంచిగా వ్యహరించడం, అహానికి గురికాకపోవడం, ద్వేషించకపోవడం.. ఇటువంటివన్నీ మనిషి స్వభావాన్ని బట్టి అతని వ్యక్తిత్వంలో భాగంగా ఉంటాయి. వీటిని పుస్తక పఠనం లేదా పెద్దలు చెప్పగా వినడం ద్వారా నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. లేదా ఎవరికి వారు ప్రయత్నం ద్వారా, ఆలోచన ద్వారా అలవర్చుకోవచ్చు. ఈ ధర్మమే మన స్వభావంగా మారుతుంది. అటువంటి సద్భావాలను, స్వధర్మాలను అలవర్చుకోవడానికి ఆధ్యాత్మికత ఒక సాధనగా ఉపయోగపడుతుంది.
మన దేశమే ఒక తత్త్వ శాస్త్ర గ్రంథం. సనాతన ధర్మమనే పటిష్ట పునాదులపై వెలసిన నిలువెత్తు నిదర్శనం. ఆధ్యాత్మికత దాని జీవ రసాయనం. ఆధ్యాత్మికత అంటే ముందే చెప్పుకున్నట్టు మతం కాదు. అదో గొప్ప నాగరికత. ఒక ప్రవర్తన. ఒక క్రమశిక్షణ. సంఘ జీవన హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం. మనిషిని పురోగతి వైపు ప్రోత్సహించే మహా చైతన్యం. ఒక జాతి నాగరికతను అంచనా వేయాలంటే ఆ దేశ జనాభా లెక్కలు అందుకు కొలమానం కాదు. ఆ దేశ సంస్క•తీ స్వరూపమే దాన్ని నిర్ణయిస్తుంది. చాలా దేశాలు ఈ భూమ్మీద పురుడు పోసుకోకముందే మన దేశంలో సంస్క•తి విలసిల్లింది. ఈ సాంస్క•తిక వైభవానికి మూలం మన ఆధ్యాత్మిక నేపథ్యమేనన్నది నిస్సందేహం.
మనకు వేర్వేరు ఇష్టదైవాలు ఉండవచ్చు. కృష్ణుడు, సాయిబాబా, రాముడు, అల్లాహ్, జీసస్.. ఇలా వారిపై మనకు గల భక్తి భావం వ్యక్తిగతం. కానీ దేశభక్తి అనేది వేరు. ఇక్కడ భక్తి అంటే ప్రేమ, గౌరవం. ఇక్కడున్న ప్రజలు, మట్టీ, నీరూ, చెట్టూ, పుట్టా, వనరులు అన్నిటిపై అవ్యాజమైన అనురాగం. ఇది నాది అనే భావన. ఈ దేశాన్ని ప్రేమించడం అంటే దాని జీవ లక్షణాన్ని గురించి తెలుసుకోవాలన్న తపన పెంచుకోవడమే. ప్రజల అభిరుచులు, ఆచార వ్యవహారాలు, అన్న పానీయాలు, వస్త్రాభరణాలు, కళ, సంగీత, సాహిత్య, విజ్ఞాన విశేషాలు, భాషలు.. ప్రజల మనుగడలో నుంచి తొంగిచూసే అన్ని అంశాలను కలిపి పోగేస్తే అదే ఆ దేశపు సాంస్క•తిక స్వరూపం అవుతుంది. ఆ స్వరూపం నుంచి ప్రాణం పోసుకుని మనుషుల్లో ‘స్వభావసిద్ధంగా మారేదే ఆధ్యాత్మికత. అటువంటి ఘనమైన ఆధ్యాత్మిక సంపదకు భారతదేశం పుట్టినిల్లు.
Review నాలో నేను… నీలో నువ్వు...