బుద్ధం శరణం గచ్ఛామి

వైశాఖ పూర్ణిమ బుద్ధ జయంతి దినం. బుద్ధుడి జీవిత కాలంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యాన్ని వహించింది. బుద్ధుడు ఒకానొక వైశాఖ పూర్ణిమ నాడు జన్మించాడు.
మరొక వైశాఖ పూర్ణిమ నాడు బుద్ధుడు అయ్యాడు ఇంకొక వైశాఖ పూర్ణిమ నాడు ఆయన నిర్యాణం చెందాడు. బుద్ధుడు ఈ లోకానికి ఒక జ్యోతి. అందరికీ అనువైన ధర్మమార్గాన్ని సూచించాడు. అంతకుముందు వాటన్నింటినీ ఆయన అనుసరించి చూపాడు. దశావతరాల్లో బుద్ధావతారం కూడా ఒకటనే లెక్క ఉంది.

ది స్టేట్స్మన్‍ పత్రికలో వైశాఖ శుద్ధ పూర్ణిమతో ముడిపడిన బుద్ధుడి జీవితం గురించి వివరంగా ఉంది. అందులో వివరించిన ప్రకారం..
‘‘నాడు వైశాఖ పూర్ణిమ. రెండువేల ఐదు వందల ఎనభై సంవత్సరాలకు మునుపు నేడు నేపాల్‍ అని పిలువబడే హిమాలయ సానువు ప్రదేశాల చెంత శాక్యులనే తెగ వారు నివసిస్తుండే వారు. వారికి కపిలవస్తు అనే నగరం రాజధాని. కపిలవస్తు రాజనగరిలో రాణి మాయాదేవి నీళ్లాడింది. దీంతో ఆమె తన పుట్టినింటికి వెళ్లాలనే కోరికను వెల్లడించింది. రాజు శుద్దోధనుడు వెంటనే పల్లకీ బోయీలను రప్పించి ఆమె ప్రయాణానికి సన్నాహాలు చేశాడు.
మాయాదేవి పుట్టినిల్లు తోడి శాఖ్య ప్రజాపత్తాక (ప్రజాపతి) రాజ్యమైన దేవదహ నగరం. కపిలవస్తు నుంచి దేవదహకు వెళ్లే రహదారి లుంబినీ వనం అనే అడవి మీదుగా వెళ్తుంది. అక్కడ సాల వృక్షాలు సాంద్రంగా ఎదిగి ఉన్నాయి. ఆ వనం మధ్యలో ఒక చక్కని తామర కొలను ఉంది. పుష్పించిన సాల వృక్షాలు చుట్టూ బారులు తీరి ఉండగా, ఆ కొలను ప్రశాంతంగా ఉంది.

పల్లకి అక్కడి వరకు వచ్చింది. మాయాదేవికి నొప్పులు ప్రారంభమయ్యాయి. పల్లకీని ఆపాలని ఆమె బోయీలను ఆజ్ఞాపించింది. ఆమె వెంట ఆమె సోదరి ప్రజాపతి గౌతమి కూడా ఉంది. అక్కకు పురిటి సమయం ఆసన్నమైందని ఆమె గ్రహించింది. ఆదరాబాదరా అక్కడ ప్రదేశాన్ని శుభ్రం చేసి మాయాదేవి పురుడు పోసుకోవడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించారు.

కొద్ది నిమిషాల అనంతరం అక్కడ మాయాదేవి మగ శిశువును ప్రసవించింది. అతడే గౌతముడు.
ముప్పై ఐదు సంవత్సరాల అనంతరం మళ్లీ ఒక వైశాఖ పూర్ణిమ దినం వచ్చింది. ఆ వైశాఖ పూర్ణిమ నాడు చంద్రుడు నేటి బిహారులోని గయ చెంతనే గల ఒక మర్రి వృక్షం మీద తన వెన్నెల వెలుగులను ప్రసరిస్తూ ఉన్నాడు.
అప్పటికి ఆరేళ్ల క్రితం గౌతముడు భార్యను, కుమారుడిని, రాజ్యాన్ని వీడి మావన లోకం నుంచి దు:ఖాన్ని పారద్రోలడానికి పరిశ్రమిస్తూ శాక్యముని అయ్యాడు. సన్యాసుల సాంగత్యం, ఉపవాసాలు, జపాలు, తపాలు ఏమీ కార్యరూపందాల్చలేదు. తుదకు ఆయన ఆ మర్రి వృక్షం కింద కూర్చుని కొత్త వెలుతురు కోసం చిత్తాన్ని సమీకృతం చేశాడు.
వైశాఖ పూర్ణిమ చంద్రుడు ప్రకాశవంతంగా, దివ్యంగా వెలుగులీనుతుండగా, శాక్యమునికి ప్రబోధం కలిగింది. ఆ సమయంలో ఆయనకు ఆశ్రయం ఇచ్చిన మహా వృక్షమే బోధి వృక్షం అయ్యింది. ఆ ప్రదేశం బుద్ధ గయ అయ్యింది.

ఆయన బుద్ధుడు అయ్యాడు.
నలభై ఐదు సంవత్సరాల అనంతరం మళ్లీ అది ఒక వైశాఖ పూర్ణిమ దినం.. శాక్యముని బుద్ధుడు అయిన తరువాత వర్షాకాలాల్లో తప్ప మిగతా అన్ని కాలాల్లో దేశదేశాల వెంట తిరుగుతూ బౌద్ధ మత సిద్ధాంత ప్రచారం చేస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన బాగా వృద్ధుడు అయ్యాడు. తన చరమ కాలాన్ని ఆయన పాటలీపుత్రం, వైశాలి మున్నగు నగరాల్లో కాక ఒక పల్లెపట్టున గడపాలని అనుకున్నాడు. ఆనందుడు అనే ముఖ్య శిష్యుడితో కలిసి ఆయన ఒక సాల వృక్షాలతో కూడిన అరణ్యానికి వెళ్లాడు. అక్కడ ఆనందుడు రెండు సాల వృక్షాల నడుమ కొమ్మలతో ఒక చిన్న మంచం తయారు చేశాడు. అక్కడే బుద్ధుడు నిర్యాణం పొందాడు. ఆ ప్రదేశం కుసినర అనే ప్రఖ్యాతి చెందింది. ఏ సాల వృక్షాల వనంలో జన్మించాడో చివరికి అవే సాల వృక్షాల నడుమ జీవితాన్ని ముగించాడు బుద్ధుడు’’.
లుంబిని వనంలో సాల వృక్షచ్ఛాయలలో వైశాఖ పూర్ణిమ నాడు గౌతముడి జననం.

గయలో మర్రిచెట్టు కింద వైశాఖ పూర్ణిమ నాడు గౌతముడు బుద్ధుడు అయ్యాడు. కుసినర గ్రామంలో సాల వృక్షాల కింద వైశాఖ పూర్ణిమ నాడు నిర్యాణం పొందాడు. బుద్ధుని జీవితంలో ఇవి మూడు ముఖ్య ఘట్టాలు. ఈ మూడు ముఖ్య ఘట్టాల్లో ప్రదేశాలు మారాయి.
చెట్లు మారాయి. తిథి మాత్రం మారలేదు. అందుచేత వైశాఖ పూర్ణిమ బుద్ధులకు మహా పర్వమై ఉంది. గౌతముడిని బుద్ధుడిగా చేసిన బోధి వృక్షం పూజాభాజనమైంది. వైశాఖ పూర్ణిమ నాడు బోధి వృక్షానికి పూజ చేసే ఆచారం బుద్ధుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది.
జేత వన విహారంలో బుద్ధుడు మకాం చేసి ఉన్న రోజులలో ఒకనాడు భక్తులు పువ్వులు తెచ్చారు. కానీ, ఆ సమయంలో బుద్ధుడు ఎక్కడికో వెళ్లి ఉన్నాడు. భక్తులు బుద్ధుని దర్శనం కోసం చాలాసేపు వేచి ఉన్నారు. ఎంతసేపటికీ బుద్ధుడు రాలేదు. బుద్ధుని దర్శనం కాక భక్తులు నిరుత్సాహం చెంది ఆయన కోసం తెచ్చిన పువ్వులను అక్కడే వదిలి వెళ్లిపోయారు.

జేతవన విహారదాత అయిన అనంత పిండకుడు ఈ పరిస్థితిని చూశాడు. పూజకు వినియోగించాల్సిన ఆ పుష్పాలు ఇలా అక్కడ నిరుపయోగంగా పడి ఉండటం అతనికి నచ్చలేదు. అంతలోనే బుద్ధుడు అక్కడకు వచ్చాడు. అనంత పిండకుడు ఈ విషయాన్ని బుద్ధుడికి చెప్పాడు.
‘మీరు ఈ ప్రాంతంలో లేనప్పుడు కూడా పూజ సాగడానికి వీలుగా అక్కడే ఏదైనా వస్తువును ఉంచి వెళ్లండి’ అని బుద్ధుడిని కోరాడు.
శారీరక పారిభాగాది (అవయవాల) పూజలకు బుద్ధుడు అంగీకరించలేదు. కాకపోతే బోధి వృక్షానికి పూజ చేయొచ్చని చెప్పాడు. తన జీవితకాలంలోనూ, తదనంతరమూ కూడా బౌద్ధంలో ఈ ఒక్క పూజా కార్యక్రమం సాగడమే తనకు సమ్మతమని బుద్ధుడు అనంత పిండకుడికి చెప్పాడు.
బుద్ధుడు చెప్పిన మీదట, జేతవన విహారంలో ఒక బోధి వృక్షాన్ని నాటి పెంచడానికి బుద్ధుడి శిష్యుడైన ఆనందుడు నిర్ణయించాడు. గయలోని బోధి వృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటాడు. అప్పుడు ఒక గొప్ప ఉత్సవం జరిగింది. కోసల దేశపు రాజు తన సిబ్బందితో, అనుచరులతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు. వేలాది బౌద్ధ భిక్షకులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు.

ఆనాటి నుంచి బోధి వృక్ష పూజ బౌద్ధులలో కొనసాగుతోంది. ఆ పూజ ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమ నాడు సాగించడం ఒక ఆచారంగా మారింది. ఇప్పుడు బౌద్ధ మతం ప్రబలి ఉన్న అన్ని దేశాలలోనూ వైశాఖ పూర్ణిమ నాడు బోధి వృక్ష పూజ విశేషంగా సాగుతుంది.
ఆనాడు బౌద్ధులు బోధి వృక్షానికి జెండాలు కట్టి, దీపాలు పెట్టి, వృక్షం మొదట్లో పరిమళ జలాన్ని పోస్తారు. హీనయాన బౌద్ధ మతాన్ని అవలంబించే బర్మా (మియన్మార్‍)లో ఈ ఉత్సవం ఈనాటికీ చూడదగినదిగా ఉంటుంది. రంగూన్‍, పెగు, మాండలే తదితర బర్మా దేశపు నగరాల్లో ఈ పండుగను నితాంత వైభవంతో చేస్తారు. ఈ ఉత్సవం దాదాపుగా రోజంతా కొనసాగుతుంది. ప్రతి ఇంటిలోని స్త్రీలు పరిమళ జలభాండాన్ని తలపై ధరించి బయల్దేరుతారు. మేళతాళాలు ఊరేగింపుగా వెంట సాగుతాయి. వెనుక నుంచి దీపాలు, జెండాలు పట్టుకుని వస్తారు. నగరం నాలుగు మూలల నుంచీ ఇలా బయలుదేరిన వేర్వేరు ఉత్సవాలు సాయంత్రానికి ఒకచోట కలుసుకుంటాయి. సమ్మర్ధ దారుణమైన ఆ ఊరేగింపు ఉత్సవంగా బౌద్ధాలయానికి వెళ్తుంది. లోపలి దేవాలయానికి ముమ్మారు ప్రదక్షిణలు చేస్తారు. ఆనూ కుండల్లోని నీళ్లు బోధి వృక్షం మొదట్లో పోస్తారు. దీపాలు వెలిగిస్తారు. చెట్టుకు జెండాలు కడతారు. హిందువులు ఆచరించే ‘వట సావిత్రి’ తదితర వ్రతాలు ఈ బౌద్ధ పర్వం ఛాయలను కలిగి ఉంటాయని అంటారు.
మనిషి తన జీవన ధర్మాన్ని సమతూకంతో పాటిస్తూ దు:ఖ సాగరంగా భావించే సంసారం నుంచి మహా నిర్యాణ పథానికి చేరుకోవడమే బుద్ధుడి ధర్మ మార్గం. అలా చేయగలిగిన వాడు ఉత్తమ బౌద్ధునిగా, భోదిసత్వ సముడిగా గుర్తింపు పొందుతాడు. అతడే ఒక ధర్మజ్యోతిగా ప్రకాశిస్తాడు. బౌద్ధులు ఆయన ధమ్మనిష్టకు గుర్తింపుగా బుద్ధుడిని బోధిసత్త్వునిగా గౌరవించారు. బౌద్ధ ధర్మం అంటే మానవ ధర్మమే. ప్రతి జీవిలోనూ ఈ ధర్మ స్ప•హ అంతర్లీనంగా ఉంటుంది. పడిపోయిన మనిషిని లేవనెత్తే వాడు బుద్ధుడి ధర్మ స్పర్శ గలవాడే.
మనిషి ఎలా ఉండాలి?
నిండైన శాంతితో ఉండాలి.
ఎక్కడ ఉండాలి?
వర్తమానంలో ఉండాలి.
గతం వర్తమానాన్ని, ప్రస్తుతం భవిష్యత్తును నిర్ణయిస్తుందని అంటారు.
‘నువ్వు చేసే పాప పుణ్యాలే నరకం, స్వర్గ ప్రవేశాలను నిర్ణయిస్తాయి’ అని చెబుతున్నాయి అన్ని ధర్మ శాస్త్రాలు.
‘నీ గత కర్మలే ప్రస్తుత సమస్యలకు కారణం’
అని కర్మ సిద్ధాంతం బోధిస్తోంది.

ఈ రోజెలా బతకాలో, ఈ క్షణంలో ఏం చేయాలో బుద్ధుడు సవివరంగా బోధించాడు.
అశాశ్వతమైన సుఖసంపదలు, నశించిపోయే శరీరం, మరణమనే లోక నిష్క్రమణ.. ఇవి నిఖార్సయిన నిజాలు. ఇవే సిద్ధార్థుడిని సత్యాన్వేషణకు ప్రోత్సహించాయి.
గతం ఒక జ్ఞాపకం. భవిష్యత్తు ఒక స్వప్నం.
మనిషి ఈ రెండింటి మధ్యా ఊగిసలాడుతూ ప్రస్తుత కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. ఎక్కువ మంది యాంత్రిక జీవితం గడుపుతున్నారు. జీవితకాలం ముగిసిపోగానే లోకం నుంచి నిష్క్రమిస్తున్నారు. ఇది కాదు కదా జీవిత పరమార్థం. దీనిని గ్రహించిన సిద్ధార్థుడు సుదీర్ఘకాలం తపస్సు అనే అంతర్లోక ప్రయాణం చేశాడు. బోధి వృక్షం నీడలో, పున్నమి వెన్నెల తెల్లని వెలుగులో ‘బుద్ధం’ అనే జ్ఞానధార ఆయనలోకి ప్రవేశించింది. ఆయన జ్ఞాన పూర్ణుడయ్యాడు. ఆయనే బుద్ధుడయ్యాడు. ఆయనకు ఆశ్రయం ఇచ్చింది బోధి వృక్షం. ఆయన అవలోకించిన ధర్మం బౌద్ధంగా ప్రసిద్ధి పొందాయి.
సత్యం, శాంతి, దయ, జ్ఞాన ప్రసారం, నియమబద్ధ జీవనం, ధ్యానం వంటివి బౌద్ధధర్మంలో ప్రధానాంశాలు.
బుద్ధుడు త్రిశరణాలు ప్రతిపాదించాడు. శరణం అంటే ఆశ్రయించడం.

బుద్ధం, ధమ్మం, సంఘం.. ఈ మూడూ మనిషి జీవితంలో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి.
బుద్ధం (జ్ఞానం)లోనే మనిషి మాయ నుంచి, ప్రాపంచిక భ్రమల నుంచి తనను తాను వేరు చేసుకోగలుగుతాడు.
దమ్మ సూత్రాలు పాటించి పరిపూర్ణ మానవుడు అవుతాడు. అలా చేయడమే జీవన సాఫల్యం.
బుద్ధుడు తన దమ్మ సూత్రాలను అమృత ప్రసాదంగా దీనులకు, చక్రవర్తులకు సమంగా పంచాడు. అచిరకాలంలోనే బౌద్ధం ప్రపంచమంతా విస్తరించింది. భూమిపై ఏడు శాతం జనాభా.. అంటే 60 కోట్ల మందికిపైగా బౌద్ధులతో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద మతంగా అవతరించడానికి ‘సమ సమాజ’ సూత్రమే ఆలంబనం. బుద్ధుడు ప్రబోధించిన త్రిరత్నాలు, వాటికి సంబంధించిన చతు:సత్యాలు, అష్టాంగ మార్గం, ప్రతీత్య సముద్పాదాలలో కర్మఫలం ప్రస్తావన లేదు. ఆయన ఏది చెప్పినా బతుకు గురించే. చావు తరువాత గురించి ఆయన ఏమీ చెప్పలేదు. పునర్జన్మ గురించి చెప్పలేదు.
అనిత్యం, అనాత్మం, దు:ఖం
అనే మూడు సత్యాలను వెల్లడించాడు.

విశ్వమానవ కల్యాణం కోసం అష్టాంగ ధర్మాలను రూపొందించాడు.
మనిషి తనలో ఉన్న అసాధారణ శక్తులను, విశ్వప్రేమను తెలుసుకుని జీవించేలా బౌద్ధం దారి చూపింది. ఇతరులను, ఇతర జీవులను సంతోషపెడుతూ, తానూ సంతోషంగా జీవించాలనే సత్యాన్ని బోధించింది. బౌద్ధ కర్మ సిద్ధాంతం మనుషులను ఆశావహులు, జీవన ప్రేమికులు, అహింసావాదులు, సత్యాన్వేషులుగా మార్చింది.

నాలుగు సత్యాలు.. ఎనిమిది సూత్రాలు
మనుషుల్లోని ఆధిక్యతా భావాలు, మనసుల్లోని అంటరానితనం వల్లనే సమాజంలో అంతరాలు ఏర్పడుతున్నాయి. దీనికి పరిష్కారంగా బుద్ధుడు ప్రవచించిన నాలుగు సత్యాలు, ఎనిమిది సూత్రాలు ప్రపంచానికి శాంతి మార్గాన్ని నిర్దేశిస్తున్నాయి. అవేమిటో చూద్దాం.

ఈ నాలుగు సత్యాలను తెలుసుకోవాలి

– సమస్యను కారకంగా గుర్తించడం
– ప్రతి సమస్యకు కారణాలు ఉన్నాయని తెలుసుకోవడం
– ఏ సమస్యా శాశ్వతంగా ఉండదని గ్రహించడం
– ఆ సమస్యను ఎనిమిది రకాల మార్గాలతో గెలవడం

బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గాలు
– సరిగా, సమంగా ఆలోచించి మంచి సంకల్పం చేయడం
– దాని గురించి సత్యమైన మాటలే పలకడం
– దానికి సంబంధించిన పనులను సరిగా చేయడం
– స్వచ్ఛమైన జీవితాన్ని గడపడం
– చెడును విస్మరించి మంచిని పాటించడం
– తెలుసుకున్న మంచి విషయాలను ఆచరించడం
– మరణం అనివార్యమని గ్రహించి మంచి పనులు చేయడం
– జనహితమైన జీవితంతో పునీతులు కావడం

పంచశీల సూత్రాలు
– ఏ జీవినీ బాధ పెట్టకూడదు
– అన్ని జీవులనూ సమదృష్టితో చూడాలి
– జీవులను ప్రేమించాలి, గౌరవించాలి
– జీవుల అభివృద్ధిలోనే మన అభివృద్ధి దాగి ఉందని గ్రహించాలి.
– జీవుల అభివృద్ధిలో పాలుపంచుకోవాలి.

కోరికలను జయించాలని, అవే మన శత్రువులని చెప్పిన బుద్ధుడు నిజానికి మొదట్లో విలాస పురుషుడు. రాజకుమారుడిగా భోగాలను అనుభవించాడు. పుట్టిన వెంటనే తల్లిని కోల్పోయిన బుద్ధుడు పినతల్లి గౌతమి పెంపకంలో పెరిగాడు. అందుకే బుద్ధుడి పేరు ముందు ‘గౌతమ’ అనే పేరు వచ్చింది.

తండ్రి శుద్ధోధనుడు.. సిద్ధార్థుడిని (బుద్ధుడికి ముందు పేరు) గొప్ప చక్రవర్తిని చేయాలని తలచాడు. అందుకే అతడికి ఎలాంటి తాత్విక విషయాలు, సామాన్య ప్రజల కష్టాలు తెలియకుండా పెంచాడు. పదహారేళ్ల ప్రాయంలోనే సిద్ధార్థుడికి యశోధరతో వివాహమైంది. వీరికి రాహుల్‍ అనే కుమారుడు జన్మించాడు. అలా సిద్ధార్థుడు 29 ఏళ్ల వరకు రాజభోగాలను అనుభవించాడు. విలాస జీవితం గడుపుతున్నా.. సిద్ధార్థుడు అంతర్ముఖంగా, అశాంతితోనే ఉండేవాడు. ఈ ప్రాపంచిక సుఖాలను అనుభవించడం జీవిత పరమ లక్ష్యం కాదని భావిస్తుండేవాడు. దీంతో అతడికి మనుషుల కష్టసుఖాలు తెలియకూడదని తండ్రి శుద్ధోధనుడు ఎంతగానో ప్రయత్నించే వాడు. ఈ క్రమంలోనే ఒకరోజు సిద్ధార్థుడు తన 29వ ఏట బయటకు వెళ్లాడు. అప్పుడు- ఒక ముసలివ్యక్తిని, ఒక రోగ పీడితుడిని, ఒక కుళ్లిపోతున్న శవాన్ని, ఒక సన్యాసిని చూశాడు. ప్రతి మనిషి వార్ధక్యం నుంచి తప్పించుకోలేరని, ఈ శరీరం రోగపీడితమై ఏదోనాడు మట్టిలో కలిసిపోవాల్సిందేనని రథ సారథి సిద్ధార్థుడికి చెప్పడంతో సిద్ధార్థుడు తీవ్రంగా కలత చెందాడు. ముసలితనాన్ని, రోగాన్ని, మరణాన్ని జయించాలనే సంకల్పంతో నాటి నుంచి సన్యాస జీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు. తన రథసారథైన చెన్నుడి సాయంతో రాజభవనం నుంచి ఒక గుర్రంపై తప్పించుకునిపోయాడు. బుద్ధుడి జీవితంలోని ఈ ఘట్టాన్నే మహాభినిష్క్రమణ అంటారు. అలా వెళ్లిపోయిన సిద్ధార్థుడు తన సన్యాసి జీవితాన్ని మగధ సామ్రాజ్యంలోని ఒక పట్టణమైన రాజగృహంలో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు. అక్కడి రాజు బింబిసారుడు తనను గుర్తుపట్టడంతో పాటు తన రాజ్యాన్ని బహూకరిస్తానన్నా వద్దని వారించిన సిద్ధార్థుడు అక్కడి నుంచి వెళ్లిపోయి ఇద్దరు సన్యాసుల వద్ద శిష్యరికం చేశాడు. అలరకలమ అనే సన్యాసి తన బోధనలతో సిద్ధార్థుడిని ప్రావీణ్యుడిని చేశాడు. అనంతరం ఉదకరామపుత్త అనే యోగి శిష్యరికంలో యోగ శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అయినా జ్ఞానతృష్ణ తీరకపోవడంతో కౌండిన్యుడు అనే యోగి వద్ద శిష్యరికం చేశాడు. అయినా అతడు పరమ సత్యాన్ని కనుగొనలేకపోయానని భావించాడు. ఐహిక సుఖాలు, కోరికలే మనిషి అజ్ఞానానికి కారణమని గుర్తించి గయలోని బోధి వృక్షం నీడన జ్ఞానోదయం పొందిన సిద్ధార్థుడు.. మనిషి అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను, వాటి నుంచి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోగలిగాడు. నాటి నుంచి గౌతమ బుద్ధుడిగా మారాడు.

Review బుద్ధం శరణం గచ్ఛామి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top