శుభ వసంతం

మార్చి 25, చైత్ర శుద్ధ పాడ్యమి, బుధవారం-శ్రీ శార్వరి ఉగాది నామ సంవత్సరం

పండగంటే మన ఇంటిని మామిడాకుల తోరణాలతో, పూలతో ముస్తాబు చేయడమే మనకు తెలుసు. కానీ, ఉగాది వేళ మాత్రం మొత్తం• ప్రకృతి పండుగకు ముస్తాబవుతుంది. అందమైన వసంతానికి స్వాగతం పలుకుతూ నిర్వహించుకునే ఉగాది పర్వం ప్రకృతి సంబరం. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘మాసానాం మార్గశీర్షోహం.. రుతూనాం కుసుమాకర:’ అంటాడు. అంటే- మాసాలలో మార్గశిరమూ, రుతువులలో వసంత రుతువూ తానేనని అర్థం. అంతటి మహత్యం ఉంది వసంత రుతువుకి. ప్రపంచంలో అత్యధికంగా పూలు వసంతంలోనే పూస్తాయి. ఎర్రటి ఎండాకాలంలో సుకుమారమైన మల్లెపూలు పూయడం, చుక్కనీరు లేని చోట రసాలు నిండిన మధుర ఫలాలు గుత్తులుగా విరగకాయడం చైత్ర మాసానికే సొంతమైన ప్రకృతి వింత. అటువంటి వింతలే కృష్ణుడిని సైతం కట్టిపడేశాయి.
వసంతం అనే పదానికి ఏడాది అనే అర్థమూ ఉంది. ఒక్క తెలుగు వారే కాదు.. చాంద్రమానాన్ని పాటించే తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రజలూ చైత్ర శుక్ల (శుద్ధ) పాడ్యమిని కొత్త సంవత్సరానికి మొదటి రోజుగా పరిగణిస్తారు.
కృతయుగంలో కార్తీక శుద్ధ అష్టమి నాడు ఉగాది జరుపుకునేవారట.
త్రేతాయుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజు సంవత్సరాది పండుగ వచ్చేది. దీనినే మనం ప్రస్తుతం అక్షయ తృతీయగా జరుపుకుంటున్నాం.
ద్వాపర యుగం మొదలైంది మాఘ శుద్ధ అమావాస్య నాడు.
అయితే అన్ని యుగాల ఆరంభమూ వసంత మాసంలోనే జరిగిందని చెబుతారు. ఆయా యుగాల్లో వసంతం ఆయా మాసాల్లో వచ్చేదట. మోడువారిన చెట్లు చిగురుస్తూ పచ్చని ప్రకృతి మనిషిని పరవశానికి గురి చేసే కాలం, ఏ యుగంలోనైనా నూతన ఉగాదికి నాంది పలికేదిగానే ఉంటుంది కదా!.
‘వసంతి సుఖం యథా తథా అస్మిన్నితి’ అంటారు.
అంటే- వసంత కాలంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అర్థం. నిజానికి సాధారణ పండుగల్లా ఉగాది ఏ దేవతకో సంబంధించిన పండుగ కాదు. ఇది కాలాన్ని ఆరాధించే పండుగ. నిరంతరమూ, నిత్య నూతనమూ అయిన కాలాన్ని కొలుచుకుని అనంత కాలగమనంలో మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకుని మరొక్కసారి దేవుడు ఇచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ప్రయత్నానికి నాంది పలికే పండుగ – ఉగాది.
రేపటికి సంకేతం..
ఉగాది నాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని అంటారు. సకల చరాచర జీవరాశికీ మూల కారకుడైన బ్రహ్మ ఈ మహత్కార్యాన్ని ఆరంభించిన రోజుని అత్యంత వైభవోపేతంగా జరపాలన్న కాంక్షతోనే సరికొత్త అందా లను మోసుకొచ్చే వసంత మాసపు తొలి రోజునే ఉగాదిగా ఎంచుకున్నాడు. అందుకే ఈ పండుగకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రకృతే వేదిక. మామిడి చిగురు తిన్న మత్త కోయిలల గానాలూ.. సాయం సంధ్యలో మరుమల్లెల పరిమళాలూ.. గిలిగింతలు పెట్టే వసంత సమీరాలూ.. వెండి వెన్నెలను కురిపించే చందమామ అందాలూ.. అన్నీ ఉగాది పండుగ ప్రత్యేకతలే. అందమైన రేపటికి సంకేతాలే!.
ఉగాది ఆగమనం చాలా అందంగా ఉంటుంది. అందుకేనేమో ఓ కవి గారు ఇలా చమత్కరించారు..
ఎవరదీ.. నువ్వేనా ఉగాదీ
కొమ్మల్లో కోయిల కూస్తుంటే
మా పెరటి రెమ్మల్లో మల్లెలు పూస్తుంటే
ఈ మధుమాసోదయ వేళ
ఉగాదీ నిన్ను పోల్చుకున్నానులే..
ఉగాదికి నాంది ఇలా..
ఉగాదిని మొదట్లో యుగాదిగా వ్యవహరించే వారు. ‘యుగస్య ఆది:’ అని అర్థం. అంటే ఉత్తర, దక్షిణ ఆయనాలు రెండు కలిసి ఉండే సంవత్సరానికి చైత్ర శుద్ధ పాడ్యమే ఆది కనుక ఆ రోజును ఉగాది అంటారు. యుగాది అంటే బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజు అని అర్థం. కాల క్రమేణా అది వాడుకలో ఉగాదిగా మారింది. బ్రహ్మ ఇప్పుడు ద్వితీయ అంటే రెండో సగం జీవిత కాలంలో ఉన్నాడు. అందుకే ఏదైనా కార్యం చేయాలని అనుకున్నప్పుడు సంక ల్పంలో కాలాన్ని ప్రస్తావిస్తూ ఆయ నను గౌరవించడం మన సంప్ర దాయంగా మారింది.
అద్య బ్రహ్మణ: ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, అష్టావింశిన్ మహాయుగే, కలియుగే ప్రథమపాదే.. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ శార్వరి నామ సంవత్సరే చైత్ర మాసే, వసంత రుతౌ, శుక్ల పక్షే, పాడ్య మ్యాం తిథౌ, బుధవారే శుభ నక్షత్రే శుభయోగ శుభ కరణే.. అని ఉగాది నాడు పూజను ఆరం భించడం ఆచారం. అంటే, ఏ కార్యాన్ని మొదలు పెట్టాలనుకున్నా మనం సృష్టికర్త అయిన బ్రహ్మ మొదలు జరిగిన కాలాన్నంతా చెబుతూ మనం వైవస్వత మన్వంతరంలో 28వ మహా యుగమైన కలియుగంలో శ్రీ శార్వరి నామ సంవత్సరంలో ఉన్నామంటూ వర్తమాన సమయం దాకా చెబుతాం. గడిచిన అనంత కాలం మొదలు ఈ ఏడాది ఈ రోజు దాకా కాలాన్ని నిమిషాలతో సహా లెక్కగట్టి నిత్య పూజా విధానాల్లో, శుభాశుభ కార్యాల్లో తప్పనిసరిగా మననం చేసుకునే ఉత్క•ష్ట మైన జీవనశైలిలో భాగం. అదీ మన సంప్ర దాయంలో కాలానికి ఉన్న ప్రాధాన్యత. ఉగాది అచ్చంగా ఆ కాలానికి ప్రతిరూపమైన పండుగే.
కాలం విష్ణు స్వరూపం..
కృష్ణ పరమాత్మ కురుక్షేత్ర సమయంలో విశ్వరూపధారణ చేసినపుడు ‘నేను కాలాన్ని.. ఈ వ్యవస్థను విధ్వంసం చేస్తాను’ అంటాడు. అంటే ఇక్కడ కాలం విష్ణు స్వరూపమే. కానీ, ఆ కాల స్వరూపుడు చెప్పిన విధ్వంసం వెనుక ఒక రహస్యం దాగి ఉంది. ఆ విధ్వంసం ఒక కొత్త సృష్టికీ, సరి కొత్త వ్యవస్థ రూపకల్పనకూ పునాది అవుతుంది. ఏవైనా గడిచిన విషయాల గురించి చెప్పేటప్పుడు కాలగర్భంలో కలిసిపోవడం అనే పదాన్ని మనం అందుకే వాడుతుంటాం. వెనుకటి కాలాన్ని తనలోకి లాక్కునే కాలం నిరంతరం మనకు కొత్త సమయాన్ని, కొత్త ఆశలను, కొత్త అవకాశాలను ఇస్తూనే ఉంటుంది.
ఉగాది.. ఇదీ పూజకు నాంది
ఏడాది తొలి రోజు ఏలా గడుస్తుందో అలాగే ఏడాదంతా గడుస్తుందని ప్రజల విశ్వాసం. అందుకే ఉగాది రోజును సకల శుభప్రదంగా జరుపుకునేందుకు అంతా సన్నద్ధమవుతారు. ఆ పండుగ రోజుని ఎలా జరుపుకోవాలని అనే దానికి శాస్త్రం ఒక క్రమ పద్ధతిని సూచించింది. దాని ప్రకారం..
ప్రాత: కాలంలోనే లేచి పెద్దవాళ్లతో తలకు నువ్వుల నూనె పెట్టించుకుని వాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలి. ఆపై అభ్యంగన స్నానం ఆచరించాలి. తల మీద నీళ్లు కుమ్మరించుకుంటూ..
గంగేచ యమునేచైన కృష్ణా గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు
అనే శ్లోకాన్ని పఠించాలి. తైలాభ్యంగనం వల్ల ఆకలి, దప్పిక, మలిన నిర్వీర్యం జరుగుతాయనీ, మహాలక్ష్మి కృప లభించి దరిద్రం తొలగిపోతుందనీ చెబుతారు. ఉగాది రోజు కొత్త బట్టలు ధరించాలి. నూతన వస్త్రాలలో సకల దేవతలు నివాసం ఉంటారని శాస్త్రం చెబుతోంది. కొత్త బట్టలు కట్టుకుని కుటుంబసభ్యులు, ఇష్టమైన వారి సాంగత్యంలో గడిపితే, లలితా, లక్ష్మీ కటాక్షాలు లభిస్తాయట. దిష్టి పోయేందుకు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టాలి. తరువాత ఇష్టదేవతలను ప్రార్థించి పరగడుపున ఉగాది పచ్చడిని స్వీకరించాలి. షడ్రుచుల సమ్మేళనమైన ఈ పచ్చడి గొప్ప ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని పురాణోక్తి. సర్వ శుభప్రదమైన పంచాంగ శ్రవణాన్ని ఉగాది నాడు తప్పక వినాలి. అందు లోనూ ఉత్తర ముఖంగా కూర్చుని పంచాంగ శ్రవణం చేయడం వల్ల విశేష పుణ్య ఫలితాలు కలుగుతాయట.
పంచాంగ శ్రవణం.. సర్వశుభప్రదం
పంచాంగం సిరిసంపదలను ప్రసాదిస్తుంది. దుస్స్వప్నాలను హరిం చడంతో పాటు గంగానదీ స్నాన ఫలితాన్ని ఇస్తుంది. గోదానం చేసిన భాగ్యాన్నీ, ఆయురారోగ్యాలనూ, విద్యాబుద్ధులనూ, సత్సంతానాన్నీ ప్రసాదిస్తూ సకల విజయాలనూ సిద్ధింప చేస్తుంది. అందుకే ఉగాది నాడు పంచాంగ శ్రవణం తప్పక చేయాలని చెబుతాయి శాస్త్ర గ్రంథాలు. ఉగాది నాడు చేసే పనుల్లో ఇదో ముఖ్య ఘట్టం. పంచాంగ శ్రవణం సమ యంలో ఎన్నోసార్లు గ్రహాల పేర్లను పలుకుతారు. అందువల్ల ఆయా గ్రహాలు సంతోషిస్తాయి. ఫలితంగా పంచాంగ శ్రవణం చేసిన వారికీ, విన్నవారికీ సూర్యుడి వల్ల తేజస్సు, చంద్రుడి వల్ల వైభవం, కుజుడి వల్ల సర్వమంగళం, బుధుడి వల్ల బుద్ధి వికాసం, గురుడి వల్ల జ్ఞానం, శుక్రుడి వల్ల సుఖం, శని వల్ల దు:ఖరాహిత్యం, రాహువు వల్ల ప్రాబల్యం, కేతువు వల్ల ప్రాధాన్యం కలుగుతాయని జ్యోతిష వాక్కు. పంచాంగ ప్రస్తావన వేదాలు మొదలు ఎన్నో శాస్త్ర గ్రంథాల్లో కనిపిస్తుంది. మన పంచాంగానికి మూలమైన కాల సిద్ధాంతాలు ఉన్న గ్రంథాన్ని క్రీస్తు శకం 505లో వరాహమిహిరుడు ప్రతిపాదించాడు. మొత్తం 18 సిద్ధాంతాలు ఉండగా, అందులో ముఖ్యమైనవంటూ అయిదింటిని తన గ్రంథంలో ప్రస్తా వించాడు. ఆ జ్యోతిష గ్రంథాన్ని ఉగాది నాడే ప్రజలకు ఆయన అంకితం చేశాడట. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న, వాడుకలో ఉన్న పంచాం గాలను, వరాహమిహిరుని జ్యోతిష గ్రంథంలోని పూర్వ గణిత, దృగ్గణిత సిద్ధాంతాల ఆధారంగానే రూపొందిస్తున్నారు.
అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి..
ఈ ఏడాది శ్రీ శార్వరి నామ సంవత్సరంలో దేశానికి, మన తెలుగు రాష్ట్రాలకు మంచి ఫలితాలే ప్రాప్తించనున్నాయని పంచాంగకర్తలు అంటున్నారు. వివిధ గ్రహాల అనుకూల స్థితి కారణంగా ప్రజలకు మేలు జరుగుతుంది. సుఖశాంతులతో ప్రశాంత జీవనం గడుపుతారు. శుక్రుడి గమనం కారణంగా సౌభాగ్యం, ఆర్థికవృద్ధి విశేషంగా ఉంటాయట. ప్రత్యేకించి మహిళలకు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రజలు ఆనందంగా తమ తమ పనుల్లో నిమగ్నమవుతారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. చంద్రుడి కారణంగా మనశ్శాంతి, ప్రశాంత జీవితం లభిస్తాయి. మనోబలం పూర్తిగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ప్రజలు ముందుకు సాగుతారు. గురు గ్రహ గమనం రీత్యా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మంచి విద్యాయోగాన్ని పొందుతారు. చక్కని ఆలోచన విధానంతో, బుద్ధి బలంతో విజ్ఞానాన్ని ఆర్జిస్తారు. ప్రజలు కూడా జ్ఞాన మార్గంలో ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు. ఆలోచనల్లో ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి. సూర్య సంచారం వల్ల ప్రజలు రోగాలు లేని వారై ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగిస్తారు. రాహు, కేతువుల గ్రహ గమనాన్ని బట్టి ఆధ్యాత్మిక పురోగతి, సాంకేతికపరమైన అభివృద్ధి రెండు జోడెడ్ల బండి మాదిరిగా ముందుకు సాగుతాయి. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో దాదాపు చాలా గ్రహాలు శుభ స్థానాల్లో ఉండటం వల్ల ప్రజలు సంపూర్ణ శుభ ఫలితాలను అనుభవిస్తారు.
ఇక, దేశంలో శ్రీ శార్వరి నామ సంవత్సర ఫలితాలను అవలోకించి చూస్తే.. పాలనలో ఒడిదుడుకులు సహజ పరిణామాలేనని పంచాంగకర్తలు వివరిస్తున్నారు. బుధుని శుభదృష్టి కారణంగా దేశానికి, రాష్ట్రాలకూ సంపూర్ణ ధన యోగం ఉంటుంది. శని, కుజుల కారణంగా భయాందోళనలు నెలకొంటాయి. కొన్ని సందర్భాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. సున్నితమైన అంశాల్లో ఏర్పడే అభిప్రాయ బేధాలు ఉద్రిక్తతలకు దారితీయవచ్చు. కాబట్టి ఈ కాలంలో పాలకులు, ప్రజలు సమన్వయంతో ఆలోచించాల్సి ఉంటుంది. ప్రజలు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పాలనలో ప్రతిష్టంభన ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రజలు వెన్నుదన్నుగా నిలిస్తే తప్ప పాలకులకు కష్టకాలమేనని చెప్పాలి. అలాగే, దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగే అవకాశాలున్నాయని పంచాంగకర్తలు అంటున్నారు. ప్రస్తుతం నెలకొన్న మాంద్యం ప్రభావం శ్రీ శార్వరి నామ సంవత్సరంలోనూ కొనసాగే అవకాశాలే ఎక్కువని అంటు న్నారు. దేశవ్యాప్తంగా అభివృద్ధిని సాధించాలంటే ప్రజలు బాగా కష్టపడాలి. పాలకులు బాగా శ్రద్ధ చూపాలి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహ రించాలి. సమష్టి కృషి వల్ల ఆపదలను, విపత్కర పరిస్థితులను అధిగ మించవచ్చు. ప్రపంచ దేశాలతో సంబంధాలు బలపడాలంటే ఆయా అంశాల మీద పాలకులు ప్రత్యేక దృష్టి సారించాలి. అప్పుడే వైజ్ఞానికంగా, ఆర్థికంగా భారతదేశం సమగ్రంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది.

Review శుభ వసంతం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top