నీ పని ‘శ్రీరంగం రోకలే!

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం

ఐదు పది అవుతుంది

యుద్ధంలో గెలవాలంటే యుద్ధం చేయాలనే ఉత్సాహం ఉండగానే సరిపోదు. తమ శక్తి సామర్థ్యాల మీద తగిన అవగాహన ఉండాలి. లేకపోతే యుద్ధభూమి వదిలి పలాయనం చిత్తగించాల్సి ఉంటుంది.
రెండు చేతులూ ఒకచోట జోడించి నమస్కరిస్తూ ఓటమిని అంగీకరించడం అనేది చాలాసార్లు చూస్తూ ఉంటాం. దీని నుంచి పుట్టిందే పై జాతీయం.
ప్రతి చేతికీ ఐదేసి వేళ్లు ఉంటాయి. రెండు చేతులూ దగ్గరకు వచ్చినపుడు అయిదూ అయిదూ కలిసి పది వేళ్లవుతాయి. ఓటమిని అంగీక రిస్తూ నమస్కరించినపుడు అయిదు వేళ్లు పది అవుతాయి కాబట్టి ఈ మాట పుట్టింది.
అందుకే ఎవరితోనైనా పోరాడితే ఓడిపోతావ్‍ అని చెప్పాల్సి వచ్చినపుడు ‘వాడితో పెట్టుకోకు. అయిదు పది అవుతుంది’ అని అంటూ ఉంటారన్న మాట.
అంటే అతని జోలికి వెళ్లకు.. వెళ్తే.. రెండు చేతులతో నమస్కరిస్తూ ఓటమిని అంగీకరించాల్సి వస్తుందనే భావంలో ఈ జాతీయాన్ని ఉపయో గిస్తుంటారు.

శ్రీరంగం రోకలి

‘ఆ పని నెత్తి మీద వేసుకున్నావా? ఇక నీ పని శ్రీరంగం రోకలే’
‘అతని వద్దకు వెళ్లకయ్యా బాబూ.. అతనసలే శ్రీరంగం రోకలి’
వివిధ సందర్భాల్లో వినిపించే మాటలివి. శ్రీరంగం అంటే తమిళనాడులో ఉన్న ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం. దేశం నలు మూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. అంతమందికి రోజూ ప్రసాదం అందించడం అనేది ఆషామాషీ విషయం కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందుకే కొందరు భక్తులు స్వచ్ఛందంగా ఈ ప్రసాదం తయారీ పక్రియలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో ఒక వ్యక్తి రోకలి పోటు వేస్తున్నాడనుకోండి. అలిసిపోయాను అని చెప్పి ఉన్న పళంగా ఆ పని నుంచి తప్పుకోవడానికి లేదు. అలా చేస్తే పాపం. అందుకే వేరే భక్తుడు వచ్చి ఆ రోకలిని తన చేతిలోకి తీసుకునే వరకు రోకలితో దంచుతూనే ఉండాలి. వేరే భక్తుడు ఎవరైనా వచ్చి రోకలి అందుకుంటే అదృష్టం. రాకపోతే మాత్రం శ్రమ పడక తప్పదు. దీని నుంచి పుట్టినదే ‘శ్రీరంగం రోకలి’ జాతీయం.
దురదృష్టవశాత్తూ ఒక పని ఎంతకీ తరగ కుండా ఉన్నప్పుడు కానీ, ఎవరైనా విసిగిస్తూ ఒక పట్టాన వదలనప్పుడు కానీ ఈ పలుకుబడిని వాడుతుండటం కద్దు.

తద్దినం పెట్టే వాడి తమ్ముడు

‘నీకేమయ్యా.. తద్దినం పెట్టేవాడి తమ్ముడిలా కూల్‍గా ఉంటావు. సమస్యంతా మాకే’ అనే మాట ఎప్పుడైనా విన్నారా? పురోహితుడు తద్దిన మంత్రాలు చదువుతున్నప్పుడు అన్నదమ్ము లందరూ ఒకచోట కూర్చుంటారు. అయితే వారిలో పెద్దవాడు మాత్రమే పురోహితుడు చెప్పిన పనులు చేస్తుంటాడు. తమ్ముళ్లు మాత్రం ఇంకేమీ చేయకుండా జంధ్యాన్ని ఎడమ భుజం నుంచి కుడికి మార్చుకోవడం మాత్రం చేస్తారు. అంటే ముఖ్యమైన పనంతా చేసేది పెద్ద వాడేనన్న మాట. ఈ కార్యం నుంచి పుట్టిందే- ‘తద్దినం పెట్టే వాడి తమ్ముడు’ జాతీయం.
ఇతరులతో పోలిస్తే ఎవరైనా చాలా తక్కువ శ్రమ చేస్తున్నప్పుడు, బాధ్యతలు తక్కువగా ఉన్నప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.

Review నీ పని ‘శ్రీరంగం రోకలే!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top