కొత్త సినిమాల పండుగ..

తెలుగు చిత్రసీమలో దసరా సెంటిమెంట్‍ చాలా ఎక్కువ. ఆ రోజు నిర్మాణంలో ఉన్న చిత్రాల విశేషాలతో పాటు కొత్త సినిమాల ప్రకటనలు చేసేందుకు చిత్ర బృందాలు ఆసక్తి చూపుతాయి. ఈసారి దసరా సందర్భంగా అలా కొత్తగా ప్రకటించిన సినిమాల సంగతులేమిటంటే..

బాలకృష్ణ-గోపీచంద్‍
కలయిక మరోసారి..

‘వీరసింహారెడ్డి’ విజయం తరువాత కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్‍ మలినేని మరోసారి కలిసి పనిచేయనున్న సంగతి తెలిసిందే. ‘ఎన్‍బీకే111’ వర్కింగ్‍ టైటిల్‍తో పట్టాలెక్కనున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్‍ పతాకంపై వెంకట సతీశ్‍ కిలారు నిర్మిస్తున్నారు. నవంబర్‍ 24న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానుంది. ‘చారిత్రక అంశాలతో కూడిన యాక్షన్‍ కథతో రూపొందనున్న చిత్రమిది. బాలకృష్ణ ఇందులో మునుపెన్నడూ చూడని శక్తివంతమైన పాత్రలో, సరికొత్త లుక్‍లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర పూర్వ నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్నాయి’ అని చిత్ర బృందం తెలిపింది. ఇక, ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ 2: తాండవం’ సినిమా డిసెంబర్‍ 5న విడుదల కానుంది. దీనికి బోయపాటి శ్రీను దర్శకుడు.

రాజుగారి నాలుగో గది..
దర్శకుడు ఓంకార్‍ రూపొందించిన ‘రాజుగారి గది’ చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి ‘రాజుగారి గది : శ్రీచక్రం’ అనే మరో సినిమా రానుంది. దీన్ని పీపుల్‍ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‍, కృతి ప్రసాద్‍ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్‍ను విడుదల చేశారు. ‘పురాణ విశ్వాసాలు, అందులోని రహస్యాలు, మరిచిపోయిన వారసత్వాలపై అల్లుకున్న కథతో రూపొందనున్న చిత్రమిది. కాలికాపురం అనే గ్రామ నేపథ్యంగా సాగుతుంది. వినోదం, భక్తి, భయం, సస్పెన్స్.. ఇలా అన్ని రకాల అంశాలతో మరిచిపోలేని హారర్‍ అనుభవాన్ని అందిస్తుంది’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా వచ్చే ఏడాది దసరాకు విడుదల కానుంది.

సైకో ప్రేమికుడి ‘అగ్లీ స్టోరీ’..
నందు, అవికాగోర్‍ జంటగా ప్రణవ స్వరూప్‍ తెరకెక్కించిన చిత్రం ‘అగ్లీస్టోరీ’. ఈ చిత్ర టీజర్‍ను దసరా సందర్భంగా విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి ఇది ట్విస్ట్లు, సస్పెన్స్ అంశాలతో నిండి ఉన్న ముక్కోణపు ప్రేమకథతో తెరకెక్కినట్టు అర్థమవుతోంది. ఇందులో నందు సైకో తరహా ప్రేమికుడి పాత్రను పోషించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది.

కామ్రేడ్‍ కల్యాణ్‍..
శ్రీవిష్ణు హీరోగా జానకిరామ్‍ మారెళ్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. కోన వెంకట్‍ సమర్పిస్తున్న ఈ సినిమాను వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. మహిమా నంబియార్‍ కథానాయిక. ఈ చిత్రానికి ‘కామ్రేడ్‍ కల్యాణ్‍’ అనే పేరు ఖరారు చేశారు. దసరా సందర్భంగా టైటిల్‍ గ్లింప్స్ను విడుదల చేశారు. విశాఖ మన్యంలో నక్సలైట్ల ముప్పు పెరిగిందంటూ రేడియో ప్రకటనతో మొదలైన గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ ప్రచార చిత్రాన్ని బట్టి ఇది 1992లో విశాఖ జిల్లాలోని మాడుగుల గ్రామ నేపథ్యంలో సాగే కథ అని అర్థమవుతోంది. యాక్షన్‍ కామెడీ జోనర్‍లో సాగే ఈ సినిమాలో శ్రీవిష్ణు రెండు పాత్రల్లో కనువిందు చేయనున్నారు. రాధిక, షౌన్‍ చామ్‍ చాకో ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు.

అనుమాన పక్షి..
‘డీజే టిల్లు’ సినిమాతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాడు దర్శకుడు విమల్‍ కృష్ణ. ఇప్పుడాయన రాగ్‍ మయూర్‍ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాజీవ్‍ చిలక, రాజేశ్‍ జగ్తియాని, హీరాచంద్‍ దండ్‍ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెరిన్‍ ఫిలిప్‍ కథానాయిక. ఈ సినిమాకు ‘అనుమాన పక్షి’ అనే పేరును ఖరారు చేశారు. విజయదశమి సందర్భంగా ఈ చిత్ర టైటిల్‍, ఫస్ట్లుక్‍, మోషన్‍ పోస్టర్‍ను విడుదల చేశారు. ‘వినోదంతో నిండిన వైవిధ్యభరితమైన కథతో రూపొందుతోన్న చిత్రమిది. రాగ్‍ మయూర్‍ పాత్ర విచిత్రమైన స్వభావంతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.

Review కొత్త సినిమాల పండుగ...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top