వెండితెరపై అందాలను ఆరబోసే మన కథానాయికలు ఆఫ్ స్క్రీన్‌లో భలే ఆసక్తికరమైన విషయాలు చెబుతుంటారు. ఏం చేస్తున్నారు? ఏం చదువుతున్నారు? జీవితం గురించి దృక్పథం ఏమిటి? అనే విషయాలపై ముద్దుగుమ్మలు చెబుతున్న విషయాలేమిటో చదివేయండి మరి..
‘పర్వ’ చదువుతున్నా: అనుష్క
నేను బయటికి రావడానికి, తరచూ కనిపించడానికి పెద్దగా ఇష్టపడను. ప్రస్తుతం రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యా. తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతున్నాను. నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. కొత్త విషయాలు నేర్చుకోవడానికి అదో సాధనం. అలాగే, ప్రస్తుతం ప్రముఖ కన్నడ రచయిత భైరప్ప గారి ‘పర్వ’ చదువుతున్నాను. కొన్నేళ్లుగా విరామం లేకుండా నటిస్తూ వచ్చా.. అందుకే కుటుంబాన్ని చాలా మిస్ అయ్యా. ఇప్పుడు కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ అనుబంధాలను ఎంజాయ్ చేస్తున్నాను. సామాజిక మాధ్యమాలపైన నాకు ఎక్కువ ఆసక్తి లేదు. వాటికి సాధ్యమైనంత దూరంగా ఉంటాను. మహిళలు బయటికి సున్నితంగా, అమాయకంగా కనిపించినా, మానసికంగా వాళ్లు చాలా దృఢంగా ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినపుడు ప్రతి ఇంట్లోనూ వాళ్లు కుటుంబానికి ఓ స్తంభంలా నిలబడతారు. అలాంటి మహిళల శక్తిసామర్థ్యాలను ప్రతిబింబించే పాత్రలను చేయాలని ఉంది. నా రంగంలో నేను చేసింది కొంతే.. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రస్తుత కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చి మరీ నటించాలని ఉంది.
పాత్రలో నటించడం కాదు.. జీవించాలి: శ్రీలీల
అదిరిపోయే స్టెప్పులతో కుర్రకారును ఉర్రూతలూగించే శ్రీలీల ఇటీవల తన మనసులోని మాటలను ఇలా పంచుకుంది- ‘భాష కాదు.. నాకు పాత్రలే ముఖ్యం. ఇప్పటి వరకు నా వ్యక్తిత్వానికి భిన్నంగా ఉన్న పాత్రలే ధరించాను. కానీ, భాష ఏదైనా తెరపై నా వ్యక్తిగత జీవితాన్ని ప్రతిబింబించే పాత్రల్లో నటించడానికే ఆసక్తి చూపిస్తా. మనం పాత్రలో జీవించడానికి బదులుగా నటించడం ప్రారంభించిన క్షణమే.. మనం నిజాయితీగా పనిచేయట్లేదని నాకు అనిపిస్తుంటుంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో నేను విన్న స్క్రిప్ట్‌లు చాలా వరకు నా వాస్తవ జీవితానికి దగ్గరగా ఉన్నాయని అనిపించింది. అందుకే పాత్రలను ఎంపిక చేసుకునే విషయంలో నాకు పట్టింపు లేదు. పాత్ర నచ్చితే ఏ భాష సినిమాలోనైనా నటిస్తా. అదీ నా వాస్తవ జీవితానికి దగ్గరగా ఉంటే..’
తొందరేం లేదు..:
ఇలియానా
‘ఆట’, ‘దేవదాసు’, ‘క్రాక్’, ‘పోకిరి’ వంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఇలియానా ఇటీవల కొంతకాలంగా వెండితెరకు దూరమైంది. మధ్యలో కొంత కాలం బాలీవుడ్లో మెరిసినా ఇప్పుడు అక్కడా నటించడం లేదు. మరి ఈ గ్యాప్ గురించి ఏమంటోందంటే..
‘ప్రస్తుతం నా పూర్తి సమయాన్ని నా పిల్లలకే కేటాయిస్తూ మాతృత్వ మమకారాన్ని ఆస్వాదిస్తున్నా. మళ్లీ సినిమాలు చేయాలనే తొందరేం లేదు. తెరపై కనిపించడం, భిన్నమైన పాత్రలు పోషించడం, సెట్లో సందడి.. ఇలా అన్నింటినీ మిస్ అవుతున్నాననే బాధ ఉన్నా.. పిల్లల బాధ్యతకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నా. అందుకే కొన్ని రోజులు విరామం తీసుకున్నా. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తాను. ప్రస్తుతం నా ఇద్దరు కుమారులతో బిజీగా ఉన్నాను’.























































































































































































































































Review ముద్దుగుమ్మల మనసులో మాట.