సాహితీ సేద్యకారుడు ఆరుద్ర.. తెలుగు సినిమాపైనా తన పాటలతో చెరగని ముద్ర వేశారు. ఆగస్టు 31, 2025 ఆయన శతజయంతి దినం. తెలుగు సినిమాల కోసం నాలుగు వేల పాటలను రాసి ప్రేక్షకులను అలరించిన ఆయన పాటలు నేటికీ తెలుగింట వినిపిస్తూనే ఉంటాయి. వీనుల విందు చేస్తూనే ఉన్నాయి. వాటినోసారి గుర్తుచేసుకుందాం..
‘తీస్కో కోకాకోలా.. ఏస్కో రమ్మూ సారా..’ 1971లో వచ్చిన ‘రౌడీలకు రౌడీలు’ చిత్రంలోని ఈ పాట నాటి కుర్రకారును ఊపేసింది. ఆరుద్ర రాసిన ఈ క్లబ్ సాంగ్‌ను పిల్లలు ఇంట్లో పాడితే పెద్దోళ్లు తిట్టిన రోజులవి. అదే ఆరుద్ర కలం ‘శ్రీరస్తు శుభమస్తు.. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం’ అంటూ రాయగానే తెలుగింటి పెళ్లిపందిరి నెత్తిన పెట్టుకుంది. ఈనాటికీ తెలుగు లోగిళ్లలో పెళ్లిసందడిలో ఈ పాట వినిపించకుండా ఉండదు. ‘పందిట్లో పెళ్లవుతున్నాదీ.. కనువిందౌతున్నాదీ’ అనే ఈ పాట కూడా పెళ్లిళ్లలో మార్మోగాల్సిందే. విశాఖపట్నంలో పుట్టిన ఆరుద్ర సమగ్రాంధ్ర సాహితీకారుడు. అదే సమయంలో తెలుగు సినిమా పాటలతోనూ తెలుగింట చెరగని ముద్ర వేశారు. 1950లో చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్రలో వచ్చిన ‘బీదలపాట్లు’తో ఆరుద్ర సినీ ప్రయాణం మొదలైంది.
ఒకసారి ఆరుద్ర తన దారినపోతుంటే ఇద్దరు వ్యక్తులు ‘కొండగాలి తగిలింది.. గుండె ఊసులాడింది’ (ఉయ్యాల జంపాల) పాటను పాడుకుంటూ వెళ్తూ.. ‘ఏం రాశాడురా..’ అంటూ తమ శైలిలో ప్రేమగా తిట్టారట. ఆ మాటలు విన్న ఆరుద్ర.. ఆ పాట రాసినందుకు చేసిన సన్మానంలో తనకు దక్కిన రూ.,10,116 కంటే ఆనాడు తాను రాసిన పాట వింటూ వాళ్లు తనను తిట్టిన ప్రేమపూర్వక తిట్లే ఎక్కువ అని వ్యాఖ్యానించారు.
ఆరుద్ర హేతువాది. అయినా ఆయన రాముడిపై అద్భుతమైన పాటలు రాశారు. ఆ రోజుల్లో బాపు సినిమా తీశారంటే ఆరుద్రే పాటలు రాయాలి. అంతగా వీరిద్దరి కాంబినేషన్ కొనసాగింది. బాపు తొలి చిత్రం ‘సాక్షి’లోని ‘అమ్మ కడుపు చల్లగా’తో మొదలుపెట్టి ‘ఎదగడానికెందుకురా తొందర’ (అందాల రాముడు), ‘రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా’ (గోరంత దీపం), ‘ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ’ (ముత్యాలముగ్గు), ‘సిత్రాలు సేయరో శివుడో’ (మనవూరి పాండవులు), ‘మహాబలిపురం.. మహాబలిపురం’ (బాలరాజు కథ), ‘చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా’ (తూర్పు వెళ్లే రైలు).. ఇలా పలు బాపు చిత్రాలకు ఆరుద్ర ఆణిముత్యాల్లాంటి పాటలను అందించారు. ‘ఆంధ్రకేసరి’ చిత్రం కోసం రాసిన ‘వేదంలా ఘోషించే గోదావరి’, ‘ఎంఎల్ఏ’ చిత్రంలోని ‘నీ ఆశ అడియాస.. చెయిజారే మణిపూస’, ‘ధనమేరా అన్నిటికీ మూలం’ (లక్ష్మీ నివాసం) లాంటి పాటలు రాయడం ఆరుద్ర కలానికే చెల్లు. చలన చిత్ర రంగంలోకి ప్రవేశించిన తొలి రోజుల్లో మహాకవి శ్రీశ్రీలా ఆరుద్ర కూడా డబ్బింగ్ చిత్రాల రచయితగా పేరు పొందారు. హీరో కృష్ణ నట జీవితంలో మైలురాళ్లుగ నిలిచిన ‘గూఢచారి 116’, ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాల ఘన విజయాల వెనుక ఉన్నది ఆరుద్ర కలం బలమే. అప్పటి దాకా తెలుగు తెరపై చూడని జేమ్స్‌బాండ్, కౌబాయ్ తరహా ఈ చిత్రాల కథ, మాటలు, పాటల అల్లికలో ఆరుద్ర కలం కొత్త పుంతలు తొక్కింది.
దిగ్గజ దర్శకుడు కేవీ రెడ్డితో ఒకసారి ఆరుద్ర ‘రెడ్డిగారూ! మీరు ‘భక్త పోతన’, ‘యోగి వేమన’ చిత్రాలు అద్భుతంగా తీశారు. ‘కవి తిక్కన’ ఎందుకు తీయకూడదు?’ అని అడిగారట. ‘‘అందులో కథేముంది? ఆడోళ్లకు నచ్చేదేముందబ్బా?’ అని కేవీ రెడ్డి తనదైన శైలిలో బదులిచ్చారట.
తన సాహితీ పరిశోధనకు ఈ ఘటన బీజం వేసిందని ఆరుద్ర చెప్పుకునే వారు. శోభన్‌బాబు నటించిన ‘మల్లెపూవు’ (1978) చిత్రంలో ఓ కవి సమ్మేళనం సన్నివేశం ఉంటుంది. ఇందులో మరో సినీ కవి వేటూరి సుందరరామ్మూర్తితో కలిసి ఆరుద్ర ఓ పది నిమిషాలు తెరపై కనిపించి కవితాగానం చేస్తారు. ఈ చిత్రంలోనూ రెండు చక్కటి పాటలను రాశారాయన. సాహిత్యంలో ఎన్నో ప్రయోగాలు చేసిన ఆరుద్ర తెలుగు సినీ పూదోటలో పూయించిన పాటల మల్లెలు ఎప్పటికీ గుబాళిస్తూనే ఉంటాయి.






















































































































































































































































Review పాటకు బలం.. ఆరుద్ర కలం.