నరసింహస్వామి యోగ మార్గంలో అనాహతానికి, విశ్వంలో సూర్య మండలానికి, దేవలోకంలో సుదర్శన చక్రానికి ప్రతీక. వరాహస్వామి భూతత్వానికి, మూలాధారానికి, విశ్వచైతన్య మూలానికి ప్రతీక. వరాహమూర్తి అనాహతం చేరుకున్నప్పుడు కుండలిని ఆత్మతత్వాన్ని ప్రదర్శిస్తుంది. అదే వరాహ నారసింహ తత్త్వం. సింహాచల స్వామి చందనమయ లింగాకృతిలో సదా దర్శనమిస్తూ శివకేశవుల అభేదానికి ప్రత్యక్ష నిదర్శనమై భక్తకోటిని అనుగ్రహిస్తుంటాడు. భగవంతుడు సర్వాంతర్యామి, జగత్తంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడని చాటి చెప్పడమే శ్రీ నరసింహావతార ఉద్దేశం.
తెలుగునాట వెలసిన సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాలలో సింహాచలం ఒకటి. ఇది దేశంలోని అన్ని నారసింహ క్షేత్రాలలో అతి ప్రాచీనమైనది. ఆంధప్రదేశ్‍లోని ప్రసిద్ధ విశాఖపట్నం నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో తృతీయ (వరాహ), చతుర్థ (నరసింహ) అవతారాల సమ్మిళితంగా, వైవిధ్యభరితమైన రూపంలో ఇక్కడ వరాహ లక్ష్మీనృసింహస్వామిగా కొలువై దర్శనమిస్తున్నాడు. ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిశాడు. ఈ దైవాన్ని అశేష భక్తకోటి దర్శించి సేవించుకుని, భక్తితో అప్పలకొండ, వరాల అప్పన్న, నరసింహ అప్పడు అనే పేర్లతో స్మరించుకుంటారు. హరిచందనగిరిగా, సుందరగిరిగా, సువర్ణగిరిగా, ప్రహ్లాదాద్రిగా, వరాహాచలంగా, చందనాద్రిగా ఖ్యాతిగాంచిన ఈ నృసింహ క్షేత్రం గోస్తని, శారద నదుల పరీవాహక ప్రాంతం మధ్య నెలకొని ఉంది. సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున తూర్పు కనుమల్లో ప్రకృతి సౌందర్యానికి ఉనికిపట్టుగా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. ఈ స్వామిని దర్శించుకోవాలంటే 800 అడుగుల ఎత్తున ఉన్న కొండపైకి వెయ్యి మెట్లు ఎక్కాలి. ఈ సహస్ర సోపానాలను విష్ణువు యొక్క వెయ్యి నేత్రాలకు ప్రతీకగా పేర్కొంటారు. ఈ ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని కోరికలు కోరుకుంటే అవి తీరుతాయనేది భక్తుల విశ్వాసం. ఏప్రిల్ 20, 2026 చందనోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
ఆలయ నిర్మాణం క్రీస్తు శకం తొమ్మిదో శతాబ్దంలో జరిగి ఉండవచ్చని, క్రీస్తు శకం 13వ శతాబ్దంలో కోణార్క్ ఆలయ నిర్మాత తూర్పు గాంగరాజు నరసింగదేవుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడని చరిత్రకారులు భావిస్తున్నారు. కళింగ శైలిలో నిర్మించిన ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళ, అందమైన గోపురాలతో భక్తులకు కనువిందు చేస్తుంది. విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని దర్శించి విరివిగా దానాలు చేసినట్టు ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది.
ఈ ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం, రథయాత్ర, భక్త్యోత్సవం, చందనోత్సవం, ఉట్ల వేడుక, గోదా కల్యాణం, తెప్పోత్సవం, డోలోత్సవం మొదలైన ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. వీటిలో చందనోత్సవం భక్తులను విశేషంగా ఆకర్షించే కార్యక్రమం. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ రోజూ నాలుగు వేదాలు, నాలాయిర దివ్య ప్రబంధాలు, పురాణాలను స్వామి సన్నిధిలో పారాయణం చేస్తారు.
శ్రీమహావిష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుడిని వధించాక నరసింహ రూపంలో హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఈ అసురులిద్దరూ సోదరులు. వీరిని వధించడానికి కృతయుగంలో శ్రీహరి వెంటవెంటనే రెండు ఆకృతుల్ని ధరించాడని పురాణాలు చెబుతున్నాయి. సత్యకాలంలో వేదాలను అపహరించిన హిరణ్యాక్షుడిని వధించి, వరాహావతారాన్ని ఉపశమింపచేసే లోపున హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడిని తూర్పు సముద్రంలోకి నెట్టివేశాడట. ప్రహ్లాదుడు నారాయణుడిని శరణువేడాడు. భక్తాభీష్ట వరదుడైన లక్ష్మీవల్లభుడు ప్రహ్లాదుడిని రక్షించాలనే వేగిరిపాటులో వరాహ రూపాన్ని చాలించకుండానే, నృసింహుడిగానూ వ్యక్తమయ్యాడు. వరాహ, నృసింహ ద్వయరూప ఏక విగ్రహంగా, ప్రళయ భీకరంగా, జ్వాలా మాలికలతో చండ ప్రచండమూర్తిగా స్వామి తేజస్సు ప్రకటితమైంది. బ్రహ్మాది దేవతలతో పాటు ప్రహ్లాదుడు ప్రార్థించినా స్వామి ఉగ్రత్వం తగ్గలేదు. దాంతో బ్రహ్మ సూచన మేరకు ప్రహ్లాదుడు, ఇతర దేవతలు చందన లేపనంతో స్వామికి గంధసేవ చేశారు. దీంతో వరాహనృసింహుడు శాంతించాడు. ప్రహ్లాదుడిని ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. చందన చర్చితంగా భాసిల్లుతూ, సింహగిరిపై సదా వర్థిల్లాలని పరమ విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు వేడుకున్నాడు. స్వామి తథాస్తు అన్నాడు.
స్వామికి అక్షయ తృతీయ నాటి చందనోత్సవం నాడు మూడు మణుగుల చందనం, ఆ తరువాత జ్యేష్ఠ పూర్ణిమ నాడు దివ్య చందనోత్సవం పేరిట మూడు మణుగుల చందనం, ఆషాఢ పౌర్ణమి నాడు శ్రీచందనోత్సవం పేరిట మూడు మణుగుల చొప్పున చందనం సమర్పిస్తారు.
హిరణ్యకశిపుడి కుమారుడు, పరమ విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడి కోరిక మేరకు స్వామి ఈ క్షేత్రంలో వెలశాడని, బ్రహ్మ సకల దేవతలతో తరలివచ్చి బ్రహ్మోత్సవాలు నిర్వహించాడని పురాణగాథ.
వైశాఖ శుద్ధ తదియ తిథిని అక్షయ తృతీయ అంటారు. ఆ రోజే (ఏప్రిల్ 20, 2026) సింహాద్రినాథుడి గంథం వొలుపు, నిజరూప దర్శనం, చందనోత్సవంగా ప్రసిద్ధి. నిత్య చందనావృతంగా, లింగాకృతిలో భాసిల్లే స్వామి నిజ మంగళ దివ్య స్వరూపాన్ని ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే, అదీ చందనోత్సవం నాడు కేవలం పన్నెండు గంటలు మాత్రమే భక్తులు దర్శించుకోగలుగుతారు. మిగతా 364 రోజులూ సుగంధ భరిత చందనంతో స్వామి అలంకృతుడై ఉంటాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు సింహాచల చందన యాత్ర పేరిట జరిగే వైభవోపేతమైన వేడుక నేత్రానందం కలిగిస్తుంది. ఈ స్వామిలో ముఖం వరాహానిది. శరీరం నరునిది. తోక సింహానిది. సింహాచల క్షేత్రంలో తప్ప నరహరి మరెక్కడా వాలం (తోక)తో దర్శనమివ్వడు. లక్ష్మీదేవి ఆయన వక్షస్థల వాసి. మూలవిరాట్టుకు ఇరువైపులా శ్రీదేవి, భూదేవి కొలువై ఉంటారు.
పురూరవ చక్రవర్తి ఊర్వశితో గగన మార్గాన విహరిస్తుండగా ఒకచోట విమానం ఆగిపోయింది. స్వామి పురూరవుడికి స్వప్నంలో సాక్షాత్కరించి తాను పుట్టలో ఉన్నట్టు తెలిపాడని, పురూరవుడు అక్కడ మట్టిని తొలగించి సహస్ర కలశ గంగధారతో, పంచామృతాలతో స్వామిని అభిషేకించాడన్నది స్థల పురాణం. ఈ క్షేత్రంలో మొదట ప్రహ్లాదుడే స్వామికి చందనసేవ చేశాడు. అనంతరం సకల దేవతలూ చందనంతో స్వామిని అలంకరించారు. ప్రహ్లాదుడి తదనంతరం కాలక్రమంలో వరాహ నృసింహకృతి మట్టి పుట్టలో నిక్షిప్తమైంది. వేలాది సంవత్సరాల తరువాత పురూరవ చక్రవర్తి అక్షయ తృతీయ నాడు సింహగిరిపై స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని కనుగొన్నాడని, శ్రీగంధంతో స్వామిని పూజించి చందనసేవను
పునరుద్ధరించాడని అంటారు. అలా అప్పటి నుంచి ఏటా అక్షయ తృతీయ నాడు చందనోత్సవం కొనసాగుతోంది. వైశాఖ శుద్ధ విదియ నాటి రాత్రి మూల విరాట్టుకు ఉన్న చందనాన్ని ఒలిచి, తదియ నాటి బ్రాహ్మీ ముహూర్తంలో స్వామికి గంగధార పవిత్ర జలాలతో సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆపై స్వామి నిజరూప దర్శనానికి అనుమతిస్తారు. అక్షయ తదియ నాటి సాయం సంధ్యా సమయంలో మళ్లీ చందనాన్ని స్వామికి సంపూర్ణంగా అలదుతారు. ఇలా ఒలిచిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా అందిస్తారు.
ఈ ఉత్సవానికి సంబంధించి జానపదుల గాథల్లో వేరే విశేషం కనిపిస్తోంది. సింహగిరి దుగ్గన పేరు గల బోయ తెగకు చెందిన వ్యక్తి కొర్రలు, జొన్నలు పండించే వాడు. స్వామికి అక్కడ అవతరించాలనే సంకల్పం కలిగింది. దీంతో వరాహ రూపంలో వెళ్లి ఆ చేను మేస్తుండే వాడు. కొన్నాళ్లు చూసి, దుగ్గన ఆ అడవిపందిని వెంటాడి శూలం విసిరాడు. నెత్తురోడుతూ అది ఓ పుట్టలో దూరింది. దుగ్గన అక్కడకు వెళ్లి చూస్తే వరాహం సొమ్మసిల్లి పడి ఉంది. దాంతో అతడు జాలిపడి ఆ వరాహానికి గంధం తెచ్చి పట్టువేశాడు. ఆ చల్లదనానికి వరాహం తేరుకుని తాను భగవంతుడినని, ఆ పుట్టలోనే ఉంటానని చెప్పాడు. ఈ విషయం క్రమంగా పాలకుల వరకు వెళ్లి ఆలయ నిర్మాణం జరిగిందని చెబుతారు. ఆ బోయడు పూర్వజన్మలో వాలి అని, రామావతారంలో వాలిని కొట్టినప్పుడు మరో అవతారంలో అతడి వల్ల దెబ్బతింటానని వరం ఇచ్చాడని, శ్రీరాముడే వరాహమని, వాలి దుగ్గనగా పుట్టాడని జానపదుల విశ్వాసం.
ఎన్నెన్నో నారసింహ క్షేత్రాలు
దుష్టశిక్షణ, శిష్టరక్షణ నిమిత్తం దశావతారాల్లో నాలుగోదైన నరసింహుడికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఉగ్రనారసింహుడు, కృద్ధ నారసింహుడు, వీర నారసింహుడు, విలంబ నారసింహుడు, కోప నారసింహుడు, యోగ నారసింహుడు, అఘోర నారసింహుడు, సుదర్శన నారసింహుడు, శ్రీలక్ష్మీ నారసింహుడు.. ఈ తొమ్మిది రూపాలను నవ నరసింహ వ్యూహాలని పిలుస్తారు.
శ్రీకదిరిలోని నరసింహస్వామి దేవాలయం ప్రసిద్ధమైనది. హిరణ్యకశిపుడిని సంహరించాక ఈ ప్రాంతానికే నరసింహస్వామి వచ్చాడని, అలా ఆగ్రహావేశాలతో వచ్చిన స్వామి ఇక్కడ అడవిలో క్రూర జంతువులను వేటాడాడని, అందుకే ఆయనను వేటరాయుడు అని అంటారని చెబుతారు. వేటరాయుడు కాస్తా జన వ్యవహారంలో బేట్రాయుడు అయింది.
శ్రీ అహోబిలంలో వెలసిన స్వామి స్వయంభువు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబిలాన్ని అహోబలం అనీ అంటారు. అహోబిలానికి నగరి, నిధి, తక్ష్యాద్రి, శింగవేళ్ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద్ద అహోబిలం, భార్గవ తీర్థం, నవ నారసింహ క్షేత్రం అనే పేర్లున్నాయని పురాణాలు చెబుతున్నాయి. జ్వాలా, అహోబిల, మాలోల, క్రోడ, కారంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన నారసింహులు ఇక్కడి నరసింహస్వామి వారి తొమ్మిది మూర్తులు.
శ్రీ సింహాచలంలో ఏడాదిలో పన్నెండు గంటలు మాత్రమే భక్తులకు నిజరూప దర్శనం ఇచ్చే స్వామి- శ్రీవరాహ లక్ష్మీనరసింహుడు.
శ్రీ కృష్ణానదీ తీరంలోని మంగళగిరి, స్నానాలయ్య, అన్నాలయ్య, దీపాలయ్య, వజ్రాలయ్య అనే అయిదు క్షేత్రాలను కలిపి పంచ నారసింహ క్షేత్రాలని పిలుస్తారు.
మంగళగిరిలోనే మూడు నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. అవి- కొండ కింద శ్రీలక్ష్మీనరసింహస్వామి, కొండపైన పానకాల స్వామి, గిరి శిఖరంపై గండాల నరసింహస్వామి ఆలయాలు. శ్రీలక్ష్మి ఈ కొండపై తపస్సు చేసినందు వల్ల ఇది మంగళగిరి అయింది. లక్ష్మీదేవి ఇక్కడే స్వామికి అమృతాన్ని సమర్పించి కోపాన్ని తగ్గించిందట.
శ్రీ యాదగిరిగుట్టలో యాదర్షి తపస్సుకు మెచ్చి జ్వాలా నరసింహుడు, యోగానంద నరసింహుడు, గండభేరుండ నరసింహుడు, ఉగ్రనరసింహుడు, లక్ష్మీనరసింహ రూపాల్లో భక్తుల పూజలు అందుకుంటున్నాడు.
శ్రీ ప్రకాశం జిల్లాలోని వలేటివారి పాలెం సమీపంలోని నృసింహ క్షేత్రం మాల్యాద్రి. దీనినే మాలకొండ అనీ అంటారు. అగస్త్యుడు ఈ కొండపై తపమాచరించగా లక్ష్మీనారసింహుడు జ్వాలారూపుడై దర్శనమిచ్చాడట.
శ్రీ అంతర్వేది.. హిరణ్యాక్షుడి కుమారుడైన రక్తావలోచనుడి సంహారానంతరం వశిష్ఠుడి కోరిక మేరకు విష్ణువు లక్ష్మీనృసింహ స్వామిగా వెలసిన క్షేత్రం- అంతర్వేది. ఏటా మాఘ మాసంలో ఇక్కడ స్వామి వారి కల్యాణోత్సవం కన్నులపండువగా జరుగుతుంది.
శ్రీ నెల్లూరు జిల్లా రాపూర్‍లో నారసింహుడు చెంచులక్ష్మీ సమేతుడై వెలిశాడు. హిరణ్యకశిపుని సంహారానంతరం శేషాచల కొండల్లో ఉగ్రరూపంలో గర్జిస్తూ తిరుగుతుండగా చెంచులక్ష్మి తారసపడిందని, ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన స్వామి.. శాంతించి ఆమెను పెనవేసుకుని ఇక్కడే శిలారూపంలో వెలిశాడని అంటారు.
నారసింహుని దివ్య దర్శనం నయనానందకరం. నరసింహ కరావలంబం చదివి శరణు వేడితే కష్టాలు మన దరికి చేరవని అంటారు. అలాగే, రుణ విమోచన నారసింహ స్తోత్రం చదివితే అప్పుల బాధలు సమసిపోతాయంటారు. నరసింహుడు ఉగ్రరూపుడైనా భక్తుల మనోభీష్టాలను నెరవేర్చడంలో కరుణా సముద్రుడు.
శ్రీ ధర్మపురి.. పూర్వ కరీంనగర్ జిల్లాలోని ధర్మపురిలో నారసింహుడు యోగానందుడిగా వెలశాడు. ధర్మవర్మ అనే రాజు పేరిట ఈ ప్రాంతానికి ధర్మపురి అనే పేరు వచ్చిందని, ఆయన తపస్సు చేయడం వల్లే స్వామి ఇక్కడ కొలువయ్యాడనేది కథనం. ఇక్కడ యమధర్మరాజు విగ్రహాన్ని ముందుగా దర్శించుకున్న తరువాతే నృసింహుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. ధర్మపురికి పోతే యమపురి ఉండదని ప్రతీతి.
నృసింహుని మకర వేట
చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, సాంస్క•తికంగా వైభవాన్ని సంతరించుకున్న సింహాచల నారసింహ క్షేత్రాన్ని రామానుజులు, కృష్ణమాచార్యులు, చైతన్య మహాప్రభు వంటి మహా పురుషులు దర్శించుకుని తరించారు. కులోత్తుంగ చోళుడు, కృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించి కానుకలు సమర్పించారు. ఉత్తర, దక్షిణ శిల్పకళా రీతులకు ఆలవాలమైన ఈ ఆలయ నిర్మాణం వాద్య సంగీత నాట్యకళల కేంద్రంగా విలసిల్లినట్టు శాసనాల వల్ల తెలుస్తోంది. సింహాచల వరాహ నరసింహస్వామి ఆలయం పశ్చిమాభిముఖంగా నిర్మితమైంది.
చైత్రం నుంచి వైశాఖం వరకు సింహాచల క్షేత్రంలో ఎన్నో ఉత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి. భోగినాడు గోదా కల్యాణం జరుగుతుంది. సంక్రాంతి నాడు ఆలయ స్తంభాలకు అన్నంతో బలివేస్తారు. ఇక్కడి స్తంభాలన్నీ స్వామి వారి బాహువులని, ఒక్కో స్తంభంలో ఒక్కో శక్తి నిక్షిప్తమై ఉంటుందని భక్తులు నమ్ముతారు. అందువల్ల మకర సంక్రాంతి నాడు వాటికి బలిహరణ జరుపుతారు. కనుమ నాడు స్వామి వారి ఉత్సవమూర్తి కొండ మీద నుంచి కిందనున్న గ్రామానికి విచ్చేస్తారు. ముందుగా స్వామి తన సోదరి, సింహాచలం (అడవివరం) గ్రామదేవత శ్రీపైడితల్లి అమ్మవారికి దర్శించి పూలతోటలోకి వచ్చి ‘మకరవేట’ జరుపుతారు. అదే గజేంద్ర మోక్షం. మొసలి ఏనుగును పట్టుకోవడం, ఏనుగు చిరకాల పోరాటం, మొసలి పట్టు నుంచి విడిపించుకోలేక చివరకు ఏనుగు విష్ణువును ప్రార్థించడం, స్వామి వారు దిగివచ్చి చక్ర ప్రయోగంతో మకరాన్ని సంహరించి ఏనుగుకు మోక్షాన్ని ప్రసాదించడం.. ఇది భాగవతంలోని ప్రసిద్ధ వృత్తాంతం. జలాశయంలో బొమ్మ మొసలిని, ఏనుగును పెట్టి మకరాన్ని స్వామి సంహరించినట్టు చూపిస్తారు. ఈ ఉత్సవం అయ్యాక స్వామిని గజవాహనంపైన ఊరేగిస్తారు. ఇక, వైశాఖ శుద్ధ తదియ నాడు నిర్వహించే చందనోత్సవం నేత్రానందకరమే!.





























































































Review సింహాచల స్వామి చందనమయ.