తెనాలి రామలింగం కాళికా దేవి వరం వల్ల గొప్ప కవి అయినాడు. కాని ఏమి లాభం? ఆ రోజుల్లో అంత పెద్ద కవులను ఆదరించగలవారు తెనాలి చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరూ లేరు. ఒక్క విజయనగరం మహారాజు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం తెలుగు కవులను ఆదరిస్తూ ఉండేవారు. ఆ సంగతి తెలిసి రామలింగం ఎన్నో కష్టాలు పడి విజయనగరం చేరుకున్నాడు.
ఇన్ని ప్రయాసలు పడి అక్కడకు చేరుకున్నా రాజుగారి దర్శనం దొరకడం అంత సులభం కాలేదు. ఆయన రాజు ఆస్థానంలోకి ప్రవేశించడం మాట అటుంచి, రాజాస్థానం గుమ్మం వరకు కూడా రామలింగానికి ప్రవేశం దొరకలేదు. రామలింగం అక్కడా ఇక్కడా ఆరా తీసి ఒక విషయం తెలుసుకున్నాడు. రాయల వారి గురువు గారైన తాతాచార్యుల వారిని పట్టుకుంటే రాజాస్థానంలోకి సులభంగా ప్రవేశించవచ్చని ఎవరో చెప్పారు. దాంతో రామలింగం ఆనాటి నుంచి తాతాచార్యుల వారి వద్దకు చేరి ఆయనకు సేవ చేయడం మొదలుపెట్టాడు. ఇలా మూడు మాసాలు శ్రమపడ్డాడు. అయినా ఆచార్యుల వారి అనుగ్రహం లభించలేదు.
‘నీ బోటి కుర్రాళ్లకు రాజు గారి దర్శనమేమిటి? నీ కవిత్వం వారికి వినిపించడమేమిటి? వారు వినడమేమిటి?’ అని తాతాచార్యులు నవ్వారు.
దీంతో రామలింగానికి విసుగు పుట్టింది. తాతాచార్యుల వారి ద్వారా కూడా రాజ దర్శనం దుర్లభమని తెలిసిపోయింది. ఇక, సొంతంగా ఏదో మార్గం ఆలోచించి రాయల వారి దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఒకనాడు ఆస్థానం బంట్రోతుకు లంచం ఇస్తానని ఆశపెట్టి దర్బారులోకి ప్రవేశించాడు. ఆ సమయంలో రాజు గారి దర్బారులో పెద్ద వేదాంత చర్చ జరుగుతోంది.
ఒక పండితుడు ఈ ప్రపంచమంతా మిథ్య అనీ, మనం చేసేదంతా కల్పితమనీ చెబుతున్నాడు.
సభలో ఉన్న వారంతా ఆశ్చర్యంతో నోళ్లు తెరుచుకుని వింటున్నారు.
ఆయన ఉపన్యాసం చాలించి కూర్చోగానే, ఇదే అదనుగా భావించిన రామలింగం లేచి, ‘స్వామీ! మనం ఇప్పుడు చేస్తున్నవన్నీ చేస్తున్నామని అనుకోవడమే కదా!’ అని అడిగాడు.
ఆయన ‘అవును. అంతే’ అన్నాడు.
‘అయితే స్వామీ! మహారాజు గారు ఇప్పుడు మనకు భోజనాలు పెట్టిస్తారు కదా! మీరు తినకుండా మానుకోండి. ఈ ప్రపంచం మిథ్య కాదనుకునే మా బోటివాళ్లం కొంతమందిమి మాత్రం భోజనం చేస్తాం’ అన్నాడు రామలింగం.
సభలో ఉన్న వారంతా గొళ్లున నవ్వారు. పాపం ఆ వేదాంతి చిన్నబోయాడు. రాయల వారు రామలింగం సమయస్ఫూర్తికి మెచ్చుకుని తన ఆస్థానంలో అతడికీ చోటిచ్చారు.
ఎలాగైనా రాజాస్థానంలో చోటు సంపాదించాలనే రామలింగం కోరిక ఆ విధంగా నెరవేరింది. ఇక తాతాచార్యుల వారిని ఎలా పట్టాలా? అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే రాజాస్థానంలో చోటు కల్పిస్తానని చెప్పి సేవలన్నీ చేయించుకుని, పని చేసి పెట్టకపోగా, తనను వెక్కిరించడం రామలింగడికి కోపం తెప్పించింది. అందుకు బదులు తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయం రానే వచ్చింది.
తాతాచార్యుల వారికి తెల్లవారుజామునే లేచి తుంగభద్ర నదికి వెళ్లి స్నానం చేయడం అలవాటు. ఈ సంగతి రామలింగం తెలుసుకున్నాడు.
ఒకరోజున తాతాచార్యుల వారు నదిలో స్నానం చేస్తున్నారు. ఆయన బట్టలు విడిచి ఒడ్డున దాచారు. వాటిని రామలింగం ఎవరూ చూడకుండా దాచిపెట్టాడు.
ఆచార్యుల వారు స్నానం చేసి ఒడ్డుకు వచ్చి చూసుకుంటే వస్త్రాలు లేవు. సరిగ్గా రామలింగం అప్పుడే ఏమీ తెలియని వాడిలాగా ఒక వేపు నుంచి వచ్చి, ఆచార్యుల వారిని పలకరించాడు.
రామలింగాన్ని చూసే సరికి ఆచార్యుల వారికి పై ప్రాణాలు పైనే పోయాయి. తన ఒంటిపై వస్త్రాలు లేకపోవడంతో సిగ్గుతో కుంచించుకుపోయారు. బహుశా తన బట్టలు కనిపించకుండా పోవడమనేది రామలింగం చేసిన పనే అయి ఉంటుందని ఆయన అనుమానించారు. వెంటనే తన వస్త్రాలు తనకు ఇవ్వాలని బతిమాలే ధోరణిలో ఆచార్యులు అడిగారు. రామలింగం ఆయన చేత చాలాసేపు బతిమాలించుకుని ఆఖరికి ఒక షరతు మీద గుడ్డలు ఇవ్వడానికి అంగీకరించాడు. అదేమిటంటే- తాతాచార్యుల వారు రామలింగాన్ని ఆ తుంగభద్ర నది తీరం నుంచి ఊళ్లో వరకు మోయాలి.
ఏం చేస్తారు పాపం! ఆచార్యుల వారు విధిలేక అందుకు అంగీకరించారు. అప్పటికి తూర్పు బాగా తెల్లవారింది. రామలింగాన్ని తాతాచార్యులు తన భుజాల మీదికి ఎక్కించుకుని ఊళ్లోకి తీసుకెళ్లడానికి బయల్దేరారు. ఎవరూ చూడకుండానే రామలింగాన్ని ఊళ్లో దింపాలనేది ఆయన తాపత్రయం. కానీ, అప్పటికే ఊళ్లోని వారంతా నిద్ర లేచారు. తాతాచార్యుల వారు రామలింగాన్ని భుజాల మీదికి ఎక్కించుకుని పరుగెత్తుతూ రావడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. అదే సమయంలో రాయల వారు కూడా తన అంతపురం నుంచి మిద్దె మీదకు చేరుకుని ఈ దృశ్యాన్ని చూశారు.
తాతాచార్యుల వంటి పెద్ద మనిషి రామలింగాన్ని మోసుకుని రావడాన్ని చూసి రాయల వారికి చాలా కోపం వచ్చింది. వెంటనే బంట్రోతులను పిలిచి, ‘మీరు వెళ్లి ఆచార్యుల వారి పైకి ఎక్కి కూర్చున్న వాడిని కిందకు దించి తన్నుకుంటూ తీసుకురండి’ అని ఆజ్ఞాపించారు.
రాయల వారి బంట్రోతులు తనను సమీపించడంతోనే వారు తనను పట్టుకుంటారని అనుకున్నాడు రామలింగం. తనను పట్టుకోవడానికే వారు వస్తున్నారని గ్రహించాడు. పైగా వారు వస్తున్న తీరు గమనించిన రామలింగం వారి చేతిలో తనకు దేహశుద్ధి తప్పదని కూడా తెలుసుకున్నాడు.
అతనికి వెంటనే ఒక ఉపాయం తట్టింది.
తాతాచార్యుల వారి భుజం మీద నుంచి కిందకు దిగి, ‘స్వామీ! మీ చేత నేను తెలియక మోయించుకోవడం వల్ల నాకెంతో పాపం చుట్టుకుంది. మళ్లీ మిమ్మల్ని అలాగే మోస్తే తప్ప ఆ పాపం పోదు. దయ ఉంచి నా భుజాల మీదికి ఎక్కి కూర్చోండి. మోస్తాను’ అని బతిమలాడాడు.
పాపం ఆచార్యుల వారు ఇది నమ్మి రామలింగం భుజాల మీదికి ఎక్కి కూర్చున్నారు. అంతలో రాజభటులు అక్కడకు చేరుకున్నారు. వారికి మధ్యలో జరిగిన ఈ మార్పిడి వ్యవహారం గురించి ఏమీ తెలియదు. రాయల వారు ఆ మోస్తున్న వాడి భుజాల మీద ఉన్న వాడిని ఈడ్చుకుని రమ్మనడమే తెలుసు. అందుకే రామలింగం భుజాల మీద ఉన్న తాతాచార్యుల వారిని ఒక్క ఉదుటున కిందకు లాగారు. ఆయనను బాదుకుంటూ, బాదుకుంటూ రాజాస్థానానికి తీసుకువచ్చారు. ‘నేను రాయల వారి గురువు గారిని’ అని ఆయన ఎంత మొత్తుకున్నా వారు వినలేదు.
ఆయనను అలా బాదుకుంటూ తీసుకువచ్చిన భటులు రాయల వారి ఎదుట నిలబెట్టారు. రాయల వారికి తన గురువు గారి అగచాట్లు చూసే సరికి మరింత కోపం వచ్చింది. జరిగిందంతా చెప్పి తాతాచార్యులు రాయల వారికి విన్నవించారు. రామలింగం తన తెలివితో ఇదంతా చేశాడని రాయల వారు గ్రహించారు. ఆయన కోపం నషాళానికి అంటింది. వెంటనే రామలింగాన్ని పట్టుకుపోయి ఏనుగుల చేత తొక్కించాలని ఆజ్ఞాపించారు. దీంతో రామలింగానికి తగిన శాస్తి జరిగిందని తాతాచార్యులు సంతోషించారు. ఈ విధంగా రామలింగంపై ఆయన కడుపుమంట చల్లారింది.
కానీ, రామలింగం ఏమైనా తక్కువ వాడా? రాయల వారి ఆజ్ఞ బారిన పడకుండా చావకుండా ఎలా తప్పించుకున్నాడో వచ్చే సంచికలోని కథ ద్వారా తెలుసుకుందాం.

























































































































































































































































































































































































































Review తెనాలి రామలింగం తెలివి.