ఇండియాలో డాక్టర్ కోర్సు పూర్తయితే.. వెంటనే ఏదైనా పట్టణానికో, నగరానికో వెళ్లిపోయి క్లినిక్‍ను ప్రారంభిస్తారు. నగర ప్రాంతాల్లో అయితే వైద్యానికి బాగా గిట్టుబాటు అవుతుందనేది చాలామంది అభిప్రాయం కావచ్చు. కానీ, ఆయన పక్కా పల్లెటూరు మనిషి. గ్రామాల గుండెచప్పుడు విన్న.. గ్రామీణుల మనసెరిగిన వైద్యుడు. ఆంధప్రదేశ్‍లో చదువుకుని అమెరికాలో అడుగుపెట్టినా.. ఆయన తన మూలాలను మరిచిపోలేదు. అందుకే అమెరికాలో కూడా ఆయన ఇరవై సంవత్సరాలుగా జార్జియా డగ్లస్ ఏరియాలోనే ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. అక్కడి గ్రామీణ వాతావరణం, అక్కడి మనుషుల ఆప్యాయత తనను కట్టిపడేస్తున్నా యని చెబుతున్నారు డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ. త్వరలో ‘ఆపి’ (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఇండియాన్ ఆలిజన్) ప్రెసిడెంట్ కాబోతున్న ఆయనకు పదవులపై కంటే బాధ్యతలు నిర్వర్తించడంపైనే శ్రద్ధ ఎక్కువ. వైద్యాన్ని ఎంత శ్రద్ధగా, బాధ్యతగా చేస్తారో.. తనపై ఉన్న ఇతర బాధ్యతలను అంతే శ్రద్ధగా నిర్వర్తిస్తారు. తనకు తెలియకుండానే ఎందరికో ఎన్నో విధాలుగా సహాయపడుతుంటారు. కానీ, దానిని అదేదో గొప్ప ‘సేవ’ కింద భావించరు. సేవ చేయడాన్ని కూడా ఆయనొక బాధ్యతగా ఫీలవుతారు. జీవితంలో అదీ ఒక భాగమని అంటారు. త్వరలో ‘ఆపి’ కన్వెన్షన్ జరగనున్న వేళ ఆయన ‘ఆపి’ వైస్ ప్రెసిడెంట్‍గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలో ఏపీకి చెందిన మొదటి ప్రెసిడెంట్ ఘనతను సాధించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘తెలుగు పత్రిక’తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆయన కెరీర్, జీవిత విశేషాలు ఆయన మాటల్లోనే.
అమెరికా ప్రస్థానం..
అమెరికా వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాలకు పైనే అవుతోంది. జార్జియాలో గత ఇరవై ఏళ్లుగా ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాను. 1980లో కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసిన అనంతరం పశ్చిమ ఆఫ్రికాలోని నైజీరియాలో మెడికల్ ఆఫీసర్‍గా కొంత కాలం పనిచేశాను. అనంతరం ఆస్ట్రియాలోని వియన్నాలో సర్జికల్ డిప్లొమా ఫెలోషిప్ చేశాను. తరువాత అమెరికాకు వచ్చి పిట్స్బర్గ్ యూనివర్సిటీలో రెసిడెన్షియల్ పోగ్రామ్‍ను చేశాను. అక్కడే గల వివిధ వైద్యవిద్యా సంస్థల్లో కొంత కాలం పనిచేశాను. అక్కడి నుంచి జర్మనీలోని హాంబర్గ్ వెళ్లి.. థెరఫీ అండ్ ఎండోస్కోపీ ఫెలోషిప్ చేశాను. ఇది పూర్తయ్యాక నేను, జార్జియాలో డగ్లస్ ప్రాంతాన్ని నా ప్రాక్టీస్ ఏరియాగా ఎంచుకున్నాను. డగ్లస్ గ్రామీణ ప్రాంతం. ఇక్కడ చిన్న చిన్న కమ్యూనిటీలు చాలా ఉన్నాయి. అంతా మంచి వాతావరణం. మంచి మనస్తత్వాలు గల ప్రజలు. వీరందరితో పాటు నేను పనిచేసే చోట హాస్పిటల్ ప్రెసిడెంట్, సిబ్బంది, సహచరుల సహకారంతో నా కెరీర్‍లో సక్సెస్ అయ్యాను. ఇక్కడి కమ్యూనిటీ కూడా నాకు మంచి సపోర్ట్ను అందించింది.
కుటుంబ నేపథ్యం..
నేను వైద్యుల కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాను. నాన్న గారి పేరు డాక్టర్ వీరాస్వామి. ఆంధ్రా మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్‍లో ప్రొఫెసర్‍గా పనిచేశారు. తరువాత అప్పట్లో కొత్తగా ప్రకాశం జిల్లా ఏర్పాటవగా, ఆ జిల్లాకు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంఅండ్‍హెచ్‍ఓ)గా పనిచేశారు. అనంతరం మెడికల్ అడిషనల్ డైరెక్టర్‍గా పదోన్నతి పొంది.. అదే హోదాలో పదవీ విరమణ చేశారు. అమ్మ గారు ఉపాధ్యాయురాలు. ఎంఏ బీఈడీ చేశారు. పేరు సత్యవతి. పెద్దన్నయ్య ఈఎన్‍టీ సర్జన్. ఆయనతో పాటు ఆయన భార్య కూడా మైక్రోబయాలజీ ప్రొఫెసర్‍గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు స్కూలులో పనిచేస్తున్నారు. నేను మా కుటుంబంలో రెండో వాడిని. నా తరువాత సోదరుడు తిరు పతిలో ప్రస్తుతం డెర్మటాలజిస్టుగా పని చేస్తున్నారు. ఆయన భార్య గైనకాల జిస్టు. తరువాత తమ్ముడు ఎంఎస్ జెనెటిక్స్ చేసి.. కుటుం• వ్యాపారంలో స్థిరపడ్డారు. ఆయన భార్య లాయర్. మాకో సోదరి. ఆమె టీచర్.
నేను.. నా విద్యాభ్యాసం..
నా ప్రాథమిక విద్య అంతా గుంటూరు జిల్లా నరసారావుపేటలోనే కొనసాగింది. అక్కడే అమ్మ ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఆమె పనిచేసే స్కూలులోనే నా ప్రాథమిక విద్యాభ్యాసం నడిచింది. ఆ సమయంలో నాన్నగారు నాగార్జునసాగర్ డ్యామ్ మెడికల్ ఆఫీసర్‍గా ఉండేవారు. అనంతరం గుంటూరులోని జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. తరువాత తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ మెడిక్ కాలేజీలో మెడిసిన్ చేశాను. మళ్లీ గుంటూరు చేరుకుని హౌస్ సర్జన్‍గా, సీనియర్ హౌస్ సర్జన్‍గా పనిచేశాను. అక్కడి నుంచి నైజీరియా, యూఎస్‍లలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెలోషిప్, ఇంటర్నల్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ కోర్సులను ప్రాక్టీస్ చేస్తూనే పూర్తి చేశాను.
వివాహం.. సంతానం..
యూఎస్‍లో ఫెలోషిప్ కాగానే గుంటూరు తిరిగి వచ్చేశాను. ఆ సమయంలోనే గుంటూరుకు చెందిన డాక్టర్ ఉమామహేశ్వరితో నాకు వివాహం అయ్యింది. మా అబ్బాయి పేరు వీరేన్.. మిడిల్ నేమ్ సాయిరామ. నేను సాయి భక్తుడిని. అందుకే మా తండ్రి గారి పేరు, సాయి పేరు కలిసి వచ్చేలా పెట్టుకున్నాను. ప్రస్తుతం 23 ఏళ్ల వీరేన్ మెడిసన్ సెక•డ్ ఇయర్ చేస్తున్నాడు.
అమెరికా ఎలా వెళ్లానంటే..
నిజానికి నేను అమెరికాలో స్థిరపడాలని అనుకోలేదు. అనుకోకుండా ఒక ఆహ్వానంపై నేను మొదట అమెరికా వెళ్లాను. ఫెలోషిప్ రిసెర్చ్ చేసేందుకు అమెరికా నుంచి ఆహ్వానం అందింది. బ్రూక్లిన్ మెడికల్ సెంటర్‍లో వాస్క్యులర్ రిసెర్చ్ చేసేందుకని వెళ్లాను. అది పూర్తయిన అనంతరం అమెరికా ప్రజల జీవన విధానం, సంస్క•తి, మంచి విద్యా విధానం.. ఇవన్నీ చూసి అమెరికాలో సెటిల్ కావాలనే కోరిక కలిగింది.
యూఎస్‍లో ఫెలోషిప్ కాగానే గుంటూరు తిరిగి వచ్చేశాను. ఆ సమయంలోనే గుంటూరుకు చెందిన డాక్టర్ ఉమామహేశ్వరితో నాకు వివాహం అయ్యింది. మా అబ్బాయి పేరు వీరేన్.. మిడిల్ నేమ్ సాయిరామ. నేను సాయి భక్తుడిని
కెరీర్‍లో మరిచిపోలేని అనుభవం..
ఒక వైద్యుడిగా ఎందరికో చికిత్స అందించాను. అందరూ కృతజ్ఞత కలిగి ఉంటారు. నా పై నమ్మకంతో, నా వద్దకు వచ్చిన రోగులకు మంచి వైద్యం అందించి..వారికి కొత్త జీవితాన్ని ఇవ్వడం వైద్యుడిగా నా ధర్మం. నా ధర్మాన్ని నేను వంద శాతం అంకితభావంతో నిర్వర్తిస్తాను. ఫలితంగా ఎందరెందరో కొత్త జీవితాలను పొంది కృతజ్ఞతలు చెప్పేవారు. ఇటువంటివి నా కెరీర్‍లో చాలా సంఘటనలు ఉన్నాయి. అయితే, ఒక ఉదంతం మాత్రం ఎప్పటికీ నాకు ప్రత్యేకం.
నేను లివర్ స్పెషలిస్టును. డగ్లస్ చుట్టుపక్కల వందల మైళ్ల దూరం నుంచి ఎంతోమంది నా వద్దకు వైద్యం కోసం వచ్చే వారు. ఒకరోజు ఒక హెపటైటిస్ ‘సీ’ పేషంట్ తీవ్రమైన రక్తపు వాంతులతో నా వద్దకు వచ్చాడు. అతను సరోసిస్‍తో కూడా బాధపడుతున్నారు. ఎడతెగని బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటున్నాడు. నిజానికి ఆ రోజు సాయంత్రం నేను వీకెండ్ మూడ్‍లో ఉన్నాను. అంతలో ఇతని గురించి ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే అతనున్న ఇంటెన్సివ్ కేర్‍కు వెళ్లాను. అప్పటికే అతని కడుపు అంతా రక్తంతో నిండిపోయింది. ఒక బెలూన్‍తో దాన్నంతా మొదట శుభ్రం చేశాను. అనంతరం లివర్‍ను శుభ్రపరిచి లివర్ ప్లాంటేషన్ చేశాను. దీంతో రక్తస్రావం తగ్గింది. అతను కోలుకున్నాక నాకు కృతజ్ఞత తెలిపిన తీరును ఎప్పటికీ మరువలేను.
భారత్-అమెరికాలో వైద్యవిద్య తీరుతెన్నులు..
భారత్‍లో వైద్యవిద్యా విధానం బాగానే ఉంది కానీ, ఇంకా మెరుగు పడాలి. వైద్యవిద్యలో పోటీ కూడా ఎక్కువ. అమెరికాలో అలా కాదు. అందరూ పోటీలో నిలుస్తారు.. గెలుస్తారు. అలాగే ఏ స్పెషలైజేషన్ కావాలో ఎంచుకునే స్వేచ్ఛ కూడా అమెరికాలో ఎక్కువ. భారత్‍లో వైద్యవిద్య తీరుతెన్నులను ‘ఆపి’ తరపున మార్చాలని నడుం కట్టాం. అందులో భాగంగా ఇటీవలే భారత వైద్య మంత్రికి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్‍కు ఒక లేఖ కూడా రాశాం. ముఖ్యంగా భారత్‍లో ఎమర్జెన్సీ రూమ్ ట్రీట్‍మెంట్, ఫ్యామిలీ మెడిసిన్ పోగ్రామ్స్ పెంచాలని కోరాం. వాస్తవానికి గ్రామీణ భారతంలో వైద్యుల ప్రాక్టీసింగ్ పెరగాలి. కానీ, ఇందుకు స్టేట్ బడ్జెట్ కావాలి. ఆయా రాష్ట్రాల సపోర్ట్ కూడా లభించాలి. ఇవి లేని కారణంగా గ్రామ ప్రాంతాల్లో ప్రాక్టీస్‍కు వైద్యులు వెనుకాడుతున్నారు. త్వరలోనే మా విజ్ఞప్తి కార్యరూపం దాలుస్తుందని, ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నేను ఆ మార్పును చూస్తాననే ఆశాభావంతో ఉన్నాను.
ప్రస్తుతం భారత్‍లోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ రూమ్ ఫెలోషిప్‍పై శిక్షణనిస్తున్నారు. కానీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇటువంటి పరిస్థితి లేదు. అందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి.
ఎమర్జెన్సీ రూమ్ ట్రీట్‍మెంట్ అంటే..
రెండు విషయాల్లో భారత్‍లో వైద్యం తీరుతెన్నులు మారాల్సి ఉంది. ఒకటి- ఉదాహరణకు ఒక హృద్రోగి గుండెనొప్పితో ఆస్పత్రికి వస్తే అతనికి వెంటనే అత్యవసర చికిత్స అందించాలి. ఆ చికిత్స అందించడానికి అక్కడ ఎమర్జెన్సీ రూమ్ ట్రైన్డ్ డాక్టర్ ఉండాలి. ఇది చాలా ముఖ్యం. అటువంటప్పుడే పేషంట్‍కు జీవితాన్ని ఇవ్వగలం.
రెండోది ప్రమాదవశాత్తూ ఇంట్లో ఎవరైనా పడిపోతే.. తీవ్ర గాయాలైతే.. అతనికి మొదటి పది నిమిషాల్లో చికిత్స అందించడం చాలా ముఖ్యం. ఇటువంటి అత్యవసర చికిత్స అందించే వ్యవస్థ భారత్‍లో లేదు.
అత్యవసర వైద్యం కోసం వచ్చిన వారికి ఛాతీ పరీక్షలు నిర్వహించాలి. గుండె తిరిగి క్రమబద్ధంగా కొట్టుకునేలా చేయాలి. ఇవన్నీ చేయడానికి నిపుణుడైన వైద్యుడు అత్యవసర విభాగాల్లో ఉండాలి. అలాంటి పరిస్థితిలో ఒక రోగికి కొత్త జీవితాన్నిచ్చే పరిస్థితి లేకుంటే ఎలా?
అయితే, ఇండియాలో ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎనస్థీషియన్స్, తానా వారు కలిసి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి, పారా మెడిక్స్కు, విద్యార్థులకు మంచి శిక్షణ, అవగాహన కలిగించే ప్రయత్నం చేపట్టారు. అత్యవసర చికిత్సపై వీరు అవగాహన కలిగిస్తున్న తీరు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కార్యక్రమాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కొనసాగుతున్నాయి. ఈ ప్రయత్నాలకు ‘ఆపి’ పూర్తి మద్దతునిస్తోంది.
‘ఆపి’ లక్ష్యం..
మా గోల్ ఏమిటంటే.. భారత్‍లో ఏటా వైద్యవిద్య పూర్తి చేస్తున్న వైద్య విద్యార్థులకు మొదటి వారంలోనే బేసిక్ లైఫ్ స్కిల్స్పై అవగాహన కలిగించాలి. శిక్షణనివ్వాలి. భారత్‍లో ఈ దిశగా పరిస్థితి మెరుగుపడితే వైద్యం విషయంలో శిఖరాగ్రాన నిలుస్తుంది. అత్యవసర సమయంలో వచ్చిన రోగులకు చెస్ట్ పనితీరు, గాలి ఊపిరితిత్తుల్లోకి ఎలా వెళ్తుంది? అనేది పరిశీలించాలి. ఇక చెస్ట్ కంప్రెషన్‍కు సంబంధించి కార్డియో లైఫ్ సపోర్ట్ పోగ్రామ్స్పై వైద్యవిద్య నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే శిక్షణ ఇవ్వాలి. ప్రస్తుతం భారత్‍లో ఇది లేదు. ఇండియన్ మెడికల్ అనస్థీషియన్స్ మాత్రం ఈ దిశగా ప్రయత్నాలైతే చేస్తున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్‍లైన్స్తో సమానంగా మార్గదర్శకాలను తయారు చేసి ఈ తరహా శిక్షణకు మార్గం సుగమం చేస్తున్నారు. అవి అమలైతే ఫలితం బాగుంటుంది. హృద్రోగుల సర్వైవల్ రేట్ పెరుగుతుంది. ఇది త్వరలోనే సాకారం కావాలని ఆశ.
భారత్‍లో వైద్యవిద్య తీరుతెన్నులను ‘ఆపి’ తరపున మార్చాలని నడుం కట్టాం. అందులో భాగంగా ఇటీవలే భారత వైద్య మంత్రికి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్‍కు ఒక లేఖ కూడా రాశాం. ముఖ్యంగా భారత్‍లో ఎమర్జెన్సీ రూమ్ ట్రీట్‍మెంట్, ఫ్యామిలీ మెడిసిన్ పోగ్రామ్స్ పెంచాలని కోరాం.
నా సక్సెస్‍కు కారణం..
నేను చిన్నప్పటి నుంచి చదువులో మరీ బాగా చురుకు కాకపోయినా బాగా యాక్టివ్‍గా ఉండేవాడిని. నాన్నగారు నేను గుంటూరులోనే ఉండాలని అనేవారు. కానీ, నేను వినలేదు. మా ఇంట్లో మా అన్నయ్య బాగా చదివే వారు. నాది చిన్నప్పటి నుంచీ చాలెంజింగ్ మెంటాలిటీ. అన్నయ్యతో సమానంగా నేనూ చదువుతానని అనేవాడిని. అన్నట్టే నేను గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కాగానే, నాన్నగారు పిలిచి ‘నువ్వు సాధించావ్’ అన్నారు. నేను బాగా చదువుకోవాలనే నా కోరికకు మా తల్లిదంద్రులే ఇన్‍స్పిరేషన్. వారు జీవితంలో బాగా కష్టపడ్డారు. సాధారణంగా భారతీయ మధ్య తరగతి కుటుంబాలు పిల్లల చదువులపైనే ఎక్కువ దృష్టి పెడతాయి. మాదీ మధ్య తరగతి కుటుంబమే. కాబట్టి బాగా చదువుకుని జీవితంలో మంచిగా స్థిరపడాలని అమ్మానాన్న చెప్పే వారు. పెళ్లికి ముందు వరకు నా సక్సెస్‍కు కారణం నా తల్లిదండ్రులే. పెళ్లి తరువాత.. నేను అమెరికాలో ప్రాక్టీస్‍లో తలమునకలైపోతే.. నా సతీమణి కుటుంబ బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. నేను పనిచేసే చోట తలెత్తే సమస్యలు, ఇంటా బయటా అన్ని అంశాలను ఆమె మేనేజ్ చేస్తారు. కాబట్టి నేను నా ప్రొఫెషన్‍లో మరింతగా లీనం కావడానికి ఆస్కారం కలిగింది. ఈ విధంగా నా సక్సెస్‍లో నా భార్య కూడా భాగస్వామి.
అమెరికా – భారతీయ విద్యావిధానాలు
భారత్‍లో వైవిధ్యం తక్కువ. చదువుల్లో వైవిధ్యం ఎంతగా ఉంటే ఆ విద్యార్థులు అంతగా రాణిస్తారు. యూఎస్‍లో స్టూడెంట్స్ను ఏదైనా క్వశ్చన్ అడిగితే వారిచ్చే సమాధానం భిన్నంగా ఉంటుంది. అది ఆయా అంశాలపై వారికి చిన్ననాటి నుంచే ఉన్న అవగాహన ఫలితం. ఇక్కడి విద్యార్థి ఏదైనా జనరల్‍గా మాట్లాడతాడు. సాధారణ విజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. భారత్‍లో విద్యా విధానమంతా టన్నెల్ సిస్టమ్. ఒక మూసలో కొనసాగుతోంది. పిల్లలు, తల్లిదండ్రులు అంతా ఇంజనీరింగ్, మెడిసిన్ చుట్టూనే తిరుగుతున్నారు.
అమెరికా విద్యా విధానం ఎంత గొప్పదో ఒక ఉదాహరణ చెబుతాను. మా అబ్బాయి కిండర్‍గార్డెన్ చదివే సమయంలో ఒకసారి క్లాస్ టీచర్ ఫోన్ చేసి స్కూల్‍కు రమ్మన్నారు. స్టెతస్కోప్ పనితీరుపై పిల్లకు అవగాహన కలిగించాలని, అదెలా పని చేస్తుందో చెప్పాలని చెప్పారు. ఆశ్చర్యం.. ఆ వయసులో పిల్లలకు స్టెతస్కోప్ గురించి వివరించడం! మన దగ్గర ఇటువంటిది అసలు ఊహించగలమా? కనీసం ఐదో తరగతిలోకి వచ్చే వరకు కూడా భారతీయ విద్యార్థులకు స్టెతస్కోప్ గురించి తెలియకపోవచ్చు. అమెరికాలో విద్యార్థులకు ఇలా పలు విషయాలపై చిన్నప్పటి నుంచే ఇంటరాక్షన్ ఉంటుంది. కాబట్టి వారికి సహజంగానే జనరల్ నాలెడ్జ్ ఎక్కువ.
‘ఆపి’లో నా భాగస్వామ్యం..
2006లో నేను ‘ఆపి’లో చేరాను. జార్జియా చాప్టర్ సెక్రరీగా ఉండేవాడిని. ఏటా జరిగే యాన్యువల్ కన్వెన్షన్స్లో చివరిలో కూర్చునేవాడిని. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇతర బాధ్యులు ఆ కన్వెన్షన్ నిర్వహణ బాధ్యతల్లో తలమునకలైన తీరు చూసి ‘నేను వారిలా పనిచేయాలి’ అనుకునే వాడిని. నేను వైద్యుడిగా మొదటి నుంచీ పూర్తిగా జార్జియా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన కారణం కావచ్చు, మరేదైనా కావచ్చు.. ఇటువంటి బాధ్యతలు మనకు సరిపడవని అనుకునే వాడిని. ఈ కారణంగానే నాకు ఇతర రాష్ట్రాల ‘ఆపి’ బాధ్యులతో అంతగా కనెక్టివిటీ ఉండేది కాదు. లీడర్లతో పరిచయాలు ఉండేవి కావు. అయితే ఒకసారి స్నేహితుడు శ్రీని గంగసాని.. ‘ఇంత ఎనర్జీ పెట్టుకుని అలా ఉండిపోతున్నావేంటి? నువ్వు ఆపిలో కీ రోల్ పోషించాలి.. రా’ అన్నారు. అలాగే, ఇతర మిత్రులు డాక్టర్ పులిపాక రావు, డాక్టర్ భీమేశ్వరరావు, డాక్టర్ మనూష వంటివారు ‘ఆపి’లో బాధ్యతలు నిర్వహించాలని ప్రోత్సహించారు. అదే సమయంలో ఫ్లోరిడా – జార్జియా – నార్త్ కరోలినా.. ఈ మూడు రాష్ట్రాలు కలిపి ‘ఆపి’కి ఒక రీజియన్ కాగా, నన్ను ఈ రీజియన్‍కు డైరెక్టర్‍ను చేశారు. ఆ సమయంలో కొన్ని కార్యక్రమాలు చేశాను. రెండో ఏడాది అదే హోదాకు ఎన్నికలు జరగగా, నాకు గట్టిపోటీ ఎదురైంది. దీంతో నాలో పట్టుదల పెరిగింది. తరువాత ఏడాది ‘ఆపి’ బోర్డు ఆఫ్ ట్రస్టీగా ఎన్నికయ్యాను. డాక్టర్ జయేష్‍షా, డాక్టర్ నరేంద్రకుమార్ తదితరుల సహకారంలోమూడేళ్ల పాటు ఆ హోదాలో ఉన్నాను. తరువాత ట్రెజరర్‍గా పోటీచేసి.. ఆరు ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఆ తరువాత వరుసగా సెక్రరీగా, వైస్ ప్రెసిడెంట్‍గా గెలిచాను. ‘ఆపి’ అనేది అత్యంత శక్తివంతమైన అసోసియేషన్. ఎందరెందరో ఫిజీషియన్ ప్రముఖులు ఇందులో ఉన్నారు. ఈ అసోసియేషన్‍లో లైఫ్ మెంబర్స్ పన్నెండు వేల మంది, జనరల్ మెంబర్స్ పదివేల మంది వరకు ఉన్నారు. అమెరికాలోని ప్రతి ఏడుగురులో ఒకరు ఇండియన్ ఆరిజిన్ ఫిజీషియన్లనే వైద్యం కోసం ఆశ్రయిస్తుంటారు. ఇది మనకు గర్వ కారణం. అలాగే, ఏటా జరిగే ఆపి కన్వెన్షన్ల వల్ల అభిప్రాయాలు, ఆలోచనలు ఎక్స్చేంజ్ అవుతాయి. పరిచయాలు కలుగుతాయి. వైద్య రంగంలో చోటుచేసుకుంటున్న మార్పు లపై అవగాహన కలుగుతుంది. తెలుగు వారు ఐదుగురు గతంలో ‘ఆపి’ ప్రెసిడెంట్‍గా చేశారు. ప్రస్తుతం వైస్ ప్రెసి డెంట్‍గా ఉన్న నేను ఆంధప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తొలి వ్యక్తిగా తొలి ప్రెసిడెంట్ కాబోతున్న ఘనత సాధించబోతున్నా. అలాగే తెలంగాణ నుంచి డాక్టర్ సురేశ్‍రెడ్డి ఆ ఘనత సాధించబోతున్నారు. తెలుగు మెంబర్స్ ఆపిలో రెండువేల మంది వరకు ఉన్నారు. వీరంతా కలిసి కట్టుగా ఉంటారు కాబట్టే మన వాళ్లు గెలవగలుగుతున్నారు. ఆపిలో ఇక ముందు కూడా లీడర్‍షిప్ కంటిన్యూ చేస్తాం. అయితే ఇంకా మెంబర్‍షిప్ పెరగాలి. అమెరికాలోని ఇండియన్ ఆరిజిన్ ఫిజీషియన్స్ మాత్రమే ఆపిలో మెంబర్స్ కాగలరు. అమెరికాలో లైసెన్స్ ఉన్న ఫిజీషియన్స్కే ఈ అవకాశం ఉంటుంది.
‘ఆపి’ భవిష్యత్తు కార్యక్రమాలు..
ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్‍గా ఏడాది టర్మ్ ఉంది. 2020 జూలై నుంచి జూన్ 2021 వరకు ప్రెసిడెంట్‍గా బాధ్యతలు చేపట్టబోతున్నా.. 2021లో ఓర్లాండ్‍లో యాన్యువల్ సమ్మిట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాం. డిసెంబరు 2020లో విశాఖపట్నంలో నా ఆధ్వర్యంలోనే గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. అలాగే ఆపిలో ఫ్యామిలీ మీట్‍లు ఉంటాయి. 2020లో జపాన్ లేదా సౌత్ కొరియాకు ఫ్యామిలీలతో వెళ్లాలనే ఆలోచన ఉంది. అప్పటికి సరిహద్దు సమస్య తీరిపోతే నార్త్ కొరియాకు వెళ్లే ఆలోచన కూడా ఉంది. అలాగే విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ ముగియగానే.. అక్కడి నుంచి కుటుంబాలతో కంబోడియా, వియత్నాం, బ్యాంకాక్‍కు టూర్ వెళ్లాలనే ప్లాన్ కూడా ఉంది. ఆపి మెంబర్స్ అంతా సక్సెస్‍ఫుల్ పీపుల్. 2019లో తెలంగాణకు చెందిన డాక్టర్ సురేశ్‍రెడ్డి ప్రెసిడెంట్‍గా బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం నేను 2020 సంవత్సరానికి ప్రెసిడెంట్‍గా బాధ్యతలు చేపడతాను.
సేవా భావం..
ప్రత్యేకించి సేవా కార్యక్రమాలేవీ చేపట్టడం లేదు. కానీ ఎవరైనా వచ్చి సాయం కోరితే మాత్రం చేతనైనంత చేస్తాను. విద్య, వైద్యం, ఆధ్యాత్మిక కార్యక్రమాల రూపేణా ఎందరో ఆర్థిక సాయం కోరుతూ వస్తారు. అటువంటి వారి అవసరాలు తీరుస్తుంటాను.
యువతకు సందేశం..
‘ఆపి’లో రెండో తరం నాయకత్వం వహించడానికి సిద్ధం కావాలి. ఆ బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు రావాలి. వైద్యుల మధ్య అయినా, మనుషుల మధ్య అయినా వివక్ష అనేది ఉండ కూడదు. దానికి వ్యతిరేకంగా ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి. సెకండ్ జనరేషన్ ఫిజీషియన్స్ ‘ఆపి’ సభ్యత్వాలను విరివిగా తీసుకోవాలి. ఇది చాలా అవసరం. ‘ఆపి’ చేపట్టే కార్య క్రమాల్లో యువ ఫిజీషియన్లు పాల్గొనాలి.
వైద్యరంగంలో అడ్వాన్స్ టెక్నిక్స్..
ఉదరభాగానికి సంబంధించిన అనేక సమస్యలు గ్యాస్ట్రో ఎంట్రాలజీ కిందకే వస్తాయి. ఇందులో సాధారణ సమస్యలతో పాటు పలు సంక్లిష్టమైన కేసులూ ఉంటాయి. నా ప్రాక్టీస్‍లో నేను చూసిన ఎక్కువ సమస్యలు.. డైజెషన్, ఆసిడ్ బర్నింగ్ ముఖ్యమైనవి. అమెరికన్లు స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. అలాగే డ్రింకింగ్, స్మోకింగ్ హాబిట్స్ కూడా వారిలో ఎక్కువే. వీటి వల్లే కడుపులో ఆసిడ్స్ పెరుగుతాయి. అవే గ్యాస్ట్రో సమస్యలకు కారణమవుతాయి. అందుకే జీవన విధానం మార్చుకోవాలి. బ్రేక్‍ఫాస్ట్, లంచ్, డిన్నర్.. ఈ మూడు విధాలుగా మనం రోజూ ఆహారం తీసు కుంటాం. అయితే, డిన్నర్ తరువాత కనీసం రెండు గంటల పాటు నిద్రపోకూడదు. లేదంటే ఆసిడ్ రిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. రాత్రి వేళ ఫుడ్ స్టమక్ నుంచి ఖాళీ అయ్యాకనే, అంటే పూర్తిగా డైజెషన్ అయ్యాకనే నిద్రించాలి. అలాగే పిల్లో ఎత్తుగా ఉండాలి. ప్రస్తుతం కోలన్ సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. అమెరికాలో రెడ్‍మీట్ ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఇక్కడి వారికి ఆరోగ్య స్ప•హ ఎక్కువ. వివిధ ప్రసార సాధనాలు, ప్రసార మాధ్యమాల ద్వారా ఆరోగ్య విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. అందుకే ఇక్కడ వయసు 40 దాటగానే కోలన్ చెక్‍కు ప్రజలు వస్తారు. అటువంటి పరిస్థితి మన ఇండియాలోనూ ఉండాలి. కోలన్ సమస్య గురించి మీకెలా తెలిసింది అని ప్రశ్నిస్తే.. వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్నామని చెబుతారు. కోలన్ సమస్యను ప్రారంభంలోనే తుంచివేయాలి. లేదంటే అది క్యాన్సర్‍గా మారుతుంది. కోలన్ సమస్య అనేది అందరిలోనూ ఉంటుంది. వెజ్, నాన్‍వెజ్ తీసుకునే అందరిలోనూ ఇది వస్తుంది. దీనికి విరుగుడు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడమే. మన భారత్‍లో తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగానే ఉంటుంది. అలాగే వ్యాయామం చేయాలి. వారానికి కనీసం పద్నా
Review అమెరికా లో తెలుగు వెలుగు డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ.