ఆ అక్షరం విశ్వంభరం

రాజు మరణిస్తే ఒక తార రాలిపోతుంది.
సుకవి మరణిస్తే ఒక తార నింగికేగుతుంది.
రాజు మరణానంతరం అతని రూపం ‘విగ్రహం’గా నిలుస్తుంది.
సుకవి మాత్రం కలకాలకం జనుల నాలుకపైనే జీవిస్తాడు.
ఎంత అక్షర సత్యం?
సినారె మన మధ్య లేరన్న ఊసే లేదు.
ఆయన, ఆయన కావ్యాలు, కవితలు, సినీ గేయాలు తెలుగునాట ఒక ‘ధ్యాస’గా నిలిచిపోతాయి.
తెలుగు సాహిత్యానికి ఆయనో బ్రాండ్‍ అంబాసిడర్‍..
ఏ సాహిత్య కార్యక్రమం జరిగినా దానికి ఆయనతోనే గ్లామర్‍..
బతికున్నంత కాలం అక్షరాలతో సాహితీ సేద్యం చేసిన నిరంతర స్వాప్నికుడు డాక్టర్‍ సింగిరెడ్డి నారాయణరెడ్డి జూన్‍ 12న నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ‘నా రణం.. మరణంపైనే’ అంటూ చాటిన ఆయన.. ‘అవయవాలు చస్తాయి కానీ, ఆలోచనలు చావవు’ అంటూ తెలుగు సాహితీ సౌరభాలను విరబూయించి.. మనందరినీ తన పాటల పల్లకీలో ఊరేగించి తను మాత్రం దివికేగిపోయారు.

సినారె అసలు పేరు సింగిరెడ్డి సత్యనారాయణరెడ్డి. అయితే, తండ్రి గారు ఆయనను స్కూళ్లో వేసినప్పుడు ‘సి.నారాయణరెడ్డి’గా రాశారు. తరువాత కాలంలో ‘సత్యా’న్ని తన కవిత్వపు వస్తువుగా మార్చుకోవడం వల్ల నారాయణరెడ్డిగా లోక ప్రసిద్ధి చెందారు. ఆయన తన 13వ ఏటనే పద్యం రాశారు. అయితే, తండ్రి మాత్రం ‘మెదడు పాడైతది బిడ్డా’ అని మందలించారు. సినారె వినకపోగా, పదో తరగతి నాటికి పాటలు రాయడం కూడా మొదలు పెట్టారు. బాల్యం, యవ్వనాల్లో నిజాం వ్యతిరేక సత్యాగ్రహం, దారశథి సాహచర్యం, తెలంగాణ రచయితల సంఘం కార్యదర్శిగా పని చేయడం వంటివి ఈ రైతు బిడ్డ అక్షర సేద్యానికి ఎరువుగా మారాయి. ఛందస్సు అంటే ఏమిటో తెలియకుండానే ఆయన సీసపద్యం రచించారు. అధ్యాపకుడిగా, సినీ గేయ రచయితగా, రాజ్యసభ సభ్యుడిగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా సి.నారాయణరెడ్డిది సుదీర్ఘ ప్రస్థానం.
అక్షర సేద్యకారుడు
ఆయనది డెబ్బై ఏళ్ల కవన యాత్ర. 85 ఏళ్లలో అదే సంఖ్యలో గ్రంథాలను రచించారు. కవిత్వాన్ని శ్వాసగా పీల్చి, కవిత్వాన్ని ధ్యాసగా భావిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. విశ్వవిద్యాలయంలో ముప్పై సంవత్సరాల పాటు అధ్యాపక వృత్తిలో కొనసాగడం, పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేయడం, ఉర్దూలోనే చదువుకోవడం వంటి వాటి వల్ల ఆయన భావాలు తేనెలూరేవి. భాష సౌకుమార్యంతో శోభిల్లేది.
కవిత రాయనిదే రోజు గడవదు
ఆయన ఆధునిక కవిత్వంపై అరవై నాలుగు సంవత్సరాల క్రితం రాసిన పీహెచ్‍డీ సిద్ధాంత గ్రంథం ఇప్పటికీ పరిశోధక విద్యార్థులకు నిత్య పాఠ్య పుస్తకం వంటిది. కవిత అనేది అలవోకగా జాలువారుతుంది ఆయన కలం నుంచి. కవిత రాయనిదే రోజు గడవని స్వాప్నికుడు ఆయన. సినారెకు లభించిన జ్ఞానపీఠ పురస్కారం ఎంత గొప్పదో, ఆయన రచించిన విశ్వంభర అంత కంటే గొప్పది. ‘విశ్వంభర’ అంటే మట్టి. మట్టి అంటే భూమి. మట్టిని నమ్ముకున్న మహాకవి సినారె. తెలంగాణ మాండలికాన్ని తెలుగు సినిమా పాటల్లో ఎక్కువగా ఉపయోగించిన కవి సినారె మాత్రమే. ‘పల్లె నాకు పాటనిచ్చింది.. పట్నం మాటనిచ్చింది’ అనే వారాయన. సినారె చాలా రాశారు. వేటికవే వైవిధ్యం.. రసరమ్యం.. ‘నాగార్జునసాగరం’లోని కళా సౌందర్యం, జ్ఞాన సంపద, మూడు పాత్రల నడుమ సాగే భావోద్వేగాలు చదివిన వారిని వదలవు. ‘నవ్వని పువ్వు’ ఆయన తొలి పద్య కవితా సంకలనం. 1953లో అచ్చయ్యింది. పద్యం, గేయం, వచనం, పాట, గజల్‍, ద్విపదులు, ప్రపంచ పదులు, బుర్రకథ, యాత్రా చరిత్ర, సినీ గేయాలు వంటి దాదాపు 18 సాహితీ పక్రియల్లో సుమారు తొంభై ఐదుకు పైగా గ్రంథాలు రచించారు. నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయులు, విశ్వనాథ నాయుడు వంటివి ఆయన దీర్ఘ కావ్య రచనలు. భూమిక, ఆకాశం, మట్టి-మనిషి, విశ్వంభర రచనల్లో సినారె మానవేతర ఇతిహాసాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించారు.
పరమాణువుగా మొదలై.. శిఖరమై
ఆధునిక ఇతిహాస వచన కవితా కావ్యం, వేనోళ్ల ప్రశంసలు అందుకున్న ‘విశ్వంభర’ను ఆయన 1980లో ప్రచురించారు. దీనికి గాను ఆయన 1988లో జ్ఞానపీఠ్‍ అందుకున్నారు.
‘నవ్వని పువ్వు’ అంటూ తొలి రచనతో పరమాణువుగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. మహాపర్వతమై ఎదిగిన సినారె కలం శక్తివంతం. గళం సమ్మోహనం. సుమధుర తెలుగు భాషలో ఆయన ప్రసంగాలు ఇట్టే ఆకట్టుకునేవి. భాషలో శబ్ద మాధుర్యం, భావ గాంభీర్యం, కవితా పరిమళం నిక్షిప్తమై ఉండేవి. తన ‘సినారె గజల్స్’తో గానామృతం పంచిన అమృతభాండం ఆయన. చాదర్‍ఘాట్‍ కాలేజీలో ఇంటర్మీడియట్‍ చదివే రోజుల్లోనే జువ్వాడి గౌతమరావు సంపాదకత్వంలో వెలువడే ‘జనశక్తి’ పత్రికలో మొదటి కవిత ప్రచురితమైంది. సుల్తాన్‍బజార్‍లోని శ్రీకృష్ణదేవరాయంధ్ర భాషా నిలయంలో సినారె ఆధునిక కవిత్వంలో శిఖరప్రాయులైన గురజాడ, రాయప్రోలు, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్త్రి, జాషువా, శ్రీశ్రీ వంటి భావ కవుల, అభ్యుదయ కవుల రచనలు చదివారు. ‘ప్రహ్లాద చరిత్ర’, ‘సీతాపహరణం’ వంటి పద్య నాటికలు, ‘భలే శిష్యులు’ వంటి సాంఘిక నాటికను కాలేజీ రోజుల్లోనే రాశారు. ఓయూలో చదివే రోజుల్లో ‘శోభ’ అనే సాహిత్య సంచిక వచ్చేది. దానికి సినారె కొంత కాలం సంపాదకునిగా వ్యవహరించారు. ‘రోచిస్‍’,సింహేంద్ర’ పేర్లతో ఆ పత్రికకు కొన్ని కవితలు రాశారు. ఎంఏ చదివే రోజుల్లో ‘సినీ కవి’ అనే నాటికను రాసి ప్రదర్శించారు. విశ్వవిద్యాలయం తెలుగు విద్యార్థి సమితికి, ఆ తర్వాత తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పని చేశారు. సినారె.. తనకు దారశథి కృష్ణమాచార్య గొప్ప ఆదర్శప్రాయులని చెప్పుకునే వారు. తాను రాసిన ‘జలపాతం’ కావ్యాన్ని సినారె కృష్ణమాచార్యకే అంకితం చేశారు. ఆ రోజుల్లో దాశరథిని, సినారెను ‘తెలంగాణ నయనయుగళం’ అని పిలిచే వారు. ఆచార్యులు కె.గోపాల కృష్ణారావు, పల్లా దుర్గయ్య, దివాకర్ల వెంకటావధాని సినారె గురువులు.
పెద్ద కుటుంబం
డాక్టర్‍ సి.నారాయణరెడ్డి కుటుంబం పెద్దది. అంతా కలిపి 30 మంది వరకు ఉంటారు. అందరూ రకరకాల వృత్తుల్లో స్థిరపడ్డారు. కానీ, ఆయన ముని మనవరాలు వరేణ్య (పెద్ద కుమార్తె గంగ మనవరాలు) మాత్రం తాత బాటలో నడుస్తోంది. ఆమె ‘త్రూ డెమన్‍ ఐ’ అనే కథల సంపుటి రాశారు. ‘టెండర్‍ రేస్‍’ అనే కవిత్వం కూడా రాశారు. దీన్ని సినారె ‘లేత కిరణాలు’ అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆయన కొంత కాలంగా కూతుళ్లు, మనవళ్లు, మనవరాళ్లతో కలిసి హైదరాబాద్‍లోని మణికొండలో నివాసం ఉంటున్నారు. సి.నారాయణరెడ్డి సతీమణి సుశీల. వీరికి నలుగురు కుమార్తెలు (గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి). దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించారు. నాటి నుంచి ఆమె జ్ఞాపకంగా ‘సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు’ను స్థాపించారు. ఏటా ఈ ట్రస్టు నుంచి ఉత్తమ రచయిత్రికి రూ.50 వేల నగదు పురస్కారాన్ని అందిస్తున్నారు. భార్య పేరిట అంబేద్కర్‍ వర్సిటీలో ఉత్తమ విద్యార్థులకు స్వర్ణ పతకాలను కూడా ప్రదానం చేస్తున్నారు.
హుందాతనానికి పెట్టింది పేరు
సినారెది గంభీర మనస్తత్వం. విశాల దృక్పథం. తనలోని భావోద్వేగాలు బయటకు కనిపించేవి కావు. అన్నింటినీ మనసులో దాచుకునే వారు. తెలంగాణ అంటే ఆయనకు అభిమానం ఉన్నా బయటకు చెప్పలేదు. పోతన ఎక్కడి వాడనే వివాదం ఉమ్మడి రాష్ట్రంలో తలెత్తింది. ఈ సమయంలో ఆయన పోతన తెలంగాణ వారేనని విస్పష్టంగా చెప్పారు. ఆయన గతంలో ‘తల్లా పెళ్లామా’ సినిమా కోసం ‘తెలుగుజాతి మనది.. నిండుగ వెలుగుజాతి మనది’ అనే తెలుగు వారి గుండెలు ఉప్పొంగించే గీతాన్ని రాశారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన కొత్తలో ఆయన ఓ వేదికపై ‘తెలుగు జాతి మనది.. రెండుగ.
ఆ రూపం.. ఆ ‘ఆహా’ర్యం
పాల నురుగలాంటి తెల్లటి ధోవతి, సిల్కు లాల్చీ.. తెలుగు వారి నిండుదనానికి నిలువెత్తు సంతకంగా ఉండేది డాక్టర్‍ సి.నారాయణరెడ్డి ఆహార్యం. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పంచెకట్టులోనే ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. హైదరాబాద్‍లో చదివే రోజుల్లో నిజాం సంస్క•తి రాజ్యమేలుతోంది. నిజాం నవాబుకు గౌరవ సూచకంగా విద్యార్థులు రూమీ టోపీ ధరించే వారు. ఆ సంస్క•తిని వ్యతిరేకించిన విద్యార్థులు గాంధీ టోపీ ధరించే వారు. సినారె కూడా గాంధీ టోపీ ధరించే వారు. ఇంటర్మీడియట్‍లో చేరింది మొదలు తెలుగు అధ్యాపకునిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించే వరకు సినారె ప్యాంటూ, షర్టే వేసుకున్నారు. సాహితీ సమావేశాలకు వెళ్లడం ప్రారంభించాక ఆయన పంచెకట్టు మొదలైంది. ‘పంచెకట్టు ఓ కళ. నాకైతే కనీసం పది- పదిహేను నిమిషాల సమయం పడుతుంది’ అని సినారె ఇంటర్వ్యూలలో తన ఆహార్య ప్రియత్వం గురించి చెప్పే వారు. ఆయన ఎక్కువగా ఎర్ర అంచు పంచెలే ధరించే వారు. దానికి కూడా ఒక సందర్భంలో కారణం చెప్పారు. ‘రెడ్‍’లో ‘రెడ్డి’ గోచరిస్తుంది కదా! అందుకని..’ అంటూ చమత్కరించే వారు.
భోజనప్రియుడు
ఇక ఆహారం విషయంలోనూ సినారెకు కొన్ని అభిరుచులు ఉండేవి. ఆయనకు ఆరోగ్యపరంగా పెద్దగా ఆరోగ్య సమస్యలేమీ లేవు. గత నలభై సంవత్సరాలుగా షుగర్‍ ఉన్నా.. ఎప్పుడూ దాన్ని అదుపులోనే ఉంచుకునే వారు. మంచి భోజనప్రియుడు. ఎక్కడ ఉన్నా సమయానికి భోజనం చేసే వారు. ఆయన పరమపదించడానికి ముందు రోజు కూడా పెద్ద కుమార్తె గంగ చేతుల మీదుగా ఇడ్లీ, మధ్యాహ్నం భోజనం, రాత్రి తెల్ల అన్నం, పప్పుతో భోజనం చేశారు. జూన్‍ 11న చివరి రోజంతా ఇంట్లో ప్రశాంతంగా గడిపారు. మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేశారు. ఆయనకు నడక అంటే ఇష్టం. ‘నడక నా తల్లి..’ అనే కవిత కూడా రాశారు. నాలుగు సంవత్సరాల క్రితం ఆయనకు కాలు విరిగింది. అప్పటి నుంచి నడక మానేశారు.
ఎన్నెన్నో ఘనతలు..
నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం అభివృద్ధికి సినారె చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే ఈ విశ్వవిద్యాలయానికి యూజీసీ గుర్తింపు లభించింది. కూచిపూడి కళా క్షేత్రాన్ని ఈ విశ్వవిద్యాలయం పరిధిలోకి తెచ్చింది కూడా సినారె హయాంలోనే. 1989, ఆగస్టు 24న తెలుగు విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవాన్ని తెలుగులో నిర్వహించి చరిత్ర సృష్టించారు. తన హయాంలో తెలుగు విశ్వవిద్యాలయం తరపున 150కి పైగా ఉత్తమ గ్రంథాలను ప్రచురించారు. 1990, మార్చి 10,11,12 తేదీల్లో బెంగ• ళూరులోని మూడో అఖిల భారత తెలుగు మహాసభలను, మారిషస్‍లో మూడో ప్రపంచ తెలుగు మహాసభలను తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన నిర్వహించారు. 1997-2004 మధ్య కాలంలో రాష్ట్ర సాంస్క•తిక మండలి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. దక్షిణ భారతదేశం నుంచి రాజ్యసభకు నియమితులైన ప్రథమ కవి సినారె కావడం విశేషం. ఆయన పలు రచనలు ఆంగ్లం, ఫ్రెంచి, సంస్క•తం, హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళ భాషల్లోకి అనువాదమయ్యాయి. సాధారణంగా అంతా ఆత్మకథలు రాసుకుంటారు కదా! కానీ, సినారె ఆత్మకవితకు అంకురార్పణ చేశారు. ‘పుట్టితిని తెలంగాణ నట్ట నడిగడ్డపై.. ’ అంటూ ఆత్మకవితను ఆరంభించారు. తెలుగు సాహితీవేతల్లో ఇప్పటి వరకు విశ్వనాథ సత్యనారాయణ, సినారె, రావూరి భరద్వాజ.. వీరి ముగ్గురికి మాత్రమే జ్ఞానపీఠ పురస్కారాలు లభించాయి. విశ్వనాథ సత్యనారాయణ, రావూరి భరద్వాజ ఆంధప్రదేశ్‍ ప్రాంతానికి చెందిన వారైతే.. సి.నారాయణరెడ్డి ఒక్కరే తెలంగాణ ప్రాంత కవి.
సి.నారాయణరెడ్డి ‘సినారె’గా ఎలా మారారు?..
అదెలా జరిగిందో ఓ సందర్భంలో ఆయనే చెప్పుకున్నారు.
‘మా అమ్మకు వరుసగా పిల్లలు పుట్టి చనిపోతున్నారు. మా ఊరిలో వేరే వాళ్లింట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంటే అమ్మ అక్కడకు వెళ్లి.. పుట్టబోయే బిడ్డకు ‘సత్యనారాయణరెడ్డి’ అనే పేరు పెడతానని మొక్కుకుంది. చిన్నప్పుడు నన్నంతా అదే పేరుతో పిలిచే వారు. బడిలో చేరేటప్పుడు నీ పేరేంటని ఓ ఉర్దూ టీచర్‍ అడిగితే, ‘సింగిరెడ్డి సత్యనారాయణరెడ్డి’ అని చెప్పా. ఆయనకు పలకడం రాక ‘సి.నారాయణరెడ్డి’ అని రిజిస్టర్‍లో రాశారు. కవిగా పేరు పొందాక ఆ పేరును మరింత క్లుప్తంగా ‘సినారె’గా మార్చుకున్నా’.

సినారె జీవన చిత్రం
పూర్తి పేరు : సింగిరెడ్డి నారాయణరెడ్డి
లోక ప్రసిద్ధి : సినారె
తల్లిదండ్రులు : బుచ్చమ్మ, మల్లారెడ్డి
స్వస్థలం : హన్మాజీపేట, సిరిసిల్ల రాజన్న జిల్లా
జన్మ తేదీ : 1931, జూలై 29
విద్యాభ్యాసం : ఉర్దూ మాధ్యమంలోనే చదువంతా సాగింది. వీధి బడిలో ప్రాథమిక విద్య.. సిరిసిల్లలో మాధ్యమిక విద్య.. కరీంనగర్‍లోని
ప్రభుత్వ పాఠశాలలో 1948లో
ఉన్నత పాఠశాల విద్య..
ఇంటర్మీడియట్‍ : 1948-49లో హైదరాబాద్‍ చాదర్‍ఘాట్‍ కళాశాలలో విద్యాభ్యాసం.
డిగ్రీ : 1952లో ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఎంఏ పట్టా : 1954
అధ్యాపక వృత్తి : 1954-55లో సికింద్రాబాద్‍ పీజీ కళాశాలలో పార్ట్టైమ్‍ అధ్యాపకుడుగా పని చేశారు. అనంతరం అదే కళాశాలలో
1955లో ఆంధ్రోపన్యాసకులుగా
ఉద్యోగం వచ్చింది.
ఉపన్యాసకుడు : 1958-59లో నిజాం కళాశాలలో పనిచేశారు
పరిశోధన: 1957-62 మధ్య కాలంలో ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో ‘ఆధునికాంధ్ర కవిత్వం- సంప్రదాయాలు-ప్రయోగాలు’ అనే అంశంపై పీహెచ్‍డీ.
పీహెచ్‍డీ పట్టా : 1962
తెలుగు ఆచార్యుడు:1963లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో రీడర్‍గా చేరిక.. 1976లో ఆచార్యునిగా పదోన్నతి.. 1981 వరకు బాధ్యతలు.
భార్య: సుశీల
కూతుళ్లు : గంగ (భర్త-భాస్కర్‍రెడ్డి, మనవరాలు- మనస్విని, మనవడు- చైతన్యదేవ్‍), యమున (భర్త- సురేందర్‍ రెడ్డి, మనవడు- క్రాంతికేతన్‍, మనవరాలు- మౌక్తిక), సరస్వతి (భర్త- సంతోష్‍రెడ్డి, మనవడు- లయచరణ్‍), కృష్ణవేణి (భర్త- వెంకటేశ్వరరెడ్డి, మనవడు- అన్వేష్‍).
మరణం: 2017, జూన్‍ 12

భలేగా రా‘సినారె’
తెలుగు సినీ గీతానికి కావ్య స్థాయిని అద్దిన సాహితీ విశ్వంభరుడు డాక్టర్‍ సి.నారాయణరెడ్డి. మూడు వేలకు పైగా తెలుగు సినీ గీతాలకు ప్రాణం పోసిన ఆయన తెలుగు సినీ వినీలాకాశంలో ‘గీతా’కారుడుగా చిరస్థాయిగా నిలిచిపోయారు. అనుభూతి- ఆర్తి- ఆర్ద్రత- ఆవేశం- జావళీ- కవ్వాలీ- యుగళం- రసరమ్యం- మాండలికం.. ఇలా అన్ని విధాలుగా ఆయన తన కలాన్ని కదం తొక్కించారు. సినీ గీతాలతో ఆయన చేయని ప్రయోగం లేదు.
• నన్ను దోచుకొందువటే.. (గులేబకావళి)
• తోటలో నా రాజు తొంగి చూసెను నాడు (ఏకవీర)
• తెలుగుజాతి మనది..నిండుగ వెలుగుజాతి.. (తల్లా?పెళ్లామా?)
• చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన.. (చెల్లెలి కాపురం)
• చదువురాని వాడవని దిగులు చెందకు.. (ఆత్మబంధువు)
• పగలే వెన్నెల.. జగమే ఊయల (పూజాఫలం)
• నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో.. (పూజాఫలం)
• ఈ నల్లని రాలలో.. ఏ కన్నులు దాగెనో (అమరశిల్పి జక్కన)
• జేజమ్మా.. మాయమ్మా.. (అరుంధతి)
• ఇదిగో రాయలసీమ గడ్డ.. (సీతయ్య)
• కంటేనే అమ్మ అని అంటే ఎలా.. (ప్రేమించు)
• చాంగురే బంగారు రాజా.. (శ్రీకృష్ణపాండవీయం)
• మల్లియలారా.. మాలికలారా.. (నిర్దోషి)
• నీవుంటే వేరే కనులెందుకూ.. (స్నేహం)
• అభినందన మందారమాల.. (తాండ్రపాపారాయుడు)
• ఓ ముత్యాలరెమ్మ..ఓ మురిపాలకొమ్మ..(ఒసేయ్‍ రాములమ్మ)
• పుట్టిన రోజు పండుగే అందరికీ.. (జీవన తరంగాలు)
• మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు.. (అమ్మ మాట)
• వస్తాడు నా రాజు ఈ రోజు.. (అల్లూరి సీతారామరాజు)
• నా మది నిన్ను పిలిచింది గానమై.. (ఆరాధన)
• ఎంతటి రసికుడవో తెలిసెరా.. (ముత్యాలముగ్గు)
• గోగులుపూచె గోగులు కాచె ఓ లచ్చ..(ముత్యాలముగ్గు)
• శివరంజనీ.. నవ రాగిణీ.. (తూర్పు పడమర)
• గోరంత దీపం.. కొండంత వెలుగు.. (గోరంత దీపం)
• మ్రోగింది కల్యాణ వీణ.. (కురుక్షేత్రం)
• విన్నానులే ప్రియా.. (బందిపోటు దొంగలు)
• బలే మంచి రోజు పసందైన రోజు (జరిగిన కథ)
• ఈ రేయి తీయనిది.. (చిట్టి చెల్లెలు)
• విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా.. (రంగేళిరాజా)
• అణువూ అణువున వెలసిన దేవా.. (మానవుడు-దానవుడు)
• వ్రేపల్లె వేచెను.. వేణువు వేచెను.. (శారద)
• మల్లెకన్న తెల్లన మా సీత సొగసు (ఓ సీత కథ)
• చిత్రం భళారే విచిత్రం.. అయ్యారే విచిత్రం (దానవీరశూరకర్ణ)
• స్నేహమే నా జీవితం..స్నేహమేరా శాశ్వతం(నిప్పులాంటి మనిషి)
• చిగురేసె మొగ్గేసె సొగసంతా పూలపూసె (ఆలుమగలు

నా పాటే నా సందేశ
సినారె కవిత రాసినా, సినీ గేయం రాసినా జనహితాన్ని, సామాజిక సందేశ బాధ్యతను మాత్రం విస్మరించలేదు. అందుకు ఆయన రాసిన పాటల్లో నిదర్శనాలు కోకొల్లలుగా ఉంటాయి. ఆయన సందేశాన్నే పాటగా మలిచిన తీరు అద్భుతం. మచ్చుకు కొన్ని చూడండి..
చదువు రాని వాడవనీ దిగులు చెందకు (ఆత్మబంధువు)
గోరంత దీపం కొండంత వెలుగు (గోరంత దీపం)
పుట్టిన రోజు పండగే అందరికీ (జీవన తరంగాలు)
వందేమాతర గీతం వరస మారుతున్నది (వందేమాతరం)
నా దేశం భగవద్గీత అగ్ని పునీత సీత (బంగారు మనిషి)
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం (నిప్పులాంటి మనిషి)
నాది నాది అనుకున్నది నీది కాదురా.. నీవు రాయన్నది
ఒకనాటికి రత్నమౌనురా
ఏ సిరులెందుకు? ఏ నిధులెందుకు? ఏ సౌఖ్యములెందుకూ ఆత్మశాంతి లేనిదే..
గాలికి కులమేదీ.. నేలకు కులమేదీ
కంటేనే అమ్మ అని అంటే ఎలా (ప్రేమించు)
ఓ నాన్నా.. నీ మనసే వెన్న (ధర్మదాత)
తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది (తల్లా పెళ్లామా)
ఎన్నాళ్లో వేచిన ఉదయం..ఈనాడే ఎదురవుతుంటే (మంచి మిత్రులు)
మనసొక మధు కలశం.. పగిలే వరకే అది నిత్య సుందరం (నీరాజనం)
ఇంకా తెరవారదేమో.. ఈ చీకటి విడిపోదేమి (మంచి మిత్రులు)
కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి
నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్లయినా తాగి బతకాలి (గోరంత దీపం)
మెత్తగా వుంటే ఈ లోకం.. నెత్తిపై కాళ్లు పెడుతుంది
కత్తిలా వున్న వాడంటే.. గులామై కాళ్లు పడుతుంది
రాయలసీమ రతనాల సీమ..
నెల్లూరు, కోస్తాలు బంగారు పంటల బస్తాలు..
తెలంగాణమే తేనె మాగాణము
అమ్మా అని నోరార పిలవరా.. ఆ పిలుపే అందరు నోచని వరమురా (మనుషులు మట్టిబొమ్మలు)
మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ (మాతృదేవోభవ)
అనగనగా ఒక రాజు.. అనగనగా ఒక రాణి.. రాజు గుణము మిన్న.. రాణి మనసు వెన్న (ఆత్మబంధువు)
ఎవరికీ తలవంచకు.. ఎవరినీ యాచించకు (కర్ణ)
నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవొద్దు (కోడలు దిద్దిన కాపురం)
ఈ మట్టిలోనే పుట్టాము.. ఈ మట్టిలోనే పెరిగాము (రైతు కుటుంబం)

ఎన్టీఆర్‍ మాట.. దుర్యోధనుడికి సినారె పాట
ఎవరైనా ఈ సాహసం చేయగలరా? దుర్యోధనుడే ప్రధాన పాత్రధారి.. అసలే విలన్‍ లక్షణాలున్న పాత్ర.. దాన్ని హీరోచితంగా చూపించే ప్రయత్నం.. పైగా అతనికో పాట పెడితే.. ఈ విషయాన్నే ఎన్టీఆర్‍ తనకు సన్నిహితుడైన సినారెను అడిగారట. సినారె అందుకు సరేననడమే కాదు ఆ పాటను ఆయనే రాశారు. ఎన్టీఆర్‍ చిత్రాలలో ‘దానవీరశూరకర్ణ’ది ప్రత్యేక స్థానం. అందులో దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్‍ జీవించారు. ఈ చిత్రంలోని ‘చిత్రం.. భళారే విచిత్రం’ పాట చాలా హిట్‍. దుర్యోధనుడికి ఓ యుగళగీతం పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన ఎన్టీఆర్‍కు వచ్చింది. వెంటనే ఆ ఆలోచనను సినారెతో పంచుకున్నారు. ‘ఏం కవి గారూ! దుర్యోధనుడికి ఓ పాట పెడితే ఎలా ఉంటుంది?’ అని అడిగితే సినారె బాగుంటుందని అన్నారట. దాంతో ఆ పాట రాసే బాధ్యతను కూడా ఎన్టీఆర్‍ సినారెకు అప్పగించారు. సాహిత్యంలో ఇష్టం వచ్చిన ప్రయోగాలు చేసుకోవాలని కూడా ఎన్టీఆర్‍ స్వేచ్ఛనిచ్చారట. అలా ‘చిత్రం భళారే విచిత్రం’ రూపుదిద్దుకుంది. ఈ పాటలోని సాహిత్యం తనకెంతో నచ్చిందని ఎన్టీఆర్‍ ఆ తరువాత పలు సందర్భాల్లో చెప్పేవారు.
మరో సందర్భంలో… అభిమాన ధనుడైన సుయోధనుడి మయసభ మందిర ప్రవేశ సన్నివేశం. దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్‍ ధీరగంభీరంగా నడిచి వస్తుంటే ఆయనకు స్వాగతం పలికే సందర్భంలో సినారె కలం కూడా మరోసారి అంతే గంభీరంగా ముందుకు ఉరికింది.
‘శత సోదర సంసేవిత సదనా.. అభిమానధనా.. సుయోధనా..’ అంటూ ఆ కలం స్వాగతం పలికింది. అంతటితో ఆగలేదు. సుదీర్ఘ సంస్క•త సమాసాలతో ఆ సందర్భాన్ని మరింత సుసంపన్నం చేసింది.
‘ధరణిపాల శిరోమకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణా..
కదన రంగ బాహుదండ ధృత గదా ప్రకట పటు సౌర్యాభరణా..’ అంటూ సినారె సాగించిన అక్షర ప్రయోగం నభూతో.. ఈ పదాలకు అర్థాలు తెలియకున్నా.. ఆ సందర్భానికి తగినట్టు అతికిన ఈ మాటలు నేల ప్రేక్షకుల చేత కూడా చప్పట్లు కొట్టించాయి.

Review ఆ అక్షరం విశ్వంభరం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top