చరణా కింకిణులు ఘల్లుఘల్లుమన..

కవిత్వం నా మాతృభాష.. కవిత నా శ్వాస.. కవిత నా చిరునామా అని ప్రకటించి, ‘ఇతివృత్తం మానవత్వం’ అని ఉద్ఘాటించి, సతతహరితంగా సాహితీ సృజన చేసిన కవితా పథింకుడు.. తెలుగు కీర్తిని, తెలుగు యశస్సును, తెలుగు నుడికారాన్ని, తెలుగు అక్షరాన్ని, తెలుగు పలుకుబడిని ఏలుబడిగా చేసుకుని తనకు తానుగా జగతినంతటికీ వ్యాపించిన కవితా తపస్వీ.. నత్య ప్రగతిశీలి, అభ్యుదయవాది ‘సినారె’. ఆయన రాసిన కవితలు నిత్యనూతనం.
నెత్తి మీద నీలి తెర
కాళ్ల కింద ధూళి పొర
(విశ్వంభర)

మారాలిరా!
కరుడుగట్టిన నేటి కరకు
సంఘపు రంగు మారాలి.

విజయంబు సాధించినావా విద్యార్థీ
నీ వీర భావాలు నింగి వ్యాప్తించగా,
నీ వైరి చిత్తాల నేల కంపించగా

ఏదైనా రాయందే
ఈ క్షణాన్ని పోనీయను
కలాన్ని పిండేయందే
కాలాన్ని కదలనీయను
అవసరమైనప్పుడల్లా
అగ్గిపుల్లతో చీకటి
కొవ్వును కరిగించందే
కొత్త పొద్దు రానీయను

ఒకటా రెండా.. వేల పాటలు.. అవి వింటే గుండె నిండా వెన్నెల ఊటలు..
తరాలకు, అక్షరాలకు నడకలు నేర్పిన కొత్త బాటలు..

ఎన్ని మెట్లు ఎక్కావని కాదు
యెంత ఎత్తుకెదిగావని,
ఎన్ని మునకలేశావన్నది కాదు..
యెంత లోతు చూశావని,
ఎన్ని సభలు తిరిగావని కాదు..
యెంత బుద్ధి పెంచావని,
ఎన్ని కృతులు చదివావని కాదు..
యెంత సిద్ధి పొందావని!
(ప్రపంచ పదులు)

మనసు తెలుసుకున్న వాడు మర్మజ్ఞుడు
తనను తెలుసుకొన్న వాడు తత్వజ్ఞుడు
అసలు తెలియదన్న వాడు ఆత్మజ్ఞుడు
అన్నీ తెలుసన్న వాడు అల్పజ్ఞుడు

మనసుకు తొడుగు మనిషి
మనిషికి ఉడుపు జగతి
ఇదే విశ్వంభరా తత్వం
అనంత జీవిత సత్యం

కుర్రాళ్లొస్తున్నారు జాగ్రత్త
కొత్త గొంతు లెగరేసుకుంటూ
పరమ వృద్ధులూ తప్పుకోండి
పాతకీర్తిని నెరమరేసుకుంటూ

వెన్నవంటి మనసున్న వానికి
అన్నమేమొ కరువాయె
ఉన్నవాని కింతన్నమిడుదామన్న
గుండె లేదాయె

మరణం నన్ను వరించి వస్తే ఏమంటాను
నేను ఏమంటాను?
పాలుపట్టి జోలపాడి పడుకోమంటాను
(నా రణం.. మరణంపైనే)

ఊపిరాడటం లేదు
ఉక్కపోస్తుంది ఏసీ గదిలో
కారణం తెలిసిపోయింది
కవిత రాయలేదు ఇవాళ

అమ్మ ఒకవైపు.. దేవతలంతా ఒకవైపు..
సరితూచమంటే నేను తూగేను అమ్మవైపు

ప్లాస్టిక్‍ పువ్వుకు కూడా పరిమళమిస్తుంది పదవి
అష్టావక్రునికైనా అందం తెస్తుంది పదవి
పేదవానికైనా వీరపీఠం వేస్తుంది పదవి
అధికారం పూనుకుంటే అందలాలకేమి కొదవ

ట్టతలకూ జులపాలను ముడుస్తుంది పదవి

ఈ గద్దె కోసమేనా ఇన్ని వేషాలు వేసేది
ఈ గడ్డి కోసమేనా ఇన్ని మోసాలు చేసేది
ఇన్నాళ్లూ మనిషంటే ఏమేమో అంచనా వేశాను
ఈ ప్రాణి కోసమేనా ఇన్ని ప్రాణాలు తీసేది
ఈ పేరు కోసమేనా ఇన్ని పాపాలు మోసేది

ఒంటపట్టిన దేహప్రీతికి
అంతుపట్టని ప్రాణభీతికి
ఆశ్రయమిచ్చిన దివ్యకల్పన
అతిలోక శక్తుల ఆరాధన

గుహ నుంచి మహలు దాకా
నడక నుంచి రోదసి నౌక దాకా
దివిటీల నుంచి విద్యుద్దీపాల దాకా
అమ్ముల నుంచి అణ్వస్త్రాల దాకా
ప్రవహించిన సంస్క•తికి మూలహేతువు
మనిషిలో వికసించిన విజ్ఞానధాతువు

ఏ మసకసందెలు కమ్ముకున్నా
ఆ మనసు కాంతి చక్షువే..
ఏ మంచుగడ్డలు పేరుకున్నా
ఆ మేధ జ్వలనధాతువే..

ఎన్నెన్ని ప్రస్థానాలు మనిషికి
ఎన్నెన్ని పరిభ్రమణాలు మనిషికి
అంతలోనే నురగల పరుగు అంతలోనే కదలని అడుగు
ఎవరు తాను ఏ ధాతు గర్భం నుంచి ఎదిగిన మాను
ఎలా కుదించుకున్నాయో
ఇంత మొలకలో అంతటి శాఖలు
ఎలా పొదుగుకున్నాయో
ఇంత విత్తులో అంతటి జీవరేఖలు
(‘విశ్వంభర’ నుంచి)

ఎన్నిసార్లు నా గదిలో కొచ్చిందో సముద్రం
వచ్చినప్పుడల్లా టేబుల్‍ మీది కాగితాలు
నిక్కపొడుచుకుంటాయ్‍
తిరిగిపోతూ అది మిగిల్చిపోయిన నురగలు అచ్చుపడ్డ
అక్షరాల్లా మెరుస్తుంటాయ్‍
(‘గదిలో సముద్రం’ నుంచి)

నింగిలోతును చూడగోరితే
నీటిచుక్కను కలుసుకో
రత్నతత్వం చూడగోరితే
రాతిముక్కను కలుసుకో
అణువునడిగితే తెలియదా
బ్రహ్మాండమంటే ఏమిటో
మౌన సముద్రం చూడగోరితే
మంచుగడ్డను కలుసుకో
మనిషి మూలం చూడగోరితే
మట్టిబెడ్డను కలుసుకో
(‘ప్రపంచ పదులు’ నుంచి)

చిగురు చిగురున రాగశీకరములొలికించి
ఆకునాకున మరక•తాత్తరులు పలికించి
పూవుపూవున మధువు పులకింతలోనరించి
వచ్చె కుసుమాస్త్ర భాస్వంతము వసంతమ్ము
(‘రుతుచక్రం’ నుంచి)

తలుపులు, కిటికీలు ఎంతగా మూసుకొని ఉన్నా
తరుముకొచ్చే కాలవాహిని తిరిగిపోతుందా
ముసురుకొచ్చే ముదిమి తన వల విసరకుంటుందా

ఎగిరిపోవాలే ఎంత పైకైనా
ఉడ్డీన చేతనకు విభ్రమించి
మూగ చుక్కల ముఖాలు ముందుకొచ్చి
వెలుతురు ఈలలు వేస్తుంటే.

Review చరణా కింకిణులు ఘల్లుఘల్లుమన...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top