ఆహారమే మహా భాగ్యం

మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాలను ధాన్యాలు, పప్పులు, గింజలు, కాయగూరలు, పండ్లు, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, మాంసాహారంగా వర్గీకరించవచ్చు. వీటిలో ఉండే పోషకాంశాలు శరీరానికి పుష్టిని, శక్తిని ఇస్తూ రోగాలు రాకుండా కాపాడతాయి. మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, ధాతు లవణాలు అనే పోషకాంశాలు ఆయా ప్రమాణాలతో, కొద్ది తేడాతో మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఉంటాయి. ఇవన్నీ సరైన ప్రమాణాల్లో కలిసి ఉన్న ఆహారాన్ని సంతులిత ఆహారం అంటారు. మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, మరియు పిండి పదార్థాలను మనం తీసుకునే ఆహారంలో ముఖ్యమైన పదార్థాలుగా పరిగణించవచ్చు. ఎందుచేతనంటే ఈ పదార్థాలు శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. విటమిన్లు, ధాతు లవణాలు ఏమాత్రం శక్తిని ఇవ్వవు కానీ ఆహార పరిణామ పక్రియలలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు కాల్షియం అనే ధాతు లవణం ఎముకలకు, దంతాలకు బలాన్ని ఇస్తుంది.
పాలకూర, తోటకూర, నువ్వులు వంటి పదార్థాలలో కాల్షియంతో పాటు ఆక్సలేటు అనే తత్వం ఉంటుంది. ఆక్సలేటు కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సలేటుగా మారి కాల్షియంను శరీర కణాలకు అందకుండా అడ్డుపడుతుంది. మూత్రపిండంలో రాళ్లు గలవారు వీటిని ఎక్కువగా తీసుకోకూడదు.
తమలపాకులో సున్నం కలిపి తాంబూలం సేవించడం అనే సంప్రదాయం భారతదేశంలో ఎక్కువగా ఉంది. దీని వలన శరీరానికి తగినంత ప్రమాణంలో కాల్షియం లభిస్తుంది. కాబట్టి తాంబూల సేవనం మంచి అలవాటుగానే పరిగణించాలి.
ఐరన్‍ (ఇనుము ధాతువు) రక్తం తయారీలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఆకుకూరల్లో ఐరన్‍ ఎక్కువగా ఉంటుంది. 50 గ్రాముల ఆకుకూరతో చేసిన కూరను తింటే శరీరానికి కావాల్సిన ఐరన్‍ తగిన పరిమాణంలో లభిస్తుంది. చిరుధాన్యాలైన సజ్జలు, రాగులలో కూడా ఐరన్‍ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది.
ధాన్యాల్లో వరి, గోధుమలు, సజ్జలు, రాగులను ఎక్కువ శాతం మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. వీటిలో ఎక్కువ శాతం పిండి పదార్థాలు, 6-12 శాతం మాంసకృత్తులు, ధాన్యపు పై పొరల్లో బీ విటమిన్లు, కొన్ని చిరు ధాన్యాల్లో ధాతు లవణాలు ఉంటాయి.
బాగా పాలిష్‍ చేసిన వరిలో విటమిన్ల శాతం చాలా తక్కువగా ఉంటుంది.
పప్పుల్లో ఎక్కువగా మాంసకృత్తుల ఉంటాయి. విటమిన్లు తక్కువగా ఉంటాయి. కానీ మొలకెత్తిన పప్పు ధాన్యాల్లో విటమిన్‍ ‘సీ’ ఎక్కువగా లభ్యమవుతుంది.
నూనె గింజల్లో మాంసకృత్తులతో పాటు నూనె పదార్థాలు మరియు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. వేరుశనగలో బీ1, బీ6 విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఆకుకూరల్లో పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్క కూర, బచ్చలి, పుదీనా, మునగకూర, పొన్నగంటి వంటివి ఎక్కువగా వాడతారు. వీటిలో కాల్షియం, ఐరన్‍, కెరోటిన్‍ (విటమిన్‍ ‘ఏ’ తత్వం), విటమిన్‍ సీ, మిగిలిన బీ కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగాఉంటాయి. దుంప కూరల్లో క్యారెట్‍, పచ్చటి కందల్లో కూడా కెరోటిన్‍ ఎక్కువగా ఉంటుంది.బంగాళాదుంపలో విటమిన్‍ సీ శాతం ఎక్కువగా ఉంటుంది. పండ్లలో కూడా విటమిన్‍ సీ, కెరోటిన్‍ ఎక్కువ పరిమాణంలో ఉంటాయి.
ఎండుద్రాక్ష, కర్జూరాల్లో ఐరన్‍ ఉంటుంది. ఆకుకూరలు ఎక్కువగా తింటే పండ్లు తినవలసిన అవసరం తగ్గుతుంది. మసాలా దినుసుల్లో కొత్తిమీర, మిరపకాయల్లో కెరోటిన్‍ ఎక్కువగా ఉంటుంది. పచ్చి మిరపకాయల్లో విటమిన్‍ సీ ఎక్కువ లభిస్తుంది.
, చింతపండుల్లో విటమిన్‍ సీ తగినంతగా ఉంటుంది. వెల్లుల్లి, ఇంగువలు ప్రేగులలో ఉండే రోగకారక బ్యాక్టీరియాను నశింపచేసే పోషకాలు కలిగి ఉంటాయి.ఈ విధంగా మనం వాడే ఆహార పదార్థాలలో శరీర వృద్ధికీ, వ్యాధి క్షమత్వ శక్తిని పెంచే అనేక పోషకాలను కలిగి ఉన్నాయి. కానీ, అవి వండేటప్పుడు ఆయా పోషక అంశాలు నశించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని వండేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనం భుజించే ఆహార పదార్థాల పరిమాణం, నాణ్యత సమపాళ్లలో ఉండాలి.

Review ఆహారమే మహా భాగ్యం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top